Rare article of G VKrishnarao


రాయిజం
శ్రీ  జి.వి.కృష్ణారావు
(ఈ వ్యాసాన్ని మహతి పత్రికలో- వాసిరెడ్డి వెంకట సుబ్బయ్య సంపాదకుడుగా - తెనాలి నుండి రాశారు. ఆయన పండిత కవి. ఆయన సంస్కృతం నుండి తెలుగులోనికి అనువదించిన శృంగార కావ్యానికి ఆవుల గోపాల కృష్ణమూర్తి పీఠికి రాశారు.
యం.ఎన్.రాయ్ జైలు నుండి విడుదలై కాంగ్రెసు రాజకీయాలలోకి ప్రవేశించిన తొలి రోజులలో రాసిన వ్యాసం ఇది. జి.వి.కృష్ణారావు అప్పుడే కాలేజీలోకు ప్రవేశించాడు. విద్యార్థిగా రాయ్ భావాల ప్రభావంతో  ఈ వ్యాసం రాశారు. దీనికి గల చారిత్రక ప్రాధాన్యత వలన ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. జి.వి. కృష్ణరావు ఆ తరువాత రచయితగా రాయ్ అనుచరుడుగా పేరు పొందాడు.)
కాంగ్రెసు పార్టీలో సోషలిస్టు పార్టీ ఉండటం వల్ల సోషలిస్టు సిద్ధాంతాలకు హాని కలుగుతుంది. కాంగ్రెసును బలపరచటానికి మాత్రము కాంగ్రెసులో ఉండవలసిన అగత్యం సోషలిస్టు పార్టీకి లేదు. అలా కాంగ్రెసులో రెండో పార్టీ ఉండటంవల్ల కాంగ్రెసుకు బలం కలగటానికి బదులు బలహీనత ఏర్పడుతుంది. కాంగ్రెసు వెలుపల ఖచ్చితమైన కమ్యూనిస్టు పార్టీ ఉండవలసిందే. దాన్ని రాయి ఒప్పుకుంటున్నాడు. దానిలో సభ్యుడవుతానంటున్నాడు. బయట సోషలిస్టు పార్టీలో సభ్యుడైన ప్రతివాడూ కాంగ్రెసులో సభ్యుడు కావాలి. పరిపూర్ణంగా కాంగ్రెసు సభ్యుడు లాగానే ప్రవర్తించాలి. అంటే, సోషలిస్టు కార్యక్రమాన్ని కాంగ్రెసు చేత ఆమోదింపజేయాలని కాదు. కాంగ్రెసు లెఫ్టువింగ్ ను నడిపించే శక్తిగా ఉండి అవసరమైతే నాయకత్వం వహించి కాంగ్రెసును రాడికలైజు చేయాలి. అంతేగాని కాంగ్రెసు పార్టీలో సోషలిస్టు పార్టీ ఉండటానికి వీలులేదని రాయి ఈ కారణాల్ని చూపుతున్నాడు—
1.             సిద్ధాంతరీత్యా పొరపాటు (Theoritical blunder)
ఈ రోజున సోషలిజం అంటే కాపిటలిజానికి, సామ్రాజ్య తత్వానికి వ్యతిరేకంగా తీవ్ర విప్లవ సంఘర్షణను వదలుకొని, విప్లానిక ప్రజా బాహుళ్యము యొక్క కార్యక్రమాల ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకోడమన్నమాట. కాబట్టి తమ అధికారాన్ని చలాయించుకోటానికి బూర్జువాయిజ్ దేన్ని సాధనంగా చేసుకొన్నదో,  ఆ పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని బలపరచడమే దీని భావము. సోషలిస్టు పార్టీ, సంస్కారాన్ని తలపెట్టేదే గాని విప్లవాన్ని తలపెట్టదు. ఉన్నటువంటి సాంఘిక స్థితిని వ్యత్యస్తం చేసి వర్గరహితమైన సంఘాన్ని స్థాపించే సాధనం కాదు.
ఇలాటి పక్షం వల్ల హిందూ దేశానికి ప్రయోజనం లేదు. దేశము యొక్క రాజకీయ ఆర్థిక రంగంలో దీనికి స్థానమే లేదు. సంస్కారికమైనటువంటిన్నీ అవిప్లవానికమైనటువంటి స్వభావము వల్ల సోషలిస్టు పార్టీ స్వాతంత్ర్యం కోసం జరిగే సంఘర్షణలో సాధనం కాజాలదు. కృషిక వర్గాన్ని ప్రబోధించి, ఆర్గనైజ్ చేసి విప్లవములోకి దిగకుండా కాపిటలిస్టు విధానంలోనే ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని క్రమంగా చక్కపరుచుకోటానికి సహాయపడి నడుపుతుంది అన్న కారణం ఒకటే ఈ పక్షం కావటానికి పనికివస్తుంది. ఈ కారణం కూడా హిందూ దేశంలో దుర్బలమవుతుంది. ఎందుకంటే ఐరోపా అమెరికాలలో మాదిరిగా కాపిటలిస్టు విధానం బాగా అభివృద్ధిలో వున్నప్పుడే, కృషిక వర్గం కేపిటలిస్టు సంఘంలోనే ఉండి తన పరిస్థితుల్ని అభివృద్ధి చేసుకోగలుగుతుంది. కృషిక వర్గం ప్రజాస్వామికమైన రాజకీయపు హక్కుల్ని చలాయించటం వల్ల క్రమక్రమంగా ప్రభుత్వం యొక్క లక్షణాన్ని మార్చవచ్చు ననుకొంటున్నారు. దీనికి ప్రజాస్వామిక ప్రభుత్వమిదివరకే ఉండాలి. ప్రజాస్వామిక ప్రభుత్వమిదివరకే ఉండాలి. ప్రజాస్వామిక ప్రభుత్వమూ, విజృంభించియున్న కాపిటలిజమూ,  రెండూ హిందూదేశంలో లేవు. కాబట్టి ఈ దేశంలో సోషలిస్టు పార్టీ ఉండటానికి వీలులేదు. కాపిటలిస్టు అభివృద్ధికి ఆటంకం లేనటువంటి దేశాల్లో రిఫార్మిష్టు, సోషలిస్టు పార్టీలుంటవి. కాని బానిసత్వంలో ఉన్న మనదేశంలాంటి వలస రాజ్యములలో ఉంటానికి వీలులేదు. బూర్జువాయిజీ హక్కుల్ని ఇవ్వగల్గే స్థితిలో ఉన్నప్పుడే, సంస్కరణ, జన బాహుళ్యాన్ని తప్పుత్రోవని పెడుతుంది.
Further, the decay of Capitalism as a world force has pronounced the death sentence over Socialism (Reformists) and consequently on Socialist parties.
ఐరోపాలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీలు పడిపోవటం మంచి పాఠం నేర్పుతోంది.
ఇదివరకు కంటె తీవ్రప్రయత్నాలతో సోషలిస్టు పార్టీని సాగించినా అది సోషలిస్టు పార్టీగా నడవదు. నడవటానికి కమ్యూనిస్టు పార్టీగా గాని, లేక ప్రజాస్వామిక విప్లవపక్షంగా గాని పనిచేయాలి. రెండూ చారిత్రకంగా అవసరం. రెంటికి సాంఘిక ప్రోద్బలముంది. అట్లాంటప్పుడు అపోహ గలిగించే పార్టీని ఎందుకు ఏర్పరచాలి? నిష్ప్రయోజకమైన జెండా క్రింద ఎందుకు నడపాలి? ఇదివరకు చేసిన ప్రయత్నాకంటె కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి ప్రజాబాహుళ్యం యొక్క సహాయం ఎక్కువగా ఉంది. ప్రజాబాహుళ్యము యొక్క ఉద్యమం వల్లనే  ఈ పక్షం బయలుదేరిందంటే అతిశయోక్తి అవుతుంది. ఇదివరకు ప్రయత్నాలకంటే ఈ ప్రయత్నంలోని ప్రత్యేకత ఏమిటంటే, వర్గవిభేదం కలిగించటం, కాంగ్రెస్ రాడికలైజ్ కావటం ఇది సూచిస్తుంది. కాంగ్రెస్ చేసే తీవ్రసాంఘిక రాజకీయ ప్రయత్నాల్ని ఇది పూర్ణంగా సూచించటం లేదు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ప్రజల్ని కమ్యూనిస్టు ధ్వజం క్రిందకు చేర్చడం ప్రజల ఆదర్శానికి చాలా ముందు పోవడం అవుతుంది.
చారిత్రకంగా అర్థవంతమైన సోషలిస్టు పార్టీగా కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ఉండదలిస్తే, జాతీయవాదులైన జనాన్ని రాడికలైజ్ చేయడానికి సహాయపడక పైగా అడ్డు తగులుతుంది. రాడికలైజేషన్ అంటే దోపిడీ చేయబడుతున్న వర్గాలలో విప్లవ చైతన్యాన్ని వేగిరించడం. దీనివల్ల సామ్రాజ్యతత్వంతో పోరాడటానికి ముందంజ వేయటం జరుగుతుంది. ఈ రాడికలైజేషన్ సోషలిస్టు పార్టీ నాయకత్వమున యెన్నటికీ జరుగదు. ఎందుకంటే, శ్రమత్వం (Gradualism) ఈ పక్షము యొక్క ముఖ్య నియమము, సోషలిస్టు పార్టీ అవలంబించే విధానమూ తంత్రమూ క్రమత్వ సిద్ధాంతం మీదనే నడవాలి. ముక్తసరిగా చెప్పాలంటే, ఇండియాలో సామ్రాజ్య తత్వానికి వ్యతిరేకంగా పోట్లాడవలసిన ఉద్యమం, సంస్కారరీత్యా, క్రమంగా ముందుకు పోవటం  అనే ఆవిప్లవ సిద్ధాంతానికి పాల్పడిన సోషలిస్టు పార్టీ నాయకత్వాన నడవటానికి వీలు లేదు.
2.             రాజకీయంగా పొరపాటు (Political Blunder)
ప్రస్తుతము విదేశ సామ్రాజ్య తత్వం అవిప్లావికమైనటువంటి జాతీయమైన ఫ్రీ కాపిటలిస్టు సంఘానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉంది. జాతీయ స్వాతంత్ర్యం సంపాదించటం, నిరాఘాటంగా సాంఘిక ఆర్థిక నాగరికతాభ్యుదయానికి వలసిన పరిస్థితులను కలిపించటం, ఇప్పటికి కర్తవ్యం. కాబట్టి విప్లవ ప్రజాస్వామికమైన సామ్రాజ్యమునకు వ్యతిరేకమైన శక్తులు కూడటానికి సాంఘిక బలాన్ని పురస్కరించుకొని ఒక పక్షము తన ప్రబోధన విధానం, వ్యవస్థాపక పద్ధతి మార్చుకోవాలి. అట్లాంటి పార్టీ సోషలిస్టు పార్టీ కాదు. సోషలిస్టు కార్యక్రమాన్ని స్వీకరించటానికి యీ పరిస్థితుల్లో వీలులేదు.
3.                తంత్ర రీత్యా పొరపాటు (Technical Blunder)
కాంగ్రెస్ పార్టీని సోషలిస్టు పార్టీ కార్యక్రమం స్వీకరింపచేయటం వట్టి భ్రాంతి. ఒక రాజకీయ పక్ష కార్యక్రమాన్ని ఇంకొక పక్షంచేత స్వీకరింపచేయటం ఎప్పుడూ పడదు. ఆ విషయం ఆ పక్షము యొక్క కార్యక్రమం సోషలిజమ్. నేషనల్ కాంగ్రెస్ యొక్క సాంఘిక ఆధారం (Social Basis) దానికన్న విశాలమైనది. ఆచార్య రీత్యా కాంగ్రెస్ హిందూదేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడేటటువంటి పక్షము ఐనా, ఇప్పటి వరకూ దాని కార్యక్రమమూ, విధానమూ, నాయకత్వము యొక్క సాంఘిక లక్షణాన్ని బట్టి మారినవి. జాతీయ స్వాతంత్ర్య సంఘర్షణలో గట్టిగా పనిచేస్తే విప్లవ ప్రజాస్వామిక కార్యక్రమాన్ని కాంగ్రెసు అనుసరించవలసి ఉంది. ఏ పరిస్థితులలోనైనా సోషలిస్టు పార్టీ కార్యక్రమాన్ని స్వీకరించేటంతదూరం పోదు. కాంగ్రెసు ప్రజాస్వామిక జాతీయ విప్లవము యొక్క కార్యక్రమాన్ని స్వీకరించకుండా ఉండటానికి (దీనివల్ల ప్రీ కాపిటలిస్టు సాంఘిక సంబంధాల్ని ధ్వంసం చేయడం చేత సాంఘిక విప్లవం కలుగుతుంది) కరాచీ తీర్మానము లాంటి మూడో రాడికల్ కార్యక్రమమును నామక: ఆమోదించవచ్చును. దీనివల్ల లాహోరులో జరిగిన స్వాతంత్ర్య తీర్మానములో కనబడుతున్న రాడికలైజేషన్ విధానాన్ని ప్రక్కకు త్రోసివేయడం జరుగుతోంది.
సాంఘిక చారిత్రక కారణాలవల్ల కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు కార్యక్రమాన్ని స్వీకరింపజాలదు. కాబట్టి దానికేమాత్రము ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం చేసేవారు చీలిపోవలసి వుంటుంది. ఈ దురదృష్ట అవస్థ కొంతవరకు  ఈవరకే కలిగింది. దీన్ని మిగిలిపోకముందే సవరించుకోవాలి. కాంగ్రెసు సోషలిస్టు పార్టీ అవలంబించే విధానాన్ని మార్చుకోకపోతే రాడికల్ ప్రజాస్వామిక ఉద్దేశాల ద్వారా కాంగ్రెసును స్వాధీనం చేసుకోటం జరుగదు. కాంగ్రెసులో రాడికల్స్ చిన్న సంఘంగానే వేరుపడటం జరుగుతుంది. రైట్ వింగ్ అధికారాన్ని చెలాయిస్తుంది. కాంగ్రెసు నాయకత్వము కోసం పోరాడవలసింది సోషలిజం జెండా క్రింద కాదు, ప్రజాస్వామిక జాతీయ విప్లవము ద్వారా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రాడికల్ జాతీయ విప్లావిక లక్షణాల ద్వారా కాంగ్రెసును స్వాధీనం చేసుకోగోరుతున్నది. కానీ కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ద్వారా మాత్రం కాదు.
కాంగ్రెసులో ఖచ్చితమైన సోషలిస్టులు సోషలిజం అంటే అభిమానమున్నవారు ఉన్నారు. వీరికి ప్రత్యేకమైన పార్టీ గావాలని ఉంటుంది. ఆ పార్టీ సోషలిస్టు పార్టీ కాదు. కమ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీ చారిత్రకంగా అవసరమైనా, రాజకీయంగా ప్రాముఖ్యత వున్నా, బహిరంగంగా కాంగ్రెసు నాయకత్వానికి ప్రయత్నించజాలదు. జాతీయ ప్రజాస్వామిక శక్తుల్ని ఆకర్షించే కేంద్రంగా మాత్రమే పనిచేయవలసి ఉంటుంది. కమ్యూనిస్టులు కాంగ్రెసుకు వెలుపల స్వతంత్ర పక్షాన్ని ఏర్పరచుకొని కాంగ్రెసు పార్టీలో లెఫ్టువింగు మెంబర్లై కాంగ్రెసు విధానాన్ని మార్చి నడపగలుగుతారు. కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ఒకవేళ కాంగ్రెసు నాయకత్వాన్నిదేశపరిస్థితులకనుగుణ్యంగా కార్యక్రమాన్ని అవలంబించి స్వాధీనం చేసుకోగలుగుతుంది కానీ, సోషలిస్టు కార్యక్రమం క్రింద కాదు. పైగా విప్లవ ప్రజాస్వామిక  కార్యక్రమానికి సోషలిస్టు కార్యక్రమం అని పేరు పెట్టటానికి అర్థం యథార్థమైన సోషలిస్టు కార్యక్రమాన్ని వదిలిపెట్టటం అవుతుంది. ఒకే పార్టీ విభిన్నమైన సోషలిజం యొక్క రెండు రకాలను ప్రచారం చేయజాలదు. జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని సోషలిజం అంటే, యదార్థమైన సోషలిజాన్ని త్రోసివేయాలి. కాబట్టి కాంగ్రెసు సోషలిస్టు పార్టీ సోషలిజం జెండాను ఎగురవేయటానికి కుతూహలం పడటంవల్ల వారి ఆదర్శానికి ద్రోహం చేయటమవుతుంది. ప్రజాస్వామిక జాతీయ విప్లవం కోసం పోరాడితే, తరువాత సోషలిస్టులకు యధార్థమైన సోషలిస్టు కార్యక్రమం కోసం పోట్లాడటానికి ఏదీ అడ్డుపడదు. ప్రజాస్వామికాన్ని సంపాదించిన మీదటనే సోషలిజం స్థాపించటానికి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ఖచ్చితమైన సోషలిస్టులు అంతా కాంగ్రెస్ పార్టీకి వెలుపల స్వతంత్రమైన కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపించి కాంగ్రెస్ లో లెఫ్టువింగుగా పనిచేయాలి. కాంగ్రెసులో ప్రత్యేక పక్షంగా పనిచేయకూడదు. కాంగ్రెస్ యొక్క ప్రత్యామ్నాయ (Alternative) నాయకత్వం క్రింద పనిచేయాలి. సోషలిస్టు పార్టీ కాంగ్రెసు పార్టీలో ఉండకూడదు. ఆ పార్టీ మెంబర్లు వ్యక్తిగతంగా కాంగ్రెసులో చేరి లెఫ్టువింగు వెనుక నుండి నడిపిస్తుండాలి. నిజంగా జాతీయ ప్రజాస్వామిక కార్యక్రమంతో కాంగ్రెసు లెఫ్టువింగ్ నాయకత్వం సోషలిస్టు ప్రోత్సాహం వల్లనే లభిస్తుంది. ఎందుకంటే చారిత్రక కారణాలవల్ల ప్రపంచ పరిస్థితుల వల్ల, హిందూదేశంలో వెనుకపడిన జమీందారీ ప్రజాస్వామిక విప్లవము కృషివర్గము యొక్క పలుకుబడి క్రింద నిర్వహించబడుతుంది.
కాబట్టి హిందూ దేశ విప్లవంలో, ప్రజాస్వామిక దశలోనైనా కృషిక వర్గ పక్షము అనివార్యం కావలసి వుంది. కృషిక వర్గము యొక్క సోషలిస్టు పార్టీ ఆదర్శము కాంగ్రెస్ చేత సోషలిస్టు కార్యక్రమాన్ని స్వీకరింపచేయటం కాదు. జాతీయ స్వాతంత్ర్య సంఘర్షణలో కాంగ్రెస్ ను సాధనంగా వాడుకోవాలి.
కష్టపడుతున్న ప్రజలకొరకు స్వాతంత్ర్యం సంపాదించదలచే వారంతా ఏకీభవించి, ఒకే రాజకీయ పక్షంగా కాంగ్రెస్ లో ఉండి దాని ప్రస్తుత ఆదర్శాలలోనూ, రాజకీయములోనూ, వ్యవస్థాపకత్వములోనూ, ఉన్న లోటును తొలగించి, ప్రజాసామ్రాజ్య తత్వానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన బాహుళ్యపక్షంగా మార్చాలి.
Posted by-         ఎన్. ఇన్నయ్య

No comments:

Post a Comment