మరణించిన తరువాత ? After life what?









మనిషి చనిపోయిన తరువాత ఏమౌతుంది ? పునర్జన్మ వుంటుందా ? స్వర్గానికి నరకానికి పోతారంటారు. ఏది పోతుంది ?



ఆత్మ అనేది మరణానంతరం స్వర్గానికి లేదా నరకానికి వెడుతుందంటారు.



ప్రపంచంలో అన్ని కాలాల్లో యించుమించు అన్ని మతాలు మరణానంతరం గురించి నమ్మకాలు పెట్టాయి. కొన్ని మతాలు పాపం చేసిన వారు నరకానికి పోతారన్నాయి. మరికొన్ని మతాలు పుణ్యం చేసిన వారు స్వర్గానికి చేరుకుంటారన్నారు. స్వర్గ నరకాలు అంటే ఏమిటి? అవి అసలు ఉన్నాయా? ఆ విషయం వేరే చర్చించవచ్చు. ముందు ఆత్మ సంగతి తేల్చాలి.



మనిషి శరీరంలో మెదడు అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. మనిషి మరణించడం అంటే మెదడు కూడా మరణించడమే. మన శరీరం, అందులో ముఖ్యమైన మెదడు గురించి, నిరంతర శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. ఇప్పటి వరకు తెలిసిన దానినిబట్టి ప్రొటీన్లతో కూడిన శరీరం మనది. వాటి తీరుతెన్నులు పెద్ద జీవాణువుల సంకేతాల మయం (డి.ఎన్.ఎ.) మన మెదడులో యిమిడివున్న జ్ఞాపకాలు సూక్ష్మ జీవకణాల వలన పనిచేస్తాయి. వాటిని న్యూరాన్.లు అంటారు. న్యూరాన్ల మధ్య సంబంధాలు అత్యంత క్లిష్టమైనవి. శరీరం అందులోని మెదడు చనిపోయినప్పుడు న్యూరాన్ లు, డి ఎన్ ఎ అన్నీ కూడా చనిపోతాయి.



అంటే శరీరం లేకుంటే మెదడు వుండదు. మెదడు లేకుంటే జ్ఞాపకాలు వుండవు. మనిషి చైతన్యం, ఆలోచనలు, కలలు, అనుభూతులు, స్మృతులు అన్నీ మెదడుకు చెందినవే. మెదడు యావత్తు చేసే పనినే చైతన్యత అని, మానసికం అనీ అంటారు. మెదడు లేకుండా స్వతంత్రంగా చైతన్యతకు, మనస్సుకు అవకాశం లేదు.



ఆ దశలో నమ్మకస్తులు, మతాలు ఆత్మ అనే భావాన్ని వాడుకలోకి తెచ్చాయి. శరీరం అందులోని మెదడు మరణించినా, ఆత్మ వుంటుందని నమ్మారు. స్వర్గానికి, నరకానికి పోయేది యీ ఆత్మ మాత్రమే. పునర్జన్మ ఎత్తేది కూడా ఆత్మ అని నమ్మారు.



అన్ని మతాలకు ఆత్మపై విశ్వాసం మూలం. అది నమ్మితే గాని, ముందుకు సాగడానికి వీల్లేదు. ఒకసారి నమ్మిస్తే, బోలెడంత మతవ్యాపారం జరపవచ్చు. మతాలలోని పురోహిత వర్గాలు చేస్తున్న పని యిదే.



నమ్మకాలకు మెదడులో మూలస్థానం నొసలు భాగంలోని మెదడులో వున్నట్లు కనుగొన్నారు (Anterior Paratingulate Cortex).



విశ్వంలో జీవశక్తి వున్నదని, అందులో భాగమే మన శరీరంలో ఆత్మగా వుంటుందని నమ్మమంటున్నారు. ఇంద్రియాతీతంగా శక్తుల్ని గమనించవచ్చని చెప్పారు. జోసెస్ రైన్ వంటివారు జీవితమంతా శ్రమపడి, చివరకు ఇంద్రియాతీత శక్తి విషయంలో విఫలమయ్యారు.



శాస్త్రీయ పరిశీలన వలన అన్ని నమ్మకాలకు మూలం మెదడు అనేది కచ్చితంగా నిర్ధారణ అయింది.



చిన్నతనంలోనే నమ్మకాలు నూరిపోయడం వలన అవి నిజాలని, వాటిని పాటించడం పరిపాటి అయింది. స్వర్గంలో అమ్మాయిలను అనుభవించడం కూడా నిజమేనని నమ్ముతున్నారు. ఇవన్నీ మతపరంగా వచ్చినవే.



సైన్స్ చదివినా, నమ్మకాలను పోగొట్టుకోవడం లేదు. రెండిటినీ వేరు చేసి, దేనికదే పాటిస్తున్నారు. అదే పెద్ద చిక్కు. ముస్లింల మదరసాలలో, క్రైస్తవుల సండే పాఠశాలల్లో, బౌద్ధుల ఆరామాలలో యిదే జరుగుతున్నది. మిగిలిన మతాలు అంతే. ఆ నమ్మకాలకోసం ప్రాణత్యాగాలకు, హింసకు అరాచకత్వానికి దిగుతున్నారు.



రుజువు, ఆధారం శాస్త్రీయంగా కావాలంటే పునర్జన్మ ఆత్మ, స్వర్గ నరకాలు నిలబడవు. దేవుడి సంగతి సరేసరి. ఆ పేరిట మనుషులు రాసిన పవిత్ర గ్రంథాలలో పవిత్రత ఏమీ లేదు. వున్నదల్లా మూర్ఖ నమ్మకమే. దాని చుట్టూ క్రతువులు ఆచారాలు, శిక్షలు, ఎన్నో అల్లారు.



మెదడులో ఏ భాగం దేనికి పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు. కొన్నిటిని స్పష్టంగా కనుగొన్నారు. మరికొన్ని యింకా పరిశోధనలో వున్నాయి. మెదడుకు దెబ్బ తగిలినప్పుడు ఆ భాగం ప్రభావితం చేసే శరీర భాగం దెబ్బ తినడం చూచారు. చూపుకు, వినడానికి, వాసన గ్రహించడానికి, స్పర్శకు ఏ భాగం మెదడులో అజమాయిషీ చేస్తున్నదో గుర్తించారు. శస్త్ర చికిత్సలు వాటి ఆధారంగా చేయగలుగుతున్నారు. కాని ఇదంతా అభివృద్ధి చెందుతున్న సైన్స్. ఇంకా ఎంతో గ్రహించవలసి వున్నది. ఒక విధంగా యిది నిరంతర కృషి.



మెదడులో కోట్లాది న్యూరాన్లు వుండగా, నమ్మకాలకు సంబంధించిన న్యూరాన్లు ఒక భాగంలో వున్నాయి. అవే మన విశ్వాసాలకు స్థానంగా పనిచేస్తున్నాయి. మనలో నమ్మకాలు ఏర్పడిన తరువాత, వాటిని గుడ్డిగా అనుసరించడం అలవాటుగా మారింది.



న్యూరాన్లు కోట్లాది వున్నాయన్నాం గదా. అవి అతి సాధారణంగా అనిపించినా, చాలా జటిలమైనవి కూడా. మెదడులో యివి పనిచేసే తీరు అంతా ఎలక్ట్రో మాగ్నటిక్ – విద్యుదయస్కాంత పద్ధతిలో సాగుతుంటుంది. అవన్నీ అవగాహన చేసుకోవడం క్రమంగా జరుగుతున్నది.



ఆశ్చర్యకర విషయం ఏమంటే సాధారణంగా నమ్మే వాటిని గురించి ఆధారాలు, సాక్ష్యాలు వెతకరు. నమ్మేస్తారు అంతే. వాటికి కారణాలు వెతికి సమర్థించుకుంటారు కూడా. కాని వాటికి భిన్నంగా వ్యతిరేకంగా శాస్త్రీయ పద్ధతి చేరితే, ఒక పట్టాన ఒప్పుకోరు. అదే నమ్మకాలకు – మత నమ్మకాలకు – ఆయువుపట్టు.



మతపరంగా ఆలోచిస్తే ప్రపంచంలో విషయాలు అర్థంకావు. జనం ఏదీ తెలుసుకోలేరు. జనానికి జీవితంలో ఉపయోగపడేవన్నీ సైన్స్ ఆలోచన ద్వారా వస్తున్నవే. ప్రార్థనలు చేస్తే అవిరావు.



నమ్మకాలకు, మత విశ్వాసాలకు శాస్త్రీయ (సైంటిఫిక్) ఆధారాలు చూపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకని? సైన్స్ క్రమపద్ధతిలో పురోగమిస్తుంది గనుక. దాని ఉపయోగాలు స్పష్టం గనుక. కాని ఎంత తిప్పలు పడ్డా సైన్స్ ద్వారా మత విశ్వాసాలను రుజువు చేయలేకపోతున్నారు. అప్పుడప్పుడూ చేసిన అలాంటి ప్రయత్నాలు చతికిల బడుతూనే వున్నాయి. దేవుడు, ఆత్మ, స్వర్గనరకాలు, పునర్జన్మ, అవతారాలు అలాంటివన్నీ సైన్స్ ఆధారంగా నిలబడవు. గుడ్డిగా నమ్మితేనే నిలుస్తాయి. అందుకే సైన్స్ ను దూరం పెట్టి నమ్మకాలు పాటిస్తారు.



సైంటిస్టులు ఎక్కడైనా చెప్పిన మాటల్ని నమ్మకాలకు ఆధారంగా చూపబోతారు. సైన్స్ లో పెత్తందారీతనానికి, అధికారిక ప్రకటనలకు తావులేదు. ఎంత పెద్దవాడు చెప్పినా, ఆధారాలు చూపడం తప్పనిసరి.



మత విశ్వాసాలకు సైంటిఫిక్ ఆధారాలు యిచ్చే ప్రయత్నం తెలివితక్కువ తనానికి పరాకాష్ఠ. సైన్స్, మూల సూత్రం స్వయంగా పరిశీలించుకుంటూ సరిదిద్దుకుంటూ, పోవడం తప్పులు చేస్తే తప్పు జరిగిందని ఒప్పుకొని సవరించుకోవడంలోనే సైన్స్ పురోగమిస్తున్నది. సైన్స్.కు పవిత్ర (హోలీ) గ్రంథాలుండవు. పురోహిత పెత్తందారీ దళారులు వుండరు. ఆధారాలు, రుజువులు వుంటాయి. అందరికీ అవి సమానం ప్రపంచంలో ఎవరైనా ప్రయోగించి, విషయ నిర్ధారణ చేయవచ్చు. అవేవీ మతాలలో వుండవు.



న్యూటన్ మూఢనమ్మకాలు



సైన్స్ లోకంలో ఐజక్ న్యూటన్ గొప్ప సైంటిస్ట్. ఆయన కనుగొన్న గురుత్వాకర్షణ శక్తి ఆధారాలకు, రుజువులకు నిలచింది. అవి ఎక్కడ ఎవరైనా చేయవచ్చు.



అలాంటి గొప్ప సైంటిస్ట్ న్యూటన్.కు చాలా మూఢనమ్మకాలుండేవి. వాటిని ఎవరూ నమ్మలేదు. పట్టించుకోలేదు. ఎందుకని? అవి ఆధారాలు లేని వ్యక్తిగత విశ్వాసాలు గనుక అలాగే ఎడిసన్ విషయంలోనూ జరిగింది. ఈ సంగతి గ్రహిస్తే మనం గ్రహించవలసింది. రుజువులకు నిలిచే విషయాలే తప్ప, సైంటిస్ట్ ప్రకటనలు కాదు.



అలాగే సైన్స్ లో ప్రాంతీయతలు, దేశాభిమానాలు వుండవు. ఎక్కడైనా ఎవరైనా సైన్స్ ఆధారాలకు పరీక్ష పెట్టవచ్చు. రుజువు చేయవచ్చు. హైదరాబాద్ సైన్స్, అమెరికా సైన్స్ వుండదు. అది విశ్వ వ్యాప్తం ఇది గ్రహించాలి. పిల్లలకు ప్రశ్నించడం ప్రోత్సహిస్తే, మూఢనమ్మకాలు దూరం అవుతాయి.



- ఎన్. ఇన్నయ్య.

1 comment:

voleti said...

నువ్వు నీ గురించి కాక ఇతరుల గురించి ఆలోచించినంత కాలం ఆత్మ దర్శనం అవదు.. నీ గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఆత్మావలోకనం అవుతుంది...

Post a Comment