రాజకీయాలు -అధికారం- పార్టీలు
ప్రజాస్వామ్యం - పార్టీ రాజకీయాలు
ఎమ్.ఎన్.రాయ్
(ఎమ్.ఎన్.రాయ్ వివిధ ప్రదేశాలలో ఇచ్చిన ఉపన్యాసాలను, వారు మరణించిన తరువాత వారి భార్య ఎలెన్ రాయ్ సంకలనం చేసి పుస్తకంగా ముద్రించారు.)
ప్రజల సార్వభౌమత్వాన్ని రాజకీయ పార్టీలు నాశనం చేస్తాయని సిద్ధాంతపరంగా చెపుతున్నాం. పశ్చిమ ఐరోపాలో దీనికి సాక్ష్యాధారాలు ఉన్నవి. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామనే పేరిట విపరీతంగా సైనిక ఖర్చులు పెడుతున్నారు. ప్రజలకు ఇది చాలా భారంగా పరిణమించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామంటూనే చంపేస్తున్నారన్న మాట. పార్టీలు ఎన్ని ఉన్నా, పార్టీ ఎంత చిన్నదైనప్పటికీ ఆడుతున్న ఆటమాత్రం ఒకటే. ఐరోపా దేశాలలో పార్టీ విధానం ఎప్పుడూ అస్థిరంగానే ఉంటుంది. నిష్పత్తి ప్రాతినిధ్యం ఇక్కడ ప్రోత్సహిస్తున్నందువల్ల, చిన్న పార్టీలు అనేకం తలెత్తాయి. పార్లమెంటులలో వీటి ప్రభావం వివిధ రకాలుగా ఉంటున్నది. పార్టీ విధానం అర్థం పర్థం లేనిదైపోయింది. ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అనే పార్టీ విధానం క్రమంగా అస్థిరత్వాన్ని తెచ్చిపెడుతున్నది.
అల్ప సంఖ్యాకులకు అవకాశాలు ఇచ్చే నెపంతో నిష్పత్తి ప్రాతినిధ్యం ప్రవేశపెట్టడంతో పార్టీ విధానంలో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా మారుతున్నది. ఓటర్లకు వారి ప్రతినిధులకు వ్యక్తిగత సంబంధం అదృశ్యం అవుతున్నది. వ్యక్తిగతంగా అభ్యర్థులకు గాక, పార్టీలకు ఓట్లు వేయటం వల్ల పార్లమెంటు సభ్యులు, ఓటర్లకు బాధ్యులు కాకుండా పోతున్నారు. ఓటర్లకూ, పార్లమెంటులోని పార్టీలకు వ్యక్తిగత సంబంధం లేనందువల్ల, ప్రభుత్వ ప్రాతినిధ్యం, లేదా బాధ్యత అనేది కావాలని మోసంగా మారకపోయినా, లాంఛనంగా మాత్రం వుంటున్నది. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని, పార్టీ విధానం భ్రష్టపరుస్తున్నది.
గ్రేట్ బ్రిటన్ లో పార్టీ విధానం కొంత మెరుగుగా పనిచేసింది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి ప్రాతిపదిక ఇక్కడ పూర్తిగా నాశనం కాలేదు. పార్లమెంటరీ సభ్యులు, ప్రాంతాల వారీగా ఓటర్లవల్ల ఎన్నుకోబడుతున్నప్పటికీ, నియోజక వర్గాలకు బాధ్యులుగా, సిద్ధాంతరీత్యా అయినా సభ్యులు ప్రవర్తిస్తున్నారు. బ్రిటన్ లో కూడా, పార్టీ విధానంలో స్థిరత్వం పోయింది. రెండు పార్టీలలో చీలికలు వచ్చాయి. వాటి కార్యక్రమాలు పలచబడినాయి. వాటి విభేదాలు ఎక్కువైనాయి. ఫలితంగా, వెస్ట్ మినిస్టర్ కేంద్రం రాజకీయ క్రీడారంగంగా లేదు. ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం, పార్లమెంటులో తరచు రాజకీయ ఆటలో నియమాలను పాటించటంలో, నియమాలను పాటించటం లేదని పరస్పరం నిందించుకుంటారు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఎన్నికలు జరిగిన తరవాత, లేబర్ పార్టీ ఆధిక్యత సన్నగిల్లటం వల్ల, పార్లమెంటరీ పద్ధతులను సరిగ్గా పాటిస్తే అధికారంలో వుండే అవకాశమే ఆ పార్టీకి లేకుండా పోయింది. రెండు మాసాలలోనే కొత్త ఎన్నికలు జరగవచ్చునని అనుభవజ్ఞులైన శాస్త్రజ్ఞులు జోస్యం చెప్పారు. సంప్రదాయబద్ధమైన పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తే అలా జరిగి ఉండవలసింది. భద్రత లేకుండా పార్లమెంటులో ఉన్న ప్రభుత్వం ఏదైనా దీర్ఘకాలిక శాసనాలను చేబట్టలేదు. పార్లమెంటులో పార్టీకి అంత స్వల్పాధిక్యత ఉన్నప్పుడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని రద్దు గావించటమే జరుగుతుంది. పార్టీ సభ్యులకు స్వతంత్ర నిర్ణయం చేసే హక్కు గాని, ఆచరించే స్వాతంత్ర్యం గానీ ఏమీ లేదు. విపరీతమైన పరిస్థితులలో కూడా ఇది సంభవించదు. పార్టీ ఆదేశాన్ని ప్రతి సభ్యుడూ ఏ పరిస్థితులలో నైనా పాటించేటట్లు చూస్తారు. లేకుంటే కొంతమంది సభ్యులు ప్రతిపక్షం వైపుకు పోవచ్చు. లేదా ఏదైనా సమస్య మీద ఓటు వేయకపోవచ్చు. అస్థిరమైన పార్లమెంటరీ విధానంలో ఎన్నికైన ప్రతినిధులు తమ నియోజకవర్గ ప్రజల వాంఛలు ఎలా ఉన్నాసరే పార్టీకి లొంగి ఉండవలసిందే. ప్రజల సార్వభౌమత్వాన్ని పార్టీ ఎలా కాజేస్తుందో గమనించవచ్చు. ప్రజాస్వామ్య సంప్రదాయం చిరకాలంగా పాతుకుపోయిందనుకున్న బ్రిటన్ లోనే ఇలా జరుగుతున్నది.
పార్లమెంటులో ఆరేడు ఓట్లు అధికంగా ఉన్నంత మాత్రాన ఎక్కువమంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునే హక్కు చట్టరీత్యా గానీ, నైతికంగా గాని ప్రభుత్వానికి లేదు. అంతేగాక పార్లమెంటులో అల్పసంఖ్యాధిక్యతలో ఉన్నంత మాత్రాన, 55 లేక 60 శాతం ప్రాతినిధ్యం గలవారు, మిగిలిన వారిని అల్పసంఖ్యాకులు అంటూ, స్వారీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉన్నదా అని పరిశీలించాలి. లాంఛన ప్రజాస్వామ్యంలో ఇదొక మౌలిక దోషం.
లోగడ పెద్దమనుషుల్లా రాజకీయ క్రీడారంగంలో పాల్గొన్న పార్టీ నాయకులు ఉన్నప్పుడు, 1950లో ఎన్నిక సృష్టించిన పార్లమెంటరీ స్థితి బ్రిటన్ లో కొనసాగేదే కాదు. ప్రజల నుంచి స్పష్టమైన అభిప్రాయ సేకరణ కోసం ఉభయ పార్టీలు ఎన్నిక జరపాలని అంగీకరించేవే.
కాలానుగుణంగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటించక, లోపాయికారీగా ప్రతిపక్షం కూడా ఆమోదించగా, లేబర్ పార్టీ అధికారంలో కొనసాగింది. కొత్త ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో ఎవరికీ హామీ లేదు కనక ఇటువంటి అంగీకారానికి వచ్చారు. రెండు పార్టీల మధ్య సార్వభౌములైన ప్రజలకు కొత్త పార్లమెంటును ఎన్నుకునే హక్కు లేకుండా పోయింది. ఎన్నిక జరిగితే దేశానికి స్థిరమైన, స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడి ఉండవచ్చు. పార్లమెంటరీ అవకాశవాద ఆటలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర ప్రభుత్వం ఉండేదే.
ఇనుమూ, ఉక్కు పరిశ్రమను జాతీయం చేయాలనేది, ఓటర్ల నుంచి స్పష్టమైన అభిప్రాయం రానిదే, వత్తిడి చేయబోమని లేబర్ ప్రభుత్వం ఒక విధమైన అభిప్రాయాన్ని సృష్టించింది. దీనివలన ప్రతిపక్షం ప్రభుత్వం విదేశీ విధానానికి మద్దత్తు నిచ్చింది. మితవాదులు, ఉదారవాదులు కూడా లేబర్ ప్రభుత్వ విదేశీ విధానానికి చిత్తశుద్ధితో బలాన్ని చేకూర్చాయి. అంతర్జాతీయ సోషలిజాన్ని పెంపొందించే దృష్టి లేబర్ పార్టీ విదేశాంగ విధానంలో లేక పోవటమే ఇందుకు కారణం.
కానీ సంవత్సరాంతంలోగా ఉక్కూ, ఇనుమూ పరిశ్రమ జాతీయీకరణ బిల్లు విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షాలతో కలిసి పయనించలేకపోయింది. పార్లమెంటులో వచ్చిన ఒప్పందం నిరవధికంగా నిలవలేదు. లేబర్ పార్టీలోని శక్తివంతమైన వామపక్షం ఈ బిల్లుకోసం వత్తిడి చేసింది. ఆ తరవాత వచ్చే ఎన్నికలలో, సంపూర్ణ సోషలిస్టు కార్యక్రమాలతో రంగంలోనికి దిగితే, పార్టీకి అత్యధిక బలం చేకూరుతుందని వారు వాదించారు. పార్టీలో అతి నిర్దాక్షిణ్యంగా, క్రమశిక్షణ కొరడాను ఉపయోగించి అతి ముఖ్యమైన శాసనాలను పార్లమెంటు ఆమోదం పొందేటట్లు చేసారు. అంతంత మాత్రంగా సాగిన ప్రతిపక్షాల అంగీకారం అంతటితో అంతమయింది. (1215లో జాన్ ప్రభువు హక్కుల పత్రంపై సంతకం చేసినప్పటి నుంచీ, పార్లమెంటుకు పునాదులు ఏర్పడినవి.) పార్లమెంటుల మాతృస్థానమైన ఇంగ్లండ్లో అప్పటి నుంచీ పార్టీ విధానంలోని అసలు రంగు బయటపడింది. విచక్షణారహితంగా అధికార పోరాటం జరిగింది.
అధిక సంఖ్యాకులు, అల్ప సంఖ్యాకులు అనే విషయంలో వచ్చిన కలహాల దృష్ట్యా, బలాబలాలు తేల్చుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబడడంలో అర్థం లేకపోలేదు. పార్లమెంటులో గాకపోయినా, దేశంలో స్పష్టమైన బలం ఉన్నదని నిరూపించుకోవాలంటే ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉన్నది. కానీ పార్టీ క్రమశిక్షణను ప్రయోగించి, అధికారంలో కొనసాగటానికి లేబర్ పార్టీ నిర్ణయించుకొన్నది. వెంటనే ఎన్నిక జరిగితే ఓడిపోతామనే భయం ఉండటంవల్ల, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానానికి అవకాశం వచ్చినట్లు  భాష్యం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి, రాజ్యాంగబద్ధంగా అవసరమైన జన వాక్యాన్ని ప్రభుత్వం కోల్పోయిందని అంగీకరించినట్లే, అయినప్పటికీ ప్రాతినిధ్యపు ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు కల్పించలేదు.
దేశంలో తన స్థితి గురించి ఏ మాత్రం హామీ ఉన్నా లేబర్ పార్టీ, ప్రజాస్వామికంగా సందేహాస్పదమైన నైతికంగా తగని, విధానానికి దిగవలసింది కాదు. ఎన్నికలు జరిగితే, తాను జయించగలననే, స్థితి వచ్చేవరకూ అధికారంలో కొనసాగాలను కోవటం వల్లనే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, నిర్దాక్షిణ్యంగా అణచివేసింది.
పార్లమెంటులో అధిక సంఖ్యలేనిదే, ఏ ప్రభుత్వం కూడా సరైన ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదు. ఇది కూడా ఐచ్ఛికంగా జరగాలి. లేబర్ పార్టీ, తన సభ్యుల నిర్ణయానికి వదిలివేస్తే, అనేక సమస్యలపై - అవి ప్రతిపక్షం వారు చేపట్టని వైనప్పటికీ - ఓడిపోయి ఉండేది. పార్టీ అదుపులో ఉన్న ప్రభుత్వం, పార్టీ సభ్యులు ప్రజాస్వామికంగా ప్రవర్తించనివ్వకుండా అధికారంలో కొనసాగుతున్నప్పుడు, అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు.
పార్లమెంటు రాత్రంతా సమావేశం జరిపేటట్లుచేసి, ప్రభుత్వ బలం సన్నగిల్లడానికి దోహదం చేసే ప్రతిపక్ష ఎత్తుగడలు సందేహాస్పదమైనవి. లోగడ విదేశీ విధానంలో అనేక ప్రధాన సమస్యలపై ప్రభుత్వానికి బలాన్ని చేకూర్చిన ప్రతిపక్షం, ఏదో సాధారణమైన సమస్యను ఆధారంగా అతి స్వల్ప తేడాతో ప్రభుత్వాన్ని ఓడించాలని చూస్తున్నాయి. ప్రతిపక్షాలిచ్చే ఇబ్బందికర పరిస్థితిని పార్లమెంటరీ విధానంలో అంతం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. అయినా ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వానికి సందేహంగానే ఉన్నది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టడానికి, ప్రభుత్వం ఏదన్నా చేయకముందే ఎన్నిక పెడితే గెలుస్తామని ప్రతిపక్షం భావిస్తున్నది. ఓటర్లలో అత్యధిక సంఖ్యాకులను ఆకర్షించటానికి, ఉద్రేక పూరితంగా నినాదాలివ్వటానికి ఏదైనా సమస్యను వారు వెతుక్కుంటున్నారు. అధికారం కోసం పెనుగులాడుతున్న పార్టీలు ఇంచుమించు సమ ఉజ్జీలైనప్పుడు అసలు సమస్యలేమిటో తెలుసుకోవటం ఓటర్లకు కష్టమైపోతున్నది. నిష్పాక్షికంగా, వివేచనతో నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కన్పించటం లేదు. ప్రజాస్వామ్యాన్ని చెడగొట్టటంలో, నాశనం గావించటంలో పార్టీవిధానం అలా పనిచేస్తున్నది.
అధికారాన్ని పట్టుకోవటం, నిలబెట్టుకోవడం పార్టీల ఉద్దేశ్యం. పార్లమెంటరీ విధానం లాంఛన ప్రాయమైన పద్ధతులతో ఇటువంటి అవకాశాలను కల్పిస్తున్నది. ఓటర్లలో, వివేచనా పరులు అత్యధిక సంఖ్యలో బలపరచవలసిన అవసరం లేకుండా పోతున్నది. లాంఛనప్రాయమైన పార్లమెంటరీ విధానంలో ఎన్నికల మోసాలు, పార్టీ విధానంలో అంతర్గతంగా ఉండటం వల్ల విధిగా వీటిని చేస్తుంటారు. ఒక పార్టీగాని, లేదా పార్టీల సంకీర్ణ ప్రభుత్వంగానీ ఓటర్ల మద్దత్తు విషయమై సందేహించనప్పుడు, ఎన్నిక తప్పదన్నప్పుడు అధికారంలో ఉండగానే ఎన్నిక చట్టాన్ని సవరించి, ప్రతిపక్షానికి అవకాశాలు తగ్గిపోయేటట్లు చేస్తారు. ఫ్రాన్సులో ప్రజాస్వామ్యాన్ని ఇలాగే దిగజార్చారు. ప్రజాస్వామ్య రక్షణ పేరిట జరిగిన తొక్కిసలాట ఫలితమిది.
రాజ్యాంగరీత్యా ఫ్రాన్సులో పార్లమెంటు పరిమితి పూర్తయినందువల్ల సాధారణ ఎన్నిక జరగవలసి ఉన్నది. (1951లో). ప్రస్తుత పార్లమెంటులో కమ్యూనిస్టులు చాలా సంఖ్యలో ఉన్నారు. కనక ఎన్నికల అనంతరం అయినప్పటికీ ప్రస్తుత పార్లమెంటులోని సంకీర్ణ ప్రభుత్వంలో వారిని చేర్చవలసివచ్చింది. కాని రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకొనే దానికి తగిన సంక్షోభాన్ని సృష్టించగలమనే ఆశతో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని వదలి వెళ్ళారు. ఆ సాహసకార్యంలో విఫలమై, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నిష్పత్తి ప్రాతినిధ్యం పద్ధతివల్ల వచ్చే పార్లమెంటులో సోషలిస్టులను దెబ్బకొట్టి, ఇంకా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కమ్యూనిస్టులకున్నది. ఈలోగా రంగం మీద డిగాల్ పార్టీ ప్రత్యక్షమైనది. ప్రస్తుత పార్లమెంటులో ద్వితీయ స్థానంలో ఉన్న, రిపబ్లికన్ పార్టీ నుంచి ఎక్కువ స్థానాలు చేజిక్కించుకొనే ధోరణి డిగాల్ పార్టీ కనబరిచింది. ప్రస్తుతం ఉన్న కేంద్ర పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కొత్త పార్లమెంటులో అధికారంలో కొనసాగే అధికారం లేదు. లోగడ రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ప్రాతినిధ్య నిష్పత్తి విధానాన్ని, కమ్యూనిస్టులకు, డిగాల్ పార్టీకి లేకుండా చేయడం తప్ప, మరో అవకాశం కన్పించలేదు. ఎన్నికల చట్టం సవరిస్తే కమ్యూనిస్టులు, (ఛార్లెస్ డిగాల్ 1870-1970. మొట్టమొదట డిగాల్ తాత్కాలిక ప్రభుత్వాధిపతిగా రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉన్నాడు. 1958లో అల్జీరియా సంక్షోభ సమయంలో ప్రధానిగా కొత్త రాజ్యాంగానికి ప్రజాభిప్రాయం పొందాడు. 1969 ఏప్రిల్ లో జనవాక్య సేకరణ జరిగినప్పుడు పదవికి రాజీనామా ఇచ్చాడు) డిగాల్ పార్టీ కలిసి కొత్త పార్లమెంటులో 60 శాతం వరకూ సీట్లు, హస్తగతం చేసుకోవచ్చునని అంచనా వేశారు. ఫ్రాన్సులో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంతటితో స్వస్తి పలికినట్లే.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంటుందా, ఊడుతుందా అనే స్థితి వచ్చినప్పుడు కూడా, సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్ధించే, ఎన్నికల చట్టానికి చేయవలసిన చట్టాన్ని గురించి అంగీకారానికి రాలేకపోయారు. అధికారంలో ఉండగా, అందుబాటులో ఉన్న అవకాశాలకోసం, తాపత్రయ పడటం వల్ల సంకీర్ణ ప్రభుత్వం ప్రధాన సమస్యలు పట్టించుకోలేకపోయింది. రాజకీయ పరిస్థితి ఇంకా అధ్వాన్నం అయింది. తుదకు ఒక అంగీకారం కుదిరింది. వచ్చే పార్లమెంటులో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకు బలం చేకూరే పద్ధతులలో ఎన్నికల చట్టం సవరించారు. ఎన్నికలలో దుర్వినియోగ పద్ధతులు అవలంబించటానికి అవకాశాన్ని తీసుకున్నారు. ఏ విధంగానైనా సరే, నియంతృత్వ పక్షాలను అధికారంలోకి రానివ్వరాదనే నెపంతో, ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులను సమర్ధించుకొన్నారు. వాస్తవానికి ప్రతిపక్షాల అధికారాన్నే ఉంచదలచి ఇదంతా చేశారు. ప్రజాస్వామ్యాన్ని, నాశనం చేయకుండానే, ఇదంతా చేయకపోతే ఏమయ్యేది… అధికారంలో ఉన్న పార్టీలు అలాగే కొనసాగటానికి కొత్త ఎన్నికల చట్టాన్ని ఉద్దేశించారు. ఓటర్ల అభిప్రాయంలో నిమిత్తంలేదు. పాత చట్టాన్ని అనుసరించి, ప్రజాభిప్రాయాన్ని సరిగా ప్రతిబింబింప చేయటం లేదనుకుంటే, కొత్త చట్టంలో పరిస్థితి మెరుగుకాలేదు. అధికార పెనుగులాటకోసం, పార్టీ రాజకీయాలు సాధనగా ఉపయోగించుకోవటానికే రెండు చట్టాలు తోడ్పడ్డాయి. పోనీ ఎన్నిక స్వేచ్ఛగా జరిగే హామీ ఉన్నదా అంటే, పార్టీల ఎత్తుగడవల్ల ప్రజాభిప్రాయం తప్పుగా చూపిస్తున్నారు.
ఐరోపాలో ఉన్న భద్రతా రాహిత్యత అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఇంకా చేరలేదు. కాని అక్కడ కూడా ప్రజల వివేచనాయుత అభిప్రాయం పార్టీ విధానంలో ప్రతిబింబించటం లేదు. కిందటి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. అయినప్పటికీ డెమోక్రటిక్ పార్టీ అభిప్రాయాలమీద, విధానాలమీద ఓడిపోయిన పార్టీ ప్రభావం ఉంది అంటే డెమోక్రటిక్ పార్టీ ప్రజలిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నదన్నమాట. వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పించుకోవటం కోసం ఇలా చేస్తున్నది. ఇదొక నియమాలు లేని ఆచరణ విధానం. ఆమెరికాలలో రెండు పార్టీల విధానమనేది (ప్రస్తుతం డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ ప్రధాన పక్షాలుగా ఉన్నప్పటికీ మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. సోషలిస్టు, కమ్యూనిస్టు, లిబర్టేరియనం, పీపుల్స్, లేబర్ మొదలయిన రాజకీయ పక్షాలు కూడా ఉన్నవి. ఇవి ఇంతవరకూ ఎన్నడూ అధికారంలోకి రాలేదు.) కేవలం నమ్మించటం కోసమే. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం తప్ప ఈ విధానం వల్ల మరే ప్రయోజనం లేదు. అక్కడ ప్రజాస్వామ్యం రెండు పక్షాల గుత్తాధిపత్య పాలనగా దిగజారిపోయింది.
మన దేశంలో పార్టీ విధానం ఇంకా బాల్యావస్థలో ఉన్నది. ప్రస్తుతం ఒకే పార్టీ పరిపాలన ఉన్నది. (కాంగ్రెసు పార్టీని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్య చేశారు. 1976లో వచ్చిన జనతా ప్రభుత్వం రెండేళ్ళపాటు కేంద్రాన్ని పరిశీలించింది) అది కొనసాగించాలనే కోరికలో రహస్యం ఏదీలేదు. పార్లమెంటరీ విధానం ఉన్నప్పటికీ ఒకే పార్టీపాలన ప్రజాస్వమ్యానికి వ్యతిరేకమే. రాజ్యాంగంలో ఏమి వ్రాసినప్పటికీ అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రజాస్వామ్యం, కాంక్షిస్తూ మాట్లాడినప్పటికీ, అధికారంలో ఉన్న పక్షం నియంతృత్వ పోకడలు గలదే. జాతి అంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పార్టీ పేర్కొంటున్నది. జాతి అంతా ఒకటే కనక, అవిభాజ్యం కూడా, అధికార పక్ష సభ్యులతో కూడిన వారు పార్లమెంటులో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రాజ్యాంగం కేవలం పెత్తనం చేయదని హామీ ఏదీలేదు. (రాజ్యాంగ సభ అనేది సరైన మాటకాదు) సర్వ సత్తాక ప్రజాస్వామిక రిపబ్లిక్ అయిన భారతదేశంలో చాలా పవిత్రంగా పేర్కొన్న ప్రాథమిక చట్టంలో కొన్ని ‘ప్రాథమిక హక్కులు’ ఇచ్చారు. అయితే నిర్మాణ వ్యవస్థను మార్చాలంటే కూలద్రోయవలసిందే. కాని అధికారంలో ఉన్న పార్టీకి తర్కబద్ధమైన ఆలోచన ఉండదు. ‘ప్రాథమికహక్కులు’ కొన్ని సవరించి స్వేచ్ఛకు అదుపులు పెడతారు. ఏకపక్ష పాలన ఆధిక్యతను ప్రశ్నించే అవకాశం ప్రస్తుతం ఉన్నది. న్యాయస్థానాల స్వాతంత్రాన్ని గూడా తగ్గించే ఆలోచనలు చేస్తున్నారు.
అర్హతలేని సభవారు రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ సభ ఎన్నికలో వచ్చినదికాదు. అందరికీ ఓటుహక్కు ఉన్న దృష్ట్యా, పార్లమెంటు ఎన్నికవల్ల ఏర్పడుతుంది. కనుక అప్పటివరకూ రాజ్యాంగ సవరణకోసం ఆగవలసి వచ్చింది. ఈలోగా, సర్వధికారాలుగల ప్రభుత్వం పడిపోయే పరిస్థితేమీ లేదు. అయినప్పుడెందుకీ తొందర? దేశంలో అభిప్రాయం ఏదైనా కానీ, కాలదోషం పట్టిన పార్లమెంటుపై పూర్తి అధికారంగల పార్లమెంటరీ పార్టీ ఏదైనా ఆమోదింపజేసుకోవచ్చు. ప్రజల సార్వభౌమత్వాన్ని పార్టీ కాజేసిందనటానికి యింతకంటె మచ్చుతునక మరొకటిలేదు.
పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం గూడా నాశనమవుతుంది. అసలు అది వున్నదనే అంతంతమాత్రం కాంగ్రెసు హైకమాండ్ ఆదేశాన్ననుసరించి పార్లమెంటులో పార్టీ సభ్యులు స్వేచ్ఛగా మాట్లాడటానికి వీలులేదు. సభ్యులు పార్టీకి బాధ్యులు. పార్టీ రహస్య సమావేశాలలోనే విమర్శను అనుమతిస్తారు. నిందితుడే న్యాయమూర్తి అన్నమాట.. పార్లమెంటు ఉన్న స్థితినిబట్టి ప్రజలు శాసనాలపైన గానీ, పరిపాలనా శాఖపైన గానీ అదుపు పెట్టడానికి అధికార పక్షాన్ని సాధనగా వాడుకోవాలి. ప్రజలలో పెరుగుతున్న నిస్పృహను కొందరు అధికారపార్టీ సభ్యులు ప్రతిధ్వనిస్తున్నారు. ఎన్నికైన సభ్యులుగా అది వారికి నిరాకరించటానికి వీలులేని హక్కుమాత్రమేగాక వారి విధి కూడా ...కాంగ్రెసుపార్టీ గౌరవ సంప్రదాయాలు… కోసం ఎన్నికైన సభ్యులను ప్రజాస్వామికంగా ప్రయత్నించనివ్వడంలేదు. అవధులులేని ప్రజావాణి కపటంతో కూడిన జాతీయ ఐక్యత అనే మేళవింపును గందరగోళ పరచవచ్చు. కనక అటువంటిది అణచివేయాలి. పార్టీ క్రమశిక్షణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని చెరుస్తున్నారు. ప్రజా స్వామ్యానికీ, పార్టీ విధానానికీ గల వైవిధ్యానికి ఇంతకు మించి మరే ఉదాహరణ అక్కరలేదు.
రాజకీయ పార్టీలు అధికారం హస్తగతం చేసుకోటానికే తప్ప, ప్రజాస్వామ్యాన్ని ఆచరించటానికి ఏర్పడటంలేదు. లక్ష్యం కోసం ఏ సాధనైనా సమర్థనీయమేనని వారంటున్నారు. గతంలోనూ, ప్రస్తుతం కూడా అనేక దేశాల అనుభవాన్ని బట్టి పార్టీలు అనుసరించే పద్ధతులు అవినీతికి దారితీస్తాయని ప్రజాస్వామ్యాన్ని నాశనం గావిస్తాయని రుజువయింది.  

     రచయిత అనువాదం
ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య




No comments:

Post a Comment