సర్వెంద్రియానాం మెదడు ప్రధానం




మనోభావాలు అనే మాట ఎక్కువగా వింటూంటాం. మనస్సు ఒక ప్రత్యేక పదంగా కవితలో, సాహిత్యంలో వున్నది.
అలాగే హృదయం కూడా చాలా ప్రాధాన్యత వహించింది. గుండె చెప్పినట్లు వినడం కూడా బాగా వ్యాప్తిలో వున్నది.
శరీరంలో గుండె అనేది నిరంతరం, అమాయకంగా కొట్టుకునే యంత్రం. అది ఆగితే మనిషి చనిపోతాడు. కాని గుండె ఆలోచించదు. అలాంటి శక్తి వున్నది. మెదడుకు మాత్రమే.
మన సాహిత్యంలో పాతుక పోయిన పదజాలం మనల్ని శాసిస్తుంది. ఆలోచించకుండానే అంగీకరించే పదాలున్నాయి. ఆత్మ అలాంటిదే. మనస్సు కూడా అంతే.
విడమరచి చూస్తే ఆత్మ, మనస్సు అనేవి సృష్టించిన పదాలే. అవి ఎక్కడ వున్నాయంటే ఎక్కడా లేవు. మన నమ్మకాలలో మాత్రమే వున్నాయి.
అయినా సరే, ఆత్మ, మనస్సు అనే పదాలకు చాలా ప్రాధాన్యత మతపరంగా యిచ్చారు. అవి నమ్మకాలలో గూడు కట్టుకున్నాయి. వాటిని ప్రశ్నించం. మన పెద్దలు, మన మతాలు, పవిత్ర గ్రంథాలు చెప్పాయని, ఒప్పేసుకుంటాం.
వాస్తవానికి ఎంత అన్వేషించినా ఆత్మ, మనస్సుకు వునికి లేదు.
మరి వున్నదేమిటి?
సర్వేంద్రియాణాం మెదడు ప్రధానం

మన శరీరంలో అన్నిటి కంటె, అత్యంత ముఖ్యమైనది మెదడు. దానిని గురించి మనకు పరిమితంగానే తెలుసు. ఇంకా తెలుసుకుంటూ పోతున్నారు. ఇది నిరంతర శాస్త్రీయ కార్యక్రమం. అలా పొరలు విప్పుతుంటే అనేక ఆశ్చర్యకర సంగతులు తెలుస్తున్నాయి.
మెదడు చేసే పనిలో భాగమే మనస్సు. అంతేగాని మనస్సుకు ప్రత్యేక అంగంగాని, స్థానం గాని వుండదు. మెదడు ఆలోచనలనే ఆ పేరు పెట్టి పిలుస్తాం. జీవశక్తి అనేది అలాంటిదే.
నమ్మకాలన్నీ మెదడు నుండి వస్తాయి.
మెదడులో కణాలు పని చేసే తీరును బట్టి నమ్మకాలు, ఆలోచనలు, భావాలు, కవితలు, యిత్యాదులన్నీ వస్తాయి.
మెదడు చాలా క్లిష్టమైనది. మెదడులో వంద బిలియన్ న్యూరాన్ లు (సూక్ష్మకణాలు) వున్నాయి. ఇవి ఎన్నో రకాలు. ప్రతి దానికీ ఒక కణ (సెల్) భాగం వుంటుంది. ఒక కణం నుండి మరో కణానికి సంబంధం వుంటుంది. వంద బిలియన్ కణాల సంబంధం వూహించడమే కష్టం. ఇక లెక్కించేదెక్కడ?
న్యూరాన్స్ ను తెలుసుకోడానికి ఎలక్ట్రోడ్స్ తో ప్రేరేపిస్తారు. ఎన్నో రకాల న్యూరాన్లను స్థూలంగా ప్రేరిపితాలనీ, ప్రతి బంధకాలనీ విభజించవచ్చు.
న్యూరాన్స్ లో జరిగే ప్రక్రియ విద్యుత్ రసాయన చర్య అనవచ్చు. ఎలక్ట్రో కెమికల్ అన్నమాట. న్యూరాన్లు పరస్పరం స్పందనలు అందించుకునే తీరును తరచుగా ఫైరింగ్ చేయడం, ఎంత సంఖ్యలో ఫైర్ చేస్తుందో గమనించడం, ఏ స్థానంలో ఫైరింగ్ చేస్తుందో చూడడం అని మూడు తీరులుగా చూస్తారు. ఇది మెదడు పరిశీలనలో జటిలమైన కార్యక్రమం.
మన మెదడులో జరిగేది ఎలక్ట్రో మాగ్నటిక్ (విద్యుదయస్కాంత చర్య) అని తెలుసుగాని, దీని పూర్తి అవగాహన ఇంకెంతో జరగాల్సి వుంది.
వివిధ ఔషధాలు మెదడుపై తద్వారా శరీరంపై పని చేసే తీరు గ్రహిస్తున్నారు. ఎలాంటి మందు మెదడులో ఏ భాగంపై పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు.
ఆల్డస్ హక్స్ లి అలాంటి ప్రయోగం తనపై కూడా చేసుకుని, వాటి ప్రక్రియను రికార్డు చేశాడు. వాటిని డోర్స్ ఆఫ్ పర్సెప్షన్, పేరిట రాశాడు. ఆధ్యాత్మిక, యోగ, చింతనల పేరిట జరిగే వాటిని రికార్డు చేశాడు. దైవ చింతన కూడా అలాంటిదే.
పరిశోధనల వలన ఇప్పటి వరకు తేలిందేమంటే, నమ్మకాలకు ప్రోది చేసే రసాయనిక ప్రేరణ డోపామైన్ (Dopamine) నుండి వస్తుంది. పైగా ఇదొక అలవాటుగా మారే లక్షణంతో వుంది. అలాంటి అలవాట్లలో మనోభావాలు అనే పేరిట చలామణి అవుతున్న మత విశ్వాసాలు, మూఢ నమ్మకాలు వున్నాయి. దీనిపై చాలా పరిశోధనలు చేశారు.
భావాలు సృష్టించే శక్తి మెదడుకు వుంది. దైవ భావం అలాంటిదే. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, మొదలైనవన్నీ అలా సృష్టి అయినవే.
నమ్మకాలకు పుట్టిల్లు, మెదడు. అది సరైనది కాదని తెలిసి కూడా నమ్మడం చూస్తూనే వున్నాం. నమ్మకాలు ముందు ఏర్పరచుకుంటాం. అవి హత్తుక పోతాయి. ఇవి బయట నుండి బలపడేటట్లు అనేక శక్తులు తోడ్పడతాయి. నమ్మకం ఏర్పడిన తరువాత దానిని బలపరచడానికి కారణాలు వెతుకుతాం. ఇదీ తంతు.
మానసిక రుగ్మతలు, మెంటల్ యిత్యాది మాటలు వింటాం. మానసిక జబ్బుల్ని పిచ్చి (ఉన్మత్తత) అని కూడా ముద్రవేస్తారు. పిచ్చి అనగానే మనిషిని వెలివేసినట్లు చూస్తారు.
కాని జబ్బులనేవి – అది ఏమైనాసరే – శరీరానికి వచ్చేవే. ఒక్కొక్క అంగం జబ్బుకు గురైనపుడు దానికి చికిత్స వుంటుంది. మానసిక జబ్బులనేవి మెదడుకు చెందినవి. వాటిని కొన్ని గుర్తించగా, మరి కొన్ని పరిశోధనలో వున్నాయి.
శరీరం లేకుండా జబ్బులు లేవు. ఇంద్రియాతీతమైనవి అనేదంతా అసత్యం. అతీంద్రియ శక్తులు వుండవు. కాని ఆ పేరుతో చాలా దొంగ వ్యాపారం జరుగుతున్నది. ఇందుకు మూల కారణం మానసిక ఇంద్రియాతీత శక్తులున్నాయని గుడ్డిగా నమ్మడమే.
మెదడులో ఏ భాగం  ఏ పనికి చెందినదో గుర్తిస్తున్నారు. ఇంకా విశేష పరిశీలన జరుగుతున్నది. తెలియవలసినవి అనేకం వున్నాయి. ఇప్పుడిప్పుడే జన్యు శాస్త్రం చిగురించింది. ఇందులో చాలా రహస్యాలు పొరలు విప్పుకుంటున్నాయి. తదనుగుణంగా వైద్యశాస్త్రం విస్తరిస్తున్నది. ఈ లోగా చిట్కా వైద్యాలు, భూత ప్రేత చికిత్సలు, వుండనే వున్నాయి. మూఢనమ్మకాల కారణంగా చాలా అనర్థాలు జరుగుతూనే వున్నాయి. శాస్త్రీయ పద్ధతి ఒక్కటే నెమ్మదిగా యీ మూర్ఖత్వాన్ని పోగొట్టగలదు.
స్టీఫెన్ హాకింగ్ ను గమనించండి
శరీరంలో 90 శాతం  పనిచేయకపోయినా మెదడు శక్తితో స్టీఫెన్ హాకింగ్ ప్రపంచానికి విజ్ఞాన ఫలితాలు అందిస్తున్నారు. ఆయన మానవాళికి గర్వకారణం. ఇటీవలే గ్రాండ్ డిజైన్ శీర్షికన వెలువరించిన గ్రంథం విశ్వవ్యాప్తంగా ఆలోచింప జేస్తున్నది. దైవ భావన ఒక నమ్మకంగా తేల్చిన స్టీఫెన్ దాని అవసరం లేదని స్పష్టం చేశారు.
మరి అయితే, యీ మూఢ నమ్మకాలు ఎక్కడ నుండి వస్తున్నాయి? తల్లిదండ్రుల దగ్గర మొదలై, సమాజంలో వీటి విజృంభణ జరుగుతున్నది. కొన్నాళ్ళకు అది మూఢ భావన అని తెలిసి కూడా, అలవాటు పడినందున ఆనవాయితీగా ఆచరిస్తారు.
వైజ్ఞానిక పద్ధతి వలన (శాస్త్రీయ పంథా) మూఢ భావాల గుట్టు తెలిసినా వదలుకోలేకపోతున్నారు. పైగా మనలో వస్తున్న మూఢ నమ్మకాలను సమర్థించే విధంగా కారణాలు చూడడం కూడా వున్నది.
ప్రపంచంలో జరుగుతున్న ప్రగతి, మానవ పురోగతి అంతా శాస్త్రీయ (వైజ్ఞానిక) పద్ధతి వలనే అని గ్రహించాలి. దానికి మూఢ నమ్మకాలు అడ్డు రాకుంటే యింకెంతో ముందంజ వేస్తాం.
అంతా తెలుసు, అన్నీ మన పూర్వీకులు చెప్పారు. సత్యం అంతా పవిత్ర మూల గ్రంథాలలో వుంది అనేవి మానవ ప్రగతికి అడ్డం.
ప్రకృతిలో మనం వున్నాం, అందులో తెలిసింది కొద్ది. తెలుసుకోవలసింది అపారం, అది క్రమేణా నిరంతరం జరుగుతుంది అనేది వైజ్ఞానిక ధోరణి. మన పిల్లలకు అదే అవసరం
Innaiah Narisetti.

No comments:

Post a Comment