కవిగా శశాంకతో నాకు బొత్తిగా పరిచయం లేదు. లెక్చరర్ శశాంక కొంత తెలుసు. మిత్రుడుగా బాగా సన్నిహిత స్నేహం వుంది. హైదరాబాద్ లోని ఆదర్శనగరంలో 1970 ప్రాంతాల్లో వుంటుండగా, నేను న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్ లో వుండేవాడిని. అప్పుడే కలుసుకుంటూ వుండేవాళ్ళం.
శశాంకతో నా పరిచయం అంతా గోరా శాస్త్రి ద్వారానే, శశాంక అప్పుడప్పుడు జీరాలోని గోరా శాస్త్రి యింటికి రాగా, అక్కడే సరస సల్లాపాలు జరిపాం. గోరాశాస్త్రి చనువుతో శశాంకను ఏవేవో అంటుండేవాడు. శశాంక చిన్నవాడుగనుక ఆ మాటలన్నీ పడేవాడు.
నేను శశాంక యింటికి వెళ్ళి వరండాలో కూర్చొని ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవారం. ఇరువురం దేవులపల్లి కృష్ణశాస్త్రి యింటికి వెళ్ళి కాలక్షేపం చేసేవారం. సేత అనసూయలు అప్పుడు ఆదర్శనగర్ లో వుండేవారు. వారూ పరిచయమయ్యారు.
1969లో గోరా శాస్త్రికి 60వ జన్మదిన సభ తలపెట్టినప్పుడు శశాంక సహకరించారు. అందరం కర్నూలు వెళ్ళి సన్మాన సభలో పాల్గొన్నాం. సి. ధర్మారావు, మండవ శ్రీరామమూర్తి, శశాంక, నేను ఆ సమావేశాల్లో చురుకుగా కార్యక్రమాలు జరిపాం. ఫోటోలు తీయించుకున్నాం.
నేను ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళినా, శశాంక కవితాలోకం వేరు. నా చర్చలు, ప్రసంగాలు అన్నీ వేలూరి సహజానంద నిర్వహించేవారు. కనుక శశాంక కవితా విభాగంలోకి వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడైనా దండమూడి మహీధర్, శశాంక, నేనూ కాంటీన్ లో లాంచనంగా కలసి కబుర్లు చెప్పుకునేవారం. రవీంద్ర భారతిలో కార్యక్రమాలకు గోరాశాస్త్రితో కలసి నేను వెళ్ళినప్పుడు, శశాంక జత అయ్యేవారు. అక్కడ పాతూరి వారు, సి. ధర్మరావు చేరేవారు. శశాంక మిత భాషి. చక్కగా నవ్వుతూ పలకరించేవారు. సంజీవరెడ్డి నగర్ మారిన తరువాత మా కలయిక సన్నగిల్లింది. శశాంక చెణుకులు గోపాలశాస్త్రి వద్ద సరసాలు బాగుండేవి.
గోరాశాస్త్రి గారింట్లో వి.ఎస్. రమా దేవిని కలసినప్పుడు, ఒక పర్యాయం శశాంక వచ్చారు. అప్పుడు జరిగిన సంభాషణలన్నీ కవితా గోష్టిని తలపించాయి.
నాకు ఈమని శంకరశాస్త్రి గారితో కించిత్తు పరిచయం వుండేది. ఆయన వీణా కార్యక్రమాలకు నేను, నా భార్య కోమల, కుమార్తె నవీన వెళ్ళేవాళ్ళం. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక గేయాన్ని వీణపై పలికించగా, అదేమిటో తెలియకుండానే, అభినందించాం. శశాంక రాసిన గేయం అది అన్నారాయన. సంతోషించాం. ఆ విధంగా ప్రత్యక్ష పరోక్ష రీతులలో శశాంకతో సన్నిహితత్వం వుంది. ఆయన కుమారుడు పార్వతీశం ఆ తరువాత దూరదర్శన్ లో పరిచయమయ్యారు.
రచనలు : నయా జమానా కవితలు, స్వర లహరి కవితలు, రాగ వల్లరి కవితలు.
- నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment