విశ్వనాథ సత్యనారాయణ


విశ్వనాథ సత్యనారాయణ
వ్యాస నేపధ్యం
కోగంటి సుబ్రహ్మణ్యం సంపాదకత్వాన రాడికల్ హ్యూమనిస్ట్ పక్ష పత్రిక తెనాలి నుంచి ప్రచురితమైంది. 1958 ప్రాంతాలలో ఇన్నయ్య గారు విశాఖపట్టణం లో వుంటూ హ్యూమనిస్ట్ లో రాసిన ఈ వ్యాసం ఇటీవలనే లభించింది. విశ్వనాధ సత్యనారాయణ గారిపై ఆ నాటికే త్రిపురనేని రామస్వామి, శ్రీ శ్రీ, ఆవుల గోపాలక్రిష్ణమూర్తి, జాషువా వంటి వారు తీవ్ర విమర్శలు చేశారు.విమర్శకుల దృష్టిలో, కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది.

ఆంధ్ర ప్రదేష్ లో పాఠ్య పుస్తకాలను జాతీయం చేసిన సందర్భంలో విశ్వనాథ వారు, అభ్యుదయ మానవతావాదుల తీవ్ర విమర్శలను ఎదుర్కొనవలసివచ్చింది. బుద్ధుడిని రాక్షసుడిగా రాయటం జరిగింది. AGK తీవ్రంగా విమర్శించటంతో ఆ వ్యాసాన్ని పాఠాలనుంచి తొలగించారు. కులం పేర్కుంటూ, జాషువా పై అవహేళనగా వ్యాఖ్యలు చేసారు. ఇవి ఈ వ్యాసం రాసిన సమయాన ఉన్న నేపధ్యం. ఇన్నయ్య గారి వ్యాసం దిగువున ఇస్తున్నాము.

-cbrao


శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

అధికార కేంద్రీకరణ సాహిత్యరంగంలో ప్రబలుతున్నకొద్దీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిని రచయితగా, నవలాకారునిగా, నాటకకర్తగా, కవిగా, పండితునిగా, కవిపండిత, పండిత కవి వగైరాలుగా – విభజించి – ఏ రంగానికారంగమైనా సరే – మొత్తం కలిపి అయినాసరే – ఏరీ ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో విశ్వనాథకు ఎదురేరీ – ఇదీ నేడు వీధి వీధినా జరుగుతున్న తోలుబొమ్మలాట, సాహిత్యంలో స్వాతంత్ర్య పిపాసువులూ, నిష్కర్ష విమర్శకులు లోపిస్తుండగా భట్రాజీయం విరివిగా – కలుపువలె పెరిగిపోతున్నది. ఎవరి స్వార్థములు వారివి. సత్యనారాయణగారితర్వాత ఎవరైతేనేమి... (నెహ్రూ తర్వాత ఎవరన్నట్లు) వర్తమానం గడవాలి. అంటే భజన చెయ్యాలి. అది సరేనయ్యా.

ఈ విధంగా వీధి వీధినా ఏదో శక్తి వుండక పోతుందా – మళ్ళీ తిన్న అన్నమే తిని చూశాను. తిన్న అన్నం తింటే మనిషికి విషం కాదూ మరి ? పశువులైతే నెమరువేయగలవు కానీ పరిణామంలో ఆ శక్తిని అధిగమించాంగా. తిన్న అన్నము వంటిది తినగలము. అంతకుముందున్న అభిప్రాయాలు అవతలకు నెట్టి, పొగడే వారిపై గల గౌరవంతో మళ్ళీ కల్పవృక్షం తిరగేస్తే అంతా చిన్నము నిలువక వ్రాసినట్టే వున్నది. దీపికా లతాంతములో దివ్యజ్యోతి వుంటుందా, అక్కడక్కడ కవిత్వపు పటుత్వం, దుర్విదగ్ధతతో కూడిన శిల్పం మసక మసకగా కన్పించినవి. విశ్వనాథ పేరు నిలబెడితే, అంటే ఆయన తర్వాత కీర్తిని శేషింప చేయగలిగినది పలువురు పేర్కొంటున్న రామాయణ కల్పవృక్షమే యిటులుండ యిక మిగిలిన వాటి మాటేమిటి.

వ్రాసిన నవల లన్నిటిలోకి ఏకవీర అత్యుత్తమమన్నారెవరో. చదివి అభిప్రాయం సైతం యిదివరకే వ్రాశాంగాని, మరలా ఒక్కసారి తిరగేస్తే వంటబట్టని మనస్తత్వ శాస్త్రం కనిపించింది. అదే శరత్ అయితే.

వేయి పడగలు చిత్రం తెలుగు వికిపిడియా సౌజన్యంతో

పరిమాణాన్ని బట్టి అయినా – విశ్వనాథవారి ఓపిక చిహ్నమైన – వేయిపడగలు ఇది ఏ కోవలోకి చెందినదబ్బా? నవల అనటానికి వీలు లేదు. కేవలం వచన రచన అనలేం. అంత జుగుప్స కలిగించే సంభాషణలు, చాదస్తం ఎలా ప్రవేశపెట్టగలిగారో విశ్వనాథవారు. పండిత కవి కదా.

కొందరెవరో వీధి శృంగారమనేవారట విశ్వనాథవారి శృంగార వీధిని. ఏమోగాని వీధిలో సైతం అలాంటి శృంగారం కన్పట్టదు. ఆ మధ్య సన్నిధానం సత్యనారాయణ శాస్త్రిగారి నరస భూపాలీయం చూస్తుంటే శృంగార వీధి లోనిదంతా ఆరీతి అని అన్నారాయన. మరి తెలిసిన వారు ఎక్కడేమాట అనాలో అలాగే అంటారు. విశ్వనాథవారిని చదివి చదివి అభిప్రాయం చెప్పలేని నాలాంటివారికేం తెలుసు ఏమనాలో. తెలియనిచ్చేట్లు రాశారా ఆయన.
విశ్వనాథవారి రచనలన్నీ ఓపిగ్గా సేకరించి ( కొన్నట్లయితే ఎంత అదనంగా బాధపడేవాడినో) చదివిన తర్వాత ఎందుకు ఇంత కాలం వృధా చేశానా? అనిపించింది. అసలు మాతో రోశయ్యగారంటుండేవారు. – తపస్సు చేస్తే మాత్రం పానుగంటి సమాసపు కట్టు విశ్వనాథకు అబ్బుతుందా. విశ్వనాథవారు తన శక్తినంతా దుర్వినియోగమే చేశారు. చక్కని భాషలో గద్యరచన చేసినా బాగుండేది. అన్నిటిల్లో కాలు పెట్టి – దేనిలోనూ సాధన లేకుండా పాడు చేసుకున్నారు. అడుగడుగునా నాగుబాము వలె ఏమారక విషం కక్కుతూ, ఆ వైదికాధ్యాయత తొంగి చూస్తూనే ఉంటుంది ఆయన రచనల్లో. నన్నయకున్న లోటదేగా. ఎందుకో ఆయన శిష్యుడయ్యాడు విశ్వనాథవారు.

విశ్వనాథవారి రచనలు యికనుంచి రావు – వచ్చే అవకాశాల్లేవు – అని నిశ్చితాభిప్రాయాని కొచ్చిన తర్వాత పంచశతి కనిపించింది. అవినీతికి శిఖరాగ్రమందినట్లేనని నిశ్చయించుకున్నాను. ఏమైనా యీ ఆధునిక కాలంలో – అటువంటి రచనలు సాగిస్తూ చెలామణి కాగలుగుతున్నందుకు చెప్పదలచినది ఎవరేమనుకున్నా ధైర్యంగా చెబుతున్నందుకు ఆయన్నభినందించాలి. అయితే నా సందేహమల్లా? విశ్వనాథవారే స్వయంగా వెళ్ళి ఎన్ని సభల్లో తన కావ్యాల విశిష్టతను వివరించగలరు గనుక. వయసు మీరింది. త్వరగా కాలం వృధా చేయక పేరు నిలబడటం కోసం – వెంటనే రచనలన్నిటికీ టీకాతాత్పర్య సహిత వ్యాఖ్యానము వ్రాసిపెట్టిపోతే అభిమానులకు తర్వాత చదువుకునేందుకు బాగుంటుంది. ఈ ఉపన్యాసాలు తాత్కాలికమే కాని చెప్పినదంతా గుర్తుంచుకుంటారా ఏమన్నానా.
ఇంత వ్రాసిన తర్వాత మిత్రుడొకడు, ఎంత చెడ్డా కవిగదా, ఆయన కవిత్వంపై ఏమీ వ్రాయలేదేమన్నాడు. భట్రాజులంతా జీలగబెండులో సారం పిండిన తర్వాత, మిగిలినది పిండి నీవు అనుభవించు అన్నట్లుంది. శక్తి దుర్విదగ్ధతవల్ల చెడగొట్టుకున్నవారిని చెప్పిన తర్వాత, యింకా శక్తి విషయం చెప్పమనటంలో అర్థం లేదు.
మరి వూరూరా విశ్వనాథ సత్యనారాయణ గారికింత ప్రచారం సాగటంలో అంతర్యం? కవిత్వమా? కవిత్వం ఎవడికి కావాలి. లౌకికం. అదే భారతీయ సంస్కృతి లోతుపాతులు తెలిసిన వారికి ఈ విషయాలాట్టే చెప్పనక్కరలేదు. అమ్ముడుపోయే ప్రతులూ, భట్రాయాలూ కాదు. కవిత్వపు విలువను నిర్ణయించేది. అది కాలగమనంలో ఋజువౌతుంది. పేరుకు గ్రాంధికం, లౌక్యానికి వ్యావహారికం, యిది కాదు. సమ్రాట్ లక్షణాలు. అకాడమీలు విలువల్ని కొలవలేవు. అన్నీ ప్రియమైన సత్యాలు చెబుదామనే మొదలు పెట్టాను. సత్యంలో ప్రియత్వమేదీ? ఉంటే విశ్వనాథవారు కవిత్వమే వ్రాయక పొయ్యేవారు.

ఇంతకూ విశ్వనాథను గురించి ఏమంటావు? అన్నాడు మిత్రుడు. కచ్చితంగా చెప్పలేను, పండితుడని, సాహిత్య దృష్టిగలవాడని, తద్వారా ప్రయోజనాన్ని ఆశించిన వాడని సాహిత్య రంగంలో ప్రమాదకర వ్యక్తి అనీ – యింకా ఇలాంటివే ఏవో కొన్ని కారణాలు అందరికీ వంటబట్టవు. ఆహా సరుకుంటే యింత వందిమాగధత్వం ఎందుకవసరమౌతుందీ. ఏమైనా విశ్వనాథ కళ్ళతో తిక్కన, శ్రీనాథుల చూసే దౌర్భాగ్యం కలగకుండు గాక. సాహిత్య రంగంలో ఈ అవ్యవస్థకు భట్రాజీయం అంతిరించు గాక.
అసతోమా సద్గమయ.
Written in 1958 by Innaiah Narisetti
Published in Radical Humanist telugu fortnightly from Tenali edited by Koganti Subrahmanyam
No comments:

Post a Comment