అధికారం వద్దన్న పార్టీ- ఎమ్.ఎన్.రాయ్

రాజకీయాలు-అధికార పార్టీలు
అధికారం వద్దన్న పార్టీ
(ఎమ్.ఎన్.రాయ్)

(1947, మే, 17-25 మధ్య డెహ్రాడూన్ లో జరిగిన రాజకీయ అధ్యయన శిబిరంలో, రాజ్యాంగాన్ని రూపొందించే విషయమై, చర్చను ముగిస్తూ ఇచ్చిన ఉపన్యాసం.)
సమకాలీన ప్రపంచంలో స్థూలంగా చూస్తే, రెండు రాజ్యాంగాలతో కూడిన, భిన్న రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామిక రాజ్యాంగాలు, సోవియట్ యూనియన్ రాజ్యాంగం, రెండు దృక్పథాలను సూచిస్తున్నవి. ఇవి రెండూ వ్యక్తి ప్రతిభా వ్యుత్పన్నతలు విప్పారడానికి, అనవసరమైన అదుపులు పెడుతున్నవి. ఈ అదుపులో స్థాయీ భేదాలున్నవి. అందుకు భిన్న కారణాలున్నవి. కనక స్వేచ్ఛా సమాజాన్ని ఊహించి,  దానికి తగిన రాజ్యాంగ నిర్మాణాన్ని చేయడం సంభవించింది. ఈ ముసాయిదా రాజ్యాంగాన్ననుసరించి, సమాజంలో, రాజకీయ వ్యవస్థ సూచిత మవుతుంది. సాంఘిక న్యాయాన్నీ, వ్యక్తి స్వేచ్ఛను నెలకొల్పడం ఈ రాజ్యాంగ ఉద్దేశ్యం. ఇది కేవలం సిద్ధాంత ప్రతిపాదన కాదు. ఉన్న వాస్తవాలను నిశితంగా పరిశీలించిన అనంతరం రాజ్యాంగాన్ని ఏర్పరచడం జరిగింది. ఇది భారతదేశ పరిస్థితులకోసం తయారు చేపినప్పటికీ, ఈ సూత్రాలు ప్రతిచోటా అన్వయించదగినవి.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సోవియట్ రాజ్యాంగ విధాన అనుభవాలను బట్టి ప్రస్తుత సంక్షోభం నుంచి, ఇవి రెండూ కూడా, ప్రపంచాన్ని బయట పడవేయజాలవని నిర్ణయించడం సహజమే. రాజకీయ వివేచనతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే చివరి మాటగా, భావించారు. మార్క్సిస్టులు ఈ విధానాన్ని అంతటినీ పూర్తిగా ఖండించే వరకూ అలానే అనుకున్నారు. ఆదర్శ ప్రజాస్వామ్యం ఏర్పడిన తరవాత రాజ్యం లేకుండా పోయి, వర్గరహిత సమాజం వ్యవస్థాపితమవుతుందనీ, ఈలోగా సంధికాలంలో కార్మిక నియంతృత్వం ఉంటుందని వారొక ప్రతిపాదన చేశారు.
పార్లమెంటరీ విధానంలోని లోపాలను మరీ ఊహలలో ఉండే, సంప్రదాయవాదులు తప్ప అందరూ గుర్తించారు. దానిని సవరించటానికి, మెరుగుపరచటానికి ప్రయత్నం జరిగింది. ఎటువంటి సంస్కరణలు కావాలో స్పష్టమైన భావాలు ఎవరికీ లేవు. సోవియట్ రాజ్యాంగాన్ని ఆధారంగా చూపిన రాజకీయ విధానం, శత్రువుల చేతిలో ఖండనకు గురికాగా, అదే ఆదర్శరాజ్యమని అనుకూలురు శ్లాఘించారు. ఈ రెండు ధోరణులు, ఏమంత సహాయకారి గావు. రెండు విధానాలలోని, లోపాలను చూపిన అనంతరం రాడికల్ ప్రజాస్వామ్య ముసాయిదా రాజ్యాంగం, సమాజానికి రాజకీయ వ్యవస్థను చూపింది. లోగడ రాజ్యాంగంలోని ఉత్తమ అంశాలను స్వీకరించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సోవియట్ విధానపు అనుభవాల నుంచి నేర్చిన ఫలితమది. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. నియంతృత్వం ఎటువంటిదైనా సరే, నిరాకరించడం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, బూర్జువా నియంతృత్వానికి  ముసుగు కనుక ఆ విధానాన్ని అభివృద్ధి చేయవలసి ఉన్నది. దీనికంటే ఉత్తమ మార్గంగా, కార్మిక నియంతృత్వం, ఉండగలదని చెప్పలేము.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలోని ప్రత్యక్ష ఉదార ధోరణిని, సోవియట్ విధానంలోని ప్రాథమిక ప్రజాస్వామ్య లక్షణాలు, ముసాయిదా రాజ్యాంగంలో పొందుపరచటం గమనించవచ్చు రాజ్యాంగంపై. ఇదొక సమగ్ర పత్రం కాదు. ఆదర్శ నిర్మాణానికి పూర్తి పథకమూ కాదు. వివేచన, నీతి అనే భావాల ఆధారంగా, మాత్రమే రాబట్టిన విషయమూ కాదు. ప్రస్తుతం ప్రపంచం మీద ఆధిపత్యం వహించాలనే ధోరణిలో పోటీపడుతున్న రెండు విధానాల అనుభవం నుంచి నేర్పించది మాత్రమే.  నవ్య ప్రాపంచికానుభవవాదులు తప్ప అనుభవం మాత్రమే ఏకైక మార్గదర్శకం అని ఎవరూ చెప్పడానికి వీలులేదు. తర్కం, వివేచన కూడా పరీక్షించవలసి ఉంటుంది. అంటే ఏ దేశానికైనా, రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ‘కేవలం ఆలోచన’ అసలే లేకుండా చేయడం కుదరదు. కేవలం ఆలోచన సహితం గాలి నుంచి వచ్చి పడింది కాదు. వివరించి చూస్తే అది కూడా అనుభవ ఫలితమే. ప్రత్యక్షానుభవం ఒకటే అనుభవం కాదు.
కనుక ఇటువంటి ముసాయిదాను ఊహతో కూడిన ‘ఆదర్శ’ రాజ్యాంగం అనటానికి ఆస్కారం లేదు. దేశంలో పరిస్థితి మారినప్పుడు, రాజ్యాంగానికీ, వాస్తవ పరిస్థితికీ సంబంధం ఉండదు. కొత్త వాస్తవికతను సృష్టించే వరకూ ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుంది. నేటి వాస్తవికతలో అసమానత, స్వేచ్ఛ లేకపోవటం, ఆర్థిక తేడాలూ ఉన్నవి కొత్త వాస్తవికత కొన్ని మార్పులను తేవచ్చు బాహ్య సంబంధాలలో, రాజకీయ స్వేచ్ఛ ఎక్కవగావచ్చు. కాని దేశంలో ఆర్థికంగా స్వేచ్ఛ లోపించినప్పుడు, స్వేచ్ఛ లేదా సమానత్వం, లేదా ఉదారత్వం, లేదా సహనం అనేవి సాధ్యం కావు. అసమానత్వం, అస్థితర, వాస్తవాలుగా ఉన్నంతకాలం, నిర్దుష్టమైన, వివేచనాత్మక, నైతిక, రాజకీయ వ్యవస్థ సందర్భోచితంగానూ, అన్వయించటానికి వీలుగానూ ఉంటుంది. అప్రియమైన సత్యాన్ని తొలగించి, ప్రియమైన వాస్తవాన్ని ప్రవేశపెట్టడం ఆచరణయుక్తమైన విషయమే.
ప్రజా పరిపాలనావశ్యకత వల్ల రాజ్య నిర్మాణానికి దారితీసింది. సమాజంలో రాజకీయ వ్యవస్థ రాజ్యమే కనుక, క్రమంగా రాజ్యం, సమాజం ఒకటి కావాలని ఆశించవచ్చు. రాజ్యం హరించిపోతుందనే మార్క్సిస్టుల ఆదర్శంలో ఇక్కడ పేర్కొనే రాజ్యవ్యవస్థ కొత్త విషయాన్ని సమకూరుస్తున్నది. సమాజానికీ మించిపోయిన సంస్థగా రాజ్యం లేనప్పుడు ఇక హరించిపోయేదంటూ ఏమీలేదు. సమాజంతో సమానమైన రాజ్యంలో ధర్మకర్తృత్వం ఉండదు. ఐనా, సమాజంలో పరిపాలన సాగవలసి ఉంటుంది. ఆ విధంగా, సమాజ రాజకీయ వ్యవస్థగా తొలుత ఉద్దేశించిన  కార్యక్రమాన్ని రాజ్యం కొనసాగిస్తుంది.
అధికారంలోకి వస్తే?
రాజ్యానికి సంబంధించిన ఈ తార్కిక సిద్ధాంతం, అధికార సమస్యను నిర్ధారణ చేస్తుంది. రాజ్యం, సమాజం అంతటితోనూ కలసినప్పుడు, లేదా సమాజంలోని రాజకీయ వ్యవస్థతో కలసిపోయినప్పుడు, అధికారాన్ని హస్తగతం చేసుకొనే నిమిత్తం పోరాడే పార్టీలకు తావుండదు. పార్టీలవల్ల అధికార పోరాటం జరుగుతున్నది. అధికారంలో లేని పార్టీ, లేదా అధికారాన్ని కోల్పోయిన పార్టీ, ఏ హామీ అయినా ఇవ్వవచ్చు. కాని ఆ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడదని ప్రజలకు హామీ ఏమీటి? సమాజంలో రాజ్యం కలసిపోయిన చోట, పోటీబడే పార్టీలకు అవకాశం లేదు కనక ప్రజాస్వామ్యాన్ని గురించీ, మంచి ప్రభుత్వాన్ని గురించి ఇప్పుడున్న సందేహాలు రావడానికి వీలులేదు. కలవర పెడుతున్న అధికార సమస్య గురించిన, పరిష్కార మార్గం, కేవలం ప్రస్తుత రాజ్యవ్యవస్థ నుంచి, తార్కికంగా రాబట్టినది కాదు. దీనికి తాత్విక భావన ప్రాతిపదికగా ఉన్నది.
ఆచరణలో, సాధ్యమేనని చెపుతున్న స్వేచ్ఛారాజ్యంలో ప్రజాపాలనా వ్యవహారాలను, రాగద్వేషాతీతంగా ఉండే వ్యక్తులు నిర్వహిస్తారు. లోగడ తాత్విక-ప్రభువులనే భావనకు, ఇదొక ఆధునిక చిత్రణ. ఇటువంటి వ్యక్తులు, భావంలో స్వేచ్ఛాపరులు కనక, అధికారం వల్ల చెడిపోరు. చెడిపోవడానికి అవకాశం ఉన్న వ్యక్తి మానసికంగా స్వేచ్ఛాపరుడు కాడు, రాగద్వేషాతీతుడు కాదు, తాత్వికుడూ కాదు. అవినీతికి లోబడని స్వేచ్ఛాపరులు ఉంటారా అనే విషయమై సందేహం లేదు. కాని మానసికంగా స్వేచ్ఛాపరులుగా ఉండే అవకాశం మనుషులకు ఉన్నదా అనే విషయంలోనే సందేహం. ఈ సందేహాన్ని, మానవతా తత్వం స్వీకరించదు. మానవుడు ప్రాయికంగా వివేచనాత్ముడు కనక నీతివాది అనే వైజ్ఞానిక ప్రాతిపదికతో ఈ తత్వం  ప్రారంభిస్తుంది. తన నైతిక వివేచన సారాంశాన్ని అతడు గుర్తెరిగినన్నాళ్లు, మానసిక స్వేచ్ఛవైపుకు ధృఢంగా పయనించగలడు. మానవస్వభావాన్ని గురించి వాస్తవికతతో కూడిన ఆశావాదం, న్యాయమైన, సహనమైన, సాంఘిక వ్యవస్థను ఏర్పరచాలనే ఆదర్శం కాస్తా స్వప్నంగా మిగలకుండా ఆచరణాత్మక ప్రతిపాదన అవుతుంది.
మానవుడు, మౌలికమైన తన వివేచనతో, భావస్వేచ్ఛను సాధించగలడని, రాగద్వేషాతీతంగా ఉండగలడని, అవినీతికి పాల్పడకుండా పయనించగలడని మా నమ్మకం. అటువంటి వ్యక్తులు, అధికారం కావాలని ఆశించరు. ఆ వ్యక్తులతో కూడిన పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆలోచించదు. అయితే, పార్టీలు పోటీబడి అధికారంలోకి రావడానికే ఉన్నప్పుడు, పార్టీలలో అటువంటి వ్యక్తులు చేరతారా అనేది సమస్య.
అధికారాన్ని హస్తగతం చేసుకోదలచినంతకాలం, కార్మిక నియతంతృత్వ సిద్ధాంతం కంటే, మనం చెప్పేదానిలో మెరుగేమీ లేదు. ఉన్నత ప్రజాస్వామ్యం స్థాపించడానికి, కార్మిక నియంతృత్వం కూడా ఒక సాధనగా ఉపకరిస్తుందన్న విషయం వారూ చెప్పారని విస్మరించకూడదు. కొత్త భావాలను పాత పదజాలంతో వ్యక్తపరచకూడదు. కొత్త భాషను వ్యక్తీకరించాలి. నేడున్న ఈర్ష్యా అసూయలకు చోటులేకుండా చేయడంలో నైతిక సత్తా ఉండాలి.
ప్రజాస్వామ్యానికి విద్య

ప్రస్తుత సంక్షోభానికి మార్గాంతరం అన్వేషిస్తూ, ప్రజాస్వామ్యానికి విద్య అత్యవసరమనే ఒక్ రాజకీయకటిక సత్యాన్ని తెలుసుకొన్నాము. నేటి ప్రజాస్వామిక వాదులు ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. అందువల్ల ప్రజాస్వామ్యం విఫలం చెందడమే గాక, ప్రజాస్వామ్యం సాధ్యమై అనే సందేహం కూడా వచ్చింది. విద్యకూ, ప్రజాస్వామ్యానికీ ఉన్న సంబంధం మళ్ళీ స్వీకరించాలి.  వివేచన, విద్య, వ్యవస్థాపిత ప్రజాస్వామ్యాన్ని గురించి మనం ప్రస్తావిస్తున్నాం. అలాగే, రాగద్వేషాతీత వ్యక్తులూ, స్వేచ్ఛాయుత భావుకులూ అంటున్నాం ఇవన్నీ మాటల గారడీ కావు. చిత్తశుద్దితో, మానసిక స్వేచ్ఛాపరులుగా, రాగద్వేషాతీత వ్యక్తులుగా, తాత్వికులుగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. కనక మన రాగద్వేషాలను అణగద్రొక్కి, మన భావాలూ, ప్రవర్తన ఆధారంగా, ఇతరులను ప్రభావితం చేయాలని అనుకోవడం లేదు. ఈ రాగద్వేషాలను పెకలించివేయాలని, అవినీతికి అతీతులుగా ఉండాలనీ రుజువు పరచదలచాము. సందేహం, సంశయవాదం సరిదిద్దటానికి తోడ్పడుతుంది. కాని ధృఢవిశ్వాసం కూడా అవసరం. ఏ పరిస్థితులలోనూ, అవినీతికి లొంగబోమని ఆత్మవిశ్వాసాన్ని చూపలేనివారే, ముసాయిదాలో చూపిన రాజ్య అవకాశాన్ని సందేహిస్తారు.
ఆచరణకు సంబంధించిన ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. రాగద్వేషాతీత వ్యక్తులు, సంధికాలంలో, ఇంకా ప్రజాస్వామ్యాన్ని విద్యా విషయకంగా రూపొందించనప్పుడు ఎలా ప్రభావితం చేస్తారు? ముసాయిదా రాజ్యాంగంలో ఇందుకు సూచనలు ఉన్నవి. సంస్థాగతమైన ప్రతిపాదనలు కూడా పేర్కొనటం కద్దు. ప్రజాస్వామ్యాన్ని సాధ్యమని నిరూపించే రాజ్యాంగం అమలు పరచాలంటే, అందుకు అనుకూలంగా ఎక్కువమంది అభిప్రాయం కూడా వుండాలి. ఇది ఎంతవరకూ పనిచేస్తుందనేది ఇప్పుడు చెప్పటం కష్టం. ప్రారంభదశలో పరిమితంగానే కావచ్చు. కాని మనం కోరుకుంటున్నట్లుగా, ప్రజాస్వామ్యం కోసం విద్యను వ్యాపింపచేయడంలో కొందరు నిమగ్నులై వుంటారు. ఈ కృషి ఫలప్రదమైనంతవరకూ, రాగద్వేషాతీత వ్యక్తులు క్రమంగా తమ అర్హ స్థానాలకు ఎక్కువగా వస్తారు. ఇదంతా (1884లో ఇంగ్లండులో వ్యవస్థాపితమైన ‘ఫేబియన్’ సొసైటీ, శాంతియుతంగా సోషలిజం అనే క్రమంగా వ్యాపించాలని, ఉద్దేశించారు) ఫేబియన్ క్రమవాదం వలె కనిపిస్తుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టుల సాహసవాదమే అవుతుంది. మనకు స్వేచ్ఛ కావాలనుకుంటే, కమ్యూనిస్టు చెప్పే మార్గాంతరం ఎంత ఉద్వేగంతో కూడినదైనా ఎలాంటి అవకాశాన్నీ ఇవ్వదు. కనక క్రమేపీ ఆచరించవలసి వచ్చినప్పటికీ దానిమీద ఆధారపడక తప్పదు. కాంతి వేగంకంటే (త్వరణం) మించిపోవడానికి ప్రకృతిలో సాధ్యం కానప్పుడు మనం అంతకంటే వేగంగా పోజాలం. మనం పనిచేసే పరిస్థితులలో వేగాన్ని ఆటంకపరచే పద్ధతి వుంటే, అప్పుడు వాస్తవంతో సంఘర్షణకు దిగడం ఆదర్శప్రాయంగా ఉంటుంది. ప్రకృతిలో కాంతి త్వరణం (వేగం)లా సమాజంలో మార్పుకు కూడా క్రమమే తొందరతో కూడినది. ఇందులో ఒకటి ఎంత వాస్తవమో, రెండోదీ అంతే. పరిమితులు కూడా అందులోనే ఇమిడి ఉన్నాయి.
అయితే, సామాజిక మార్పు అనేది పదార్థ, యాంత్రిక విధానాల ననుసరించి లేదు. అదంతా మానవ ప్రయత్నం మీద ఆధారపడి వుంది. మానవుడి సృజనాత్మక శక్తి, సాధనలో అవధులు లేనిది కనక, సామాజిక మార్పుకు మానవ ప్రయత్నం తోడైతే, అనంత ప్రయాణం అనుకున్నది అత్యంత సమీపం కూడా కావచ్చు. రాజ్యానికీ, సమాజానికీ ఉన్న సంబంధాలు, వీటితో పోల్చి చూస్తే వ్యక్తి స్థితి అనే వాటిని, 22 రాడికల్ ప్రజాస్వామ్య సూత్రాలలో గమనించవచ్చు. ఇవి రూపొందించక ముందే ముసాయిదా రాజ్యాంగంలో వీటికి సంస్థాగత రూపం ఇవ్వడం జరిగింది. ఒకటి మౌలిక సూత్రలా సంక్షిప్త వ్యక్తీకరణ అయితే, రెండోది ఆచరణలో అన్వయించడానికి ఉపకరించేది.  రెండిటినీ కలిపి పరిశీలించాలి. అప్పుడు అధికారానికి అప్పుడు అధికారానికి సంబంధించిన సమస్య పరిష్కారమవుతుంది.
ఇవి నా భావాలు. రాజకీయ పార్టీలు అధికారం కోసం పెనుగులాడుతుండగా, రాడికల్ ప్రజాస్వామిక పార్టీ (1940 లో పుట్టిన ఈ పార్టీని 1948లో కావాలని రద్దు చేసుకున్నారు. ఎం.ఎన్.రాయ్ దీని స్థాపకులు, రద్దు కావించినవారు కూడా.) అధికారం హస్తగతం చేసుకొనే ప్రయత్నం చేయబోవడం లేదనే స్పష్టం చేస్తున్నాం. అధికారాన్ని ఇతరులకు సంక్రమింపజేసే ఆచారం ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేసినదని మా సూత్రం. ఏదో ఒక నెపంతో ప్రజల వద్దనుంచి అధికారాన్ని సంక్రమింపచేసుకుంటే, అది స్వల్పకాలానికే అయినప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని చంపేసినట్లే. అధికారం సర్వదా ప్రజలతోనే ఉండాలి. ప్రజాస్వామ్యానికి అదొక్కటే రక్షణ. అయితే దీనికి సంస్థాగత రూపాన్ని ఇవ్వాలి. అనేకమంది వ్యక్తులను బానిసలను చేసే సమాజంలో, లాంఛనప్రాయంగా ప్రజలకు అధికారం ఉన్నా ప్రజాస్వామ్యం కపటమే అవుతుంది.
సంఘటిత ప్రజాస్వామ్యం:
అందుకే, సంఘటిత ప్రజాస్వామ్యం అనే భావనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ భావానికి ప్రజా సంఘాలు నిర్దిష్టమైన రూపు రేఖలను సమకూర్చుతాయి. రాజ్యంలో ప్రాథమిక సంస్థా సభ్యులుగా వ్యక్తిగత సభ్యులు ఏకాకిగానూ, నిస్సహాయంగానూ ఉండరు. ప్రస్తుత రాజ్యంలో ప్రజల సార్వభౌమత్వం కట్టుకథగా ఉంటున్నది. ప్రజా సంఘాలు విస్తృతాధికారాలతో స్థాయీ సంఘాలుగా ఉంటూ, విస్తారమైన ప్రాంతాలకు ఏర్పడే సంఘాలపై సరాసరి ప్రభావాన్ని చూపెట్టటానికి వీలుగా ఉంటాయి. ఈ సంఘాలవల్ల అధికారం అన్ని వేళలా ప్రజలకే ఉంటుంది. రాజ్యం అనేది సమాచారాన్ని అందిస్తూ, సలహాలనిస్తూ, పాలనా యంత్రాంగాలను సమన్వయూకరిస్తూ, ప్రజలు రూపొందించిన విధానాలను పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా, రాజ్యం అనేది సమాజంతో కలసిపోతుంది. దేశమంతటా కూడా, సామాజిక జీవనం మేళవింపుగా సాగటానికి, మొత్తం మీద సమన్వయీకరణతో ఉండటానికి తోడ్పడుతుంది.
ఈ ఆదర్శంతో ఉన్నందువల్ల మా పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోవటం అనే ప్రశ్నే జనించదు. అధికారంలో ఇతర రాజకీయ పక్షాలలా ఇదికూడా చెడిపోతుందనే భయం ఉండటం కూడా అసందర్భమే. వివేచనతో ఉన్న విషయం తెలుసుకున్న మానవుడు నైతికంగా ఉండాటు కనక, అతడు అధికారం వల్ల చెడిపోయే ప్రశ్నే లేదు. ఈ సందర్భంలో ఉన్న మా పార్టీ వంటిదేదైనా అధికారం కోసం ప్రయత్నించదు. ఇది పార్టీగా అధికారంలోకి వచ్చే సమస్యే లేదు. ప్రజా సంఘాల వల్ల సంఘటితమైన ప్రజలలో అధికారం వుండాలని, ప్రజలు ఆ సంఘాల వల్ల విద్యాధికులై, తమ సార్వభౌమత్వాన్ని ఎలా వినియోగించుకోవాలో నేర్వడం జరుగుతుంది. అధికారం కోసం పార్టీలు పెనుగులాడటం అసంభవమవుతుంది. మరో పది పార్టీలు ఉండనివ్వండి. ఏ పార్టీని అణచివేయనక్కరేదు. కాని మేము విజయం పొందితే ఏ పార్టీ కూడా, అధికారాన్ని పట్టుకోదు. ప్రజా సంఘాలలో ఉన్న ప్రజలకే అధికారం ఉంటుంది. కొంతకాలం వరకూ ఏదో ఒక పార్టీ లేదా పార్టీలు అధికారాన్ని ఆక్రమించుకొనే ప్రయత్నం చేయవచ్చు. ఆ కార్యక్రమంలో మేము పోటీకి దిగం. ఆ కార్యక్రమం ప్రజాస్వమ్యాన్ని తృణీకరించటమే. ప్రజలను విద్యాధికులను చేసే ప్రాథమిక ప్రయత్నంలో నిమగ్నులమవుతాం. ఏదో ఒక ఆకర్షణీయమైన నెపంతో ప్రజల అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎవరినీ ప్రజలు అనుమతించని స్థితి వచ్చేవరకూ ఇలా జరగాల్సిందే. ప్రాచీన కాలంలో ప్లేటో ఆచరణలో పెట్టిన సూత్రాన్ని అన్వయించి, ప్రజాస్వామ్యానికి విద్య మూలం, అనేది దృష్టిలో పెట్టుకుని సాధించ ప్రయత్నిస్తాం. పౌరులందరూ తమ వివేచనను గుర్తించేటట్లు తోడ్పడతాం. ఆధునిక విజ్ఞానం ప్రమాణయుతంగా, మానవుడు ప్రాయికంగా హేతువాది అని చెపుతున్నది. కన హేతువాదాన్ని  గుర్తింపచేసేటట్లు విద్యా ప్రయోజనం ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ఈ ధోరణి అని గుర్తిస్తే, అధికార పెనుగులాటే రాజకీయ ప్రయోజనం అనేది పోతుంది. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకోవు. రాజకీయాలు ప్రజా పరిపాలనకు సంబంధించిన కళగా మారుతుంది. ఈ కళలో ప్రతి వ్యక్తీ నైపుణ్యాన్ని సంపాదిస్తే, రాజ్యం, సమాజం ఒకటవుతాయి.
అధికారాన్నిపలచబడేటట్లు చేయడం
________________________
అధికారాన్ని హస్తగతం చేసుకోటం గాక, పలచబడేటట్లు చేయడం రాడికల్ ప్రజాస్వామ్య పార్టీ ఉద్దేశం అనడంలో స్వప్నావస్థ ఏమీ లేదు. ప్రతి రాడికల్ డెమోక్రాట్ ఉద్దేశం ఇదే. అధికారం పట్టుకోవాలనే కాంక్షను విడనాడి స్వేచ్ఛకోసం కృషి చేయటం ఎందుకు సాధ్యం కాదు.. ఈ అవకాశాన్ని గుర్తించటానికి, అధికారం అనేది ప్రజలందరిలో గాక, కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైతే, అది స్వేచ్ఛకు వ్యతిరేకమవుతుందని తెలుసుకోవాలి. కమ్యూనిస్టులు, ఫాసిస్టులు హెగెల్ నుంచి స్వీకరించిన స్వేచ్ఛాభావాన్ని మనం త్యజించాలి. ఆవశ్యకతను గుర్తించటమే స్వేచ్ఛ అయితే, బానిసత్వానికి అదొక మారుపేరు మాత్రమే. సమష్టి రాజకీయ దేవతాపీఠం దగ్గర ఆరాధించే వారంతా, స్వేచ్ఛను ఈ విధంగానే స్వీకరించారు. అందరికీ స్వేచ్ఛ కావాలంటే ప్రతి ఒక్కడూ స్వేచ్ఛను ఒదులుకోవాలన్నారు. వ్యక్తి స్వేచ్ఛను కాదంటూ, మరేదో అదనంగా మార్మిక శక్తి వచ్చి సమాజానికి స్వేచ్ఛ కలుగుతుందన్నారు. ఇటువంటి మార్మికమైన స్వేచ్ఛ మోసపూరితం. కనుకనే అధికారంతో వ్యక్తులను మోసంగించి, భ్రమింపజేసి, వారి నుంచి ఐచ్ఛికంగా లొంగుబాటు జరిగేటట్లుగా చూస్తారు.
వ్యక్తులు మానసికంగా, బానిస బంధాలలో ఉన్నంత కాలం సమాజం స్వేచ్ఛగా ఉండదని గమనించిన అనంతరం, అధికారం కోసం రాజకీయాలు అనేవి కూడా నిరాకరించవలసి వస్తుంది. ఇటువంటి విశ్వాసంతో ఉన్నంత మాత్రాన రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ రాజకీయాలను వదిలేస్తుందనుకోకూడదు. అయితే ఈ పార్టీ రాజకీయాలు అధికార రాజకీయాలు కాదు. స్వేచ్ఛతో కూడిన రాజకీయాలు మాత్రమే.
ఈ నమ్మకం లేకుంటే, మనల్ని మనమే సందేహిస్తే, ఇతరులకు నచ్చజెప్పలేము. అధికార తృష్ణలేని రాజకీయాలు సాధ్యమే కాకుంటే రాజకీయాలు హేతుబద్ధంగా గానీ, నీతిమంతంగా గానీ ఎన్నడూ ఉండజాలవు. ఏ నీతి, నియమం లేకుండా, చిత్తశుద్ధి లేకుండా పరస్పరం గొంతులు  కోసుకునే ప్రయత్నమే రాజకీయమవుతుంది. జీవితం అంతా రాజకీయాలలో ఉత్సాహంగా పాల్గొన్న నేను ఈ నైచ్యపు ఆటకు దిగను. ప్రత్యామ్నాయం సాధ్యమేనని నా నమ్మకం, ఆశ కూడా. ఆధునిక నాగరికతను సంక్షోభం ఆవరించిందని అందరూ అంగీకరించారు. అది వాస్తవం. ఆ సంక్షోభానికి మూల లక్షణం ఏమిటి… స్థాణువుగా ఉన్న పరిస్థితిని అంతం చేయటమే సంక్షోభం  అంటే పరిస్థితులు తీవ్రస్థాయికి చేరుకున్నాయన్నమాట. ఇప్పుడు అటో ఇటో తేలాలి. మానవజాతి, ఆటవికతలోకైనా పోవాలి. ఉజ్వలలోనైనా దారి కనుక్కోవాలి. రెండో మార్గాంతరనికి అవకాశం వుంటే, మానవతా వాదం పైకి వస్తుంది. దీని విజయానికి రాజకీయాధికారం అవసరం లేదు. జాతీయవాదులు, కమ్యూనిస్టులు అధికారం కోసం పెనుగులాడినటువంటి ప్రపంచాన్ని పతనావస్థకు తీసుకుపోనివ్వండి. మానవతావాదం మాత్రం విమోచనకు కృషి సాగిస్తున్నది. అది ఎక్కడో స్వర్గంలో కాదు --- ఇక్కడే, ఈ ప్రపంచంలోనే సమగ్ర మానవతావాద రాజకీయాలు సమూల ప్రజాస్వామ్య వ్యవస్థను తెస్తాయి. ఇదే ఆధునిక మానవుడికి తత్వం కావాలి. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటబడి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలంటే నేటి వైజ్ఞానిక, జ్ఞాన వికాస యుగంలో సమగ్ర మానవతావాదమే శరణ్యం.

రచన: అనువాదం:
ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment