సాంస్కృతిక జీవనంపై సైన్స్ ప్రభావం

“శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?” -2
సాంస్కృతిక జీవనంపై సైన్స్ ప్రభావం ......
సత్ఫలితాలు
విజ్ఞానాన్ని అన్వయించినందు వల్ల భౌతిక స్థితిగతులు మెరుగయ్యాయి. సాంస్కృతిక జీవనంపై కూడా బలమైన మార్పు కనబరచింది. బైబిల్, ఖురాన్, రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు వంటి ప్రమాణ గ్రంథాలు కోట్లాది ప్రజలకు, అందుబాటులో ఉండే ధరకు లభించడానికి ముద్రణాయంత్రం తోడ్పడింది. విద్యావ్యాప్తికి అవకాశం కలగడమేగాక ఎవరు కావాలన్నా విజ్ఞానం లభించే స్థితి వచ్చింది, ఈ విధంగా జ్ఞానాన్ని పవిత్రస్థానాల నుంచి మతరహిత రంగానికి తేవడంతో, ఇన్నాళ్ళు కొద్దిమంది అల్ప సంఖ్యాకులు స్వార్థంతో మానవజాతిని మూఢనమ్మకాలలో, మార్మిక స్థితిలో అట్టిపెట్టగా, అది నేడు తొలగే అవకాశం లభించింది. కులం హెచ్చుతగ్గులు పోగొట్టడానికి రైళ్ళు కొంత తోడ్పడ్డాయి. జ్ఞానం, పరస్పర సానుభూతితో మానవజాతి ఒకటిగా పెంపొందించడానికి అచ్చుయంత్రం ఉపకరించింది. లోగడ దేవుడి ఆజ్ఞానుసారం సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయనేవారు.
నేడు అందరికీ అందుబాటులో రేడియో, పుస్తకాలు, పత్రికలు, సినిమాలు ఉండడం వల్ల సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదం కలిగింది. దూరంగా ఉన్న ప్రదేశాలలో ఏమిజరుగుతున్నదో తెలుసుకోవడానికి నేడు ఎవరూ లక్షాధికారి కానక్కరలేదు. హ్యూయన్.సాంగ్ లాగ యాత్రికుడు కానక్కరలేదు. సముద్రంలోతులలో జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరూ గజయీత గాళ్ళుగా మారనక్కరలేదు. సమకాలీన, ప్రాచీన ప్రపంచ విషయాలు గ్రహించడానికి ఎవరూ ఐరోపా, అమెరికా వెళ్ళనక్కరలేదు. ఆరుభాషలు నేర్వనక్కరలేదు. ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలు, సంపద, స్థితిగతులు, కులం, వృత్తితో కూడా నిమిత్తం లేకుండా, పుస్తకాలు ప్రచారసాధనాలతో ఇటువంటి కృషి జరుగుతున్నది. చావు అనేది అందరికీ సమానత్వం ఇచ్చింది. సైన్సు వల్ల సమానత్వం అనేది అందరికీ సాధ్యమని చెబుతున్నది.
జ్ఞానం, సమాచారంలాగే కళలు కూడా గ్రామాలలో గుడిసెలకు చేరాయి. అజంతా, ఎల్లోరాగుహల శిల్పాలు చూడవచ్చు. రవిశంకర్, గులాం అలీఖాన్ సంగీతం వినవచ్చు. షెక్స్ పియర్ నాటకాలు లండన్లో ప్రదర్శిస్తుంటే తిలకించవచ్చు. ఓవల్ రంగస్థలంలో క్రికెట్ ఆటను ఆనందించవచ్చు. చంఢీఘడ్ భవన సౌందర్యాన్ని, న్యూయార్క్ ఆకాశహర్మ్యాలను తిలకించవచ్చు. ఇంట్లో నుంచి కదలకుండా ప్రపంచంలోని కళలను, వినోదాలను అనుభవించవచ్చు. కళలు, ఆలోచనలను ఆధునిక సాంకేతిక శాస్త్రం మన ఇళ్ళకు తెచ్చి పెట్టింది. అర్థ శతాబ్దం కిందటి వరకూ సాధ్యం కానప్పటికీ, నేడు పౌరుడు ప్రపంచవ్యక్తిగా భావించుకునే స్థితిని కల్పించింది.
అపస్వరాలు
ఇంతవరకు ఆధునిక సాంకేతికశాస్త్ర సత్ఫలితాలనే గమనించాం. కాని ఇంకోవైపు కూడా లేకపోలేదు. ఆధునిక సాంకేతిక శాస్త్రం పై విమర్శ చాలా వరకు సరిగాలేని మాట వాస్తవమే. విమర్శకుడు ఎప్పుడూ, ఎన్నడూ లేని స్వర్ణయుగాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. పారిశ్రామిక విప్లవాన్ని కొందరు ఖండిస్తారు. మనిషిని యంత్రంగా మార్చి వేసిందని, పనిలో ఉండే సృష్టి ఆనందాన్ని తీసేసిందని అంటారు. పారిశ్రామిక విప్లవం రాకముందు ఏ సమాజాన్ని చూసినా లక్షలాది ప్రజలు ఆకలితో అలమటించారన్న విషయం విస్మరిస్తున్నారు. ఢక్కా ముఖమల్ నేతపనిలో నిమగ్నులైన పనివారు చిన్నవయస్సులోనే అంధులైన విషయం కూడా మరచిపోయారు. అంత మాత్రాన ఢక్కానేత పని నగిషీతనాన్ని కాదనడం లేదు. ఒక కాలాన్ని నిర్ణియించేటప్పుడు కేవలం ఉద్వేగభావాలతో, కొన్ని లక్షణాలను మాత్రమే స్వీకరించి, కొట్టుకుపోరాదు.
పారిశ్రామిక ఉత్పత్తికి ముందున్న రోజులలోని విమర్శనే, పారిశ్రామిక నాగరికతలోని కొన్ని విషయాలకు అన్వయించవచ్చు. స్వార్థం ప్రబలడం, నైతికవిలువలు పతనం కావడం, కుటుంబం విచ్ఛిన్నం కావడం, యువతరం తిరుగుబాటు ఇటువంటివే. ఒక్క విషయంలో ఆధునిక విమర్శకులు సాంకేతిక శాస్ర్తం గురించి స్పష్టంగా చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక శాస్త్రం ప్రభుత్వాలకు ఇచ్చిన విపరీతశక్తితో పోల్చి చూస్తే, గతంలోని చక్రవర్తులు ఎందుకూ కొరగాని వారనిపిస్తుంది. శాశ్వత సైన్యాభివృద్ధి, రోడ్లు, నీటిరవాణా, వైర్ లెస్ ప్రసారాలు, మరతుపాకులు, సాయుధశకటాలు, జెట్ బాంబర్లు, అణ్వాయుధాలు, పౌరులకు అత్యవసరంగా సరఫరా చేసే నీరు, విద్యుత్ లను కూడా కేంద్రం అదుపులో పెట్టడం, ఆధునిక పద్ధతులలో మనస్సులను మూసబోసినట్లు చేయడం-ఇత్యాదులన్నీ, నిరంకుశత్వా నికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడడానికి వీల్లేకుండా చేశాయి. తిరుగుబాటులు విఫలం అయ్యే స్థితిని కూడా కల్పించింది. హంగరీ, టిబెట్లో జరిగినదాన్ని బట్టి, ఈ శతాబ్దంలోనే ఐరోపాలోని అనేక దేశాలలో ఈ విషయం వాస్తవమని రుజువైంది. పాలకవర్గాలు స్వయంగా కొన్ని మానవ విలువలను విశ్వసిస్తున్నప్పుడు మాత్రమే ప్రజలలోని అసంతృప్తి వైదొలగుతుంది. అటువంటి విలువలను పాలకులు అభిలషించడమనేది వారి సంస్కృతిని బట్టి ఉంటుందేగాని, సాంకేతిక శాస్త్రానికి సంబంధం లేదు. సాంకేతిక శాస్త్రం వల్ల వారు కోరుకునే విలువలు సమర్ధవంతంగా సాధించడానికి తోడ్పడుతుంది. వారి సంస్కృతి మానవత ఉదారతత్వంతో ఉంటే తమపాలనను కాపాడుకునే నిమిత్తం ఒక హద్దును మించి బల ప్రయోగం చేయరు. వారికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. వారి సంస్కృతి పెత్తందారీ తనానికి, సమిష్టి వాదానికి చెందినదై ఉంటే మార్పును హింసాయుత సమాజంలో తేవాలనుకున్నా చాలా కష్టం. రెండో ప్రపంచ యుద్ధానంతరం సాధారణ ఎన్నికలలో మితవాదులు 1945లో ఓడిపోయినప్పుడూ, 1947లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లార్డ్ అట్లీ ప్రభుత్వ ఆక్రమణలను విరమించడం ప్రారంభించినప్పుడూ ఉదార సంస్కృతి లక్షమాలు కనిపించాయి.
1956లో హంగరీలోనూ, 1959లో టిబెట్లోనూ, నాజీ నియంతృత్వం కింద ఐరోపాలోనూ జరిగినవి జ్ఞప్తికి తెచ్చుకుంటే నియంతృత్వ సంస్కృతి లక్షణాలు అర్థమౌతాయి. పెత్తంగారీ సంస్కృతికి తోడ్పడే సాంకేతిక శాస్ర్తం మానవస్వేచ్ఛను నాశనం చేస్తుంది. అసలు మానవజాతినే తుడిచిపెట్టే ప్రమాదమూ లేకపోలేదు. అధికార దాహంతో ఉన్నవాడు చేసినా, శాంతి కోరుతున్నప్పటికీ భయపడి ప్రయోగించిన పాలకుడు చేసినా సరే, అణ్వస్త్రయుద్ధ ఫలితం ఒక్కటే. మానవజాతి నాశనం అవుతుంది. మానవుడి సాంస్కృతిక పరిణామాభివృద్ధి వల్ల సాంకేతిక శాస్త్రాన్ని అదుపు చేయడం అవసరం. అంతర్గతంగా ఉన్న పెత్తందారీతనం, మూఢనమ్మకాల నుంచి మానవుడు విమోచన పొందాలి. తన విధికి తానే నిర్ణేత అని మానవుడు భావించడమే గాక, ఈ విషయమై స్పష్టత అవసరం. ఏ సిద్ధాంతమైనా ఆత్మ హత్య సదృశంగా పరిణమించరాదు.
ఇక్కడే విజ్ఞానం యొక్క విమోచనా పాత్ర నిర్వహించాలి. మానవుడిని మానవుడుగా పెంపొందేటట్లు విజ్ఞానం తోడ్పడుతుంది. మానవుడు కేవలం మాంసపు ముద్దకాదు. అతడు ఈర్ష్య అసూయల నుంచి, మూఢనమ్మకాల నుంచి బయటపడాలి, సమస్యలను నిష్పాక్షికంగా చూడడానికీ, వాటి పరిష్కారం ఫలప్రదంగా చేయడానికీ తన ఆలోచనకు తగ్గట్లు హుందాగా ప్రవర్తించడానికీ, నైతికజీవిగా ఉండడానికీ విజ్ఞానం తోడ్పడుతుంది. విశ్వం, అంటే ఏమిటో తెలుసుకోవడానికీ, తనను తాను అర్థం చేసుకోవడానికి సైన్స్ ఉపకరిస్తుంది. గత మూడు వందల సంవత్సరాలలో ప్రకృతి రహస్యాలను తెలుసుకోజాలనప్పుడు ఇదంతా అసంభవం. విజ్ఞానం మానవుడి జీవితాన్ని, విశ్వాసాన్ని మార్చి వేసిన తీరు చాలా ప్రధానమైంది. సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పుకంటే ఇది చాలా గణనీయమైంది.
 రచన                                                                                         తెలుగు సేత
ఎ. బి. షా                                                                   నరిసెట్టి ఇన్నయ్య

1 comment:

anrd said...సర్ ! మీ వ్యాసంలోని కొన్ని విషయాల గురించి నా అభిప్రాయాలను రాయాలనిపించి రాస్తున్నాను. దయచేసి అపార్ధం చేసుకోవద్దండి.
.....................

* ఆధునిక విజ్ఞానం వల్ల లాభాలూ ఉన్నాయి. నష్టాలూ ఉన్నాయి.

* ఆధునిక విజ్ఞానం ఎంతో పెరిగింది, నిజమే, కానీ దానివల్ల ప్రపంచంలోని పేదరికం పోలేదు. నిరుద్యోగం పెరగటమే కానీ తగ్గటం లేదు.

* గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వంటి సమస్యలూ పెరిగాయి.

* దేశాల మధ్య సైబర్ నేరాలు పెరిగితే, ప్రపంచమే సమస్యల వలయంలో చిక్కుకుపోతుందట.

* ఆధునిక విజ్ఞానం వల్ల, ప్రపంచం లోని ఎన్నో విషయయాలను , ప్రజలు తాము ఏమీ కష్టపడకుండానే , తెలుసుకోగలుగుతున్నారు. అయితే,

* టీవీలు, ఇంటర్నెట్ వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నమాట నిజమే కానీ, ప్రజలు టీవీలు, నెట్ లు ముందు కూర్చుని ప్రపంచం లోని వింతలు, వినోదాలూ చూస్తూ సమాజంలోని సమస్యలను పట్టించుకోవటం లేదు.

* పారిశ్రామిక విప్లవం రాకముందు ఏ సమాజాన్ని చూసినా లక్షలాది ప్రజలు ఆకలితో అలమటించారని మీరు వ్రాసారు.

* కానీ , పారిశ్రామిక విప్లవం రాకముందు విదేశాల్లో సంగతులు ఎలా ఉన్నాయో కానీ , పారిశ్రామిక విప్లవం రాక ముందు కూడా భారత దేశం సిరిసంపదలతో విలసిల్లేది. ఇక్కడి సంపదను చూసే కదా విదేశీయులు ఇక్కడికి వచ్చారు.

*ఢక్కా ముఖమల్ నేతపని అనేది భారతదేశానికి సంబందించిన కళ కాదనుకుంటున్నాను.

*అయినా, ఈ రోజుల్లో కూడా ఎన్నో రసాయనిక పరిశ్రమలు వంటి కర్మాగారాల్లో పనిచేసేవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

* పంజాబ్ పొలాలలో పంటలకు పురుగుమందులు కొట్టిన వాళ్ళలో చాలామందికి కాన్సర్ వంటి జబ్బులు వచ్చాయట.

* పారిశ్రామిక విప్లవం వచ్చిన తరువాత, ప్రపంచంలో పెరిగిపోయిన వాతావరణకాలుష్యం వల్ల ఎన్నో పక్షులు, జంతువుల జాతులు అంతరించాయని ఈ మధ్య జరిగిన జీవవైవిధ్య సదస్సులో శాస్త్రవేత్తలే చెప్పటం జరిగింది.

* ఆధునిక విజ్ఞానం వల్ల లాభాలూ ఉన్నాయి, నష్టాలూ ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అవసరం అయినంత మేరకు మాత్రమే ఉపయోగించుకుంటే మంచిది అనిపిస్తోందండి.

Post a Comment