బెజవాడ రామచంద్రారెడ్డి--సాహితీపరులతో సరసాలు
మాట మధురం. రాత రమణీయం. రూపు గంభీరం. ప్రవర్తన హుందాగలది. బెజవాడ రామచంద్రారెడ్డి వ్యక్తిత్వ వర్ణనలో అతిశయోక్తి లేదు.
ఆయన పరిచయం అయ్యే నాటికి షష్ఠిపూర్తి చేసుకున్నారు. నావంటి గ్రాడ్యుయేట్ తో సన్నిహితంగా మిత్రుడుగా మెలగగలగడం, ఆకర్షించడం బెజవాడ రామచంద్రారెడ్డి విశాల దృక్పధమే కారణం.
1958 నుండీ 1973 వరకూ సన్నిహితులుగా వున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాం. ఆయన కార్డు రాస్తే సంతోషించేవాడిని. కారణం ఒక వైపు గోటితో చిత్రం గీసి పంపేవారు. అలాంటి నఖ చిత్రాలు దాచుకొని, చివరకు స్టేట్ పురావస్తు శాఖకు యిచ్చాను. సంజీవదేవ్ అక్షరాలవలె బెజవాడ వారి రాతచాలా చూడముచ్చటగా వుండేది.
బెజవాడ గోపాలరెడ్డికీ రామచంద్రారెడ్డికీ బంధుత్వం వుంది. కాని రాజకీయంగా శత్రుత్వమే. దక్షిణాదిన ఉద్యమ తీవ్రతకు పేరొందిన పెరియార్ రామస్వామి నాయకర్ ప్రభావితుడైన రామచంద్రారెడ్డి జస్టిస్ పార్టీలో చేరారు. ఆయన చదువుకూడా మద్రాసు పచ్చయప్ప కళాశాలలో. అది జస్టిస్ పార్టీకి కాణాచి. బి.ఎ. చదివి లా చేసి, 1923లో బార్ లో చేరికూడా, ఆయన ప్రాక్టీసు చేయలేదు. రాజకీయాలు, సాహిత్యంలో నిమగ్నులై, జీవితమంతా కాంగ్రెస్ వ్యతిరేకిగా, రైతు పక్షపాతిగా వుండేవారు.
బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర వారపత్రిక నెల్లూరు నుండి (1930-40) సంపాదకులుగా నడిపారు. ఆయన సాహిత్య పరిషత్తు అధ్యక్షోపన్యాసాలు, నాటక పరిషత్తు ప్రసంగాలు, రెడ్డి జనమహాసభలో సూచనలు, స్వతంత్రం ద్వారానే మనకు తెలుస్తున్నాయి.
1930 నాటికే మద్రాసు శాసన సభ స్పీకర్ గావడం, 1923 నుండే కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నిక అవుతుండడం రెడ్డి గారి జీవిత మలుపులే. చక్కగా టూకీగా ఆకర్షణీయంగా మాట్లాడడంతో ఆయన అందరినీ ఆకట్టుకోగలిగారు. అయితే 1937లో ఎన్నికలు జరిగినప్పుడు గోపాలరెడ్డి-రామచంద్రారెడ్డి కావలి నుండి పోటీ చేసారు. ఆనాడు ఒకే వేదిక నుండి ఉభయులూ ప్రచారం చేయడం విశేషం. జస్టిస్ పార్టీ పూర్తి ఓటమి చూడగా 7 వేల ఓట్లతో రామచంద్రారెడ్డి తన పరాజయం అనుభవించారు. గోపాలరెడ్డి 20 వేల ఓట్లతో గెలిచారు. పరిమిత ఓటర్లు వుండే వారని మనం గమనించాలి.
రాజకీయాలు ఎలా వున్నా రామచంద్రారెడ్డి గ్రాంధిక వాది సాహిత్య పరిషత్తు అధ్యక్షులుగా ఆయన చురుకైన పాత్ర వహించారు. కవులను, రచయితలను ప్రోత్సహించి, కొందరిని ఆర్థికంగా ఆధుకున్నారు. అవధానాలలో పాల్గొని పృచ్ఛకుడుగా వ్యవహరించారు. అనేక మంది రచయితలు ఆయన చేత పీఠికలు రాయించుకున్నారు.
నాటకాల పట్ల విపరీతమోజు చూపిన రెడ్డి గారు, కళల పోషణ జరగాలని కోరారు. పరిశోధన తత్వం గల వ్యక్తిగా నాటక చరిత్ర గమనించి, విశ్వవిద్యాలయాలలో నాటక కళపై దృష్టి పెట్టాలన్నారు.
మహాభారత ఉపన్యాసాలు 18 రోజులు జరిగితే, రెడ్డి గారు పాల్గొని, రోజూ వ్యాఖ్యానించేవారు. దక్షిణ భారత వ్యవసాయ సంఘం 1943లో స్థాపించి, రైతు రక్షణకు భిన్న తీరులలో కృషి చేశారు.
నెల్లూరులో జమీన్ రైతు వారపత్రిక నిరంతరం బెజవాడ రామచంద్రారెడ్డిపై వ్యంగ్య కార్టూన్లు ప్రచురించింది. 1952 తొలి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నెల్లూరు నుండి లోక్ సభకు రామచంద్రారెడ్డి ఎన్నిక అయ్యారు. నాడు సోషలిస్టు అభ్యర్థిగా ఆయనపై ఇస్కా రామయ్య కూడా పోటీ చేశారు.
నేషనల్ డెమొక్రటిక్ పార్టీ డెఫ్యూటి నాయకుడుగా రెడ్డి గారు లోక్ సభలో వుండగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ నాయకుడు. 1930 ప్రాంతాలలో స్వతంత్ర పత్రిక సంపాదకుడు 1960 నాటికి రాష్ర్ట స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు గావడం విశేషం. అప్పుడే రామచంద్రారెడ్డి గారితో నాకు పరిచయం. ఆయన రాజకీయాలతో నాకు నిమిత్తం లేదు. అయితే నాడు ఆచార్యరంగాకు నేను పి.ఎ.గా (ఆంతరంగిక కార్యదర్శి) వున్నందున ప్రముఖులతో సన్నిహితుడను కాగలిగాను.
రామచంద్రారెడ్డిగారితో 1959లో తొలిసారి బాపట్ల నుండి బొబ్బిలి వరకూ కారులో పర్యటించాను. మేముయిరువురమే వుండడంతో బోలెడు సాహిత్య, నాటక, కళారంగాల సంగతులు చెప్పారు. ఆయనలో సున్నిత హాస్యం వుండేది. ప్రసంగాలు హుందాగా సాగేవి. ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసాలు, నెహ్రూపై విమర్శలు యిష్టపడేవారు. రెడ్డి గారి సరసన రాజాజీని కలవడానికి, మాట్లాడడానికి అవకాశం లభించింది. అప్పటి నుండీ రెగ్యులర్ గా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం.
సాహిత్యంలో కొంత అభ్యుదయం, కొంత సనాతనత్వం మిళితం చేసిన రెడ్డి గారు, తనకు యిష్టమైన వారిని సత్కరించారు. త్రిపురనేని రామస్వామికి గుడివాడలో గండపెండేరం తొడిగిన ఖ్యాతి రెడ్డి గారిదే.
దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువాలతో ఆయనకు చాలా దగ్గర సంబంధాలుండేవి. కొప్పరపు కవుల మొదలు అనేక మందిని ఆయన ఆదరించారు. ప్రతాప రుద్రీయం వంటి నాటకాలు ఓపికగా తిలకించి, విశ్లేషించారు. 1935లో 110 కందపద్యాలతో మాతృశతకం రాశారు. తరువాత రచనలన్నీ వివిధ సంచికలలో, పత్రికలలో, కవికృతులలో కనిపిస్తాయి. ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వ విద్యాలయాలలో పాలక మండలి సభ్యుడుగా రెడ్డి గారు విద్యాభిలాషి. తిరుపతిలో సంస్కృత పరిషత్తు అధ్యక్షులు గానూ వున్నారు.
కవులపై చెణుకులు, అవధానాలలో సరసాలు, కొద్దిగా సెక్స్ జోక్ లు రెడ్డి గారి సొత్తు. రామచంద్రారెడ్డి గారి కుమారులలో పాపిరెడ్డితో నాకు దగ్గర సాన్నిహిత్యం వుండేది. ఓబులరెడ్డి, కృష్ణారెడ్డి, దశరధ రామిరెడ్డి, సీతారామిరెడ్డి గార్లతో హలో  సంబంధమే. బెజవాడ రామచంద్రారెడ్డి గారి గ్రాంధిక వాదం నేడు అదృశ్యంకాగా, ఆయన పనిచేసిన జస్టిస్ పార్టీ స్వతంత్ర పార్టీలు కాలం చేశాయి. నెల్లూరు వర్ధమాన సమాజానికి రెడ్డి గారి పుస్తకాలు, పత్రికలు యిచ్చారు.
ఇక్కడ ప్రస్తావించిన అనేక విషయాలు నేను అడిగి తెలుసుకున్నవీ, వారు భిన్న సందర్భాలలో చెప్పినవీ వున్నాయి. రెడ్డి కుల సభలలో ఎందుకు పాల్గొన్నారో తెలియదు. జస్టిస్ పార్టీలో కొందరివలె ఆయన కులవ్యతిరేక ప్రచారం తీవ్రంగా చేయలేదు. కాని వాడుక భాషను గట్టిగానే నిరసించారు. రెడ్డి గారి చమత్కార బాణాలు : కాంగ్రెస్ కాల్బలము (వలంటీర్లు) పోలీసం లాఠీ దెబ్బలకు కాల్బలమునే చూపినారు అని స్వతంత్ర పత్రికలో రాశారు.
కొప్పరపు కవులతో అవధానంలో పృచ్చకుడుగా రవికలో రెండున్నవి అనే సమస్యను పూరణకుయిచ్చి నవ్వించారు. స్వతంత్ర, తెలుగు వారపత్రికను రామచంద్రారెడ్డి గారు సంపాదకుడుగా వదలేసినప్పుడు, మాలి సుబ్బరామయ్య కొన్నాళ్ళు, వెన్నెల కంటి ఆంజనేయులు కొంతకాలం సంపాదక బాధ్యత వహించారు.
జాషువా కావ్యం ముంతాజు మహలుపై రామచంద్రారెడ్డి గారి వ్యాఖ్య.కన్నెరాళ్ళ గూర్చి కట్టించె షాజాను తాజమహలు. దివ్య తేజ మొదప వన్నెగన్న చెన్ను వర్షించె జాషువ తాజమహలు కవిత తేజమలర” నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డి పాళెంలో, బెజవాడ రామచంద్రారెడ్డి జరిపిన సాహిత్య గోష్టి కార్యక్రమాలు, కళాపోషణ గొప్ప జ్ఞాపకాలు.
రచనలు : మాతృశతకం, అనేక పీఠికలు, సాహిత్య ఉపన్యాసాలు, ఎడిటర్ : స్వతంత్ర  తెలుగు వార పత్రిక.
- నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment