హైటెక్ ముఖ్యమంత్రినారాచంద్రబాబు నాయుడు-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 15

ఎన్టీరామారావుకు అల్లుడు కాకముందు చంద్రబాబునాయుడు నాకు పరిచయమయ్యాడు. 1977లో హైదరాబాదులో పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్సులో బండారు రత్నసభాపతి నేను, ఎస్.వి.పంతులు వద్ద కూర్చుని ఉన్నాము. సాయంత్రం రత్నసభాపతితో మేము కబుర్లు చెప్పుకుంటూ మొదటి పెగ్గులో ఉండగా హఠాత్తుగా నారాచంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం వచ్చారు. ఎక్కడో కొట్లాడుకుని, హడావుడిగా వచ్చినట్లు ఉంది. అప్పట్లో చంద్రబాబునాయుడుతో నాకు పరిచయం లేదు. తిరుపతి నుండి సరాసరి వచ్చామని, అక్కడ విద్యర్థుల మధ్య కొట్లాటలు జరిగాయని, ముఖ్యంగా కమ్మ, రెడ్డి కులాల మధ్య పోట్లాటలు విపరీతంగా ఉన్నాయని వారి మాటలను బట్టి మాకు తెలిసింది. వారు చెప్పిందంతా విని, రత్నసభాపతి ఫోన్ తీసుకుని నేదురుమల్లి జనార్ధనరెడ్డితో మాట్లాడారు. ఈ కొట్లాటల వ్యవహారం మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని గట్టిగా చెప్పారు. అట్లా తొలిసారి చంద్రబాబునాయుడ్ని చూడటం జరిగింది. మరుసటి సంవత్సరం ఎం.ఎల్.ఎ.గా ఎన్నికై చంద్రబాబు నాయుడు వచ్చి న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్ లో ఉన్నారు. ఆయనతోపాటు లక్ష్మీనారాయణ ఉండేవారు. అప్పుడు నేను అక్కడ కొల్లూరి కోటేశ్వరరావు క్వార్టర్ లో ఉంటూండేవాడిని. రెగ్యులర్ గా మేము కలుసుకోవటం, నేను అసెంబ్లీకి సంబంధించిన ప్రశ్నలు, కాల్ అటెన్షన్ మొదలైనవి రాసిస్తుండేవాడిని. ఆ విధంగా మా పరిచయం బాగా పెరిగింది. తరువాత చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని, రాజశేఖరరెడ్డిని దూరంగా పెట్టారు. వారిరువురూ చాలా స్నేహంగా కలిసి ఉండేవారు. వారితో పాటు కె.ఇ. కృష్ణమూర్తి, కరణం బలరాం ఉండేవారు. మేము చాలా తరచుగ కలుసుకునేవాళ్ళం. ఇంతలో చంద్రబాబునాయుడు జూబ్లీహిల్స్ లో ఇల్లు తీసుకుని మారారు. ఆయనతోపాటు ఎన్నోసార్లు భోజనాలు చేస్తూ అనేక విషయాలు చెప్పుకునేవాళ్ళం. రాజకీయాలు మాట్లాడుకునేవాళ్ళం. అప్పట్లో పి. రాజగోపాలనాయుడు వస్తుండేవారు. ఆయన చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు గురువు. వారంతా ఆచార్య రంగా శిష్యులు. అలా జరుగుతుండగా చెన్నారెడ్డి మారిపోవటం, అంజయ్య ముఖ్యమంత్రి కావటంతో అటు రాజశేఖరరెడ్డి, ఇటు చంద్రబాబునాయుడు ప్రాముఖ్యత వహించారు. అదే సమయంలో ఎన్.టి.రామారావు కుమార్తెను చంద్రబాబునాయుడు పెళ్ళి చేసుకునే విషయం వచ్చింది. స్టేట్ మంత్రిగా చంద్రబాబునాయుడు పశుసంవర్ధక శాఖను, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మెడికల్ సర్వీసెస్ ను నిర్వహించారు. ఆ తరువాత అంజయ్య తన జంబోజెట్ మంత్రివర్గాన్ని కుదించగా అందులో చంద్రబాబుకు గ్రంథాలయాలు, రాజశేఖరరెడ్డికి గ్రామీణాభివృద్ధి ఇచ్చారు. ఎన్.టి.రామారావును రాజ్యసభకు తీసుకురావాలనే ప్రతిపాదన కూడా అప్పుడే కొంతమేరకు సాగేది. తరువాత భవనం వెంకటరామ్ ముఖ్యమంత్రి కావటం. అందులో రాజశేఖరరెడ్డి ఎక్సైజ్ మంత్రిగా ప్రాధాన్యతలోకి రావటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడుకి మైనర్ ఇరిగేషన్ స్టేట్ మంత్రిగా ఇచ్చారు. అప్పుడు రాజశేఖరరెడ్డి ఎలాగైనా చంద్రబాబు నాయుడుకు క్యాబినెట్ ర్యాంకు ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. నన్ను కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు భవనానికి చెప్పమన్నారు. అయితే అలాంటి నిర్ణయాలు కేంద్ర కాంగ్రెసి అధిష్ఠానవర్గం చేస్తుంది కనుక ఒక పట్టాన చంద్రబాబుకు క్యాబినెట్ రాలేదు. నేను మాత్రం చాలా తరచుగా చంద్రబాబును ఆయన ఛాంబర్ లో కలసి సలహాలు చెబుతుండేవాడిని. ఆ తరువాత విజయభాస్కర రెడ్డి మంత్రివర్గం రావటం, అందులో రాజశేఖర రెడ్డికి విద్యాశాఖ, చంద్రబాబుకు సాంకేతిక విద్య వచ్చాయి.
చంద్రబాబునాయుడు మరోవైపున ఎన్.టి.రామారావు అల్లుడు కావటంతో రాజకీయాల్లో కొన్ని మార్పులు కనిపించాయి. కాంగ్రెస్ లోనే కొనసాగిన చంద్రబాబు 1982 ఎన్నికలలో పోటీ చేసి తెలుగుదేశం చేతిలో ఓడిపోయారు. ఒకటి రెండు ప్రకటనలలో తన మామ ఎన్.టి.రామారావుకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు కూడా చేశారు. కానీ తెలుగుదేశం ప్రభంజనంతో అత్యధిక సంఖ్యా బలంతో గెలిచినప్పుడు ఎన్.టి.రామారావు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంకు వచ్చి హాజరయ్యారు. క్రమంగా కాంగ్రెస్ కు దూరమై, తెలుగుదేశంలో చేరి, ప్రాధాన్యాత వహిస్తూ పోయారు. తొలుత పదవులు లేకపోయినా రాను రాను పార్టీలో రామారావు అల్లుడిగా ఆయనకు చాలా ప్రాధాన్యత లభించింది. రాజకీయ అనుభవం వలన చంద్రబాబు ఆ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాడు.
నేను హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో ఉంటుండగా చంద్రబాబు మా ఇంటికి అనేక పర్యాయాలు వచ్చారు. అలాగే నేనూ ఆయన ఇంటికి వెడుతూ ఉండేవాడిని. ముఖ్యంగా భవనం వెంకటరాం ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా చంద్రబాబు కూడా వచ్చేవారు. ప్రతిసారీ తిరుపతి లడ్డూ తెచ్చేవారు. కానీ మా ఇంట్లో ఆయన మాత్రం ఏమీ పుచ్చుకునేవారు కాదు.
చంద్రబాబు ఏదైనా విషయం చెబితే అసెంబ్లీపరంగా గానీ, బయటగానీ బాగా గ్రహించేవారు. తనకు నచ్చితేనే అమలు పరిచేవారు. ఆయనకు నేను సన్నిహితంగా ఉండడం గమనించి చాలామంది రికమండేషన్స్ కు వచ్చేవారు. అది నాకు గిట్టదు. కనుక చెప్పేవాణ్ణి కాదు. ఆ కోపం చాలామందికి ఉండేది. నంద్యాలలో రేణుకాచౌదరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల ఖర్చులకు డబ్బు ఇప్పించమని చంద్రబాబుకి చెప్పి త్వరగా పని జరిగేటట్లు చూడమని నన్ను కోరింది. అయితే ఆమె సంపన్నురాలనీ, ఆమెకు పార్టీ నిధి అక్కరలేదని చంద్రబాబు అంటుండేవారు. ఎన్.టి.రామారావుపై తిరుగుబాటు చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను లాంఛనంగా కలిసినా అభినందనలు చెప్పలేకపోయాను. ఆ తర్వాత కలవడమే మానేశాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన న్యూయార్క్ వచ్చారు. నా కుమారుడు అప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ లో పనిచేస్తున్నాడు. అక్కడకు వచ్చిన చంద్రబాబు నా కుమారుడిని కలిసి ఇండియాకు రమ్మని ఆహ్వానించారు కూడా. ఆయన ఉన్నాడని తెలిసినా నేను కలవలేకపోయాను. ఏమైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కలయిక తగ్గిపోవటమే కాక అరుదు అయింది.
చంద్రబాబు నాయుడు మాంసాహారిగా వుండి రాను రాను శాఖాహారిగా మారాడు. ఓక ఘట్టంలో వైస్ చాన్స్ లర్ జి.రాం రెడ్డి కి నాకు అకడమిక్ కలహం రాగా, నాపై రాం రెడ్డి అనుచరులు వెళ్ళి చంద్రబాబు ను శరణు కోరారు. కాని ఆయన తటస్థ వైఖరి అవలంబించి , వారి అభియోగం నాతో ప్రస్తావించలేదు .
ప్రజాస్వామ్యం కోసం ఎన్.టి.రామారావు పక్షాన తీవ్రంగా పోరాడి సంక్షోభాన్ని ఎదుర్కొన్న చంద్రబాబునాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. శాసన సభ్యులను కాపాడుకుని హైదరాబాదు నుండి ఢిల్లీకి, మైసూరుకు, బెంగుళూరుకు తరువాత హైదరాబాదుకు తెచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటంలో కీలక పాత్ర వహించారు. అలా చేస్తున్నప్పుడు నేను బెంగుళూరులో విద్యామంత్రి రఘుపతి ఇంటికి వెళ్ళి ఉదయం తేనీటి విందులో చంద్రబాబు నాయుడును అభినందించాను. హైదరాబాదుకు బయల్దేరుతూ ఆ కాన్వాయిలో నన్ను కూడా రమ్మన్నాడు. వెంకయ్య నాయుడు, జయపాల్ రెడ్డి, పర్వతనేని ఉపేంద్ర మొదలైనవారు అప్పుడున్నారు. బెంగుళూరులో నేను కాట్రగడ్డ ప్రసూన మొదలైన శాసన సభ్యుల ను కలిసి నాదెండ్ల భాస్కరరావు ఉచ్చులో పడవద్దని చెప్పాను. అదే చంద్రబాబు నాయుడు కొన్నేళ్ళ తర్వాత భాస్కరరావు అడుగుజాడలలో అప్రజాస్వామికంగా ఎమ్.ఎల్.ఎ.లను వైస్రాయ్ హోటలులో అట్టిపెట్టి విద్రోహచర్యకు పూనుకొనడం బాధాకరమనిపించింది. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన గెలిచి రావడం, రాష్ట్రాన్ని అంతర్జాతీయ రంగంలో పరిచయం చేయటం అమెరికా అధ్యక్షుడు క్లింటన్ ను తీసుకురావటం సాంకేతిక హైటెక్ రంగాన్ని బాగా పోషించడం అభినందనీయమైంది.

క్లింటన్ తన స్వీయ అనుభవాలలొ హైదరాబాద్ సందర్శన, చంద్రబాబు నాయుడు తో పరిచయం ప్రస్తావించారు. వాషింగ్టన్ లో జరిగిన తానా సభలలో వారిరువురు కలసి పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు దేశ, రాష్త్ర రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తున్నారు .

నరిసెట్టి ఇన్నయ్య

1 comment:

surya prakash apkari said...

చంద్రబాబు నాయుడు గారి అంచెల౦చెల రాజకీయ ప్రస్థానం గూర్చి మీ అనుభావాలకోణం నుంచి నిశితముగా తెలియజేశారు! రాబోయే ఎన్నికలలో బాబుహవా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వీచటం లేదనిపిస్తున్నది!

Post a Comment