జ్యోతిష్యాన్నిఖగోళం పోల్చి చెప్పాలి

ప్రత్యేక సంచికకు

పుట్టెడు ఆముదంలో మునిగినా అంటేదే అంటుంది!
రచన - నరిసెట్టి ఇన్నయ్య

తెలుగు యూనివర్సిటీతో సహా దేశంలో ఉన్న విద్యా సంస్థలు జ్యోతిష్యాన్ని బోధిస్తూ డిగ్రీలిస్తున్నారు. అవి తట్టుకొని అసలే అజ్ఞానాంధకారంలో మూఢ నమ్మకాలలో కొట్టుక పోతున్నవారిని ఇంకా ముంచేస్తున్నారు. ఎక్కడ జ్యోతిష్యం చెపుతారో దానితోపాటు పోల్చి శాఖగోళ స్త్రాన్ని కూడా చెప్పాలని కోరాము. అప్పుడు పోల్చి చూసుకుని ఏది సరైనదో తేల్చుకుంటారని చెప్పాము. కానీ అలా జరిగితే జ్యోతిష్యం ద్వారా సంపాదించుకునే పద్ధతి దెబ్బతింటుందని ఊరుకున్నారు.
ఇండియా నుండి అమెరికా వెళ్ళి వివిధ ఉద్యోగాలు చేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, కంప్యూటర్ టెక్సాలజీ నిపుణులు తమ వెంట జ్యోతిష్యాన్ని కూడా తెచ్చుకున్నారు. విద్యలో నేర్చిన శాస్త్రీయ పద్ధతిని ఉద్యోగం వరకే పరిమితం చేసి మిగిలిన రంగాలలో దానిని అన్వయించటానికి పూనుకోవటం లేదు. అయితే వైద్యంలో శాస్త్రీయ పద్ధతి ప్రకారం చికిత్స చేస్తే కంప్యూటర్ ద్వారా టెక్నాలజీ అమలు చేస్తే అదే శాస్త్రీయ పద్ధతిని జీవితంలో మిగిలిన రంగాలకు ఉపయోగిస్తే చక్కని ఫలితాలొస్తాయి. అది చేయకపోవటం వలన ఉద్యోగంలోంచి బయటకు వచ్చిన తరువాత వెంట తెచ్చుకున్న మూఢనమ్మకాలను భారతీయ సంస్కృతి పేరుతో ఆచరిస్తున్నారు. వారి సంతానానికి కూడా అదే అంటగడుతున్నారు. ఇందులో ప్రముఖంగా చెప్పుకోదగినది జ్యోతిష్యం, వాస్తు, పూజలు, పునస్కారాలు, కర్మ సిద్ధాంతం, మతపరంగా ఆచారాలు, ముహూర్తాలు పేర్కొనదగినవి. అమెరికాలో టి.వి.లు, పత్రికలు, రేడియోలు స్థాపించి, వాటిలో కూడా తమ మూఢ నమ్మకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో లైబ్రేరియన్ గా పేరొందిన హైపేషియా ఈ విషయంలో గొప్ప సలహా ఇచ్చింది. పిల్లలకు చదువు చెప్పేటప్పుడు పుక్కిటి పురాణాలు, గాథలు, ఇతిహాసాలు, సంప్రదాయ కథలు కేవలం వినోదానికి చెపుతున్నామని అవన్నీ నిజం కాదని స్పష్టంగా చెప్పమన్నది. అలా కాక స్వర్గ నరకాలను గురించి, దేవుడు, దయ్యాలను గురించి, భూత ప్రేత పిశాచాలను గురంచి, జ్యోతిష్యం, ముహూర్తాల గురించి చెబుతూ అవన్నీనిజమేననే భ్రమ కల్పిస్తే చాలా ప్రమాదం వాటిల్లుతున్నదని ఆవిడ హెచ్చరించింది. చిన్నప్పుడు పిల్లలకు ఇలాంటి కథలు, గాథలు చెబుతున్నప్పుడు తల్లిదండ్రుల నుండి వచ్చే ప్రతి విషయం నిజమని వారు నమ్ముతారు. తరువాత ఎంత చదువుకున్నా సైంటిస్టు, ఇంజనీరు అయినా ఆ నమ్మకాలు పోవు. అవి తొలగించుకోవడానికి చాలా శ్రమపడవలసి వస్తుంది. సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు కార్ల్ శాగన్, రిచర్డ్ డాకిన్స్ ఇలాంటి హెచ్చరికలే చేశారు. తల్లిదండ్రులు ఇలాంటి మూఢ నమ్మకాలు చిన్నప్పుడు పిల్లలకు వినోదంగా నూరిపోస్తుంటే వాటివల్ల జరిగే హాని వారు గ్రహించరు.
ఇండియా నుండి అమెరికా వచ్చిన వారిలో మూఢనమ్మకాలు చూస్తుంటే సైంటిస్టుల హెచ్చరిక అక్షరసత్యాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు జ్యోతిష్యం చూసుకుంటే ఆధారాలు లేని, రుజువులకు నిలబడని అనేక అంశాలు నమ్మి ఆచరిస్తున్నారు. పెళ్ళి మంత్రాల దగ్గర్నుండి, ఇళ్ళ నిర్మాణం వరకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
జ్యోతిష్యం తప్పు అని అందులోని అంశాలు శాస్త్రీయంగా రుజువు చేస్తే 5 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి అమెరికాలో సుప్రసిద్ధ జేమ్స్ రాండీ సవాలు చేశారు. ఇది భారతీయ జ్యోతిష్యానికే గాక అమెరికాలో జ్యోతిష్యానికీ వర్తిస్తుంది. అంటే జ్యోతిష్యం మూఢనమ్మకంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదన్నమాట.
ఇండియాలో జ్యోతిష్యంలో నవగ్రహాలు ప్రధానం. వీటిలో భూమికి ఉపగ్రహమైన చంద్రుడుని చేర్చారు. అక్కడ ప్రారంభమైన దోషం విస్తరించి, ఉనికిలో లేని రెండు గ్రహాలను చేర్చారు. అవి రాహువు, కేతువు. ఇంకా విడ్డూరమైన విషయం ఏమంటే సూర్యుణ్ణి గ్రహంగా పేర్కొన్నారు. నక్షత్రానికి, గ్రహానికి తేడా తెలియని జ్యోతిష్యం అమలులో ఉన్నదన్నమాట. ఇది కాక రాశి చక్రాలు, నక్షత్రాలు జ్యోతిష్యంలో కనిపిస్తాయి. తారల గురించి అ, ఆ లు తెలియని జ్యోతిష్యం వ్యక్తుల భవిష్యత్తును అంచనా వేస్తున్నది. తారల గురించి ఖగోళ శాస్త్రానికి తెలిసిందే తక్కువ. ఇంకా నిరంతర పరిశోధన చేస్తూ తెలుసుకుంటున్నారు. వాటి నుండి వచ్చే కిరణాలు మానవ జీవితంపై ప్రభావం చూపుతున్నవని రుజువులు లేవు. కేవలం సూర్యుని ప్రభావం మాత్రమే మానవులపై స్పష్టంగా ఉన్నది. రాశులు అనేవి పూర్వకాలం నుండి ఆకాశంలో ఆకారాన్ని బట్టి పేర్కొన్న అంశం. అంతకు మించి నక్షత్రాల లోతుపాతులు ఏమీ తెలియవు. అయినా అటు పాశ్చాత్య, ఇటు భారతీయ జ్యోతిష్యాలు మానవుల్ని వర్గీకరించి వారి భవిష్యత్తును చెప్పడానికి పూనుకున్నారు. ఇదంతా పూర్వీకులు రాసిన గ్రంథాల ఆధారంగా చెపుతున్నాం అని నమ్మిస్తున్నారు, జనం నమ్ముతున్నారు. ప్రశ్నిస్తే జ్యోతిష్యం నిలబడదు. ఆధారాలు చూపడానికి ఎలాంటి అవకాశాలూ వారికి లేవు. జ్యోతిష్యం విఫలమైతే అందుకు బాధ్యత వహించేవారెవరూ లేరు. పూర్వకాలంలో రుషులు చెప్పారని ప్రమాణంగా స్వీకరించటం తప్ప నిత్య నూతనంగా పరిశోధన పరిశీలన జ్యోతిష్యంలో ఉండవు.
ఖగోళ శాస్త్రం అతి వివరంగా పరిశీలనలు చేస్తూ తెలిసిన వాటిని జనానికి అందిస్తూ, మిగిలిన వాటిని క్రమేణా తెలుసుకుంటున్నది. ఇది నిరంతర ప్రక్రియ. అనంతంగా సాగుతున్నది.
చంద్రుడి విషయం చూద్దాం. జ్యోతిష్యంలో చెబుతున్న చంద్రుణ్ణి గురించి పరిశోధన, పరిశీలన ఎంతో జరిగింది జరుగుతున్నది.  భూమికి కన్పించే చంద్రుడు కేవలం ఒకవైపు మాత్రమేనని జ్యోతిష్యానికి తెలియదు. భూమికి చుట్టూ ఉపగ్రహంగా తిరిగే చంద్రుడు ఒకవైపునే తిరుగుతాడు. అవతలివైపు ఏముందో తెలుసుకోవటానికి ఖగోళ శాస్త్రం కొంతవరకు ప్రయత్నించింది. అలాంటి విషయమే తెలియని జ్యోతిష్యం కేవలం జనం మూఢ నమ్మకాల మీదనే వ్యాపారం చేస్తున్నది. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యుని వెలుతురు పడి పారదర్శకంగా మనకు కన్పిస్తుంది. అలాగే జ్యోతిష్యం పేర్కొన్న గ్రహాలు కూడా సూర్యుని వెలుగు స్వీకరిస్తాయే కాని వాటికి స్వయం ప్రకాశం లేదు. గ్రహాల నుండి మానవులపై ప్రసరించేది ఏమిటి? దేనిని బట్టి గ్రహ ప్రభావం కొలుస్తారు ? సూర్యుని నుండి మానవులపై పడే వెలుగులాంటిది గ్రహాల నుండి రాదు. తారల నుండి వచ్చే వెలుగు మానవులపై ప్రభావం చూపెడుతున్నదని చెప్పటానికి జ్యోతిష్యానికి ఆధారాలేం లేవు. సైన్సులో వారి అజ్ఞానం అపారం. పరిశోధన చేయటం వారి శాస్త్రాలలో భాగం కాదు. పూర్వీకులు చెప్పినదాన్ని ప్రశ్నించకుండా తందాన అనటమే జ్యోతిష్యం. దాన్ని గుడ్డిగా నమ్మి ఆచరించేవారు ఉన్నంతకాలం జ్యోతిష్యం వ్యాపారం నిరంతరం సాగుతుంది. ఇది శాస్త్రీయ పరిశోధనలు వినియోగించుకుంటున్న నేటి కాలంలో చాలా అవమానకరమైన విషయం. అధికారంలో ఉన్నవారు ఇలాంటి మూఢనమ్మకాలతో ముహూర్తాలను ఆచరిస్తే ప్రజాధనం వినియోగం అవుతుంది, పరిశోధన కుంటుపడుతుంది. నేడు అదే జరుగుతున్నది.
జ్యోతిష్యం విషయమై ఇండియాలో శాస్త్రజ్ఞులు, మానవవాదులు, హేతువాదులు కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే అక్కడున్న న్యాయమూర్తులు మూఢనమ్మకాల నుంచి వచ్చిన వారు గనుక శాస్త్రీయంగా తీర్పునివ్వలేకపోయారు. సుప్రీంకోర్టుకు ఈ విషయం వెళ్ళినప్పుడు తీర్పు చెబుతూ శాస్త్రీయంగా పరిశీలిస్తామని, పరిశోధన చేస్తామని జ్యోతిష్యులు హామీ ఇచ్చారు గనుక ఆ పని చేయడానికి వారికి అవకాశం ఇవ్వాలని తీర్పు చెప్పారు! డాక్టర్ పి.ఎమ్. భార్గవ ఆధ్వర్యాన సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలలో ఆశ్చర్యకరమైన పరిణామం ఏమంటే అత్యంత అధునాతనమైన ఎన్ సైక్లోపీడియా బ్రిటానికాలో చూపెట్టిన పరిశీలనాధారాలను స్వీకరించకుండా కాలం దోషం పట్టిన పాత ఎడిషన్ నుండి జడ్జీలు స్వీకరించటం అతి ఘోరమైన విషయం. పోనీ వారి తీర్పు ప్రకారం జ్యోతిష్యంలో శాస్త్రీయ పరిశీలన ఎక్కడైనా జరుగుతున్నదా అంటే దాఖలాలు లేవు. నమ్మకాలతో తిరుపతి తిరుమల దేవాలయానికి వెళ్ళే జడ్జీలు ఎలాంటి తీర్పునిస్తారో జ్యోతిష్యం విషయంలో ఆలోచించుకోవచ్చు. రాకెట్ ఉపగ్రహం అతి శాస్త్రీయంగా తయారు చేసి ప్రయోగించబోయే ముందు తిరుపతి వెంకటేశ్వర విగ్రహం దగ్గర పెట్టి తరవాత ప్రయోగించిన రాధాకృష్ణవంటి సైంటిస్టులు వుంటే శాస్త్రీయ పరిశోధన ఎలావుంటుందో వూహించండి.
డాక్టర్ తన వృత్తిలో వైద్యం చేసేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు, వ్యక్తి కులం, మతం చూడరు.  తాను నేర్చుకున్న వైద్య విద్య ప్రకారం అమలు చేస్తారు. అది శాస్త్రీయ పద్ధతి. అలాంటి పద్ధతినే అన్నిరంగాలకు విస్తరిస్తే సక్రమ ఫలితాలు, పురోభివృద్ధి లభిస్తుంది.
వాస్తు
కొన్నిరోగాలు అంతర్జాతీయంగా త్వరితంగా వ్యాపించినట్లే కొన్ని మూఢ నమ్మకాలు కూడా అలాగే వ్యాపిస్తాయి. అందులో వాస్తు పేర్కొనదగినది. టి.వి. 9 ఛానెల్ వంటివారు వాస్తు మూఢ నమ్మకమని ప్రచారం చేస్తున్నా అమెరికా వచ్చిన భారతీయులు ముఖ్యంగా తెలుగువారు వాస్తు ప్రకారం ఇళ్లు కొనటం, అమ్మడం చేస్తున్నారు. టి.వి.లు, రేడియోలలో కూడా ప్రచారం చేస్తున్నారు. వాస్తు భారతీయ ప్రాచీన మత ప్రాయంగా దేవాలయాలు కట్టడానికి వాడినా నేడది అంటు రోగంగా ప్రబలి ఆలోచనా రహితంగా అలముకుంటున్నది. వెర్రితలలు వేస్తున్నది. హేతువాదులు, మానవవాదులు చేసిన సవాలుకు నిలబడలేక వాస్తు పండితులు వాదనలు మాని తమ వ్యాపారాన్ని సాగించుకుంటున్నారు.  ప్రశ్నించటం తగ్గిపోయి సాస్టాంగపడటం అలవాటయి మానసిక బలహీనతగా మారిన వాస్తు మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తున్నది. ఈ నమ్మకాలున్న వ్యక్తులు అటు ప్రభుత్వంలోకి, ఇటు సినిమాలలోకి ప్రవేశించటం వల్ల వారి ప్రభావం జనంలోకి ఇంకా అల్లుకుపోయింది. పెట్టుబడి లేని వాస్తు వ్యాపారం చాలా గిట్టుబాటుగా ఉన్నది. ఇది హోమియోపతి వైద్యంలాగా నాటుకుపోతున్నది. ఫలితాలు పరిశీలించేవారు గాని, ప్రశ్నించేవారు గాని లేరు. ఉన్నా వారికి సమాధానం చెప్పేవారు లేరు. వాస్తు విఫలమైతే, జ్యోతిష్యం విఫలమైతే అది వారి ఖర్మ అనుకోవటం తప్ప చెప్పినవారిని శిక్షించే పద్ధతేం లేదు. అసలు మూల శాస్త్రమే తప్పయినప్పుడు సత్ఫలితాలు ఆశించటం అంతకన్నా తప్పు.
సమాజం ముందుకు పోవడానికి ఎక్కడా జ్యోతిష్యం గానీ, వాస్తుగానీ, ముూఢనమ్మకం గానీ తోడ్పడలేదు. శాస్త్రీయ సాంకేతిక రంగం మానవులకు అన్నివిధాలా తోడ్పడుతున్నది. అందుకే వాటిని అన్వయించటానికి జ్యోతిష్యులు, వాస్తు పండితులు ఒప్పుకోరు. అది జరిగితే తమ వ్యాపారం దెబ్బతింటుంది. పైగా జ్యోతిష్యానికి వాస్తుకి టాక్సులు లేవు.
అనారోగ్యాలకు ముడిపెట్టి చెబుతున్న జ్యోతిష్యం, ముహూర్తాలు, రుద్రాక్షలు, వాస్తు ఇత్యాది విషయాలు సీరియస్ గా తీసుకోవాలి. అలా చెప్పేవాళ్ళు అర్హులా అనేది ఆలోచించాలి. జనాన్ని మూఢ నమ్మకాలతో భయభ్రాంతుల్ని చేయడం ఎంతవరకు అనుమతించవచ్చు. అని కూడా చూడాలి.
పురోహితులకు, జ్యోతిష్యులకు, వాస్తు పండితులకు ఇతర విషయాలలో ఆరోగ్యం పేరిట భవిష్యత్తు పేరిట జనాన్ని ఆకట్టుకొని ధనాన్ని సేకరిస్తున్న వారి విషయంలో ప్రభుత్వం క్రమబద్ధం చేసే విషయం పరిశీలించాలి. ఎవరైనా ఏదైనా చెప్పి డబ్బు సంపాదించి బాధ్యతా రహితంగా ఉండవచ్చా..? వీటి పేరిట డబ్బు సంపాదిస్తున్నప్పుడు ప్రభుత్వానికి లెక్కలు చెప్పనక్కరలేదా? లైసెన్సు అక్కర్లేదా?  ఈ విషయాలను కూడా సీరియస్ గా తీసుకోవాలి. మూఢనమ్మకాలను అదుపులో పెట్టడానికి మహరాష్ట్ర కర్ణాటకలో చట్టాలు చేసినట్లే  ఇతర రంగాలలో కూడా చట్టాలు అవసరం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. చట్టబద్ధం చేయాలి. వాస్తు విషయంలో మరింత సీరియస్ గా చర్య తీసుకోవడం అవసరం. ఏదైనా జనాల భవిష్యత్తును గురించి ఆరోగ్యాన్ని గురించి చెబుతున్నప్పుడు వాటి సత్ఫలితాలు, వైఫల్యాలు విషయమై ఎవరు బాధ్యత వహించాలనేది ఆలోచించాలి. ఈ రంగంలో ఏదైనా శాస్త్రీయ సర్వే ఉన్నదా?  చెప్పినవాటిలో ఎన్ని నిజమయ్యాయి మరెన్ని విఫలమయ్యాయి. అనేది ఎప్పుడైనా పరిశీలించారా ? విఫలమైతే ఎలాంటి చర్య తీసుకున్నారు?
కమ్యూనిస్టు పార్టీలు సైతం ఈ విషయంలో తీవ్రంగా విఫలం కావటం ఆశ్చర్యకరం. వారు ప్రభుత్వంలో వచ్చిన చోట ఇలాంటివి ఏవీ పట్టించుకోలేదు. శాస్త్రీయంగా జనాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు. కేరళలో అయ్యప్ప కల్ట్ వ్యాపిస్తుంటే అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు కళ్ళు మూసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో మదర్ తెరీసా వంటివారు పిల్లల పేరిట విపరీతంగా డబ్బు సేకరించి వారికి ఖర్చు పెట్టకుండా పోప్ కు చేరవేస్తే చూసీ చూడనట్లు ఊరుకున్నారు. నేడు మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండి మూఢనమ్మకాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ముద్ర వేస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణాలో చేపవైద్యం నుండి వాస్తు వరకు విజృంభించి ప్రజలను వెనక్కు నడిపిస్తుంటే ముఖ్యమంత్రులు, గవర్నర్లు, జడ్జీలు వాటిలో భాగస్వాములవుతున్నారు. అందుకే వీటిని అదుపులో పెట్టే చట్టం అవసరం. ప్రాథమిక విద్య నుండి శాస్త్రీయ పద్ధతి చెప్పాలి. తదనుగుణంగా సిలబస్సు రూపొందించాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో కూడా కమ్యూనిస్టులు, నక్సలైట్స్ తోసహా వామ పక్షాలన్నీ మూఢనమ్మకాల విషయంలో విఫలం కావడం శోచనీయం, సి.హెచ్. రాజేశ్వరరావు వంటివారు కమ్యూనిస్టు పార్టీలో వుండగా వేములవాడ రాజరాజేశ్వరీ దేవాలయానికి ట్రస్టీలుగా ఉన్నారు. సమ్మక్క, సారక్క జాతరలను ఏవో కుంటిసాకులు చెప్పి అతివాద కమ్యూనిస్టులు సైతం వెనకేసుకొచ్చారు. ప్రజలను శాస్త్రీయ పద్ధతిలో నడిపే ప్రయత్నం గానీ సిలబస్ లో అటువంటి మార్పులకు ఉద్యమాలు కానీ చేయలేదు. రాష్ట్రంలో హేతువాద, మానవవాద, నాస్తిక సంఘాలు బలంగా లేనందున వారి వాదనతో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి చట్టాలు తీసుకురాలేకపోయాయి. ఇప్పుడైనా ఆ ధోరణిలో ప్రయత్నం జరగాలి. తిరుపతి తిరుమలలో మనుషులు చెక్కిన విగ్రహాన్ని వెలిసిందని, దాని చుట్టూ కథలల్లి, విగ్రహాలకి అలంకరణ చేసి దర్శనం పేరిట విపరీతంగా ధనార్జన చేస్తున్నారు. ప్రజలలో మూఢనమ్మకాన్ని విపరీతంగా పెంచుతున్నారు. ఇదే పరిస్థితి క్రైస్తవులలోను ముస్లిములలోను ఆ మాటకొస్తే అన్ని మతాలలోను వ్యాపించి ఉన్నది. మానవ ప్రగతికి, ఆరోగ్యానికి సైన్సు మాత్రమే ఉపయోగపడుతుందనే విషయం విస్మరించారు. ఈ పరిస్థితి మారాలి. చిన్న పిల్లలకు మూఢనమ్మకాలు చెప్పడం దోషపూరితమని తెలుసుకోవాలి.

No comments:

Post a Comment