సాంకేతిక శాస్త్రం మానవజీవితాన్ని మార్చేస్తుందా?

శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక)
పిల్లలకు అర్థమయేది ఎలా?

1.  సాంకేతిక శాస్త్రం మానవజీవితాన్ని మార్చేస్తుందా?
చాలామంది దృష్టిలో విజ్ఞానం అంటే సాంకేతికశాస్ర్తమే. ఇందులో ఆశ్చర్య పడవలసిందేమీ లేదు. మన జీవితవిధానంలో సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పులు అలాంటివి. విజ్ఞానం లేకుండా ఆధునిక సాంకేతిక శాస్ర్తం ఊహించలేం. అయితే, సాంకేతిక శాస్త్రమే విజ్ఞానం కాదు. విజ్ఞానం చేసే పని జ్ఞానాన్వేషణే. సిద్ధాంతానికీ అన్వయానికీ ఉన్న సంబంధమే విజ్ఞానానికీ, సాంకేతిక శాస్ర్తానికీ ఉంది. విజ్ఞాన సిద్ధాంతాలను ఆచరణలో పెడితేనే సాంకేతిక శాస్త్రం తలెత్తుతుంది. ఉదాహణకు విద్యుదయస్కాంత తరంగాలు విజ్ఞానంలో భాగం. వీటి నియమాలను చూపే రేడియో, సాంకేతిక శాస్త్రంలో భాగం. ఈ ఉదాహరణ వల్ల మామూలు వ్యక్తి దృష్టిలో విజ్ఞానం అంటే సాంకేతికశాస్ర్తం ఎందుకైందో తెలుస్తుంది. సాంకేతిక శాస్త్రంలో మెరుగుదల ప్రభావాలు ఎవరికైనా కనిపిస్తాయి. విజ్ఞానసిద్ధాంతంలో ఉత్తరోత్తరాగాని అది స్పష్టపడలేదు.
ఇలా చెబుతున్నామంటే, మానవజీవితంపై సాంకేతిక శాస్త్రం ప్రభావం అశ్రద్ధ చేయదగిందని గాని, కృత్రిమం అనిగాని అర్థంగాదు. ఆ మాటకొస్తే అది తెచ్చిన మార్పుల ప్రాధాన్యం చాలా ప్రగాఢమైంది. మానవుడి భౌతిక, సాంస్కృతిక రంగంపై ఈ ప్రభావం ఎంతగా ఉన్నదంటే, ఆధునిక సాంకేతిక శాస్త్ర యుగారంభానికి పూర్వం జీవితం ఎలా ఉండేదో ఊహించడానికి చాలా ప్రయత్నం కావాలి. ఈ మార్పులు రెండు విధాలుగా ఉన్నాయి. చాలా మార్పులు మంచికే దోహదం చేశాయి. అశోకుడు, అలెగ్జాండర్, అక్బర్, మొదటి ఎలిజిబెత్ కాలంతో పోల్చి చూస్తే, సాంకేతిక మార్పుల వల్ల మానవజీవితం సంతోషంగానూ, భద్రతతోనూ ఉందనవచ్చు. అయితే కొన్ని మార్పులు మానవస్వేచ్ఛకూ, మానవ ఉనికికీ భంగం కల్పించేవిగా పరిస్థితులను సృష్టించాయి. మంచిచెడుల పట్టికను చూస్తే ఆధునిక సాంకేతికశాస్ర్త ఫలితాలు ఇప్పటివరకూ చెడుకంటే, చాలా మంచినే సమకూర్చి పెట్టినట్లు స్పష్టమౌతుంది.
ఈ నిర్ణయాన్ని కొంత వివరించడం మంచిది. నేడు విజ్ఞానం వల్ల చెడు ఫలితాలు వచ్చాయని వింటున్నాం. యంత్రానికి మానవుడు లొంగిపోయాడంటున్నారు. మానవసంబంధాలలో లలితమైనవన్నీ వ్యాపార లక్షణాలుగా మారాయంటున్నారు. కొద్దిమంది చేతుల్లో అనూహ్యమైన వినాశక శక్తిని అందించిందంటున్నారు. కనక గత మూడువందల సంవత్సరాలలో జీవితాన్ని ఎలా విజ్ఞానం మార్చి వేసిందో సింహావలోకనం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి సింహావలోకనం వల్ల విజ్ఞానం మానవజీవితంపై చూపిన ప్రభావాన్ని తులనాత్మకంగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది. అంతే గాక, సాంకేతికశాస్త్రం కంటే విజ్ఞానం చాలా ప్రభావాన్ని చూపుతుందని గ్రహించవచ్చు.
మానవజీవితంపై విజ్ఞాన ప్రభావం మూడు విధాలుగా ఉంటుంది. 1. సాంకేతికం, 2. సాంస్కృతికం,                             3. తాత్వికం, విజ్ఞానం మానవుడికి ఏం చేసిందో ఈ మూడు కోణాలలో పరిశీలిద్దాం.
Scientific Method by A B Shah( Telugu : by Innaiah Narisetti)

(తదుపరి విషయాలు రెండవ భాగంలో)

No comments:

Post a Comment