నాదెండ్ల భాస్కరరావు-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 13




నాదెండ్ల భాస్కరరావు అడ్వకేటుగా ప్రాక్టీసు చేస్తూ రాజకీయాలలో ప్రవేశించారు. కాంగ్రెసు పార్టీ యూత్ విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించారు. నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా ఉండగా హైదరాబాదులోని సెక్రటేరియట్ ఎదురుగా వున్న మా ఆఫీసుకు అనేక పర్యాయాలు వచ్చేవారు. కొన్ని సందర్భాలలో రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు. ఇంచుమించు రోజూ ఫోనులో అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. భాస్కరరావు చురుకైన, తెలివిగల రాజకీయవాది. విషయాలు త్వరగా గ్రహించేవాడు. ఎక్కడికైనా చొచ్చుకు పోయేవాడు. ఆ విధంగానే కాంగ్రెసు పార్టీలో ఆయన అన్ని స్థాయిలవారితో మెసిలారు.
రాజకీయాలలో ప్రవేశించిన తొలి రోజులలో ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డికి చేరువయ్యారు. ఆయన తొలి మంత్రివర్గంలో శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. కానీ, తనకున్న సన్నిహితత్వం వలన ఇంకా పెద్ద శాఖను ఆశించారు. ప్రమాణ స్వీకారాలు జరిగిన తొలి రోజున గవర్నర్ శారదా ముఖర్జీ ఇచ్చిన విందుకు ఆయన అలిగి రాలేదు. తరువాత కొన్నాళ్ళకు చెన్నారెడ్డి మంచి శాఖను ఇచ్చినా భాస్కరరావు ఆట్టే కాలం నిలుపుకోలేకపోయారు. ఢిల్లీ వెళ్ళి తనపై ఫిర్యాదులు చెబుతున్నాడని చెన్నారెడ్డి ఆగ్రహించి మరొకసారి ఆయనకు అప్రధానమైన శాఖ ఇచ్చారు. ఇలాంటి రాజకీయ ఒడుదుడుకులు చెన్నారెడ్డి కాలంలో ప్రారంభమై అంజయ్య కాలంలో కొనసాగాయి. కనుక అంజయ్య కూడా భాస్కరరావును కుదించి ఒక దశలో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు కూడా. ఆ తరువాత భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా వుండగా భాస్కరరావు ప్రయత్నించినా పదవి రాలేదు. అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీకై ప్రతిపక్షాలు కొన్ని ప్రయత్నించడంతో ఎన్.టి.రామారావుకు చేరువై తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించాడు. తనను కో-పైలట్ గా చిత్రించుకున్నాడు. ఎన్.టి.రామారావు తొలి మంత్రివర్గంలో కీలకశాఖల్ని నిర్వహించాడు. పార్టీలో ఆయనకు ఉపేంద్రకు అసలు పడేది కాదు. అలాగే మరికొందరితో కూడా భాస్కరరావుకు పొత్తు కుదిరేది కాదు. భాస్కరరావుకు రాగద్వేషాలు ఎక్కువే. ఇందిరాగాంధీ తొందరపడవద్దని సలహా ఇచ్చినా తెలుగుదేశం పార్టీలో చేరాడు. కానీ, ఆయనకు పార్టీలో తృప్తిలేదు. జీవితమంతా కాంగ్రెసు సంస్కృతిలో అలవాటుపడిన భాస్కరరావు తెలుగుదేశంలో రామారావు నాయకత్వంలో ఇమడలేకపోయారు.
ఎన్.టి.రామారావు గుండె చికిత్సకు అమెరికా వెళ్ళినప్పుడు కాంగ్రెసు కుట్ర రాజకీయాలు పైకితెచ్చి వివిధ పార్టీలతో గూడుపుఠాణీ జరిపి కేంద్ర కాంగ్రెసు వారి మద్దతుతో రాష్ట్రంలో రామ్ లాల్ గవర్నర్ సానుకూలతతో కృత్రిమంగా రామారావును అధికారం నుండి తప్పించారు. ప్రజలు ఎన్నుకున్న రామారావు ఆయన పార్టీ ప్రజాస్వామికంగా వస్తే అందుకు పూర్తి విరుద్ధంగా భాస్కరరావు డొంక తిరుగుడు విధానాలతో రామారావును తొలగించి ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని నగరంలో కృత్రిమ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. తెలుగుదేశంలో ఉన్న బలహీనులకు అనేక ఆశలు చూపి కొందరిని ఆకర్షించగలిగారు. త్రిపురాన వెంకటరత్నం, నన్నపనేని రాజకుమారి మొదలైనవారు అలాగే మంత్రులయ్యారు. నిర్ణయాలు చకచక చేయటం అడిగిన వారికి అడిగినట్లు వరాలివ్వటం, కాలేజీలు, సంస్థలు మంజూరు చేయటం నిమిషాల మీద జరిగిపోయింది. కానీ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా రియాక్షన్ వస్తుందని తాము అభాసుపాలవుతామని భాస్కరరావు అంతగా వూహించి వుండడు. నెలరోజులు తిరక్కముందే భాస్కరరావు కృత్రిమ ముఖ్యమంత్రిత్వం పోయింది. ఎన్.టి.రామారావు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రజాస్వామికంగానే కొనసాగారు.
ఆశ్చర్యమేమంటే భాస్కరరావును ఆదుకుంటామని అండగా నిలుస్తామని చెప్పిన కాంగ్రెసు ఆ తరువాత ఆయనను గాలికి వదిలేసింది. అవమానించిన అంజయ్యకు మళ్ళీ కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారు. కానీ భాస్కరరావును మాత్రం రాజకీయంగా అంటరానివాడిగానే అట్టిపెట్టారు. అది రామారావు దెబ్బ.
భాస్కరరావును నేను ఈ విద్రోహ చర్య అనంతరం కలియడం మాట్లాడడం మానుకున్నాను. అప్రజాస్వామిక విద్రోహ చర్యగా ఆయన ధోరణి నాకు బొత్తిగా నచ్చలేదు.

- నరిసెట్టి ఇన్నయ్య

1 comment:

Unknown said...

దుందుడుకు ధోరణితో దొడ్డిదారిన దూకుడుగా ముఖ్యమంత్రిపదవిని కబళించి,ప్రధాని ఇందిరాగాంధీ గారి అండదండలతో ఎన్ టి రామారావు గారిని తొలగి౦పజేసి నెలరోజుల నెలరాజుగా వెలిగి రోజూ ఎన్నెన్నో రాజకీయ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పెడధోరణుల పెడసరపు వ్యక్తిత్వం కలిగినవారు నాదెండ్ల భాస్కర రావు గారు! ఆయన తిరుగుబాటుకు ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ తర్వాత ఏ పదవీ ఇవ్వకపోవడం గమనార్హం! ప్రధాని ఇందిర గారు తమ వ్యతిరేకులను గద్దె ది౦పడంలో రాజకీయముగా ఎంతవరకు తెగించగలరో ఈ దృష్టాంతం తేటతెల్లం చేస్తున్నది!

Post a Comment