అమెరికాలో క్రైస్తవులనుద్దేశించి శామ్ హారిస్ (సుప్రసిద్ధ మనోవిశ్లేషణ శాస్త్రజ్ఞుడు, హేతువాది) ‘ఒక బహిరంగ లేఖ’ను సంచలనాత్మకంగా ప్రచురించాడు. లోగడ ‘మూఢనమ్మకాలకు స్వస్తి’ అనే గ్రంథం రాసి బహుళ ప్రచారం పొందిన శామ్ హారిస్ లేఖతో మరికొంత సంచలనం సృష్టించాడు. ఆయన అనుమతితో దీన్ని తెనిగించి ప్రచురించాను. అది వరుసగా ఇక్కడ అందిస్తున్నాము.
క్రైస్తవం ఇంత అమానుషమా
(లెటర్ టు క్రిస్టియన్ నేషన్)
పరిచయ వాక్యాలు
శామ్ హారిస్ మాటలలో సౌమ్యుడు. కలం పడితే చాలా పదునైన భావాలు వెలువడతాయి. మతాల ఘోర కృత్యాలను, దారుణ హింసలకు బాగా రియాక్ట్ అయ్యి మానవులను మంచి మార్గంలో నడపడానికి మతాలు ఎలా అడ్డు వస్తున్నాయో అధ్యయనం చేసి తెలుసుకున్నారు. ఆయనను మొట్టమొదట 2005లో అమెరికాలో బఫెలో నగరంలో కలిశాను. సెంటర్ ఫర్ ఇంక్వరీ ట్రాన్స్ నేషనల్ వాళ్ళు పాల్ కట్జ్ ఆధ్వర్యాన నూతన వికాసం అనే పేరిట 5 రోజులపాటు ప్రపంచ సభలు జరిపారు. వాటిల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు శామ్ హారిస్ కలిశారు. అప్పటికే ఆయన ది ఎండ్ ఆఫ్ ఫెయిత్ పుస్తకం వెలువరించారు. అది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా బహుళ ప్రచారంలోకి వచ్చింది. తన ఆటోగ్రాఫ్ తో ఆ పుస్తకాన్ని నాకు బహూకరించారు. వివిధ మతాల ఆచారాల, నమ్మకాల విషయాలను తెలుసుకోవడానికి పర్యటన చేస్తూ, భారతదేశంలో ఉత్తరాది ప్రాంతాలలో అనేకచోట్లకు వెళ్లానని చెప్పారు. ఆ సమావేశాల్లో చర్చా వేదిక నుండి మాట్లాడిన శామ్ హారిస్ ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడారు.
శామ్ హారిస్ 1967లో పుట్టారు. ఆయన స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివారు. సుప్రసిద్ధమైన పత్రికలకు వ్యాసాలు రాశాడు. అందులో లాస్ ఏంజిల్స్ టైమ్స్, ప్లే బోయ్, ఫ్రీ ఇంక్వరీ, టైమ్స్ వంటి పత్రికలలో చాలా లోతుపాతులయిన విషయాలు చర్చించారు. ఫ్లెమింగ్ ది గాడ్ హువజ్ నాట్ దేర్ అనే సినిమాలో ప్రత్యేక అభిప్రాయాలను ఇస్తూ రికార్డు చేశారు. మెదడులో నమ్మకాలకు అతీంద్రియ విషయాలకు ఆసక్తి కనబరిచే ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని న్యూరో సైన్స్ విభాగంలో పిహెచ్.డి చేస్తున్నారు. దీనికిగాను ఎమ్.ఆర్.ఐ పరికరాలను ఉపయోగిస్తున్నారు. అనేక సెక్యులర్ ప్రాజెక్టులను ప్రపంచ వ్యాప్తంగా స్థాపించి హేతుబద్ధంగా శాస్త్రీయంగా ఆలోచించడానికి పథకాలు వేశాడు. హఫింగ్టన్ పోస్ట్ వ్యాసాలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. తూర్పు పశ్చిమ ప్రపంచపు సంప్రదాయాలను ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అమెరికా యూరోపులలో నిరంతర చర్చా వేదికలలో పాల్గొంటున్నారు.
శామ్ హారిస్ క్రైస్తవుల ప్రాబల్యాన్ని, అమెరికాలో వారి మూర్ఖత్వాన్ని మతం పేరిట అటు అధికారంలో ఉన్నవారు. ఇటు చర్చిల పురోహిత వర్గాలు చేస్తున్న మావో చిత్రహింసలను బయట పెడుతున్నారు. ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా నడుపుతూ ఆసక్తిపరులకు జిజ్ఞాసాపూర్వకమైన విషయాలను అందిస్తున్నారు. క్రైస్తవులపై ఆయన చేసిన దాడి ఇతర మతాలకు కూడా వర్తిస్తుంది. ముస్లింలు, హిందువులు, యూదులు, సిక్కులు తదితరులు చేస్తున్న దారుణాలను ద ఎండ్ ఆఫ్ ఫెయిత్ లో బాగా విపులీకరించారు. సమకాలీన ప్రపంచంలో బుష్ ఆధ్వర్యాన ఛాందస క్రైస్తవుల విజృంభణతో సమాజం ఎలా వెనక్కు పోతున్నదో హెచ్చరించడానికి రాసిన ఈ పుస్తకం చాలా శక్తివంతమైన ఆయుధం.
ఫ్రీ ఇంక్వరీ పత్రిక ఎడిటర్ నా మిత్రులు టాం ఫ్లిన్ ఈ రచన తెలుగు అనువాదానికి చొరవ తీసుకుని అనుమతి పంపేటట్లు ఏర్పాడు చేశారు. ఆయనకు ధన్యవాదాలు. ఇటువంటి ఆలోచన భారతదేశంలోనూ అవసరమేనని మిత్రులు శిశిర్ చలసాని ఈ గ్రంథాన్ని తెనిగించమని విస్తారంగా ప్రజలలోకి వెళ్ళాలని ప్రోత్సహించారు. ఆయన కనబరిచిన ఉత్సాహమే ఈ అనువాదానికి ప్రచురణకు దారితీసింది.
శక్తివంతమైన ఇటువంటి శాస్త్రీయ దృక్పథాలు అన్ని మతాలకు అన్వయిస్తూ రావాలి. పాఠకులు ఈ గ్రంథాన్ని చదివి, చదివించి సమాజానికి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. శామ్ హారిస్ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. ఆయనకు భార్య కుమారుడు ఉన్నారు.
--- ఎన్. ఇన్నయ్య
పాఠకులకోమాట
‘నమ్మకానికి అంతం’ (ఎండ్ ఆఫ్ ఫెయిత్) అనే శీర్షికన నా తొలి పుస్తకం రచించినప్పటి నుండి దేవుణ్ణి నమ్మకపోవడంలో నేను తప్పు చేస్తున్నానని వేలాదిమంది నాకు ఉత్తరాలు రాశారు. ఇందులో క్రైస్తవుల నుండి వ్యతిరేకమైనవి వచ్చాయి. ఇది చాలా విడ్డూరమైనది. ఇతరులకంటే తమ మతం ప్రేమను, క్షమాపణను చాలా బాగా ఆచరణలోకి పెడుతుందని ఊహిస్తారు. క్రీస్తు ప్రేమ వలన మారిపోయామని చెప్పేవారు. విమర్శలు సహించలేక చాలా ఘాటుగా హత్యచేసేటంత కసిగా ఉంటున్నారు. ఇది మానవ స్వభావం అనుకోవచ్చు. కానీ అలాంటి ద్వేషం బైబిల్ నుండి రాబట్టడం స్పష్టంగా ఉంది. ఇదెలా తెలుసు? నాకు ఉత్తరాలు రాసేవారు బైబిల్ లో అనేక సూత్రాలను ఉదహరిస్తూ ఉంటారు.
ఈ పుస్తకం అన్ని మతాల వారిని ఉద్దేశించి ఉంది. కాని ‘క్రైస్తవులకు బహిరంగ లేఖ’గా దీనిని బయట పెడుతున్నాను. క్రైస్తవులు తమ మత విశ్వాసాలను సమర్ధిస్తూ వాదించే తీరును దృష్టిలో పెట్టుకుని రాశాను. మన సమాజంలో సెక్యులరిస్టులు మతాన్ని ప్రభుత్వాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నారు. వారిని సమర్థిస్తూ ఈ రచన చేశాను. క్రైస్తవులు ఇందుకు వ్యతిరేకంగా తమ హక్కులకు పోరాడుతున్నారు. ఈ పుస్తకంలో క్రైస్తవం అని ఉద్దేశించింది పరిమిత దృక్కోణంలోనే. క్రైస్తవులు బైబిల్ ను దైవ ప్రేరణ విధంగా భావిస్తారు. జీసస్ క్రైస్ట్ కు దివ్యత్వం ఉన్నట్లుగా నమ్మినవారే మరణానంతరం ముక్తిని పొందుతారని అంటారు. అమెరికా జనాభాలో చేసిన వైజ్ఞానిక సర్వేలను బట్టి సగంమంది ఇలాంటి నమ్మకాలు వెల్లడిస్తున్నారు. క్రైస్తవ శాఖలో ఈ నమ్మకాలు వివిధ రీతులుగా వున్నాయి. కాథలిక్కులు, ప్రొటస్టెంట్ లు, ఎవాంజలిస్టులు, బాప్టిస్టులు, పెంటెకోస్టులు, జెహోవా విట్ నెస్ లు తదితర మితవాద శాఖలు ఈ వాదనలో ఉన్నారు. మితవాద క్రైస్తవులు జాతీయ రంగంలో – కోర్టులలోను, స్కూళ్లలోనూ, ప్రభుత్వ శాఖలలోనూ చాలా ప్రభావాన్ని చూపుతున్నారు.
‘క్రైస్తవ దేశానికి బహిరంగ ఉత్తరం’ రాయడంలో క్రైస్తవులు నైతిక నటనలకు వారు కట్టుబడి ఉన్నామనుకునే తీరు తెన్నులు పటాపంచలు చేయదలచాను. ఉదారవాద, మితవాద క్రైస్తవులు నేను చెప్పే క్రైస్తవంలోకి రామని అంటారు. ఈ మితవాద, ఉదారవాద క్రైస్తవులు నా వలె ఇతర క్రైస్తవులు తమ హక్కుగా నిర్ధారించే విషయాలపట్ల కలవరం చెందుతున్నారు. తమ మత విశ్వాసాల పట్ల వారు కోరే హక్కులు ఆధారంగా ఇతర మతాల తీవ్రవాదులు కూడా రక్షణ కోరుతున్నారని వారు గుర్తించాలి. ఈ ఉదార మితవాదులు విమానాలతో భవనాలను కూలగొట్టకపోవచ్చు. ప్రపంచం అంతం అవుతున్నదని చెప్పే జోస్యాలు నమ్మకపోవచ్చు. కాని పిల్లల్ని క్రైస్తవులుగా, ముస్లింలుగా, యూదులుగా పెంచడాన్ని వారు ప్రశ్నించరు. ప్రపంచంలో మతపరంగా ఉన్న అత్యంత అభ్యుదయకర నమ్మకస్తులు సైతం ప్రశ్నించడంలేదు. ‘లెటర్ టు ఎ క్రిస్టియన్ నేషన్’లో క్రైస్తవులు ఎలా విభజిస్తున్నారో, హాని చేస్తున్నారో తిరోగమనం వైపు తీసుకెడుతున్నారో చూపాను. ఇందులో ఉదార వాదులు, మితవాదులు, నమ్మకం లేనివారు సర్వసాధారణమైన విషయాలను తమ మధ్య ఉన్నాయని గ్రహించవచ్చు.
అమెరికాలో ఇటీవల గాలప్ పోల్ తీసుకుంటే కేవలం 12 శాతం మాత్రమే భూమి మీద మానవ జీవనం దేవునితో నిమిత్తం లేకుండా సహజంగా పరిణమించిందని అన్నారు. కాని 31 శాతం మంది పరిణామానికి దేవుడు దయ ఉన్నది అన్నారు. ప్రపంచాన్ని గురించి ఎలాంటి అభిప్రాయం ఉన్నది అని పోల్ పెడితే తెలివిగల పథకం ఎవరో రూపొందించారనే అంశం తెలుస్తుంది. దేవుడు విధానం ఓడిపోతుంది. ప్రకృతిలో తెలివిగల పథకం ఎవరో రూపొందించారనే అంశానికి సాక్ష్యాధారాలు లేవు. పైగా ఈ పథకంలో తెలివిలేని రీతులు ఎన్నో కనిపిస్తాయి. తెలివిగల పథకంపై జరుగుతున్న వాదోపవాదాలు మనల్ని పక్కదారి పట్టించరాదు. 21వ శతాబ్దంలో మతపరంగా వస్తున్న ఆందోళనకర అంశాలు విస్మరించరాదు. అమెరికాలో 53 శాతం సృష్టివాదులని గ్యాలప్ పోల్ చెబుతున్నది. ఒక శతాబ్దం పాటు శాస్త్రీయ పరిశోధన జీవితాన్ని, భూమిని గురించి ఎంతో పరిశోధనలు చేసి శాస్త్రీయంగా విషయాలు వెల్లడించింది. అయినా మన తోటి వాళ్ళలో సగం మంది 6,000 సంవత్సరాల క్రితం ఈ విశ్వం పుట్టినట్లు నమ్ముతున్నారు. సుమేరియన్లు జిగురు కనుగొన్న వెయ్యి సంవత్సరాల తరువాత పరిస్థితి ఇలా ఉన్నది. రాష్ట్రపతిని, శాసన సభ్యులను ఎన్నుకొనే అధికారం గలవారు, ఆ సభలకు ఎన్నికయినవారు నోవా ఓడలో డైనోసార్లు జంటలుగా వుండేవని, సుదూరాన ఉన్న పాలపుంతల వెలుగు భూమి ద్వారా సృష్టి అయిందని, మనుషుల్లో తొలి స్త్రీ పురుషులు మట్టి నుండి సృష్టి కాగా దైవము ఊపిరి పోసిందని, ఈడెన్ తోటలో మాట్లాడే పాము ఉండగా అదృశ్య దేవుడు ఈ చర్యలని చేశాడని నమ్ముతున్నారు.
అభివృద్ధి చెందిన దేశాలలో అమెరికా నమ్మకాలు ఏకాకిగా కనిపిస్తున్నాయి. చరిత్రలో మునుపు ఎన్నడూ లేనంతగా అమెరికా దిగజారిపోయి నిలిచింది. అగ్రరాజ్యం, ఉన్నత మూర్ఖత్వంతో ఉంటే అది దారుణమైన అంశమని నాగరికతను పట్టించుకోనివారు ఎవరైనా అనుకోవాల్సిందే.
చాలామంది నాగరికత ఎట్లాపోతే ఏంటి అనుకుంటున్నారు. అమెరికా జనాభాలో 44 శాతం జీసస్ తిరిగి వస్తాడని, రానున్న ఏభయి సంవత్సరాలలో జనాల భవిష్యత్తు నిర్ణయిస్తాడని, భూమి మీద పరిస్థితులు దారుణంగా పరిణమించినప్పుడు జీసస్ తిరిగి వస్తాడని బైబిల్ జోస్యాన్ని వ్యాఖ్యానించేవారు ఉంటున్నారు. న్యూయార్క్ నగరం అగ్నికి ఆహుతి అయితే అప్పుడు అమెరికా జనాభాలో కొందరు క్రీస్తు తిరిగి రావడానికి అదొక చిహ్నంగా భావించి ఆహ్వానిస్తారు కూడా. ఇలాంటి నమ్మకాలు మనుషుల మనసుల్ని మూసిపెడుతుంటే, సాంఘికంగా, ఆర్థికంగా, పరిసరాల దృష్ట్యా భౌగోళిక రాజకీయాల దృష్ట్యా మంచి భవిష్యత్తు నిర్మించుకోవడం కష్టం. అమెరికా ప్రభుత్వంలో చాలామంది ప్రపంచం అంతం అవుతుందని అది దివ్యమైన స్థితి అని నమ్మితే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించండి. అమెరికా జనాభాలో సగం మందికి ఇలాంటి నమ్మకాలున్నాయి. అందుకు మతంపట్ల మూర్ఖ నమ్మకమే కారణం. అటువంటి స్థితిని నైతికంగా, మేథస్సు రీత్యా అత్యవసర పరిస్థితిగా మనం భావించాలి. అటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది కనుకనే ఈ పుస్తకం మీ ఎదుట ఉంచాను. ఇది మీకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశ్యం.
-- శామ్ హారిస్
క్రైస్తవుల నుద్దేశించి శామ్ హారిస్ రాసిన లేఖ
బైబుల్ దైవవాణిగా మీరు నమ్ముతున్నారు. జీసస్ ను దేవుని కుమారుడుగా విశ్వసిస్తున్నారు. జీసస్ లో నమ్మకం ఉంచిన వారికే మరణానంతరం ముక్తి ఉందంటున్నారు. క్రైస్తవుడుగా ఇవన్నీ నిజమని నమ్ముతున్నారు. అంతేగాని మీకు వాటివల్ల బాగా ఉందని అనిపించడం ప్రధానం కాదు. ఈ నమ్మకం వలన వచ్చే సమస్యలు చూపే ముందు మీరు, నేను అంగీకరించే విషయాలు కొన్ని ఉన్నాయి. మనలో ఎవరో ఒకరు చెప్పింది సరయినది కావాలి. మరొకరిది తప్పు కావాలి. ఇక్కడ బైబుల్ దైవవాక్యం కావాలి. లేదా దైవ వాక్యం కాదు అనేది సరయిన నిర్ణయం కావాలి. మానవుడికి జీసస్ ఒకే ఒక సరయిన ముక్తి మార్గాన్ని చూపారు. (యోహాను 14:6) లేదా అతడు చెప్పినది సరయిన మార్గం కాదనుకోవాలి. సరయిన క్రైస్తవుడు మిగిలిన అన్ని మత విశ్వాసాలలో తప్పు అనుకోవాలి. వారి దృష్ట్యా అది మంచిదే. క్రైస్తవం మనకి సరయినదయితే నావంటి నమ్మకం లేనివారు నరకంలో యమ యాతనలు పడటానికి సంసిద్ధులు కావాలి. నేను నా సన్నిహితులకు నచ్చచెప్పి దైవ భావాన్ని తృణీకరించమంటాను. అలాంటి వారంతా శాశ్వత నరకంలో కాలుతూ ఉండాల్సిందే (మత్తయి 25:41). క్రైస్తవ మూల సిద్ధాంతం సరయినదయితే నా జీవితాన్ని పరమ ఛండాలంగా గడిపానన్నమాట. అరమరికలు లేకుండా ఇందుకు నేనంగీకరించాలి. క్రైస్తవాన్ని బహిరంగంగా నిరంతరం నిరాకరించిన నాకు ఎలాంటి చీకు చింతా లేవు. క్రైస్తవునిగా ఉండడానికి నీకెలాంటి అసంబద్ధమైన నమ్మకాలున్నాయో నాకు తెలుసు.
కొందరు క్రైస్తవులు ఈ రెండు వాదనలతో అంగీకరించరు. ఇతర మత విశ్వాసాలు ముక్తికి తోడ్పడతాయని నమ్మే క్రైస్తవులున్నారు. నరకం అంటే భయపడనివారు, జీసస్ తిరిగి వస్తాడని నమ్మనివారు కొందరు క్రైస్తవులలో ఉన్నారు. అలాంటివారు మతపరంగా ఉదారవాదులు, మితవాదులు అని చెప్పుకుంటారు. నాకు, మీకు విశ్వాసం రావాలంటే వారి దృష్టిలో ఏదో తప్పుగా అర్థం చేసుకుంటాం అన్నమాట. ఆలోచనాపరమైన క్రైస్తవులు ఎందరో నాస్తిక వాదానికి, మత మౌఢ్యానికి మధ్య ఎంతో విశాలమైన, రమణీయమైన దృక్పథాలు ఉన్నాయని చెబుతూ వచ్చారని అంటున్నాం. వారి ప్రకారం విశ్వాసం అంటే మార్మికత, విడమర్చి చెప్పడం. ప్రజల నమ్మకాల నుండి కాక వారి జీవితాల పడుగు పేకల నుండి మతాన్ని రూపొందించుకుంటారన్నారు. మతపరమై ఉదారత్వం, మితవాదాన్ని గురించి వచ్చే సమస్యల్ని నేను వేరే చోట్ల ప్రస్తావించాను. ఇక్కడ వారనుకునే వాటికంటే సాధారణమైన, అత్యవసరమైన విషయాలను పరిశీలించాలి. బైబుల్ కేవలం మామూలు గ్రంథం, మామూలు మనుషులు రాసింది అయివుండాలి. లేదా అందుకు భిన్నమైనదైనా అయివుండాలి. క్రీస్తు దివ్య వ్యక్తి అయి ఉండాలి. లేదా కాదనుకోవాలి. బైబుల్ గనక మామూలు గ్రంథం అయితే, క్రీస్తు మామూలు మనిషి అయితే క్రైస్తవ మూల సిద్ధాంతం తప్పు. అలాంటప్పుడు క్రైస్తవ మత శాస్త్ర చరిత్ర సామూహిక భ్రమలతో కూడిన కథలని అనుకోవాలి. క్రైస్తవ మూల సూత్రాలు సరయినవి అనుకుంటే, నమ్మకాలు లేనివారు ఆశ్చర్యపడాల్సిన అంశాలున్నాయి. అది మీరు గ్రహించవలసి వుంది. అమెరికాలో సగం జనాభాకు ఈ విషయం తెలుసు. అందువలన చిత్త శుద్ధిగా మాట్లాడుకుందాం. ఈ వాదోపవాదాల్లో ఒక పక్షం నెగ్గుతుంది. మరో పక్షం ఓడిపోతుంది.
గమనించండి
ప్రతి ముస్లిం భక్తులు ముస్లింగా ఉండడానికి చెప్పే కారణాలు, క్రైస్తవుడు క్రైస్తవుడుగా ఉండడానికి చెప్పేకారణాలు ఒకలాంటివే అయినా ముస్లింలు చెప్పే కారణాలను సరయినవిగా నేను భావించను. కొరాన్ ‘సృష్టికర్త వెల్లడించిన దివ్య వాక్కు’ అన్నారు. బైబుల్ గురించి మీరెలా నమ్ముతున్నారో, ముస్లింలు కురాన్ గురించి అలాగే నమ్ముతున్నారు. మహమ్మద్ జీవితాన్ని చిత్రిస్తూ చాలా సాహిత్యం వచ్చింది. ఇస్లాం దృష్ట్యా అతడు దైవ ప్రవక్తగా ఇటీవల ఆవిర్భవించినవాడు. మహ్మదు స్పష్టంగా చెబుతూ జీసస్ ను దివ్యత్వం కలవాడు కాదన్నాడు (కురాన్ 5:71-75; 19:30-38). అన్యథా నమ్మేవారు శాశ్వతంగా నరకంలో మగ్గుతారన్నారు. ఈ విషయంలో మహమ్మద్ అభిప్రాయం తిరుగులేనిదని ముస్లింల ఉద్దేశ్యం.
ఇస్లాంలోకి మారడంలో మీరు కలవరపడాల్సిన అంశం ఏది? అల్లా నిజమైన దేవుడు కాదా? కొండ గుహలలో గాబ్రియెల్ అనే దేవత మహమ్మదును కలుసుకోలేదని రుజువు పరచగలవా? లేదు. ముస్లింల నమ్మకాలు అర్థం లేనివని తృణీకరించడానికి ఇవేమి రుజువు చేయనక్కరలేదు. మహమ్మదు వారి దేవుడు నిజమని నిరూపించే భారం ముస్లింలపైన పడింది. కాని వారలా రుజువు చేయలేరు కూడా. వాస్తవాన్ని గురించి సాక్ష్యాధారాలు ఉండాలని ముస్లింలు జడవలేదు. ఇస్లాం పిడివాదం మత్తులో ఉన్నవారు తప్ప మిగిలిన వారికి ఈ విషయం అర్థం అవుతుంది.
ముస్లింలకు సంబంధించిన నమ్మకాలు ఎలాంటివో నాస్తికుడిగా ఉండటం కూడా అలాంటిదే. ముస్లింలు వారిని వారు మోసం చేసుకోవడం లేదా? ‘కురాన్ సృష్టికర్త సంపూర్ణ వాక్కు’గా భావిస్తే ఆ పుస్తకాన్ని వారు నిశితంగా చదవలేదని తెలియడంలేదా? విశ్వం సిద్ధాంతాలు చిత్తశుద్ధితో పరిశీలించడానికి పనికిరావని స్పష్టం కావడంలేదా? అవును స్పష్టమే. నీవు ముస్లిం గురించి ఎలా అనుకుంటున్నావో నిన్ను గురించి ముస్లిం భక్తులు కూడా అలాగే అనుకుంటున్నారు. అన్ని మతాల గురించి నా ధోరణి అదే.
ప్రథమ భాగం
బైబుల్ ఎంత అత్యుత్తమమైనది ?
మానవ మంచితనానికి తిరుగులేని ఆధారం క్రైస్తవమేనని నీవనుకుంటున్నావు. జీసస్ ప్రేమను, దయను, స్వార్థ రాహిత్యాన్ని చూపాడని నమ్ముతున్నావు. ఇంతవరకు వచ్చిన గ్రంథాలలో బైబుల్ అత్యుత్తమమైనదని, కాల పరీక్షకు నిలచిందని, అది దైవ ప్రేరితమని నమ్ముతున్నావు. ఈ నమ్మకాలన్నీ తప్పుడువే.
నీతికి సంబంధించిన అంశాలు ఆనందానికి, బాధలకు చెందినవే. అందుకనే మనకు శిలల పట్ల నైతిక బాధ్యత లేదు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇతరులకు నీతి అంశాలు అన్వయిస్తే మన చర్యల ద్వారా ప్రభావితం అయితే అప్పుడు నీతి సమస్య వస్తుంది. బైబుల్ నీతికి సంపూర్ణ మార్గదర్శకమని అనడం దిగ్భ్రమ కలిగిస్తుంది. ఆ పుస్తకంలో అంశాలు చదివిన తరువాత అలా అనిపిస్తుంది. తల్లిదండ్రులకు దేవుడిచ్చిన సలహాలు సూటిగా ఉన్నాయి : పిల్లలు దారి తప్పితే బడిత పూజ చేయండి. (సామెతలు 13:24, 20:30, 23:13-14). సిగ్గు ఒగ్గు లేకుండా మాట్లాడితే చంపేయండి. (నిర్గమకాండం 21:15, లెవీయ కాండం 20:9, ద్వితీయోపదేశం కాండం 21.:18-21, మార్క్ 7:9-13, మాథ్యూ 15:4-7) నమ్మనందుకు, వ్యభిచారానికి, స్వలింగ సంపర్కానికి, విశ్రాంతి రోజున పనిచేసినందుకు, విగ్రహారాధన చేసినందుకు, భూతవైద్యానికి తదితర ఊహాజనిత నేరాలకు రాళ్ళేసి కొట్టి చంపాలి. దేవుడికి కాలాతీత వివేచన ఎంత ఉందో ఒక ఉదాహరణ చూడండి.
‘నీ సోదరుడు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భార్య, నీ స్నేహితుడు రహస్యంగా వచ్చి ఇతర దేవుళ్ళను ఆరాధించడానికి రమ్మంటే లొంగిపోవద్దు, వినద్దు, వారిపట్ల దయ చూపవద్దు, వదిలిపెట్టద్దు. దాచిపెట్టద్దు:వారిని చంపేయండి, అలాంటి వారిని హతమార్చండి, రాళ్ళతో కొట్టి చంపండి, నీ దేవుని నుండి నిన్ను తప్పించడానికి వారు ప్రయత్నం చేశారు. దేవుడిచ్చిన భూమి నుండి వైదొలగమని, ఇతర దేవుళ్ళ దగ్గరకు పోదామని ఎవరైనా పురికొల్పితే వారిని కత్తికి బలి చేయండి. వారి పశువులను కూడా చంపేయండి.’
- ద్వితీయోపదేశ కాండం 13:6, 8-17
చాలామంది క్రైస్తవులు జీసస్ గురించి నమ్ముతూ అతడు క్రూరత్వాన్నుండి వైదొలగి ప్రేమ, సహనం బోధించాడని నమ్ముతారు. కాని జీసస్ అలా చేయలేదు. నూతన ప్రకరణలో జీసస్ పూర్వ నిబంధన నియమాలను యథాతథంగా ఆమోదించాడు.
‘పరలోకము గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించు చున్నాను.’
కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాసనమును ఆచరించి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును.
మాథ్యూ 5:18-19
దేవదూతలు ఈ విషయాన్ని చాలా చోట్ల ప్రతిధ్వనించారు. (తిమోతి 3:16-17) జీసస్ ప్రేమను గురించి దాతృత్వాన్ని గురించి కొన్ని ఉన్నతమైన విషయాలు ప్రవచించాడు. అవి నైతికంగా గొప్ప అంశాలు. జీసస్ కు ముందే అలాంటి అంశాలు జొరాస్టర్, బుద్ధ, కన్ఫ్యూషియస్, ఎపిక్టిటస్ వంటి వారు చెప్పారు. బైబుల్ కంటే ఇంకా నిర్దిష్టంగా స్వీయ ప్రాధాన్యతను అధిగమించి ఎలా సాగిపోవాలో అనేక గ్రంథాలు ఉదహరించాయి. పాత కొత్త బైబుల్ నిబంధనలలో అసహ్యకరంగా హింసను మెచ్చుకుంటున్న సందర్భాలు అనేకం కనిపిస్తాయి. క్రైస్తవం గనక ప్రేమకు దయకు ప్రాతినిధ్యంగా నిలిచిందంటే ప్రపంచంలో ఇతర మతాల గురించి తెలుసుకోలేదన్నమాట.
జైనమతాన్ని గురించి చూడండి. జైనులు కేవల అహింసావాదాన్ని బోధించారు. విశ్వాన్ని గురించి వారు చెప్పిన విషయాలలో సంభవం కానివి చాలా ఉన్నా మత చిత్రహింసల పేరిట జరిగిన క్రూరత్వాన్ని వారు నమ్మలేదు. క్రైస్తవుల మత హింసాకాండ తప్పుత్రోవను పెట్టిన చర్యగా వీరు భావించవచ్చు. బైబుల్ బోధనలు పరస్పర విరుద్ధంగా గందరగోళంగా ఉన్నందున క్రైస్తవులు ఐదు శతాబ్దాలపాటు వారంటే నమ్మకం లేనివారిని సంతోషంగా తగలపెట్టారు. క్రైస్తవులు ఆరాధించి గౌరవించే సెయింట్ అగస్టిన్, థామస్ అక్వినాస్ లు విశ్వాస రహితులను చిత్రహింస చేయాలని (అగస్టిన్), చంపేయాలని (అక్వినాస్) చెప్పారు.
క్రైస్తవ మతానికి చెందని వారిని, నమ్మకం లేనివారిని, యూదులను, దయ్యం పట్టిన వారిని మూకుమ్మడిగా చంపేయాలని మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్ ప్రచారం చేశారు. బైబుల్ ను మరోవిధంగా మీరు వ్యాఖ్యానించవచ్చు. చరిత్రలో చాల ప్రభావవంతం చేసిన వారు క్రైస్తవ బోధనలని విడమరచి చెప్పినదానికంటే వీరు భిన్నంగా భాషించకపోవచ్చు. జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ వంటి వ్యక్తులు క్రైస్తవులలో ఉత్తమ ఉదాహరణ అని చాలామంది క్రైస్తవుల నమ్మకం. ఇందులో పెద్ద సమస్య ఇమిడి ఉన్నది. మార్టిన్ లూథర్ కింగ్ జూలియర్ కు ఆదర్శంగా నిలిచింది క్రైస్తవమే అయితే జైనిజం అనేది గుర్తించాలి. మార్టిన్ లూథర్ కింగ్ జూలియర్ తాను మహాత్మాగాంధీ నుండి అహింసా విధానాన్ని స్వీకరించినట్లు చెప్పాడు. 1959లో భారతదేశం పర్యటించి గాంధీ శిష్యుల నుండి అహింసాయుత పోరాటానికి అనుసరించాల్సిన సూత్రాలను నేర్చుకున్నాడు. హిందూగా ఉన్న గాంధీకి అహింసా సిద్ధాంతం ఎక్కడ నుండి వచ్చింది? జైనుల నుండి వచ్చింది.
జీసస్ గనుక పొరుగువాడిని ప్రేమించు అంటూ దివ్య సూత్రాన్ని చెప్పాడని నీవనుకుంటే బైబుల్ కొత్త నిబంధన మళ్ళీ చదువు. జీసస్ మళ్ళీ తిరిగి వస్తే నీతి ఎలా ఉంటుందో ఒకసారి గమనించు?
‘ఏలన, దేవుడు ఏది న్యాయమో దానినే చేయును. మిమ్ము కనిపెట్టువారికి కష్టములు కలిగించును. శ్రమనొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి కలిగించును. శక్తిమంతులగు దేవదూతలతో యేసు ప్రభువు దివి నుండి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇట్లు చేయును. దేవుని ఎరుగని వారిని శిక్షించుటకును, మన యేసు ప్రభువును గూర్చిన సువార్తకు విధేయులు కానివారిని దండించుటకును, అగ్ని జ్వాలలతో ఆయన దివి నుండి దిగివచ్చును. దేవుని సన్నిధికిని, ఆయన మహత్తర మహిమకును దూరస్థులై శాశ్వత వినాశమనెడి దండనమునకు వారు గురియగుదురు.’
-- 2 తెసలోనియన్స్ 1:6-9
‘నాయందు నివసింపనివాడు తీగవలె పారవేయబడి ఎండిపోవును. అట్టి తీగలను ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు.’
-- జాన్ 15:6
ఒక రకంగా చూస్తే జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్, అసిసీకి చెందిన సెంట్ ఫ్రాన్సిస్ చర్యలవంటివి జీసస్ లో కనిపిస్తాయి. మరో తీరులో జీసస్, మత చిత్రహింసల ప్రతి రూపంగా నిలిచాడు. బైబుల్ నీతి విషయంలో మార్గదర్శిగా నిలిచిందని నమ్మేవారు వింత భావాలతో ఉన్నారేమో అనిపిస్తుంది. బైబుల్ లోని నైతిక వివేచనను అంచనా వేసేముందు అందరికీ తృప్తికరంగా ఉండే రీతిలో నైతిక అంశాలను పరిశీలించడం మంచిది. బానిసత్వాన్ని గురించిన అంశం చూద్దాం. బానిసత్వం చాలా హీనమైనదని నాగరిక ప్రపంచమంతా నేడు అంటున్నది. ఈ విషయంలో అబ్రహాం దేవుడి నుండి సంక్రమించిన నీతి సూచనలు ఏమిటి? బైబుల్ ని సంప్రదించండి. సృష్టికర్త బానిసలని అట్టేపెట్టుకోమని మనకు చెప్పాడు.
‘నీకు బానిసలు కావలసి వచ్చినచో చుట్టుపట్ల నున్న అన్యజాతుల నుండి కొని తెచ్చుకొమ్ము.
మీ చెంత నివసించు పరదేశుల బిడ్డలను గూడ మీరు బానిసలుగా కొనవచ్చును. మీ దేశమున పుట్టిన ఇతర జాతుల సంతానము కూడా మీ సొత్తు కావచ్చును.
అట్టివారిని మీరు గతించిన తరువాత మీ పిల్లలు కూడా శాశ్వతమైన సొత్తుగా వాడుకోవచ్చును. అట్టి జనము మీకు బానిసలు కావచ్చును. కాని మీ తోడి యిస్రాయేలీయులను మాత్రము మీరు కఠినముగా చూడరాదు.’
-- లెవీయ కాండం 25..44-46
బైబుల్ ప్రకారం ప్రతివాడూ తన కుమార్తెలను లైంగికంగా అమ్ముకోవచ్చు. అందులో కొన్ని నాజూకులు చూపారనుకోండి :
‘ఒకడు తన కొమార్తెను బానిసగా విక్రయించిన, ఆమె మగ బానిస మాదిరిగా స్వేచ్ఛను పొందజాలదు.
ఆమె తన్ను పొందిన యజమానుని సంతోషపెట్టలేకపోయిన అతడు ఆమెను తిరిగి విక్రయించవచ్చును.
కాని ఆమెను విదేశీయులకు అమ్ము అధికారము అతనికి లేదు. అట్లు చేయుట అన్యాయము.
యజమానుడు ఆమెను తన కొమారుని కొరకు ఉద్దేశించినచో తన కొమార్తెపట్ల ఎట్లో అట్లే ఆమెపట్లను వ్యవహరించవలయును. ఎవ్వడైనను మారు పెండ్లమును చేసుకొనినచో మొదట ఆమె కూటికి, గుడ్డకు, దాంపత్య ధర్మమునకు లోటు లేకుండా చేయవలయును.
ఈ మూడింట అతడామెను మోసగించిన, ఆమె ఎట్టి సొమ్మును చెల్లింపకయే స్వేచ్ఛగా అతనిని వీడిపోవచ్చును’
--- నిర్గమ కాండం 21..7-11
బైబుల్ లో బానిసత్వాన్ని గురించి దేవుడు చెబుతూ వారి కళ్లను లేదా పళ్ళని హానిపరిచే ధోరణిలో కొట్టవద్దని మాత్రమే చెప్పాడు. (నిర్గమ కాండం 21) అమెరికాలో బానిసత్వాన్ని అంతం చేయడానికి అలాంటి నైతిక ధోరణి అవలంబించలేదు.
నూతన నిబంధనలలో జీసస్ బానిసత్వాన్ని అభ్యంతర పెట్టినట్లు ఎక్కడా చెప్పలేదు. సెయింట్ పాల్ చెబుతూ బానిసలు తమ యజమానులను బాగా సేవించాలని ముఖ్యంగా క్రైస్తవ యజమానులను బాగా చూసుకోవాలని అన్నాడు..
భూమిపై మీ యజమానులకు ఒడంబడి భయభక్తులతో, పిలుస్తూ ఆరాధించేటట్లు, సేవ చేసుకోవాలి.’
-- ఎఫీషియన్స్ 6..5
ఎవరు కాని దేవుని నామమును గూర్చియు, మత బోధనను గూర్చియు దూషింపకుండునట్లు బానిసలు తమ యజమానులపట్ల సకల గౌరవములను చూపవలెను.
యజమానులు విశ్వాసులైనచో, వారు తమ సోదరులేనని, బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు. అంతేకాక తమ సేవ మూలముగా లాభమును పొందువారు విశ్వాసులును, తమ ప్రియ సోదరులును కనుక వారిని మరింత అధికముగ సేవింపవలెను.
మూలం అనువాదం
శామ్ హారిస్ ఎన్. ఇన్నయ్య
No comments:
Post a Comment