నేను కలిసిన ముఖ్యమంత్రులు - 7
జలగం వెంగళరావు
(1921-1999)
“కాంగ్రెస్ పార్టీ ఆఖరి ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పేరు చరిత్రలో చిరస్థాయిగా” ఉంటుందని 1978లో శ్రీశ్రీ ఒక ఇంటర్య్వూలో జోస్యం చెప్పారు. అది దారుణంగా విఫలమయింది. ఆ తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే ఉన్నారు.
ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా, పంచాయత్ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడుగా వివిధ దశలలో వెంగళరావును నేను కలుసుకున్నాను. ఆయనతో సన్నిహితత్వం కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఆయన ఛాంబర్ లో కలుస్తున్నప్పుడు కొందరు పత్రికా విలేఖరులను రానివ్వక పోవడం ఆశ్చర్యం వేసింది. ఉత్తరోత్తరా తెలిసిందేమంటే, కక్కుర్తిపడి చిన్న చిన్న పనులకోసం చేయి చాపుతూ ఆశ్రయించిన వారు అలా పడి ఉన్నారని తెలిసింది. అయినా జర్నలిస్టులకు అదేమంత గౌరవప్రదమయిన విషయం కాదు.
పంచాయతీ వ్యవస్థ పట్ల ఆయనకుగల ఆసక్తి, శ్రద్ధను బట్టి నేను, జి.రామిరెడ్డి, కె.శేషాద్రి ఆయనకు దగ్గరయ్యాము. అనేక విషయాలు చర్చించాము. ఆ సంబంధం కొనసాగింది. తరువాత వెంగళరావు ఖమ్మం జిల్లా ముఠా రాజకీయాల నుండి ఎదిగి, రాష్ట్ర స్థాయిలో సంజీవరెడ్డి అనుకూలుడుగా రాజకీయాలలో కీలక పాత్ర పోషించాడు. బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఆరంభమయినప్పుడు, ఖమ్మంలో రవీంద్ర అనే విద్యార్థిని నిరాహారదీక్షకు కూర్చుండబెట్టి ఆందోళనకు నాంది పలికింది వెంగళరావే. అచిర కాలంలోనే ఆయన మంత్రివర్గంలో చేరి హోం మంత్రి అయ్యారు. అంతటితో ప్రత్యేక తెలంగాణా వదిలేశారు. హోం మంత్రిగా వెంగళరావు పోలీసుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన చెప్పిందొకటే. “మీరేం చేస్తారో నాకనవసరం. కానీ నక్సలైట్ల గురించి నాదాకా ఫిర్యాదులు రాకూడదు. మీమీదకు ఎలాంటి నెపం లేకుండా చూసే బాధ్యత నాది.” అది ఆసరాగా తీసుకొని పోలీసులు విజృంభించి ఎన్ కౌంటర్ల పేరుతో చాలామందిని హతమార్చారు. ఉత్తరోత్తరా ఈ విషయమై ఆరోపణల పరంపరను తట్టుకోవడానికి జస్టిస్ విమద్ లాల్ కమిషన్ వేశారు. మానవవాద సంఘాలలో కృషి చేస్తున్న మేము వెంగళరావు ధోరణిని నిరసించాము. విమద్ లాల్ కమీషన్ ముందు వాదించటానికి జస్టిస్ వి.ఎం.తార్కొండేను ఒప్పించి, ఎం.వి.రామమూర్తి, నేను తీసుకువచ్చాము. మిత్రులు, పెద్దలు కన్నభిరాన్ అండగా నిలిచారు. వామపక్షాలు ఆయన వాదించటం పట్ల చాలా సంతోషించాయి.
వెంగళరావు ముఖ్యమంత్రి కావడం విచిత్ర సన్నివేశం. ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల వూపు తరవాత పరిస్థితి సద్దుమణగడానికి ప్రత్యేకాధికారి సరీన్ ను నియమించారు. ఆరు నెలలు రాజకీయాలకు స్వస్తి పలికేసరికి అధికారం చవిచూచినవారు గిలగిలలాడిపోయారు. మరొకవైపు కేంద్రంలో శ్రీమతి ఇందిరా గాంధీ ఉభయ ప్రాంతాలకు ఆమోదయోగ్యమయిన తెలంగాణా వ్యక్తి ఉండే బాగుంటుందని ఆలోచించారు. అప్పుడు నూకల రామచంద్రారెడ్డి, జి. రాజారాం పేర్లు ప్రముఖంగా వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన పి.వి.నరసింహారావు ఈ విషయంలో లోపాయికారిగా వెంగళరావు పేరు తెచ్చారు. సయోధ్య అయోధ్య వాదాల మధ్య వెంగళరావుకు మద్దతు ఎంత ఉన్నదో బేరీజు వేస్తే 155 మంది వ్యతిరేకత చూపారు. కానీ రాజకీయాలలో తెరవెనుక జరిగే తంతు జనానికి ఒక పట్టాన తెలియదు. నవభారత్ కంపెనీ చౌదరి చిరకాలంగా వెంగళరావుకు అనుకూలుడు. ఆయన మరికొందరు కలిసి ఎలాగైనా వెంగళరావును రంగం మీదకు తీసుకురావాలని ప్రయత్నించారు. కేంద్రంలో ఇందిరాగాంధీకి దగ్గరగా ఉన్న దీక్షిత్ వంటి వారికి వెంగళరావు పేరు సూచించారు. కొత్త రఘురామయ్య కూడా అందుకు అనుకూలత కనబరిచారు. ఆయనకు ఉన్న వ్యతిరేకత విషయం దాచిపెట్టి పూర్తి మద్దతు ఉన్నట్లు చెప్పారు. ఒకసారి ఇందిరాగాంధీ పేరు చెప్పిన తరువాత వ్యతిరేకత కాస్తా అనుకూలంగా మారింది. ఇందులో కొందరు ప్రముఖ పోలీసులు సైతం తమ పాత్ర నిర్వహించలేకపోలేదు. మొత్తం మీద వెంగళరావు ముఖ్యమంత్రి కావటం ఆయన అదృష్టం. పైగా ఆయన హయాంలో ఎమర్జెన్సీ ఉండటం వల్ల ఎదురులేని పాలన సాగింది. విమద్ లాల్ కమిషన్ విచారణ సయితం ఆయన పదవిని కదిలించలేకపోయింది.
ముఖ్యమంత్రిగా వెంగళరావు నిర్ణయాలు తీసుకోవటం అమలు పరచటం చకచకా చేసేవాడు. డబ్బు మనిషి అనే పేరు తెచ్చుకోలేదు. ఆయన దగ్గరున్న సిబ్బంది అవసరమైతే డబ్బు విషయాలు చూసేవారు. కనుక ప్రత్యక్షంగా ఆయనపై నెపం వెయ్యడానికి వీలుండేది కాదు.
ఎమర్జెన్సీ ప్రకటించటంతో ఇందిరాగాంధీ నిర్ణయం వెనుక ఉన్న రహస్యాన్ని వెంగళ రావు బయటపెట్ట దలుచుకున్నారు. రాజకీయాల నుండి విరమించిన తరువాత ‘నా జీవితకథ’ అనే శీర్షికన పుస్తకం వ్రాశారు. ఆ సందర్భంగా జస్టిస్ ఎమ్.ఎల్.సిన్హా అలహాబాద్ హైకోర్టులో ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యానాలు చేశారు. దీనికి ఆయన తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ కోర్టు ధిక్కార నేరం కింద కేసు పెడతానన్నారు. వెంగళరావు క్షమాపణ చెప్పి బేషరతుగా పుస్తకాన్ని వెనక్కు తెప్పించి ఆ అంశాన్ని తొలగించి మరొక ప్రచురణ చేశారు. ఆయన రాసిన చరిత్రలో పి.వి.నరసింహారావు, నాదెండ్ల భాస్కరరావు, కాసు బ్రహ్మానందరెడ్డిలపై అనేక విషయాలలో విమర్శలు చేశారు.
వెంగళరావు పదవిలోనూ ఆ తరువాత హైదరాబాదులోని ద్వారకాపురి కాలనీ ఇంట్లో ఉండేవారు. బాగా పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నారు. నేను, ఎస్.వి.పంతులు నిరంతరం ఆయనను కలుస్తుండేవాళ్ళం. పోలీసు అధికారి బాలాజీ నమ్మినబంటుగా వెంగళరావుపట్ల ఇష్టంగా సేవలు చేసేవాడు. అనేక విషయాలు అరమరికలు లేకుండా అడినవాటికి తడుముకోకుండా వెంగళరావు చెప్పేవారు. ఎమర్జెన్సీ కాలంలో వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా, సంజయ్ గాంధీ ఆంధ్రలో పర్యటించడం ఆ సందర్భంగా వచ్చిన ఆరోపణలు, కళాపోషణ అంశాలు ప్రస్తావిస్తే దాటవేసేవారు. రాజకీయాలలో ఇలాంటివి ఎన్నో వస్తూనే వుంటాయి అనేవారు.
నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా వెంగళరావును కలిసే రోజులలో ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు రాగా ముఖ్యమంత్రి ఛాంబర్ లోనే వెనుక గదిలో అభ్యర్థులకు డబ్బులు పంచటం గమనించాను. ఆశ్చర్యపోయాను. వెంగళరావు దగ్గర వుండే ప్రకాశరావు, సీతాపతి వంటివారు ఆఫీసులో కీలకపాత్ర వహించేవారు. ప్యూనుగా ఉన్న లోకయ్య ఎంతో ప్రాముఖ్యుడుగా ఉండేవాడు. వెంగళరావు సమయపాలన బాగా పాటించేవాడు. అందువలన ఆయన కార్యక్రమాలకు పేచీ ఉండేది కాదు.
1975లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగనప్పుడు తన మంత్రిమండలి వెంకట కృష్ణారావుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సభలు జయప్రదంగా జరిగాయి. ఫ్రికెన్ బర్గ్ ను అటు వెంగళరావుకు, ఇటు వెంకట కృష్ణారావుకు పరిచయం చేశాను. ప్రొఫెసర్ పూర్వాపరాలు చెప్పాము. అదొక గొప్ప అనుభవం. ఫ్రికెన్ బర్గ్ ఒక పాస్టర్ కుమారుడు. గుంటూరు జిల్లాలో పుట్టాడు. తెలుగు బాగా మాట్లాడేవాడు. తరువాత ఆయన అమెరికాలో విస్కాన్ సిస్ యూనివర్సిటీలో రాజకీయ చరిత్ర ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు. అక్కడే వెల్చేరు నారాయణరావుగారు కూడా పనిచేశారు. నేను ఫ్రికెన్ బర్గ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు అమెరికాలో ఉండగా జరిపాను. ఆయన చాలా సంతోషించారు. వెంగళరావు, వెంకట కృష్ణారావును గుర్తు పెట్టుకుని అభినందించారు. ఆయన ‘గుంటూరు జిల్లా’ అనే శీర్షికన మంచి చారిత్రక పరిశోధనాత్మక పుస్తకం వ్రాశారు. దానిని ఆక్స్ ఫర్డ్ ప్రచురణల వారు వెలువరించారు. నేను దానిని తెలుగు చేసి ప్రచురించాను. ఆయనతో ఇప్పటికీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉన్నాను.
ఒకసారి సత్తుపల్లిలో వెంగళరావుపై కాళోజీ నారాయణరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వామపక్షాలవారు ఆయనను సమర్థించారు. రిపోర్టరుగా నేను పర్యటన చేసి ఎన్నికల వార్తలు సేకరించాను. అప్పుడు వెంగళరావును కలిస్తే డిపాజిట్టు పోయే సీట్లకు వామపక్షాలవారి హడావుడి ఇంతెందుకు అన్నారు. ఆయన అలా మాట్లాడటం అలవాటే. ఆయన మాటే నిజమైంది.
ఖమ్మం జిల్లాలో కొన్నిసార్లు ఆయన పర్యటిస్తున్నప్పుడు నన్ను, ఎస్.వి. పంతులును వెంటబెట్టుకెళ్ళారు. చాలా ఆదరంతో చూసేవారు. గిరిజన ప్రాంతాలలో అధికార పర్యటన ఏర్పాటు చేసినపుడు హెచ్.కె.బాబు ఆ శాఖ డైరెక్టరుగా ఉండేవారు. నేను గిరిజన వాసులను ఇంటర్వ్యూ చేసి ప్రత్యక్షంగా విషయాలు తెలుసుకొని ఆంధ్రజ్యోతిలో పెద్ద రిపోర్టు రాశాను. అందులో కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకమైన వ్యాఖ్యానాలున్నాయి. డైరెక్టరు హెచ్.కె.బాబు నాపై వెంగళరావుకు ఫిర్యాదు చేశాడు. ఆయన పట్టించుకోకపోగా ప్రభుత్వం కళ్ళు తెరిపించినందుకు నన్ను అభినందించారు. వెంగళరావు పదవీవిరమణ తరవాత హుందాగా జీవితం గడిపారు.
- నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment