జ్యోతిష్యంలో అశాస్త్రీయాలు

జ్యోతిష్యంలో వింతలు, విడ్డూరాలు, అశాస్త్రీయాలు

ఖగోళ శాస్త్రం – జ్యోతిష్యం :
ఖగోళశాస్త్రం సైన్స్ లో భాగం. ఇందులో పరిశీలన, పరిశోధన ప్రధానంగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఈ ప్రక్రియ జరుగుతున్నది. కనుక క్రమేణా తెలుసుకునేది విస్తృతమౌతున్నది. పూర్వం తెలియని గ్రహాలు, నక్షత్రాలు, శకలాలు ఇలా ప్రకృతిలో ఎన్నో విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇప్పటికి పరిమితంగా తెలిసింది. ఇంకా తెలియవలసింది అనంతంగా ఉన్నది. కనుక ఖగోళ శాస్త్రంలో ఏప్పుడూ నిత్య నూతనంగా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇందులో మరొక విశేషమేమిటంటే లోగడ తెలుగుకున్న వాటిలో దోషాలున్నా, అసంపూర్ణతలు ఉన్నా అవి దిద్దుకుంటూ పోవటం శాస్త్రియ ప్రక్రియలో ఒక ఉత్తమ గుణం. తన తప్పులను తాను సవరించుకుంటూ రుజువైన వాటిని అంగీకరిస్తూ, రుజువు కానివాటిని మూఢంగా నమ్మకుండా, రుజువుల కోసం ఎదురు చూడటం ఈ శాస్త్రంలో మంచి లక్షణం. ఇది సైన్స్ లో అన్ని విభాగాల్లోనూ ఉంటుంది. ఇందులో జ్యోతిష్యాలకు, ఊహలకూ, మనుషుల బలహీనతలను అట్టం పెట్టుకుని వ్యాపారం చేసే ధోరణి ఉండదు.
జ్యోతిష్యం భారత దేశం సొత్తు కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సహా అనేక చోట్ల ఇది ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా మత, ధోరణిలో జోతిష్యం సాగింది. ఎక్కువగా పూర్వీకుల రచనలు, వాదనలు, ఆధారంగా జ్యోతిష్యం నడుస్తున్నది. మనుషులలో ఉన్న బలహీనతలు, నమ్మకాలు, పెట్టుబడిగా జ్యోతిష్యం వాడుకుంటున్నది. ఇందులో దోషాలు దిద్దుకోవటం, తప్పులు సవరించుకోవటం కనిపించదు. పైగా కుంటి సాకులతో కప్పి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రుజువులు ఆధారాలు లేకపోవటమే. గ్రహాల నుండి మనుషులపై ప్రభావం చూపే ఆధారాలేమీ లేవు. కానీ ఉన్నట్లుగా నమ్మించి, చెప్పి వ్యక్తులను తప్పుదారిన పట్టిస్తున్నారు. ప్రాచీనమైనంత మాత్రాన అదే సరైనదనే ధోరణి నడుస్తున్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఎన్నో దోషాలు అమలులో ఉన్నాయి. మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను వదిలేయటం అవసరం. ఉదాహరణకు అంటరాని తనం, కులహెచ్చుతగ్గులు, చాలా కాలం నుంచి వస్తున్నాయి. అంతమాత్రాన అవి మంచివని, వాటినే అనుసరించాలని అనలేము. అలాగే జ్యోతిష్యం ప్రాచీన కాలంలో ఎవరో చెప్పారని ఇప్పటికీ మూర్కంగా అనుసరించటం మన జనాన్ని వెనక్కి నడిపించటమే. ఇదే దోరణి విదేశాల్లోనూ ఉన్నది. అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు వారు రుజువులకు ముందుకు రారు. ఇండియాలోనూ అదే ధోరణి ఉన్నది.

ప్రపంచంలో చాలా దేశాలలో జ్యోతిష్య నమ్మకాలు ఉన్నాయి. కానీ భారతీయ జ్యోతిష్యం వాటికి భిన్నంగా, చాలా ప్రత్యేకతలతో ఉన్నది.
భారతీయ జ్యోతిష్యానికి మూలం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు, 108 పాదాలు, పుట్టుక కాలం.
9 గ్రహాలలో ప్రపంచంలో ఎక్కడా లేని, శాస్త్రీయ ఆధారాలకు అందని రెండు గ్రహాలున్నాయి. ఒకటి రాహువు, కేతువు.
గ్రహాలకి కులాలున్నాయి. అంటరానితనం ఉన్నది. శని శూద్ర కులానికి చెందగా, వైశ్య కులానికి చెందినవారు చంద్రుడు, బుధుడు అట. రాజ వంశానికి చెందినవారు కుజ, రవి కాగా బ్రాహ్మణులలో శుక్రుడు గురువున్నాడు. ఇంతటితో ఆగలేదు. శుక్రుడు, చంద్రుడు స్త్రీ గ్రహాలట. గురుడు, కుజుడు, రవి పురుషులట. శని, బుధుడు నపుంసకులట. ఈ విచక్షణ వర్గీకరణ ప్రపంచంలో మరే జ్యోతిష్యంలోనూ లేదు. వీనికి తోడు ప్రతి గ్రహానికి ఒకళ్ళో ఇద్దరో దేవుళ్ళు కూడా ఉన్నారు. అందుకే గ్రహాలను దేవతలంటారు. పైగా మన జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు గ్రహం. అంతేగాని నక్షత్రం కాదు.
వ్యక్తి భవిష్యత్తును చెప్పటానికి జనన కాలం, లగ్నం ఆధారంగా సూచిస్తారు.
భారతీయ జ్యోతిష్యానికి మూలం ఎక్కడో కచ్చితంగా తేల్చి చెప్పటంలేదు. వేదాలలో జ్యోతిష్యం లేదు. వేదాంగాలలో 6 భాగాలుండగా అందులో జ్యోతిష్యం ఒకటి. ఎక్కువమంది జ్యోతిష్యులు పరాశరహోరా శాస్త్రాన్ని పాటిస్తారు. ఆ తరువాత చిలవలు పలవలుగా చాలా పుస్తకాలు, చాలామంది పండితులు బయల్దేరి అనేక చిట్కా జ్యోతిష్యాలు చెప్పారు. వీటిలో ఉత్తరోత్తర ఖగోళ శాస్త్రంలో కనుగొన్న గ్రహాలు లేవు. నెప్ట్యూన్, యురేనస్ వంటివి వారికి తెలియదు. గ్రహాలకు బలం ఉంటే అవి మనుషుల మీద ప్రభావం చూపితే మరి ఆ గ్రహాల సంగతి ఏమవుతుందో తెలియదు.
గ్రహాల నుండి వెలుగు రాదు. అయినప్పటికీ గ్రహాల ప్రభావం మనిషిమీద ఎలా ఉంటుంది అనేది ప్రాచీన శాస్త్రాల, అంకెల గారడీతో చెప్పటం తప్ప ఋజువుపరచటానికి ఏమీ లేదు. కానీ కొత్త ఎత్తుగడలతో నామ నక్షత్రం పేరిట మొదటి అక్షరాన్ని బట్టి జన్మ లగ్నం చెప్పటం, ప్రశ్న కాలాన్ని బట్టి చెప్పటం అనేవి బతుకు తెరువుకు వేసిన ఎత్తుగడలు మాత్రమే.
ఖగోళ శాస్త్రంలో ఋజువులూ ఆధారాలూ ఉంటాయి. ఆధునిక పరికరాలతో పరికించే తీరు ఉంటుంది. జ్యోతిష్యంలో ప్రాచీన గ్రంథాలు తప్ప మరే పరిశీల, పరిశోధన ఉండదు. గ్రహానికీ, నక్షత్రానికీ తేడా వీరికి తెలియదు. రాశులు అనేవి ఊహించిన రూపాలే తప్ప వాస్తవంలో లేవు. అయినా వాటినే నేటికీ పాటిస్తున్నారు.
జనన కాలాన్ని నిర్ధారించడానికి, తల్లి గర్భంలో బిడ్డ ప్రవేశించినపుడు, ప్రసవించేటప్పుడు తల బయటికి వచ్చినప్పుడు, తొలిసారి బిడ్డ ఏడ్చినప్పుడు, తొలుత శ్వాస పీల్చినప్పుడు లెక్కలు వేస్తున్నారు. ఇవన్నీ అభిప్రాయ భేదాలతో ఉన్న అంశాలే. కచ్చితంగా జన్మ నక్షత్రాన్ని నిర్ణయించే ఆధారాలేవీ వీరికి లేవు. అయితే నమ్మకం, మూఢవిశ్వాసం సంప్రదాయంగా వస్తున్నాయి గనక జ్యోతిష్యం ఒక వ్యాపారంగా సాగిపోతోంది. ఖగోళ శాస్త్రం పక్కన పెట్టుకొని పరిశీలిస్తే జ్యోతిష్యం నిలబడదు. కనకనే దాని జోలికి పోరు. యూనివర్సిటీలలో జ్యోతిష్యం కోర్సులు పెట్టిన చోట కూడా శాస్త్రీయ పరిశీలన, ఖగోళంతో పోల్చి చూడటం అనేవి లేవు. సూర్యుని నుండీ వచ్చే వెలుగు ప్రతి క్షణం అనంత కిరణాలతో ఉంటుంది అందులో ఏ కిరణంతో పుట్టినప్పుడు ప్రభావితం అవుతారో చెప్పలేరు.
Innaiah Narisetti
 
 

"ఏది నీతి? ఏది రీతి? Book by Innaiah

"ఏది నీతి? ఏది రీతి?" అనే ఈ పుస్తకంలో నాగరీకుడయిన మనిషి ఆచరించాల్సిన జీవన విధానం వుంది. నమ్మాల్సినవి ఏమిటో, విడనాడాల్సినవి ఏమిటో హేతుబద్ధంగా వివరించారు రచయిత. ఈ వ్యాసాలు పరాన్నభుక్కులయిన ఒక సెక్షన్‌ని ఇబ్బంది పెడతాయి. వారి బారిన పడిన అమాయక ప్రజల్ని ఇవి రక్షిస్తాయి.
ఈ వ్యాసాలు మానవవాద విషయాల్ని, విశేషాల్ని, విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. ఇలాంటి రచనలు ఈ సమాజానికి అవసరం.
You can now access your book here at this link 
http://kinige.com/kbook.php?id=2256ఇసనాక మురళీధ

"నేనూ రెడ్డినే" ముఖ్యమంత్రి అంజయ్య-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 9





1919-1986

అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ అది కూడా ఏకాభిప్రాయంతో లేదు. తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత చెప్పారు. అంతకు ముందు అంజయ్య అంటే వెనుకబడిన తరగతులకు ప్రతినిధి అని అందరూ భావించేవారు.
ఆల్విన్ కంపెనీలో ఆరణాల కూలీగా ఆరంభమైనట్లు చెప్పుకున్న అంజయ్య పేదవారికోసం, గుడిసెలలో బతుకుతున్న వారికోసం చాలా కాలం రాజకీయంగా కృషిచేశారు. ఆడంబరాలు లేకుండా సింపుల్ గా జీవితం గడుపుతూ చలాకీగా మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అంజయ్యను 1969 ప్రాంతాలలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సందర్భంగా కలిశాను. అప్పట్లో చెన్నారెడ్డి ప్రవేశించి ఉద్యమాన్ని ఉధృతం చేసినప్పుడు అంజయ్య కూడా శ్రీమతి ఇందిరాగాంధీపై విసుర్లు విసురుతూండేవాడు. ప్రజాసమితి పక్షాన ఎన్నికలలో పోటీచేసి నెగ్గాడు కూడా. ప్రజాసమితి కాంగ్రెసులో లీనమైన మరునాటి నుండి అంజయ్య తిరుగులేని ఇందిరాగాంధీ భక్తుడైపోయాడు. మిగిలినవారు ఎటు మారినా ఆయన మాత్రం స్థిరంగా ఇందిర మనిషిగానే నిలిచాడు.
మొట్టమొదట బ్రహ్మానందరెడ్డిని తొలగించి రాష్ట్రంలో మరొక వ్యక్తిని తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న రోజులలో (1972) ముఖ్యమంత్రి కావాలని అంజయ్య ఆశించి ఇందిరాగాంధీని అడిగాడు కూడా. ఆ తరువాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడం దేశంలో ప్రజాబలం కోల్పోవటం జరిగినా అంజయ్య మాత్రం ఆమె పక్షానే నిలిచాడు. తరచు ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్ గాంధీని కలిసేవాడు. అంజయ్య సంజయ్ గాంధీకి అత్యంత సన్నిహితుడయ్యాడు. అతను చనిపోయినప్పుడు అంజయ్య అప్ సెట్ అయ్యాడు. అవన్నీ నేను ప్రత్యక్షంగా గమనించాను. బర్కత్ పురాలో ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెపుతున్నప్పుడు తోటి కాంగ్రెసు నాయకుల మీద, రాజకీయ విషయాలపైన అరమరికలు లేకుండా వ్యాఖ్యానాలు చేస్తుండేవాడు. మేము నవ్వుకునేవాళ్ళం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చెన్నారెడ్డిపై ఫిర్యాదులు చెపుతూనే వుండేవాడు. అవి కొన్ని ఢిల్లీలో కూడా చెప్పాడు. చెన్నారెడ్డి అపఖ్యాతిపాలై కాంగ్రెసు ప్రతిష్ఠను దిగజారుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కావాలనే తన కోరికను మళ్ళీ అంజయ్య వెలిబుచ్చాడు. ఆయనకు పి.వి. నరసింహారావు మద్దతు పలికాడు. మరొకవైపు సంజయ్ గాంధీ ఇష్టుడు కావటం వలన ఇందిరాగాంధీ అంజయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. తన చిరకాలవాంఛ తీరినందుకు అంజయ్య సంతోషించాడు.
ముఖ్యమంత్రి రాకముందే అంజయ్య కేంద్ర కాంగ్రెసు నాయకులతో సాన్నహిత్యం పెంచుకున్నాడు. బీహారు కాంగ్రెసు వ్యవహారాలు కూడా కొన్నాళ్ళు చూశాడు. హిందీ, ఉర్దూ మాట్లాడటం, కాళ్ళు మొక్కటం కాంగ్రెసు సంస్కృతిలో అంజయ్యకు కలిసివచ్చాయి.
ముఖ్యమంత్రిగా ఆయన 61 మందితో జంబో జెట్ మంత్రివర్గాన్ని ఏర్పరచాడు. రాజకీయవర్గాలన్నీ విస్తుపోయాయి. అప్పుడు ఆయనను విలేఖర్లుగా మేము అడిగితే ఏ మంత్రికి ఎవరి సిఫారసు ఉన్నదో బయట పెట్టాడు. ఆ విధంగా కాదనలేక జాబితా పెంచుతూ పోయాడు. అయితే కేంద్రం దీనిపై వెంటనే స్పందించి మంత్రి వర్గాన్ని కుదించమని చెప్పటంతో ఒక 20 మందిని తొలగించి, వారికి వేరే పదవులు ఇస్తానన్నాడు. అంజయ్య తన మంత్రివర్గంలో నాదెండ్ల భాస్కరరావుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.  ఒక స్థాయిలో భాస్కరరావు అంజయ్యను లెక్కచెయ్యనట్లుగా ప్రవర్తించాడు. దానిపై అంజయ్య ఆగ్రహించి ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాడు కూడా. భాస్కరరావు 17 పేజీల ఫిర్యాదు రాసి ఇందిరాగాంధీకి పంపించాడు. అయితే వాటిపై విచారణ జరిపిస్తామని తొందరపడి మరోపార్టీ పెట్టే ప్రయత్నాలు చేయవద్దని ఆమెకు బాలరాజ్ చోప్రా ద్వారా కబురు పెట్టారు. అంజయ్యకు ఢిల్లీలో తగినంత సానుభూతి లేకపోలేదు. ఎవరెన్ని చెప్పినా ఢిల్లీ ఆయనను ఆదరిస్తూనే వచ్చింది.
అప్పట్లో నేను అంజయ్యను చాలా ఎక్కువగా కలుసుకునేవాడిని. ఆయన ప్రియశిష్యుడైన పి. జనార్ధనరెడ్డికి పురావస్తుశాఖ ఇచ్చాడు. ఒకసారి నన్ను పిలిచి మనవాడికి కాస్త దాని సంగతి చెప్పు అన్నాడు. నేను జనార్ధనరెడ్డిని వెంటబెట్టుకుని స్టేట్ ఆర్కైవ్స్ (తార్నాక, హైదరాబాదు)కు వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించమన్నాను. శాసనసభలో కూడా ప్రశ్నలకు కొన్ని సమాధానాలు ఆయనకు చెపుతుండేవాడిని. జనార్ధన రెడ్డి చాలా వినయంగా స్వీకరించేవాడు.
వివిధ రాజకీయ ఉత్సవాలలో మేము పాల్గొంటున్నప్పుడు, ముఖ్యమంత్రి అంజయ్య యధాలాపంగా, ‘మన డ్రైవర్లకు, ఆ ప్రెస్ వాళ్ళకు ముందుగా పెట్టుండ్రి’ అని సదుద్దేశంతో అనేవాడు. అందువలన గోల తగ్గుతుందని ఆయన ఉద్దేశ్యం.
అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగని ఆనాడు కవి దాశరథి వ్యాఖ్యానిస్తే పత్రికలు వ్యంగ్య చిత్రాలు వేసి ఎగతాళి చేశాయి. అంజయ్య జోక్స్ కొన్ని ఆయన చెప్పినవి కొన్ని ఆయన పేరిట ప్రచారంలోకి వచ్చినవి వాడుకలో ఉండేవి. ‘సముద్రంలో తేల్ పడిందంట.  మనకు ఇంక ఆయిలు కరువు లేదు’ లాంటి ఉర్దూ కలిపిన పదాలు ఆయన ఎన్నో వాడుతుండేవారు. కంటి ఆసుపత్రికి వెళ్ళ అక్కడ లేబర్ వార్డు లేదా అని అడిగినట్లు చెపుతారు. ఆయనకు లేబర్ అంటే ఉన్న ఇష్టాన్ని ఆవిధంగా చిత్రించారు. ఇలాంటివి ఎన్నో ఉండేవి.
అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికే ఉద్దేశ్యంతో అంజయ్య మందీ మార్బలాన్ని వెంటబెట్టుకుని బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. అది నచ్చని రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి అని కూడా గమనించక, బఫూన్ అని ఈసడిస్తూ మాట్లాడారు. పత్రికలలో అది పతాక శీర్షికలలో వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దానిపై స్పందించాయి. అంజయ్య రాజీనామా ఇద్దమనుకున్నాడు. ఆయన అనుచరులు పట్టుబట్టి ఆపారు. కానీ ఆ తరువాత కొద్ది కాలానికే అసెంబ్లీ ఎన్నికలు రావటం అంజయ్యకి జరిగిన అవమానం తెలుగువారికి జరిగినట్లుగా ప్రచారంలో విపరీతంగా పాకిపోవటం, కాంగ్రెసు పతనానికి ఒక ప్రధాన కారణం అయింది. అప్పుడే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.
ఇంత జరిగిన తరువాత అంత అవమానించిన రాజీవ్ గాంధీ అదే అంజయ్యను తన మంత్రివర్గంలోకి తీసుకోవటం కాంగ్రెస్ సంస్కృతికి దర్పణం.
అంజయ్య ఆట్టే కాలం జీవించలేదు. 1986లో చనిపోయాడు. అంజయ్య మిత్రత్వానికి మంచి వ్యక్తి. అది స్వానుభవమే.

నరిసెట్టి ఇన్నయ్య

విజయరాజకుమార్ (1927-83) నరిసెట్టి

 విజయరాజకుమార్- కన్యాకుమారి



1955లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రలో కమ్యూనిస్టులు విజయరాజకుమార్, వీరాచారిలను ఉద్దేశించి వాడిన పదం అది. ఆచార్య ఎన్.జి. రంగా కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ ఐక్య కాంగ్రెసు పక్షాన ప్రచారం చేశారు.  రంగాకు విపరీత మద్దతుతో చాలా బహిరంగ సభలు జరిగేవి. అప్పుడు రంగా పక్షాన ఎన్. విజయరాజకుమార్, ఎన్. వీరాచారి ప్రచారం చేసేవారు. వారి సభలకు బాగా ఆకర్షణ వుండేది. అర్థరాత్రి వరకు జనం బహిరంగ సభలలో వారి ప్రసంగాల కోసం వేచి వుండి వినేవారు.


సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులను బాగా ఎదుర్కొన్న ఖ్యాతి ఎన్. విజరాజకుమార్ కు దక్కింది. ఆయన అప్పటికే సిడ్నీ, బీట్రిస్ వెబ్ దంపతులు రాసిన ‘సోవియట్ కమ్యూనిజం’ అనే బృహత్గద్రంథాన్ని అధ్యయనం చేశారు. అది ప్రామాణిక రచన కావటం వల్ల విజయరాజకుమార్ దానిపై ఆధారపడి అనర్గళంగా ఉపన్యాసాలు చేసేవారు. కనీసం మూడుగంటలయినా ఉపన్యాసం ఒక్కొక్క ఉపన్యాసం సాగేది. ఉద్రిక్తత ప్రబలి వుండేది. నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు జరిగేవి. ఆంధ్రా అంతా ఎర్రబారిందని, కమ్యూనిస్టులు అధికారంలోకి రావటం ఖాయమని అనుకున్నారు. ఆ నేపథ్యంలో విజయరాజకుమార్, వీరాచారి ప్రచారం చేస్తే, కమ్యూనిస్టులు వారిని రంగా రేచుకుక్కలని తిట్టేవారు. ఒకేవేదిక మీదకు రమ్మని కమ్యూనిస్టులను వారు సవాలు చేస్తుండేవారు. మొత్తం మీద వారి సభలు విజయవంతంగా సాగేవి. వాటితోబాటు సుంకర సత్యనారాయణ, పసుపులేటి కోటేశ్వరరావు, కె. రోశయ్య మొదలైనవారు కూడా రంగా అనుకూల ప్రచారంలో వుండేవారు. ఏతావాతా ఫలితాలు చూస్తే కమ్యూనిస్టులు నేలకరిచారు. విజయరాజకుమార్ కు విపరీతమైన ఖ్యాతి వచ్చింది.


ఎవరీ విజయరాజకుమార్ (1927-83)

చేబ్రోలు పంచాయతీలోని పాతరెడ్డిపాలెంలో (గుంటూరు జిల్లా) 1927లో రాజయ్య – అంతోనమ్మ దంపతులకు కలిగిన ప్రథమ సంతానం థామస్. అయితే రోమన్ కాథలిక్ చర్చి నుండి బయట పడి పేరు మార్చుకుని హైస్కూలు స్థాయిలోనే విజయరాజకుమార్ గా వెలుగులోకి వచ్చారు. జీవితంలో హైస్కూలు చదువు పూర్తి చేయకుండానే రాజకీయ రంగంలో ప్రవేశించిన వ్యక్తి విజయరాజకుమార్. కనీసం మెట్రిక్యులేషన్ పూర్తిచేద్దామని టంగుటూరి సూర్యకుమారితోపాటు ఆనాడు అమలులో ఉన్న సీనియర్ కేంబ్రిడ్జ్ చదువు సాగించి, అదీ తుదివరకు సాగనివ్వకుండానే విరమించారు. తెనాలి, కొల్లిపర మొదలైన ప్రాంతాలలో అసంపూర్తి చదువులలోనే సుభాస్ చంద్రబోసు స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీకి ఆకర్షితులయ్యారు. అందులో చేరి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్రలో మద్దూరి అన్నపూర్ణయ్య ఆ పార్టీకి నాయకుడు. సుభాస్ చంద్రబోసు అదృశ్యం కాగా (1940లో) ఆంధ్రలో ఆ పార్టీవారు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించేవారు. అందులో ఉపన్యాసకుడుగా, గాయకుడుగా కార్యకర్తగా విజయరాజకుమార్ పనిచేశాడు. చేబ్రోలులో పార్టీ రాజకీయ పాఠశాలలు జరిగేవి. బాపట్ల నుండి వి.ఎల్.సుందరరావు,  చేబ్రోలులో టీచర్ మురహరిరావు  కూడా ఆ పాఠశాలలలోపనిచేసేవారు. కలకత్తా నుండి సుభాస్ చంద్రబోస్ అన్న కొడుకు శరత్ చంద్రబోసు వచ్చి ఉపన్యాసాలిస్తుంటే, వేదిక మీద విజయరాజకుమార్ దానిని తెలుగులోకి అనువదించేవారు. ఇదంతా 1951 వరకు జరిగిన కార్యక్రమం.

అప్పటికే విజయరాజకుమార్ తండ్రి రాజయ్య రంగా శిష్యులుగా వున్నారు. ఆయన కుమారుడు విజరాజకుమార్.ని ప్రోత్సహించి రంగావర్గంలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ముఠాలుగా చీలి రంగా, ప్రకాశం బయటపడి వేరే పార్టీలు పెట్టారు. కృషికార్ లోక్ పార్టీ రంగా స్థాపించగా వారి తొలి రాజకీయ పాఠశాల కృష్ణాజిల్లా చర్లపల్లిలో జరిగింది. విజయరాజకుమార్ అక్కడ పార్టీ సమావేశాల్లో పాల్గొంటుండేవారు. అందర్నీ ఆకర్షించారు. క్రమేణా ఆర్గనైజింగా కార్యదర్శిగా రంగా పక్షాన రాష్ట్ర ప్రజల నుద్దేశించి రచనలు ప్రారంభించారు. అప్పటికే ‘విప్లవాధ్యక్షుడు’ అనే పేరిట సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్రను రాసి ప్రచురించారు. దేశికవితా ప్రచురణలవారు దానిని ప్రచారంలోకి తీసుకువచ్చారు.

ఆచార్య రంగా రాసిన ‘రివల్యూషనరీ పెసెన్ట్స్’ అనే పుస్తకాన్ని ‘విప్లవ రైతాంగం’ పేరిట తెనిగించారు. ఆ విధంగా ఉపన్యాసాలు రచనలు సాగిస్తూ గుంటూరులో కుటుంబం పెట్టి గడుపుతుండగా గౌతు లచ్చన్న రంగా అనుచరుడుగా గీత సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. కల్లు గీసుకునే గీత కార్మికులకు నిషేధం వుండరాదని వారి జీవనవృత్తి కొనసాగాలని ఆయన నినదించారు. రంగా ప్రధమ శిష్యులలో లచ్చన్న ఒకరు. ప్రభుత్వ నిషేధానికి నిరసనగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళమని పిలుపునిచ్చారు. ఆ పిలుపు నందుకొని విజయరాజకుమార్, వీరాచారి సత్యగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. అప్పటికే విజయరాజకుమార్ గుంటూరులో ఎ.సి. కాలేజి ఎదురుగా యూనివర్సల్ బుక్ షాప్ పెట్టారు. ఎల్.వి.ఆర్. అండ్ సన్స్ క్లబ్ ఆవరణలో వుండేది. ఆయన అరెస్టు కావటంతో పుస్తకాల షాపు కుటుంబానికి అప్పచెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆరు మాసాలు శిక్ష అనుభవించారు. ఆ తరువాత గవర్నర్ త్రివేది నిషేధాన్ని ఎత్తివేయడంతో సత్యాగ్రహుల్ని విడుదల చేశారు. తిరిగి వచ్చిన తరువాత విజయరాజకుమార్ మళ్ళీ పార్టీ యాత్రను సాగించారు.  చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించారు. కుటుంబ భారాన్ని మోస్తూనే 1956లో పెళ్ళి చేసుకున్నారు. అయితే ఈలోపు కొద్ది కాలం అనంతపురం జిల్లా పుట్టపర్తి వెళ్ళి వచ్చి సాయిబాబా భక్తుడయ్యాడు. కానీ అది ఆట్టే కాలం వుండలేదు. ఆంధ్రపత్రిక విలేఖరిగా తెనాలిలో వున్న జె.వెంకటప్పయ్య శాస్త్రిగారి పెద్ద కుమార్తె కన్యాకుమారిని పెళ్ళి చేసుకున్నారు. గుంటూరులో సరస్వతీ మహల్ లో ఆ పెళ్ళి కార్యక్రమాన్ని సెక్యులర్ పద్ధతిలో ఆవుల గోపాలకృష్ణమూర్తి నిర్వహించారు. ఆచార్య రంగా, కొత్త రఘురామయ్య (కేంద్రమంత్రి) మొదలైనవారెందరో ఆ కార్యక్రమానికి విచ్చేశారు.

వారికి ఇద్దరు అబ్బాయిలు కలిగారు. ఈలోగా పూదోట శౌరయ్యతో పుగాకు వ్యాపారం ప్రారంభించారు. అది సాగక నిలిపేశారు. రాజకీయ కార్యకలాపాలు మాత్రం నిరంతరం కొనసాగించారు. ఎన్నికల కార్యక్రమాలలో 1956-57లో బాగా పాల్గొన్నారు. రాజకీయ రంగంలో మార్పులు రాగా స్వతంత్ర పార్టీ ఆవిర్భవించింది. రాజగోపాలాచారి, ఎమ్.ఆర్. మసాని, ఆచార్య రంగా, బెజవాడ రామచంద్రా రెడ్డి మొదలైనవారెందరో పార్టీ స్థాపకులుగా ఉన్నారు. నెహ్రూ సహకార వ్యవసాయ విధానంతో రైతులను నిర్వీర్యులుగా చేయదలిచారని ప్రచారం చేశారు. విజయరాజకుమార్ ఆవిషయాలను అనేక కరపత్రాలుగా చిన్న పుస్తకాలుగా రాసి ప్రచురించారు.
లోగడ 1950 ప్రాంతాలలో ఆంధ్రలో వినోబాభావే భూదానోద్యమాన్ని సాగించారు. దానిని రంగా పక్షం వ్యతిరేకించింది. ఆయన ధోరణి రైతులకు అనుకూలం కాదన్నది. విజయరాజకుమార్ ఆయన్ను ఒక సభలో తారసిల్లి త్యాగం అనేది గడ్డం పొడవును బట్టా, తినే ఆహారాన్ని బట్టా నిర్ణయించేది ? అని ఎద్దేవ చేశారు. స్వతంత్ర పార్టీ రాష్ట్ర  ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విజరాజకుమార్ ప్రచారం చేశారు.

ఒకానొక సందర్భంలో విజయనగరానికి తాతా దేవకీనందన్ మున్సిపల్ ఛైర్మన్ గా వుండేవారు. ఆయన ఆహ్వానంపై ఆవుల గోపాలకృష్ణమూర్తి, విజయరాజకుమార్ వెళ్ళారు. బహిరంగ సభ ప్రారంభం కానుండగా విజయరాజకుమార్ తన పైపంచ కోసం వెతుకుతున్నారు. అప్పుడు గోపాలకృష్ణమూర్తి చమత్కరిస్తూ పైపంచ లేకపోతే ఉపన్యాసం పెగలదా? అని చమత్కరించారు. వేదికమీద ఉన్నవారు గొల్లుమన్నారు.

సంజీవరెడ్డి పై పోరాటం

విజయరాజకుమార్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయానికి స్థానిక సంస్థల పక్షాన సెనేట్ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. అప్పట్లో గోవిందరాజుల నాయుడు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ముఖ్యమంత్రి సంజీవరెడ్డిని పిలిచి గౌరవ పట్టాను సమర్పించారు. అలా గౌరవ డిగ్రీ ఇవ్వాలంటే సెనేట్ ఆమోదం వుండాలి. అది జరగనందుకు విజయ రాజకుమార్ అభ్యంతర పెట్టారు. కోర్టులో దావా వేశారు. కోర్టు కేసు తేలేవరకు సంజీవరెడ్డిని డాక్టర్ అని పిలవవద్దని ప్రభుత్వ  కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. విజయరాజ కుమార్ కేసును నెల్లూరులో వేయగా ఆవుల గోపాలకృష్ణమూర్తి వాదించారు. వాయిదాలు పడుతూ వచ్చిన ఆ కేసు ఆసక్తికరంగా సాగినా చివరకు జడ్జీకి ధైర్యం చాలక కేసును తిరుపతి మార్చుకోమని తప్పుకున్నారు. విజయరాజకుమార్ కాపరాన్ని సంగారెడ్డికి మార్చారు. తెలంగాణా స్వతంత్ర పార్టీ పక్షాన పనిచేశారు. సంగారెడ్డిలో భూములు కొని వ్యవసాయం చేశారు. కానీ అది సాగలేదు. కనుక వాటిని అమ్మేసి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అది కూడా అంతంత మాత్రంగానే సాగింది.

ఆచార్య రంగా కాంగ్రెస్ లో తిరిగి చేరినప్పుడు విజయరాజకుమార్ మాత్రం ప్రతిపక్షంలోనే వుండేవారు. సంగారెడ్డిలో ఏమంత చురుకుగా రాజకీయం సాగలేదు. తన రచనలు అడపతడప సాగిస్తూ ‘కడలిమీద కోంటికి’ (Kon-tiki రచయిత Heyerdahl) అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. భారత ప్రధాని చరణ్ సింగ్ స్థాపించిన  లోక్ దళ్ పార్టీలో చేరారు. రైతుల పక్షాన ఆయన పోరాటాలను సమర్థించారు. ఆయన రాసిన Economic Nightmare of India ను తెలుగులోకి అనువదించారు. ఆయన మరణానంతరం తెలుగు అకాడమీ ముద్రించింది. సంగారెడ్డిలో వుండగా బెంగుళూరు నుండి గణిత నిపుణురాలు శకుంతలాదేవి (22.4.2013న మరణించారు) వచ్చి మెదక్ నుండి లోక్ సభకు ఇండిపెండెంట్ గా పోటీ చేసారు. ఆమె సహకారం కోరిందని విజయరాజకుమార్ ప్రచారం చేశారు. డిపాజిట్ రాలేదనుకోండి.  విజయరాజకుమార్ కు హోమియోపతి వైద్యం పై మూఢనమ్మకం వుండేది. ఇతరులకు చికిత్స చేయటమే కాక తాను స్వయంగా వాడుకునేవారు. తనకు కిడ్నీస్ విఫలం కాగా హోమియో పతి ఏమీ కాపాడలేకపోయింది. ఉస్మానియా ఆసుపత్రిలో చేరి అక్కడ చనిపోయారు.ఈనాటికీ కమ్యూనిస్టు వ్యతిరేకిగా ఉపన్యాసకుడుగా ఆయన్ను కొద్దిమంది తలుచుకుంటారు. 
courtesy: Deeptidhara blog ( Mr C.Bhaskararao)

రెండుసార్లు ముఖ్యమంత్రిచెన్నారెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 8




Devhas Baba blessed Channareddi with his feet
1919-1996


‘దేవర్ బాబా’ కాలు చెన్నారెడ్డి నెత్తిపై పెట్టి దీవించాడు. ఆయన ఉత్తరప్రదేశ్ లో ఒక చెట్టుకొమ్మ మీద కూర్చుండే బాబా. అక్కడ డా.చెన్నారెడ్డి గవర్నర్ గా చేశారు. ఆ ఫోటో ‘సెక్యులరిస్ట్’ ఇంగ్లీషు మాసపత్రిక ముఖచిత్రంగా వేశారు. అప్పట్లో దానికి ఎడిటర్ ప్రొ. ఎ.బి.షా. అది చెన్నారెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన ఆగ్రహంతో ఊగిపోయి, ‘పిలవండి! ఆ ఇన్నయ్య ఎక్కడ ఉన్నాడో, సంగతేంటో తేల్చుకుందాం’ అన్నాడు. నాకు కబురు చేశారు. వెళ్ళాను. ఆ పత్రికను చూపి విసిరికొట్టి, ‘నా మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా?’ అన్నాడు.
నేను ప్రశాంతంగా ఆయన షష్ఠిపూర్తి సంచిక తీసి, అందులో రంగుల చిత్రంగా పూర్తి పేజీలో వేసిన దేవర్ బాబా కాలు పెట్టి దీవించిన చిత్రం ఆయన ముందు పెట్టాను. అది చెన్నారెడ్డి ఆమోదంతో ఆయన అభిమాని పరమహంస తయారు చేసిన సావనీర్. చెన్నారెడ్డి అవాక్కయిపోయాడు. ఆగ్రహంలో వివేచన మరచిపోవడం సహజం.
1958 నుంచే నాకూ, చెన్నారెడ్డికి సన్నిహిత పరిచయం ఉంది. ఆది నుండి అది లవ్-హేట్ సంబంధంగానే కొనసాగింది. స్వతంత్ర పార్టీ ఆవిర్భవించిన తొలి రోజులలో విజయవాడలో ఆచార్యరంగా మొదలైనవారి సమక్షంలో జరిగిన సభలో చెన్నారెడ్డి ఆవేశంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ లో ఉండేబదులు, కృష్ణలో దూకి చావటం మేలని చప్పట్ల మధ్య ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ లో చేరిపోయాడు. ఆయన మాట్లాడిన సభలో నేను, ఎస్.వి.పంతులు మొదలైనవారంతా ఉన్నాము. అప్పుడే చెన్నారెడ్డితో నా తొలి పరిచయం. ఆ తరువాత ఆయన చనిపోయేవరకూ అన్ని పరిస్థితులలోనూ కలుస్తూనే ఉన్నాము.
మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రాసినప్పుడు కూడా చెన్నారెడ్డి పదవిలో ఉండగా అవినీతి విషయాలను ప్రస్తావించిన సంగతులు కొందరు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. నా పుస్తకాన్ని విసిరికొట్టినట్లు అక్కడ ఉన్నవారు చెప్పారు. ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి రాకముందు, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సారధిగా ఆయన వుర్రూతలూగించినప్పుడు ఎన్నిసార్లు కలిశానో చెప్పలేను. నా మీద ఎంత కోపమున్నా, మరొక ప్రక్క ఆదరంగానే చూపేవాడు. తెలంగాణా ఉద్యమం తారాస్థాయిలో ఉండగా కొందరు ఆంధ్ర ప్రాంత మిత్రులు ఆయన్ను కలవాలనే కోరిక వెళ్ళబుచ్చారు. అడ్వకేట్ ఎన్.కె.ఆచార్య, మానవవాది కొసరాజు సాంబశివరావు, జర్నలిస్ట్ ఎ.ఎల్.నరసింహారావు వారిలో ఉన్నారు. ఆనాడు చెన్నారెడ్డి ఒక టెర్రర్. ఆంధ్రులు ఆయన్ని కలిసేవారు కారు. నేను వీరిని వెంటబెట్టుకుని తార్నాకలో ఆయన గృహానికి వెళ్ళినప్పుడు, ‘మీరంతా తెలంగాణా వారితో కలిసి ఉద్యమంలో పాల్గొంటే మీ జోలికి ఎవరూ రారు’ అని సలహా చెప్పారు. వెళ్ళినవారు మౌనంగా వచ్చేశారు. నేను తరువాత ఆయనతో, ‘అయితే తెలంగాణా వారితో ఉద్యమంలో కలవకపోతే ఏమైనా చేయవచ్చు అని సందేశం ఇస్తున్నారా!’ అని అడిగాను. ఆయన కాసేపు కూర్చోబెట్టి ఆచార్య రంగా, లచ్చన్న మొదలైన వారి విషయాలు అడిగారు. మా ఇరువురికి అవి కామన్ టాపిక్స్.
ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నిసార్లు చెన్నారెడ్డితో తారసిల్లానో చెప్పలేను. ఒకసారి జర్నలిస్ట్ కాలనీకి వచ్చినప్పుడు, ఆయన ఉపన్యాసం చెబుతూ, కొత్త జర్నలిస్ట్ కాలనీలు ఏర్పాటు చేద్దామని ఉందనీ, అయితే జర్నలిస్టుల పేర్లు పెట్టాలంటే సుప్రసిద్ధ తెలుగు వారి పేర్లు కనిపించటం లేదని అన్నారు. ఎం. చలపతిరావు కాలనీకి ప్రారంభోత్సవం చేస్తూ అన్నమాటలవి. కొండా లక్ష్మారెడ్డి నన్ను ధన్యవాదాల ప్రసంగం చేయమన్నాడు. అప్పుడు నేను మాట్లాడుతూ కొత్త జర్నలిస్టుల కాలనీలు ఇస్తామని అన్నందుకు చెన్నారెడ్డిగారికి ధన్యవాదాలని అంటూ ఎన్ని కాలనీలు పెడితే అంతమంది సుప్రసిద్ధ తెలుగు జర్నలిస్టుల పేర్లు చెబుతామని, ఉదాహరణగా - నార్ల వెంకటేశ్వరరావు, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, సి.వై.చింతామణి, ఖాసా సుబ్బారావు అలా పేర్లు వల్లించాను. జనం చప్పట్లు కొట్టారు. చెన్నారెడ్డికి మళ్ళీ కోపం వచ్చింది. కానీ ఏమీ అనలేదు.
చెన్నారెడ్డి మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు అతి సన్నిహితుడనని చెప్పుకుంటున్న నాదెండ్ల భాస్కరరావుకు తొలుత ప్రాధాన్యత ఇవ్వలేదు. కొన్నాళ్ళకు అలిగి కూర్చున్నప్పుడు తరువాత ఆర్థిక ప్రణాళిక శాఖ ఇచ్చాడు. మళ్ళీ కొన్నాళ్ళకు ఆయనను బాగా తగ్గించారు. భాస్కరరావు ఎన్ని ఫిర్యాదులు చేసినా చెన్నారెడ్డి ఏమీ చేయలేకపోయాడు.
అనేక ప్రెస్ మీటింగులలో ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసేవాణ్ణి. కొన్నిసార్లు ఆయన సమాధానం చెప్పటానికి కుదరక నీవే దానికి జవాబు చెప్పు అనేవాడు. మరోసారి ఢిల్లీ నుండి తిరిగి బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు చెన్నారెడ్డిని తొలగించి వేరే వారిని పెట్టబోతున్నారని వార్త ప్రబలింది. విపరీతంగా వారు ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడ పత్రికల వారిని కలిసినప్పుడు వారంతా ఆయనకు పదవి పోయినట్లు సానుభూతిగా ప్రశ్నలు వేస్తూండగా నేను, కంగ్రాట్యులేషన్స్ చెన్నారెడ్డిగారు, మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారుగా అన్నాను. ఆయన నవ్వుతూ ఏమో నీకే తెలియాలి అని దాటేసి వెళ్ళిపోయారు. ప్రెస్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ వున్న ఉమా వెంకట్రామరెడ్డి సంతోషంగా, ఆశ్చర్యంగా నా దగ్గరకు వచ్చి, ఏమండి మీరు చెప్పేది నిజమేనా అని ఆత్రుతగా అడిగారు. ఆ తరువాత కొన్నాళ్ళకు చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను పెట్టారు.
చెన్నారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దానికి ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు గాంధీ భవన్ లో కలిసేవాడిని. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరికొన్నిసార్లు కలుసుకొన్నాను.
చెన్నారెడ్డి రాగద్వేషాలు విపరీతంగా ఉన్న వ్యక్తి. ఆగ్రహావేశాలను దాచుకోకుండా వ్యక్తం చేసేవాడు. ఆయన్ను ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసినప్పుడు జస్టిస్ పింగళి జగన్మోహన రెడ్డిని గురించి, కొందరు కాంగ్రెస్  నాయకుల గురించి చాలా ఘాటుగానే స్పందించేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి రోజులలో డాక్టర్ గా ప్రాక్టీసు పెట్టడం, పత్రిక నడపటం మొదలైన ఎన్నో విశేషాలు వివరంగా చెప్పేవాడు. ప్రత్యేక తెలంగాణాలో ఆయన పాత్ర వేరు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గవర్నర్ గా ఆయన ధోరణి వేరు. రాజకీయాలలో అవినీతి అనే అంశం చెన్నారెడ్డి కాలంలో ఒక ప్రత్యేకమైన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తులాభారాలు జరిపించిన తీరు జనాకర్షణ అయింది. చెన్నారెడ్డి నిర్భీతిగా వ్యవహరించేవారు. సభలలో తనకు ఇష్టమైన వారిని స్టేజి మీదకు పిలిచి కూచోబెట్టేవారు. అలాంటి అదృష్టం శ్రీమతి దుర్గాభక్త వత్సలం వంటివారికి దక్కింది. చెన్నారెడ్డి పదవిలో వుంటే క్షేమం అని వి.బి.రాజు అనేవాడు. శత్రువులను సైతం లోబరచుకొన్న రాజకీయ చతురత ఆయనకున్నది. తనపై పోటీ చేసి ఓడించిన వందేమాతరం రామచంద్రరావును పిలిచి అధికార భాషా సంఘాధ్యక్షుణ్ని చేసిన చెన్నారెడ్డి, అరమరికలు లేకుండా తన మామ పేరిట కె.వి.రంగారెడ్డి జిల్లా అని రూపొందించారు. మార్క్సిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యను డ్రైనేజి బోర్డు ఛైర్మన్ గా ఒప్పించడం చెన్నారెడ్డికే తగింది. ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆలిండియా మెడికల్ ఇన్ స్టిట్యూట్ లో చేరి పరీక్షలు చేయించుకున్నారు. ఆ పక్క గదిలోనే మేనకా గాంధీ కూతురుని ప్రసవించింది. అందరికంటే ముందు వెళ్ళి అభినందనలు చెప్పబోగా అక్కడే ఉన్న సంజయ్ గాంధీ ‘రాజీనామాకు సిద్ధంగా ఉండండి’ అనేసరికి బిత్తరపోయాడు. హైదరాబాదు వచ్చేసరికి అలాంటి సన్నివేశమే జరిగింది.
Narisetti Innaiah

విస్వాశం పై రిచర్ద్ డాకిన్స్ ప్రసంగం --తప్పనిసరిగ మన విద్యార్థులకు తెలియపరచవలసినది

నేను కలిసిన ముఖ్యమంత్రులు - 7

జలగం వెంగళరావు
(1921-1999)


“కాంగ్రెస్ పార్టీ ఆఖరి ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పేరు చరిత్రలో చిరస్థాయిగా” ఉంటుందని 1978లో శ్రీశ్రీ ఒక ఇంటర్య్వూలో జోస్యం చెప్పారు. అది దారుణంగా విఫలమయింది. ఆ తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే ఉన్నారు.
ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా, పంచాయత్ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడుగా వివిధ దశలలో వెంగళరావును నేను కలుసుకున్నాను. ఆయనతో సన్నిహితత్వం కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఆయన ఛాంబర్ లో కలుస్తున్నప్పుడు కొందరు పత్రికా విలేఖరులను రానివ్వక పోవడం ఆశ్చర్యం వేసింది. ఉత్తరోత్తరా తెలిసిందేమంటే, కక్కుర్తిపడి చిన్న చిన్న పనులకోసం చేయి చాపుతూ ఆశ్రయించిన వారు అలా పడి ఉన్నారని తెలిసింది. అయినా జర్నలిస్టులకు అదేమంత గౌరవప్రదమయిన విషయం కాదు.
పంచాయతీ వ్యవస్థ పట్ల ఆయనకుగల ఆసక్తి, శ్రద్ధను బట్టి నేను, జి.రామిరెడ్డి, కె.శేషాద్రి ఆయనకు దగ్గరయ్యాము. అనేక విషయాలు చర్చించాము. ఆ సంబంధం కొనసాగింది. తరువాత వెంగళరావు ఖమ్మం జిల్లా ముఠా రాజకీయాల నుండి ఎదిగి, రాష్ట్ర స్థాయిలో సంజీవరెడ్డి అనుకూలుడుగా రాజకీయాలలో కీలక పాత్ర పోషించాడు. బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఆరంభమయినప్పుడు, ఖమ్మంలో రవీంద్ర అనే విద్యార్థిని నిరాహారదీక్షకు కూర్చుండబెట్టి ఆందోళనకు నాంది పలికింది వెంగళరావే. అచిర కాలంలోనే ఆయన మంత్రివర్గంలో చేరి హోం మంత్రి అయ్యారు. అంతటితో ప్రత్యేక తెలంగాణా వదిలేశారు. హోం మంత్రిగా వెంగళరావు పోలీసుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన చెప్పిందొకటే. “మీరేం చేస్తారో నాకనవసరం. కానీ నక్సలైట్ల గురించి నాదాకా ఫిర్యాదులు రాకూడదు. మీమీదకు ఎలాంటి నెపం లేకుండా చూసే బాధ్యత నాది.” అది ఆసరాగా తీసుకొని పోలీసులు విజృంభించి ఎన్ కౌంటర్ల పేరుతో చాలామందిని హతమార్చారు. ఉత్తరోత్తరా ఈ విషయమై ఆరోపణల పరంపరను తట్టుకోవడానికి జస్టిస్ విమద్ లాల్ కమిషన్ వేశారు. మానవవాద సంఘాలలో కృషి చేస్తున్న  మేము వెంగళరావు ధోరణిని నిరసించాము. విమద్ లాల్ కమీషన్ ముందు వాదించటానికి జస్టిస్ వి.ఎం.తార్కొండేను ఒప్పించి, ఎం.వి.రామమూర్తి, నేను తీసుకువచ్చాము. మిత్రులు, పెద్దలు కన్నభిరాన్ అండగా నిలిచారు. వామపక్షాలు ఆయన వాదించటం పట్ల చాలా సంతోషించాయి.
వెంగళరావు ముఖ్యమంత్రి కావడం విచిత్ర సన్నివేశం. ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల వూపు తరవాత పరిస్థితి సద్దుమణగడానికి ప్రత్యేకాధికారి సరీన్ ను నియమించారు. ఆరు నెలలు రాజకీయాలకు స్వస్తి పలికేసరికి అధికారం చవిచూచినవారు గిలగిలలాడిపోయారు. మరొకవైపు కేంద్రంలో శ్రీమతి ఇందిరా గాంధీ ఉభయ ప్రాంతాలకు ఆమోదయోగ్యమయిన తెలంగాణా వ్యక్తి ఉండే బాగుంటుందని ఆలోచించారు. అప్పుడు నూకల రామచంద్రారెడ్డి, జి. రాజారాం పేర్లు ప్రముఖంగా వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన పి.వి.నరసింహారావు ఈ విషయంలో లోపాయికారిగా వెంగళరావు పేరు తెచ్చారు. సయోధ్య అయోధ్య వాదాల మధ్య వెంగళరావుకు మద్దతు ఎంత ఉన్నదో బేరీజు వేస్తే 155 మంది వ్యతిరేకత చూపారు. కానీ రాజకీయాలలో తెరవెనుక జరిగే తంతు జనానికి ఒక పట్టాన తెలియదు. నవభారత్ కంపెనీ చౌదరి చిరకాలంగా వెంగళరావుకు అనుకూలుడు. ఆయన మరికొందరు కలిసి ఎలాగైనా వెంగళరావును రంగం మీదకు తీసుకురావాలని ప్రయత్నించారు. కేంద్రంలో ఇందిరాగాంధీకి దగ్గరగా ఉన్న దీక్షిత్ వంటి వారికి వెంగళరావు పేరు సూచించారు. కొత్త రఘురామయ్య కూడా అందుకు అనుకూలత కనబరిచారు. ఆయనకు ఉన్న వ్యతిరేకత విషయం దాచిపెట్టి పూర్తి మద్దతు ఉన్నట్లు చెప్పారు. ఒకసారి ఇందిరాగాంధీ పేరు చెప్పిన తరువాత వ్యతిరేకత కాస్తా అనుకూలంగా మారింది. ఇందులో కొందరు ప్రముఖ పోలీసులు సైతం తమ పాత్ర నిర్వహించలేకపోలేదు. మొత్తం మీద వెంగళరావు ముఖ్యమంత్రి కావటం ఆయన అదృష్టం. పైగా ఆయన హయాంలో ఎమర్జెన్సీ ఉండటం వల్ల ఎదురులేని పాలన సాగింది. విమద్ లాల్ కమిషన్ విచారణ సయితం ఆయన పదవిని కదిలించలేకపోయింది.
ముఖ్యమంత్రిగా వెంగళరావు నిర్ణయాలు తీసుకోవటం అమలు పరచటం చకచకా చేసేవాడు. డబ్బు మనిషి అనే పేరు తెచ్చుకోలేదు. ఆయన దగ్గరున్న సిబ్బంది అవసరమైతే డబ్బు విషయాలు చూసేవారు. కనుక ప్రత్యక్షంగా ఆయనపై నెపం వెయ్యడానికి వీలుండేది కాదు.
ఎమర్జెన్సీ ప్రకటించటంతో ఇందిరాగాంధీ నిర్ణయం వెనుక ఉన్న రహస్యాన్ని వెంగళ రావు బయటపెట్ట దలుచుకున్నారు. రాజకీయాల నుండి విరమించిన తరువాత ‘నా జీవితకథ’ అనే శీర్షికన పుస్తకం వ్రాశారు. ఆ సందర్భంగా జస్టిస్ ఎమ్.ఎల్.సిన్హా అలహాబాద్ హైకోర్టులో ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యానాలు చేశారు. దీనికి ఆయన తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ కోర్టు ధిక్కార నేరం కింద కేసు పెడతానన్నారు. వెంగళరావు క్షమాపణ చెప్పి బేషరతుగా పుస్తకాన్ని వెనక్కు తెప్పించి ఆ అంశాన్ని తొలగించి మరొక ప్రచురణ చేశారు. ఆయన రాసిన చరిత్రలో పి.వి.నరసింహారావు, నాదెండ్ల భాస్కరరావు, కాసు బ్రహ్మానందరెడ్డిలపై అనేక విషయాలలో విమర్శలు చేశారు.
వెంగళరావు పదవిలోనూ ఆ తరువాత హైదరాబాదులోని ద్వారకాపురి కాలనీ ఇంట్లో ఉండేవారు. బాగా పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నారు. నేను, ఎస్.వి.పంతులు నిరంతరం ఆయనను కలుస్తుండేవాళ్ళం. పోలీసు అధికారి బాలాజీ నమ్మినబంటుగా వెంగళరావుపట్ల ఇష్టంగా సేవలు చేసేవాడు. అనేక విషయాలు అరమరికలు లేకుండా అడినవాటికి తడుముకోకుండా వెంగళరావు చెప్పేవారు. ఎమర్జెన్సీ కాలంలో వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా, సంజయ్ గాంధీ ఆంధ్రలో పర్యటించడం ఆ సందర్భంగా వచ్చిన ఆరోపణలు, కళాపోషణ అంశాలు ప్రస్తావిస్తే దాటవేసేవారు. రాజకీయాలలో ఇలాంటివి ఎన్నో వస్తూనే వుంటాయి అనేవారు.
నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా వెంగళరావును కలిసే రోజులలో ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు రాగా ముఖ్యమంత్రి ఛాంబర్ లోనే వెనుక గదిలో అభ్యర్థులకు డబ్బులు పంచటం గమనించాను. ఆశ్చర్యపోయాను. వెంగళరావు దగ్గర వుండే ప్రకాశరావు, సీతాపతి వంటివారు ఆఫీసులో కీలకపాత్ర వహించేవారు. ప్యూనుగా ఉన్న లోకయ్య ఎంతో ప్రాముఖ్యుడుగా ఉండేవాడు. వెంగళరావు సమయపాలన బాగా పాటించేవాడు. అందువలన ఆయన కార్యక్రమాలకు పేచీ ఉండేది కాదు.
1975లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగనప్పుడు తన మంత్రిమండలి వెంకట కృష్ణారావుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సభలు జయప్రదంగా జరిగాయి. ఫ్రికెన్ బర్గ్ ను అటు వెంగళరావుకు, ఇటు వెంకట కృష్ణారావుకు పరిచయం చేశాను. ప్రొఫెసర్ పూర్వాపరాలు చెప్పాము. అదొక గొప్ప అనుభవం. ఫ్రికెన్ బర్గ్ ఒక పాస్టర్ కుమారుడు. గుంటూరు జిల్లాలో పుట్టాడు. తెలుగు బాగా మాట్లాడేవాడు. తరువాత ఆయన అమెరికాలో విస్కాన్ సిస్ యూనివర్సిటీలో రాజకీయ చరిత్ర ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు. అక్కడే వెల్చేరు నారాయణరావుగారు కూడా పనిచేశారు. నేను ఫ్రికెన్ బర్గ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు అమెరికాలో ఉండగా జరిపాను. ఆయన చాలా సంతోషించారు. వెంగళరావు, వెంకట కృష్ణారావును గుర్తు పెట్టుకుని అభినందించారు. ఆయన ‘గుంటూరు జిల్లా’ అనే శీర్షికన మంచి చారిత్రక పరిశోధనాత్మక పుస్తకం వ్రాశారు. దానిని ఆక్స్ ఫర్డ్ ప్రచురణల వారు వెలువరించారు. నేను దానిని తెలుగు చేసి ప్రచురించాను. ఆయనతో ఇప్పటికీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉన్నాను.
ఒకసారి సత్తుపల్లిలో వెంగళరావుపై కాళోజీ నారాయణరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వామపక్షాలవారు ఆయనను సమర్థించారు. రిపోర్టరుగా నేను పర్యటన చేసి ఎన్నికల వార్తలు సేకరించాను. అప్పుడు వెంగళరావును కలిస్తే డిపాజిట్టు పోయే సీట్లకు వామపక్షాలవారి హడావుడి ఇంతెందుకు అన్నారు. ఆయన అలా మాట్లాడటం అలవాటే. ఆయన మాటే నిజమైంది.
ఖమ్మం జిల్లాలో కొన్నిసార్లు ఆయన పర్యటిస్తున్నప్పుడు నన్ను, ఎస్.వి. పంతులును వెంటబెట్టుకెళ్ళారు. చాలా ఆదరంతో చూసేవారు. గిరిజన ప్రాంతాలలో అధికార పర్యటన ఏర్పాటు చేసినపుడు హెచ్.కె.బాబు ఆ శాఖ డైరెక్టరుగా ఉండేవారు. నేను గిరిజన వాసులను ఇంటర్వ్యూ చేసి ప్రత్యక్షంగా విషయాలు తెలుసుకొని ఆంధ్రజ్యోతిలో పెద్ద రిపోర్టు రాశాను. అందులో కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకమైన వ్యాఖ్యానాలున్నాయి. డైరెక్టరు హెచ్.కె.బాబు నాపై వెంగళరావుకు ఫిర్యాదు చేశాడు. ఆయన పట్టించుకోకపోగా ప్రభుత్వం కళ్ళు తెరిపించినందుకు నన్ను అభినందించారు. వెంగళరావు పదవీవిరమణ తరవాత హుందాగా జీవితం గడిపారు.
- నరిసెట్టి ఇన్నయ్య


దేశ ఆర్థిక భవిష్యత్తును మార్చిన పి.వి.నరసింహారావు-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 6




1921-2004
‘ఈ పాముల తేళ్ళ బాధ పడలేకుండా ఉన్నాము’ అని జి.సి.కొండయ్య (ప్రముఖ జనతా నాయకుడు) ఆ రోజులలో వ్యాఖ్యానించేవారు. మొదట్లో ఆ మాటలకు అర్థం తెలిసేది కాదు. తరువాత పాములపర్తి వెంకట నరసింహారావు, తేళ్ళ లక్ష్మీ కాంతమ్మ సన్నిహిత సహచర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడని గ్రహించి నవ్వుకున్నాము.
పి.వి. నరసింహారావు విద్యామంత్రిగా, బ్రహ్మానందరెడ్డి కేబినెట్ లో నాకు పరిచయం అయ్యారు. ‘తెలుగు విద్యార్థి’ మాసపత్రిక (ఎడిటర్ కొల్లూరి కోటేశ్వరరావు, మచిలీపట్నం) ఇంటర్వ్యూలు, ఉపన్యాసాలూ ఆయన చాలా చక్కగా చెప్పేవాడు. అలా మొదలైన మా పరిచయం క్రమేణా సాన్నిహిత్యానికి దారితీసింది. 1968లో నాటి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడు (లోగడ తెలుగు స్వతంత్ర సంపాదకుడు) గోరాశాస్త్రికి కర్నూలులో 50వ జన్మదినం జరిపినప్పుడు ముఖ్యఅతిథిగా పి.వి.నరసింహారావును తీసుకెళ్లాము. అప్పుడు కోట్ల విజయభాస్కరరెడ్డి జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉండేవారు. వ్యవసాయ బ్యాంక్ శాఖాధికారి మండవ శ్రీరామమూర్తి, తెలుగుభాషా సంఘాధికారి సి.ధర్మారావు, నేనూ పూనుకొని సన్మానం చేసి గోరాశాస్త్రికి కొంత ఆర్థిక సహాయం చేయగలిగాము. ఒక సంచిక కూడా వెలువరించాము. ఆ సభలో పి.వి.నరసింహారావు గొప్ప ఉపన్యాసం చేశారు. ఆయనతో చాలా సేపు కాలక్షేపం చేసి అనేక విషయాలు అడిగాను.
హైదరాబాదులో ఆయన మంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు వివిధ సందర్భాలలో గోరాశాస్త్రి, తేళ్ళ లక్ష్మీకాంతమ్మలతో కలిసి పి.వి.దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీ అయింది. తేళ్ళ లక్ష్మీకాంతమ్మ మా కుటుంబానికి సన్నిహిత స్నేహితురాలు. ఆమె చిరకాలంగా రాజకీయాలలో ఉంటూ పి.వి.కి దగ్గరైంది. చాలా చనువుగా కొన్ని పర్యాయాలు చులకనగా పి.వి.నుద్దేశించి మాట్లాడేది. అది చాటున కాదు. ఎదుటే. నేను ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయి. ఉత్తరోత్తరా పి.వి. ఇంగ్లీషులో ‘ది ఇన్ సైడర్’ అనే నవల రాసి లక్ష్మీకాంతమ్మను ఒక పాత్రగా చేసి అన్యాపదేశంగా ఎత్తి పొడిచారు. అది గ్రహించిన లక్ష్మీకాంతమ్మ బాహాటంగానే ఆయనను ఖండించింది.
నన్ను రాడికల్ హ్యూమనిస్టుగానే పి.వి. పరిగణిస్తూ పోయారు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా నేను స్నేహపూర్వకంగానే కలుస్తూ ఉండేవాడిని. చనువుగా ప్రశ్నలడిగేవాడిని. కానీ ఆయన దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఉదాహరణకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించబోయేముందు కొన్నాళ్ళు పి.వి.ని దూరంగా పెట్టింది. అప్పడు హైదరాబాదు ఆదర్శనగర్ లో పి.వి. వుండేవారు. ఆమెపై వ్యంగ్య విమర్శనాత్మక రచన ఒకటి తలపెట్టారు. నేను కలసినప్పుడు ఒకటి రెండు పేరాలు వినిపించారు. అయితే అది ఇందిరాగాంధీని ఉద్దేశించిందా అని అడిగితే చెప్పలేదు. ఈలోగా ఇందిరాగాంధీ పిలుపు రావడం, ఢిల్లీ రాజకీయరంగంలో పి.వి.ప్రవేశించడం, కీలకపాత్ర వహించడంతో ఆమెపై ఆగ్రహాన్ని దాచేశారు.
విశ్వనాథ సత్యనారాయణ సుప్రసిద్ధ నవల వేయిపడగలు హిందీలో ‘సహస్రఫణి’ శీర్షికన పి.వి.నరసింహారావు అనువదించారు. నేను ఒకటి రెండుసార్లు ఈ విషయమై నిరసనను ఆయనకు సూచన ప్రాయంగా తెలియజేశాను. ఆయనేమీ అభ్యంతర పెట్టలేదు. అయితే హైదరాబాదు ఆకాశవాణిలో హిందీ విభాగంలో నా మిత్రుడు దండమూడి మహీధర్ ఉన్నందున నేను వెళ్ళి రామమూర్తిగారిని కూడా పలకరిస్తూ ఉండేవాడిని. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే సహస్రఫణి ఆయన రాస్తున్నాడని, కొన్నాళ్ళ తరువాత అది పి.వి.నరసింహా రావు పేరుతో ప్రచురితమైంది. ఇరువురిలో ఎవరు ఏమేరకు అనువదించారో వివరాలు తెలియవు. రామమూర్తి గారిని ఒకసారి విషయం ప్రస్తావించి మీరు అనువదిస్తున్న సహస్రఫణి పి.వి.గారి పేరుతో వచ్చిందేమిటి? అంటే  ఆయన మౌనమే సమాధానంగా ఇచ్చారు.
శాసనసభలో, లోక్ సభలో పి.వి. చాలా బాగా రాణించిన రాజకీయవాది. ఆయన బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో సమైక్యవాదిగా నిలబడ్డారు. తరువాత ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పుడు వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పి.వి. చవిచూశారు.
ఆయన కేంద్రానికి వెళ్ళిన తరువాత నేను కలుసుకోవటం తగ్గింది. హైదరాబాదు వచ్చినప్పుడు రాజ్ భవన్ లో కొన్నిసార్లు కలిసి మాట్లాడుకున్నాం.
పి.వి. ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి అమెరికా రాజధాని వాషింగ్టన్ కు వచ్చి అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. (దానిని హౌస్ అంటారు) నేను ప్రెస్ లాబీలో ఉండి ఆయన ప్రసంగం విన్నాను. బాగా మాట్లాడారనిపించింది. ఆ రోజులలో నేను ‘వార్త’ దినపత్రిక విదేశీ ప్రతినిధిగా వాషింగ్టన్ లో ఉన్నాను. అటువంటి అక్రెడిషన్ రావడానికి మిత్రులు, వార్త ఎడిటర్ కె.రామచంద్ర మూర్తిగారు తోడ్పడ్డారు. అక్కడ నుండి తరచు వార్త వ్యాసాలు, ఇతర విశేషాలు పంపగా ప్రచురించేవారు. ఆశ్చర్యమేమంటే దేశ ప్రధానిగా పి.వి.మాట్లాడితే మర్నాడు అమెరికా దినపత్రికలలో ఒక మాట రాలేదు. నేను ఆశ్చర్యపోయాను. అంత క్రితం చిన్న దేశాలైన కొరియా వంటి దేశాల ప్రధానులు మాట్లాడితే ప్రముఖంగా ప్రచురించడం చూశాను. ప్రెస్ క్లబ్ లో కొందరిని కదిలించి చూస్తే పి.వి.బాగా మాట్లాడటం ప్రధానం కాదు. అందులో కొత్త అంశం కానీ, అగ్రరాజ్యాన్ని ఆకర్షించే ప్రతిపాదనలు లేనందువల్ల అశ్రద్ధకు గురైందని చెప్పారు. అదే సందర్భంగా ఆయన ఒక మ్యూజియం సందర్శిస్తే అది ముఖ్యమైన వార్తగా వేశారు. అప్పుడు పి.వి.ని కలిశాను. ఆయన వెంట కొందరు జర్నలిస్టులు వచ్చారు. అలా వచ్చిన వారిలో కల్యాణీ శంకర్ ఉన్నది. ఆమె హైదరాబాదులో జర్నలిస్టుగా యు.ఎన్.ఐ.లో సీతారాం దగ్గర పనిచేసింది. తరచు ప్రెస్ కాన్ఫరెన్సుల తరువాత నా దగ్గరకు వచ్చి వివరాలు వివరణలు అడిగి రాసుకునేది.  ఆ తరువాత ఆమె ఢిల్లీలో జర్నలిస్టుగా ఉంటూ చాలా ప్రముఖ స్థానాలు ఆక్రమించింది. పి.వి.కి బాగా దగ్గరైంది. ఒక సందర్భంలో ఆమెను పక్కన కూర్చుండబెట్టుకుని తిరుపతిలో కల్యాణ మహోత్సవంలో కూడా పాల్గొన్నారు.
పి.వి.ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. ఆ ఖ్యాతి పి.వి.కి దక్కాలి. మరొకవైపు బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది.
పి.వి. వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని వాడటం విశేషం. ఆయన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
పి.వి. పెయ్య నాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది. కొన్నిటిలో ఇది నిజమే. అలా ఉన్నప్పుడు సమస్యలు వాటంతటవే సద్దుకు పోతుండేవి. పి.వి.లో మరొక కోణం ఏమంటే కళలు, సాహిత్యం, రసజ్ఞత పట్ల అభిరుచి ఉండటం.
పి.వి.కి చాలామంది సన్నిహితులుగా ఉండేవారు. కొంతమందికి పరోక్షంగా మరికొంతమందికి ప్రత్యక్షంగా సహాయపడ్డారు. తన బాల్యమిత్రుడు సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావుకు పద్మభూషణ్ ఇప్పించినప్పుడు ఇబ్బందికర సన్నివేశం ఏర్పడింది. కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉంటున్న కాళోజీ అది స్వీకరించడానికి తటపటాయిస్తే పి.వి. పట్టుబట్టి ఒప్పించారు.
పి.వి.ని గ్రామంలో దొర అనేవారు. ఆయన దేశ్ ముఖ్. ఎన్నో రకాల ఆస్తి సాగులేకుండా వృధాగా పడుండేది. దేశంలో పరోక్షంగా బి.జె.పి. మతతత్వాన్ని వెనకేసుకొచ్చినట్లు బాబ్రీ మసీదు సంఘటనతో విమర్శకులు ఆరోపణలు చేయక పోలేదు. తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటు ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై పోటీ పెట్టకపోవడం గమనార్హం. by Innaiah Narisetti


రాజకీయ జీవిగా కాసుబ్రహ్మానంద రెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 5





ఆద్యంతాలూ రాజకీయవాదిగా జీవితం గడిపిన కాసుబ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోను, కేంద్రంలోనూ తనదైన ముద్ర వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుదామని విఫయ ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ లో సంజీవరెడ్డి మంత్రివర్గంలో తొలిసారి అమాత్యులుగా జీవితాన్ని ఆరంభించారు. అప్పటి నుండి చివరివరకూ రాష్ట్ర, కేంద్ర పదవులు ఎన్నో చేపట్టి కొనసాగారు.
1950 ప్రాంతాలలో ఆయన ప్లీడరుగా గుంటూరులో ఉన్న రోజులలో కలుసుకున్నాను. నేను ఎ.సి. కాలేజీలో విద్యార్థిగా ఉన్నపుడు నా సోదరుడు విజయరాజకుమార్ పెళ్ళి ఆహ్వానం కార్డు ఇవ్వడానికి వెళ్లాను. గుంటూరులో అమరావతి రోడ్డులో ఉంటున్న బ్రహ్మానందరెడ్డి, కాఫీ ఇచ్చి సాదరంగా కార్డు స్వీకరించినా పెళ్ళికి మాత్రం రాలేదు. అంతకుముందు ఎ.సి.కాలేజీకి ఎదురుగా ఎల్.వి.ఆర్. అండ్ సన్స్ క్లబ్బులో రోజూ బ్రహ్మానందరెడ్డి వచ్చి పేకాడటం చూసేవాడిని. అదే ప్రాంగణంలో మా అన్న ఒక పుస్తకాల షాపు పెట్టారు. నేను తీరిక వేళల్లో కూర్చుని అమ్ముతుండేవాడిని. ప్రక్కనే బ్రహ్మానందరెడ్డి, సలాం, ఇంకా కొందరు గుంటూరు ప్రముఖలు పేకాడుతుంటే మధ్య మధ్యలో నేను కాసేపు నిలబడి వారి మాటలు వింటూండేవాడిని. ఒకసారి గమ్మత్తయిన సంభాషణ చెవిన పడింది. మదరాసు శాసనసభ కౌన్సిల్ సభ్యుడుగానూ, గుంటూరు మున్సిపల్ కౌన్సిలం సభ్యుడుగానూ ఉన్న ప్లీడరు సలాం మంచి హాస్యప్రియుడు. సంభాషణా చతురుడు. ఆయనను ఉద్దేశించి, ‘ఏం సలాం.. మరీ పాతిక్కీ - పరక్కీ కూడా కక్కుర్తి పడుతున్నావటగా’ అని బ్రహ్మానంద రెడ్డి ఒక విసురు విసిరాడు. వెంటనే సలాం - ‘ఏం చేస్తాం, వందా, రెండు వందలూ అయితే నీతో పనేంటయ్యా, బ్రహ్మానందరెడ్డి ఉన్నాడుగా అంటున్నారు మరి’ అనేసరికి అందరూ గొల్లున నవ్వారు. అలా సాగుతుండేవి వారి సరసాలు.
బ్రహ్మానందరెడ్డి క్రమంగా జిల్లా నుండి రాష్ట్రానికి ఎదిగారు. మొదటి నుండి ముఠా రాజకీయాల్లో మునిగితేలారు. తొలుత సంజీవరెడ్డి కుడి భుజంగా రాజకీయాలలో చక్రం తిప్పి కీలక స్థానంలోకి వచ్చారు. ఆ తరువాత ఆయనకు ఎదురు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో అత్యంత ప్రముఖ నాయకుడుగా కాంగ్రెసు పార్టీని చీలదీసి రెడ్డి కాంగ్రెసు అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఆర్థిక వ్యవహారాల నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు.
బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నేను వివిధ సందర్భాలలో కలిశాను. ‘తెలుగు విద్యార్థి’ (కొల్లూరి కోటేశ్వరరావు - సంపాదకుడు) మాసపత్రికకు ఇంటర్వూ చేసి ప్రచురించాము. పాత హైదరాబాదులో మత కల్లోలాలు జరిగినప్పుడు (1968) వివిధ సంఘాలను పిలిచి జూబిలీ హాలులో సంప్రదింపులు జరిపారు. అప్పుడు మానవవాద సంఘం తరఫున నన్ను పిలవగా నేను తోచిన సూచనలు ఇచ్చాను.
1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని బాగా దెబ్బ కొట్టింది. ఆయన, ఆయన మంత్రులూ ఒక దశలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భాలలో తేళ్ళ లక్ష్మీకాంతమ్మ (లోక్ సభ సభ్యురాలు). నేను కలసి బ్రహ్మానంద రెడ్డి దగ్గరకు వెళ్ళి మాకు తోచిన విషయం చెపుతుండేవాళ్లం. ఆయన బంగళా నిర్మానుష్యంగా ఉండేది. కొంతకాలం ఆయన కుంగి పోయినట్లు కనిపించేవాడు. అలాంటప్పుడు కలుస్తుంటే ఎంతో సహాయపడినట్లుగా భావించేవాడు. అదే సందర్భంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమకారులు కొందరు హైదరాబాదులో గోడలపై బ్రహ్మానందరెడ్డి భార్య రాఘవమ్మను ఉద్దేశించి చాలా అసహ్యకరమైన, అశ్లీల, శృంగార నినాదాలు రాశారు. మేము నిరసన తెలిపాము. తెలంగాణాలో ప్రముఖ స్త్రీ నాయకురాళ్ళు జె.ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి, సరోజినీ పుల్లారెడ్డి మొదలైనవారు అటువంటి నినాదాలను ఖండించి వారే స్వయంగా చెరిపివేయడానికి పూనుకున్నారు. అటువంటి క్లిష్ట దశలో మేము కలుస్తుండడం బ్రహ్మానందరెడ్డికి ఊరటనిచ్చింది.
రాజకీయవాదిగా బ్రహ్మానందరెడ్డి చాలా ముఠా కక్షలతో సంకుచిత ధోరణిలో ప్రవర్తించాడు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికపై, దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావుపై ప్రభుత్వపరంగా దాడి చేసి అదుపు పెట్టాలని చూశాడు. వారికి ప్రకటనలు ఆపివేయాలనుకున్నాడు. ప్రెస్ బిల్లు పెట్టే చర్యకు ఉపక్రమించగా మేము హేతువాద సంఘం పక్షాన తీవ్ర ప్రతిఘటన చేశాము. మామిడిపూడి వెంకటరంగయ్యని పిలిచి సభ జరిపి ప్రెస్ బిల్లును సుల్తాన్ బజారు వై.యం.ఐ.యస్. హాలులో ఎండగట్టాము. దీనిపై అఖిల భారత స్థాయిలో పత్రికలు ప్రతిధ్వనించాయి. బ్రహ్మానందరెడ్డి ఆ బిల్లును సెక్ట్ కమిటీకి పంపి తప్పుకున్నారు.
బ్రహ్మానంద రెడ్డి జీవిత చరిత్రను కపిల కాశీపతి ‘బ్రహ్మానందయాత్ర’ పేరిట పెద్ద గ్రంథంగా వెలువరించారు. అందులో చాలా వివరాలు, నిశిత పరిశీలనలు చేశారు. అయినప్పటికీ దానిని బ్రహ్మానందరెడ్డి స్నేహపూర్వకంగానే స్వీకరించటం విశేషం. నేతి చలపతి అధ్యక్షతన బ్రహ్మానందరెడ్డిపై ఒక విచారణ సంఘాన్ని కాంగ్రెసు కమిటీ నియమించింది. ఆయన జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉండగా అరాచక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉండగా అవి చాలావరకూ వాస్తవాలని నేతి చలపతి  కమిటీ నిర్ధారించిందట. ఆ విషయం నిజమేనా అని నేను బ్రహ్మానందరెడ్డిని అడిగితే టోపీ వెనక నుంచి ముందుకు తిప్పి నవ్వి సమాధానం దాటేశారు. అసెంబ్లీలోనూ బయటా బ్రహ్మానందరెడ్డి నుండి సమాధానం రాబట్టటం చాలా కష్టమయ్యేది. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో సహచరులకు, పార్టీ వారికీ అంతుపట్టేది కాదు. ఏదైనా అడిగితే గాంధీ టోపీని వెనక నుంచి ముందుకు తిప్పుకుని పెట్టుకునేవారు.
రాజకీయాలలో తనకు బద్ధ విరోధిగా ప్రారంభమైన జలగం వెంగళరావును మంత్రివర్గంలోకి ఆహ్వానించి, హోం మంత్రి శాఖ కేటాయించి బ్రహ్మానందరెడ్డి తన రాజకీయ చతురతను చూపారు. ఆవిధంగా ప్రత్యర్థులను ఆకర్షించటం, మరో పక్క దెబ్బ కొట్టడం ఆయన రాజకీయ జీవితంలో మామూలే. సంజీవరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటూ, తరువాత తీవ్రవ్యతిరేకిగా మారిపోయాడు. సంజీవరెడ్డి కేంద్రమంత్రిగా ఉక్కు కర్మాగారాలశాఖ నిర్వహిస్తున్నప్పుడు ఆంధ్రులకు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పరచటం అవసరమని ఆందోళన జరిగింది. అందుకు గాను తమనంపల్లి అమృతరావు అనే కాంగ్రెస్ వాదిని నిరాహారదీక్షకు పురిగొలిపి ఆందోళన పెంచటానికి బ్రహ్మానందరెడ్డి హస్తం ఉందనేవారు. ఆ సందర్భంగా జరిగిన అలజడులలో విజయవాడలోని సంజీవరెడ్డి విగ్రహాన్ని పగులగొట్టారు. దీనికి బ్రహ్మానందరెడ్డి పరోక్ష కారణం అంటారు. ఆయన మంత్రివర్గంలో ఉంటూ వచ్చిన చెన్నారెడ్డి కేంద్రానికి వెళ్ళి కోర్టు తీర్పు ద్వారా పదవి పోగొట్టుకుని తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించి బ్రహ్మానందరెడ్డి వ్యతిరేకిగా ఆందోళన చేశారు. అయితే ఒక పట్టాన బ్రహ్మానందరెడ్డి లొంగలేదు. శాసనసభలో ఆయన మెజారిటీకి తిరుగు లేకుండా ఉండేది. అయినప్పటికీ ఇందిరాగాంధీ రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా ఆయనను తొలగించి పి.వి.నరసింహారావును ముఖ్యమంత్రిగా తీసుకువచ్చింది.
రాష్ట్ర గవర్నరుగా, కేంద్రమంత్రిగా ఆయన చిరకాలం వివిధ పదవులు అనుభవించిన రాజకీయవాది. సంతానం లేదు. రాజకీయాలలో తన పాత్రను ఏమేరకు నిలబెట్టుకున్నాడనేది చరిత్ర చెపుతుంది. ఆయనకు పదవి లేనప్పుడు కూడా నేను తరచు కలిసి మాట్లాడుతుండేవాడిని.

by Innaiah Narisetti

ఎం.ఎన్ .రాయ్ ప్రధమ భార్య ఎవిలిన్ ట్రెంట్

ఎం.ఎన్ .రాయ్ ప్రధమ భార్య ఎవిలిన్ ట్రెంట్ గురించి చాలా మందికి తెలియదు. రాయ్ తన అనుభవాలలో ఆమె ప్రస్తావన తేలేదు. ఆమెను గురించిన పరిషొధనాత్మక వ్యాస పరంపర చదవంది: blog Scientific Humanism at : zolaleila.blogspot.com

దళితుల ప్రథమ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 4



సంజీవయ్యను సాగనివ్వలేదు

(1921-1972)

నాకు బాగా ఇష్టమైన వ్యక్తి దామోదరం సంజీవయ్య. కానీ, ఆయనతో నాకున్న పరిచయం చాలా స్వల్పమనే చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా రెండు మూడు పర్యాయాలు సన్నిహితంగా కలసి మాట్లాడగలిగాను. ఆ రెండుసార్లూ కూడా తెనాలిలో కలవటం అనుకోకుండా జరిగిన విషయమే. తెనాలి సభ్యులు, సోషలిస్టు ప్రముఖులు అయిన నన్నపనేని వెంకట్రావు ద్వారా 1970లో కలిసినపుడు సుదీర్ఘ చర్చలు చేశారు. సంజీవయ్య ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెనాలిలో మూడురోజులపాటు బడుగు వర్గాల సమస్యలపై చర్చాగోష్ఠి వి.ఎస్.ఆర్. కాలేజీలో ఏర్పాటు చేశారు. దానికి వెంకట్రావుగారు నా సహాయం అడిగారు. చర్చకు కావలసిన హంగులు, పిలవాల్సిన వ్యక్తులు, చర్చించాల్సిన అంశాలు, అందుకు భూమికగా తోడ్పడే సాహిత్యం సమకూర్చడానికి నేను యథాశక్తి తోడ్పడ్డాను. ఇది 1970 నాటి మాట. సంజీవయ్య వచ్చిన తరవాత గోష్ఠిలో చర్చలు, ఉపన్యాసాలు చాలా లోతుపాతులతో హుందాగా జరిగాయి. డా.ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు, డా.రాఘవేంద్రరావు, రావెల సోమయ్య, సూర్యదేవర హనుమంతరావు మరెందరో పాల్గొని చర్చల స్థాయిని పెంచారు.
సంజీవయ్యకు దళితులు, బడుగు వర్గాల అభివృద్దిపట్ల అపారమైన శ్రద్ధ, ఆసక్తి వుండేవి. కానీ అందుకు తగ్గట్టు ఆయన చేయలేకపోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే. ఒకవైపు కుల, మరోవైపు ముఠాలు, ఇంకోపక్క అగ్రకులాల వ్యతిరేకతలు ఇత్యాది సమస్యలతో సంజీవయ్య సతమతమయ్యారు.
సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు. అందునా తనకిష్టమయిన బడుగు వర్గాల అభివృద్ధి అంశం గనుక, చాలా ఆవేదనతో, ఉద్విగ్నంగా ప్రసంగించేవారు. విడిగా ఆయనతో వివిధ కోణాల నుంచి బడుగు వర్గాల సమస్యను చర్చించాము. కాంగ్రెసు పార్టీలో సంజీవయ్య ఉన్నందున అనుకున్నవన్నీ అమలు పరచటానికి వీలులేని పరిమితులు ఉన్నాయి. అంబేద్కర్ భావాలు, లోహియా ఆలోచనలూ, ఎం.ఎన్.రాయ్ ధోరణి బడుగువర్గాల ఉన్నతికి తోడ్పడేదిగా, అగుపించినా, పార్టీ ఓట్లు రాజకీయం వలన చాలా అంశాలలో ముందుకుపోలేని స్థితి కాంగ్రెసు పార్టీలో ఉన్నది. చర్చలలో అటువంటి విషయాలను సంజీవయ్య ప్రస్తావించినా, వేదికపై అలా మాట్లాడడానికి వీలుకాలేదు. కానీ బడుగు వర్గాల సమస్యలపట్ల ఆయన వెలిబుచ్చిన ఆవేదన మాత్రం చప్పుకోతగ్గది. నా అభిప్రాయాలు ఆయనతో చెప్పినప్పుడు సంతోషించి నన్ను గురించి వివరాలు అడిగారు. నన్నపనేని వెంకటరావుగారు రాడికల్ హ్యూమనిస్టుగా నాకు సంబంధించిన అంశాలు చెప్పారు. ఏదైనా ఆ అనుభవాలు చాలా హత్తుకుపోయిన అంశాలు.
మరొకసారి తెనాలిలోనే ఆవుల గోపాలకృష్ణమూర్తిగారి వద్ద సంజీవయ్యగారిని కలుసుకోగలిగాను. ఆ సన్నివేశం భిన్నమయినది. ముఖ్యమంత్రిగా పర్యటన చేస్తున్న సంజీవయ్య విజయవాడ వెళ్ళి, పాతబస్తీలో ఒక అనాథ బాలికల ఆశ్రమాన్ని సందర్శించవలిసి ఉన్నది. సంజీవయ్య అక్కడివరకు వెళ్ళారు. ఒక కొండ గుట్టపై ఆ అనాథబాలికల బడి ఉన్నదని తెలిసి, ‘అంతపైకి నేను ఎక్కలేను’ అని తిరిగి వెళ్ళిపోయారు. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అనాథ బాలికలు, యాజమాన్యం కుంగిపోయారు. ఈ విషయాల్ని ఆంధ్రపత్రికలో వార్తగా ప్రచురించారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి అది చూచి ‘ముఖ్యమంత్రి పదవికి దేకగలిగిన వాడు ఆ మాత్రం గుట్ట ఎక్కలేకపోయాడా’ అని వ్యాఖ్యానించాడు. అదే మాటలని యధాతథంగా ‘ఆంధ్రపత్రిక’ తెనాలి విలేఖరి వెంకటప్పయ్యశాస్త్రికి పంపగా ప్రముఖంగా ప్రచురితమయింది. అది చూసుకున్న ముఖ్యమంత్రి సంజీవయ్య వెంటనే స్పందిస్తూ, ఆ వ్యాఖ్య బావున్నది. నాకు తగిలింది. నచ్చింది. నేను తక్షణమే కార్యక్రమం వేసుకొని అనాథ బాలికల ఆశ్రమానికి వెళుతున్నానని చెప్పి వెళ్లారు. అక్కడ నుండి తెనాలికి వచ్చి గోపాలకృష్ణమూర్తిని కలిసి అభినందించారు. అప్పుడు నేనక్కేడే ఉన్నాను. చాలాసేపు అనేక విషయాలు మాట్లాడుకున్నాము. గోపాల కృష్ణమూర్తిగారిపట్ల ఆయన ఎంతో ప్రేమ, ఆసక్తి కనబరిచారు.
దామోదరం సంజీవయ్య రాజకీయాలలోకి వచ్చిన కొత్తలోనే మదరాసులో రాజగోపాలాచారిని ఆకర్షించారు. ఆ తరువాత ఆంధ్రలో వివిధ దశలలో హుందాగా ప్రవర్తించి పేరు తెచ్చుకున్నారు. కర్నూలు నుంచి వచ్చిన సంజీవయ్య ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూను ఆకర్షించటం విశేషం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి హఠాత్తుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల వలన రాజీనామా చేయవలసి వచ్చింది. బస్సుల జాతీయీకరణను చేయడంలో పక్షపాతం వహించి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బ కొట్టాలని కర్నూలు జిల్లా బస్సురూట్లు జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో తాత్కాలిక కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. కనుక సంజీవయ్య శాసనసభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు. బలీయమైన రెడ్డి వర్గం ఎ.సి.సుబ్బారెడ్డి నాయకత్వాన ఎదురుతిరిగి సొంత పక్షం పెట్టుకున్నారు. 1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినపుడు సంజీవయ్య పోటీ చేద్దామనుకున్నారు. కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ఆ విధంగా సంజీవయ్య ముఖ్యమంత్రిత్వం స్వల్ప కాలానికే పరిమితం కావడంతో దళితులకు ఏమంతగా చేయలేకపోయారు. ఎ.సి. సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను ఎద్దేవా చేసాడు. ముఖ్యమంత్రిగా 1962లో దిగిపోయిన సంజీవయ్య, గవర్నర్ కు రాజీనామా సమర్పించారు. ఆ మర్నాడే సికిందరాబాదులో తన భార్యను వెంటబెట్టుకుని అజంతా టాకీసులో సినిమాకని నడిచివెళ్ళారు. త్రోవలో ఎస్.వి.పంతులు కనిపిస్తే రా పంతులూ సినిమాకి పోదాం అని ఆయనను కూడా వెంటబెట్టుకు వెళ్లారు. ఈనాటి ముఖ్యమంత్రులలో అలాంటి ప్రవర్తన వూహించటం కష్టం.
కేంద్రానికి వెళ్ళి దామోదరం సంజీవయ్య మంత్రిగా కొనసాగారు. చక్కని పేరు తెచ్చుకున్నారు. కార్మిక సమస్యలు బాగా పట్టించుకున్నారు. పారిశ్రామిక రంగంలో ఎదుర్కొంటున్న విషయాలు అధ్యయనం చేశారు. ఆయన రాసిన ‘లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్’ పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు.
సంజీవయ్య 1972లో చనిపోవటం దళితులకు, బడుగు వర్గాలకు పెద్ద లోటు. ఆయనతో నాకున్న పరిచయం పరిమితమే అయినా అపరిమిత అనుభవాన్నిచ్చింది.
Innaiah Narisetti

మిత్ర శత్రువుగా నీలం సంజీవరెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 3


Shake hands with Sanjivareddi, the speaker of Lok Sabha in Begumpet airport, Hyderabad
మిత్ర శత్రువుగా నీలం సంజీవరెడ్డి
(1913-1996)


ఆంధ్రప్రదేశ్, దేశ రాజకీయాలలో ఒక ఊపు ఊపిన రాజకీయ దిట్ట నీలం సంజీవరెడ్డి. ఆయన చదివింది ఇంటర్మీడియట్ అయినా రాష్ట్రపతి వరకూ ఎదిగి కీలకపాత్ర వహించిన వ్యక్తి. మొట్టమొదటిగా ఆయనను కర్నూలు రాజధానిలో కలుసుకున్నాను. అది సన్నిహిత పరిచయం కాదు. ఆయన అప్పటికే చాలా వివాదాస్పదమై వ్యక్తి. ఆచార్య రంగా వ్యతిరేకంగా ఉన్నందున ఆయనపట్ల నేను సుముఖత కనబరచలేదు. కానీ అశ్రద్ధ చూపడానికి వీలులేని రాజకీయ నాయకుడిగా సంజీవరెడ్డిని పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తూపోయాను.
తెనాలిలో ఆవుల గోపాలకృష్ణమూర్తి 1954-55లో మునిసిపల్ ఛైర్మన్ గా ఉన్న రోజులలో, సంజీవరెడ్డి మంత్రి హోదాలో వచ్చారు. అప్పుడు మున్సిపల్ ఛైర్మన్ గోపాలకృష్ణమూర్తి సభాముఖంగా సంజీవరెడ్డిని రెండు రోడ్లు తెనాలికి మంజూరు చేయవలసిందిగా కోరారు. అందుకు సంజీవరెడ్డి స్పందిస్తూ అడిగిన రెండింటిలో ఒకటి మంజూరు చేస్తున్నట్లు, అంటే 50 శాతం ఇచ్చినట్లు అని ప్రకటించి, ఇలా ఇవ్వడం అపూర్వమని మిగిలిన చోట్ల ఇవ్వనివిధంగా ఇస్తున్నానని చెప్పారు. గోపాలకృష్ణమూర్తి ధన్యవాదాలు చెపుతూ రెండులో ఒకటి సగం కాదని, అడిగిన రెండింటిలో ఒక రోడ్డు లక్షన్నర విలువ కాగా, రెండవది 50 వేలు మాత్రమేనని కనుక లక్షన్నర విలువచేసే రోడ్డు నిర్మాణం అంగీకరిస్తే సంతోషిస్తామని చెప్పగా సభలో పెద్ద పెట్టున చప్పట్లు కొట్టారు. తరువాత ట్రావెలర్స్ బంగళాలో సంజీవరెడ్డి తనను తెనాలి ఆహ్వానించి తీసుకువచ్చిన ఆలపాటి వెంకట్రామయ్యపై ఆగ్రహం కనబరిచి, నన్ను సభాముఖంగా ఇలా అవమానం చేయిస్తాడా అని అన్నారు. అప్పుడు నేను సభలో ప్రేక్షకుణ్ణి మాత్రమే. గోపాలకృష్ణమూర్తి అభిమానిని కూడా.
సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు తిరుపతిలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. నాటి వైస్ ఛాన్సలర్ గోవిందరాజులు నాయుడు ఏకపక్షంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా సెనేట్ కు చెప్పకుండానే నిర్ణయం తీసుకోవటం అప్రజాస్వామికమని మా అన్న విజయరాజకుమార్ సెనేటు సభ్యులుగా కోర్టులో కేసు వేశారు. అది తేలేవరకూ డాక్టర్ అని తన పేరు ముందు వాడవద్దని సంజీవరెడ్డి పక్షాన ఛీఫ్ సెక్రటరీ భగవాన్ దాస్ ఉత్రువులిచ్చారు. నెల్లూరు కోర్టులో ఆ కేసును ఆవుల గోపాలకృష్ణమూర్తి చేపట్టారు. కొంతకాలం విచారణ జరిగిన తరువాత తమ పరిధిలో లేదని ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. ఉత్తరోత్తర నేను కలిసినపుడు మీమీద కోర్టులో గౌరవ డిగ్రీ విషయమై కేసు పెట్టిన వ్యక్తి మా అన్న అని చెప్పినప్పుడు ఆయన సీరియస్ గా తీసుకోలేదు. తరువాత మేము మిత్రులమయ్యాము.
1955 ఉప ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార ఉద్యమం ముమ్మరంగా ఆంధ్రలో సాగినప్పుడు సంజీవరెడ్డి, రంగా కలిసి పర్యటించారు. మా అన్న విజయరాజకుమార్ రంగా పక్షాన ఆ పర్యటనలో చాలా సభలలో పాల్గొన్నాడు. రంగాగారి సన్నిహితులుగా నేను కొన్ని సందర్భాలలో సంజీవరెడ్డిని కలవటం తటస్థించింది. ఆ తరువాత ముఖ్యమంత్రిగాను, కేంద్రమంత్రిగాను ఉన్న సంజీవరెడ్డితో నేను కలిసింది తక్కువే. హైదరాబాదులో ఒకేసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొలి రోజులలో గోరాగారు అనుచరులతో సత్యాగ్రహం తలపెట్టారు. నిరాడంబరంగా ఉండాలని, పూలమొక్కల బదులు కూరగాయలు పెంచాలని ఉద్యమంలో ప్రధానాంశాలుగా ఉన్నవి. సంజీవరెడ్డి గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రిగా బస చేసినప్పుడు (1963) దాని ఎదురుగా గోరా, ఆయన భార్య సరస్వతి, పత్తి శేషయ్య, వెంపో, కానా మరికొందరితోపాటు నేనూ రోడ్డుమీద కూర్చున్నాను. సంజీవరెడ్డి కబురుపెట్టి గోరాని పిలిపించుకొని భోజనం పెట్టి చర్చలు జరిపి పంపించారు. ఆ సందర్భంగానే మిగిలినవారిని కూడా లోనికి పిలిచి నిర్ణయాలు చెప్పమని గోరా కోరినప్పుడు, ఆయన మమ్మల్ని లోపలికి పిలిచినప్పుడు కలవటం జరిగింది. అక్కడ నన్ను గుర్తుపట్టి లోగడ కర్నూలులో, తెనాలిలో కలిశావు కదా అన్నారు. మీకు చాలా గుర్తున్నదే అన్నాను.
చాలాకాలం తరువాత రాజకీయ సుడిగుండంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన తరువాత సంజీవరెడ్డి జనతా పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు నేను కలవడం తటస్థపడింది. ఎమ్.వి.ఎస్. సుబ్బరాజు అప్పుడు సంజీవరెడ్డికి ప్రియశిష్యుడుగా ఉండేవాడు. ఆయన నాకు కుటుంబ మిత్రులు. ఆ విధంగా కొన్ని పర్యాయాలు సంజీవరెడ్డిని దగ్గరగా కలుసుకున్నాను. ‘కమెండో’ పత్రిక ఎడిటర్ వినుకొండ నాగరాజు ఎలాగో సంజీవరెడ్డికి చాలా సన్నిహితుడయ్యారు. ఆయన నాకు మిత్రుడు కనుక మేము హైదరాబాదు సరోవర్ హోటల్ లో కొన్ని సందర్భాలలో కలిసి మాట్లాడటం వలన దగ్గరగా వచ్చాము. వినుకొండ నాగరాజు జనతాపార్టీ పక్షాన పోటీచేసి ఓడిపోవడం ఆ తరువాత రాష్ట్రపతిగా ఉన్న సంజీవరెడ్డి దగ్గరకు అప్పుడప్పుడూ ఢిల్లీ వెళ్లటం కూడా జరిగేది. నేను ఢిల్లీలో కలవలేదు. కాని హైదరాబాదులోనే అనేక సందర్భాలలో సంజీవరెడ్డిని కలిసే అవకాశం లభించింది. ‘మిసిమి’ ఎడిటర్ ఆలపాటి రవీంద్రనాథ్ చిరకాలంగా సంజీవరెడ్డికి సన్నిహితులు. అలా కూడా మేము విడిది గృహాలలో సంజీవరెడ్డిని కలిశాము.

చివరి రోజులలో నా మిత్రుడు, బుక్ లింక్స్ పుస్తక ప్రచురణ సంస్థ యజమాని కె.బి.సత్యనారాయణ ద్వారా సంజీవరెడ్డి తన జీవిత గాథను ప్రచురించాడు. అప్పుడు నేను వ్రాతప్రతిని చూడటం కొన్ని సలహాలు చెప్పటం వలన మరికొంత సన్నిహితులమయ్యాము. తొలి ప్రతిలో నిష్కర్షగా చాలా విషయాలు బయటపెట్టిన సంజీవరెడ్డి తీరా ప్రచురణ సమయానికి ఎందుకోగాని వాటన్నిటినీ ఉపసంహరించారు. వివాదాలు అనవసరమని భావించారు. నేను కొంతమేరకు ఆశ్చర్యపోయాను. పుస్తకం పేరు ‘ఫ్రం ఫామ్ హౌస్ టు రాష్ట్రపతి భవన్’ ఆయన రాసిన మరొక స్వీయగాథను ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’ అనే శీర్షికన అలైడ్ పబ్లిషర్స్ వెలికి తెచ్చారు. స్పీకర్ గా, రాష్ట్రపతిగా సంజీవరెడ్డి చాలా అధునాతన సాహిత్యం చదివారు. ఒకసారి ఎం.సి.చాగ్లా అది తెలిసి ఆశ్చర్యపోయి మెచ్చుకున్నారు. సంజీవరెడ్డి మిగిలినవారితో పోల్చితే నిరాడంబరంగా జీవితం గడిపారు. హైదరాబాదు వచ్చేముందు ఎస్.వి.పంతులుగారికి కబురు చేసి సరోవర్ లో బస ఏర్పాటు చేయమనేవారు. ఆవిధంగా కూడా కొన్ని సందర్భాలు మేము కలిసి మాట్లాడడానికి అవకాశాన్నిచ్చాయి. సంజీవరెడ్డి ఎదిగాడు. సంజీవరెడ్డి చివరి రోజులలో చాలా సన్నిహితంగా వ్యవహరించటం నాకు సంతోషదాయకమైన విషయం. ఇందిరాగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీని అప్రజాస్వామికమైనదిగా సంజీవరెడ్డి వ్యతిరేకించటం గొప్ప హైలైట్. మొదటిసారి తన బావమరిది తరిమెల నాగిరెడ్డి (కమ్యూనిస్టు) చేతిలో అనంతపురంలో ఓడిపోయిన తరువాత మళ్లీ జిల్లాలో ఎప్పుడూ పోటీ చేయలేదు. బయటనుండే గెలిచారు. సంకుచిత కాంగ్రెస్ రాజకీయాల నుండి ఆయన ఎదిగి జనతా రాజకీయాలలో ప్రజాస్వామిక వాదిగా పరిణమించటం విశేషం.
In his last days Sanjiva reddi wrote his autobiography under the title:
Without Fear or Favour : Reminiscences and Reflections of a President, published in 1989  by Book links, Hyderabad