ప్రజాస్వామ్య భవిష్యత్తు--ఎమ్.ఎన్.రాయ్

రాజకీయాలు -అధికారం- పార్టీలు



(ఎమ్.ఎన్.రాయ్  ఇచ్చిన ఉపన్యాసాలను, వారు మరణించిన తరువాత వారి భార్య ఎలెన్ రాయ్ సంకలనం చేసి Parties,Power and Politics పుస్తకంగా ముద్రించారు.)
(1950, ఫిబ్రవరి 5న కలకత్తా యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ హాలులో చేసిన ప్రసంగం)
మానవ మేధస్సు ఇంతవరకు భావించిన దానిలో ప్రజాస్వామ్యం ఉత్తమమైన ప్రభుత్వమని నమ్మేవారు. ప్రజాస్వామ్య భవిష్యత్తులో ఆసక్తి చూపుతారు. ఇందుకు భిన్నంగా ఆలోచించేవారున్నారు. ప్రజాస్వామ్యం వాంఛనీయం కాదని అంటారు లేదా సాధ్యా సాధ్యం గురించి సంశయం వెల్లడిస్తారు. వారితో వాదించను. ప్రజాస్వామ్యం ఉత్తమ ప్రభుత్వ విధానమని భావించి ప్రారంభిస్తాను. దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తును గురించి   ప్రస్తావిస్తాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి బెదిరింపు ఉన్నది. ఇది విశ్వజనీనమైన అనుభవం. ప్రజాస్వామ్యానికి కొత్త దృష్టి కావాలనే ఆలోచన ప్రతి చోట ఉన్నది. ఇతరుల అనుభవం నుంచి మనం నేర్చుకోవచ్చు. కాని మనమే పరిష్కార మార్గాన్ని కనుగొంటే, ఇతరులకు ఉపయోగంగా ఉంటుంది.
రాజకీయ స్వేచ్ఛ కోసం చిరకాలం పోరాటం జరిగిన అనంతరం, ఇండియాలో సర్వతంత్ర స్వతంత్ర రాజ్యం స్థాపించడం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మౌలికమైన చట్టం, మంచి రాజ్యాంగాన్ని వ్రాయడం సులభమే. అవసరమైన ఆదర్శవాదం, రాజకీయ సాంఘిక విషయ జ్ఞానం గల చట్టం తెలిసిన పండితులు, రాజ్య యంత్రాంగాన్ని గురించి చక్కని సమగ్ర పథకం రూపొందించగలరు. మంచి రాజ్యాంగాన్ని ఆచరణలో పెట్టడం దుర్లభం. దానికి ఇతర లక్షణాలుండాలి. ఇప్పటి వరకూ సులభమైన భాగాన్ని పూర్తి గావించారు. మంచి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది అమలు జరపడం కష్టంగా ఉన్నది. దీనికి కనీస ఆటంకం ఉండే రీతులు కూడా, ఇప్పటి వరకు పై చేయిగానే ఉంటూ వచ్చింది.
రాజ్యాంగాన్నిఅమలు పరచడానికి సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం, కొన్ని పద్ధతులు, విధానాలు పరిశీలించడం అవసరమని ప్రజాస్వామిక రాజ్యాలలో సంప్రదాయంగా నమ్ముతూ వచ్చారు. భారత రిపబ్లిక్ కు చెందిన రాజ్యాంగంలో ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వివరాలపట్ల చాలా శ్రద్ధ వహించారు. రాజ్యాంగం సిద్ధాంతరీత్యా అది లోపమే. దేశానికి మౌలిక చట్టం రాజ్యాంగమే. రాజ్యపరమైన శాసన విభాగానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్దేశించడం, పాలనా శక్తిపై అదుపు విధించడం రాజ్యాంగం చేసే పని, భారత రాజ్యాంగంలో కొన్ని మౌలిక సూత్రాలు విధించడం జరిగినా, అవి సంధిగ్ధావస్థకు మించి లేవు. కొన్ని అభ్యంతరకర లక్షణాలు, ముఖ్యంగా పౌర స్వేచ్ఛ గురించినవి, లేకపోలేదు. ప్రాథమిక హక్కుల గురించిన భాగం చాలా చిన్నదే. రాజ్యాంగం చూస్తే ప్రపంచంలోనే పెద్దది. సాధారణ పౌరుడికి సులభంగా అర్థంగాని చట్ట పూరిత భాషలో, అనుసరించవలసిన విధానాలను విపులీకరించారు. ఈ భాషా భేషజంలో, ప్రాథమిక హక్కులు ఇతర మౌలిక భావాలు ప్రాధాన్యత లేకుండా మరుగున బడ్డాయి.
అదుపాజ్ఞలు విధించడం రాజ్యాంగం న్యాయవాదుల కర్తవ్యం, ఇచ్చిన హక్కులను దుర్వినియోగ పరచకుండా అదుపాజ్ఞలను ఉద్దేశించారు. అదుపాజ్ఞలకు ఇచ్చిన ప్రాధాన్యత మానసికంగా ముఖ్యమైనది. అధికార దుర్వినియోగాన్ని రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారని దీని భావం. బహుశ అనుకోకుండానే, దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తును గురించి రానున్న ప్రమాదం వ్యక్తపరచారు.
దేశానికి తగిన ప్రభుత్వం లభిస్తుందనే నానుడిలో చాలా సత్యం ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాల కింద రాజ్యాంగం అమలులో ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీని ప్రజలు అదుపు చేసిన చోట, ప్రజాస్వామిక రాజ్యాంగం పనిచేస్తుంది. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటున్న పార్టీని దేశ జనాభా బొత్తిగా అదుపులో పెట్టలేకపోతున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల యొక్క ప్రజల చేత ప్రభుత్వం అయినట్లయితే, సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాస్వామ్య సూత్రాలపై ప్రమాణం చేసే పార్టీ కూడా ప్రజాస్వామ్య రాజ్యానికి హామీగా నిలవవు.
ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం, పనిచేయడం అనేది స్వేచ్ఛా సమాజంలో ప్రజల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. అందుకు ఆయా దేశాలలోని సాంస్కృతిక సంప్రదాయాలపై ఇదంతా ఆధారపడుతుంది. విశ్లేషించి చూస్తే ఈ విషయం గమనించవచ్చు. ప్రజాస్వామ్యానికి చెందిన రాజకీయ సాంఘిక సిద్ధాంతాలు తొలుత తాత్విక మానవతావాదం నుంచి ఉత్తేజాన్ని పొందాయి. మానవుడి వ్యవహారాలన్నీ సృష్టికర్త చూస్తున్నాడనే నమ్మకాన్ని ఈ తత్వం పటాపంచలు చేసింది. మానవుడే తన ప్రపంచాన్ని సృష్టించుకొన్నాడన్నది మానవుడి జీవితమే లక్ష్యంగా ఉంటుదనీ, అన్నిటికీ కొలమానం మానవుడేనని, ఈ కొలమానాన్ని బట్టే నిలవలను నిర్థారించాలని మానవతావాదం పేర్కొన్నది.
మానవతా తత్వం నుంచి రాబట్టినవి ప్రజాస్వామిక ఆచరణ, కాలానుగుణంగా తనకు ఉత్తేజం కల్పించిన మూల తత్వానికి దూరంగా జరిగింది. చివరకు పార్లమెంటరీ వ్యవస్థలో సార్వభౌముడు కాస్తా నిస్సహాయుడుగా మారాడు. ప్రభుత్వం కొద్ది మంది వ్యక్తులు నడిపిస్తుండగా, పరిపాలనపై వారికే అదుపు ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిశితంగా పరిశీలించే విమర్శకుల దృష్టిలో వైఫల్యాలన్నీ వ్యక్తిగత కారణాలుగానూ, అధికార తృష్ణ, రాజకీయవాదుల ఆశలు, సాంఘిక వర్గాల స్వార్థాల వల్ల జరుగుతున్నాయంటారు. మానవుల ఉద్దేశాలను బట్టే చాలావరకు సాంఘిక సంఘటనలు ఉంటాయి. రాజకీయ వాదుల, పార్టీల ఉద్దేశాలతో నిమిత్తం లేని చారిత్రక కారణాలు కూడా లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలం గావడానికి, తగిన గుణపాఠం నేర్చుకోవడానికి ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తుకు రాగల ప్రమాదాల నుంచి తట్టుకోవాలంటే, వీటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అదే మనకు హామీ.
ప్రజాస్వామ్య పుట్టుకను దృష్టిలో పెట్టుకుని, ఐరోపాలో ప్రజాస్వామ్యం ఎందుకు అపఖ్యాతిపాలైందో కారణాలు చూడవచ్చు. ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి పట్టించుకునేవారు, దీనికి ఉత్తేజాన్నిచ్చిన మూలాన్ని గమనించాలి. రాజకీయ సిద్ధాంతాలు, సాంఘిక సిద్ధాంతాలు కూడా తత్వం నుంచి, సమగ్ర జీవిత దృక్పథం నుంచి ఎంచుకొంటారు. అలౌకిక శక్తి మానవ జీవితంగా వ్యక్తమైందని నమ్మారు. దైవేచ్ఛ ప్రతి దానికీ ముందే నిర్ధారిచినదన్నారు. ఆయా కాల పరిస్థితుల ననుసరించి ఈ మనస్తత్వం నిర్ధారితమైంది. చాలా కాలం మానవ చరిత్రను ఈ భావనే ప్రభావితం గావించింది. మానవుడు స్వతంత్రించి పని చేయడంపై అదుపులు పెట్టడం, తన విధికి తానే యజమాని అని మానవుడు భావించక పోవడానికి ఈ నమ్మకం అడ్డొచ్చింది. మానవుడి వివేచనకు అవగాహన కాని అలౌకిక శక్తి ప్రపంచంలో ప్రతిదీ నిర్థారిస్తుందనడంతో మానవ జీవితాన్ని శాశ్వతంగా బానిసత్వంలో ఉంచినట్లయింది. జీవితానంతరం మోక్షం కోసం ఇటువంటి సేవను దివ్యమైనదిగా శ్లాఘించవచ్చు. ఆధ్యాత్మిక బానిసత్వానికి తిరుగుబాటుగా ప్రజాస్వామిక జీవన దృక్పథం ఆవిర్భవించింది. మానవ జీవితమే అత్యున్నత విలువ అనడంతో ఈ దృక్పథం ఆరంభిస్తుంది. కనుక అలౌకికత్వానికి, మరేదో లక్ష్యానికి మానవుడు మార్గంగా దిగజారి పోరాదంటుంది.
దోషాలను గుణాలుగా భావించే ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మానవుడు, స్వేచ్ఛకు విలువ ఇచ్చే రాజకీయ సాంఘిక సిద్ధాంతాలను రూపొందించాడు. మానవ ప్రగతికి మానవ మేథస్సు ఆధారం అని, మానవ ప్రపంచంలో ఉన్నదంతా మానవ సృష్టి అని భావించాడు. దీని ఫలితమేమంటే, రాజకీయ సాంఘిక సంస్థలు మానవ ప్రయోజనానికి తోడ్పడకపోతే, వాటిని మలచడానికి మానవుడికి హక్కు, శక్తి ఉన్నాయన్నమాట. కేవలం కొద్దిమంది రాజకీయవాదులు గాక, ప్రజా బాహుళ్యం అధికార మనస్తత్వం నుంచి దూరంగా జరిగి, మానవతా జీవిత దృక్పథాన్ని ఆమోదిస్తే, ఆ మేరకు ప్రజాస్వామ్యం వికసించడానికి ఆ దేశంలో అనుకూల వాతావరణం ఉన్నదన్నమాట.
ఈ ప్రమాణాన్ని బట్టి నిర్ణయిస్తే, భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. ప్రజల మనస్తత్వం ఇంకా పెత్తందారీ విధానంలో ఉన్నది. తిరోగమన సాంస్కృతిక సంప్రదాయాన్ని ఆధ్యాత్మిక ప్రతిభగా రాజకీయవాదులు, రాజకీయపార్టీలు శ్లాఘిస్తుండడం గమనించవచ్చు. పెత్తందారీ మనస్తత్వం గల ప్రజలతో ప్రజాస్వామ్యం స్థాపించడం సాధ్యపడదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం విఫలమైతే, రాజకీయ పార్టీల నాయకుల కుట్ర వల్ల మాత్రం కాదు. బాహ్య పరిస్థితులు, ప్రజల మనస్తత్వం, మానవ స్వేచ్ఛ, మానవ సృజన శక్తిని గమనించకపోవడం వంటి కారణాలే ప్రజాస్వామ్య వైఫల్యానికి దోహదం చేస్తాయి. ప్రజాస్వామిక జీవిత దృక్పథానికి ఇవి మౌలిక విలువలు.
సిద్ధాంతపరంగా ఈ విలువలను ఆమోదించినంత మాత్రాన ప్రజాస్వామ్యానికే భద్రత చేకూరదని పాశ్చాత్య ప్రపంచానుభవం చెబుతున్నది. ఏమైనా మౌలిక కృషి తొలుత చేయాలి. అప్పుడు ఇతరుల దోషాలను తొలగించవచ్చు. ప్రజాస్వామ్యాన్ని లాంఛనప్రాయం చేయడం మూలదోషం. ప్రతి వ్యక్తి సార్వభౌముడనేది ప్రజాస్వామ్యంలో మౌలిక తాత్విక సూత్రం. క్రమేణా రాజ్యాంగపరమైన సిద్ధాంతాలలో కూడా ఈ సూత్రాన్ని కేవలం చట్టబద్ధమైన కట్టుకథగా మార్చేశారు. సార్వభౌముడైన వ్యక్తి నిస్సహాయుడైన సాంఘిక జీవిగా మారాడు. ప్రజాస్వామిక సమాజానికి తగిన భావపునాదులు ఏర్పడినా, వ్యక్తులకు తగిన ప్రాధాన్యతను ప్రజాస్వామ్యం ఇవ్వలేదు. వ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్లించలేదు. ఫలితంగా, ప్రజాస్వామిక ఆచరణ తన లక్ష్యాన్ని తానే ఓడించుకున్నది.
పార్లమెంటరీ విధానం ప్రజాస్వామ్యాన్ని లాంఛనప్రాయం చేయడమే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజాస్వామిక ప్రభుత్వం స్థానే ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ప్రాతినిధ్య ప్రభుత్వమూ, ప్రజాస్వామిక ప్రభుత్వమూ ఒకటి కాదు. ప్రజాస్వామ్యాన్ని లాంఛనప్రాయం చేయడం, ప్రాతినిధ్య ప్రభుత్వంతో తాదాత్మ్యం గావించడం అనేది ఆధునిక రాజ్యాలలో అధిక జనాభా వల్ల, విశాల దేశాల వల్ల సంభవించింది. ప్రాచీన కాలంలోని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఆచరణయుక్తం కాకుండా పోయింది. ఈ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందడంతో ప్రజాస్వామ్యం అపఖ్యాతిపాలైంది. ఈ వైఫల్యం తప్పనిసరికాదు. రాజకీయ  పరిపాలన సమస్యలతో సతమతమైన రాజకీయ ఆధునిక ప్రజాస్వామ్యవాదులు వ్యక్తి స్వేచ్ఛ, సార్వభౌమత్వం అనే భావాలకు దూరమయ్యారు. వ్యక్తిని సమష్టిత్వానికి లొంగేటట్లు చేశారు.
వ్యక్తిని చేతగానివాడుగా చేసిన అనంతరం, పార్టీల పేరిట అధికారం కోసం కొందరు కలహించడం మొదలైంది. ప్రజాస్వామ్యానికి పార్టీ విధానం మూలం అని నమ్మినా, ఇంతకంటే ప్రజాస్వామ్యానికి హాని చేసిందేదీ లేదు. ప్రజాస్వామ్యాన్ని మూకస్వామ్యం కిందకు పార్టీలు మార్చేశాయి. సిద్ధహస్తుడైన మూకస్వామ్యవాది జయప్రదమైన ప్రజాస్వామ్యవాదిగా మారాడు. పెద్ద హామీలిచ్చేవారు బహుశ నిజంగానే మంచి చేద్దామనుకోవచ్చు. కాని అధికార క్రీడలో నిమగ్నులైన తరవాత, ఆట నియమాలు పాలించాలిగదా. వెనుకబడినతనం  గల వాతావరణంలో అధికార కలహాల వల్ల బాగా చదువుకున్నవారున్న దేశాలకంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కిందకు ఈడ్చేస్తుంది. ప్రజాస్వామ్యంలో అందరికీ ఓటు హక్కు అనేది అత్యున్నత దశగా పేర్కొంటున్నారు. కేవలం తలలు లెక్కించే పద్ధతికి దిగజారిన తరువాత తలల్లో ఏముందో ప్రజాస్వామ్యం పట్టించుకోదు. బాధ్యత లేని తలలైతే, ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి అజ్ఞానమే ఆధారం అన్నమాటే.
లోగడ ఎన్నికల అనుభవం మనకున్నది. మహాత్ముడికి ఓటు వేస్తున్నాం కనక, దేవాలయానికి పోతున్నట్లుగానే పోలింగ్ కు వెళ్ళారు ఓటర్లు. ఓట్ల పెట్టెలలో ఓటుతోపాటు బియ్యం వేశారు. ఓటంటే వారి దృష్టిలో విలువలేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే మహాత్ముడికి ఓట్లిచ్చినట్లేనన్నారు. అన్ని ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. కనక ఆ పార్టీ అదుపులో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామికం అనొచ్చు. ఇదంతా అందరికీ ఓట్లు లేనప్పుడు జరిగింది. ఇక అందరికీ ఓట్లు అంటే ఇంకా అధ్వాన్న పరిస్థితి అన్నమాటే. అందరికీ ఓటు ఉండరాదని చెప్పడం లేదు. ఓటంటే ఏమిటో చెప్పకుండా ఓటు హక్కు ఇస్తే ప్రయోజనం లేదు.
అందరికీ ఓటుహక్కుంటే, దేవాలయానికి పోయినట్లే పోలింగ్ కు వెడతారు. ప్రజల రాగద్వేషాలకు విజ్ఞప్తి చేసిన మూకస్వామ్యవాదులకు విజయావకాశాలు బాగా ఉంటాయి. ఒకటికి మించి పార్టీలున్నందువల్ల మూకస్వామ్యానికి ఇంకా గిరాకీ పెరుగుతుంది. ప్రజలను ఆకర్షించడానికి మూకస్వామ్యవాదులు పోటీ పడతారు. ఎన్నికలలో గెలవాలంటే అజ్ఞానాన్నీ, ప్రజల మూఢనమ్మకాన్ని ఆధారం చేసుకోవడంలో కాంగ్రెస్ తో పోటీ పడాలన్నమాట.
అందుకే భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. రాజకీయవాదుల దురుద్దేశ్యం ఇందుకు కారణం కాదు. పార్టీ రాజకీయ విధానం, ప్రజాస్వామ్యాన్ని లాంఛనంగా చూసే పద్ధతే కారణం. కనక ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి పట్టించుకొనేవారు ఇతరులను ఆరోపించడం మానాలి. ప్రజాస్వామ్యం సాధ్యం కావడానికి పరిస్థితులను సృష్టించే కృషి చేయాలి. ఈ లోగా బహుశా ఒక దశాబ్దం అనుకోండి, మూకస్వామ్యం ఉంటుంది. అధికార కలహం కొనసాగుతుంది. అవినీతి, అసమర్థత పెరుగుతుంది. ప్రజాస్వామ్యానికి పునాది వేసేవరకు ఇది తప్పదు. ప్రజలు తమ విధికి తామే బాధ్యులమని గుర్తించేటట్లు చేయాలి. ప్రజాస్వామ్యం అత్యుత్తమ ప్రభుత్వమని నమ్మేవారు ప్రజల మనస్తత్వంలో విప్లవం తీసుకొచ్చే ప్రధాన కర్తవ్యాన్ని నిర్వహించాలి.
చరిత్ర అంతటా రాజకీయ, సాంఘిక మార్పులకు ముందు తాత్విక విప్లవం వచ్చింది. కనీసం ప్రజలలో పేర్కోదగినంత మందిలో అయినా ఈ మార్పు జరిగింది. అవసరమైన ఇటువంటి అనుభవం భారతదేశంలో రాలేదు. ప్రజలందరి మనస్తత్వంలో మార్పు ఒక్కసారి రారు. కాని మొదలుపెట్టటం జరగాలి. గుడ్డివాళ్లు, గుడ్డివాళ్ళకే దారిచూపే స్థితినుంచి బయటపడాలి. దేశంలో ఎక్కువమంది ప్రజలు మూఢ నమ్మకాలతోనూ, రాగద్వేషాలతోనూ ఉన్నారు. ఆధునిక విద్యా విధానం సహాయంతో ఈ దోషాలన్నిటినీ ధర్మాలుగా హేతుబద్ధం చేసి చూపుతున్నారు. ఇటువంటి సాంస్కృతిక వాతావరణంలో ప్రజా జీవనం అవినీతికి గురి అవుతుంది. ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. అధిక సంఖ్యాకులు గుడ్డి నమ్మకాల సంప్రదాయాల నుంచి, వీరారాధన నుంచి బయటపడాలి. అన్వేషణా ధోరణి, స్వశక్తిపై ఆధారపడటం, స్వేచ్ఛను కోరటం జరగాలి. మానవుడికి తనలో విశ్వాసం ఏర్పడటం నిజమైన ప్రజాస్వామిక సమాజానికి అవసరం.
ఐరోపాలో అభివృద్ధి చెందిన దేశాలు తాత్విక విప్లవాన్ని చవిచూచిన తరవాత కూడా, పాక్షికంగానైనా ప్రజాస్వామ్యం విఫలమైంది. సంస్థలు మనిషికంటే పై స్థానంలో ఉండటం వల్ల ఇలా జరిగింది. సంస్థలను మనుషుల సృష్టించారని మరచిపోయారు. మనుషుల్లో మంచితనం లేనిచోట మంచి సంస్థలు జయప్రదం కావు. లేదా మంచితనం ఉన్నందుకు వారు బాధపడాలి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఎక్కువమంది ప్రజల స్వేచ్ఛా పిపాసను కలిగి తాము స్వేచ్ఛకోసం పుట్టామని గ్రహించాలి. స్వేచ్ఛగా పుట్టకపోయినాసరే ఇది అవసరం. ప్రజాస్వామ్యం వివేచనాయుత, సామాజిక వాతావరణంలోనే పనిచేస్తుంది. సామాజిక సమస్యలకూ, జీవితానికీ హేతు దృక్పథం ఉండాలంటే, ప్రకృతికి బయట దేనినో నమ్మే ధోరణిని నిరాకరించాలి. మానవుడికి మించి ఎవరిపైనో విశ్వాసం ఉంచటాన్ని తృణీకరించాలి. ప్రపంచంలో స్వేచ్ఛగా ఉండాలని పట్టుదల లేకపోతే ప్రపంచాన్ని మార్చే శక్తి మానవునికున్నదని నమ్మకపోతే ప్రజాస్వామ్యం సాధ్యం కాదు.
దేశంలో పరిస్థితులను వాస్తవ దృక్పథంతో చూడాలి. ఈ పరిస్థితులు సాంస్కృతిక సంప్రదాయంలో ప్రగాఢంగా నాటుకుపోయి ఉన్నాయి. ప్రజాస్వామ్య భవిష్యత్తును గురించి అంతగా ఆశావాదానికి ఉత్తేజం కలిగించటం లేదు. ప్రజాస్వామికి స్వేచ్ఛను గురించి చిత్తశుద్ధి లేకుండా మాట్లాడేవారూ, ఒకే పార్టీ పరిపాలన నియంతృత్వ ప్రమాణంతో ఉన్నదని భావించేవారూ తమ బాధ్యతను గుర్తించటం లేదు. ఒకే పార్టీ పాలన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైతే, ప్రతిపక్షం తలెత్తినంతమాత్రాన ప్రజాస్వామ్యానికి భద్రత ఉన్నట్లు కాదు. పై నుంచి పెత్తనాన్ని అంగీకరించే ప్రజలు మానసికంగా, గుడ్డిగా ఆచరించేవారు అధిక సంఖ్యాకులు ఉన్నప్పుడు పరిస్థితి మెరుగుపడదు.
ప్రజాస్వామ్యానికి ఎవరి దురుద్దేశం వల్ల ప్రమాదం వాటిల్లదు. దేశంలోని సాంస్కృతికమైన వెనుకబడినతనం వంటి పరిస్థితుల ప్రభావం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఉన్నందువల్ల మనం భూతాలతో పోరాడనవసరం లేదు. ఇతరుల ఉద్దేశాలతో కలహించనవసరం లేదు. నియంతృత్వం అసాధ్యమయ్యే పరిస్థితులను కల్పించాలి. పెత్తనాన్ని అంగీకరించే మనస్తత్వం వల్ల నియంతృత్వానికి లాంఛనప్రాయమైన ప్రజాస్వామ్యం ఆధారాన్ని కల్పిస్తుంది. తెలివిగల, చదువుకున్న జర్మన్ ప్రజలు సహితం ఈ వలలో పడ్డారు. అయితే ఇంగ్లాండులో నియంతృత్వానికి ఆకర్షితులు కాలేదు. పశ్చిమ ఐరోపాలోని దేశాలలో కూడా దుర్భేద్యమైన  హిట్లర్ సైనిక శక్తి నియంతృత్వాన్ని రుద్దలేక పోయింది. ఇదొక పేర్కొనదగిన సంఘటన, ఉన్నత విద్యాస్థాయి, తెలివితేటలు ఉన్నప్పటికి జర్మనులు పెత్తనాన్ని అంగీకరించే స్థితి నుంచి ఎప్పుడూ బయటపడలేదు. చారిత్రకంగా వీరికి ఆ స్థితి వచ్చింది. రాజ్యాన్ని పవిత్రంగా చూసే మనస్తత్వం వారికున్నది. ఇందుకు భిన్నంగా ఐరోపాలో, పశ్చిమ ఉత్తర దేశాలలో తాత్విక విప్లవాన్ని చవిచూచారు. అందువల్ల మధ్యయుగాల మనస్తత్వం నశించింది. వ్యక్తి స్వేచ్ఛా పిపాసకు, ప్రజాస్వామిక జీవితానికీ ప్రోత్సాహం కలిగింది. సాధారణ జర్మన్ పౌరుడి అత్యున్నతమైన కోర్కె సైనికుడు కావాలనీ లేదా రాజ్యాధికారి కావాలనీ, యూనిఫారం వేసుకోవాలనీ, ప్రజలలో బలశాలి ననిపించుకోవాలనీ, ఇదంతా రాజ్య ఛాయలో జరగాలని అనుకుంటాడు. పాశ్చాత్య దేశాలలో రాజ్యాధికారం చొచ్చుకుపోకుండా, ఉదారవాదం జాగరూకతను నేర్పింది. కనీస పరిపాలన చేసే ప్రభుత్వం ఉత్తమమైనదనీ ప్రజలు భావించారు. పెత్తందారీ విధానానికి ప్రజలు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడూ, కరుణామయుడైన పరిపాలకుడూ లేదా శక్తిమంతమైన నియంతా తమకోసం అంతా చేసిపెడతాడని భావించినపుడు వారికి తగిన ప్రభుత్వమే లభిస్తుంది. నియంతృత్వం తలెత్తడానికి తగిన సాంస్కృతిక, మానసిక పరిస్థితులను తొలగిస్తే తప్ప, ఎంత హెచ్చరిక చేసినా ప్రయోజనం లేదు. ఈ హెచ్చరిక చేసేవారే అవకాశం వస్తే నియంతృత్వాన్ని స్థాపిస్తారు. వారు కూడా అదే పరిస్థితులలో పనిచేయాలి కనక ఈ స్థితి తప్పదు.
పార్టీ, అధికార రాజకీయాలలో నిమగ్నులైనవారు ఎక్కువ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోరు. పునాదులు వేయడమంటే వారి దృష్టిలో చాలా జాప్యంతో కూడిన పని మాత్రమే. వారికి దగ్గరదారులు కావాలి అధికారానికి దగ్గర దారి ఇతరుల కంటే ఎక్కువ హామీలివ్వటమే. ఇచ్చిన హామీలు చేయగలమనే ఉద్దేశ్యం కానీ, నమ్మకం కానీ వారికుండదు. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు అనేది రాజకీయాలకు బయట ఉన్నవారిపైన లేదా అధికార కలహం నుంచి బయటపడగలిగిన వారిపైన ఆధారపడి ఉన్నది. ‘ఆచరణాత్మక రాజకీయవాదు’ను ఆకర్షించే తీరులో కాక వేరే విధంగా వీరు పనిచేయవలసి వుంటుంది. కొంతకాలం వీరు ఏకాకులుగా ఉండవలసి ఉంటుంది. ఇది నేటి అవసరం  కనక ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే అవకాశం ఉన్నది. జాతీయ స్వేచ్ఛ అనేది కట్టుకథ. జాతి విమోచన మోసం. వ్యక్తి స్వేచ్ఛమీద ఇష్టం ఉండటం ఒక ముఖ్య లక్షణంగా చాలామంది ప్రజలలో వ్యాపిస్తే తప్ప ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు అంధకారమే.
ఈ కృషి కష్టంగా కనిపించవచ్చు. వాస్తవంగా అంత కష్టం కాదు. అధికారం లేకుండా తామేమీ చేయలేమని, తమ వైఫల్యాలను రాజకీయవాదులు హేతుబద్ధం చేయాలని ప్రయత్నిస్తారు. ఒక మనిషి వాస్తవంగా స్వేచ్ఛను కోరినప్పుడు, ప్రజాస్వామిక సమాజంలో నివసించదలచినప్పుడు అతడు ప్రపంచాన్నంతటినీ విముక్తి గావించలేడు. దేశంలో ఉన్న ప్రజలందరినీ, ఒక మహత్తర విప్లవంతో స్వేచ్ఛాపరులను చేయడు. కాని తాను హేతువాదిగా, నీతిమంతుడుగా  ప్రవర్తించి, తనను చాలావరకు విముక్తుణ్ణి కావించుకోవచ్చు. అతడలా చేస్తే అతడిచుట్టూ ఉన్నవారు అలానే చేయగలరు. ఈ చర్య స్వేచ్ఛను వ్యాపింపచేస్తుంది. రాజకీయవాదులు కేంద్రంలో అధికారం కోసం పోరాడుకుంటుంటే అలాంటివారిని వదిలేసి ఒక వందమంది స్వేచ్ఛాపరులుగా నివసిస్తూ పని చేస్తుంటే వారి సంఖ్య అతి త్వరలోనే వేలల్లోకి పోతుంది. ఈ ఉద్యమం వ్యాపించి, ప్రజాస్వామ్యానికి వేసిన పునాది స్థిరపడుతుంది.

     రచయిత అనువాదం
ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య




No comments:

Post a Comment