పుట్టినరోజు వినూత్నంగా జరుపుకున్న తీరు



అక్టోబరు 31 నా 76వ పుట్టిన రోజు. అమెరికాలోను, యూరోప్ లోను హాలోవిన్ పండగ ఆరోజే
. దీనిని దెయ్యాల పండగ అంటారు. పిల్లలు వింత వేషాలు వేసుకుని, రాత్రిళ్ళు ఇళ్ళకు వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అంటూ పెద్దలు పంచే చాక్లెట్లు స్వీకరించి ఆనందించే పండుగ. అయితే నా పుట్టిన రోజు ఈసారి వినూత్నంగా చేద్దాం అని నా కుమార్తె డాక్టర్ నవీన తూర్పు యూరోప్ పర్యటన ఏర్పాటు చేసింది.  ఆవిధంగా తొలిసారి ప్రపంచ ప్రసిద్ధ నివాస నగరమయిన వియన్నాలో అడుగుపెట్టాం.
వియన్నా నగరం
ప్రపంచంలో నివసించదగిన నగరాలు సర్వేచేయగా వియన్నాకు కొన్నేళ్ళుగా అగ్రస్థానం లభిస్తున్నది.  మనం వియన్నా అనిపిలిచేది అక్కడివారు వయన్ అంటారు. అది జర్మన్ భాష. అక్కడ ఉన్న 20 లక్షల మంది ప్రజలు జర్మన్ భాషలో మాట్లాడతారు. వియన్నాకు ‘స్వప్న నగరం’ అనే పేరుంది. మానవుల కలల గురించి పరిశోధన చేసి వాటి ప్రాధాన్యతను వెలికితెచ్చి, శాస్త్రీయంగా విడమరిచి, అవసరమయితే చికిత్స కూడా చేయవచ్చునని వెల్లడించిన ఫ్రాయిడ్ అక్కడి వాడే. ఆయన సిద్ధాంతాలు శాస్త్రీయంగా రుజువు కాలేదు. ఆయన ప్రభావం వలన కలలపై బాగా పరిశోధన జరుగుతున్నది.  మేము ఫ్రాయిడ్ మ్యూజియంకు వెళ్ళి ఆయన నివాసాన్ని, వాడిన పరికరాల్ని, గడిపిన జీవితాన్ని ప్రదర్శనలో చూశాం. వియన్నా నగరంలో ఒక వీధిలో ఉన్న మూడంతస్తుల భవనం ఏమంత గొప్పది కాదుగాని ఫ్రాయిడ్ రీత్యా దానికి ఫ్రాధాన్యత సంతరించింది. అటు హిట్లర్, నాజీల దాడికి గురయి నగరం వదిలేసిన ఫ్రాయిడ్ వస్తువులు ఆయన కుమార్తె ఆన్ కొన్ని సేకరించి, ఒక ప్రైవేటు మ్యూజియంకు ఇవ్వగా వాటిని భద్రపరిచారు. ఆ మ్యూజియం సందర్శన మేథస్సుకు సంతృప్తినిచ్చే విషయం. ఆ తరవాత నగర కేంద్రంలో ఉన్న లాంట్ మన్ హోటల్ కు వెళ్ళాం. ఫ్రాయిడ్ తరచు నడుచుకుంటూ వచ్చి అక్కడ కాఫీ తాగేవాడు. ఆయన కూర్చున్న టేబుల్ వద్దే కూర్చోవాలని వెళ్ళాను. అప్పటికే అక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు. వారు ముగించేవరకూ వేచి వుండి, వారు వెళ్ళిపోతుండగా వారిని పలకరించి మీరు కూర్చున్న చోటుకు ప్రాధాన్యత ఏమిటో తెలుసా?  అని అడిగాము. తెలియదన్నారు. అది ఫ్రాయిడ్ కూర్చునే చోటు అని చెప్పగా వారు ఆశ్చర్యపడి సంతోషించారు. మేము అక్కడ కూర్చొని భోజనం చేసి, ఫోటోలు తీసుకుని, సంతోషించాము.
అలాంటి నగరంలో గడుపుతూ మ్యూజియంలను, ప్యాలెస్ లను, థియేటర్లను, శిల్ప సంపదకలిగిన మందిరాలను చూచి ఆనందించాము.  అందులో ఎలిజబెత్ రాణివాసం పేర్కొనదగినది. అమూల్యమైన వస్తువులను అపూర్వంగా భద్రపరిచివుంచారు. కోట్ల విలువ చేసే రత్న ఖచిత మంచం ఒకటి చూచాము. దానిపై ఇంతవరకు ఎవరూ పడుకోలేదట! అంటే కేవలం ప్రదర్శన వస్తువుగానే మిగిలిపోయిందనమాట. వియన్నా అంతటా రోమన్ కాథలిక్ ప్రభావం కనిపిస్తుంది. వారి చర్చీల ఔన్నత్యం, పూజలు, సంగీతమయమయిన భక్తి పాటలు, వినిపిస్తూ వుంటాయి. వియన్నాలో అప్పటికప్పుడు టిక్కెట్లు కొనుక్కుని థియేటర్లకు ఒపెరా, బాలేకు వెడదామంటే కుదరదు. చాలా ముందుగా రిజర్వు చేయించుకుని వెళ్ళాలి. ఇప్పటికీ సుప్రసిద్ధమయిన సంగీత ప్రదర్శనలు నిత్యనూతనంగా జరుగుతుంటాయి. వియన్నాలో ఎటు వెళ్ళాలన్నా సౌకర్యాలు చాలా బాగా వుంటాయి. ట్రాంలు, రైళ్ళు, బస్సులు, టాక్సీలు, పుష్కలంగా తిరుగుతుంటాయి గనుక సులభంగానే ప్రయాణం చేసి, చూసి రావచ్చు. ఫ్రాయిడ్ అనుచరుడు, వ్యక్తి స్వేచ్ఛపై సైకాలజీలో పరిశోధనలు చేసిన యాడ్లర్ కేంద్రం కూడా చూసాము. అయితే అది మ్యూజియం కాదు.
వియన్నాలో చాలా కేంద్రాలలో హోటళ్ళు నడిపేవారు పేవ్ మెంట్లను కూడా వినియోగిస్తారు. అయితే అక్కడక్కడ బిచ్చగాళ్ళు వచ్చి అడుక్కోవటం కనిపించింది. ఇదేమంత పెద్ద సంఖ్య మాత్రం కాదు. కానీ, స్త్రీలు, పురుషులు కూడా చాలామంది సిగరెట్లు తాగటం గమనార్హం. హోటళ్ళలో ప్రధానంగా మాంసాహారం, వైన్, బీర్ ఎక్కువగా కనిపించింది.
వియన్నా అంతర్జాతీయ కేంద్రాలకు, యూనివర్సిటీలకు ప్రసిద్ధి. భావ పోరాటాలు, తాత్విక వైజ్ఞానిక ఆలోచనలు నిరంతరం సాగిస్తున్న నగరం ఇది. యునెస్కో కేంద్రం, సాంకేతిక విద్యాలయం, ఫైనాట్స్ అకాడమీ గమనార్హం. ఫుట్ బాల్ ప్రధానమైన ఆటగా ఉన్నది. చాలా ప్రాంతాలు, ఓపిగ్గా తిరిగి చూడవచ్చు. ప్రజల సహకారం కూడా బాగానే వుంటుంది. ఏ విధంగా చూసినా వియన్నా నగరం ఆకర్షణీయంగా కనిపించేదిగానే ఉన్నది. అలాంటి నగరంలో నా పుట్టిన రోజు గడపటం ఆనందాన్నిచ్చింది.
సౌండ్ ఆఫ్ మ్యూజిక్
వియన్నా నుండి బస్సులో గాని రైల్లో గానీ, 3 గంటలు ప్రయాణం చేస్తే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా తీసిన సుప్రసిద్ధ ప్రదేశం సాల్స్ బర్గ్ చేరుకుంటాము.  సినిమా ఎంత ప్రసిద్ధమో ఆ ప్రదేశం కూడా అంత ఆనందదాయకమైన చోటు. ఎన్నాళ్ళనుండో చూడాలనుకుంటున్న ప్రకృతి సౌందర్య దృశ్యానికి చేరుకున్నాము. అది ఆల్ఫ్స్ పర్వతాలలో ఉన్న చిన్న వూరు. కనీసం వంద రమణీయ దృశ్యాలు షూటింగుకు పనికొచ్చే తీరులో ఉన్న ప్రాంతం అది. కొండలు మబ్బులు, లోయలు, కొలనులు, నది, ఆపిల్ చెట్లు, అన్నీ ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింప చేసే దృశ్యాలు.
సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాను 50 సార్లు చూసామన్న వారూ మాకు తటస్థ పడ్డారు. ఆశ్చర్యమేమంటే ఇది ఇంగ్లీషులో ఉన్న సినిమా. సాల్స్ బర్గ్ లో ప్రజలు జర్మన్ భాష మాట్లాడతారు. వారిని పలకరిస్తే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా చూడలేదన్నారు. ఆశ్చర్యం వేసింది. సాల్స్ బర్గ్ దగ్గర సాల్జక్ నది ప్రవహిస్తున్నది. ఆ నదిపై ఉన్న వంతెన ఇరువైపులా తాళాలు విపరీతంగా ఉన్నాయి. అదేమిటని తెలుసుకోగా ప్రేమ తాళాలు అని చెప్పారు. దంపతులెవరైనా తమ పేర్లు రాయించుకుని గుర్తుగా అక్కడ పెట్టుకోవచ్చు. ఆ దృశ్యం బాగుంది. పాత కొత్త నగరాలను కలిపే వంతెన అది. సాల్స్ బర్గ్ చిన్న ప్రాంతం. ఊరంతా యాత్రికులపై ఆధారపడే ప్రదేశం. అది ప్రపంచ ప్రసిద్ధ సంగీతకారుడు మొజాక్ నివసించిన ప్రదేశం. అతడి ఇల్లు మ్యూజియంగా మార్చి చూపుతున్నారు. అతను వాడిన సంగీత పరికరాలు చూచి హెడ్ ఫోన్స్ లో సంగీతం విని ఆనందించాము. అక్కడ జూన్ నుండి ఆగస్టు వరకు సంగీతోత్సవాలు జరుగుతాయి. అది ప్రత్యేక ఆకర్షణ. మొత్తం చిన్న నగరమే కనుక నడచి చూచి ఆనందించవచ్చు. అయితే ఇక్కడొక వింత విశేషమున్నది. ఆర్చి బిషప్ ఉల్ఫ్ డైట్రిట్జ్ అనే అతను రహస్యంగా ఒక స్త్రీని అట్టెపెట్టుకుని 15 మంది పిల్లలను మాత్రమే కన్నాడట. ఆమె పేరిట ఒక సుందర భవనాన్ని నిర్మించాడు. ఆల్టివర్ అని ఆ భవనాన్ని పిలుస్తారు. అది ఆమె పేరు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోప్ అతన్ని తొలగించాట. అయితే ఆ సుందర భవనాన్ని పేరు మార్చి ‘మిరాబెల్’ అని పిలుస్తున్నారు.  అదిప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తున్న భవనం. చిన్న స్థలమైన సాల్స్ బర్గ్ లో ఒక యూనివర్సిటీ ఉన్నది. ఇక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతాయి. మాంసాహారం ప్రధానం కాగా స్థానికంగా ద్రాక్షతోటల నుండి వైన్ తయారు చేస్తారు. సందర్శకులకు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా తీసిన ప్రదేశాలను తిప్పి చూపుతారు. ఎంతసేపు చూసినా విసుగు పుట్టని ప్రకృతి సౌందర్య ప్రదేశం అది. వూరంతా సందుగొందులుగా ఉన్నప్పటికీ అది కూడా ఆకర్షణీయంగా మార్చి చూపటం సాల్స్ బర్గ్ విశేషం.
బ్రాటిస్లేవియా
వియన్నాకు ఒక గంట ప్రయాణంలోనే స్లొవేకియా రాజధాని బ్రాటిస్లేవియా చేరతాము.  అది డాన్యూబ్ నది తీరాన ఉన్నది. చరిత్ర ప్రసిద్ధి చెందిన డాన్యూబ్ నది తూర్పు యూరోప్ లో ఇంచుమించు తొమ్మిది దేశాల గుండా ప్రవహిస్తుంది. ఆ దేశాల నాగరికత చరిత్రపై ఎంతో ప్రభావం చూపిన నది డాన్యూబ్.
బ్రాటిస్లేవియాలో సుమారుగా నాలుగున్నర లక్షల జనాభా వున్నారు. నదికిరువైపులా నగరం ఉన్నది. ఒకవైపున పాత నగరం, మరొక వైపు కొత్త నగరం అంటారు. మొరావా నది కూడా ఇక్కడ ప్రవహిస్తున్నది. స్లోవేకియాకు సాంస్కృతిక కేంద్రంగా బ్రాటిస్లేవియాను పేర్కొనవచ్చు.  ఇక్కడ గమనించిన తొలి ఆకర్షణ స్వీట్ వైన్ తేనె కలిపిన వైన్ ఇక్కడ తయారు చేస్తారు. ఇది స్థానికంగానే ఉంటుందని తెలిసింది. ఇక్కడ నిరుద్యోగం లేదని సగర్వంగా చెప్పుకుంటారు. సాంకేతికపరమైన పరిశ్రమలు ఉండటం వలన ప్రతిఒక్కరికీ ఏదో ఒక ఉద్యోగం లభించటం గమనార్హం. చిన్న ప్రదేశమే కనుక ఓపిగ్గా తిరిగి చూడవచ్చు. అటు జర్మనీ వాళ్ళూ, ఇటు కమ్యూనిస్టులూ ఎడాపెడా వాయించిన ఈ ప్రదేశంలో ప్రజలు తట్టుకొని స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి పెంపొందారు. ఒక చిన్న విశ్వవిద్యాలయం కూడా ఉన్నది. కేథలిక్ మతం ప్రధానమైంది. గోతిక్ ఆర్ట్ ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మేము చూసిన వాటిలో బ్రాటిస్లేవియా కాజిల్ (కోట) పేర్కొనదగినది.  డాన్యూబ్ నది ఒడ్డున ఒక కొండపై ఉన్న కోట ఇక్కడ సుప్రసిద్ధమైనది. ఇది సైనిక కేంద్రంగానూ, మత స్థావరంగానూ పనిచేసింది. ప్రతిష్ఠాత్మకమైన స్థానంగా దీనిని స్థానికులు పేర్కొంటారు. దాడులలో విధ్వంసమైన ఈ కోటను థెరీసియన్ శైలిలో పునర్మించారు.  ఊళ్ళో ఉన్న కొలనులు పార్కులు సుందరంగా యాత్రికులకు చూపించే తీరులో అమర్చారు.
ఇది ప్రజాస్వామిక దేశం. స్లోవాక్ పార్లమెంటు ఇక్కడ ఉన్నది. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు అంతకుముందే జరిగిన ఎన్నికలలో ఓటర్లకు ఆకర్షణీయమైన బహుమతులు లభించాయని, కొందరు వెల్లడించారు. కమ్యూనిస్టు పార్టీ, ఇప్పటికీ బలంగా ఉన్నా, ఓట్లు మాత్రం రావట్లేదని చెప్పారు. మ్యూజియంలు, గాలరీలు చాలా చూడముచ్చటగా అమర్చారు. ఇక్కడ ఉన్న చిన్న మార్కెట్ చేతి పరిశ్రమల వస్తువులతో కళకళలాడుతున్నది. యూనివర్సిటీలో 27 వేలమంది విద్యార్థులున్నారు. సాంకేతిక విశ్వవిద్యాలయంలో 18 వేల మంది విద్యార్థులున్నారు. నది అవతల కొత్త నగరంలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ఆధిపత్యాన నిర్మించిన ఇళ్ళు, బొత్తిగా సౌకర్యంలేని గూళ్ళు వలె ఉన్నాయి. ఇంత చిన్న ప్రదేశంలో కూడా కొన్ని దేశాల రాయబార కార్యాలయాలుండడం విశేషం. యాత్రికుల నిమిత్తం, ఆకర్షణీయంగా నగరాన్ని తీర్చి దిద్దటం. ఇక్కడి ప్రత్యేకత.
బుడపెస్ట్
మనం చరిత్రలో బుడాపెస్ట్ అని చదువుకున్న నగరానికి వెళ్ళాము. ఇది హంగరీ రాజథాని. అక్కడికి వెళ్ళిన తరవాత కానీ, ఇది జంటనగరాల కేంద్రం అని తెలియలేదు. పర్వతాల మధ్య ఉన్న బుడ నగరం, పల్లపు ప్రాంతంలో ఉన్న పెస్ట్ నగరం కలిపిన జంట నగరాల రాజథాని ఇది. వీటి మధ్య ఉన్న డాన్యూబ్ నదిపై వంతెనలు నిర్మించి, ఒకే నగరంగా రూపొందించారు. 18 లక్షల జనాభా కలిగిన బుడపెస్ట్ చరిత్ర ప్రసిద్ధమైనది. విదేశీ దాడులలో, పాలనలో వారి కట్టడాలు, చర్చీలు, నదిపై వంతెనలు మాటి మాటికీ ధ్వంసమవుతుండగా పట్టుదలతో తిరిగి నిర్మించి, ఇప్పుడు స్వతంత్ర దేశంగా అనుభవిస్తున్నారు. కమ్యూనిస్టులు పరిపాలించినా కూడా ఎక్కడా ఆనవాళ్ళు లేవు. ఆనవాళ్ళేవీ నేడు కనిపించవు. కమ్యూనిస్టు నాయకుడు లెనిన్ మొదలైన వారి విగ్రహాలు.
బుడపెస్ట్ నగరమంతా గుహల మయం వాటిపైనే నగరం నిర్మితమైంది. యూరోప్ కు ఒక రకంగా బుడపెస్ట్ ఆర్థిక కేంద్రంగా కూడా మారింది. బుడ కోట డాన్యూబ్ నదీ తీరాన మిలీనియం అండర్ గ్రౌండ్ రైల్వేలను ప్రపంచ సంపదగా ప్రకటించారు. సాంకేతికానికి ప్రధాన కేంద్రంగా మారిన బుడపెస్ట్ చైనాకు ఆకర్షణీయ కేంద్రంగానూ పరిణమించింది. బుడపెస్ట్ సందర్శన స్థలాలలో కేజిల్ (కోట), స్టేట్ అపరా, యూదుల స్మారక కేంద్రం పేర్కొనదగినది. ఇక్కడ యూదులు చాలా హింసలకు లోనై తట్టుకున్నారు. వారి సినగాగ్ లు సుప్రసిద్ధమైనవి. బుడపెస్ట్ లో కూడా పార్లమెంట్ భవనం గోతిక్ కళను ప్రస్ఫుటం చేస్తుంది. చిత్రహింసల భవనం ఇక్కడొక మ్యూజియంగా మార్చి చూపుతున్నారు. ఒకప్పుడది నాజీలకు కేంద్ర స్థానం. ఇక్కడి కేజిల్ హిల్ ను యునెస్కో భద్రపరిచిన కేంద్రంగా అట్టిపెట్టారు. కేథలిక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హంగరీ సైన్స్ అకాడమీ పేర్కొనదగిన అంశం. బుడ ప్రజలు సహకార భావంతో మెలుగుతున్నారు. చూస్తుంటే చరిత్రను మరోసారి తిరగవేస్తున్నట్లుంటుంది.
ప్రాగ్
వియన్నా నుండి మూడు గంటలు బస్సులో ప్రయాణం చేస్తే ప్రాగ్ నగరం చేరుకుంటాము. ఇది చెక్ రిపబ్లిక్ రాజధాని. అయితే అక్కడి ప్రజలు దీన్ని ప్రాహా అంటారు. ప్రాహా ప్రత్యేకతలో బొహీమియన్లు పేర్కొనదగిన ప్రజలు. చరిత్రలో దీన్ని గురించి చదువుతున్నప్పుడు చాలా స్వతంత్ర ధోరణిగల ప్రజలని మన లంబాడీ సంచార జాతుల వంటివారని తెలుసుకున్నాము. వారిని స్వయంగా చూచినప్పుడు అందమైన ప్రజలుగా కనిపించారు. మామూలు నియమ నిబంధనలకు కట్టుబడని స్వేచ్ఛాప్రియులని కొందరు కావాలని పేదరికాన్ని స్వీకరిస్తారని చెప్పారు. వీరి ప్రత్యేక చేతి కళలలో క్రిస్టల్స్ తో పాత్రలు చేయటం విశేషం. వారు చేసిన ఈ చేతి వస్తువులు కొంచెం ఖరీదనిపించినా వారి నైపుణ్యతను చాటేవిగా ఉన్నాయి. వియన్నా నుండి ప్రాగ్ కు వెళ్ళేటప్పుడు యాత్రికుల నిమిత్తం పల్లెటూళ్ళ నుండి బస్సులు తీసుకెళ్ళారు. మధ్యలో బొహీమియన్లు నడిపే ఒక హోటల్ దగ్గర ఆపారు. ఆ విధంగా వారిని చూడటం వారి వస్తువులని తిలకించటం సంతోషకరమైన విషయం.
ప్రాగ్ కేథలిక్ మత ప్రాథాన్యతగల ప్రాంతమయినా వారిని తిరస్కరిస్తూ క్రైస్తవ సంస్కరణలు కోరిన లూథర్ ప్రభావం కూడా కొంతవరకు కనిపిస్తుంది. ఒక చోట లూథర్ విగ్రహాన్ని కూడా చూశాము. ప్రాగ్ వద్ద  విటావా నది ప్రవహిస్తుంది.  ఇక్కడ 13 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ నగరంలో కేంద్ర స్థానమైన కోటను, మ్యూజియంలను, గాలరీలను, థియేటర్లను గమనించాము. టూరిస్టు కేంద్రంగా యూరోప్ లో ప్రాధాన్యతను సంతరించుకున్నది.  ప్రాగ్ లో ఒక వింత గడియారాన్ని చూశాము. అది మన గడియారాలకు విరుద్ధమైన ధోరణిలో రివర్స్ లో తిరుగుతాయి. అది ఖగోళ గడియారం. మధ్య యుగాల్లో చిత్రహింసలు ఎలా పెట్టేవారో చూపించే పరికరాలను ఒక మ్యూజియంలో అట్టిపెట్టారు. పొరుగు దేశమైన రుమేనియా నుండి చాలామంది ఉపాధి నిమిత్తం రావటం ఒక ప్రత్యేకత. సాంస్కృతిక కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయి.
రచయిత ఫ్రాంజి కాఫ్కా
సుప్రసిద్ధ రచయిత ఫ్రాంజి కాఫ్కా ఇక్కడివాడే. అయితే అతను జర్మనీలో ఎక్కువ కాలం గడపడం వలన ఇక్కడ ప్రజలకు అంతగా జ్ఞాపకాలు లేవు. అతని రచనల్లో కనిపించిన కోట, తిరిగి చూచాము. నగరం అంతా పాత కొత్త కేంద్రాల కూడలిగా నదికిరువైపులా ఉన్నది.  నగరంలో ఎక్కడ చూచినా విగ్రహాల మయం. పునర్వికాస, గోతిక్ కళా క్షేత్రాలు, బాగా కనిపిస్తాయి. కాఫ్కా మ్యూజియం ఒక ప్రత్యేక విశేషం. అలంకరణ కళాకృతులతో కూడిన మ్యూజియం ప్రాగ్ కు ప్రత్యేకత. నగరంలో చాలా ప్రాంతాలు తిరిగి చూడడానికి వీలుగా ఉన్నాయి.
మొత్తం మీద మేథస్సుకు సంతృప్తినిచ్చే సందర్శనగా మిగిలిపోయిన పర్యటన పేర్కొనదగినది. వీలున్నప్పుడు ఈ ప్రాంతాలను చూస్తే చాలా విషయాలు నేర్చుకుంటాము.
- నరిసెట్టి ఇన్నయ్య




1 comment:

kodali srinivas said...

Wish you many returns od the day

Post a Comment