మనం ఎక్కడ నుండి వచ్చాం?


మనం ఎక్కడ నుండి వచ్చాం?
నా బాల్య దశలో గమ్మత్తుగా వుండే వాదనలు విన్నాను. ఎవరైనా మొండిగా దేవుడు లేడన్నాడనుకోండి. వుంటే చూపించమన్నాడనుకోండి. అందుకు జవాబుగా యిలా వాదన సాగేది.
నీవెట్లా పుట్టావు?
మా అమ్మనాన్నకు పుట్టాను.
వాళ్లెలా పుట్టారు?
అలా వెనక్కు పోతే, ఎక్కడో ఒకచోట ఆగి, నాకు తెలియదు అనేసరికి, అక్కడే దేవుడు సృష్టించాడంటారు. ఇదీ సృష్టి వాదం. ఆ తరువాత ప్రశ్న లేదు. రుజువులు లేవు. వాదనకు అదే మొదలు. అదే చివర.
కాని అది సరికాదు.
నేడు వైజ్ఞానిక పద్ధతి వచ్చింది. మానవులకు పూర్వీకులు ఎవరో స్పష్టంగానే తేల్చారు. మానవుల పరిణామం ఎలా క్రమంగా సాగిందో రుజువులు లభించాయి.  పరిశోధనలో మానవులకు భిన్న జీవులకు సంబంధాలు బయటకు వచ్చాయి. పరిణామ క్రమం తెలిసింది. ఇందులో నమ్మకాలకు చోటు లేదు. అన్నీ ఆధారాలు గలవే.
అలాంటి అధారాలలో తెలిసిన కీలక అంశం జన్యుశాస్త్రం. జన్యువులు జీవులన్నింటిలోనూ వున్నాయి. అది మానవులకు ప్రత్యేకం కాదు. దీనిని బట్టి మానవుల మొదలు, జంతువులకు, చేపలకు, పక్షులకు, క్రిమికీటకాలకు, సూక్ష్మ జీవులకు సంబంధాలు వెలికి వచ్చాయి.
పరిణామంలో పరిశోధనల ఫలితంగా, శకలాలు, శిథిలాలు, భూగర్భ నిక్షిప్తాలు, ఇంకెన్నో వెలికి వచ్చాయి. వాటిని పరిశీలించే కార్బన్ పరీక్షలు, డి.ఎన్.ఎ. పరీక్షలు వచ్చాయి. రహస్యాలు గుప్పిట విప్పాయి.
పరీక్షలలో బయటకు వచ్చిన పరిణామ రహస్యాలు ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడించాయి. మానవులకు జీవులన్నీ చుట్టాలే అనేది యిందలి సారాంశం. అయితే కొందరు దగ్గర చుట్టాలు కాగా, మరికొందరు దూరపు చుట్టాలు. కానీ చుట్టాలనేది వాస్తవం.
డి.ఎన్.ఎ. కనుగొనడం 20వ శతాబ్దంలో జరిగింది. కనుక చుట్టరికాలు ఆలశ్యంగా తెలియడానికి అదొక కారణం.
డి.ఎన్.ఎ. ఎలా తోడ్పడింది? జన్యు సమాచారం డి.ఎన్.ఎకు. చెందినది. అందులో గర్భింతగా చుట్టజుట్టుకొని సంకేతాలు వున్నాయి. వీటికి క్రోమోజోములని పేరు పెట్టారు. ఇందులో నిక్షిప్తమైన సమాచారం సంకేతాలుగా వున్నది. జీవుల నిర్మాణానికి యీ జన్యువులు సంకేతాలుగా వున్నది. జీవుల నిర్మాణానికి యీ జన్యువులు సంకేత సందేశాలుగా వున్నాయి. ఈ సంకేతాలను ఎ, టి, సి, జి అని నాలుగు అక్షరాలుగా చూపారు.
జన్యువులో వున్న సంకేతాలలో కొన్ని మానవులకు, కొన్ని కోతులకు, కొన్ని ఎలుకలకు చెందినవి కావచ్చు. అన్ని జీవులకు సంకేత పదాలు ఒకటే గనుక, జంతువుల నుండి సూక్ష్మ జీవుల వరకూ మూలాధారం  ఒకటే అనవచ్చు. సంకేతాల సంఖ్యలో మానవులకు, చింపాజీలకు ఎలుకలకు తేడా వుంది.  ఈ విషయం అన్ని జీవులకూ వర్తిస్తుంది. అలా పరిశీలించినప్పుడే, మానవులకు దగ్గరలో చింపాజీలుండడం, ఎలుకలు దూరంగా వుండడం గమనించారు. అంత మాత్రాన మానవులంతా ఒకేతీరు అనడానికి వీల్లేదు. సున్నిత తేడాలు జన్యుపరంగా వున్నాయి.
పాలిచ్చే జంతువులన్నింటిలో కొన్ని జన్యువులు ఒకేతీరులో వుండడం గమనించారు.
సారాంశం ఏమంటే తరతమభేదాలతో మనం అన్ని జీవులలో సంబంధాలు గలవాళ్ళం. ఇలా చెప్పగలుగుతున్నామంటే, కొందరికి ఒళ్ళు జలదరించవచ్చు. మానవులు విశిష్టమైన, శ్రేష్ఠమైన వారన్నప్పుడు, మిగిలిన జీవులతో సంబంధం ఎలా ఒప్పుకుంటారు.
కాని జన్యువులు నిర్థారించే తీరు కాదనడానికి వీల్లేని అంశం.
ఈ జన్యువులతో నిక్షిప్తమైన జన్యుసంకేతాన్ని (కోడ్) తెలియజేస్తున్న శాస్త్రీయ నిఘంటువును కాదనలేం. జన్యువుల గుట్టు విప్పి చూపిన జన్యు సంకేతం ఒక మహత్తర నిఘంటువులాంటిది. ఇది జీవులన్నింటికీ చెందినది.
అందుకే జీవులన్నీ మానవుల చుట్టాలనగలిగాం. కొన్ని దగ్గర, కొన్ని దూరపు చుట్టాలంతే.
డిఎన్ఎ అనే సంకేత పదాన్ని విచ్చలవిడిగా యీ వ్యాసంలో వాడాం. అంటే ఏమిటి?
డియోక్సి రైబో నూక్లిక్ యాసిడ్ అని పూర్తి పదం. ఇది మానవులతో సహా జీవులలో పారంపర్యంగా వచ్చేది. ప్రతికణంలో (సెల్) జీవాణువు వుంటుంది. కణ కేంద్రంలో దీనిని కనుగొనవచ్చు. డిఎన్ఎలో సమాచారం – సంకేతంగా, రసాయనిక మూలంగా వుంటుంది. ఇవి ఎ అని అడినైన్, జి అని గానైన్ (Ganine), సైటో సైన్ (సి) తై మైన్ (టి) అనే నాలుగు రసాయనాలతో వుంటుంది. మానవులలో మూడు బిలియన్ డిఎన్ఎ మూలాలు వుంటాయి. ఇవి మానవులందరిలో యించుమించు ఒక్క తీరులో వుండగా, స్వల్ప తేడాలు కనబరుస్తున్నాయి. జీవ నిర్మాణానికి వీటి క్రమమే తోడ్పడుతున్నది. ఇందులో ఎ, టి లు జత కడతాయి. సి, జి లు జత కడతాయి. ఇది నిచ్చెన మెట్ల ఆకారంలో కనిపిస్తుంది. డిఎన్ఎ తనను తాను విభజించుకుంటూ ఒక దానికి పోలిన మరొకటి ఏర్పడుతుంది.
డి.ఎన్.ఎ. ను 1950 ప్రాంతాలలో పూర్తి వివరాలతో విడమరచి చెప్పగలిగారు. అప్పటి నుండి జన్యు శాస్త్రం పెద్ద మార్పు తెచ్చింది. డి.ఎన్.ఎ. పెద్దది గనుక పెద్ జీవాణువు అనవచ్చు. దీనిని సులభంగా పరీక్షించవచ్చు. స్కూలు స్థాయి నుండీ డి.ఎన్.ఎ. పరిశీలన పద్ధతులు విద్యార్థులకు నేర్పాలి. జీవాణువుల సంకేతాలన్నీ విప్పుకుంటూ పోతుంటే, పుట్టక సమయంలో ఎలాంటి రోగాలు రానున్నాయో తెలిసే అవకాశం వుంది. కనుక నిరోధించే ప్రయోగాలు చేబట్టవచ్చు. ఇది జనోం సైన్స్ విప్లవం.
Innaiah Narisetti

No comments:

Post a Comment