నేను కలిసిన ముఖ్యమంత్రులు-సి. రాజగోపాలాచారి--1


రాజాజీ
నేను రాజాజీగారిని వారు మద్రాసు రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కలుసుకోలేకపోయాను. అయినప్పటికీ, వారు స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేసిన చాలా కాలం తర్వాత నాకు వారితో కలిసి పనిచేసే భాగ్యం దక్కింది.
రాష్ట్రం కమ్యూనిస్టుల హస్తగతం కాకుండా కాపాడడానికే రాజాజీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. 1952లో దేశంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో మద్రాసు అసెంబ్లీకి అత్యధిక సంఖ్యలో కమ్యూనిస్టులు ఎన్నిక కావడం జరిగింది. సహజంగానే వారు అధికారాన్ని చేపట్టాలని ఆశించారు. టంగుటూరి ప్రకాశంగారికి వారు ముఖ్యమంత్రి పదవిని ఆశచూపడం వల్ల ఆయన వారికి తలొగ్గడానికి సుముఖంగా ఉన్నారు. ఎన్నికలలో ప్రకాశంగారు కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా పని చెయ్యటమే కాక ఆంధ్ర ప్రాంతంలోని అనేకమంది ప్రముఖ కాంగ్రెసు నేతల ఓటమికి కీలకపాత్ర వహించారు.
కాంగ్రెసు పార్టీలోని కేంద్ర నాయకత్వం, కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో ప్రకాశంగారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరోధించడానికి అన్ని శక్తులూ ఒడ్డి ప్రయత్నాలు చేసింది. దానికి రాజాజీ తగినంత బలాన్ని కూడగట్టుకుని, ప్రకాశంగారి నాయకత్వంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాకుండా నిరోధించగలిగారు. ప్రొఫెసర్ ఎన్.జి.రంగా రాజాజీకి తమ పూర్తి మద్దతునిచ్చారు. కృషికార్ లోక్ పార్టీ సభ్యులైన ప్రజాప్రతినిధుల (ఎమ్.ఎల్.ఎల) మద్దతుతోనే రాజాజీ ముఖ్యమంత్రి కాగలిగారు.
నేను విద్యార్థిగా వుంటూనే రాజకీయ సమీకరణాలను అవగాహన చేసుకుంటూ ఉండేవాడిని.
రాజాజీ, రంగాజీ ఇద్దరూ కాంగ్రెసు నుండి బయటకు వచ్చి 1958లో స్వతంత్ర పార్టీని స్థాపించారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత రాజాజీ, కొందరు ముఖ్య నేతలు 1958-1959లో ఆంధ్ర ప్రాంతమంతా పర్యటించారు. ఆ యాత్ర బాపట్లలో మొదలై బొబ్బిలిలో ముగిసింది.
నేను రంగాగారి వద్ద పి.ఎ.గా చేరాలని కోరుతూ రంగాగారి వద్దనుండి కార్డు వచ్చింది. అది చూసి ఆశ్చర్యపడి తెనాలి వాస్తవ్యులు శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తిగారిని వారి సలహాకోసం సంప్రదించాను. శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తిగారు జాతీయ నాయకులతోనూ, వారి వ్యవహారాలతోనూ పరిచయాలు పెంచుకునేందుకు ఇదొక గొప్ప అవకాశమని నొక్కి చెప్పారు. రంగాజీగారి పి.ఏ.గా ఉన్నా ప్రత్యక్షంగా రాజకీయాలలో నన్ను అతిగా కలిగించుకోవద్దని హితబోధ చేశారు.
నేను రంగాజీగారి నివాసస్థలమైన నిడుబ్రోలుకు వెళ్ళి ఉద్యోగంలో చేరాను. రంగాజీగారి సాహచర్యం, రాజాజీగారిని కలుసుకునే అవకాశం కలిగించింది.
రాజాజీని, మిగిలిన నాయకులను అనుసరిస్తూ బాపట్ల నుండి బొబ్బిలి వరకూ భారీ ర్యాలీలను, అనేక బహిరంగ సభలను ప్రత్యక్షంగా చూశాను. ఆయా ప్రదేశాలకు ప్రయాణించేటపుడు అల్పాహార వేళల్లోనూ, భోజన విరామ సమయాల్లోనూ బసచేసి అతిథి గృహాల్లో రాజాజీగారితో అనేక విషయాలపై ముచ్చటించే అవకాశం లభించింది.
పర్యటన మొదటి రోజునే రంగాజీగారు నన్ను రాజాజీగారికి పరిచయం చేయడంతో ఇతరులెవరూ మాట్లాడడానికి సాహసించని అనేక విషయాలను రాజాజీగారితో చర్చిస్తూ ఉండేవాడిని.
రాజాజీ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా నేను ఈ టూరు ప్రోగ్రాం గురించి ...వాహిని… (రంగాగారి ఆధ్వర్యంలో నడిచే తెలుగు వారపత్రిక)కి రాస్తున్నానని చెప్పాను. ఆ పత్రిక ఈ పర్యటన గురించిన విశేషాలను విస్తృతంగా ప్రచురించింది.
కాకినాడలో మేము శ్రీ ఎమ్.వి.శాస్త్రిగారి ఇంట బస చేసినప్పుడు రాజాజీ చేతి రుమాలుతో కాఫీ కప్పును పట్టుకుని వేడివేడి కాఫీ తాగుతున్నారు. నేను ‘కాఫీకప్పు రుమనాలుతో పట్టుకోవడం ఎందుకు?’ అని వారిని అడిగాను. వారు కప్పు నా చేతికి యిచ్చి పట్టుకోమన్నారు. అది చాలా వేడిగా వుండడం చేత నేను పట్టుకోలేకపోయాను. అయితే దీనివల్ల రాజాజీ కప్పులోని కాఫీ పూర్తి చెయ్యడానికి ఏ ఆటంకమూ లేకపోయింది. అది చక్కెర లేని బ్లాక్ కాఫీ. అలవాటు లేనిదే ఆ కాఫీ రుచిని ఆస్వాదించలేమని రాజాజీ చెప్పారు. నాకు కూడా ఒక చిన్న కప్పు కాఫీ తెప్పించి యిచ్చారు. అది నాకు కషాయంలాగా తోచింది.
తర్వాత రాజాజీ తన స్వంత అనుభవాలు చెప్పసాగారు. బాపట్ల నుంచే అనేకమంది రాజాజీ ఉపన్యాసాలను ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చెయ్యడానికి ప్రయత్నించసాగారు. వీరాచారి, విజయరాజకుమార్, ఉషశ్రీ, సుంకర సత్యనారాయణ మరికొద్దిమంది తర్జుమా చేయడంలో సఫలీకృతులు కాలేకపోయారు. రాజాజీగారి స్పష్టమైన సరళమైన, వ్యంగ్యోక్తులతో కూడి, హాస్యరసస్ఫోరకంగా ఉండే ప్రసంగాలను తర్జుమా చేయడం వారివల్ల కాలేదు. చివరకు గౌతు లచ్చన్నగారు మైకునందుకుని రాజాజీగారి ప్రసంగాలను తెలుగు నుడికారపు సొబగులతో అనువదించి కరతాళ ధ్వనులు మిన్నుముట్టేలా చేసి, అందరి ప్రశంసలనూ అందుకున్నారు. రాజాజీ వారిని అభినందించి ఇకపై తన ప్రసంగాలను అనువదించే పని వారినే చేయమని కోరారు. నేను బాపట్ల నుండి బొబ్బిలి వరకూ బెజవాడ రామచంద్రారెడ్డిగారి ఫియట్ కారులో ప్రయాణించాను. ఎస్.వి.పంతులు కూడా మాతో రావడం జరిగింది.
రాజాజీతో సమయం గడపడం ఒక విశేషమైన అనుభవం. నేను ప్రతిదినం రిపోర్టును సక్రమంగా తయారుచేసి పంపానా లేదా అని ప్రతిరోజూ అడుగుతూ ఉండేవారు. రిపోర్టర్లు తమ రిపోర్టులో తమ స్వంత బాణీలను, స్వకపోల కల్పితాలను చేరుస్తూ ఉంటారని రాజాజీ అభిప్రాయపడ్డారు. నేను వారి ఉపన్యాసాలను, ప్రసంగాలను అర్థం చేసుకున్నాననీ ఆ ప్రకారంగానే రిపోర్టు సమర్పించాననీ చెప్పాను.
బాపట్లలో ఆవుల గోపాలకృష్ణమూర్తిగారి ఉపన్యాసం మీద తమ అభిప్రాయం చెప్పమని రాజాజీని అడిగాను. అది సహకార క్షేత్రాల ఏర్పాటుకు నెహ్రూ ప్రభుత్వం వ్యతిరేకించిన రాజ్యాంగంలోని 17వ అధికరణానికి సంబంధించిన విషయం. సభావేదిక పైనున్న రాజాజీ చప్పట్లు కొట్టి ఆ గోపాలకృష్ణగారి ప్రసంగం అద్భుతమని అభినందించి, ఆయన ఉపన్యాసం తరువాత తానేమీ మాట్లాడ నవసరం లేదని చెప్పారు. అదే ఆ గోపాలకృష్ణగారికి పెద్ద అభినందన.
నేను స్వతంత్ర పార్టీ రాజకీయాల్లో ఎప్పుడూ తలదూర్చలేదు. తర్వాత రెండు సంవత్సరాలకు రంగాజీగారి పి.ఎ.గా నేను విరమించుకున్నాను. ఆ కాలంలో రంగాజీగారివల్ల నేను రాజాజీ, ఎం.ఆర్.మసానీ, బెజవాడ రామచంద్రారెడ్డిగారి వంటి ప్రముఖులకు దగ్గరయ్యే అవకాశం కలిగింది. మతానికి సంబంధించిన రాజాజీగారి అభిప్రాయాలతో నా విభేదాలు వారి మేథస్సు ప్రజ్ఞపై నాకున్న అపార గౌరవానికి అడ్డంకులు కాలేదు.

నరిసెట్టి ఇన్నయ్య
వరుసాగా నేను కలసిన ముఖ్య మంత్రులతొ నా పరిమిత అనుభవాలు అందిస్తున్నాను





No comments:

Post a Comment