“శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?” -
3.
మానవజీవితంపై సాంకేతికశాస్త్ర ప్రభావం
విద్యవల్ల విముక్తి లభిస్తుందనేది విజ్ఞానపరంగా వాస్తవం. అజ్ఞానం, మూఢనమ్మకాలు, వాటి వల్ల కలిగిన రాగద్వేషాల నుంచి మానవుడిని విముక్తుడిని చేయడంలో విజ్ఞానం ఉపయోగపడింది. ఇటీవలి వరకు తనను తెలుసుకోవడానికి, విశ్వాన్ని తెలుసుకోవడానికి ఈ నమ్మకాలు అడ్డుపడి, మానవుడిని హేతుబద్ధంగా నైతికంగా పరిపూర్ణదశకు రాకుండా చేశాయి.
ఈ విమోచన ఎలా ఉన్నదో చూడాలంటే, వందేళ్ళ కిందట ఈ దేశంలో ఇంచుమించు అందరూ, నేటికీ కొందరు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, జీవ నిర్జీవ వస్తువులు, సముద్రం, గాలి, మానవుడి గురించి ఏమనుకున్నారో చూస్తే సరిపోతుంది. ఈ నమ్మకాలు మన ఆదర్శాలను నిర్ధారణ గావించాయి. మతేతరంగానూ పారలౌకికంగానూ ఎలా ప్రభావితం చేశాయి, వ్యక్తిగతంగానూ, పరస్పర వ్యక్తుల మధ్య సంబంధాలలోనూ ఈ ప్రభావం ఎలా ఉన్నదీ తెలుసుకోవచ్చు. మానవుడిని గురించి, లోకాన్ని గురించి మన భావాలను, విజ్ఞానం దృష్ట్యా ఎలా పునరాలోచించుకోవాలో పరిశీలించాలి. ఆధునిక విజ్ఞానం సూచించిన ధోరణిలో మన దృష్టిని మార్చుకుంటే మానవుడిలోని సృజనాత్మక శక్తులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. అప్పుడు సాంకేతిక శాస్త్రాన్ని మానవుడి మంచితనం కోసం మలచవచ్చు. విధ్వంస లక్ష్యాలకోసం దుర్వినియోగ పరచకుండా ఆపవచ్చు.
ఖగోళ శాస్త్రం
పురాణాలలో లోకం అంతా స్వర్గనరకాలుగానూ, భూమిగానూ విభజించారు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండగా భూమి అడుగున పాతాళ లోకంలో, ఆదిశేషు వీటన్నిటినీ మోస్తుంది. ఆ సర్పంపై విష్టువు శయనించి ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ ప్రత్యేక దేవతలకు నివాసాలు. రాహువు, కేతువులు తరచు సూర్యచంద్రులను కబళిస్తుంటాయి. అప్పుడు గ్రహణాలేర్పడతాయి. కాంతి పుంజాలు వెదజల్లే ఈ నిస్సహాయ దేవతలను రాహు కేతువుల కబంధ హస్తాల నుంచి తప్పించటానికి పూజా పునస్కారాలతో ఎన్నో వస్తువులు సమర్పించుకోవలసి ఉంది. గ్రహణాలే కాక, వరదలూ, కరువు కాటకాలూ, భూకంపాలూ అన్నీ ఏదో ఒక దేవతకు అంటగట్టారు. వాటి ముందు మానవుడు నిస్సహాయుడు. ఆరాధనతో దేవతలను శాంతింపజేయటం, లేదా పూర్తిగా లొంగిపోవడం, కాదంటే, యోగాభ్యాసం, తపస్సు వల్ల కొన్ని శక్తులు సంపాదించటం మాత్రమే మానవుడు చేయగలిగింది. అంతేగాని దైవశక్తి పనిచేసే తీరును, వివేచనాత్మకంగా తెలుసుకొని వాటి బారి నుంచి తప్పించుకోవటం, లేదా మరొక మార్గాన్ని చూడటం అనేది జరగదన్న మాట. నియమబద్దమైన ప్రకృతి అనే భావన వస్తువులలోగాని, తీరు తెన్నులలో గాని చూడలేక పోయారు. సైన్సు వల్ల నియమబద్దత వచ్చింది.
నక్షత్రాలను, గ్రహాలను, దేవతా నివాసాలుగా నేడు అందరు మానవులు నమ్మటం లేదు. దుష్ట దేవతల ప్రయత్నం వల్ల శిష్టమైన వాటిని నాశనం చేయటానికి గ్రహణాలేర్పడుతున్నాయని అందరూ నమ్మటంలేదు. మనం ఇప్పుడు, గ్రహణాలను ఊహించవచ్చు. లోగడ మనలను ఆశ్చర్యపరిచే అనేక సంఘటనలను ఇప్పుడు, గంటలూ, నిమిషాలతో సహా అంచనా వేసి చెప్పవచ్చు. భూమి సూర్యుని చుట్టూ గంటకు 65 వేల మైళ్ళ వేగంతో తిరుగుతున్నదని తెలుసుకున్నారు. దీని కాధారంగా శేషనాగు లేదుగాని, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి నిలబడిందని గ్రహించాం. సూర్యోదయం, సూర్యాస్తమయం, సముద్రాల ఆటుపోట్లు, రుతువుల మార్పులు, ఏడాదికొకసారి పక్షులు, చేపలూ వలస పోవడం, నక్షత్రాల, మనుషుల, జీవజాలాల పుట్టుక, చావు కూడా దేవుడు, దేవతవల్ల గాక, అంతర్గతంగా ఉండే నియామాల వల్ల జరుగుతున్నాయి. మానవుడి వివేచనకు ఇవన్నీ అవగాహన అయ్యేవే. తన సాంస్కృతిక పరిణామ భిన్నదశలలో మానవుడు తనను పోలిన దేవుడిని సృష్టించుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలియటం వల్ల ఇంతకు ముందెన్నడూ లేనంతగా మానవుడి సృజనాత్మక శక్తి విమోచన పొందింది.
పరిణామం, పారంపర్యత, జన్యు శాస్త్రం
ప్రపంచంలో మానవుడి స్థానాన్ని గురించి విజ్ఞానం చెప్పిందాన్ని బట్టి ఇటు వంటి విప్లవమే వచ్చింది. ఆధునిక జీవశాస్త్రం ఆవిర్భవించక ముందు, జీవరాశి మూలాన్ని గురించి 1859లో డార్విన్ సిద్ధాంతం లేక పూర్వం, ప్రత్యేక సృష్టిలో మానవుడికి నమ్మకం ఉండేది. విశ్వమంతా 6 రోజులలో సృష్టి అయిందనీ అందులో 3, 5, 6 రోజులలో జీవ సృష్టి జరిగిందనీ, మానవుడు కూడా ఇందులోనే ఉన్నాడనీ బైబిల్ చెబుతున్నది. బ్రహ్మ, (లేదా) ప్రజాపతి సృష్టి అయిందనీ అందులో 3, 5, 6, రోజులలో జీవ సృష్టి జరిగిందనీ, మానవుడుకూడా ఇందులోనే ఉన్నాడనీ బైబిల్ చెబుతున్నది. బ్రహ్మ, (లేదా) ప్రజాపతి సృష్టి చేసినట్లు అంగుష్ఠ దేహ కథనుబట్టి, హిందూమతం నమ్ముతున్నది. చాలా పురాణాలు ప్రపంచానికి, జీవితానికి ఇలాంటి మూలమేదో ఉందని నమ్మారు. అంతే తప్ప ఒక జీవికీ, మరొక దానికీ పరిణామ సంబంధాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు. మానవుడి నుంచి సర్పానికీ, సర్పం నుంచి మానవుడికీ మార్పు జరుగుతుందని, సర్వ సాధారణంగా నమ్మారు. అలాగే ఇతర జీవుల విషయంలో కూడా జరిగింది. ఒక జీవి నుంచి మరొకటి పరిణమించటమనేది అనూహ్యంగా ఉండేది. ప్రతి జీవి విశిష్టమేనని భావించారు. కనక పాకే జంతువు నుంచి పక్షి రావడం గానీ, వానరం నుంచి మనిషి రావడం గానీ, అసలు ఆలోచనకే అందలేదు. దేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని నమ్మడం వల్ల పునర్జన్మ వచ్చింది. జీవితానికి ఆత్మ ముఖ్యమనీ, పారంపర్యతను అదే తీసుకుపోతుందనీ నమ్మారు. ఇప్పటికీ చాలా మంది హిందువులు గుండెలో అంగుష్ఠదేహం ఉంటుందనీ, మరణించినప్పుడు అది బ్రహ్మ రంధ్రంగుండా బయటకు పోతుందనీ నమ్ముతారు. ఈ నమ్మకం వల్ల తల్లిదండ్రులు సంతానం యొక్క వంశానుగత లక్షణాలను అసందర్భం అన్నట్లు చూశారు. శాశ్వతమైన ఆత్మ, చావు పుట్టుకల వలయం నుంచి విమోచన పొందేవరకూ తన కర్మానుసారం మళ్ళీ పుడుతూనే ఉంటుంది. తల్లిదండ్రులు కేవలం నిమిత్తమాత్రులు. వ్యక్తి మంచి చెడ్డల వల్ల తల్లిదండ్రుల నిర్ధారణ జరుగుతుంది.
మానవుడి అంతర్గత శక్తుల గురించి, భూమిపై అతడి స్థితిగతులను గురించి ఇటువంటి దృక్పథం వల్ల కులవ్యవస్థకు తాత్విక మద్దతు సమకూడింది. సమాజంలో హెచ్చుతగ్గులు, దోపిడీ, ఇతర అన్యాయాలకు కూడా అండ ఏర్పడింది. మానవుడు పేదవాడైనా, ఆకలితో అలమటిస్తున్నా, శూద్రుడిని పైకులాల హిందువు అమానుషంగా చూస్తున్నా అందుకు కారణం అసమానత్వంతో కూడిన సాంఘిక నిర్మాణం అని గాక, దురదృష్టవంతుడి కర్మ అని చెప్పారు.
ఇదంతా ఊహమాత్రమేననీ, ఆధునిక జీవ, సాంఘిక శాస్త్రాలు కనుక్కొన్నాయి. వ్యక్తి అంతర్గత శక్తియుక్తులన్నీ, అతడి తల్లిదండ్రుల వల్ల, పరిసరాల వల్ల నిర్ధారితమైతాయని తెలుసుకున్నారు. తండ్రి రేతస్సు తల్లి గర్భంలో అండమూ కలిసి పిండం ఏర్పడి వ్యక్తి పుట్టి పెరుగుతాడు. అండంలోనూ, రేతస్సులో కూడా జీవసంబంధమైన పలుచని పొడవైన సూక్ష్మ పదార్ధాలు, వాటినంటి పెట్టుకొని చిన్న జీవాణువులు ఉంటాయి. ఈ జీవ అణువులే (జన్యువులు) వంశపారంపర్యతను కొనసాగిస్తాయి. ప్రతి జన్యువు కూడా వ్యక్తి పెరుగుదలకూ, లేదా పెరగకపోవడానికీ దోహదం చేస్తాయి. జుట్టు రంగు, ఎత్తు, లింగభేదమూ, తెలివితేటలూ, కళలూ ఆలోచనారంగంలో సృజన శక్తులూ, ఉబ్బసంవంటి వంశపారంపర్య రోగాలకు గురికావటం ఇత్యాదులన్నీ ఈ జన్యువుల వల్లనే జరుగుతోంది. భిన్న వ్యక్తులలో జన్యువుల కలయిక భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో ఒకానొక విధంగా జన్యువుల కలయిక కేవలం తల్లి-దండ్రులకు పుట్టిన అనేకమంది వ్యక్తులను పరిశీలిస్తే వారిలోని జీవాణువుల కలయికను ఇంచుమించు సరిగానే అంచనా వేయవచ్చు. ఆధునిక గణాంకశాస్త్రం వల్ల ఇది సాధ్యమవుతున్నది. ఈ విధంగా అభివృద్ధి చేసిన వంశ పారంపర్య నియమాలనే జన్యుశాస్త్రం అంటున్నారు. దీని ఆధారంగా మేలుజాతి పశువులూ, పంటల శాస్త్రం కూడా పెంపొందింది.
ఈ పై విషయాన్ని గమనిస్తే, సంప్రదాయ భావాల నుంచి మనం ఎంత దూరంగా జరిగాయో అర్థమవుతుంది. మానవ స్వభావం, జీవితాన్ని గురించిన మన భావాలలో కూడా ఇటువంటి మార్పే వచ్చింది. జీవులలోని భిన్న రూపాలు పరస్పర సంబంధం లేకుండా దేనికదే విశిష్టంగా ఉండదని ఆధునిక విజ్ఞానం చెబుతున్నది. ఉన్నత జీవరాసులు కింది స్థాయి నుంచి పరిణమించగా, ఇవి ఇంకా తక్కువ స్థాయి నుంచి వచ్చాయి. ఇదంతా సహజంగా జరిగిన ఎంపికే. దీనికి ఎంతో కాలం పట్టిందని సైన్సు మనకు చెబుతున్నది. మానవుడి పూర్వీకుడు వానరం వద్దనే ఆగలేదనీ, ఏకకణ జీవి అయిన అమీబా వరకూ సంబంధం ఉన్నదనీ తెలుసుకోవచ్చు. జీవితానికి తొలిదశ అటువంటి అతి సాధారణమైంది. ఇలా కనుక్కోవటం వల్ల నిరుత్సాహ పడిపోవడమనేది ఆయా వ్యక్తుల మానసిక రీతిని బట్టి ఉంటుంది. ఉన్నత వంశానికి ప్రాధాన్యం ఇస్తూ, తన పారంపర్యతను చూపుకునే వ్యక్తికి, అమీబా వద్ద మనం ప్రారంభమయ్యామంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. మనిషి ఆలోచనా, హృదయ లక్షణాలను బట్టి ఆధునికయుగంలో మానవుడిని అంచనా వేసుకోవాలి. అప్పుడు మూలాధారం నుంచి ఇంతగా పురోభివృద్ధి చెదినందుకు మానవుడు గర్వించవచ్చు.
మానవుడికే కాదు. జీవానికి మూలమేమిటో కూడా వివరించటానికి వీలవుతున్నది. మతాలన్నీ ఆత్మవంటి జీవశక్తిని నమ్మాయి. ఆధునిక జీవరసాయనిక శాస్త్రం గానీ, పరిశోధనాత్మక మనోవిజ్ఞానంగానీ అటువంటి భావాలకు చోటివ్వడం లేదు. జీవానికి మూలం, స్వభావం వివరించవలసి వచ్చినప్పుడు ప్రత్యేక పరిస్థితులలో జీవపదార్థానికి అనుబంధంగా జీవితం ఆవిర్భవించినట్లు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితులను పరిశోధనాలయంలో మళ్ళీ సృష్టించడం కష్టమే గాక సాధ్యం కూడా కాకపోవచ్చు. జీవితం తొలుత ఏర్పడినప్పుడు పరిస్థితులకూ, నేడు భూమి మీద ఉన్న వాతావరణం, రసాయనిక సమ్మిశ్రితం, చాలా భిన్నంగా ఉన్నందున మళ్ళీ మనం ఆదిమస్థితికి పోయి ఆనాటి పరిస్థితులను సృష్టించలేము. ఆ పరిస్థితుల గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఇది సాధ్యపడక పోవచ్చు. ఇది తప్పించుకోవటానికి చేసే సాధనకాదు. విజ్ఞానంలో ఇటువంటి పరిస్థితులు అనేక సందర్భాలలో ఏర్పడ్డాయి. ఉదాహరణకు సముద్రాలూ, పర్వతాలూ ఏర్పడినప్పటి ప్రత్యేకమంచు పరిస్థితిని గానీ, భూమి ఏర్పడినప్పటి ప్రత్యేక పరిస్థితులనుగాని మనం సృష్టించలేము. అంతమాత్రం చేత ఈ సంఘటనలకు అలౌకికశక్తి ఉన్నదని అనలేము. విజ్ఞానంలో ప్రతి సిద్ధాంతాన్నీ ప్రత్యక్ష పరిశోధనకు పెట్టలేకపోవచ్చు. ముఖ్యంగా కొన్ని సంఘటనలు, పునశ్చరణ చేయడానికి వీలులేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అలాంటి సందర్భంలో ప్రత్యక్ష పరిశోధనకు వీలైన వైజ్ఞానిక సిద్ధాంతాలు పైన పేర్కొన్న దృక్పథాన్ని బలపరుస్తున్నందున మనం ఆమోదిస్తున్నాం. విజ్ఞానేతర వివరణలు ఈ పనిచేయ లేకపోయాయి. ఆ జీవస్థితి నుంచి జీవానికి, తరువాత ప్రాణికోటికీ ఇందులో పరాకాష్ఠగా మానవుడి పరిణామం నిరంతరంగా సాగినట్లు విజ్ఞానం చూపింది. “విశ్వం ఎప్పుడు సృష్టి అయింది?” అనే ప్రశ్న సరిగా వేయలేదని కూడా విజ్ఞానం చెపుతున్నది. దీనికి సమాధానం మనం అనుసరించే కాలప్రమాణాన్ని బట్టి ఉంటుంది. ఏమైనా ప్రత్యేక సృష్టి లేదా సృష్టికర్త అనే ప్రతిపాదన మాత్రం మనకు లభించిన సాక్ష్యాధారాలకు సరిపోవడం లేదు.
ఆధునిక విజ్ఞానం కనుక్కొన్న మరొక విషయం మన దేశానికి ప్రత్యేకంగా ఆసక్తికరమైనది. మనకు శతాబ్దాలుగా కులంతో కూడిన సమాజం ఉంది. నాలుగు వర్ణాలు దీనికి ఆధారం, హిందువులలో పుట్టినవారంతా ఏదో ఒక వర్ణానికి చెందినవారే. అగ్ర స్థానంలో బ్రాహ్మణుడూ, అట్టడుగున శూద్రుడూ ఉంటున్నారు. కర్మ సిద్ధాంతానుసారం గతంలోని కర్మల వల్ల ఒకానొక వర్ణంలో పుట్టడం నిర్ధారణ అవుతుంది. ప్రతి వర్ణానికి కచ్చితంగా నిర్ణయించిన హక్కులూ, బాధ్యతలూ ఉన్నాయి. కింది స్థాయికి పోయే కొద్దీ హక్కులకంటే బాధ్యతలు పెరుగుతాయి. అట్టడుగు వర్ణానికి హక్కులు దాదాపులేనట్లే. అమానుషమైన బాధ్యతలు మాత్రం ఉన్నాయి. దీనంతటికీ దైవ ప్రమాణం సిద్ధాంతరీత్యా ఉన్నది. భగవద్గీతలో కృష్ణుడు తానే గుణకర్మానుసారం నాలుగు వర్ణాలను సృష్టించానంటాడు. ఇటువంటి పద్ధతిలో వ్యక్తి చొరవకు ఆస్కారంలేదు, వ్యక్తి స్వేచ్ఛ, హుందాతనానికి గౌరవం లేదు.
నేడు మతేతర విషయాలలో తక్కువ వర్ణాల వారు ఉన్నత కులాల ఆధిక్యతను ఆమోదించటం లేదు. ప్రజాస్వామ్య సంస్థలు రావడంతో, వారు జయప్రదంగా తిరగబడ గలుగుతున్నారు. ఈ తిరుగుబాటు పూర్తి కావాలన్నా, నిర్మాణాత్మకం కావలన్నా ఉన్నత కులాల కంటే తాము తక్కువ వారమనే భావన పోగొట్టుకోనిదే సాధ్యపడదు. బౌద్ధమతంలోకి మారడం కొంతవరకే ఫలితాన్నిస్తున్నది. హిందూమతంలో ఉన్న కర్మ, కులానికి ఆధారమైన పునర్జన్మలను బౌద్ధమతం ఆమోదిస్తున్నది. కనక మార్గాంతరంగా విజ్ఞానం కనుక్కొన్న వాటికి అనుగుణమైన ప్రపంచ దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. దీనిని బట్టి ఏర్పడే నైతిక దృక్పథం కూడా వ్యక్తి విలువలను సాధించుకోడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విషయమై విజ్ఞానం ఏమి చెబుతుందో తెలియని వారు హిందూ దృక్పథాన్ని సమర్థించేవారి చేతులలో చిక్కుకున్నారు. ఉదాహరణకు కొందరిలో ప్రవహించే రక్తం పరిశుభ్రమైందనీ, అందుకే ఆ వర్ణాలవారు గొప్పవారనీ అంటున్నారు. విజ్ఞానం కూడా నాలుగు విధాలైన రక్తం ఉన్నట్లు పేర్కొనలేదా? అంటున్నారు. ఇది దోషపూరితమైన వాదం. మానవుల రక్తం నాలుగు విధాలుగా ఉన్నట్లు కనుక్కొన్నప్పటికీ వర్ణానికీ దీనికి ఎక్కడా పొంతనలేదు. ఆ మాట కొస్తే బ్రాహ్మణులూ శూద్రులు కూడా ఒక విధమైన రక్తానికీ చెందినవారైతే ఆ బ్రాహ్మణుడి తమ్ముడూ, శూద్రుని కుమారుడూ వేరే విధమైన రక్తానికి చెందిన వారు కావచ్చు. వ్యక్తి అంతర్గత శక్తులకూ, వర్ణం, కులం, జాతికీ ఏ విధమైన సంబంధం లేదు. వివిధ వ్యక్తుల మధ్య ఉన్న భిన్నత్వం వంశపారంపర్యంగా వచ్చింది. ఈ వంశ పారంపర్యత శారీరకమైందీ, పరిసరాలకు చెందిందీ. మానవుడు దీనిని అదుపులో పెట్టగలడు.
(తరువాయి 4వ భాగంలో)
రచన తెలుగుసేత
ఎ. బి. షా నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment