మిత్ర శత్రువుగా నీలం సంజీవరెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 3


Shake hands with Sanjivareddi, the speaker of Lok Sabha in Begumpet airport, Hyderabad
మిత్ర శత్రువుగా నీలం సంజీవరెడ్డి
(1913-1996)


ఆంధ్రప్రదేశ్, దేశ రాజకీయాలలో ఒక ఊపు ఊపిన రాజకీయ దిట్ట నీలం సంజీవరెడ్డి. ఆయన చదివింది ఇంటర్మీడియట్ అయినా రాష్ట్రపతి వరకూ ఎదిగి కీలకపాత్ర వహించిన వ్యక్తి. మొట్టమొదటిగా ఆయనను కర్నూలు రాజధానిలో కలుసుకున్నాను. అది సన్నిహిత పరిచయం కాదు. ఆయన అప్పటికే చాలా వివాదాస్పదమై వ్యక్తి. ఆచార్య రంగా వ్యతిరేకంగా ఉన్నందున ఆయనపట్ల నేను సుముఖత కనబరచలేదు. కానీ అశ్రద్ధ చూపడానికి వీలులేని రాజకీయ నాయకుడిగా సంజీవరెడ్డిని పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తూపోయాను.
తెనాలిలో ఆవుల గోపాలకృష్ణమూర్తి 1954-55లో మునిసిపల్ ఛైర్మన్ గా ఉన్న రోజులలో, సంజీవరెడ్డి మంత్రి హోదాలో వచ్చారు. అప్పుడు మున్సిపల్ ఛైర్మన్ గోపాలకృష్ణమూర్తి సభాముఖంగా సంజీవరెడ్డిని రెండు రోడ్లు తెనాలికి మంజూరు చేయవలసిందిగా కోరారు. అందుకు సంజీవరెడ్డి స్పందిస్తూ అడిగిన రెండింటిలో ఒకటి మంజూరు చేస్తున్నట్లు, అంటే 50 శాతం ఇచ్చినట్లు అని ప్రకటించి, ఇలా ఇవ్వడం అపూర్వమని మిగిలిన చోట్ల ఇవ్వనివిధంగా ఇస్తున్నానని చెప్పారు. గోపాలకృష్ణమూర్తి ధన్యవాదాలు చెపుతూ రెండులో ఒకటి సగం కాదని, అడిగిన రెండింటిలో ఒక రోడ్డు లక్షన్నర విలువ కాగా, రెండవది 50 వేలు మాత్రమేనని కనుక లక్షన్నర విలువచేసే రోడ్డు నిర్మాణం అంగీకరిస్తే సంతోషిస్తామని చెప్పగా సభలో పెద్ద పెట్టున చప్పట్లు కొట్టారు. తరువాత ట్రావెలర్స్ బంగళాలో సంజీవరెడ్డి తనను తెనాలి ఆహ్వానించి తీసుకువచ్చిన ఆలపాటి వెంకట్రామయ్యపై ఆగ్రహం కనబరిచి, నన్ను సభాముఖంగా ఇలా అవమానం చేయిస్తాడా అని అన్నారు. అప్పుడు నేను సభలో ప్రేక్షకుణ్ణి మాత్రమే. గోపాలకృష్ణమూర్తి అభిమానిని కూడా.
సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు తిరుపతిలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. నాటి వైస్ ఛాన్సలర్ గోవిందరాజులు నాయుడు ఏకపక్షంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా సెనేట్ కు చెప్పకుండానే నిర్ణయం తీసుకోవటం అప్రజాస్వామికమని మా అన్న విజయరాజకుమార్ సెనేటు సభ్యులుగా కోర్టులో కేసు వేశారు. అది తేలేవరకూ డాక్టర్ అని తన పేరు ముందు వాడవద్దని సంజీవరెడ్డి పక్షాన ఛీఫ్ సెక్రటరీ భగవాన్ దాస్ ఉత్రువులిచ్చారు. నెల్లూరు కోర్టులో ఆ కేసును ఆవుల గోపాలకృష్ణమూర్తి చేపట్టారు. కొంతకాలం విచారణ జరిగిన తరువాత తమ పరిధిలో లేదని ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. ఉత్తరోత్తర నేను కలిసినపుడు మీమీద కోర్టులో గౌరవ డిగ్రీ విషయమై కేసు పెట్టిన వ్యక్తి మా అన్న అని చెప్పినప్పుడు ఆయన సీరియస్ గా తీసుకోలేదు. తరువాత మేము మిత్రులమయ్యాము.
1955 ఉప ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార ఉద్యమం ముమ్మరంగా ఆంధ్రలో సాగినప్పుడు సంజీవరెడ్డి, రంగా కలిసి పర్యటించారు. మా అన్న విజయరాజకుమార్ రంగా పక్షాన ఆ పర్యటనలో చాలా సభలలో పాల్గొన్నాడు. రంగాగారి సన్నిహితులుగా నేను కొన్ని సందర్భాలలో సంజీవరెడ్డిని కలవటం తటస్థించింది. ఆ తరువాత ముఖ్యమంత్రిగాను, కేంద్రమంత్రిగాను ఉన్న సంజీవరెడ్డితో నేను కలిసింది తక్కువే. హైదరాబాదులో ఒకేసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొలి రోజులలో గోరాగారు అనుచరులతో సత్యాగ్రహం తలపెట్టారు. నిరాడంబరంగా ఉండాలని, పూలమొక్కల బదులు కూరగాయలు పెంచాలని ఉద్యమంలో ప్రధానాంశాలుగా ఉన్నవి. సంజీవరెడ్డి గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రిగా బస చేసినప్పుడు (1963) దాని ఎదురుగా గోరా, ఆయన భార్య సరస్వతి, పత్తి శేషయ్య, వెంపో, కానా మరికొందరితోపాటు నేనూ రోడ్డుమీద కూర్చున్నాను. సంజీవరెడ్డి కబురుపెట్టి గోరాని పిలిపించుకొని భోజనం పెట్టి చర్చలు జరిపి పంపించారు. ఆ సందర్భంగానే మిగిలినవారిని కూడా లోనికి పిలిచి నిర్ణయాలు చెప్పమని గోరా కోరినప్పుడు, ఆయన మమ్మల్ని లోపలికి పిలిచినప్పుడు కలవటం జరిగింది. అక్కడ నన్ను గుర్తుపట్టి లోగడ కర్నూలులో, తెనాలిలో కలిశావు కదా అన్నారు. మీకు చాలా గుర్తున్నదే అన్నాను.
చాలాకాలం తరువాత రాజకీయ సుడిగుండంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన తరువాత సంజీవరెడ్డి జనతా పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు నేను కలవడం తటస్థపడింది. ఎమ్.వి.ఎస్. సుబ్బరాజు అప్పుడు సంజీవరెడ్డికి ప్రియశిష్యుడుగా ఉండేవాడు. ఆయన నాకు కుటుంబ మిత్రులు. ఆ విధంగా కొన్ని పర్యాయాలు సంజీవరెడ్డిని దగ్గరగా కలుసుకున్నాను. ‘కమెండో’ పత్రిక ఎడిటర్ వినుకొండ నాగరాజు ఎలాగో సంజీవరెడ్డికి చాలా సన్నిహితుడయ్యారు. ఆయన నాకు మిత్రుడు కనుక మేము హైదరాబాదు సరోవర్ హోటల్ లో కొన్ని సందర్భాలలో కలిసి మాట్లాడటం వలన దగ్గరగా వచ్చాము. వినుకొండ నాగరాజు జనతాపార్టీ పక్షాన పోటీచేసి ఓడిపోవడం ఆ తరువాత రాష్ట్రపతిగా ఉన్న సంజీవరెడ్డి దగ్గరకు అప్పుడప్పుడూ ఢిల్లీ వెళ్లటం కూడా జరిగేది. నేను ఢిల్లీలో కలవలేదు. కాని హైదరాబాదులోనే అనేక సందర్భాలలో సంజీవరెడ్డిని కలిసే అవకాశం లభించింది. ‘మిసిమి’ ఎడిటర్ ఆలపాటి రవీంద్రనాథ్ చిరకాలంగా సంజీవరెడ్డికి సన్నిహితులు. అలా కూడా మేము విడిది గృహాలలో సంజీవరెడ్డిని కలిశాము.

చివరి రోజులలో నా మిత్రుడు, బుక్ లింక్స్ పుస్తక ప్రచురణ సంస్థ యజమాని కె.బి.సత్యనారాయణ ద్వారా సంజీవరెడ్డి తన జీవిత గాథను ప్రచురించాడు. అప్పుడు నేను వ్రాతప్రతిని చూడటం కొన్ని సలహాలు చెప్పటం వలన మరికొంత సన్నిహితులమయ్యాము. తొలి ప్రతిలో నిష్కర్షగా చాలా విషయాలు బయటపెట్టిన సంజీవరెడ్డి తీరా ప్రచురణ సమయానికి ఎందుకోగాని వాటన్నిటినీ ఉపసంహరించారు. వివాదాలు అనవసరమని భావించారు. నేను కొంతమేరకు ఆశ్చర్యపోయాను. పుస్తకం పేరు ‘ఫ్రం ఫామ్ హౌస్ టు రాష్ట్రపతి భవన్’ ఆయన రాసిన మరొక స్వీయగాథను ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’ అనే శీర్షికన అలైడ్ పబ్లిషర్స్ వెలికి తెచ్చారు. స్పీకర్ గా, రాష్ట్రపతిగా సంజీవరెడ్డి చాలా అధునాతన సాహిత్యం చదివారు. ఒకసారి ఎం.సి.చాగ్లా అది తెలిసి ఆశ్చర్యపోయి మెచ్చుకున్నారు. సంజీవరెడ్డి మిగిలినవారితో పోల్చితే నిరాడంబరంగా జీవితం గడిపారు. హైదరాబాదు వచ్చేముందు ఎస్.వి.పంతులుగారికి కబురు చేసి సరోవర్ లో బస ఏర్పాటు చేయమనేవారు. ఆవిధంగా కూడా కొన్ని సందర్భాలు మేము కలిసి మాట్లాడడానికి అవకాశాన్నిచ్చాయి. సంజీవరెడ్డి ఎదిగాడు. సంజీవరెడ్డి చివరి రోజులలో చాలా సన్నిహితంగా వ్యవహరించటం నాకు సంతోషదాయకమైన విషయం. ఇందిరాగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీని అప్రజాస్వామికమైనదిగా సంజీవరెడ్డి వ్యతిరేకించటం గొప్ప హైలైట్. మొదటిసారి తన బావమరిది తరిమెల నాగిరెడ్డి (కమ్యూనిస్టు) చేతిలో అనంతపురంలో ఓడిపోయిన తరువాత మళ్లీ జిల్లాలో ఎప్పుడూ పోటీ చేయలేదు. బయటనుండే గెలిచారు. సంకుచిత కాంగ్రెస్ రాజకీయాల నుండి ఆయన ఎదిగి జనతా రాజకీయాలలో ప్రజాస్వామిక వాదిగా పరిణమించటం విశేషం.
In his last days Sanjiva reddi wrote his autobiography under the title:
Without Fear or Favour : Reminiscences and Reflections of a President, published in 1989  by Book links, Hyderabad

1 comment:

Unknown said...

మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరోవేలుగా అభివర్ణించి దానిని తొలగించి తెలంగాణాకు అన్యాయం చేశారు!పెద్దగా చదువుకోకున్నా రాజకీయంగా చురుకుగా,తెలివిగా వ్యవహరించి అంచెలంచెలుగా క్రమక్రమంగా ఎదిగి రాష్ట్రపతి పదవి వరకు ఎదిగారు!నీలం గారు ఆత్మకథ వ్రాసుకున్నట్లు నాకు తెలియదు!అది ఇప్పుడు అచ్చులో లభిస్తుందా?తెలుపగలరు!

Post a Comment