విజయరాజకుమార్ (1927-83) నరిసెట్టి

 విజయరాజకుమార్- కన్యాకుమారి



1955లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రలో కమ్యూనిస్టులు విజయరాజకుమార్, వీరాచారిలను ఉద్దేశించి వాడిన పదం అది. ఆచార్య ఎన్.జి. రంగా కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ ఐక్య కాంగ్రెసు పక్షాన ప్రచారం చేశారు.  రంగాకు విపరీత మద్దతుతో చాలా బహిరంగ సభలు జరిగేవి. అప్పుడు రంగా పక్షాన ఎన్. విజయరాజకుమార్, ఎన్. వీరాచారి ప్రచారం చేసేవారు. వారి సభలకు బాగా ఆకర్షణ వుండేది. అర్థరాత్రి వరకు జనం బహిరంగ సభలలో వారి ప్రసంగాల కోసం వేచి వుండి వినేవారు.


సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులను బాగా ఎదుర్కొన్న ఖ్యాతి ఎన్. విజరాజకుమార్ కు దక్కింది. ఆయన అప్పటికే సిడ్నీ, బీట్రిస్ వెబ్ దంపతులు రాసిన ‘సోవియట్ కమ్యూనిజం’ అనే బృహత్గద్రంథాన్ని అధ్యయనం చేశారు. అది ప్రామాణిక రచన కావటం వల్ల విజయరాజకుమార్ దానిపై ఆధారపడి అనర్గళంగా ఉపన్యాసాలు చేసేవారు. కనీసం మూడుగంటలయినా ఉపన్యాసం ఒక్కొక్క ఉపన్యాసం సాగేది. ఉద్రిక్తత ప్రబలి వుండేది. నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు జరిగేవి. ఆంధ్రా అంతా ఎర్రబారిందని, కమ్యూనిస్టులు అధికారంలోకి రావటం ఖాయమని అనుకున్నారు. ఆ నేపథ్యంలో విజయరాజకుమార్, వీరాచారి ప్రచారం చేస్తే, కమ్యూనిస్టులు వారిని రంగా రేచుకుక్కలని తిట్టేవారు. ఒకేవేదిక మీదకు రమ్మని కమ్యూనిస్టులను వారు సవాలు చేస్తుండేవారు. మొత్తం మీద వారి సభలు విజయవంతంగా సాగేవి. వాటితోబాటు సుంకర సత్యనారాయణ, పసుపులేటి కోటేశ్వరరావు, కె. రోశయ్య మొదలైనవారు కూడా రంగా అనుకూల ప్రచారంలో వుండేవారు. ఏతావాతా ఫలితాలు చూస్తే కమ్యూనిస్టులు నేలకరిచారు. విజయరాజకుమార్ కు విపరీతమైన ఖ్యాతి వచ్చింది.


ఎవరీ విజయరాజకుమార్ (1927-83)

చేబ్రోలు పంచాయతీలోని పాతరెడ్డిపాలెంలో (గుంటూరు జిల్లా) 1927లో రాజయ్య – అంతోనమ్మ దంపతులకు కలిగిన ప్రథమ సంతానం థామస్. అయితే రోమన్ కాథలిక్ చర్చి నుండి బయట పడి పేరు మార్చుకుని హైస్కూలు స్థాయిలోనే విజయరాజకుమార్ గా వెలుగులోకి వచ్చారు. జీవితంలో హైస్కూలు చదువు పూర్తి చేయకుండానే రాజకీయ రంగంలో ప్రవేశించిన వ్యక్తి విజయరాజకుమార్. కనీసం మెట్రిక్యులేషన్ పూర్తిచేద్దామని టంగుటూరి సూర్యకుమారితోపాటు ఆనాడు అమలులో ఉన్న సీనియర్ కేంబ్రిడ్జ్ చదువు సాగించి, అదీ తుదివరకు సాగనివ్వకుండానే విరమించారు. తెనాలి, కొల్లిపర మొదలైన ప్రాంతాలలో అసంపూర్తి చదువులలోనే సుభాస్ చంద్రబోసు స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీకి ఆకర్షితులయ్యారు. అందులో చేరి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్రలో మద్దూరి అన్నపూర్ణయ్య ఆ పార్టీకి నాయకుడు. సుభాస్ చంద్రబోసు అదృశ్యం కాగా (1940లో) ఆంధ్రలో ఆ పార్టీవారు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించేవారు. అందులో ఉపన్యాసకుడుగా, గాయకుడుగా కార్యకర్తగా విజయరాజకుమార్ పనిచేశాడు. చేబ్రోలులో పార్టీ రాజకీయ పాఠశాలలు జరిగేవి. బాపట్ల నుండి వి.ఎల్.సుందరరావు,  చేబ్రోలులో టీచర్ మురహరిరావు  కూడా ఆ పాఠశాలలలోపనిచేసేవారు. కలకత్తా నుండి సుభాస్ చంద్రబోస్ అన్న కొడుకు శరత్ చంద్రబోసు వచ్చి ఉపన్యాసాలిస్తుంటే, వేదిక మీద విజయరాజకుమార్ దానిని తెలుగులోకి అనువదించేవారు. ఇదంతా 1951 వరకు జరిగిన కార్యక్రమం.

అప్పటికే విజయరాజకుమార్ తండ్రి రాజయ్య రంగా శిష్యులుగా వున్నారు. ఆయన కుమారుడు విజరాజకుమార్.ని ప్రోత్సహించి రంగావర్గంలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ముఠాలుగా చీలి రంగా, ప్రకాశం బయటపడి వేరే పార్టీలు పెట్టారు. కృషికార్ లోక్ పార్టీ రంగా స్థాపించగా వారి తొలి రాజకీయ పాఠశాల కృష్ణాజిల్లా చర్లపల్లిలో జరిగింది. విజయరాజకుమార్ అక్కడ పార్టీ సమావేశాల్లో పాల్గొంటుండేవారు. అందర్నీ ఆకర్షించారు. క్రమేణా ఆర్గనైజింగా కార్యదర్శిగా రంగా పక్షాన రాష్ట్ర ప్రజల నుద్దేశించి రచనలు ప్రారంభించారు. అప్పటికే ‘విప్లవాధ్యక్షుడు’ అనే పేరిట సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్రను రాసి ప్రచురించారు. దేశికవితా ప్రచురణలవారు దానిని ప్రచారంలోకి తీసుకువచ్చారు.

ఆచార్య రంగా రాసిన ‘రివల్యూషనరీ పెసెన్ట్స్’ అనే పుస్తకాన్ని ‘విప్లవ రైతాంగం’ పేరిట తెనిగించారు. ఆ విధంగా ఉపన్యాసాలు రచనలు సాగిస్తూ గుంటూరులో కుటుంబం పెట్టి గడుపుతుండగా గౌతు లచ్చన్న రంగా అనుచరుడుగా గీత సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. కల్లు గీసుకునే గీత కార్మికులకు నిషేధం వుండరాదని వారి జీవనవృత్తి కొనసాగాలని ఆయన నినదించారు. రంగా ప్రధమ శిష్యులలో లచ్చన్న ఒకరు. ప్రభుత్వ నిషేధానికి నిరసనగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళమని పిలుపునిచ్చారు. ఆ పిలుపు నందుకొని విజయరాజకుమార్, వీరాచారి సత్యగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. అప్పటికే విజయరాజకుమార్ గుంటూరులో ఎ.సి. కాలేజి ఎదురుగా యూనివర్సల్ బుక్ షాప్ పెట్టారు. ఎల్.వి.ఆర్. అండ్ సన్స్ క్లబ్ ఆవరణలో వుండేది. ఆయన అరెస్టు కావటంతో పుస్తకాల షాపు కుటుంబానికి అప్పచెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆరు మాసాలు శిక్ష అనుభవించారు. ఆ తరువాత గవర్నర్ త్రివేది నిషేధాన్ని ఎత్తివేయడంతో సత్యాగ్రహుల్ని విడుదల చేశారు. తిరిగి వచ్చిన తరువాత విజయరాజకుమార్ మళ్ళీ పార్టీ యాత్రను సాగించారు.  చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించారు. కుటుంబ భారాన్ని మోస్తూనే 1956లో పెళ్ళి చేసుకున్నారు. అయితే ఈలోపు కొద్ది కాలం అనంతపురం జిల్లా పుట్టపర్తి వెళ్ళి వచ్చి సాయిబాబా భక్తుడయ్యాడు. కానీ అది ఆట్టే కాలం వుండలేదు. ఆంధ్రపత్రిక విలేఖరిగా తెనాలిలో వున్న జె.వెంకటప్పయ్య శాస్త్రిగారి పెద్ద కుమార్తె కన్యాకుమారిని పెళ్ళి చేసుకున్నారు. గుంటూరులో సరస్వతీ మహల్ లో ఆ పెళ్ళి కార్యక్రమాన్ని సెక్యులర్ పద్ధతిలో ఆవుల గోపాలకృష్ణమూర్తి నిర్వహించారు. ఆచార్య రంగా, కొత్త రఘురామయ్య (కేంద్రమంత్రి) మొదలైనవారెందరో ఆ కార్యక్రమానికి విచ్చేశారు.

వారికి ఇద్దరు అబ్బాయిలు కలిగారు. ఈలోగా పూదోట శౌరయ్యతో పుగాకు వ్యాపారం ప్రారంభించారు. అది సాగక నిలిపేశారు. రాజకీయ కార్యకలాపాలు మాత్రం నిరంతరం కొనసాగించారు. ఎన్నికల కార్యక్రమాలలో 1956-57లో బాగా పాల్గొన్నారు. రాజకీయ రంగంలో మార్పులు రాగా స్వతంత్ర పార్టీ ఆవిర్భవించింది. రాజగోపాలాచారి, ఎమ్.ఆర్. మసాని, ఆచార్య రంగా, బెజవాడ రామచంద్రా రెడ్డి మొదలైనవారెందరో పార్టీ స్థాపకులుగా ఉన్నారు. నెహ్రూ సహకార వ్యవసాయ విధానంతో రైతులను నిర్వీర్యులుగా చేయదలిచారని ప్రచారం చేశారు. విజయరాజకుమార్ ఆవిషయాలను అనేక కరపత్రాలుగా చిన్న పుస్తకాలుగా రాసి ప్రచురించారు.
లోగడ 1950 ప్రాంతాలలో ఆంధ్రలో వినోబాభావే భూదానోద్యమాన్ని సాగించారు. దానిని రంగా పక్షం వ్యతిరేకించింది. ఆయన ధోరణి రైతులకు అనుకూలం కాదన్నది. విజయరాజకుమార్ ఆయన్ను ఒక సభలో తారసిల్లి త్యాగం అనేది గడ్డం పొడవును బట్టా, తినే ఆహారాన్ని బట్టా నిర్ణయించేది ? అని ఎద్దేవ చేశారు. స్వతంత్ర పార్టీ రాష్ట్ర  ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విజరాజకుమార్ ప్రచారం చేశారు.

ఒకానొక సందర్భంలో విజయనగరానికి తాతా దేవకీనందన్ మున్సిపల్ ఛైర్మన్ గా వుండేవారు. ఆయన ఆహ్వానంపై ఆవుల గోపాలకృష్ణమూర్తి, విజయరాజకుమార్ వెళ్ళారు. బహిరంగ సభ ప్రారంభం కానుండగా విజయరాజకుమార్ తన పైపంచ కోసం వెతుకుతున్నారు. అప్పుడు గోపాలకృష్ణమూర్తి చమత్కరిస్తూ పైపంచ లేకపోతే ఉపన్యాసం పెగలదా? అని చమత్కరించారు. వేదికమీద ఉన్నవారు గొల్లుమన్నారు.

సంజీవరెడ్డి పై పోరాటం

విజయరాజకుమార్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయానికి స్థానిక సంస్థల పక్షాన సెనేట్ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. అప్పట్లో గోవిందరాజుల నాయుడు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ముఖ్యమంత్రి సంజీవరెడ్డిని పిలిచి గౌరవ పట్టాను సమర్పించారు. అలా గౌరవ డిగ్రీ ఇవ్వాలంటే సెనేట్ ఆమోదం వుండాలి. అది జరగనందుకు విజయ రాజకుమార్ అభ్యంతర పెట్టారు. కోర్టులో దావా వేశారు. కోర్టు కేసు తేలేవరకు సంజీవరెడ్డిని డాక్టర్ అని పిలవవద్దని ప్రభుత్వ  కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. విజయరాజ కుమార్ కేసును నెల్లూరులో వేయగా ఆవుల గోపాలకృష్ణమూర్తి వాదించారు. వాయిదాలు పడుతూ వచ్చిన ఆ కేసు ఆసక్తికరంగా సాగినా చివరకు జడ్జీకి ధైర్యం చాలక కేసును తిరుపతి మార్చుకోమని తప్పుకున్నారు. విజయరాజకుమార్ కాపరాన్ని సంగారెడ్డికి మార్చారు. తెలంగాణా స్వతంత్ర పార్టీ పక్షాన పనిచేశారు. సంగారెడ్డిలో భూములు కొని వ్యవసాయం చేశారు. కానీ అది సాగలేదు. కనుక వాటిని అమ్మేసి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అది కూడా అంతంత మాత్రంగానే సాగింది.

ఆచార్య రంగా కాంగ్రెస్ లో తిరిగి చేరినప్పుడు విజయరాజకుమార్ మాత్రం ప్రతిపక్షంలోనే వుండేవారు. సంగారెడ్డిలో ఏమంత చురుకుగా రాజకీయం సాగలేదు. తన రచనలు అడపతడప సాగిస్తూ ‘కడలిమీద కోంటికి’ (Kon-tiki రచయిత Heyerdahl) అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. భారత ప్రధాని చరణ్ సింగ్ స్థాపించిన  లోక్ దళ్ పార్టీలో చేరారు. రైతుల పక్షాన ఆయన పోరాటాలను సమర్థించారు. ఆయన రాసిన Economic Nightmare of India ను తెలుగులోకి అనువదించారు. ఆయన మరణానంతరం తెలుగు అకాడమీ ముద్రించింది. సంగారెడ్డిలో వుండగా బెంగుళూరు నుండి గణిత నిపుణురాలు శకుంతలాదేవి (22.4.2013న మరణించారు) వచ్చి మెదక్ నుండి లోక్ సభకు ఇండిపెండెంట్ గా పోటీ చేసారు. ఆమె సహకారం కోరిందని విజయరాజకుమార్ ప్రచారం చేశారు. డిపాజిట్ రాలేదనుకోండి.  విజయరాజకుమార్ కు హోమియోపతి వైద్యం పై మూఢనమ్మకం వుండేది. ఇతరులకు చికిత్స చేయటమే కాక తాను స్వయంగా వాడుకునేవారు. తనకు కిడ్నీస్ విఫలం కాగా హోమియో పతి ఏమీ కాపాడలేకపోయింది. ఉస్మానియా ఆసుపత్రిలో చేరి అక్కడ చనిపోయారు.ఈనాటికీ కమ్యూనిస్టు వ్యతిరేకిగా ఉపన్యాసకుడుగా ఆయన్ను కొద్దిమంది తలుచుకుంటారు. 
courtesy: Deeptidhara blog ( Mr C.Bhaskararao)

No comments:

Post a Comment