నేను కలిసిన ముఖ్యమంత్రులు - టంగుటూరి ప్రకాశం పంతులు

ఇటీవల మిత్రులు కొందరు ముఖ్యమంత్రులతో నాకు ఉన్న పరిచయాలు, అనుభవాలు దష్ట్యా ఆ విషయాలు కొన్ని రాయమని కోరారు. అంత వరకూ అటువంటి ఆలోచన రాగపోయినా వారి ప్రోత్సాహం వలన యధాశక్తి జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పాలని ప్రయత్నం మొదలు పెట్టాను.

వెనక్కు తిరిగి చూచుకుంటే 17 మంది ముఖ్యమంత్రులతో నాకు పరిచయముందా అని నేనే ఆశ్చర్యపడ్డాను. ఈ రచనలో ఎన్నో స్పురణకు రాకపోవచ్చు. కచ్చితంగా తేదీలు కూడా చెప్పలేక పోవచ్చు. కానీ అనుభవాలను మాత్రం చెప్పి అవి చరిత్రలో భాగంగా కాక, వ్యక్తిగత జీవితంలో మధురాను భూతులుగానే చూడాలని కోరుకున్నాను.

1. టంగుటూరి ప్రకాశం పంతులు (1872-1957)



రాజకీయాల్లో ధైర్యంగా పోరాడి, సంపాదన దేశ సేవలో ఖర్చు పెట్టి, తనది అని చూచుకోకుండా ప్రజల మధ్య పర్యటించి ఉద్యమాలు నిర్విరామంగా సాగించిన ధీశాలి. కనుక ఆయన తప్పులు చేసినా, అప్పులు చేసినా జనం అభ్యంతర పెట్టలేదు. పార్టీలు మార్చినా అది ఒక పెద్ద తప్పుగా పరిగణించలేదు. రాష్ట్ర స్థాయిలోనే కాక దేశ స్థాయిలో నాయకుడుగా మోతీలాల్ నెహ్రూ సరసన స్వరాజ్య పార్టీ స్థాయిలో రాజకీయ దురంధరుడిగా కేంద్ర శాసనసభలో తన వాణిని వినిపించిన నాయకుడు ఆయన. మదన్ మోహన్ మాలవ్య పెట్టిన నేషనల్ పార్టీలో చేరి పనిచేశారు. మద్రాసు నుండి స్వరాజ్య దిన పత్రిక పెట్టి ఇంగ్లీషులోను, తెలుగులోనూ నానా తిప్పలు పడి నడిపించిన టంగుటూరి ప్రకాశం సమయానికి జీతాలు ఇవ్వలేకపోయినా సిబ్బంది గొణగలేదు. స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నుడైనందున తీరిక లేక తాను రాసిన విషయాన్ని ఉప సంపాదకులకు ఇచ్చి స్టైల్ (శైలి) పెట్టమనేవారట. ఆయన సేవల కృషి ఫలితం అదంతా. ముఠా రాజకీయాలలో మునిగి తేలినా, పదవులు వచ్చినప్పుడు సంపాయించుకోకుండా ప్రజల కోసం సంస్కరణలు తలపెట్టి నిజమైన ప్రజా సేవకుడిగా మార్గ దర్శకత్వం చూపాడు. రాజగోపాలాచారి వంటి వ్యక్తులతో తారసిల్లి అటు శాసన సభలోనూ, ఇటు బయటా పోరాడారు. ముఖ్యమంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఫిర్కా స్థాయిలో సంస్కరణలు తలపెట్టడం, ఖాదీ ఉద్యమానికి అనుకూలంగా నూలు మిల్లులను రద్దు చేయటం వంటివి ఆనాడు ప్రకాశం మాత్రమే చేయగలిగాడు. కమ్యూనిస్టులపై తీవ్ర చర్యలు తీసుకోవడం, వారిపై మలబారు పోలీసులను పిలిపించి దమనకాండ జరిపించడం కూడా ప్రకాశం రాజకీయ జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. రాజగోపాలాచారి ఆయనకు వ్యతిరేకి.

మద్రాసును ఆంధ్రలో భాగం చేయాలని ఎంతో తిప్పలు పడి టంగుటూరి ప్రకాశం విఫలమయ్యారు. ఆంధ్రులకు చెందాల్సిన నగరం అని నిరూపించదలచి తొలి ఎన్నికలలో మద్రాసులో బీచ్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినా ఎన్నికల జైత్రయాత్ర జరిపి ఆంధ్రలో పర్యటించి వరుసగా కొమ్ములు తిరిగిన ఆంధ్ర కాంగ్రెస్ మంత్రులను – కల్లూరి చంద్రమౌళి మొదలు, కళా వెంకట్రావు వరకు మట్టి కరిపించారు. అటువంటి చరిత్రగల ప్రకాశం కమ్యూనిస్టులతో కలిసి తొలి ముఖ్యమంత్రి కావటానికి ప్రయత్నించి కుదరక, కాంగ్రెస్ తో చేతులు కలిపి సఫలమయ్యారు. ఆయనకు సన్నిహితులుగా తెన్నేటి విశ్వనాథం చివరి వరకు నిలిచారు.

నేనెలా తొలుత కలిశాను?

నేను కర్నూలులో తొలుత ప్రకాశం పంతులుగారిని విద్యార్థి దశలో కలిసినప్పుడు చాలా సంతోషించాను. నేను గుంటూరు ఏ.సి. కాలేజీలో చదువుతుండగా రెండు మూడు పర్యాయాలు కర్నూలు రాజధానికి వెళ్ళటం. మరి కొన్ని సార్లు గుంటూరులోనే ప్రకాశం పంతులుగారిని కలిసే అవకాశం ఏర్పడింది. అదొక గమ్మత్తయిన సందర్భం. గుంటూరులో లచ్చన్న అనుచరులు, వడ్డెంగుంట వెంకటేశ్వర్లు, మాదాల పెద్ద తిమ్మయ్య, రిక్షా యూనియన్ నాయకులుగా ఉన్నారు. అప్పుడు తొక్కుడు రిక్షాలు ఉండేవి. రిక్షాలో ఒక్కరే ఎక్కాలని నియమం ఉండేది. విజయనగరంలో ఇద్దరిని ఎక్కనిస్తున్నట్లు తెలిసి అలాగే తమను కూడా అనుమతించాలని రాష్ట్ర ఐ.జి.పి. నంబియార్ ను కోరాలనుకున్నారు. ఆయనకు తెలుగు రాదని, ఇంగ్లీషులో మాట్లాడే వారు కావాలని నన్ను వెంట పెట్టుకుని కర్నూలు వెళ్ళారు. అయితే నాకు వచ్చిన ఇంగ్లీషు కూడా అప్పట్లో అంతంత మాత్రమే. కర్నూలు పోలీసు డేరాలలో ఉంటున్న నంబియార్ దగ్గరకు వెళ్ళాము. నేను వచ్చీ రాని ఇంగ్లీషులో తడబడుతూ విషయం చెబుతుంటే, నంబియార్ గ్రహించి, ఆయనే స్వయంగా తెలుగులో మాట్లాడారు. హమ్మయ్య అనుకుని, పిటిషన్ ఇచ్చి వచ్చిన పని చెప్పాము. ఆయన ఇద్దరిని రిక్షాలో ఎక్కడానికి అనుమతించారు. వచ్చిన పని సఫలమైంది గనక నాయకులను చూచి వెళదాం అనుకున్నాం. ఆ విధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం గారి బంగళాకు వెళ్ళాము. ఆనాడు సెక్యూరిటీ ఆర్భాటం అంతగా లేదు. ఎవరినైనా త్వరగా కలుసుకోవడానికి వీలుండేది. ప్రకాశం గారిని కలిసి నమస్కరించి, కూర్చున్నాము. అప్పటికే ఆయన కురువృద్ధుడైపోయాడు. కదలిక సన్నగిల్లింది. చూపు తగ్గింది. జ్ఞాపకశక్తి కూడా మందగించింది. చేతులలో కొద్దిగా వణుకు వచ్చింది. మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారు. ఆయన పట్ల గౌరవంతో, వీరారాధనతో వెళ్ళాం గనక, పలకరించిందే చాలని తృప్తి పడ్డాము. ఆయన కొంచెం సేపు అదీ ఇదీ మాట్లాడి గుంటూరు సంగతులు కూడా అడిగారు. తొలి కలయిక పరిచయం ఆ విధంగా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మరో రెండు సార్లు కర్నూలులో లచ్చన్న గారి వెంట ప్రకాశం గారిని కలియగలిగాను.

నేను చిన్నవాడినని భావించకుండా ఆప్యాయంగా పలకరించి కూర్చో బెట్టిన ప్రకాశం గారి సన్నిధి మరపురానిది. అయితే నేను గౌతులచ్చన్న వెంట మరోసారి వెళ్లటం వలన అటువంటి ఆదరణ లభించింది. గౌతు లచ్చన్నగారు మా కుటుంబానికి సన్నిహితులు. రంగాగారి అనుచరులుగా మా తండ్రి రాజయ్య, మా అన్న విజయరాజకుమార్ ఉండటం వలన లచ్చన్న గారు తరచు మా యింటికి వచ్చేవారు. ఆ విధంగా నేను దగ్గరయ్యాను. అలాగే ఓబుల రెడ్డి, నీరుకొండ రామారావు గార్లతోనూ దగ్గర అయ్యాను. అయితే నాకు రంగా గారి పార్టీ రాజకీయాలతో సంబంధం లేదు. నాకున్న దల్లా వ్యక్తిగత అభిమానం మాత్రమే. నేను పార్టీ రాజకీయాలలో ఎన్నడూ లేను. ఉత్తరోత్తర రంగాగారికి కొన్నేళ్ళు పి.ఎ.గా ఉన్నప్పుడు కూడా పార్టీ రాజకీయాలకి దూరంగానే పనిచేయగలిగాను. అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే తీరుగా “ఏరా అబ్బాయ్, ఎప్పుడొచ్చావ్” అని పలకరించిన తీరులో ఆప్యాయత కలబరిచింది. ఆ తరువాత గుంటూరులో ఆయన మునిసిపల్ ట్రావెలర్స్ బంగళాలో విడిది చేసినప్పుడు యధేచ్చగా కలవ గలిగాను. అప్పటికి ఆయనకు ముఖ్యమంత్రి పదవి పోయింది. మరోసారి గౌతులచ్చన్న గారితో కలసి బంగళాకు వెళ్లి కలిశాను. నేను కేవలం వెంట వెళ్లిన విద్యార్థిని మాత్రమే. అయినా కర్నూలులో కలిసిన జ్ఞాపకాలు ఆయనకు ఉండటం నన్ను ఆశ్చర్య పరిచింది. “ఏరా! బాగున్నావా...?” అని అంటే, నన్ను జీవితంలో ఏరా అని పిలిచిన వ్యక్తులు అరుదు. అయినా ప్రకాశం గారు అలా పిలిస్తే ఆప్యాయతే కనిపించింది. ఆయన లచ్చన్నతో మాట్లాడుతూ “లచ్చన్నా, ముఖ్యమంత్రి పదవికి నా పేరు చెప్పు” అన్నారు. లచ్చన్న నమస్కారం పెట్టి బయటపడ్డారు. ప్రకాశం గారి దగ్గర జనం లేరు. అయితే అప్పటికే ఆయనలో తోంగిచూస్తున్న వార్థక్యం రాజకీయాలకు ఇక పనికిరాడనిపించింది. బయటకు వచ్చిన లచ్చన్న తన వారితో, పంతులుగారికి ఈ వయస్సులోనూ ఇంకా ముఖ్యమంత్రి కావాలని ఉంది అన్నారు.

మరొకసారి గుంటూరులోనే ట్రావెలర్స్ బంగళాలో ప్రకాశం గారిని చూచాను. ఏనుగుల వెంకటరామయ్య, ఎస్.వి. పంతులు, నేను వెళ్ళాము. గది బయట ఒక బుట్టెడు బత్తాయి కాయలు పెట్టి ఉన్నాయి. కుర్చీలో నేతి చెలపతి కూర్చోని బత్తాయి కాయలు వలుచుకుని తింటున్నాడు. లోనకు వెళ్ళిన తరువాత వెంకటరామయ్య నమస్కారం పెట్టి, పంతులుగారూ, మీ అభిమానులు మీ కోసం బత్తాయి కాయలు ఇచ్చి వెళ్ళితే బయట నేతి చలపతి ఎద్దుతిన్నట్లు తింటున్నాడు అని ఎద్దేవగా చెప్పారు. ప్రకాశం గారు “ఓరే చలపతీ బత్తాయి కాయలన్నీ నువ్వే తినేస్తున్నావురా?” అన్నారు. లేదండీ, వచ్చిన వారికి పంచుతూనే ఉన్నాను అని చెప్పాడు. మేము నవ్వుకుని బయటకు వచ్చాము. వెంకటరామయ్యతో నేను అదేమిటయ్యా అంత మోటుగా మాట్లాడావు అని అడిగితే నేతి చలపతి విషయంలో అదేమీ మోటు కాదులే అన్నారు. అప్పట్లో వెంకటరామయ్య గుంటూరులో భారత సేవక్ సమాజ్ ఆఫీసులో పనిచేస్తుండేవారు. పరుచూరి వీరయ్య ఆయనకు బాస్. వెంకటరామయ్య హాస్య ప్రియుడు. చతురోక్తులకు పెట్టింది పేరు. ప్రకాశం గారంటే వీరాభిమానం ఉండేది. ఆ విధంగానే కలిసి వెళ్ళాము.

గుండె చూపింది గాంధీగారికి – సిపాయి తుపాకీకి గాదు

ప్రకాశం గారు ఆ తరువాత కొద్ది రోజులకే చనిపోయారు. చివరి వరకూ కారులో ప్రయాణాలు చేస్తూ వచ్చారు. నేను ఆ తరువాత ప్రకాశం గారి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఆయన రచనలు, వ్యాసాలు చదివాను. రాజకీయాలలో పదవులలో ఆయన చేసిన పనులను నిశితంగా పరిశీలించాను. ప్రకాశం గారు తన స్వీయ చరిత్ర రాసుకున్నారు. అందులో 1927లో సైమన్ కమీషన్ మద్రాసు వచ్చినప్పుడు కాల్పులు జరగటం, ప్రకాశం గారు పోలీసులకు గుండె చూపెట్టి కాల్చుకోమన్నాడని చాలా మంది చెప్పుకునేవారు. అది ఆయన ధైర్యానికి గీటురాయిగా పేర్కొన్నారు. ప్రకాశం గారు ఆ విషయాన్ని విపులంగా స్వీయచరిత్రలో రాశారు. కాల్పులలో చనిపోయిన వ్యక్తిని చూడటానికి వెళ్ళినప్పుడు ఒక పోలీసు ఆపటం, పక్కనున్న వారు ఆయన ప్రకాశం పంతులు అని చెప్పటం అప్పుడు పోలీసులు అనుమతివ్వటం జరిగింది. ఇది ప్రకాశం గారు స్వయంగా రాసిన విషయం. కానీ ప్రజలలో ఆ విషయం ఆ విధంగా కాక ఒక వదంతిగా, కట్టుకథగా అల్లుకుపోయింది. ఆయన చెప్పిన విషయాన్నే యధావిధిగా ఉదహరించి 1982లో ఈనాడు దిన పత్రికలో నేను ఒక వ్యాసం రాస్తే ప్రకాశం వీరాభిమానులు నాపై విరుచుకుపడ్డారు. అప్పట్లో ఎడిటర్ గా ఉన్న గజ్జల మల్లారెడ్డి ఆ విషయం చెప్పి వేలాది ఉత్తరాలు తమ కార్యాలయానికి వచ్చినట్లు తెలియజేశారు.

రాజకీయాలలో ప్రకాశం గారు ఆచార్య రంగాతో కలియటం, విభేదించటం, రాష్ట్ర రాజకీయాల్లో చాలా మలుపులు తిప్పింది. అలాగే పట్టాభి సీతారామయ్యతో పడక రాజకీయాన్ని నడిపిన ప్రకాశం కాంగ్రెస్ కు విభిన్న నాయకత్వం చూపారు. ఏమైనా టంగుటూరి ప్రకాశం గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానూ, ఆ తరువాత చిరుపరిచయం నా అనుభవాలలో చిరస్మరణీయమైనది. ఆనాడు ప్రకాశం గారంటే ఒక రాజకీయ హీరోగా, ధైర్యానికి మారు పేరుగా ఉండేది. చివరి రోజులలో ఆయన కుమారుడు హనుమంతరావు వలన కొంత చెడు పేరు వచ్చిందని వినికిడి. ప్రకాశం గారికి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చినా రాజకీయాలలో రిటైర్ కాకుండా చనిపోయిన నాయకుడాయన.

మహాత్మా గాంధీ తిరుగులేని నాయకుడుగా ఉన్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అనంతరం జైలు నుండి బయటకు వచ్చిన ప్రకాశం జనం దగ్గర డబ్బు వసూలు చేసి లెక్కలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకున్నాడని అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి తగడని అన్నారు. ప్రకాశం ధీరోదాత్తంగా గాంధీని ఎదిరించి, ప్రజా నాయకుడుగా కామరాజు నాడార్ తో సహకరించి మదరాసు ముఖ్యమంత్రి అయ్యాడు. రాజగోపాలాచారి కూడా గాంధీజీతో చేతులు కలిపి ప్రకాశాన్ని ఎదిరించాడు. వాటన్నిటినీ తట్టుకుని తిరుగులేని ప్రజానాయకుడుగా మదరాసు ముఖ్యమంత్రిగా ప్రకాశాం తన సత్తా చూపాడు. ఆ విధంగా గాంధీజీకి గుండె చూపిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం.

ముఖ్యమంత్రులతో నేను కలిసిన పరిచయం చేసుకున్న తొలి వ్యక్తి టంగుటూరి ప్రకాశం కాగా అది జీవితంలో మంచి అనుభూతి. అతి కొద్ది పర్యాయాలు అతి స్వల్ప పరిచయంతోనే నేను సరిపెట్టుకోవలసి వచ్చింది. నేను తొలిసారి కలిసేటప్పటికే ప్రకాశం గారు 80వ పడిలోకి రావడం ఆ తరాత కొద్ది సంవత్సరాలకే ఆయన చనిపోవటం ఇందుకు కారణం.

4 comments:

Alapati Ramesh Babu said...

sir, good work keep it up. you remember one more time Sri Prakasam Garu .He is one and only dare and intimasiy to say every one "Ra Ra" . Some body think that is the head strong of Prakasam but not like that he thinks that 1) capability 2) every one is his own.

Srini Vemula said...

మీ అనుభావాలు చాలా బావున్నాయి ఇన్నయ్య గారు!! మీరు మాకు మార్గదర్శకులు మరియు ఫై తరము తో వారధి! సైట్ చాల బావుంది!

Srini Vemula said...

మీ అనుభావాలు చాలా బావున్నాయి ఇన్నయ్య గారు!! మీరు మాకు మార్గదర్శకులు మరియు ఫై తరము తో వారధి! సైట్ చాల బావుంది!

Rajendra Devarapalli said...

ప్రకాశం పంతులుగారి జీవితచరిత్రను వీలున్నప్పుడల్లా చదువుతుండే నాకు తోచిన కఠోరసత్యమేమంటే ఆయనకు చివరి వరకూ తోడుగా ఉన్నది ఆయన నీడ ఒక్కటే ఎవరూ ఏఒక్కరూ కారు.ఆయన జీవించి ఉండగా కొందరు,పోయాక మరికొందరూ చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్నారు కానీ.ఆ కాసిన చెట్టుకు తగిలిన రాళ్లదెబ్బలను ఎవరూ గ్రహించలేకపొయారు.సమగ్రమైన పరిశోధన,అధ్యయనం జరిపితే ప్రకాశం గారి జీవితం మీద ఎందరో ఘనులు,లబ్దప్రతిష్టులుగా తెగపేరు మోసినవారి బతుకులు బజార్న పడతాయి అనటం లొ ఎంతమాత్రం సందేహం లేదు.

Post a Comment