సూక్ష్మ రహస్యాలు


సూక్ష్మ రహస్యాలు
కంటికి కనిపించే దుమ్ము ధూళి పూర్వం నుండీ నేటి వరకూ అందరూ చూస్తున్నదే. దుమ్ము పీల్చకుండా ముక్కుకు బట్ట అడ్డం పెట్టుకుంటారు. మనకు కనిపించే ఏ వస్తువునైనా ముక్కలుగా చేస్తూ పోతే, అతి చిన్నవిగా చేయవచ్చు. ఒక దశలో అంతకు మించి యిక చిన్నవి చేయలేం అనిపిస్తుంది.
పూర్వం గ్రీకులు యీ సూక్ష్మ విభజన ఆలోచించారు. డెమోక్రటిక్ తాత్వికుడు యీ విషయం పరిశీలించాడు. ఒక దశ వరకే విభజించగలం అన్నాడు. అణువులు గురించి ఆలోచించారు.
దుమ్ము ధూళి అన్నాం కదా. దుమ్ము రేణువుల కణాలు కంటికి కనిపించవు. అంత చిన్న కణాలలో సూక్ష్మ క్రిములుంటాయంటే నమ్మలేం. కాని వుంటాయి. అలాంటి సూక్ష్మ క్రిములకంటే యింకా చిన్నవి అణువులు.
సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అని అన్ని మతాల వారు నమ్మే దేవుళ్ళు చెప్పినవే పవిత్ర గ్రంథాలన్నారు గదా. అయినా వాటిలో సూక్ష్మ జీవుల ప్రస్తావన లేదు. అలా దేవుళ్ళకు కనిపించని జీవులు విశ్వవ్యాప్తంగా వున్నాయి.
శాస్త్రజ్ఞులు యీ సూక్ష్మ జీవుల్ని పరిశీలించి తెలుసుకున్నారు. మనకు చెప్పారు. ఇంకా కొత్తగా బయటపడుతున్న వాటి గురించి ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే వున్నారు.
విశ్వమంతటా ఘన, ద్రవ, గాస్ పదార్థాలున్నాయి.
ప్రకృతిలో యించుమించు 90 మూల ఎలిమెంట్స్ వున్నాయి. మరో 10కి పైగా పరిశోధనాలయాలలో కనుగొన్నారు. ఆక్సిజన్, హైడ్రోజన్, ఇనుము, ఇత్తడి, బంగారం, బొగ్గు పాదరసం యివన్నీ పదార్థాలే. వీటి అణువులు కలుస్తాయి. మనం పీల్చే ఆక్సిజన్ రెండు అణువుల సముదాయం.
అణువుల్ని పరిశీలించి అనేక విశేషాలు కనుగొన్నారు. ఇది ఇంకా సాగుతూనే వుంది. అణు విభజన వలన అందులో ప్రొటాన్లు, న్యూట్రాన్లు వున్నాయని తెలిసింది. ఎలక్ట్రాన్స్ సంగతి తెలుసుకున్నారు. విధ్వంసక ఆయుధం వంటి ఆటంబాంబులు ప్రజోపయోగకరమైన అణుశక్తి కూడా కనుగొన్నారు. కార్బన్ ఉపయోగాలు ఎన్నో బయట పడ్డాయి. రసాయన శాస్త్రంలో కార్బన్ కు ప్రత్యేకత వుంది. దీనిని ఆర్గానిక్ విభజన అన్నారు. జీవంకు మూలం యీ జీవ రసాయనికమే.
తరచి చూస్తుంటే సూక్ష్మలోక రహస్యాలు అనంతంగా బయట పడుతున్నాయి. విశ్వవ్యాప్తంగా పదార్థం అంతా ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్స్ అనే మూడింటితో నిండి వుంది. ఇదంతా మాయగా అనిపిస్తుంది. కాని వాస్తవం.
(సుప్రసిద్ధ పరిణామ శాస్త్రజ్ఞుడు రిచర్డ్ డాకిన్స్ యిప్పుడే వెలువరించిన ది మాజిక్ ఆఫ్ రియాలిటీ ఆధారంగా నరిసెట్టి ఇన్నయ్య రచన).

మనం ఎక్కడ నుండి వచ్చాం?


మనం ఎక్కడ నుండి వచ్చాం?
నా బాల్య దశలో గమ్మత్తుగా వుండే వాదనలు విన్నాను. ఎవరైనా మొండిగా దేవుడు లేడన్నాడనుకోండి. వుంటే చూపించమన్నాడనుకోండి. అందుకు జవాబుగా యిలా వాదన సాగేది.
నీవెట్లా పుట్టావు?
మా అమ్మనాన్నకు పుట్టాను.
వాళ్లెలా పుట్టారు?
అలా వెనక్కు పోతే, ఎక్కడో ఒకచోట ఆగి, నాకు తెలియదు అనేసరికి, అక్కడే దేవుడు సృష్టించాడంటారు. ఇదీ సృష్టి వాదం. ఆ తరువాత ప్రశ్న లేదు. రుజువులు లేవు. వాదనకు అదే మొదలు. అదే చివర.
కాని అది సరికాదు.
నేడు వైజ్ఞానిక పద్ధతి వచ్చింది. మానవులకు పూర్వీకులు ఎవరో స్పష్టంగానే తేల్చారు. మానవుల పరిణామం ఎలా క్రమంగా సాగిందో రుజువులు లభించాయి.  పరిశోధనలో మానవులకు భిన్న జీవులకు సంబంధాలు బయటకు వచ్చాయి. పరిణామ క్రమం తెలిసింది. ఇందులో నమ్మకాలకు చోటు లేదు. అన్నీ ఆధారాలు గలవే.
అలాంటి అధారాలలో తెలిసిన కీలక అంశం జన్యుశాస్త్రం. జన్యువులు జీవులన్నింటిలోనూ వున్నాయి. అది మానవులకు ప్రత్యేకం కాదు. దీనిని బట్టి మానవుల మొదలు, జంతువులకు, చేపలకు, పక్షులకు, క్రిమికీటకాలకు, సూక్ష్మ జీవులకు సంబంధాలు వెలికి వచ్చాయి.
పరిణామంలో పరిశోధనల ఫలితంగా, శకలాలు, శిథిలాలు, భూగర్భ నిక్షిప్తాలు, ఇంకెన్నో వెలికి వచ్చాయి. వాటిని పరిశీలించే కార్బన్ పరీక్షలు, డి.ఎన్.ఎ. పరీక్షలు వచ్చాయి. రహస్యాలు గుప్పిట విప్పాయి.
పరీక్షలలో బయటకు వచ్చిన పరిణామ రహస్యాలు ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడించాయి. మానవులకు జీవులన్నీ చుట్టాలే అనేది యిందలి సారాంశం. అయితే కొందరు దగ్గర చుట్టాలు కాగా, మరికొందరు దూరపు చుట్టాలు. కానీ చుట్టాలనేది వాస్తవం.
డి.ఎన్.ఎ. కనుగొనడం 20వ శతాబ్దంలో జరిగింది. కనుక చుట్టరికాలు ఆలశ్యంగా తెలియడానికి అదొక కారణం.
డి.ఎన్.ఎ. ఎలా తోడ్పడింది? జన్యు సమాచారం డి.ఎన్.ఎకు. చెందినది. అందులో గర్భింతగా చుట్టజుట్టుకొని సంకేతాలు వున్నాయి. వీటికి క్రోమోజోములని పేరు పెట్టారు. ఇందులో నిక్షిప్తమైన సమాచారం సంకేతాలుగా వున్నది. జీవుల నిర్మాణానికి యీ జన్యువులు సంకేతాలుగా వున్నది. జీవుల నిర్మాణానికి యీ జన్యువులు సంకేత సందేశాలుగా వున్నాయి. ఈ సంకేతాలను ఎ, టి, సి, జి అని నాలుగు అక్షరాలుగా చూపారు.
జన్యువులో వున్న సంకేతాలలో కొన్ని మానవులకు, కొన్ని కోతులకు, కొన్ని ఎలుకలకు చెందినవి కావచ్చు. అన్ని జీవులకు సంకేత పదాలు ఒకటే గనుక, జంతువుల నుండి సూక్ష్మ జీవుల వరకూ మూలాధారం  ఒకటే అనవచ్చు. సంకేతాల సంఖ్యలో మానవులకు, చింపాజీలకు ఎలుకలకు తేడా వుంది.  ఈ విషయం అన్ని జీవులకూ వర్తిస్తుంది. అలా పరిశీలించినప్పుడే, మానవులకు దగ్గరలో చింపాజీలుండడం, ఎలుకలు దూరంగా వుండడం గమనించారు. అంత మాత్రాన మానవులంతా ఒకేతీరు అనడానికి వీల్లేదు. సున్నిత తేడాలు జన్యుపరంగా వున్నాయి.
పాలిచ్చే జంతువులన్నింటిలో కొన్ని జన్యువులు ఒకేతీరులో వుండడం గమనించారు.
సారాంశం ఏమంటే తరతమభేదాలతో మనం అన్ని జీవులలో సంబంధాలు గలవాళ్ళం. ఇలా చెప్పగలుగుతున్నామంటే, కొందరికి ఒళ్ళు జలదరించవచ్చు. మానవులు విశిష్టమైన, శ్రేష్ఠమైన వారన్నప్పుడు, మిగిలిన జీవులతో సంబంధం ఎలా ఒప్పుకుంటారు.
కాని జన్యువులు నిర్థారించే తీరు కాదనడానికి వీల్లేని అంశం.
ఈ జన్యువులతో నిక్షిప్తమైన జన్యుసంకేతాన్ని (కోడ్) తెలియజేస్తున్న శాస్త్రీయ నిఘంటువును కాదనలేం. జన్యువుల గుట్టు విప్పి చూపిన జన్యు సంకేతం ఒక మహత్తర నిఘంటువులాంటిది. ఇది జీవులన్నింటికీ చెందినది.
అందుకే జీవులన్నీ మానవుల చుట్టాలనగలిగాం. కొన్ని దగ్గర, కొన్ని దూరపు చుట్టాలంతే.
డిఎన్ఎ అనే సంకేత పదాన్ని విచ్చలవిడిగా యీ వ్యాసంలో వాడాం. అంటే ఏమిటి?
డియోక్సి రైబో నూక్లిక్ యాసిడ్ అని పూర్తి పదం. ఇది మానవులతో సహా జీవులలో పారంపర్యంగా వచ్చేది. ప్రతికణంలో (సెల్) జీవాణువు వుంటుంది. కణ కేంద్రంలో దీనిని కనుగొనవచ్చు. డిఎన్ఎలో సమాచారం – సంకేతంగా, రసాయనిక మూలంగా వుంటుంది. ఇవి ఎ అని అడినైన్, జి అని గానైన్ (Ganine), సైటో సైన్ (సి) తై మైన్ (టి) అనే నాలుగు రసాయనాలతో వుంటుంది. మానవులలో మూడు బిలియన్ డిఎన్ఎ మూలాలు వుంటాయి. ఇవి మానవులందరిలో యించుమించు ఒక్క తీరులో వుండగా, స్వల్ప తేడాలు కనబరుస్తున్నాయి. జీవ నిర్మాణానికి వీటి క్రమమే తోడ్పడుతున్నది. ఇందులో ఎ, టి లు జత కడతాయి. సి, జి లు జత కడతాయి. ఇది నిచ్చెన మెట్ల ఆకారంలో కనిపిస్తుంది. డిఎన్ఎ తనను తాను విభజించుకుంటూ ఒక దానికి పోలిన మరొకటి ఏర్పడుతుంది.
డి.ఎన్.ఎ. ను 1950 ప్రాంతాలలో పూర్తి వివరాలతో విడమరచి చెప్పగలిగారు. అప్పటి నుండి జన్యు శాస్త్రం పెద్ద మార్పు తెచ్చింది. డి.ఎన్.ఎ. పెద్దది గనుక పెద్ జీవాణువు అనవచ్చు. దీనిని సులభంగా పరీక్షించవచ్చు. స్కూలు స్థాయి నుండీ డి.ఎన్.ఎ. పరిశీలన పద్ధతులు విద్యార్థులకు నేర్పాలి. జీవాణువుల సంకేతాలన్నీ విప్పుకుంటూ పోతుంటే, పుట్టక సమయంలో ఎలాంటి రోగాలు రానున్నాయో తెలిసే అవకాశం వుంది. కనుక నిరోధించే ప్రయోగాలు చేబట్టవచ్చు. ఇది జనోం సైన్స్ విప్లవం.
Innaiah Narisetti

ఏది మాయ ? ఏది నిజం ?



వేదాంతి వెంట ఒక ఏనుగు తరుముతుంటే, అతడు తప్పించుకోడానికి పరిగెడుతున్నాడు. అప్పుడు అతనికి ఎదురైన ఒక సామాన్యుడు. :
స్వామీ అంతా మాయ అన్నారుగదా మరి ఏనుగు మిథ్య అయితే తమరు పరుగెత్తడం దేనికి అని సందేహం వెలిబుచ్చాడు. గోచీ చేతబుచ్చుకుని రొప్పుతూ, పరిగెత్తడం కూడా మిథ్యే నాయనా అన్నాడట !
ఇంతకూ ఏది నిజం ? ఏది మాజిక్ ?
ఉన్నదంతా నిజం. అంటే సరిపోతుందా? మన ఎదుట లేకుండా, పరిణామక్రమంలో అంతరించాయన్న సరీసృపాలు (డైనాసార్లు) ఆకాశంలో కొన్ని తారల మాటేమిటి? అవి యిప్పుడు మన కంటి ఎదుట లేకుంటే? అవి నిజమా కాదా...
మన జ్ఞానేంద్రియాలు గ్రహించడానికి వీలుగా, కొన్ని శాస్త్రీయ పరిశోధనల ద్వారా కనుగొన్న పరికరాలున్నాయి. అందులో ఒకటి సూక్ష్మదర్శిని. మరొకటి దూరదర్శిని. మనం చూడలేని సూక్ష్మ జీవులు మనలోనూ, మన చుట్టూ, ప్రకృతి అంతటా వున్నాయి. వీటిలో ఉపయోగకరమైనవీ, మనకు హాని చేసేవీ వున్నాయి. అవి తెలుసుకుని, రోగాలు వచ్చినప్పుడు చికిత్స చేస్తున్నారు. ఉపయోగకరమైన వాటిని వివిధ విధాలుగా వాడుకుంటున్నాం.
ఆకాశంలో మన కంటికి అందని గ్రహాలు, తారలు, ఉల్కలు, శకలాలు, పాలపుంతలు, మరెన్నో వున్నాయి. వాటిని దూరదర్శిని రేడియోస్కోప్, టెలిస్కోప్ వంటి వాటితో తెలుసుకుంటున్నాం. అవన్నీ నిజాలే.
మనం రేడియో వింటున్నాం. టెలివిజన్ చూస్తున్నాం. ఇవి పనిచేయడానికి మామూలు కళ్ళు చూడలేని రేడియో తరంగాలు పనిచేస్తున్నాయి.
భూగర్భంలో ఎన్నో అవశేషాలు లభించాయి. ఇంకా దొరుకుతున్నాయి. వాటిని పరిశీలించడానికి, వయస్సు నిర్ధారించడానికి, అనేక శాస్త్రీయ పద్ధతులు వచ్చాయి. కార్బర్ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. ఆ విధంగా కాలగర్భంలో కలసిన డైనోసార్లు (సరీసృపాలు) వంటివి ఎప్పుడున్నాయి, ఎలా వుండేవి అనేది కొంత వరకు గ్రహించగలిగారు.
కంటికి కనిపించని అనేక వాస్తవాలు. ఆ విధంగా తెలుసుకోగలుగుతున్నాం. శాస్త్రీయ పద్ధతి అడుగడుగునా యిందుకు ఉపయోగపడుతున్నది.
అణువులు, పరమాణువులు, త్రసరేణువులు అంటాం. అవేవీ మన కంటికి కనిపించవు. అవి విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. విధ్వంసం గావించే అణుబాంబులు, ఉపయోగపడే అణుశక్తి అలా వచ్చినవే. ఈ విధంగా వాస్తవ నిర్ధారణ జరుగుతున్నది.
మన శరీరాన్ని గురించి చాలా వివరాలు మనకు తెలియవు. క్రమేణా తెలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ., జీన్స్ మొదలైనవాటి రహస్యాలు గుప్పిట విప్పుకుంటున్నాయి. దీనివలన వైద్యశాస్త్రం చాలా ఉపయోగకరంగా మారింది. హానిని తొలగించుకోడానికి వీలుకలుగుతున్నది.
మరి మాజిక్, మాయ సృష్టి సంగతేమిటి.. వేదాంతులు చెప్పే సంగతులేమిటి?
వాస్తవంలోనుండే మాజిక్ పుట్టింది. వస్తువు లేని మాజిక్ వుండదు. వాటిని కొందరు చూడనప్పుడు, భ్రమలో కొట్టుకపోవడం కద్దు. మాజిక్ ఒక విద్య. అది వినోదం కోసం ప్రయోగిస్తే మంచిదే కాని, ఆధ్యాత్మిక వ్యాపారంగా మార్చేస్తే, అక్కడే మోసాలు, వ్యాపారం గూడుకట్టుకున్నాయి.
మాజిక్ చేసిన అనంతరం, దాని వెనుక వున్న నిజాన్ని విడమరచి కొందరు చెబుతారు. అది చిత్తశుద్ధిగల మానవ స్పందన. మరికొందరు ప్రేక్షకుల బలహీనతను ఆసరాగా తీసుకొని, దైవం, ఆధ్యాత్మిక శక్తి, యిత్యాదులు అల్లేస్తారు. క్రమంగా మోసాల గూడు కడతారు. అది మానవ ద్రోహం.
సైన్స్.లో ఎంతో మాజిక్, మాయవుంది. దానిని పొరలుగా విప్పి చూపుతుంది. అది మానవ ప్రయోజనం.
ప్రకృతిలో జరిగిన జరుగుతున్న క్రమ మార్పుల్ని గ్రహించిన ఛార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పాడు. సహజంగా ఎంపిక చేసుకుంటూ మార్పులు జరిగే తీరు ఓపికగా గ్రహించి, చూపాడు. దీని వెనుక దైవసృష్టి వున్నదంటూ, పవిత్ర గ్రంథాలు రాసి, జనాన్ని మానసిక దాసులుగా మార్చేశారు. వారికి పరిణామ సహజక్రమం పెద్ద యిబ్బందికరం. వారి ఆధ్యాత్మిక వ్యాపారానికి ఆటంకం. కనుక ఎలాగైనా తమ ఉనికి కాపాడుకోటానికి, శాస్త్రీయ నిజాన్ని దైవం ముసుగులో దాచడానికి ముప్పుతిప్పలు పడుతున్నారు. చాలా కాలం, సఫలమయ్యారు. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ నిజాలు ఆ భ్రమల్ని మాయల్ని తొలగిస్తూ పోతున్నది. దీనికి మరెంతో కాలం పట్టొచ్చు. మానవులకు అన్ని విధాలా ఉపయోగపడేది శాస్త్రీయ నిజం అన్ని విధాలా మానసిక దాస్యంలో, మాయ పేరిట ముంచెత్తుతున్నది ఆధ్యాత్మిక వ్యాపారం .;..శాస్త్రీయ సత్యం మానవ విలువలు పోషించగలదు. అది బలపడాలి.
(రిచర్డ్ డాకిన్స్ రచన “మాజిక్ ఆఫ్ రియాలిటీ” ఆధారంగా)
-         నరిసెట్టి ఇన్నయ్య

Rare article of G VKrishnarao


రాయిజం
శ్రీ  జి.వి.కృష్ణారావు
(ఈ వ్యాసాన్ని మహతి పత్రికలో- వాసిరెడ్డి వెంకట సుబ్బయ్య సంపాదకుడుగా - తెనాలి నుండి రాశారు. ఆయన పండిత కవి. ఆయన సంస్కృతం నుండి తెలుగులోనికి అనువదించిన శృంగార కావ్యానికి ఆవుల గోపాల కృష్ణమూర్తి పీఠికి రాశారు.
యం.ఎన్.రాయ్ జైలు నుండి విడుదలై కాంగ్రెసు రాజకీయాలలోకి ప్రవేశించిన తొలి రోజులలో రాసిన వ్యాసం ఇది. జి.వి.కృష్ణారావు అప్పుడే కాలేజీలోకు ప్రవేశించాడు. విద్యార్థిగా రాయ్ భావాల ప్రభావంతో  ఈ వ్యాసం రాశారు. దీనికి గల చారిత్రక ప్రాధాన్యత వలన ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. జి.వి. కృష్ణరావు ఆ తరువాత రచయితగా రాయ్ అనుచరుడుగా పేరు పొందాడు.)
కాంగ్రెసు పార్టీలో సోషలిస్టు పార్టీ ఉండటం వల్ల సోషలిస్టు సిద్ధాంతాలకు హాని కలుగుతుంది. కాంగ్రెసును బలపరచటానికి మాత్రము కాంగ్రెసులో ఉండవలసిన అగత్యం సోషలిస్టు పార్టీకి లేదు. అలా కాంగ్రెసులో రెండో పార్టీ ఉండటంవల్ల కాంగ్రెసుకు బలం కలగటానికి బదులు బలహీనత ఏర్పడుతుంది. కాంగ్రెసు వెలుపల ఖచ్చితమైన కమ్యూనిస్టు పార్టీ ఉండవలసిందే. దాన్ని రాయి ఒప్పుకుంటున్నాడు. దానిలో సభ్యుడవుతానంటున్నాడు. బయట సోషలిస్టు పార్టీలో సభ్యుడైన ప్రతివాడూ కాంగ్రెసులో సభ్యుడు కావాలి. పరిపూర్ణంగా కాంగ్రెసు సభ్యుడు లాగానే ప్రవర్తించాలి. అంటే, సోషలిస్టు కార్యక్రమాన్ని కాంగ్రెసు చేత ఆమోదింపజేయాలని కాదు. కాంగ్రెసు లెఫ్టువింగ్ ను నడిపించే శక్తిగా ఉండి అవసరమైతే నాయకత్వం వహించి కాంగ్రెసును రాడికలైజు చేయాలి. అంతేగాని కాంగ్రెసు పార్టీలో సోషలిస్టు పార్టీ ఉండటానికి వీలులేదని రాయి ఈ కారణాల్ని చూపుతున్నాడు—
1.             సిద్ధాంతరీత్యా పొరపాటు (Theoritical blunder)
ఈ రోజున సోషలిజం అంటే కాపిటలిజానికి, సామ్రాజ్య తత్వానికి వ్యతిరేకంగా తీవ్ర విప్లవ సంఘర్షణను వదలుకొని, విప్లానిక ప్రజా బాహుళ్యము యొక్క కార్యక్రమాల ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకోడమన్నమాట. కాబట్టి తమ అధికారాన్ని చలాయించుకోటానికి బూర్జువాయిజ్ దేన్ని సాధనంగా చేసుకొన్నదో,  ఆ పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని బలపరచడమే దీని భావము. సోషలిస్టు పార్టీ, సంస్కారాన్ని తలపెట్టేదే గాని విప్లవాన్ని తలపెట్టదు. ఉన్నటువంటి సాంఘిక స్థితిని వ్యత్యస్తం చేసి వర్గరహితమైన సంఘాన్ని స్థాపించే సాధనం కాదు.
ఇలాటి పక్షం వల్ల హిందూ దేశానికి ప్రయోజనం లేదు. దేశము యొక్క రాజకీయ ఆర్థిక రంగంలో దీనికి స్థానమే లేదు. సంస్కారికమైనటువంటిన్నీ అవిప్లవానికమైనటువంటి స్వభావము వల్ల సోషలిస్టు పార్టీ స్వాతంత్ర్యం కోసం జరిగే సంఘర్షణలో సాధనం కాజాలదు. కృషిక వర్గాన్ని ప్రబోధించి, ఆర్గనైజ్ చేసి విప్లవములోకి దిగకుండా కాపిటలిస్టు విధానంలోనే ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని క్రమంగా చక్కపరుచుకోటానికి సహాయపడి నడుపుతుంది అన్న కారణం ఒకటే ఈ పక్షం కావటానికి పనికివస్తుంది. ఈ కారణం కూడా హిందూ దేశంలో దుర్బలమవుతుంది. ఎందుకంటే ఐరోపా అమెరికాలలో మాదిరిగా కాపిటలిస్టు విధానం బాగా అభివృద్ధిలో వున్నప్పుడే, కృషిక వర్గం కేపిటలిస్టు సంఘంలోనే ఉండి తన పరిస్థితుల్ని అభివృద్ధి చేసుకోగలుగుతుంది. కృషిక వర్గం ప్రజాస్వామికమైన రాజకీయపు హక్కుల్ని చలాయించటం వల్ల క్రమక్రమంగా ప్రభుత్వం యొక్క లక్షణాన్ని మార్చవచ్చు ననుకొంటున్నారు. దీనికి ప్రజాస్వామిక ప్రభుత్వమిదివరకే ఉండాలి. ప్రజాస్వామిక ప్రభుత్వమిదివరకే ఉండాలి. ప్రజాస్వామిక ప్రభుత్వమూ, విజృంభించియున్న కాపిటలిజమూ,  రెండూ హిందూదేశంలో లేవు. కాబట్టి ఈ దేశంలో సోషలిస్టు పార్టీ ఉండటానికి వీలులేదు. కాపిటలిస్టు అభివృద్ధికి ఆటంకం లేనటువంటి దేశాల్లో రిఫార్మిష్టు, సోషలిస్టు పార్టీలుంటవి. కాని బానిసత్వంలో ఉన్న మనదేశంలాంటి వలస రాజ్యములలో ఉంటానికి వీలులేదు. బూర్జువాయిజీ హక్కుల్ని ఇవ్వగల్గే స్థితిలో ఉన్నప్పుడే, సంస్కరణ, జన బాహుళ్యాన్ని తప్పుత్రోవని పెడుతుంది.
Further, the decay of Capitalism as a world force has pronounced the death sentence over Socialism (Reformists) and consequently on Socialist parties.
ఐరోపాలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీలు పడిపోవటం మంచి పాఠం నేర్పుతోంది.
ఇదివరకు కంటె తీవ్రప్రయత్నాలతో సోషలిస్టు పార్టీని సాగించినా అది సోషలిస్టు పార్టీగా నడవదు. నడవటానికి కమ్యూనిస్టు పార్టీగా గాని, లేక ప్రజాస్వామిక విప్లవపక్షంగా గాని పనిచేయాలి. రెండూ చారిత్రకంగా అవసరం. రెంటికి సాంఘిక ప్రోద్బలముంది. అట్లాంటప్పుడు అపోహ గలిగించే పార్టీని ఎందుకు ఏర్పరచాలి? నిష్ప్రయోజకమైన జెండా క్రింద ఎందుకు నడపాలి? ఇదివరకు చేసిన ప్రయత్నాకంటె కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి ప్రజాబాహుళ్యం యొక్క సహాయం ఎక్కువగా ఉంది. ప్రజాబాహుళ్యము యొక్క ఉద్యమం వల్లనే  ఈ పక్షం బయలుదేరిందంటే అతిశయోక్తి అవుతుంది. ఇదివరకు ప్రయత్నాలకంటే ఈ ప్రయత్నంలోని ప్రత్యేకత ఏమిటంటే, వర్గవిభేదం కలిగించటం, కాంగ్రెస్ రాడికలైజ్ కావటం ఇది సూచిస్తుంది. కాంగ్రెస్ చేసే తీవ్రసాంఘిక రాజకీయ ప్రయత్నాల్ని ఇది పూర్ణంగా సూచించటం లేదు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ప్రజల్ని కమ్యూనిస్టు ధ్వజం క్రిందకు చేర్చడం ప్రజల ఆదర్శానికి చాలా ముందు పోవడం అవుతుంది.
చారిత్రకంగా అర్థవంతమైన సోషలిస్టు పార్టీగా కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ఉండదలిస్తే, జాతీయవాదులైన జనాన్ని రాడికలైజ్ చేయడానికి సహాయపడక పైగా అడ్డు తగులుతుంది. రాడికలైజేషన్ అంటే దోపిడీ చేయబడుతున్న వర్గాలలో విప్లవ చైతన్యాన్ని వేగిరించడం. దీనివల్ల సామ్రాజ్యతత్వంతో పోరాడటానికి ముందంజ వేయటం జరుగుతుంది. ఈ రాడికలైజేషన్ సోషలిస్టు పార్టీ నాయకత్వమున యెన్నటికీ జరుగదు. ఎందుకంటే, శ్రమత్వం (Gradualism) ఈ పక్షము యొక్క ముఖ్య నియమము, సోషలిస్టు పార్టీ అవలంబించే విధానమూ తంత్రమూ క్రమత్వ సిద్ధాంతం మీదనే నడవాలి. ముక్తసరిగా చెప్పాలంటే, ఇండియాలో సామ్రాజ్య తత్వానికి వ్యతిరేకంగా పోట్లాడవలసిన ఉద్యమం, సంస్కారరీత్యా, క్రమంగా ముందుకు పోవటం  అనే ఆవిప్లవ సిద్ధాంతానికి పాల్పడిన సోషలిస్టు పార్టీ నాయకత్వాన నడవటానికి వీలు లేదు.
2.             రాజకీయంగా పొరపాటు (Political Blunder)
ప్రస్తుతము విదేశ సామ్రాజ్య తత్వం అవిప్లావికమైనటువంటి జాతీయమైన ఫ్రీ కాపిటలిస్టు సంఘానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉంది. జాతీయ స్వాతంత్ర్యం సంపాదించటం, నిరాఘాటంగా సాంఘిక ఆర్థిక నాగరికతాభ్యుదయానికి వలసిన పరిస్థితులను కలిపించటం, ఇప్పటికి కర్తవ్యం. కాబట్టి విప్లవ ప్రజాస్వామికమైన సామ్రాజ్యమునకు వ్యతిరేకమైన శక్తులు కూడటానికి సాంఘిక బలాన్ని పురస్కరించుకొని ఒక పక్షము తన ప్రబోధన విధానం, వ్యవస్థాపక పద్ధతి మార్చుకోవాలి. అట్లాంటి పార్టీ సోషలిస్టు పార్టీ కాదు. సోషలిస్టు కార్యక్రమాన్ని స్వీకరించటానికి యీ పరిస్థితుల్లో వీలులేదు.
3.                తంత్ర రీత్యా పొరపాటు (Technical Blunder)
కాంగ్రెస్ పార్టీని సోషలిస్టు పార్టీ కార్యక్రమం స్వీకరింపచేయటం వట్టి భ్రాంతి. ఒక రాజకీయ పక్ష కార్యక్రమాన్ని ఇంకొక పక్షంచేత స్వీకరింపచేయటం ఎప్పుడూ పడదు. ఆ విషయం ఆ పక్షము యొక్క కార్యక్రమం సోషలిజమ్. నేషనల్ కాంగ్రెస్ యొక్క సాంఘిక ఆధారం (Social Basis) దానికన్న విశాలమైనది. ఆచార్య రీత్యా కాంగ్రెస్ హిందూదేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడేటటువంటి పక్షము ఐనా, ఇప్పటి వరకూ దాని కార్యక్రమమూ, విధానమూ, నాయకత్వము యొక్క సాంఘిక లక్షణాన్ని బట్టి మారినవి. జాతీయ స్వాతంత్ర్య సంఘర్షణలో గట్టిగా పనిచేస్తే విప్లవ ప్రజాస్వామిక కార్యక్రమాన్ని కాంగ్రెసు అనుసరించవలసి ఉంది. ఏ పరిస్థితులలోనైనా సోషలిస్టు పార్టీ కార్యక్రమాన్ని స్వీకరించేటంతదూరం పోదు. కాంగ్రెసు ప్రజాస్వామిక జాతీయ విప్లవము యొక్క కార్యక్రమాన్ని స్వీకరించకుండా ఉండటానికి (దీనివల్ల ప్రీ కాపిటలిస్టు సాంఘిక సంబంధాల్ని ధ్వంసం చేయడం చేత సాంఘిక విప్లవం కలుగుతుంది) కరాచీ తీర్మానము లాంటి మూడో రాడికల్ కార్యక్రమమును నామక: ఆమోదించవచ్చును. దీనివల్ల లాహోరులో జరిగిన స్వాతంత్ర్య తీర్మానములో కనబడుతున్న రాడికలైజేషన్ విధానాన్ని ప్రక్కకు త్రోసివేయడం జరుగుతోంది.
సాంఘిక చారిత్రక కారణాలవల్ల కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు కార్యక్రమాన్ని స్వీకరింపజాలదు. కాబట్టి దానికేమాత్రము ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం చేసేవారు చీలిపోవలసి వుంటుంది. ఈ దురదృష్ట అవస్థ కొంతవరకు  ఈవరకే కలిగింది. దీన్ని మిగిలిపోకముందే సవరించుకోవాలి. కాంగ్రెసు సోషలిస్టు పార్టీ అవలంబించే విధానాన్ని మార్చుకోకపోతే రాడికల్ ప్రజాస్వామిక ఉద్దేశాల ద్వారా కాంగ్రెసును స్వాధీనం చేసుకోటం జరుగదు. కాంగ్రెసులో రాడికల్స్ చిన్న సంఘంగానే వేరుపడటం జరుగుతుంది. రైట్ వింగ్ అధికారాన్ని చెలాయిస్తుంది. కాంగ్రెసు నాయకత్వము కోసం పోరాడవలసింది సోషలిజం జెండా క్రింద కాదు, ప్రజాస్వామిక జాతీయ విప్లవము ద్వారా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రాడికల్ జాతీయ విప్లావిక లక్షణాల ద్వారా కాంగ్రెసును స్వాధీనం చేసుకోగోరుతున్నది. కానీ కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ద్వారా మాత్రం కాదు.
కాంగ్రెసులో ఖచ్చితమైన సోషలిస్టులు సోషలిజం అంటే అభిమానమున్నవారు ఉన్నారు. వీరికి ప్రత్యేకమైన పార్టీ గావాలని ఉంటుంది. ఆ పార్టీ సోషలిస్టు పార్టీ కాదు. కమ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీ చారిత్రకంగా అవసరమైనా, రాజకీయంగా ప్రాముఖ్యత వున్నా, బహిరంగంగా కాంగ్రెసు నాయకత్వానికి ప్రయత్నించజాలదు. జాతీయ ప్రజాస్వామిక శక్తుల్ని ఆకర్షించే కేంద్రంగా మాత్రమే పనిచేయవలసి ఉంటుంది. కమ్యూనిస్టులు కాంగ్రెసుకు వెలుపల స్వతంత్ర పక్షాన్ని ఏర్పరచుకొని కాంగ్రెసు పార్టీలో లెఫ్టువింగు మెంబర్లై కాంగ్రెసు విధానాన్ని మార్చి నడపగలుగుతారు. కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ఒకవేళ కాంగ్రెసు నాయకత్వాన్నిదేశపరిస్థితులకనుగుణ్యంగా కార్యక్రమాన్ని అవలంబించి స్వాధీనం చేసుకోగలుగుతుంది కానీ, సోషలిస్టు కార్యక్రమం క్రింద కాదు. పైగా విప్లవ ప్రజాస్వామిక  కార్యక్రమానికి సోషలిస్టు కార్యక్రమం అని పేరు పెట్టటానికి అర్థం యథార్థమైన సోషలిస్టు కార్యక్రమాన్ని వదిలిపెట్టటం అవుతుంది. ఒకే పార్టీ విభిన్నమైన సోషలిజం యొక్క రెండు రకాలను ప్రచారం చేయజాలదు. జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని సోషలిజం అంటే, యదార్థమైన సోషలిజాన్ని త్రోసివేయాలి. కాబట్టి కాంగ్రెసు సోషలిస్టు పార్టీ సోషలిజం జెండాను ఎగురవేయటానికి కుతూహలం పడటంవల్ల వారి ఆదర్శానికి ద్రోహం చేయటమవుతుంది. ప్రజాస్వామిక జాతీయ విప్లవం కోసం పోరాడితే, తరువాత సోషలిస్టులకు యధార్థమైన సోషలిస్టు కార్యక్రమం కోసం పోట్లాడటానికి ఏదీ అడ్డుపడదు. ప్రజాస్వామికాన్ని సంపాదించిన మీదటనే సోషలిజం స్థాపించటానికి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ఖచ్చితమైన సోషలిస్టులు అంతా కాంగ్రెస్ పార్టీకి వెలుపల స్వతంత్రమైన కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపించి కాంగ్రెస్ లో లెఫ్టువింగుగా పనిచేయాలి. కాంగ్రెసులో ప్రత్యేక పక్షంగా పనిచేయకూడదు. కాంగ్రెస్ యొక్క ప్రత్యామ్నాయ (Alternative) నాయకత్వం క్రింద పనిచేయాలి. సోషలిస్టు పార్టీ కాంగ్రెసు పార్టీలో ఉండకూడదు. ఆ పార్టీ మెంబర్లు వ్యక్తిగతంగా కాంగ్రెసులో చేరి లెఫ్టువింగు వెనుక నుండి నడిపిస్తుండాలి. నిజంగా జాతీయ ప్రజాస్వామిక కార్యక్రమంతో కాంగ్రెసు లెఫ్టువింగ్ నాయకత్వం సోషలిస్టు ప్రోత్సాహం వల్లనే లభిస్తుంది. ఎందుకంటే చారిత్రక కారణాలవల్ల ప్రపంచ పరిస్థితుల వల్ల, హిందూదేశంలో వెనుకపడిన జమీందారీ ప్రజాస్వామిక విప్లవము కృషివర్గము యొక్క పలుకుబడి క్రింద నిర్వహించబడుతుంది.
కాబట్టి హిందూ దేశ విప్లవంలో, ప్రజాస్వామిక దశలోనైనా కృషిక వర్గ పక్షము అనివార్యం కావలసి వుంది. కృషిక వర్గము యొక్క సోషలిస్టు పార్టీ ఆదర్శము కాంగ్రెస్ చేత సోషలిస్టు కార్యక్రమాన్ని స్వీకరింపచేయటం కాదు. జాతీయ స్వాతంత్ర్య సంఘర్షణలో కాంగ్రెస్ ను సాధనంగా వాడుకోవాలి.
కష్టపడుతున్న ప్రజలకొరకు స్వాతంత్ర్యం సంపాదించదలచే వారంతా ఏకీభవించి, ఒకే రాజకీయ పక్షంగా కాంగ్రెస్ లో ఉండి దాని ప్రస్తుత ఆదర్శాలలోనూ, రాజకీయములోనూ, వ్యవస్థాపకత్వములోనూ, ఉన్న లోటును తొలగించి, ప్రజాసామ్రాజ్య తత్వానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన బాహుళ్యపక్షంగా మార్చాలి.
Posted by-         ఎన్. ఇన్నయ్య

మళ్ళీ చదవదగిన తెలుగు రచనలు


మళ్ళీ చదవదగిన ప్రామాణిక ఉత్తమ తెలుగు రచనలు


విమర్శాదర్శ విమర్శాదర్శం- పానుగంటి లక్ష్మి నరసిం
హారావు


2.రమణీయం -దువూరి వ్వెంకటరమణ శాస్ట్రి (వ్యాకరణం ఇంతసరళంగా చెప్పగలమా !)


3.బి.వి.నరసిం
హారావు గేయాలు 


4.నా అమెరికా పర్యటన -ఆవుల గోపాల క్రిష్న మూర్తి (ఈ తరం వారికి మార్గ దర్శిని )
ఈ బుక్ వున్నది) 


5.ఇనప కచ్చ డాలు -కొప్పరపు సుబ్బారావు ( స్తే జ్ దైరెక్ షన్స్  తో)


6 మొయిలు రాయబారం-త్రిపురాన వేంకటరాయ వర్మ