My teacher Yelavarthi Rosayya
పిలక పెంచి, వీరగ్రాంధిక వాదిగా, ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కనలను ‘గారు’ అని సంబోధించిన ఎలవర్తి రోసయ్య ఒక విశిష్ట వ్యక్తి. భావాలలో ఉగ్రవాది. ఇంగ్లీషు టీచరైనా, తెలుగులో నిష్టాతుడు. గణితంలో, సంగీతంలో మంచి ప్రవేశం వుంది. తెనాలి తాలూకా తురుమెళ్ళ హైస్కూలులో చదివి, మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రోసయ్య, భీమవరం, గుంటూరులో కాలేజీ టీచర్ గా వేలాది మందిని ప్రభావితం చేశారు.
మంచి కవిత్వం అంటే చెవి కోసుకునే రోసయ్యకు ఆప్త స్నేహితుడుగా వున్న ఆవుల గోపాలకృష్ణ మూర్తి, చిట్కా ప్రయోగాలతో ఆయన్ను మార్చేశాడు. గుంటూరు కమ్మహాస్టల్లో వున్న రోసయ్యకు త్రిపురనేని రామస్వామి “సూతపురాణం” పద్యాలు వినిపించాడు. రోసయ్య ఆశ్చర్యపోయి, ఎవరు రాశారు, చాలా అద్భుతంగా వున్నాయని, ఆరాతీశాడు.
అలా ఆసక్తి పెరిగిన తరువాత అసలు విషయం చెబితే, కూలంకషంగా చదివి, రోసయ్య మారడానికి నాంది పలికారు. ఒక రాత్రి నిద్ర పోతున్న రోసయ్య పిలక కత్తిరించి, భావాలలోనే గాక భాషలోనూ, వేషంలోనూ రోసయ్యను మార్చేశారు ఎ.జి.కె. (ఆవుల గోపాలకృష్ణమూర్తి). ఎం.ఎన్. రాయ్ మానవ వాదం పట్ల బాగా ఆకర్షితుడైన రోసయ్య, అనేకమందిని రాయ్ పట్ల మొగ్గుచూపడానికి దోహదకారి అయ్యారు. రాయ్ అనుచరులు జి.డి. పరేఖ్, ఎ.బి.షాల ప్రసంగాలు, భావాలు శ్లాఘించారు. నేను గుంటూరు ఎ.పి. కాలేజీ (1954-58) విద్యార్థిగా, రోసయ్యగారి వలన మానవవాదినయ్యాను. గురువుగారు కాస్తా జీవితమంతా స్నేహితులయ్యారు. కాలేజీ కంటే ఆయన ఇంట్లో నేర్చిన విద్య చాలా ఉపయోగపడింది. రోసయ్యగారికి జ్ఞాపకశక్తి హెచ్చు. ఇంగ్లీషు తెలుగు పుస్తకాలలో విషయాలు చెబుతూ, పేజీలు తిరగేసి, కొటేషన్లు చూపేవారు. త్రిపురాన వేంకటరాయ “మొయిలు రాయభారం” నుండి పద్యాలు వినిపించేవారు. ఎం.ఎన్.రాయ్ సైన్స్ అండ్ ఫిలాసఫీలో, జటిలవిషయాలు విడమరచి చెప్పేవారు. వీటన్నిటికి తోడు రోసయ్య వీరగ్రాంధికవాది. అది ఎదురీత. కాలం చెల్లిన వాదం. అయినా అందుకు సమర్ధనీయంగా కొటేషన్లతో కూడిన చిన్న పుస్తకం రాశారు. అది ఎందుకో గాని అచ్చువేయలేదు. అడపదడప వ్యాసాలు అక్కడక్కడా రాసినా, అవీ తక్కువే.
సాహిత్యంలో ఔచిత్యం వుండాలని ఆవుల గోపాలకృష్ణ మూర్తి అంటే, ఎంతో మెచ్చుకున్నారు. చిన్నయసూరి అంటే రోసయ్యకు ఎక్కడ లేని మోజు. దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారిపట్ల గురు భావం. భట్టుమూర్తి వసుచరిత్ర, వీణపై వాయించవచ్చుననేవారు. ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్ పలికిస్తుందని, చౌడయ్య ఫిడేల్ పేడు మీద పేడు రాసినట్లుంటందనేవారు. ప్రాచ్యపాశ్చాత్య సంగీత, సాహిత్యకారులపై రోసయ్యకు రాగద్వేషాలు జాస్తి. శామ్యూల్ జాన్సన్, థామస్ గ్రే, మిల్టన్ అంటే యిష్టం.
పాఠాలు చెప్పేటప్పుడు క్రాస్ రిఫరెన్స్ లు విరివిగా చెప్పేవారు. పోర్షన్లు పూర్తి అయ్యేవికావు నాటకాల్లో పాత్రోచితంగా నటించి చూపేవారు. కాలేజీ టీచర్ గా, ప్రిన్సిపాల్ గా, చిన్న పిల్లల స్కూలు నిర్వాహకుడుగా రోసయ్య జీవితమంతా గడిపారు. కుమారుడు అమెరికాలో వుండటం వలన ఒకసారి వెళ్ళి పర్యటించి వచ్చారు.
స్వాతంత్రోద్యమ రోజులలోనే విధవా వివాహం చేసుకొని, జీవితాన్ని ఆ దర్శంగా ప్రారంభించారు. రోసయ్య గారితో 1954లో మొదలైన పరిచయం ఆయన అస్తమించే వరకూ సాగిందినాకు. అది చాలా వ్యక్తిత్వ వికాస స్నేహం. ఆయన Website పెట్టడంలో ఎలవర్తి రామరాజ భూషణుడుకు నేను యధాశక్తి తోడ్పడి, తృప్తి చెందాను.
పానుగంటి లక్ష్మీనరసింహారావు రచనలు అంటే రోసయ్యకు ప్రాణం. సాక్షి ఆరుభాగాలు, విమర్శాదర్శం, నాటకాలు చదివి, మైమరచి, నాకు యితరులకు చదివి వినిపించేవారు. పానుగంటి హాస్యం అడుగడుగునా ఆయనతో పాటు ఆనందించాం. వాడుక భాషా వాదులను, గిడుగు మొదలు ఎందరినో రోసయ్య దుయ్యబట్టేవారు. ఆ విషయంలో ఆయనతో ఏకీభవించ లేకపోయేవాడిని. కమ్మకులాభిమానం మాత్రం రోసయ్యగారు పోగొట్టు కోలేకపోవడం, యీ నేపధ్యంలో ఆశ్చర్యమే. ఎం.ఎన్.రాయ్ మానవవాదంతో, కులతత్వం ఎలా పొందికగా చూడగలిగారో అర్థం కాదు.
see website: http://yrosayya.com/
నరిసెట్టి ఇన్నయ్య
1 comment:
rejeti.venkateswarlu,madhu(parvathiah),chandrasekhar(mamata medicals, raghavarao (retd.,lecturer) all from guntur appreciate your efforts and contributions on internet blog.
Post a Comment