పుట్టినరోజు వినూత్నంగా జరుపుకున్న తీరు



అక్టోబరు 31 నా 76వ పుట్టిన రోజు. అమెరికాలోను, యూరోప్ లోను హాలోవిన్ పండగ ఆరోజే
. దీనిని దెయ్యాల పండగ అంటారు. పిల్లలు వింత వేషాలు వేసుకుని, రాత్రిళ్ళు ఇళ్ళకు వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అంటూ పెద్దలు పంచే చాక్లెట్లు స్వీకరించి ఆనందించే పండుగ. అయితే నా పుట్టిన రోజు ఈసారి వినూత్నంగా చేద్దాం అని నా కుమార్తె డాక్టర్ నవీన తూర్పు యూరోప్ పర్యటన ఏర్పాటు చేసింది.  ఆవిధంగా తొలిసారి ప్రపంచ ప్రసిద్ధ నివాస నగరమయిన వియన్నాలో అడుగుపెట్టాం.
వియన్నా నగరం
ప్రపంచంలో నివసించదగిన నగరాలు సర్వేచేయగా వియన్నాకు కొన్నేళ్ళుగా అగ్రస్థానం లభిస్తున్నది.  మనం వియన్నా అనిపిలిచేది అక్కడివారు వయన్ అంటారు. అది జర్మన్ భాష. అక్కడ ఉన్న 20 లక్షల మంది ప్రజలు జర్మన్ భాషలో మాట్లాడతారు. వియన్నాకు ‘స్వప్న నగరం’ అనే పేరుంది. మానవుల కలల గురించి పరిశోధన చేసి వాటి ప్రాధాన్యతను వెలికితెచ్చి, శాస్త్రీయంగా విడమరిచి, అవసరమయితే చికిత్స కూడా చేయవచ్చునని వెల్లడించిన ఫ్రాయిడ్ అక్కడి వాడే. ఆయన సిద్ధాంతాలు శాస్త్రీయంగా రుజువు కాలేదు. ఆయన ప్రభావం వలన కలలపై బాగా పరిశోధన జరుగుతున్నది.  మేము ఫ్రాయిడ్ మ్యూజియంకు వెళ్ళి ఆయన నివాసాన్ని, వాడిన పరికరాల్ని, గడిపిన జీవితాన్ని ప్రదర్శనలో చూశాం. వియన్నా నగరంలో ఒక వీధిలో ఉన్న మూడంతస్తుల భవనం ఏమంత గొప్పది కాదుగాని ఫ్రాయిడ్ రీత్యా దానికి ఫ్రాధాన్యత సంతరించింది. అటు హిట్లర్, నాజీల దాడికి గురయి నగరం వదిలేసిన ఫ్రాయిడ్ వస్తువులు ఆయన కుమార్తె ఆన్ కొన్ని సేకరించి, ఒక ప్రైవేటు మ్యూజియంకు ఇవ్వగా వాటిని భద్రపరిచారు. ఆ మ్యూజియం సందర్శన మేథస్సుకు సంతృప్తినిచ్చే విషయం. ఆ తరవాత నగర కేంద్రంలో ఉన్న లాంట్ మన్ హోటల్ కు వెళ్ళాం. ఫ్రాయిడ్ తరచు నడుచుకుంటూ వచ్చి అక్కడ కాఫీ తాగేవాడు. ఆయన కూర్చున్న టేబుల్ వద్దే కూర్చోవాలని వెళ్ళాను. అప్పటికే అక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు. వారు ముగించేవరకూ వేచి వుండి, వారు వెళ్ళిపోతుండగా వారిని పలకరించి మీరు కూర్చున్న చోటుకు ప్రాధాన్యత ఏమిటో తెలుసా?  అని అడిగాము. తెలియదన్నారు. అది ఫ్రాయిడ్ కూర్చునే చోటు అని చెప్పగా వారు ఆశ్చర్యపడి సంతోషించారు. మేము అక్కడ కూర్చొని భోజనం చేసి, ఫోటోలు తీసుకుని, సంతోషించాము.
అలాంటి నగరంలో గడుపుతూ మ్యూజియంలను, ప్యాలెస్ లను, థియేటర్లను, శిల్ప సంపదకలిగిన మందిరాలను చూచి ఆనందించాము.  అందులో ఎలిజబెత్ రాణివాసం పేర్కొనదగినది. అమూల్యమైన వస్తువులను అపూర్వంగా భద్రపరిచివుంచారు. కోట్ల విలువ చేసే రత్న ఖచిత మంచం ఒకటి చూచాము. దానిపై ఇంతవరకు ఎవరూ పడుకోలేదట! అంటే కేవలం ప్రదర్శన వస్తువుగానే మిగిలిపోయిందనమాట. వియన్నా అంతటా రోమన్ కాథలిక్ ప్రభావం కనిపిస్తుంది. వారి చర్చీల ఔన్నత్యం, పూజలు, సంగీతమయమయిన భక్తి పాటలు, వినిపిస్తూ వుంటాయి. వియన్నాలో అప్పటికప్పుడు టిక్కెట్లు కొనుక్కుని థియేటర్లకు ఒపెరా, బాలేకు వెడదామంటే కుదరదు. చాలా ముందుగా రిజర్వు చేయించుకుని వెళ్ళాలి. ఇప్పటికీ సుప్రసిద్ధమయిన సంగీత ప్రదర్శనలు నిత్యనూతనంగా జరుగుతుంటాయి. వియన్నాలో ఎటు వెళ్ళాలన్నా సౌకర్యాలు చాలా బాగా వుంటాయి. ట్రాంలు, రైళ్ళు, బస్సులు, టాక్సీలు, పుష్కలంగా తిరుగుతుంటాయి గనుక సులభంగానే ప్రయాణం చేసి, చూసి రావచ్చు. ఫ్రాయిడ్ అనుచరుడు, వ్యక్తి స్వేచ్ఛపై సైకాలజీలో పరిశోధనలు చేసిన యాడ్లర్ కేంద్రం కూడా చూసాము. అయితే అది మ్యూజియం కాదు.
వియన్నాలో చాలా కేంద్రాలలో హోటళ్ళు నడిపేవారు పేవ్ మెంట్లను కూడా వినియోగిస్తారు. అయితే అక్కడక్కడ బిచ్చగాళ్ళు వచ్చి అడుక్కోవటం కనిపించింది. ఇదేమంత పెద్ద సంఖ్య మాత్రం కాదు. కానీ, స్త్రీలు, పురుషులు కూడా చాలామంది సిగరెట్లు తాగటం గమనార్హం. హోటళ్ళలో ప్రధానంగా మాంసాహారం, వైన్, బీర్ ఎక్కువగా కనిపించింది.
వియన్నా అంతర్జాతీయ కేంద్రాలకు, యూనివర్సిటీలకు ప్రసిద్ధి. భావ పోరాటాలు, తాత్విక వైజ్ఞానిక ఆలోచనలు నిరంతరం సాగిస్తున్న నగరం ఇది. యునెస్కో కేంద్రం, సాంకేతిక విద్యాలయం, ఫైనాట్స్ అకాడమీ గమనార్హం. ఫుట్ బాల్ ప్రధానమైన ఆటగా ఉన్నది. చాలా ప్రాంతాలు, ఓపిగ్గా తిరిగి చూడవచ్చు. ప్రజల సహకారం కూడా బాగానే వుంటుంది. ఏ విధంగా చూసినా వియన్నా నగరం ఆకర్షణీయంగా కనిపించేదిగానే ఉన్నది. అలాంటి నగరంలో నా పుట్టిన రోజు గడపటం ఆనందాన్నిచ్చింది.
సౌండ్ ఆఫ్ మ్యూజిక్
వియన్నా నుండి బస్సులో గాని రైల్లో గానీ, 3 గంటలు ప్రయాణం చేస్తే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా తీసిన సుప్రసిద్ధ ప్రదేశం సాల్స్ బర్గ్ చేరుకుంటాము.  సినిమా ఎంత ప్రసిద్ధమో ఆ ప్రదేశం కూడా అంత ఆనందదాయకమైన చోటు. ఎన్నాళ్ళనుండో చూడాలనుకుంటున్న ప్రకృతి సౌందర్య దృశ్యానికి చేరుకున్నాము. అది ఆల్ఫ్స్ పర్వతాలలో ఉన్న చిన్న వూరు. కనీసం వంద రమణీయ దృశ్యాలు షూటింగుకు పనికొచ్చే తీరులో ఉన్న ప్రాంతం అది. కొండలు మబ్బులు, లోయలు, కొలనులు, నది, ఆపిల్ చెట్లు, అన్నీ ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింప చేసే దృశ్యాలు.
సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాను 50 సార్లు చూసామన్న వారూ మాకు తటస్థ పడ్డారు. ఆశ్చర్యమేమంటే ఇది ఇంగ్లీషులో ఉన్న సినిమా. సాల్స్ బర్గ్ లో ప్రజలు జర్మన్ భాష మాట్లాడతారు. వారిని పలకరిస్తే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా చూడలేదన్నారు. ఆశ్చర్యం వేసింది. సాల్స్ బర్గ్ దగ్గర సాల్జక్ నది ప్రవహిస్తున్నది. ఆ నదిపై ఉన్న వంతెన ఇరువైపులా తాళాలు విపరీతంగా ఉన్నాయి. అదేమిటని తెలుసుకోగా ప్రేమ తాళాలు అని చెప్పారు. దంపతులెవరైనా తమ పేర్లు రాయించుకుని గుర్తుగా అక్కడ పెట్టుకోవచ్చు. ఆ దృశ్యం బాగుంది. పాత కొత్త నగరాలను కలిపే వంతెన అది. సాల్స్ బర్గ్ చిన్న ప్రాంతం. ఊరంతా యాత్రికులపై ఆధారపడే ప్రదేశం. అది ప్రపంచ ప్రసిద్ధ సంగీతకారుడు మొజాక్ నివసించిన ప్రదేశం. అతడి ఇల్లు మ్యూజియంగా మార్చి చూపుతున్నారు. అతను వాడిన సంగీత పరికరాలు చూచి హెడ్ ఫోన్స్ లో సంగీతం విని ఆనందించాము. అక్కడ జూన్ నుండి ఆగస్టు వరకు సంగీతోత్సవాలు జరుగుతాయి. అది ప్రత్యేక ఆకర్షణ. మొత్తం చిన్న నగరమే కనుక నడచి చూచి ఆనందించవచ్చు. అయితే ఇక్కడొక వింత విశేషమున్నది. ఆర్చి బిషప్ ఉల్ఫ్ డైట్రిట్జ్ అనే అతను రహస్యంగా ఒక స్త్రీని అట్టెపెట్టుకుని 15 మంది పిల్లలను మాత్రమే కన్నాడట. ఆమె పేరిట ఒక సుందర భవనాన్ని నిర్మించాడు. ఆల్టివర్ అని ఆ భవనాన్ని పిలుస్తారు. అది ఆమె పేరు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోప్ అతన్ని తొలగించాట. అయితే ఆ సుందర భవనాన్ని పేరు మార్చి ‘మిరాబెల్’ అని పిలుస్తున్నారు.  అదిప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తున్న భవనం. చిన్న స్థలమైన సాల్స్ బర్గ్ లో ఒక యూనివర్సిటీ ఉన్నది. ఇక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతాయి. మాంసాహారం ప్రధానం కాగా స్థానికంగా ద్రాక్షతోటల నుండి వైన్ తయారు చేస్తారు. సందర్శకులకు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా తీసిన ప్రదేశాలను తిప్పి చూపుతారు. ఎంతసేపు చూసినా విసుగు పుట్టని ప్రకృతి సౌందర్య ప్రదేశం అది. వూరంతా సందుగొందులుగా ఉన్నప్పటికీ అది కూడా ఆకర్షణీయంగా మార్చి చూపటం సాల్స్ బర్గ్ విశేషం.
బ్రాటిస్లేవియా
వియన్నాకు ఒక గంట ప్రయాణంలోనే స్లొవేకియా రాజధాని బ్రాటిస్లేవియా చేరతాము.  అది డాన్యూబ్ నది తీరాన ఉన్నది. చరిత్ర ప్రసిద్ధి చెందిన డాన్యూబ్ నది తూర్పు యూరోప్ లో ఇంచుమించు తొమ్మిది దేశాల గుండా ప్రవహిస్తుంది. ఆ దేశాల నాగరికత చరిత్రపై ఎంతో ప్రభావం చూపిన నది డాన్యూబ్.
బ్రాటిస్లేవియాలో సుమారుగా నాలుగున్నర లక్షల జనాభా వున్నారు. నదికిరువైపులా నగరం ఉన్నది. ఒకవైపున పాత నగరం, మరొక వైపు కొత్త నగరం అంటారు. మొరావా నది కూడా ఇక్కడ ప్రవహిస్తున్నది. స్లోవేకియాకు సాంస్కృతిక కేంద్రంగా బ్రాటిస్లేవియాను పేర్కొనవచ్చు.  ఇక్కడ గమనించిన తొలి ఆకర్షణ స్వీట్ వైన్ తేనె కలిపిన వైన్ ఇక్కడ తయారు చేస్తారు. ఇది స్థానికంగానే ఉంటుందని తెలిసింది. ఇక్కడ నిరుద్యోగం లేదని సగర్వంగా చెప్పుకుంటారు. సాంకేతికపరమైన పరిశ్రమలు ఉండటం వలన ప్రతిఒక్కరికీ ఏదో ఒక ఉద్యోగం లభించటం గమనార్హం. చిన్న ప్రదేశమే కనుక ఓపిగ్గా తిరిగి చూడవచ్చు. అటు జర్మనీ వాళ్ళూ, ఇటు కమ్యూనిస్టులూ ఎడాపెడా వాయించిన ఈ ప్రదేశంలో ప్రజలు తట్టుకొని స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి పెంపొందారు. ఒక చిన్న విశ్వవిద్యాలయం కూడా ఉన్నది. కేథలిక్ మతం ప్రధానమైంది. గోతిక్ ఆర్ట్ ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మేము చూసిన వాటిలో బ్రాటిస్లేవియా కాజిల్ (కోట) పేర్కొనదగినది.  డాన్యూబ్ నది ఒడ్డున ఒక కొండపై ఉన్న కోట ఇక్కడ సుప్రసిద్ధమైనది. ఇది సైనిక కేంద్రంగానూ, మత స్థావరంగానూ పనిచేసింది. ప్రతిష్ఠాత్మకమైన స్థానంగా దీనిని స్థానికులు పేర్కొంటారు. దాడులలో విధ్వంసమైన ఈ కోటను థెరీసియన్ శైలిలో పునర్మించారు.  ఊళ్ళో ఉన్న కొలనులు పార్కులు సుందరంగా యాత్రికులకు చూపించే తీరులో అమర్చారు.
ఇది ప్రజాస్వామిక దేశం. స్లోవాక్ పార్లమెంటు ఇక్కడ ఉన్నది. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు అంతకుముందే జరిగిన ఎన్నికలలో ఓటర్లకు ఆకర్షణీయమైన బహుమతులు లభించాయని, కొందరు వెల్లడించారు. కమ్యూనిస్టు పార్టీ, ఇప్పటికీ బలంగా ఉన్నా, ఓట్లు మాత్రం రావట్లేదని చెప్పారు. మ్యూజియంలు, గాలరీలు చాలా చూడముచ్చటగా అమర్చారు. ఇక్కడ ఉన్న చిన్న మార్కెట్ చేతి పరిశ్రమల వస్తువులతో కళకళలాడుతున్నది. యూనివర్సిటీలో 27 వేలమంది విద్యార్థులున్నారు. సాంకేతిక విశ్వవిద్యాలయంలో 18 వేల మంది విద్యార్థులున్నారు. నది అవతల కొత్త నగరంలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ఆధిపత్యాన నిర్మించిన ఇళ్ళు, బొత్తిగా సౌకర్యంలేని గూళ్ళు వలె ఉన్నాయి. ఇంత చిన్న ప్రదేశంలో కూడా కొన్ని దేశాల రాయబార కార్యాలయాలుండడం విశేషం. యాత్రికుల నిమిత్తం, ఆకర్షణీయంగా నగరాన్ని తీర్చి దిద్దటం. ఇక్కడి ప్రత్యేకత.
బుడపెస్ట్
మనం చరిత్రలో బుడాపెస్ట్ అని చదువుకున్న నగరానికి వెళ్ళాము. ఇది హంగరీ రాజథాని. అక్కడికి వెళ్ళిన తరవాత కానీ, ఇది జంటనగరాల కేంద్రం అని తెలియలేదు. పర్వతాల మధ్య ఉన్న బుడ నగరం, పల్లపు ప్రాంతంలో ఉన్న పెస్ట్ నగరం కలిపిన జంట నగరాల రాజథాని ఇది. వీటి మధ్య ఉన్న డాన్యూబ్ నదిపై వంతెనలు నిర్మించి, ఒకే నగరంగా రూపొందించారు. 18 లక్షల జనాభా కలిగిన బుడపెస్ట్ చరిత్ర ప్రసిద్ధమైనది. విదేశీ దాడులలో, పాలనలో వారి కట్టడాలు, చర్చీలు, నదిపై వంతెనలు మాటి మాటికీ ధ్వంసమవుతుండగా పట్టుదలతో తిరిగి నిర్మించి, ఇప్పుడు స్వతంత్ర దేశంగా అనుభవిస్తున్నారు. కమ్యూనిస్టులు పరిపాలించినా కూడా ఎక్కడా ఆనవాళ్ళు లేవు. ఆనవాళ్ళేవీ నేడు కనిపించవు. కమ్యూనిస్టు నాయకుడు లెనిన్ మొదలైన వారి విగ్రహాలు.
బుడపెస్ట్ నగరమంతా గుహల మయం వాటిపైనే నగరం నిర్మితమైంది. యూరోప్ కు ఒక రకంగా బుడపెస్ట్ ఆర్థిక కేంద్రంగా కూడా మారింది. బుడ కోట డాన్యూబ్ నదీ తీరాన మిలీనియం అండర్ గ్రౌండ్ రైల్వేలను ప్రపంచ సంపదగా ప్రకటించారు. సాంకేతికానికి ప్రధాన కేంద్రంగా మారిన బుడపెస్ట్ చైనాకు ఆకర్షణీయ కేంద్రంగానూ పరిణమించింది. బుడపెస్ట్ సందర్శన స్థలాలలో కేజిల్ (కోట), స్టేట్ అపరా, యూదుల స్మారక కేంద్రం పేర్కొనదగినది. ఇక్కడ యూదులు చాలా హింసలకు లోనై తట్టుకున్నారు. వారి సినగాగ్ లు సుప్రసిద్ధమైనవి. బుడపెస్ట్ లో కూడా పార్లమెంట్ భవనం గోతిక్ కళను ప్రస్ఫుటం చేస్తుంది. చిత్రహింసల భవనం ఇక్కడొక మ్యూజియంగా మార్చి చూపుతున్నారు. ఒకప్పుడది నాజీలకు కేంద్ర స్థానం. ఇక్కడి కేజిల్ హిల్ ను యునెస్కో భద్రపరిచిన కేంద్రంగా అట్టిపెట్టారు. కేథలిక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హంగరీ సైన్స్ అకాడమీ పేర్కొనదగిన అంశం. బుడ ప్రజలు సహకార భావంతో మెలుగుతున్నారు. చూస్తుంటే చరిత్రను మరోసారి తిరగవేస్తున్నట్లుంటుంది.
ప్రాగ్
వియన్నా నుండి మూడు గంటలు బస్సులో ప్రయాణం చేస్తే ప్రాగ్ నగరం చేరుకుంటాము. ఇది చెక్ రిపబ్లిక్ రాజధాని. అయితే అక్కడి ప్రజలు దీన్ని ప్రాహా అంటారు. ప్రాహా ప్రత్యేకతలో బొహీమియన్లు పేర్కొనదగిన ప్రజలు. చరిత్రలో దీన్ని గురించి చదువుతున్నప్పుడు చాలా స్వతంత్ర ధోరణిగల ప్రజలని మన లంబాడీ సంచార జాతుల వంటివారని తెలుసుకున్నాము. వారిని స్వయంగా చూచినప్పుడు అందమైన ప్రజలుగా కనిపించారు. మామూలు నియమ నిబంధనలకు కట్టుబడని స్వేచ్ఛాప్రియులని కొందరు కావాలని పేదరికాన్ని స్వీకరిస్తారని చెప్పారు. వీరి ప్రత్యేక చేతి కళలలో క్రిస్టల్స్ తో పాత్రలు చేయటం విశేషం. వారు చేసిన ఈ చేతి వస్తువులు కొంచెం ఖరీదనిపించినా వారి నైపుణ్యతను చాటేవిగా ఉన్నాయి. వియన్నా నుండి ప్రాగ్ కు వెళ్ళేటప్పుడు యాత్రికుల నిమిత్తం పల్లెటూళ్ళ నుండి బస్సులు తీసుకెళ్ళారు. మధ్యలో బొహీమియన్లు నడిపే ఒక హోటల్ దగ్గర ఆపారు. ఆ విధంగా వారిని చూడటం వారి వస్తువులని తిలకించటం సంతోషకరమైన విషయం.
ప్రాగ్ కేథలిక్ మత ప్రాథాన్యతగల ప్రాంతమయినా వారిని తిరస్కరిస్తూ క్రైస్తవ సంస్కరణలు కోరిన లూథర్ ప్రభావం కూడా కొంతవరకు కనిపిస్తుంది. ఒక చోట లూథర్ విగ్రహాన్ని కూడా చూశాము. ప్రాగ్ వద్ద  విటావా నది ప్రవహిస్తుంది.  ఇక్కడ 13 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ నగరంలో కేంద్ర స్థానమైన కోటను, మ్యూజియంలను, గాలరీలను, థియేటర్లను గమనించాము. టూరిస్టు కేంద్రంగా యూరోప్ లో ప్రాధాన్యతను సంతరించుకున్నది.  ప్రాగ్ లో ఒక వింత గడియారాన్ని చూశాము. అది మన గడియారాలకు విరుద్ధమైన ధోరణిలో రివర్స్ లో తిరుగుతాయి. అది ఖగోళ గడియారం. మధ్య యుగాల్లో చిత్రహింసలు ఎలా పెట్టేవారో చూపించే పరికరాలను ఒక మ్యూజియంలో అట్టిపెట్టారు. పొరుగు దేశమైన రుమేనియా నుండి చాలామంది ఉపాధి నిమిత్తం రావటం ఒక ప్రత్యేకత. సాంస్కృతిక కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయి.
రచయిత ఫ్రాంజి కాఫ్కా
సుప్రసిద్ధ రచయిత ఫ్రాంజి కాఫ్కా ఇక్కడివాడే. అయితే అతను జర్మనీలో ఎక్కువ కాలం గడపడం వలన ఇక్కడ ప్రజలకు అంతగా జ్ఞాపకాలు లేవు. అతని రచనల్లో కనిపించిన కోట, తిరిగి చూచాము. నగరం అంతా పాత కొత్త కేంద్రాల కూడలిగా నదికిరువైపులా ఉన్నది.  నగరంలో ఎక్కడ చూచినా విగ్రహాల మయం. పునర్వికాస, గోతిక్ కళా క్షేత్రాలు, బాగా కనిపిస్తాయి. కాఫ్కా మ్యూజియం ఒక ప్రత్యేక విశేషం. అలంకరణ కళాకృతులతో కూడిన మ్యూజియం ప్రాగ్ కు ప్రత్యేకత. నగరంలో చాలా ప్రాంతాలు తిరిగి చూడడానికి వీలుగా ఉన్నాయి.
మొత్తం మీద మేథస్సుకు సంతృప్తినిచ్చే సందర్శనగా మిగిలిపోయిన పర్యటన పేర్కొనదగినది. వీలున్నప్పుడు ఈ ప్రాంతాలను చూస్తే చాలా విషయాలు నేర్చుకుంటాము.
- నరిసెట్టి ఇన్నయ్య




అనుకోని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 17





“ఇన్నయ్యా, ఎవరికి వాళ్ళు తాము అందంగా ఉన్నామని అనుకోకపోతే బతకలేరయ్యా” అని 1954లో గుంటూరులో తన గదిలో గెడ్డం గీసుకుంటూ అద్దంలో చూస్తూ రోశయ్య అన్నమాటలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. ఆనాడు గుంటూరు హిందూ కాలేజీలో విద్యార్థి నాయకుడుగా రంగాగారి శిష్యుడుగా రాణించిన వ్యక్తి రోశయ్య. కాలేజీ విద్యార్థి యూనియన్ కి విద్యార్థి సమ్మేళన్ (కృషికార్ లోక్ పార్టీ విభాగం) పక్షాన అధ్యక్షుడుగా పోటీచేసి ఎన్నికలలో గెలిచాడు. మేమంత ఆయనకు ప్రచారం చేసి పెట్టాం. నేను అప్పట్లో ఎ.సి.కాలేజీలో చదువుతుండేవాడిని. ఆయనకు కార్యదర్శిగా జాస్తి జగన్నాథం (రాడికల్ హ్యూమనిస్టు) గెలిచారు. ఆ రోజులలో విద్యార్థి సమ్మేళనం కోసం చందాదారులను చేర్పించి ఆ డబ్బుతో ఉదయం కాఫీలు, టిఫిన్లు సేవిస్తుండేవారు. మధ్యలో నన్ను పిలిచేవారు. రోశయ్య చాలా చురుకుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఉపన్యాసాలు చేసేవారు. కవి సమ్మేళనాలు ఆర్గనైజ్ చేశారు. ఆయన తెనాలి దగ్గర వేమూరు నుండి వచ్చారు. ఆచార్య రంగా 1951లో కాంగ్రెసు నుండి చీలి వచ్చి కృషికార్ లోక్ పార్టీ పెట్టినప్పుడు తెనాలిలో తొలి రాష్ట్ర మహాసభ జరిగింది, కార్యకర్తగా రోశయ్య తన రాజకీయ జీవితాన్ని అక్కడ ఆరంభించాడు. ఆయనతో తొలి పరిచయం అప్పుడు జరిగింది. ఆ తరువాత స్నేహితులుగా మేము కలిసిమెలిసి ఉన్నాము.
రంగాగారు 1955లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఐక్య కాంగ్రెసు పక్షాన రాష్ట్రంలో ప్రచారం చేసినప్పుడు ఆయన శిష్యులుగా రోశయ్య, వీరాచారి, విజయరాజకుమార్, సుంకర సత్యనారాయణ మొదలైనవారు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి కమ్యూనిస్టులను ఓడించటానికి తోడ్పడ్డారు. ఆ తరువాత రంగాగారు కాంగ్రెసు నుండి దూరమై స్వతంత్ర పార్టీ అధ్యక్షులైనప్పుడు గౌతు లచ్చన్నతో పాటు రోశయ్య కూడా పార్టీలో ప్రముఖంగా ఉన్నారు. తొలిదశలో చెన్నారెడ్డి కూడా చేరి తరువాత దూరమయ్యారు. తెనాలిలో ఆ రోజులలో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా రంగాగారి పక్షాన రోశయ్య స్వాగతం పలికి వారి ఉపన్యాసాలకు అనువాదం కూడా చేసేవారు. రాజగోపాలాచారి ఉపన్యాసానికి అలాగే చేశారు. ఆ విధంగా కార్యకర్తగా ప్రారంభించిన రోశయ్య నాయకుడుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో ప్రముఖులయ్యారు. ప్రతిపక్ష స్థానంలో ఆయనకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన పక్షాన ఎన్నో సందర్భాలలో ఆయన కోరికపై మేము ప్రకటనలు ఇవ్వటం అని ప్రముఖంగా పత్రికలలో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నాతో పాటు ఎస్.వి.పంతులు బాగా కృషిచేశారు. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా రోశయ్యకు తోడ్పడి శాసనమండలి సభ్యులు కావటానికి చేయూతనిచ్చారు.
1972 నుండి నేను న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్ లో ఉన్నప్పుడు రోశయ్య పక్క క్వార్టర్స్ లో ఉండేవారు. ఇంచుమించు రోజూ కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళం. ఆయన 1978లో చెన్నారెడ్డితో చేతులు కలిపేవరకు అలా సాగింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజులలో అతి తీవ్ర విమర్శలు చేసి చెన్నారెడ్డికి చెమట పట్టించిన వ్యక్తి రోశయ్యే. అప్పట్లో నన్నూ, ఎస్.వి.పంతులును కుడి భుజం, ఎడమ భుజం అనేవారు. అటువంటి దశలో ఒకరోజు చెన్నారెడ్డి పిలిచి ఆయనకి మంత్రిపదవి ఇచ్చారు. అప్పటివరకూ ప్రతిపక్షంలో రాణించిన రోశయ్య కాంగ్రెసులో స్థిరపడిపోయారు. ఎవరు పదవిలో ఉన్నా రోశయ్యను కాదనలేని స్థితి తెచ్చుకున్నాడు. ఆ విధంగానే కేంద్రస్థాయివరకూ ఆయన సుపరిచితుడయ్యారు. హైదరాబాదులో అమీర్ పేటలో సొంత ఇల్లు ఏర్పరచుకొని ఉంటున్నప్పుడు కూడా మేము కలుస్తుండేవాళ్ళం. మా కుటుంబాన్ని గురించి పరామర్శ చేస్తుండేవారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హఠాత్తుగా చనిపోవటంతో చక్కని మార్గాంతరంగా కేంద్ర కాంగ్రెసు నాయకత్వం రోశయ్యను ముఖ్యమంత్రి స్థానానికి తీసుకువచ్చింది. బహుశ ఆయన జీవితంలో అది పెద్ద మలుపు.
అప్పటివరకూ రోశయ్య అప్పుడప్పుడూ నాతో అంటుండేవారు. “జీవితమంతా రాజకీయం తప్ప మరొక వ్యాపారం చెయ్యలేదు. తెలియదు కూడా. ఇప్పుడు ఈ దశలో ఇంకేమీ చేసే స్థితి కూడా లేదు. రాజకీయాలు కొనసాగించాల్సిందే”  అది ఆయన ధోరణి.
గవర్నర్ అయిన తరువాత ఎప్పుదైనా ఫొనులొ మేము మాట్లాడుకుంటే తప్పనిసరిగా మా అమ్మాయి నవీన, అబ్బాయి రాజు ఎలా వున్నారు అని అడగకుండా వుండరు.

Innaiah Narisetti
The series on : The chief ministers I met is complete

డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 1




(1949-2009)

మెడిసిన్ చదివినా సూది పట్టని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 1978లో ఎం.ఎల్.ఎ. అయినప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుండి చాలా సన్నిహితులమయ్యాం. నేను అనేక సందర్భాలలో శాసనసభలో వేసే ప్రశ్నలు, కాల్ అటెన్షన్ నోటీసులు, షార్ట్ నోటీసు ప్రశ్నలు ఇస్తుండేవాడిని. అందులో ఆయనకు నచ్చినవి స్వీకరించి వాడేవాడు. నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలుగులోను, ఇంగ్లీషులోనూ రాస్తూ ఉండగా ఆయనకు నా ఇంగ్లీషు మాత్రమే నచ్చేది.
మేమిరువురం కలిసి అనేకమంది మిత్రులు దగ్గరకు వెళ్ళడం. ముచ్చటించడం జరిగేది. ఒకటి రెండుసార్లు ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్ళి విందు ఆరగిస్తేనో, బ్రేక్ ఫాస్ట్ చేస్తేనో తరువాత తప్పనిసరిగా రాజశేఖర్ రెడ్డి ఒక మాట అడిగేవాడు ‘మనం ఆ స్నేహితుడికి ఏమైనా ఉపయోగపడగలమా? అడుగు’ అనేవారు. అలాంటి వారిలో డి. శేషగిరిరావు, ఆలపాటి రవీంద్రనాథ్ వంటివారున్నారు. కానీ వారు ఏ సహాయమూ అక్కరలేదని కేవలం మిత్రులుగానే కలుసుకుంటున్నామని అనేవారు. రాజశేఖర రెడ్డి మిత్రత్వ స్వభావం చెప్పటానికి ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఆయన ఎన్నో సందర్భాలలో మా ఇంటికి రావడం, మాతోపాటు భోజనమో, అల్పాహారమో చేయడం మా కుటుంబానికి ఆనందంగా వుండేది. ముఖ్యంగా భవనం వెంకట్రాం విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు ఎన్ని వచ్చాయో నేను చెప్పలేను. అలాగే మేము రాజశేఖర్ రెడ్డి ఇంట్లో (జూబిలీహిల్స్ వెళ్ళేదారిలో) అనేక పర్యాయాలు కూర్చుని ముచ్చటించుకుని భోజనాలు చేశాము. ముఖ్యంగా భవనం వెంకట్రాం, కె.వి.పి.రామచంద్రరావు, నేను ఒక బ్యాచ్ గా ఉండేవాళ్ళం. ముందుగా ఒకటి రెండు పెగ్గుల విస్కీ స్వీకరించి, తరువాత భోజనం చేసేవాళ్ళం. అప్పట్లో కె.వి.పి. డ్రింక్స్ తీసుకునేవారు కాదు. సిగరెట్లు బాగా తాగేవారు. రాజశేఖర్ రెడ్డి భార్య విజయలక్ష్మి ఎంతో చక్కగా వంటలు చేసి, ఆప్యాయంగా వడ్డించేవారు. ఆమె చాలా సహృదయురాలు.
రాజశేఖర్ రెడ్డి ఇంట్లో నేను తొలుత ఆయన తండ్రి రాజారెడ్డిని కలుసుకున్నాను. ఆయన ఎన్నోవిషయాలు, స్వానుభవాలు చెప్పారు. తాను బర్మా వెళ్ళి వచ్చినట్లు, తరువాత క్రైస్తవుడుగా తనకుగల అనుభవాలు ఆసక్తిగా చెప్పేవారు. అప్పటి నుండి సూరి (సూర్యనారాయణ) అక్కడే ఉండేవాడు. ఒక కుటుంబంవలె మేమందరం అలా ఎన్నో ఏళ్ళు మెలిగాం. భవనం వెంకట్రాం ముఖ్యమంత్రి కాగానే నాకు పదవి ఏదైనా ఇవ్వమని, నాతో చెప్పకుండా రాజశేఖర్ రెడ్డి వత్తిడి చేశారు. ఆయన మాట మీద భవనం నన్ను పిలిచి ఏ పదవి కావాలో కోరుకోమన్నాడు. అది లేనందువలనే మనం మిత్రులుగా కొనసాగుతున్నామని నేను స్పష్టంగా మర్యాదగా చెప్పాను. మిత్రులకు ఎలాగైనా సహాయపడాలనే ధోరణి రాజశేఖర రెడ్డికి మొదటి నుండి ఉన్నది.
జి.రాం రెడ్డి తొలుత వైస్ చాన్స్ లర్ గావడానికి సహాయ పడిన వారిలో రాజసెఖర రెడ్డి, భవనం కూడా వున్నారు. ఆ తరువాత ఓపెన్ యూ నివర్సిటికి వైస్ చాన్స్ లర్ గావడానికి మేము బాగా ఉపయోగపడ్డాము .అయితే అప్పుడు జెనెటిక్స్ ప్రొఫెసర్ ఒ.ఎస్ . రెడ్డి తీవ్రంగా తిప్పలు పడ్డారు . రాజసేఖరరెడ్డి తొలుత ఒ.ఎస్ .రెడ్డి ని బలపరిచినా  ఆయనను ఒప్పించి రాం రెడ్డి కి మొగ్గు చూపడంలో నేను తో ద్పడ్డాను .రాం రెడ్డి  ఓపెన్ యూనివర్సిటి సంగతి విదేశాలకు వెళ్ళి పరిసీలించారని నచ్చ చెప్పాను .కొద్ది రోజులు అప్పుడు రాజ శెఖర రెడ్డి విద్యామంత్రి గా వున్నందున కీలక పాత్ర వహించ గలిగారు. భవనం మాటపై రాం రెడ్డి ని బలపరచడంతో సమస్య తీరింది. ఒ.ఎస్ .రెడ్డి కి నాపై కోపం వచ్చినా తరువాత సర్దుకున్నారు .తరువాత నాపై ఫిర్యాదులతొ రాం రెడ్డి ముఠా రాజసెఖరరెడ్డికి మొర పెట్టుకున్నా ఆయన పెడచెవిన పెట్టారు .  
కాంగ్రెసు పార్టీలో తొలుత రెడ్డి కాంగ్రెసులో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆ తరువాత చెన్నారెడ్డికి వ్యతిరేకిగా, ఉత్తరోత్తరా విజయభాస్కరరెడ్డికి నిరసన కారుడుగా, జనార్ధన్ రెడ్డిని ప్రతిఘటించిన వ్యక్తిగా వివిధ ఘట్టాలలో ఉన్నారు. ఎన్.టి.రామారావు తెలుగుదేశం పెట్టి ఎన్నికల ప్రచారం చేసి గెలిచి వచ్చిన తరవాత, ఆ ప్రభావపు ఉప్పెన ఎంత తీవ్రమైనదో రాజశేఖర్ రెడ్డి నాతో చెప్పారు. చివరకు తన జిల్లాలో, పులివెందులలో సైతం ఒక సునామీ వలె ఆ వాతావరణం ఉన్నదని కష్టంమీద తట్టుకున్నామని చెప్పాడు. కేంద్రంలో, రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి రానురాను అతి కీలకదశలో రాజకీయ ప్రాధాన్యతలోకి వచ్చారు. వ్యవసాయ రంగానికి ఆయనిచ్చిన ప్రాధాన్యత అమెరికా అధ్యక్షుడు బుష్ ను కూడా ఆకర్షించింది.
ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షడుగా రాజశేఖర రెడ్డి ఉండగా నేను అమెరికా నుండి అభినందన లేఖ పంపగా వెంటనే సంతోషంగా సమాధానం ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయిన తరవాత నేనాయనను తరచుగా కలుసుకోలేదు. ఎప్పుడైనా కొన్ని సంఘటనలలో నా ప్రస్థావన విలేఖరుల సమావేశంలో వచ్చినప్పుడు ‘ఇన్నయ్య ఇండియాలో ఉన్నాడా?’ అని అడిగేవారు. నేను దూరంగా ఉంటూ రాజకీయాలు పట్టించుకోనందువలన అటువంటి స్థితి ఏర్పడింది. కానీ, రాజశేఖర్ రెడ్డి హఠాత్తుగా చనిపోవటం మాత్రం దారుణ సంఘటనగా భావించాను. అదే విషయాన్ని నేను హెలికాప్టర్ ప్రమాదం నాడు టి.వి.5 ఛానల్ లో చెప్పాను కూడా. రాగద్వేషాలు రాజకీయాలలో మెండుగా కనబరిచిన రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో తిరుగులేని మార్పులు చేసి తనదైన ముద్ర వేశారు.
నేను ఇంగ్లిష్ లొ తొలుత రాసిన ఆంధ్ర ప్రదేష్  రాజకీయ చరిత్ర రాజశేఖరరెడ్డి కి బాగా నచ్చింది .http://www.centerforinquiry.net/uploads/attachments/Pradesh-Part-1.pdf
Innaiah Narisetti

హైటెక్ ముఖ్యమంత్రినారాచంద్రబాబు నాయుడు-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 15





ఎన్టీరామారావుకు అల్లుడు కాకముందు చంద్రబాబునాయుడు నాకు పరిచయమయ్యాడు. 1977లో హైదరాబాదులో పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్సులో బండారు రత్నసభాపతి నేను, ఎస్.వి.పంతులు వద్ద కూర్చుని ఉన్నాము. సాయంత్రం రత్నసభాపతితో మేము కబుర్లు చెప్పుకుంటూ మొదటి పెగ్గులో ఉండగా హఠాత్తుగా నారాచంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం వచ్చారు. ఎక్కడో కొట్లాడుకుని, హడావుడిగా వచ్చినట్లు ఉంది. అప్పట్లో చంద్రబాబునాయుడుతో నాకు పరిచయం లేదు. తిరుపతి నుండి సరాసరి వచ్చామని, అక్కడ విద్యర్థుల మధ్య కొట్లాటలు జరిగాయని, ముఖ్యంగా కమ్మ, రెడ్డి కులాల మధ్య పోట్లాటలు విపరీతంగా ఉన్నాయని వారి మాటలను బట్టి మాకు తెలిసింది. వారు చెప్పిందంతా విని, రత్నసభాపతి ఫోన్ తీసుకుని నేదురుమల్లి జనార్ధనరెడ్డితో మాట్లాడారు. ఈ కొట్లాటల వ్యవహారం మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని గట్టిగా చెప్పారు. అట్లా తొలిసారి చంద్రబాబునాయుడ్ని చూడటం జరిగింది. మరుసటి సంవత్సరం ఎం.ఎల్.ఎ.గా ఎన్నికై చంద్రబాబు నాయుడు వచ్చి న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్ లో ఉన్నారు. ఆయనతోపాటు లక్ష్మీనారాయణ ఉండేవారు. అప్పుడు నేను అక్కడ కొల్లూరి కోటేశ్వరరావు క్వార్టర్ లో ఉంటూండేవాడిని. రెగ్యులర్ గా మేము కలుసుకోవటం, నేను అసెంబ్లీకి సంబంధించిన ప్రశ్నలు, కాల్ అటెన్షన్ మొదలైనవి రాసిస్తుండేవాడిని. ఆ విధంగా మా పరిచయం బాగా పెరిగింది. తరువాత చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని, రాజశేఖరరెడ్డిని దూరంగా పెట్టారు. వారిరువురూ చాలా స్నేహంగా కలిసి ఉండేవారు. వారితో పాటు కె.ఇ. కృష్ణమూర్తి, కరణం బలరాం ఉండేవారు. మేము చాలా తరచుగ కలుసుకునేవాళ్ళం. ఇంతలో చంద్రబాబునాయుడు జూబ్లీహిల్స్ లో ఇల్లు తీసుకుని మారారు. ఆయనతోపాటు ఎన్నోసార్లు భోజనాలు చేస్తూ అనేక విషయాలు చెప్పుకునేవాళ్ళం. రాజకీయాలు మాట్లాడుకునేవాళ్ళం. అప్పట్లో పి. రాజగోపాలనాయుడు వస్తుండేవారు. ఆయన చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు గురువు. వారంతా ఆచార్య రంగా శిష్యులు. అలా జరుగుతుండగా చెన్నారెడ్డి మారిపోవటం, అంజయ్య ముఖ్యమంత్రి కావటంతో అటు రాజశేఖరరెడ్డి, ఇటు చంద్రబాబునాయుడు ప్రాముఖ్యత వహించారు. అదే సమయంలో ఎన్.టి.రామారావు కుమార్తెను చంద్రబాబునాయుడు పెళ్ళి చేసుకునే విషయం వచ్చింది. స్టేట్ మంత్రిగా చంద్రబాబునాయుడు పశుసంవర్ధక శాఖను, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మెడికల్ సర్వీసెస్ ను నిర్వహించారు. ఆ తరువాత అంజయ్య తన జంబోజెట్ మంత్రివర్గాన్ని కుదించగా అందులో చంద్రబాబుకు గ్రంథాలయాలు, రాజశేఖరరెడ్డికి గ్రామీణాభివృద్ధి ఇచ్చారు. ఎన్.టి.రామారావును రాజ్యసభకు తీసుకురావాలనే ప్రతిపాదన కూడా అప్పుడే కొంతమేరకు సాగేది. తరువాత భవనం వెంకటరామ్ ముఖ్యమంత్రి కావటం. అందులో రాజశేఖరరెడ్డి ఎక్సైజ్ మంత్రిగా ప్రాధాన్యతలోకి రావటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడుకి మైనర్ ఇరిగేషన్ స్టేట్ మంత్రిగా ఇచ్చారు. అప్పుడు రాజశేఖరరెడ్డి ఎలాగైనా చంద్రబాబు నాయుడుకు క్యాబినెట్ ర్యాంకు ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. నన్ను కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు భవనానికి చెప్పమన్నారు. అయితే అలాంటి నిర్ణయాలు కేంద్ర కాంగ్రెసి అధిష్ఠానవర్గం చేస్తుంది కనుక ఒక పట్టాన చంద్రబాబుకు క్యాబినెట్ రాలేదు. నేను మాత్రం చాలా తరచుగా చంద్రబాబును ఆయన ఛాంబర్ లో కలసి సలహాలు చెబుతుండేవాడిని. ఆ తరువాత విజయభాస్కర రెడ్డి మంత్రివర్గం రావటం, అందులో రాజశేఖర రెడ్డికి విద్యాశాఖ, చంద్రబాబుకు సాంకేతిక విద్య వచ్చాయి.
చంద్రబాబునాయుడు మరోవైపున ఎన్.టి.రామారావు అల్లుడు కావటంతో రాజకీయాల్లో కొన్ని మార్పులు కనిపించాయి. కాంగ్రెస్ లోనే కొనసాగిన చంద్రబాబు 1982 ఎన్నికలలో పోటీ చేసి తెలుగుదేశం చేతిలో ఓడిపోయారు. ఒకటి రెండు ప్రకటనలలో తన మామ ఎన్.టి.రామారావుకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు కూడా చేశారు. కానీ తెలుగుదేశం ప్రభంజనంతో అత్యధిక సంఖ్యా బలంతో గెలిచినప్పుడు ఎన్.టి.రామారావు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంకు వచ్చి హాజరయ్యారు. క్రమంగా కాంగ్రెస్ కు దూరమై, తెలుగుదేశంలో చేరి, ప్రాధాన్యాత వహిస్తూ పోయారు. తొలుత పదవులు లేకపోయినా రాను రాను పార్టీలో రామారావు అల్లుడిగా ఆయనకు చాలా ప్రాధాన్యత లభించింది. రాజకీయ అనుభవం వలన చంద్రబాబు ఆ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాడు.
నేను హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో ఉంటుండగా చంద్రబాబు మా ఇంటికి అనేక పర్యాయాలు వచ్చారు. అలాగే నేనూ ఆయన ఇంటికి వెడుతూ ఉండేవాడిని. ముఖ్యంగా భవనం వెంకటరాం ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా చంద్రబాబు కూడా వచ్చేవారు. ప్రతిసారీ తిరుపతి లడ్డూ తెచ్చేవారు. కానీ మా ఇంట్లో ఆయన మాత్రం ఏమీ పుచ్చుకునేవారు కాదు.
చంద్రబాబు ఏదైనా విషయం చెబితే అసెంబ్లీపరంగా గానీ, బయటగానీ బాగా గ్రహించేవారు. తనకు నచ్చితేనే అమలు పరిచేవారు. ఆయనకు నేను సన్నిహితంగా ఉండడం గమనించి చాలామంది రికమండేషన్స్ కు వచ్చేవారు. అది నాకు గిట్టదు. కనుక చెప్పేవాణ్ణి కాదు. ఆ కోపం చాలామందికి ఉండేది. నంద్యాలలో రేణుకాచౌదరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల ఖర్చులకు డబ్బు ఇప్పించమని చంద్రబాబుకి చెప్పి త్వరగా పని జరిగేటట్లు చూడమని నన్ను కోరింది. అయితే ఆమె సంపన్నురాలనీ, ఆమెకు పార్టీ నిధి అక్కరలేదని చంద్రబాబు అంటుండేవారు. ఎన్.టి.రామారావుపై తిరుగుబాటు చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను లాంఛనంగా కలిసినా అభినందనలు చెప్పలేకపోయాను. ఆ తర్వాత కలవడమే మానేశాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన న్యూయార్క్ వచ్చారు. నా కుమారుడు అప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ లో పనిచేస్తున్నాడు. అక్కడకు వచ్చిన చంద్రబాబు నా కుమారుడిని కలిసి ఇండియాకు రమ్మని ఆహ్వానించారు కూడా. ఆయన ఉన్నాడని తెలిసినా నేను కలవలేకపోయాను. ఏమైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కలయిక తగ్గిపోవటమే కాక అరుదు అయింది.
చంద్రబాబు నాయుడు మాంసాహారిగా వుండి రాను రాను శాఖాహారిగా మారాడు. ఓక ఘట్టంలో వైస్ చాన్స్ లర్ జి.రాం రెడ్డి కి నాకు అకడమిక్ కలహం రాగా, నాపై రాం రెడ్డి అనుచరులు వెళ్ళి చంద్రబాబు ను శరణు కోరారు. కాని ఆయన తటస్థ వైఖరి అవలంబించి , వారి అభియోగం నాతో ప్రస్తావించలేదు .
ప్రజాస్వామ్యం కోసం ఎన్.టి.రామారావు పక్షాన తీవ్రంగా పోరాడి సంక్షోభాన్ని ఎదుర్కొన్న చంద్రబాబునాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. శాసన సభ్యులను కాపాడుకుని హైదరాబాదు నుండి ఢిల్లీకి, మైసూరుకు, బెంగుళూరుకు తరువాత హైదరాబాదుకు తెచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటంలో కీలక పాత్ర వహించారు. అలా చేస్తున్నప్పుడు నేను బెంగుళూరులో విద్యామంత్రి రఘుపతి ఇంటికి వెళ్ళి ఉదయం తేనీటి విందులో చంద్రబాబు నాయుడును అభినందించాను. హైదరాబాదుకు బయల్దేరుతూ ఆ కాన్వాయిలో నన్ను కూడా రమ్మన్నాడు. వెంకయ్య నాయుడు, జయపాల్ రెడ్డి, పర్వతనేని ఉపేంద్ర మొదలైనవారు అప్పుడున్నారు. బెంగుళూరులో నేను కాట్రగడ్డ ప్రసూన మొదలైన శాసన సభ్యుల ను కలిసి నాదెండ్ల భాస్కరరావు ఉచ్చులో పడవద్దని చెప్పాను. అదే చంద్రబాబు నాయుడు కొన్నేళ్ళ తర్వాత భాస్కరరావు అడుగుజాడలలో అప్రజాస్వామికంగా ఎమ్.ఎల్.ఎ.లను వైస్రాయ్ హోటలులో అట్టిపెట్టి విద్రోహచర్యకు పూనుకొనడం బాధాకరమనిపించింది. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన గెలిచి రావడం, రాష్ట్రాన్ని అంతర్జాతీయ రంగంలో పరిచయం చేయటం అమెరికా అధ్యక్షుడు క్లింటన్ ను తీసుకురావటం సాంకేతిక హైటెక్ రంగాన్ని బాగా పోషించడం అభినందనీయమైంది.

క్లింటన్ తన స్వీయ అనుభవాలలొ హైదరాబాద్ సందర్శన, చంద్రబాబు నాయుడు తో పరిచయం ప్రస్తావించారు. వాషింగ్టన్ లో జరిగిన తానా సభలలో వారిరువురు కలసి పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు దేశ, రాష్త్ర రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తున్నారు .

నరిసెట్టి ఇన్నయ్య

నేదురుమల్లి జనార్దన రెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 14





నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా హైదరాబాద్ లో ఉండగా నేదురుమల్లి జనార్దన రెడ్డితో పరిచయం అయింది. అనేక సందర్భాలలో కలుసుకుంటూ మాట్లాడుకునేవారం. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేబినెట్ మంత్రిగా నేదురుమల్లి ప్రముఖపాత్ర వహించాడు. ఆయనతో రాజకీయాలే కాక సాధారణ విషయాలు కూడా చర్చిస్తుండేవాడిని.
నేను చాలా కాలం నెల్లూరు నుండి వచ్చే జమీన్ రైతు వారపత్రికకు రాజకీయ విలేఖరిగా రాస్తుండేవాడిని. నెల్లూరు శ్రీరామమూర్తిగాకి కోరికపై ఆ పని చేశాను. అలా జరుగుతూండగా ఆ పత్రికపై ప్రభావం ఉన్న జనార్దన రెడ్డి రాజకీయ విలేఖరి ఎవరు అని తెలుసుకోడానికి ప్రయత్నించారు. శ్రీరామమూర్తిగారికి అది ఇబ్బందికరంగా పరిగణించింది. నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా ఉన్నాను గనుక నా పేరుతో జమీన్ రైతులో రాయడానికి వీలులేకపోయింది. అయితే జనార్దన రెడ్డికి నచ్చని విషయాలు, వ్యాఖ్యలు వస్తున్నప్పుడు ఆయన ఎడిటర్ ని వత్తిడి చేస్తుండేవారు. శ్రీరామమూర్తి నా దగ్గరకు వచ్చి ఈ విషయాలు వెల్లడిస్తుండేవారు. నన్ను మానేయమనడానికి ఆయనకిష్టంలేదు. పాఠకుల నుండి రాజకీయ విలేఖరి వ్యాఖ్యలకు అనుకూలత ఉండటం వల్ల కొనసాగించమన్నారు. అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత జనార్ధన రెడ్డి వత్తిడి ఎక్కువై, శ్రీరామమూర్తి నా దగ్గరకు వచ్చి తన ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆ దశలో నా అంతట నేనే రాజకీయ విలేఖరిగా రాయటం మానేస్తానని చెప్పాను. కానీ ఆయన ఒప్పుకోక కొనసాగించమన్నారు. ఆ దశలో శ్రీరామమూర్తిగారు చనిపోయారు. డోలేంద్ర ఎడిటర్ గా వచ్చారు. కనుక విరమించటం నాకు సులువు అయింది.
జనార్దన రెడ్డి వ్యక్తిగతంగా నాకు మిత్రుడు. అనేక సందర్భాలలో మేము కలిసి కూర్చుని యధేచ్ఛగా మాట్లాడుకునేవాళ్ళం. ఆయన మంచి ఆతిథ్యం ఇచ్చేవారు. కొన్నిసార్లు తట్టుకోలేనంతగా మర్యాదలుండేవి. అసెంబ్లీ జరుగుతుండగా ఉదయం సమావేశాలు సాయంత్రానికి వాయిదా పడినప్పుడు మధ్యలో మేమిరువురం ఆయనింటికి వెళ్ళి స్కాచ్ విస్కీ పుచ్చుకుని, నెల్లూరు భోజనం చేసి సాయంత్రం సమావేశానికి వచ్చేవారం. జనార్ధన్ రెడ్డి చాలామందిని అరే ఒరే అని పిలిచేవారు. కొన్నిసార్లు గర్వంగా ప్రవర్తించేవారు.
1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుండి ఆ పదవికి తానూ రావాలని జనార్ధన్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ సఫలం కాలేదు. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదవికి జనార్ధన్ రెడ్డి గౌరవం ఇవ్వలేదు. అతని మంత్రివర్గంలో సభ్యుడై వుండి కూడా లెక్కలేనట్లు ప్రవర్తించేవాడు. భవనం మెతక తనాన్ని బాగా వాడుకున్నాడు. ఆ తరువాత కొన్నేళ్ళపాటు రాజకీయ రంగంలో తిప్పలు పడి చివరకు 1990లో ముఖ్యమంత్రిగా తన కోరికను తీర్చుకున్నాడు. రెండవసారి చెన్నారెడ్డి విఫలమయినప్పుడు కేంద్రం మరొక వ్యక్తి కోసం అన్వేషిస్తున్న దశలో జనార్ధన్ రెడ్డి ఆ స్థానానికి రాగలిగాడు. అయితే అధికారంలో ఉండగా చకచక మెడికల్, డెంటల్ కళాశాలలు మంజూరు చేయటం, ఎడాపెడా పనులు జరగడం, రాజకీయ భ్రష్టత్వానికి దారితీసింది. హైకోర్టు కూడా ఆయన చర్యలను నిరసిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. బయట వ్యతిరేకత ఎంత ఉన్నా జనార్ధన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో మాత్రం తన బలాన్ని కాపాడుకోగలిగాడు. 160 మంది శాసన సభ్యులు ఆయనకు మద్దత్తు పలికారు. సంవత్సరం తిరక్కముందే మంత్రివర్గాన్ని పెంచి కొత్తవారిని తీసుకున్నాడు. కానీ కాంగ్రెసు పరిస్థితి దిగజారిపోతుండడం చూసి కేంద్రం ఆయనను తొలగించి విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఆ విధంగా ఒకసారి వచ్చిన అవకాశాన్ని జనార్ధన రెడ్డి జారవిడుచుకున్నాడు. కాంగ్రెసులో కూడా ఆయనకు వ్యతిరేకత పెరుగుతూ పోయింది.
వ్యక్తిగతంగా జనార్ధన రెడ్డి నాతో ఎప్పుడూ బాగా వుండేవాడు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు పెళ్ళిళ్ళకు ఆహ్వానించేవాడు. టీచర్ గా జీవితం ప్రారంభించి రాష్ట్ర కేంద్రస్థాయికి ఎదిగిన వ్యక్తి.
Innaiah Narisetti

నాదెండ్ల భాస్కరరావు-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 13




నాదెండ్ల భాస్కరరావు అడ్వకేటుగా ప్రాక్టీసు చేస్తూ రాజకీయాలలో ప్రవేశించారు. కాంగ్రెసు పార్టీ యూత్ విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించారు. నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా ఉండగా హైదరాబాదులోని సెక్రటేరియట్ ఎదురుగా వున్న మా ఆఫీసుకు అనేక పర్యాయాలు వచ్చేవారు. కొన్ని సందర్భాలలో రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు. ఇంచుమించు రోజూ ఫోనులో అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. భాస్కరరావు చురుకైన, తెలివిగల రాజకీయవాది. విషయాలు త్వరగా గ్రహించేవాడు. ఎక్కడికైనా చొచ్చుకు పోయేవాడు. ఆ విధంగానే కాంగ్రెసు పార్టీలో ఆయన అన్ని స్థాయిలవారితో మెసిలారు.
రాజకీయాలలో ప్రవేశించిన తొలి రోజులలో ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డికి చేరువయ్యారు. ఆయన తొలి మంత్రివర్గంలో శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. కానీ, తనకున్న సన్నిహితత్వం వలన ఇంకా పెద్ద శాఖను ఆశించారు. ప్రమాణ స్వీకారాలు జరిగిన తొలి రోజున గవర్నర్ శారదా ముఖర్జీ ఇచ్చిన విందుకు ఆయన అలిగి రాలేదు. తరువాత కొన్నాళ్ళకు చెన్నారెడ్డి మంచి శాఖను ఇచ్చినా భాస్కరరావు ఆట్టే కాలం నిలుపుకోలేకపోయారు. ఢిల్లీ వెళ్ళి తనపై ఫిర్యాదులు చెబుతున్నాడని చెన్నారెడ్డి ఆగ్రహించి మరొకసారి ఆయనకు అప్రధానమైన శాఖ ఇచ్చారు. ఇలాంటి రాజకీయ ఒడుదుడుకులు చెన్నారెడ్డి కాలంలో ప్రారంభమై అంజయ్య కాలంలో కొనసాగాయి. కనుక అంజయ్య కూడా భాస్కరరావును కుదించి ఒక దశలో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు కూడా. ఆ తరువాత భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా వుండగా భాస్కరరావు ప్రయత్నించినా పదవి రాలేదు. అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీకై ప్రతిపక్షాలు కొన్ని ప్రయత్నించడంతో ఎన్.టి.రామారావుకు చేరువై తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించాడు. తనను కో-పైలట్ గా చిత్రించుకున్నాడు. ఎన్.టి.రామారావు తొలి మంత్రివర్గంలో కీలకశాఖల్ని నిర్వహించాడు. పార్టీలో ఆయనకు ఉపేంద్రకు అసలు పడేది కాదు. అలాగే మరికొందరితో కూడా భాస్కరరావుకు పొత్తు కుదిరేది కాదు. భాస్కరరావుకు రాగద్వేషాలు ఎక్కువే. ఇందిరాగాంధీ తొందరపడవద్దని సలహా ఇచ్చినా తెలుగుదేశం పార్టీలో చేరాడు. కానీ, ఆయనకు పార్టీలో తృప్తిలేదు. జీవితమంతా కాంగ్రెసు సంస్కృతిలో అలవాటుపడిన భాస్కరరావు తెలుగుదేశంలో రామారావు నాయకత్వంలో ఇమడలేకపోయారు.
ఎన్.టి.రామారావు గుండె చికిత్సకు అమెరికా వెళ్ళినప్పుడు కాంగ్రెసు కుట్ర రాజకీయాలు పైకితెచ్చి వివిధ పార్టీలతో గూడుపుఠాణీ జరిపి కేంద్ర కాంగ్రెసు వారి మద్దతుతో రాష్ట్రంలో రామ్ లాల్ గవర్నర్ సానుకూలతతో కృత్రిమంగా రామారావును అధికారం నుండి తప్పించారు. ప్రజలు ఎన్నుకున్న రామారావు ఆయన పార్టీ ప్రజాస్వామికంగా వస్తే అందుకు పూర్తి విరుద్ధంగా భాస్కరరావు డొంక తిరుగుడు విధానాలతో రామారావును తొలగించి ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని నగరంలో కృత్రిమ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. తెలుగుదేశంలో ఉన్న బలహీనులకు అనేక ఆశలు చూపి కొందరిని ఆకర్షించగలిగారు. త్రిపురాన వెంకటరత్నం, నన్నపనేని రాజకుమారి మొదలైనవారు అలాగే మంత్రులయ్యారు. నిర్ణయాలు చకచక చేయటం అడిగిన వారికి అడిగినట్లు వరాలివ్వటం, కాలేజీలు, సంస్థలు మంజూరు చేయటం నిమిషాల మీద జరిగిపోయింది. కానీ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా రియాక్షన్ వస్తుందని తాము అభాసుపాలవుతామని భాస్కరరావు అంతగా వూహించి వుండడు. నెలరోజులు తిరక్కముందే భాస్కరరావు కృత్రిమ ముఖ్యమంత్రిత్వం పోయింది. ఎన్.టి.రామారావు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రజాస్వామికంగానే కొనసాగారు.
ఆశ్చర్యమేమంటే భాస్కరరావును ఆదుకుంటామని అండగా నిలుస్తామని చెప్పిన కాంగ్రెసు ఆ తరువాత ఆయనను గాలికి వదిలేసింది. అవమానించిన అంజయ్యకు మళ్ళీ కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారు. కానీ భాస్కరరావును మాత్రం రాజకీయంగా అంటరానివాడిగానే అట్టిపెట్టారు. అది రామారావు దెబ్బ.
భాస్కరరావును నేను ఈ విద్రోహ చర్య అనంతరం కలియడం మాట్లాడడం మానుకున్నాను. అప్రజాస్వామిక విద్రోహ చర్యగా ఆయన ధోరణి నాకు బొత్తిగా నచ్చలేదు.

- నరిసెట్టి ఇన్నయ్య

ఎన్.టి.రామారావు-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 12




(1923-1996)

“నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ నినదించి, సైనిక దుస్తులు వేసుకుని, తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు ఢిల్లీ వరకూ తీసుకెళ్లాలని ఎన్నికల ప్రచారంలోకి దిగిన ఎన్.టి.రామారావు రాజకీయ చరిత్ర సృష్టించారు. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్.టి.రామారావు నవమాసాలు నిండకముందే పార్టీని అధికారంలోకి తెచ్చారు. వామపక్షాలతో సహా అందరూ ఆయనను సమర్థించటం ఒక విశేషం. జీవితమంతా సినిమారంగంలో ఉంటూ హఠాత్తుగా రాజకీయాలలో ప్రవేశించి అనూహ్య మార్పును తెచ్చిన రామారావు, ప్రజల నాడిని తెలుసుకున్నట్లు భావించవచ్చు.
ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి వచ్చేనాటికి నాలుగుతరాల వారిని తన నటనా ప్రాచుర్యంతో ప్రభావితం చేశారు. పౌరాణిక పాత్రలు, సాంఘిక పాత్రలు, ఆయనను జనంలో బాగా జ్ఞాపకం పెట్టుకునేటట్లు చేశాయి. మద్రాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్లిన తెలుగు యాత్రీకులు ఒక మొక్కుబడిగా మద్రాసు వెళ్ళి ఉదయమే ఆయనను దర్శించుకుని వచ్చేవారు. ఎన్నికల నాటికి అవన్నీ పనిచేశాయి.
1981 నాటికి ఇందిరాగాంధీ పేకముక్కలవలె ముఖ్యమంత్రులను రాష్ట్రంలో నలుగురిని మార్చేసింది. అది జనానికి ఏవగింపుగా, అవమానంగా భావించేటట్లు చేసింది. ప్రజాస్వామ్యం, స్థానిక నిర్ణయాలు, తెలుగువారి గౌరవం మంటగలిశాయనే మాట ఆనోటా ఆనోటా ప్రబలింది. అలాంటి వాతావరణాన్ని ఎన్.టి.రామారావు రాజకీయానుభవం లేకపోయినా తనకనుకూలంగా మార్చుకున్నాడు. పార్టీ పెట్టడానికి కొందరిని సంప్రదించాడు. ఆనుపానులు చూచుకున్నాడు. మొత్తం మీద సాహసించి రంగప్రవేశం చేశాడు.
ఆ దశలో నేను ఎన్.టి.రామారావును హైదరాబాదులో అప్పుడప్పుడు కలుసుకునేవాడిని. రామకృష్ణా స్టూడియోస్ లో ఉదయం నుండే ఆయన సందర్శకులను కలిసి మాట్లాడేవారు. అప్పట్లో నాతోపాటు మహిపాల్ రెడ్డి, భీమ్ రెడ్డి, తుమ్మల గోపాలరావు మొదలైనవారం ఆయనను కలిశాము. అలా కలుస్తున్నప్పుడు కొందరు పార్టీ అభ్యర్థులుగా తమ పేరు సిఫారసు చేయమని నన్ను కోరారు. ఆ పొరపాటు మాత్రం చేయలేదు. అందువలన రామారావుగారితో ఎప్పుడైనా కలవడానికి యధేచ్ఛగా మాట్లాడడానికి సందేహించాల్సిన పని ఉండేది కాదు.
ఎన్.టి.రామారావు ఎన్నికల ప్రభంజనం తెచ్చినప్పుడు నేను టంగుటూరి ప్రకాశాన్ని గురించి ఈనాడులో ఒక పెద్ద వ్యాసం రాశాను. అందులో ఆయన జీవితచరిత్ర నుండి ఉదహరించి సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు ఒక వ్యక్తి చనిపోతే అతనిని చూడటానికి ప్రకాశంగారు వెళ్లారని, ఒక పోలీసు అడ్డుపెడితే పక్కనున్నవారు ఆయనను గురించి చెప్పగా పోనిచ్చాడని రాశాను. అంతేగాని గుండీ విప్పి తుపాకి గుండుకి ఎరగా చూపాడనే వదంతి నిజం కాదని రాశాను. ఆ మాటలు ప్రకాశంగారి, తెన్నేటి విశ్వనాథంగారి రచన నుండే తీసుకున్నాను. అయినా వీరాభిమానులు నా మీద ఆగ్రహించారు. ఈ వ్యాసం చదివి ఎన్.టి.రామారావు ప్రభావితుడయ్యాడు అని నేను చెప్పను కానీ, అదే సందర్భంలో ప్రకాశంపై ఆయన కొన్ని విసుర్లు విసరడంతో కొందరు ఆగ్రహించారు.
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా వివిధ సందర్భాలలో నేను విలేఖరిగాను, ఇతరత్రా కలిశాను. ఎప్పుడైనాసరే నన్ను ఆదరంగానే చూశారు. హిందీ అకాడమీ వారు ఆయన గురించి ఒక వ్యాసం సంకలనం ప్రచురించదలిచారు. అందులో ఒకటి నన్ను రాయమని వేమూరి రాధాకృష్ణ కోరారు. హిందీలోకి అనువాదం చేసుకుంటామని చెప్పారు. ఒక వెయ్యి రూపాయలు డబ్బు కూడా ఇచ్చారు. తీరా రాసి ఇస్తే అది నిశిత పరిశీలనతో ఉన్నదని ఎన్.టి.రామారావుగారికి నచ్చకపోవచ్చునని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాదును ఎన్.టి.రామారావు అడిగినప్పుడు ఆ వ్యాసం బాగున్నదని ప్రచురించాలని ఆయన చెప్పారు. అందుకు రామారావు అంగీకరించడంతో వేమూరి వారు ముఖం చిన్నబుచ్చుకున్నారు.
మరొక సందర్భంలో రాజ్యసభ స్థానానికి పర్వతనేని ఉపేంద్ర, యలమంచిలి శివాజి మధ్య ఎవరు ఉండాలి అనేదానిమీద రామారావుగారి దగ్గర సిఫారసుల పర్వం నడిచింది. నేను శివాజీతోపాటు రామారావుగారి దగ్గరకు వెళ్ళటం చూసిన ఉపేంద్ర కొన్నాళ్ళు నామీద అలిగారు.
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా మహిళల హక్కులు, వెనుకబడిన వారికి రిజర్వేషన్లు వంటి కొన్ని సాహసోపేత నిర్ణయాలు గొప్పమార్పును తెచ్చాయి. పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం కూడా సామాజిక విప్లవానికి నాంది పలికింది.
ఎన్.టి.రామారావు దగ్గర కొందరు చక్కని సలహాలిచ్చే పోలీసు అధికారులు (పర్వతనేని కోటేశ్వరరావు, అప్పారావు, రామ్మోహనరావు) ఉండేవారు. అలాగే జయప్రకాష్ నారాయణ వంటి ఐ.ఎ.ఎస్. అధికారులు ఆయనకు హేతుబద్ధమైన సలహాలిచ్చేవారు. మూఢనమ్మకాలతో వక్రమార్గాలు పట్టించిన ఐ.ఎ.ఎస్. అధికారులు లేకపోలేదు. రామారావుగారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉన్నది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది. అందుకే అతి పెద్ద విగ్రహాన్ని చేయించి హైదరాబాదు హుస్సేన్ సాగర్ చెరువు మధ్యలో ప్రతిష్ఠింపచేశారు. తెలుగువారి కీర్తిని చాటే ప్రముఖులు విగ్రహాలను టూరిస్టు ఆకర్షణగా నెలకొల్పారు.
ఒక సందర్భంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శివరామమూర్తి కొన్ని ప్రచురణలు రామారావుగారికి బహూకరించడానికి నన్ను తోడురమ్మన్నారు. అలా పొద్దున్నేవెళ్ళి నప్పుడు, ఇచ్చి తిరుగు ముఖం పట్టగా, ‘గాడ్ బ్లెస్ యూ’ అని ఆయన అందరినీ అన్నట్లే పలికారు. నేను వెంటనే “ఏ గాడ్? మీరే దేవుడనుకొని కాళ్ళు మొక్కుతున్నారు కదా వేరే దేవుళ్లు ఎందుకు?” అన్నాను. ఆయన దగ్గర అలా మాట్లాడేవారు బహుశ వుండరు. కాని ఆయన రియాక్ట్ అయి, “అరే, నీవా! ఏదో మాటవరసకి అన్నాన్లే” అంటూ నవ్వారు.
సత్యసాయిబాబా పుట్టపర్తి ఆశ్రమంలో హత్యలు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు విచారణకు ఉత్తరువులిచ్చి అవసరమైతే సాయిబాబాను అరెస్టు చెయ్యమన్నాడని తెలిసింది. నేను ఆయనను కలిసి అభినందించాను. చిరునవ్వు నవ్వాడు కాని ముఖ్యమత్రి ఉత్తరువులు అమలు జరగలేదు. ఆయన చుట్టూ ఉన్న సాయిబాబా భక్తులు ఆయనకు తెలియకుండానే అడ్డు పడ్డారని తరువాత ఆరా తీస్తే తెలిసింది.(పొలిస్ ఉన్నతధికారి దొర, అల్లుదు చంద్రబాబు నాయుడు కు కధ తెలుసంటారు) ముఖ్యమంత్రిగా రామారావు ఉన్నంతకాలం సాయిబాబా హైదరాబాదులో అడుగుపెట్టలేదు. ఒక సినిమాలో కూడా సాయిబాబా వంటి వ్యక్తిని ఆయన ఎగతాళిగా చిత్రించిన సందర్భం లేకపోలేదు. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్టు, ఎడిటర్ నార్లవెంకటేశ్వరరావుగారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు. ఆయన అంగీకరించి నా సహాయం తీసుకుని ఫైల్సు చూసి నిర్ణయాలు తీసుకునేవారు. రామారావుగారికి ఆ విషయం చెబితే ఆయన సంతోషించారు. కానీ నార్ల నిర్ణయాలు కొందరికి కంటగింపుగా పరిణమించాయి. ముఖ్యంగా అకాడమీల రద్దు విషయంలో అది గమనించదగింది.
ఎన్.టి.రామారావుకు కొన్ని బలహీనతలు ఉండేవి. వాటిని ఆసరాగా పనులు చేయించుకున్నవారు లేకపోలేదు. ఆచార్యరంగాకు ప్రజలు నిధులు వసూలు చేసి హైదరాబాదులో రంగా భవన్ ఎర్పరచి ఒక ట్రస్టుగా దాని పక్షాన కార్యక్రమాలు జరిపించారు. ఆయన సేవలకు ప్రతిభకు చిహ్నంగా అది జరిగింది. అంతవరకూ బాగానే వుంది. రంగాగారికి సంతానం లేదు. కానీ ఆయన బంధువులు రంగా భవన్ పై కన్నువేసి ప్రజలిచ్చిన ఆస్తి కాజేయటానికి పబ్లిక్ ట్రస్టును ప్రైవేటు ట్రస్టుగా మార్చించారు. రంగా చేతనే అది అడిగించారు. అందులో వున్న అనౌచిత్యాన్ని పాటించకుండా ఎన్.టి.రామారావు అందుకు అంగీకరించారు. అలాంటి తప్పులు చేయకుండా వుంటే బాగుండేది.
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా వుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీపై ఉస్మానియా విశ్వవిద్యాలయ లైబ్రరీలో నేను ఒక సెమినార్ నిర్వహించి ఐ.సి.ఎస్.ఎస్.ఆర్. ఆధ్వర్యాన చర్చ పెట్టాము. అందులో యూనివర్సిటీ నడుస్తున్న తీరు దాని స్థాపకుడు జి.రామిరెడ్డి వందిమాగధులను చుట్టూ చేర్చుకుని ప్రమాణాలు దిగజార్చిన పద్ధతి  విమర్శించాను. ఆయన శిష్యులు సెమినార్ లోనే దీనికి నిరసన తెలుపగా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాదు విమర్శ సదుద్దేశంతో జరిగిందని తప్పొప్పులు చర్చకు పెట్టడం మంచిదేనని అన్నారు. కానీ రామిరెడ్డి శిష్యులు ఒక పట్టాన విమర్శను గ్రహించలేకపోయారు. సమాధానం చెప్పలేకపోయారు. అప్పటికి రామిరెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయారు. అయినా ఆయన ఫోనులు చేసి నన్ను ఎదుర్కొనమని పురికొల్పారు. ఎలా ఎదుర్కోవాలో శిష్యులకు తెలియలేదు. అందువలన ఓపెన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, కొందరు ప్రొఫెసర్లు యూనివర్సిటీ గ్రౌండ్ లో రోజూ అధికారంలో ఉన్నవారి చుట్టూ తిరిగి నాకు వ్యతిరేక ప్రచారం చేశారు. పత్రికల వారి దగ్గరకు వెళ్ళి నా వ్యాసాలు ప్రచురించవద్దన్నారు. అందుకు ఎడిటర్లు అంగీకరించలేదు. బుక్ లింక్స్ వంటి ప్రచురణ కర్తల దగ్గరకు వెళ్ళి నా పుస్తకాలు అమ్మవద్దన్నారు. కానీ, కె.బి.సత్యనారాయణ వంటివారు అందుకు నిరాకరించారు. సెమినార్ లో పాల్గొన్న ప్రొఫెసర్ విల్సన్ వంటి వారిని క్షమాపణ చెప్పమని ఆయన ఇంటికి వెళ్ళి అడిగారు. ఆయన నిరాకరించాడు. చివరకు చంద్రబాబునాయుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఇంద్రారెడ్డి, జస్టిస్ జగన్మోహనరెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావు దగ్గరకు వెళ్ళి నాపై ఫిర్యాదులు చెప్పి నన్ను బాయ్ కాట్ చెయ్యమన్నారు. వారు నవ్వుకొని పంపించేశారు. చివరి అస్త్రంగా ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు దగ్గరకు వెళ్ళి నా ఫిర్యాదులు చెప్పి చర్య తీసుకోమన్నారు. ఎన్.టి.రామారావు పెద్దగా నవ్వి, “ఏం బ్రదర్, మాకేం సంబంధం ఈ విషయం, విమర్శలొస్తే మీకు చేతనయితే వారికి సమాధానం చెప్పుకోండి” అని పంపించేశారు. ఇదంతా నెలరోజుల ప్రహసనం. జర్నలిస్టులలో వి.హనుమంతరావు దగ్గరకు వెళ్ళి డేటా న్యూస్ ఫీచర్స్ నుంచి నన్ను తొలగించమని కోరారు. ఆయన నిరాకరించాడు.
ఈ ప్రహసనం పూర్తయిన తరవాత ఓపెన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ వ్యాఖ్యానిస్తూ, మాకు నెలతప్పింది కాని ఫలితం మాత్రం దక్కలేదని, మేము ఎంత ఫూల్స్ అనేది రుజువైందని వాపోయోడు. ఈ ఘటనలో పాల్గొన్న వారెవరనుకున్నారు? ప్రొఫెసర్ హరగోపాల్, చేకూరి రామారావు, కె.మధుసూదన రెడ్డి, రిజిస్ట్రార్ నాగరాజు, ప్రొఫెసర్ శివలింగ ప్రసాద్, వైస్ ఛాన్సలర్ నవనీతరావు, సి.నారాయణరెడ్డి మొదలైనవారు. ఔచిత్యం కోల్పోతే ఎలా ప్రవర్తిస్తారో ఎన్.టి.రామారావు చెప్పేవరకూ వారికి గ్రహింపు రాలేదు.

- నరిసెట్టి ఇన్నయ్య

కోట్ల విజయభాస్కర రెడ్డి-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 11




1920-2001

1968లో మొదటిసారి కర్నూలులో  కోట్ల విజయభాస్కరరెడ్డిని కలిశాను. అప్పుడు తెలుగు స్వతంత్ర, ఆంధ్రభూమి సంపాదకుడు, రేడియో నాటికల రచయిత గోరాశాస్త్రి (గోవిందు రామశాస్త్రి)కి 50వ జన్మదినోత్సవం జరపటానికి సభ ఏర్పాటు చేసిన సందర్భం అది. కర్నూలు జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉన్న విజయభాస్కరరెడ్డి బాగా సహకరించి సభ జయప్రదం కావటానికి తోడ్పడ్డారు. ఆయన ఆనాడు చక్కటి ప్రసంగం చేశారు. అప్పటి పరిచయంతో ఆ తరువాత హైదరాబాద్ లో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. మిగిలిన రాజకీయ వాదులతో పోల్చితే విజయభాస్కరరెడ్డి చాలా కాలం స్థానిక విషయాలు పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని 1982 ఎన్నికలలో విజయావకాశాలు క్షీణించాయని భయపడి విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకువచ్చారు. అప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులని రాష్ట్రంలో మార్చేసిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేసింది. విజయభాస్కరరెడ్డి వలన పరువు దక్కుతుందని పదవిలోకి తీసుకువచ్చారు. అయితే ఆనాటి రాజకీయ ప్రభంజనంలో రంగప్రవేశం చేసిన ఎన్.టి.రామారావు సుడిగాలి పర్యటనకు, ప్రజాదరణకు, విజయభాస్కరరెడ్డి సరితూగలేకపోయారు. రామారావు ఇస్తున్న హామీలకు మారుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను కూడా కిలో బియ్యం రూ.1.90 పైసలకే ఇస్తామని చెప్పినా జనం పట్టించుకోలేదు.
విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భవనం వెంకట్రాం, ఆవుల మదన్ మోహన్, నేను ఎదురుగా కూర్చున్నాం. రాష్ట్రంలో 11 మెడికల్ సీట్లు కర్ణాటకకు, అక్కడి స్థానాలు 11 ఆంధ్రకు ఇచ్చి పుచ్చకునే పద్ధతిలో ఏర్పాటు చేశారు. దిగిపోబోయే ముందు భవనం వెంకట్రామ్ ఆ ఫైలు సంతకం చేసి వెళ్ళారు. కానీ రానున్న ముఖ్యమంత్రి వాటిని ఆమోదించవలసి ఉంది. ఒకవైపు భవనం వెంకట్రామ్ మరోవైపున మదన్ మోహన్ (నాటి ఆరోగ్య శాఖామంత్రి) నన్ను వెళ్లి విజయభాస్కరరెడ్డితో ఆ ఫైలుపై సంతకం చేయమని చెప్పమన్నారు. ఆ మాట చెప్పటానికి వారికి మొఖం చెల్లక నన్ను కోరారు. నేను ఎదురుగా ఉన్న విజయభాస్కరరెడ్డి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెబితే ఆయన అప్పటికప్పుడే ఛీఫ్ సెక్రటరీకి చెప్పి ఫైలు తెప్పించి సంతకం చేయటం నన్ను ఆశ్చర్యపరచింది. కర్నూలులో ఏర్పడిన మా మిత్రత్వం ఆ విధంగా తోడ్పడింది.
నేను ఆ తరువాత విజయభాస్కరరెడ్డిని అంత తరచుగా కలవలేదు. ఎప్పుడైనా కలిస్తే ఆప్యాయంగా మాట్లాడేవారు. ముఖ్యమంత్రిగా నాలుగు నెలలకే దిగిపోయిన విజయభాస్కర రెడ్డి తరువాత ఢిల్లీ వెళ్ళిపోయి మరోసారి ముఖ్యమంత్రిగా పదేళ్ళ తర్వాత వచ్చారు. రెండవసారి కూడా ఆయన విఫలమయ్యారు. రెండు పర్యాయాలు కూడా తన చేతి మీదుగా కాంగ్రెసును వోడించి ఎన్.టి.రామారావుకు అధికారం కట్టబెట్టిన ఘనత విజయభాస్కరరెడ్డికే దక్కింది. రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నా మిత్రుడు అబ్బూరి వరద రాజేశ్వరరావుకు అధికారా భాషా సంఘాధ్యక్ష పదవి ఇచ్చారు. వారిరువురికి ఢిల్లీలో పరిచయం ఉండేది. కానీ పదవి స్వీకరించక ముందే అబ్బూరి జబ్బుతో ఆసుపత్రిలో చనిపోయారు.

విజయ భాస్కరరెడ్డి చివరిదశలో అపోలోలో చికిత్సకై చేరి చనిపోతున్న రోజులలో ఆయనను పట్టించుకున్నవారు లేదు. పదవులు లేకపోతే మనుషులకు ఉండే ఆదరణ అలాంటిదని కాంగ్రెస్ సంస్కృతి చెబుతున్నది.
Innaiah Narisetti

రెడ్డి తొలగించుకున్నభవనం వెంకట్రామ్-నేను కలిసిన ముఖ్యమంత్రులు - 10



In the Picture Mr Bhavanam Venkatram at my residence in Hyderabad- Komala, myself, Naveena are seen  1982

1932-2002

కాంగ్రెసు సంస్కతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కలవలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను, ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్ఠాన వర్గం చదరంగంలో భాగమే.
1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత కౌన్సిల్ సభ్యుడుగా చేశారు. ఆ దశలో డా. తంగిరాల సుభాష్ నాకు భవనం వెంకట్రామ్ ను పరిచయం చేశాడు. భవనం వెంకట్రామ్ సోషలిస్టు భావాలతో ఉన్న కాంగ్రెసు వాది. కళలు, సంస్కృతి, భాష, సినిమాల పట్ల బాగా ఆసక్తి ఉన్న రాజకీయవాది. రెడ్డి కులస్తుడైనా కమ్మ కులానికి చెందిన జయప్రదను పెళ్ళి చేసుకున్నాడు. ఇరువురూ గుంటూర జిల్లాకు చెందినవారే. మెట్ట, మాగాణి అలవాట్ల కలయిక కూడా వారి జీవితంలో ఉన్నది. భవనం వెంకట్రామ్ చక్కడా మాట్లాడేవారు. ఎదుటివారిని ఒప్పించి అంగీకరింపచేయడంలో చాకచక్యులు. కానీ కాంగ్రెసు ముఠా రాజకీయాలలో ఇమడలేకపోయారు.
భవనం వెంకట్రామ్ విద్యామంత్రిగా ఉండగా కేంద్రంలో నెహ్రూ కుటుంబానికి సన్నిహితురాలైన శ్రీమతి షీలాకౌర్ ఢిల్లీలో విద్యామంత్రిగా ఉండేవారు. ఆమె రాష్ట్రానికి వచ్చినప్పుడు భవనం వెంకట్రామ్ పని తీరును ఆయన అభిరుచులను, సంస్కృతిని గమనించి అభినందించారు. ఉత్తరోత్తర అది చాలా పనిచేసింది. ఇందిరాగాంధీకి దగ్గరయిన షీలాకౌర్ రాష్ట్రంలో సంక్షోభం తొలగించటానికి అంజయ్య స్థానే ఎవరిని ముఖ్యమంత్రిని చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో భవనం వెంకట్రామ్ పేరు సరైన సమయంలో సరైన వ్యక్తులకు షీలాకౌరం చేరవేసింది. మిగిలినవారెందరో తాము ఒక సమిధను సమర్పించామన్నప్పటికీ అసలు కీలకం అది.
భవనం వెంకట్రాంకు విద్యామంత్రిగా చక్కని అనుభవం వచ్చింది. ఆయన కొన్ని సదస్సులలో పాల్గొని ప్రసంగించటానికి నేను తోడ్పడ్డాను. ఉదాహరణకు సైంటిస్టులను ఉద్దేశించి హైదరాబాదు జూబిలీ హాలులో విద్యామంత్రిగా ప్రారంభోపన్యాసం చేయవలసివస్తే నేను ఆయన ప్రసంగాన్ని రాసి ఇచ్చాను. సైంటిఫిక్ మెథడ్ ఎలా అమలు జరపాలి. సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళటానికి రాజ్యాంగం రీత్యా దాని ఆవశ్యకతను అందులో రాశాను. ఎ.బి.షా. రాసిన సైంటిఫిక్ మెథడ్ ను ఆధారంగా తయారు చేసిన ఆ ఉపన్యాసాన్ని భవనం వెంకట్రాం బాగా చదువుకొని సభలో మాట్లాడాడు. సైంటిస్టులు చాలామంది ఆయనను అభినందిచారు. అనుకోని అభినందనకు భవనం పొంగిపోయాడు. తరువాత వచ్చి నాకు చాలా ధన్యవాదాలు చెప్పారు. అప్పటి నుండి మేము అతుక్కుపోయాము.
భవనం వెంకట్రామ్ తటపటాయింపు ఎక్కువగా చేసిన వ్యక్తి. ఒక పట్టాన నిర్ణయాలు తీసుకోగలిగేవాడు కాదు. దానికి కారణం ఆయనకు మద్దత్తుగా రాజకీయ వాదులు లేకపోవడమే. కానీ అన్ని పార్టీల నుండి ఆయనను మెచ్చుకునేవారు ఉండటం గమనార్హం.
ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంలో ఢిల్లీ యాత్రలు జరుగుతుండగా భవనం వెంకట్రామ్ నన్ను తోడుగా తీసుకెళ్ళేవారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన అధికారంలో ఉన్న కొద్ది కాలం ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్లినా అన్ని పర్యాయాలు నేను వెళ్ళాను. అది మంచి అనుభవం. ఇందిరాగాంధీతో సన్నిహితంగా కలవడానికి ఆమెకు ఆనాడు పి.ఏ.గా ఉన్న పోద్దార్ బాగా తోడ్పడ్డాడు. ఢిల్లీదంతా అర్ధరాత్రి రాజకీయం. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీని చాలా పొద్దుపోయిన తరవాతనే కలిసేవాడు. అప్పుడే మంతనాలు చేసేవాడు. అది కాంగ్రెసులో సంస్కృతిలో భాగమైపోయింది.
నేను ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ కు సన్నిహితంగా ఉండటం వలన నా సిఫారసుల కోసం అనేకమంది తిరుగుతూండేవారు. నేను ఏవీ పట్టించుకోకపోవడం వల్ల నా పనులు జరగవని నిర్ధారించుకుని దూరంగా పోతుండేవారు. అదొక గమ్మత్తయిన రాజకీయ వాతావరణం.
స్నేహితుడుగానే భవనం వెంకట్రామ్ కు నేను మిగిలాను. అయితే రాజకీయాలపై వ్యాఖ్యానాలు చేసేటప్పుడు మాత్రం సన్నిహితత్వాన్ని పక్కకి పెట్టి విమర్శను వ్రాశాను. అది భవనంకు కష్టమనిపించేది. తరువాత మర్చిపోయేవాడు. మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి ఎన్నో కబుర్లు చెప్పేవాడు. హైదరాబాదు ఆదర్శనగర్ లో నేను వుంటున్న ఒక అద్దె ఇంటికి భవనం వెంకట్రామ్ తరచు వచ్చేవాడు. అప్పుడు ఆయన కోసం వచ్చిన ప్రముఖులలో వై.యస్.రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, పాలడుగు వెంకట్రావు మొదలైనవారుండేవారు. అది నిత్యకృత్యంగా ఉండేది. అయినప్పటికీ నేను మాత్రం రాజకీయాల జోలికి పోకుండా ఉండగలిగాను. భవనం పదవి నుండి దిగిపోయిన తరువాత కూడా మా సన్నిహితత్వం అలాగే కొనసాగింది.
భవనం ముఖ్యమంత్రిగా ఉండగా ఏమీ చేయలేకపోయాడనే చెప్పాలి. ఎన్. జనార్ధన రెడ్డి వంటివారు ఆయన మంత్రివర్గంలో ఆయనను ఖాతరు చేసేవారు కాదు. నాదెండ్ల భాస్కరరావు ఆయన ద్వారా ఏదో ఒక పదవిలో ప్రవేశించాలని విఫల ప్రయత్నం చేశారు. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారానికి ఎన్.టి.రామారావు రావటం చాలామందికి ఆశ్చర్యం వేసింది. వారిరువురూ గుంటూరు కాలేజీలో చదువుతున్నప్పటి నుండి విద్యార్థిదశలో స్నేహితులు.  అదీగాక సినీరంగంలో భవనానికి కూడా ఆసక్తి ఉండేది. పి.వి. నరసింహారావు అంటే భవనానికి ఇష్టం ఉండేది. ఏడు మాసాల ముఖ్యమంత్రిగా చరిత్రలో ఆయన నిలిచిపోయారు.
1982లో ఎన్నికలు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఢిల్లీ నుండి సూట్ కేసులతో నిధులు తెచ్చిందని చెబితే నేను మొదట్లో నమ్మలేదు. తరువాత భవనం వెంకట్రామ్ ను పిలిచి కొంత డబ్బిచ్చి అనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థులకు పంచమన్నారు. ఆయన ఆవిషయం నాతో చెప్పకుండా అనంతపురం వెళ్ళొద్దాం రమ్మని కారులో తోడు తీసుకెళ్లారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. ట్రావెలర్స్ బంగళాలో బి.టి.ఎల్.ఎన్. చౌదరికి కాంగ్రెస్ నిధిని ఎన్నికల ఖర్చుల నిమిత్తం భవనం వెంకట్రామ్ ఇస్తున్నప్పుడు గమనించాను. ఆయన డబ్బు చాలదని సిఫారసు చేసి మరికొంత ఇప్పించమని అడిగాడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత భవనాన్ని అడిగితే ఇందిరాగాంధీ నిధులు తెచ్చి పంచిన మాట నిజమేనని అందులో ఒక భాగమే తనకు అప్పగించారని చెప్పారు.
భవనం ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబునాయుడు స్టేట్ మంత్రిహోదా వుండేది. ఆయనను కేబినేట్ హోదాకు పెంచాలని వై.ఎస్.రాజశేఖర రెడ్డి కోరిక. ఢిల్లీ వెడుతున్నప్పుడు నాకా విషయం చెప్పి నన్ను కూడా వీలైతే ఒకమాట చెప్పమన్నాడు. రాజశేఖరరెడ్డి మిత్రులకు అరమరికలు లేకుండా అలా సహాయం చేసిన ధోరణి కనబరిచాడు. కానీ నేను అందులో పాత్ర వహించలేదు.
అసలు విషయం ఏమంటే కేంద్రం ఆమోదం లేకుండా ఏ మార్పూ చేసే అవకాశం భవనానికి లేదు. తన నిస్సహాయతను భవనమే నాకు చెప్పాడు. ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా ఉన్నందున నాకు కొన్ని మంచి అవకాశాలు లభించేవి. సుప్రసిద్ధ గాయని లతామంగేష్కర్ తన తండ్రి పేరిట ముషీరాబాద్లో సంస్థ పెట్టటానికి స్థలం అడుగుదామని ఒక రోజు పొద్దున్నే భవనం ఇంటికి వచ్చింది. సమయానికి ఎవరూ లేరు. నన్ను ఆమెతో మాట్లాడుతుండమని, ఈలోగా తాను తయారయి వస్తానని భవనం చెప్పారు. ఆవిధంగా చాలా సేపు లతామంగేష్కర్ తో మాట్లాడి ఆమె అనుభవాలు తెలుసుకునే అవకాశం లభించింది. ఆశ్చర్యమేమంటే ముఖ్యమంత్రి ఇంట్లో అలాంటి సుప్రసిద్ధ గాయని వచ్చినప్పుడు అందరు కలిసి ఫోటో తీయించుకుందామంటే కనీసం కెమెరా లేదు. నేటి ముఖ్యమంత్రులకు నాటి ముఖ్యమంత్రులకు ఎంతో తేడా అనిపించింది.
భవనం వెంకట్రామ్ విద్యామంత్రిగా ఉండగా యు.జి.సి. ఛైర్మన్ మాధురీ దీక్షిత్ అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వచ్చింది. భవనం వెంకట్రామ్, నేను కలిసి వెళ్ళాం. అయితే ఆమె సత్యసాయిబాబా భక్తురాలిగా పుట్టపర్తిలో డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నది. అది అవమానకరమని, శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ వ్యక్తిగత భక్తి ముఖ్యం కాదని నేను వెంకట్రామ్ కు చెప్పాను. భవనం అందుకు అంగీకరించి సాయిబాబా విద్యాసంస్థకి వెళ్ళలేదు.
బాబాలు, మాతలు భవనం వెంకట్రామ్ దగ్గరకు వచ్చినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఒకసారి కడప నుండి శివస్వామి వచ్చి విబూది పండు ఆయన చేతిలో పెట్టాడు. గాలిలో నుంచి అవి సృష్టించినట్లు చెప్పాడు. పక్కనే కూచున్న నేను భవనం వెంకట్రాం చెవిలో - ఒక గుమ్మడికాయ ఇవ్వమనండి అని చెప్పాను. ఆయన అలాగే అడిగాడు. ఆ స్వామి తెల్లబోయి ఇవ్వలేనన్నాడు. చేతిలో పట్టే వస్తువులయితే హస్త లాఘవంతో కనికట్టు విద్యతో అవతలి వాళ్ళని భ్రమలో పడేస్తారు. ఆ స్వామి జూనియర్ కాలేజీ పర్మిషన్ కోసం వచ్చి ఇలాంటివి అడిగాడు. మొత్తం మీద వాళ్ళను భవనం దూరంగానే ఉంచేవాడు.
ఆయన హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పోస్టు భర్తీ చేయవలసి వచ్చింది. అనుకోకుండా నన్ను అడిగితే అప్పుడే హైకోర్టులో ఛీఫ్ జస్టిస్ గా రిటైర్ అయిన ఆవుల సాంబశివరావు పేరు చెప్పాను. భవనం వెంటనే అంగీకరించి నన్నే వెళ్ళి ఒప్పించమన్నారు. నేను ఆపని చేయగలిగాను.
భవనం హయాంలో జరిగిన ఒక మంచి కార్యక్రమం ఓపెన్ యూనివర్సిటీకి నాంది పలకటం. చదువుకోవటానికి అవకాశం లేక గ్రామాలలో ఉంటున్న వారికి విద్యాబుద్ధులు గరపటానికి పథకం ఉండాలని భవనం తలపెట్టాడు. ఆ ప్రయత్నంలోనే జి.రామిరెడ్డిని పిలిచి విషయాన్ని పరిశీలించమన్నాడు. ఆయన ఇంగ్లండు వెళ్ళి ఓపెన్ యూనివర్సిటీ పద్ధతిని చూసి వచ్చి రిపోర్టు ఇచ్చాడు.
యూనివర్సిటీ నాగార్జున సాగర్ వద్ద పెట్టాలని భవనం తలపోశాడు. చివరి దశలో వైస్ ఛాన్సలర్ గా జి.రామిరెడ్డికి పోటీగా జెన్ టిక్స్ శాఖాధిపతి ఓ.యస్.రెడ్డి ముందుకు వచ్చాడు. కానీ మేమంతా రామిరెడ్డినే బలపరిచాము. ఓ.యస్.రెడ్డి నాకు మిత్రుడే. ఆయనకు కష్టం వేసింది కూడా. కానీ భవనాన్ని ఒప్పించి చివరకు రామిరెడ్డి పేరుకే మొగ్గు కనబరిచాము.
భవనం వెంకట్రామ్ దిగిపోయిన తరువాత రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహించలేదు. కానీ చివరి వరకూ నాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన వద్దకు ఆట్టే ఎవరూ వచ్చేవారు కాదు. పదవి లేనప్పుడు కాంగ్రెసు సంస్కృతి అంతే.

Innaiah Narisetti