వేదాంతి వెంట ఒక ఏనుగు తరుముతుంటే, అతడు తప్పించుకోడానికి పరిగెడుతున్నాడు. అప్పుడు అతనికి ఎదురైన ఒక సామాన్యుడు. :
స్వామీ అంతా మాయ అన్నారుగదా మరి ఏనుగు మిథ్య అయితే తమరు పరుగెత్తడం దేనికి అని సందేహం వెలిబుచ్చాడు. గోచీ చేతబుచ్చుకుని రొప్పుతూ, పరిగెత్తడం కూడా మిథ్యే నాయనా అన్నాడట !
ఇంతకూ ఏది నిజం ? ఏది మాజిక్ ?
ఉన్నదంతా నిజం. అంటే సరిపోతుందా? మన ఎదుట లేకుండా, పరిణామక్రమంలో అంతరించాయన్న సరీసృపాలు (డైనాసార్లు) ఆకాశంలో కొన్ని తారల మాటేమిటి? అవి యిప్పుడు మన కంటి ఎదుట లేకుంటే? అవి నిజమా కాదా...
మన జ్ఞానేంద్రియాలు గ్రహించడానికి వీలుగా, కొన్ని శాస్త్రీయ పరిశోధనల ద్వారా కనుగొన్న పరికరాలున్నాయి. అందులో ఒకటి సూక్ష్మదర్శిని. మరొకటి దూరదర్శిని. మనం చూడలేని సూక్ష్మ జీవులు మనలోనూ, మన చుట్టూ, ప్రకృతి అంతటా వున్నాయి. వీటిలో ఉపయోగకరమైనవీ, మనకు హాని చేసేవీ వున్నాయి. అవి తెలుసుకుని, రోగాలు వచ్చినప్పుడు చికిత్స చేస్తున్నారు. ఉపయోగకరమైన వాటిని వివిధ విధాలుగా వాడుకుంటున్నాం.
ఆకాశంలో మన కంటికి అందని గ్రహాలు, తారలు, ఉల్కలు, శకలాలు, పాలపుంతలు, మరెన్నో వున్నాయి. వాటిని దూరదర్శిని రేడియోస్కోప్, టెలిస్కోప్ వంటి వాటితో తెలుసుకుంటున్నాం. అవన్నీ నిజాలే.
మనం రేడియో వింటున్నాం. టెలివిజన్ చూస్తున్నాం. ఇవి పనిచేయడానికి మామూలు కళ్ళు చూడలేని రేడియో తరంగాలు పనిచేస్తున్నాయి.
భూగర్భంలో ఎన్నో అవశేషాలు లభించాయి. ఇంకా దొరుకుతున్నాయి. వాటిని పరిశీలించడానికి, వయస్సు నిర్ధారించడానికి, అనేక శాస్త్రీయ పద్ధతులు వచ్చాయి. కార్బర్ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. ఆ విధంగా కాలగర్భంలో కలసిన డైనోసార్లు (సరీసృపాలు) వంటివి ఎప్పుడున్నాయి, ఎలా వుండేవి అనేది కొంత వరకు గ్రహించగలిగారు.
కంటికి కనిపించని అనేక వాస్తవాలు. ఆ విధంగా తెలుసుకోగలుగుతున్నాం. శాస్త్రీయ పద్ధతి అడుగడుగునా యిందుకు ఉపయోగపడుతున్నది.
అణువులు, పరమాణువులు, త్రసరేణువులు అంటాం. అవేవీ మన కంటికి కనిపించవు. అవి విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. విధ్వంసం గావించే అణుబాంబులు, ఉపయోగపడే అణుశక్తి అలా వచ్చినవే. ఈ విధంగా వాస్తవ నిర్ధారణ జరుగుతున్నది.
మన శరీరాన్ని గురించి చాలా వివరాలు మనకు తెలియవు. క్రమేణా తెలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ., జీన్స్ మొదలైనవాటి రహస్యాలు గుప్పిట విప్పుకుంటున్నాయి. దీనివలన వైద్యశాస్త్రం చాలా ఉపయోగకరంగా మారింది. హానిని తొలగించుకోడానికి వీలుకలుగుతున్నది.
మరి మాజిక్, మాయ సృష్టి సంగతేమిటి.. వేదాంతులు చెప్పే సంగతులేమిటి?
వాస్తవంలోనుండే మాజిక్ పుట్టింది. వస్తువు లేని మాజిక్ వుండదు. వాటిని కొందరు చూడనప్పుడు, భ్రమలో కొట్టుకపోవడం కద్దు. మాజిక్ ఒక విద్య. అది వినోదం కోసం ప్రయోగిస్తే మంచిదే కాని, ఆధ్యాత్మిక వ్యాపారంగా మార్చేస్తే, అక్కడే మోసాలు, వ్యాపారం గూడుకట్టుకున్నాయి.
మాజిక్ చేసిన అనంతరం, దాని వెనుక వున్న నిజాన్ని విడమరచి కొందరు చెబుతారు. అది చిత్తశుద్ధిగల మానవ స్పందన. మరికొందరు ప్రేక్షకుల బలహీనతను ఆసరాగా తీసుకొని, దైవం, ఆధ్యాత్మిక శక్తి, యిత్యాదులు అల్లేస్తారు. క్రమంగా మోసాల గూడు కడతారు. అది మానవ ద్రోహం.
సైన్స్.లో ఎంతో మాజిక్, మాయవుంది. దానిని పొరలుగా విప్పి చూపుతుంది. అది మానవ ప్రయోజనం.
ప్రకృతిలో జరిగిన జరుగుతున్న క్రమ మార్పుల్ని గ్రహించిన ఛార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పాడు. సహజంగా ఎంపిక చేసుకుంటూ మార్పులు జరిగే తీరు ఓపికగా గ్రహించి, చూపాడు. దీని వెనుక దైవసృష్టి వున్నదంటూ, పవిత్ర గ్రంథాలు రాసి, జనాన్ని మానసిక దాసులుగా మార్చేశారు. వారికి పరిణామ సహజక్రమం పెద్ద యిబ్బందికరం. వారి ఆధ్యాత్మిక వ్యాపారానికి ఆటంకం. కనుక ఎలాగైనా తమ ఉనికి కాపాడుకోటానికి, శాస్త్రీయ నిజాన్ని దైవం ముసుగులో దాచడానికి ముప్పుతిప్పలు పడుతున్నారు. చాలా కాలం, సఫలమయ్యారు. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ నిజాలు ఆ భ్రమల్ని మాయల్ని తొలగిస్తూ పోతున్నది. దీనికి మరెంతో కాలం పట్టొచ్చు. మానవులకు అన్ని విధాలా ఉపయోగపడేది శాస్త్రీయ నిజం అన్ని విధాలా మానసిక దాస్యంలో, మాయ పేరిట ముంచెత్తుతున్నది ఆధ్యాత్మిక వ్యాపారం .;..శాస్త్రీయ సత్యం మానవ విలువలు పోషించగలదు. అది బలపడాలి.
(రిచర్డ్ డాకిన్స్ రచన “మాజిక్ ఆఫ్ రియాలిటీ” ఆధారంగా)
- నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment