(1949-2009)
మెడిసిన్ చదివినా సూది పట్టని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 1978లో ఎం.ఎల్.ఎ. అయినప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుండి చాలా సన్నిహితులమయ్యాం. నేను అనేక సందర్భాలలో శాసనసభలో వేసే ప్రశ్నలు, కాల్ అటెన్షన్ నోటీసులు, షార్ట్ నోటీసు ప్రశ్నలు ఇస్తుండేవాడిని. అందులో ఆయనకు నచ్చినవి స్వీకరించి వాడేవాడు. నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలుగులోను, ఇంగ్లీషులోనూ రాస్తూ ఉండగా ఆయనకు నా ఇంగ్లీషు మాత్రమే నచ్చేది.
మేమిరువురం కలిసి అనేకమంది మిత్రులు దగ్గరకు వెళ్ళడం. ముచ్చటించడం జరిగేది. ఒకటి రెండుసార్లు ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్ళి విందు ఆరగిస్తేనో, బ్రేక్ ఫాస్ట్ చేస్తేనో తరువాత తప్పనిసరిగా రాజశేఖర్ రెడ్డి ఒక మాట అడిగేవాడు ‘మనం ఆ స్నేహితుడికి ఏమైనా ఉపయోగపడగలమా? అడుగు’ అనేవారు. అలాంటి వారిలో డి. శేషగిరిరావు, ఆలపాటి రవీంద్రనాథ్ వంటివారున్నారు. కానీ వారు ఏ సహాయమూ అక్కరలేదని కేవలం మిత్రులుగానే కలుసుకుంటున్నామని అనేవారు. రాజశేఖర రెడ్డి మిత్రత్వ స్వభావం చెప్పటానికి ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఆయన ఎన్నో సందర్భాలలో మా ఇంటికి రావడం, మాతోపాటు భోజనమో, అల్పాహారమో చేయడం మా కుటుంబానికి ఆనందంగా వుండేది. ముఖ్యంగా భవనం వెంకట్రాం విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు ఎన్ని వచ్చాయో నేను చెప్పలేను. అలాగే మేము రాజశేఖర్ రెడ్డి ఇంట్లో (జూబిలీహిల్స్ వెళ్ళేదారిలో) అనేక పర్యాయాలు కూర్చుని ముచ్చటించుకుని భోజనాలు చేశాము. ముఖ్యంగా భవనం వెంకట్రాం, కె.వి.పి.రామచంద్రరావు, నేను ఒక బ్యాచ్ గా ఉండేవాళ్ళం. ముందుగా ఒకటి రెండు పెగ్గుల విస్కీ స్వీకరించి, తరువాత భోజనం చేసేవాళ్ళం. అప్పట్లో కె.వి.పి. డ్రింక్స్ తీసుకునేవారు కాదు. సిగరెట్లు బాగా తాగేవారు. రాజశేఖర్ రెడ్డి భార్య విజయలక్ష్మి ఎంతో చక్కగా వంటలు చేసి, ఆప్యాయంగా వడ్డించేవారు. ఆమె చాలా సహృదయురాలు.
రాజశేఖర్ రెడ్డి ఇంట్లో నేను తొలుత ఆయన తండ్రి రాజారెడ్డిని కలుసుకున్నాను. ఆయన ఎన్నోవిషయాలు, స్వానుభవాలు చెప్పారు. తాను బర్మా వెళ్ళి వచ్చినట్లు, తరువాత క్రైస్తవుడుగా తనకుగల అనుభవాలు ఆసక్తిగా చెప్పేవారు. అప్పటి నుండి సూరి (సూర్యనారాయణ) అక్కడే ఉండేవాడు. ఒక కుటుంబంవలె మేమందరం అలా ఎన్నో ఏళ్ళు మెలిగాం. భవనం వెంకట్రాం ముఖ్యమంత్రి కాగానే నాకు పదవి ఏదైనా ఇవ్వమని, నాతో చెప్పకుండా రాజశేఖర్ రెడ్డి వత్తిడి చేశారు. ఆయన మాట మీద భవనం నన్ను పిలిచి ఏ పదవి కావాలో కోరుకోమన్నాడు. అది లేనందువలనే మనం మిత్రులుగా కొనసాగుతున్నామని నేను స్పష్టంగా మర్యాదగా చెప్పాను. మిత్రులకు ఎలాగైనా సహాయపడాలనే ధోరణి రాజశేఖర రెడ్డికి మొదటి నుండి ఉన్నది.
జి.రాం రెడ్డి తొలుత వైస్ చాన్స్ లర్ గావడానికి సహాయ పడిన వారిలో రాజసెఖర రెడ్డి, భవనం కూడా వున్నారు. ఆ తరువాత ఓపెన్ యూ నివర్సిటికి వైస్ చాన్స్ లర్ గావడానికి మేము బాగా ఉపయోగపడ్డాము .అయితే అప్పుడు జెనెటిక్స్ ప్రొఫెసర్ ఒ.ఎస్ . రెడ్డి తీవ్రంగా తిప్పలు పడ్డారు . రాజసేఖరరెడ్డి తొలుత ఒ.ఎస్ .రెడ్డి ని బలపరిచినా ఆయనను ఒప్పించి రాం రెడ్డి కి మొగ్గు చూపడంలో నేను తో ద్పడ్డాను .రాం రెడ్డి ఓపెన్ యూనివర్సిటి సంగతి విదేశాలకు వెళ్ళి పరిసీలించారని నచ్చ చెప్పాను .కొద్ది రోజులు అప్పుడు రాజ శెఖర రెడ్డి విద్యామంత్రి గా వున్నందున కీలక పాత్ర వహించ గలిగారు. భవనం మాటపై రాం రెడ్డి ని బలపరచడంతో సమస్య తీరింది. ఒ.ఎస్ .రెడ్డి కి నాపై కోపం వచ్చినా తరువాత సర్దుకున్నారు .తరువాత నాపై ఫిర్యాదులతొ రాం రెడ్డి ముఠా రాజసెఖరరెడ్డికి మొర పెట్టుకున్నా ఆయన పెడచెవిన పెట్టారు .
కాంగ్రెసు పార్టీలో తొలుత రెడ్డి కాంగ్రెసులో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆ తరువాత చెన్నారెడ్డికి వ్యతిరేకిగా, ఉత్తరోత్తరా విజయభాస్కరరెడ్డికి నిరసన కారుడుగా, జనార్ధన్ రెడ్డిని ప్రతిఘటించిన వ్యక్తిగా వివిధ ఘట్టాలలో ఉన్నారు. ఎన్.టి.రామారావు తెలుగుదేశం పెట్టి ఎన్నికల ప్రచారం చేసి గెలిచి వచ్చిన తరవాత, ఆ ప్రభావపు ఉప్పెన ఎంత తీవ్రమైనదో రాజశేఖర్ రెడ్డి నాతో చెప్పారు. చివరకు తన జిల్లాలో, పులివెందులలో సైతం ఒక సునామీ వలె ఆ వాతావరణం ఉన్నదని కష్టంమీద తట్టుకున్నామని చెప్పాడు. కేంద్రంలో, రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి రానురాను అతి కీలకదశలో రాజకీయ ప్రాధాన్యతలోకి వచ్చారు. వ్యవసాయ రంగానికి ఆయనిచ్చిన ప్రాధాన్యత అమెరికా అధ్యక్షుడు బుష్ ను కూడా ఆకర్షించింది.
ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షడుగా రాజశేఖర రెడ్డి ఉండగా నేను అమెరికా నుండి అభినందన లేఖ పంపగా వెంటనే సంతోషంగా సమాధానం ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయిన తరవాత నేనాయనను తరచుగా కలుసుకోలేదు. ఎప్పుడైనా కొన్ని సంఘటనలలో నా ప్రస్థావన విలేఖరుల సమావేశంలో వచ్చినప్పుడు ‘ఇన్నయ్య ఇండియాలో ఉన్నాడా?’ అని అడిగేవారు. నేను దూరంగా ఉంటూ రాజకీయాలు పట్టించుకోనందువలన అటువంటి స్థితి ఏర్పడింది. కానీ, రాజశేఖర్ రెడ్డి హఠాత్తుగా చనిపోవటం మాత్రం దారుణ సంఘటనగా భావించాను. అదే విషయాన్ని నేను హెలికాప్టర్ ప్రమాదం నాడు టి.వి.5 ఛానల్ లో చెప్పాను కూడా. రాగద్వేషాలు రాజకీయాలలో మెండుగా కనబరిచిన రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో తిరుగులేని మార్పులు చేసి తనదైన ముద్ర వేశారు.
నేను ఇంగ్లిష్ లొ తొలుత రాసిన ఆంధ్ర ప్రదేష్ రాజకీయ చరిత్ర రాజశేఖరరెడ్డి కి బాగా నచ్చింది .http://www.centerforinquiry.net/uploads/attachments/Pradesh-Part-1.pdf
Innaiah Narisetti
2 comments:
వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలోని సకారాత్మక అంశాలను ఇన్నయ్య గారు పూస గుచ్చారు!కాని వారిలోని నకారాత్మక కోణాన్ని వారు చూపించి ఉంటే మరింత బాగుండేది!
This is one sided Article. Guess that is because of fear or friendship :-)
Post a Comment