శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?
ఆంగ్ల పుస్తక రచయిత
ప్రొఫెసర్ (కీ.శే) ఎ.బి.షా.
తెలుగు సేత
ఎన్. ఇన్నయ్య, పి.హెచ్ డి.
ఎ.బి.షా గురించి
అమృతలాల్ భిక్కు భాయి షా (ఎ.బి. షా - 1920-1982) భారతదేశంలో శాస్త్రీయ పద్ధతి ప్రచారం చేయడానికి 1964లో పూనుకున్నారు. ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ పరిశీలనల ప్రభావంతో సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించిన షా. సంక్షిప్త వివరణతో సైంటిఫిక్ మెథడ్ (1964) రాశారు. దేశంలో సెక్యూలర్ ఉద్యమ నిర్మాతగా షా నిర్విరామ కృషి చేశారు. రాజకీయ, ఆర్థిక, విద్య, మత సమస్యలకు శాస్త్రీయ పద్ధతి అన్వయించిన ఖ్యాతి షాకు దక్కుతుంది. రానున్న తరాలకు యీ పద్ధతి ఎంతో ఉపయోగకారి.
ముందు మాట
ఇది ఎందుకు అవసరం?
మాది శాస్త్రీయం అనడం నేడు పరిపాటి అయింది. పవిత్ర గ్రంథాలను శాస్త్రీయం అంటూ భక్తులు వాదిస్తున్నారు. అంటే భగవద్గీత, వేదాలు, బైబిల్, కొరాన్ శాస్త్రీయం అనగలుగుతున్నారన్నమాట. ఏదైనా సరే శాస్త్రీయం అయితే, చాలా గౌరవప్రదం అని భావిస్తున్నారు. ఈ జాబితాలో యిటీవల వాస్తును, జ్యోతిష్యాన్ని పోటీపడి చేర్చుతున్నారు. ఇక చికిత్సల సంగతి చెప్పనక్కర లేదు. ఆక్యుపంక్చర్ మొదలు హోమియోపతి వరకూ శాస్త్రీయ పరిధిలో చేర్చుతున్నారు. ఈ సందర్భంగా ఏది శాస్త్రీయం, ఏది అశాస్త్రీయం తెలుసుకోవడం మంచిది. కొందరు సైంటిస్టులు, సాంకేతిక విజ్ఞానులు మూఢనమ్మకాలలో శాస్త్రీయత చూపుతున్నారు.
భారత రాజ్యాంగం సైంటిఫిక్ ధోరణి విధిగా ఫెంపొందించాలన్నది. ప్రాథమిక విద్యాస్థాయి నుండే శాస్త్రీయతను ఆకర్షణీయంగా, ఉదాహరణలతో పిల్లలకు చెప్పాలి. శాస్త్రీయత అంటే సైంటిఫిక్ అనే అర్ధంలో వాడాలి. ఇందులో ప్రధానమైన అంశం తనను తాను దిద్దుకుంటూ, సరి చేసుకుంటూ ముందుకు సాగడం. శాస్త్రీయతలో తిరుగులేని, మార్చడానికి వీల్లేని ప్రమాణాలుండవు. కొత్త విషయాలు కనుగొంటుంటే పాతవి చరిత్రలోకి పోతాయి. ఇది నిరంతర కృషి. ఒకసారి చెప్పింది ఎవరూ మార్చడానికి వీల్లేదనే ధోరణికి శాస్త్రీయతలో చోటు లేదు. శాస్త్రీయత గురించి సులువుగా, విడమరచి చెప్పడం కష్టం. బాగా అవగాహన వుంటేనే అది సాధ్యం.
కీ.శే. ఎ.బి.షా. శాస్త్రీయత గురించి టూకీగా, లోతుపాతులతో చెప్పారు. విద్యార్థులందరూ దీనిని చదవాలనే దృష్టితో హెచ్. నరసింహయ్య, బెంగుళూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ వుండగా బి.ఎ. స్థాయి విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శాస్త్రీయత గురించి తెలుసుకుంటే, పిల్లలకు చాలా ఉపయోగం. సమాజాభివృద్ధికి ఎంతో దోహదకారిగా, శాస్త్రీయ పద్ధతి వుంటుంది. ఈ రచనను, ఆ లక్ష్యంతో, అందిస్తున్నాము.
సాంస్కృతిక ప్రభావంలో సైన్స్ పాత్ర
విజ్ఞానాన్ని అన్వయించినందువల్ల భౌతిక స్థితిగతులు మెరుగయ్యాయి. సాంస్కృతిక జీవనంపై కూడా బలమైన మార్పు కనబరచింది. బైబిల్, ఖురాన్, రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు వంటి ప్రమాణ గ్రంథాలు కోట్లాది ప్రజలకు, అందుబాటులో ఉండే ధరకు లభించడానికి ముద్రణాయంత్రం తోడ్పడింది. విద్యావ్యాప్తికి అవకాశం కలగడమేగాక ఎవరు కావాలన్నా విజ్ఞానం లభించే స్థితి వచ్చింది, ఈ విధంగా జ్ఞానాన్ని పవిత్రస్థానాల నుంచి మతరహిత రంగానికి తేవడంతో, ఇన్నాళ్ళు కొద్దిమంది అల్ప సంఖ్యాకులు స్వార్థంతో మానవజాతిని మూఢనమ్మకాలలో, మార్మిక స్థితిలో అట్టిపెట్టగా, అది నేడు తొలగే అవకాశం లభించింది. కులం హెచ్చుతగ్గులు పోగొట్టడానికి రైళ్ళు కొంత తోడ్పడ్డాయి. జ్ఞానం, పరస్పర సానుభూతితో మానవజాతి ఒకటిగా పెంపొందించడానికి అచ్చుయంత్రం ఉపకరించింది. లోగడ దేవుడి ఆజ్ఞానుసారం సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయనేవారు.
నేడు అందరికీ అందుబాటులో రేడియో, పుస్తకాలు, పత్రికలు, సినిమాలు ఉండడం వల్ల సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదం కలిగింది. దూరంగా ఉన్న ప్రదేశాలలో ఏమిజరుగుతున్నదో తేలుసుకోవడానికి నేడు ఎవరూ లక్షాధికారి కానక్కరలేదు. హ్యూయన్ సాంగ్ లాగ యాత్రికుడు కానక్కరలేదు. సముద్రంలోతులలో జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరూ గజయీత గాళ్ళుగా మారనక్కరలేదు. సమకాలీన, ప్రాచీన ప్రపంచ విషయాలు గ్రహించడానికి ఎవరూ ఐరోపా, అమెరికా వెళ్ళనక్కరలేదు. ఆరుభాషలు నేర్వనక్కరలేదు. ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలు, సంపద, స్థితిగతులు, కులం, వృత్తితో కూడా నిమిత్తం లేకుండా, పుస్తకాలు ప్రచారసాధనాలతో ఇటువంటి కృషి జరుగుతున్నది. చావు అనేది అందరికీ సమానత్వం ఇచ్చింది. సైన్సు వల్ల సమానత్వం అనేది అందరికీ సాధ్యమని చెబుతున్నది. జ్ఞానం, సమాచారంలాగే కళలు కూడా గ్రామాలలో గుడిసెలకు చేరాయి. అజంతా, ఎల్లోరాగుహల శిల్పాలు చూడవచ్చు. రవిశంకర్, గులాం అలీఖాన్ సంగీతం వినవచ్చు. షెక్స్ పియర్ నాటకాలు లండన్లో ప్రదర్శిస్తుంటే తిలకించవచ్చు. ఓవల్ రంగస్థలంలో క్రికెట్ ఆటను ఆనందించవచ్చు. చంఢీఘడ్ భవన సౌందర్యాన్ని, న్యూయార్క్ ఆకాశహర్మ్యాలను తిలకించవచ్చు. ఇంట్లో నుంచి కదలకుండా ప్రపంచంలోని కళలను, వినోదాలను అనుభవించవచ్చు. కళలు, ఆలోచనలను ఆధునిక సాంకేతిక శాస్త్రం మన ఇళ్ళకు తెచ్చి పెట్టింది. అర్థ శతాబ్దం కిందటి వరకూ సాధ్యం కానప్పటికీ, నేడు పౌరుడు ప్రపంచవ్యక్తిగా భావించుకునే స్థితిని కల్పించింది.
- నరిసెట్టి ఇన్నయ్య
ఇకనుంచి “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”
అనే ఈ పుస్తకాన్ని పాఠకులకు సులభంగా అర్థమయ్యే విధంగా
24 విభాగాలుగా అందించడం జరుగుతుంది.
1 comment:
useful information. మీ ప్రయత్నానికి అభినందనలు ఇన్నయ్యగారు.
Post a Comment