గోమాంస భక్షణం
ఆర్ష సాహిత్యంలో గోవధ, గోమాంస భక్షణను గురించిన ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోబోయే ముందు అసలు మాంస భక్షణను గురించి ‘మనుస్మృతి’ ఏమంటున్నదో చూద్దాం.
నాత్తా దుష్యత్యదన్నాద్యాన్ ప్రాణినో హన్య హన్యపి,
ధాత్రైవ సృష్టా హ్యాద్యాశ్చ ప్రాణినోత్తార ఏవచ । ( మను స్మృతి 5 - 30)
ప్రతిదినము భక్షింపదగిన ప్రాణులను భక్షించువాడు దోషమునొందడు. ఎందుకంటే బ్రహ్మయే భక్షింపదగినవి ఇవి; వీటిని భక్షించే వారు వీరు- అని ఏర్పరిచాడు.
నియుక్తస్తు యథా న్యాయం యో మాంసం నాత్తి మానవః,
స ప్రేత్య పశుతాం యాతి సంభవానేకవింశతిం । ( 5 -35)
శాస్త్ర విధానం ప్రకారం శ్రాద్ధ మధుపర్కములందు నియమింపబడిన (ద్విజుడు) మాంసాన్ని భక్షించకపోతే అతడు దేహాంతమున ఇరవై ఒక్క జన్మలు పశువుగా జన్మిస్తాడు.
ఇంకా మంత్రజలంతో ప్రోక్షితంచేసిన మాంసాన్ని(ముస్లిం లు హలాల్ చేసినట్లు), యజ్ఞాలలో వేల్చబడిన పశుమాంస హవిస్సు యొక్క శేషాన్ని(కబాబ్ ల వంటి కాల్చిన మాంస ఖండాలను పలలాహారం పేరుతో భుజించేవారు. ‘పలలాహారం’ అనే పదమే ‘పలహారం’ అనే పదానికి మూలం. ) బ్రాహ్మణుడు భుజించవచ్చునని( 5-27), దేవ పితరులకు సమర్పించగా మిగిలిన మాంసం తింటే మాంస భక్షణ దోషం ఉండదనీ (5-32), విధిచే విధించబడిన మద్యపాన, మైథున, మాంస భక్షణల విషయంలో బ్రాహ్మణాది వర్ణములకు యోగ్యతానుసారంగా ప్రవర్తించడం దోషం కాదనీ (5-56) చెప్పిన ‘మనుస్మృతి’ ప్రాణిహింస చేయకుండా మాంసం లభించదు కనుక ప్రాణిహింసను వర్జించాలంటే మాంస భక్షణం మానెయ్యాలని (5- 48) కూడా సూచించడాన్నిబట్టి, ఈ పరిణామం బౌద్ధ ధర్మం యొక్క ప్రభావానికి, ముఖ్యంగా అహింసా సిద్ధాంతానికి లోనవడం కారణంగానేననేది సుస్పష్టమని చరిత్రకారులు నిర్ధారించారు. క్రమంగా శాకాహారం తీసుకోవడాన్ని ఒక గొప్ప సుగుణంగా భావించి, ఆ మేరకు ప్రచారం చేసిన పురోహిత వర్గం మాంసాహారాన్ని నీచు (నీచమైనది) అనీ, అది తినేవారిని మ్లేచ్ఛులనీ ప్రచారం చేశారు. మొదట్లో మ్లేచ్ఛ పదాన్ని బౌధాయనుడు ఇలా నిర్వచించాడు - ‘గోమాంసఖాదకో యస్తు విరుద్ధం బహుభాషతే । సర్వాచార విహీనశ్చ మ్లేచ్ఛ ఇత్యాభిధీయతే ॥’ కానీ ప్రస్తుతం అది మాంసాహారికి పర్యాయంగా మారింది. వీటన్నింటినిబట్టీ పరివర్తన చెందిన ఒకప్పటి మాంసాహారులే ప్రస్తుత ‘శుద్ధ’ శాకాహారులని గ్రహించవచ్చు.
ఇక గోమాంసం విషయానికొద్దాం.
ఆపస్తంబ గృహ్య సూత్రాలలోని 1- 3- 9 సూత్రం ప్రకారం ఎవరైనా అతిథి వచ్చినప్పుడు, పితరులకు అష్టక బలి సమర్పించే సందర్భంలోనూ, వివాహ సమయంలోనూ- ఈ మూడు సందర్భాలలో గోవును చంపి, వండి వడ్డించవచ్చు.
శతపథ బ్రాహ్మణంలోని మూడవ కాండంలోని, మొదటి అధ్యాయం యొక్క, రెండవ బ్రాహ్మణంలోని 21 వ మంత్రంలో యాజ్ఞవల్క్యుడు ‘నేను బాగా బలిసిన ఆవు మాంసాన్ని - అది లేతగా, మృదువుగా ఉండేటట్లయితే - తినడానికి ఇష్టపడతాను’ అన్నట్లు పేర్కొనబడింది.
శతపథ బ్రాహ్మణంలోని మూడవ కాండంలోని, నాల్గవ అధ్యాయంయొక్క మొదటి బ్రాహ్మణంలోని రెండవ మంత్రంలో యజ్ఞం సందర్భంగా అతిథులుగా వచ్చే రాజు లేక బ్రాహ్మణుడికి యజమానుడు (యజ్ఞ నిర్వాహకుడు) సోమరసాన్నీ, ఒక పెద్ద ఎద్దు మాంసాన్నీ, ఒక పెద్ద మగ మేక మాంసాన్నీ వండి పెట్టాలని
పేర్కొనబడింది. ( ‘రాజ్ఞే వా బ్రాహ్మణాయ వా మహోక్షం వా మహాజం వాపచేత్తదహ మానుషం’). దీనినిబట్టి ఆవుకు పవిత్రత ఆపాదించబడే కొద్దీ క్రమంగా అతిథి సత్కారంలో గోమాంసానికి బదులుగా ఎద్దు మాంసం వినియోగింపబడేదని గ్రహించవచ్చు.
ఋగ్వేదంలో అక్కడక్కడా ఆవుకు పవిత్రత ఆపాదించబడింది. దానిని అదితి అనీ దేవత అనీ కూడా సంబోధించడం జరిగింది. ఆవుకు ‘అఘ్న్యా’ ( చంపకూడనిది) అనే విశేషణాన్ని జోడించారు. అయితే అథర్వ వేదం (12. 4. 5) కాలం నాటికి ఆవును పవిత్రమైన జంతువుగా పూజించడం పూర్తిగా స్థిరపడింది. ‘పరాశర స్మృతి’
లో శ్రాద్ధమునకు ఉచితమైన పదార్థాలలో గోమాంసానికి బదులుగా మత్స్య మాంసము, అడవి పంది మాంసము, లేడి మాంసము, మేక మాంసము మొదలైనవి వచ్చిచేరాయి. (పరాశర స్మృతి - 4- 76)
అద్వైత ఆశ్రమ్ వారు ప్రచురించిన స్వామి వివేకానంద రచనా సర్వస్వంలోని మూడవ సంపుటంలోని 174 వ పేజీలో స్వామి ఇలా రాశారు - ‘ఒకప్పుడు భారతదేశంలో గోమాంస భక్షణం చేయని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కాదు’.
సుప్రసిద్ధ వేద పండితుడు, మహామహోపాధ్యాయ పి. వి. కానే ‘ధర్మశాస్త్ర విచార్’ అనే మరాఠీ గ్రంథంలో ఇలా రాశారు - ‘పరిశుద్ధంగా ఉండే కారణంగా గోమాంస భక్షణం పవిత్రమైనదేనని వాజసనేయి సంహిత పేర్కొంది.’
‘బృహదారణ్యకోపనిషత్తు’ పై తాను రాసిన భాష్యంలో ఉక్ష (వీర్యవంతమైన ఎద్దు) మాంసంతో కలిపి వండిన మాంసోదనాన్ని ఆది శంకరాచార్యులు ప్రస్తావించాడు. (6-4-18)
సువిఖ్యాత చరిత్రకారుడు రమేశ చంద్ర మజుందార్ సంపాదకత్వంలో భారతీయ విద్యా భవన్ వారు ప్రచురించిన ‘The History and Culture of the Indian People’ అన్న ఉద్గ్రంథంలో మజుందార్ ఇలా పేర్కొన్నారు - ‘మహాభారతం ప్రకారం రంతిదేవుడనే ఒక రాజు రోజూ రెండు వేల గోవులు, మరో రెండు వేల ఇతర జంతువులను వధించి, ఆ మాంసాన్ని అందరికీ దానం చేసేవాడు’
అరణ్యవాసానికి బయలుదేరి గంగానదిని దాటే సమయంలో సీత తాము సుఖంగా తిరిగి వచ్చేటట్లయితే గంగానదికి 10,000 ఆవుల్ని బలి ఇస్తానని మొక్కుకున్నట్లు ‘రామాయణమ్’ లో వాల్మీకి పేర్కొన్నాడు. దీనినిబట్టి ఆ కావ్య రచనాకాలంలో గోమేధం ఒక ఆచారంగా ఉండేదని మనం గ్రహించవచ్చు.
అయితే ఆర్యులు తమ ప్రధాన జీవనోపాధిగా పశుపోషణ స్థానంలో వ్యవసాయాన్ని చేపట్టడంతో ఆవుకు ఒక గౌరవ ప్రతిపత్తి ఏర్పడింది. ఆవుకు ఈ గౌరవ ప్రతిపత్తి ఒక క్రమ పరిణామంలో భాగంగా ఏర్పడింది. భారతీయులకు ఆవు మొదటినుంచీ పవిత్రమైనదేననీ, హిందువులు గోవధ ఎప్పుడూ చేయలేదనీ, ఆవు మాంసం ఎప్పుడూ తిని ఉండలేదనీ అమాయకంగా నమ్ముతున్నవారిని చూస్తుంటే జాలేస్తుంది.
అయినా కమల హాసన్ అన్నదాంట్లో తప్పేముంది ? సారస్వత బ్రాహ్మణులు, ఒడిసా, బెంగాల్ బ్రాహ్మణులు చేప మాంసాన్ని నేటికీ అతి ఇష్టంగా తింటారు. నేటి బ్రాహ్మణులు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతార రూపమైన చేపనే తింటూ ఉండగాలేనిది ఒకప్పటి బ్రాహ్మణులు ఆవును తిన్నారంటే నమ్మడానికి ఎవరైనా ఎందుకు బాధపడాలి ? ఎందుకు సిగ్గుపడాలి ?
మీ.. ముత్తేవి రవీంద్రనాథ్.
1 comment:
Thank you sir for writing such and sharing important information, with your approval Can I link this in my Facebook, Google+.
Post a Comment