Tarkunde with Innaiah
1940 ప్రాంతాల నుండీ ఆంధ్ర రాడికల్స్.కు చిరపరిచితుడు తార్కుండే తమ పూర్వీకులు ఆంధ్ర నుండి వలస వచ్చారనీ, యింటిపేరు తాడికొండ అనీ, మరాఠీలో తార్కుండే అయిందని చెబుతుండేవారు. పూర్తి పేరు విఠల్ మహదేవ్ తార్కుండే (03.07.1909 – 22.03.2004).
ఎం.ఎన్.రాయ్.కు అటు పార్టీలోనూ యిటు ఉద్యమంలోనూ అత్యంత సన్నిహిత మిత్రుడు, అనుచరుడు సహచరుడుగా ఆయన వున్నాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చి, చదువుకొని అడ్వొకేట్.గా ప్రాక్టీసు చేస్తూ బొంబాయి హైకోర్టు జడ్జి అయ్యాడు. పాస్ పోర్టు పొందే హక్కు పై చరిత్రాత్మక తీర్పు యిచ్చి, సంచలనం సృష్టించారు. పౌరులందరికీ పాస్ పోర్టు పొందే హక్కు ఉన్నదని చెప్పారు. ఎం.ఎన్.రాయ్ తో ఆయనకు సెంటిమెంటల్ అనుబంధం వుంది. రాయ్ సంస్మరణ సభలలో, డెహ్రాడూన్ రాయ్ నివాసంలో గతస్మృతులు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టేవాడు. జడ్జిగా తన స్వేచ్ఛకు పరిమితులు వున్నాయని వుద్యమానికి ఏమీ చేయలేకపోతున్నానని రాజీనామా యిచ్చి, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు పెట్టాడు పూర్తిగా ఉద్యమంలో నిమగ్నుడయాడు. రాడికల్ హ్యూమనిస్ట్, రేషనలిస్ట్, సెక్యులరిస్ట్, రినైజాన్స్ ఉద్యమాలతోబాటు పౌరహక్కుల ఉద్యమం సాగించాడు.
ఎమర్జన్సీలో ఇందిరా గాంధీని వ్యతిరేకించి, జయప్రకాశ్ నారాయణ్.ను సమర్ధించాడు. ముస్లింలలో తీవ్రవాదులను దూరం చేసి, మితవాదులను కలుపుకోవాలనేవాడు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక నడపడానికి, రాయ్ సాహిత్య ప్రచురణకూ చాలా సహాయపడ్డాడు.
దేశవ్యాప్తంగా పర్యటించి సభలు సమావేశాలు, అధ్యయన తరగతులలో ఎందరికో పాఠాలు చెప్పారు. నేను ఆయన్ను బొంబాయిలో డెహ్రాడూన్.లో, ఆంధ్రలో, ఢిల్లీలో అనేక పర్యాయాలు కలిశాను. ఉద్యమంలో పనిచేశాం. ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాం. అనేక వ్యాసాలు, ప్రచురణలు చేసిన తార్కుండేకు ఆయన భార్య గౌరి చేయూత నిచ్చేది.
ఢిల్లీలో మాకు ఆయన ఇంట్లో ఎన్నోమార్లు ఆతిథ్యం యిచ్చారు. స్వయంగా కారు నడుపుతూ నన్ను, ఎం.వి.రామమూర్తిని తీసుకెళ్ళి యింట్లో ఉద్యమ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. బొంబాయిలో ఇందుమతి పరేఖ్ ఇంట్లో చిన్న సమావేశాలలో కలిసేవాళ్ళు. నార్ల వెంకటేశ్వరరావుతో పరిచయం చేశాను. తన రచన ఒకటి తార్కుండేకు నార్ల అంకితం చేశారు. ఆలపాటి రవీంద్రనాథ్ తో కూడా పరిచయం చేశాను.
1982లో తార్కుండే కుమార్తె మాణిక్ పెళ్ళి ఇండియా ఇంటర్ నేషనల్ సెంటర్ ఢిల్లీలో జరిగింది. నేను ఒక్కడినే ఆంధ్ర నుండి ఆ పెళ్ళిలో అతిథిగా పాల్గొన్నాను. ఆయన ఎంతో ఆనందించారు. ఆ తరువాత మాణిక్ నేను ఎప్పుడైనా కలిసేవాళ్ళం. ఆమె ఉద్యమంలో చురుకుగా లేదు. గౌరి కొన్నాళ్ళు వీల్ ఛైర్.లో వుంటూ చనిపోయింది. తార్కుండేను మాణిక్ చూచుకునేది.
రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమానికి ఇండియాలో తార్కుండే వలన గుర్తింపు వచ్చిందని శిబ్.నారాయణ్ రే అనేవారు. ఆయనకు ప్రియ శిష్యుడుగా ఎం.ఎ.రాణె ఒక సంస్మరణ సంచిక చక్కగా వెలువరించారు. రినైజాన్స్ సంస్థ ప్రతి ఏటా తార్కుండే స్మారకోపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో అజాద్ పాంచొలి, బిడి శర్మ శ్రద్ధ వహిస్తున్నారు. నక్సలైట్లను బూటకపు ఎన్ కౌంటర్లలో చంపెస్తున్నారనే విషయమై జస్టిస్ భార్గవ కమీషన్ విచారణ చేపట్టింది. అందులో వి.ఎం. తార్కుండే, మావోయిస్టుల హక్కులకై వారించారు. ఇది 1976 ప్రాంతాల్లో జరిగింది. అప్పుడు తరచుగా ఆయన హైదరాబాద్ వస్తుండేవారు.
ఎం.ఎన్. రాయ్ 22 సిద్ధాంతాలు ఇప్పటికీ సరైనవేనని ఆయన అభిప్రాయం. ఆ విషయంలో ఏ.బి. షా, నేను విభేదించాము. ఆధునిక విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి దృష్ట్యా ఆ సిద్ధాంతాల్లో మార్పులు, చేర్పులు అవసరమని మా వాధన. అలాగే హోమియోపతి తాను కొన్ని సందర్భాలలో వాడానని, కనుక అది పూర్తిగా కొట్టి పారేయటానికి వీల్లేదని తార్కుండే అనేవారు. అప్పుడు కూడా మేము ఆయనతో తీవ్రంగా విభేదించి శాస్త్రీయంగా రుజువయ్యేవరకు హోమియోపతి అంగీకరించరాదు అని గట్టిగా చెప్పేవాళ్ళం. తార్కుండే ఎంత గట్టిగా అభిప్రాయాలను వెల్లడించేవాడో స్నేహితుడిగా అంత సహృదయుడు.
భారత మానవ వాద సంఘాధ్యక్షుడుగానూ, పునర్వికాస ఉద్యమ నాయకుడుగానూ ఆయన దేశమంతా పర్యటించి ఇతర సంఘాలను కలుపుకొని అనేక శిక్షణ తరగతులను నిర్వహించారు. ఎందరినో ఉద్యమానికి సంసిద్ధులను చేశారు. మంచి వక్త వ్యక్తిగత స్నేహాన్ని అభిలషించేవాడు. అతిసాధారణ జీవితం గడుపుతూ ఉన్నతంగా ఆలోచిస్తూ రచనలు చేశారు. ఎమ్.ఎన్.రాయ్ సాహిత్యాన్ని, భావాలను జనంలోకి తీసుకువెళ్ళడానికి బాగా తోడ్పడ్డారు. ఆయనతో పరిచయం, సన్నిహితత్వం ఉండడం ఎంతో సంతృప్తిని కలిగించింది.
Tarkunde's visit to Hyderabad -Speech in Nizam's college
Left to Right: 1 st row: V.M.Tarkunde, Gopalrao Ekbote, Avula Sambasiva rao
2nd Row: A.H.V.SubbaRao, P.V.Raja Gopal, Abburi Rama Krishna Rao, A.L.Narasimha Rao
3 rd row: 1) 2) Alam Khundmiri 3) G.R.Dalvi
4th row: 1) N.K.Acharya, 2)A.S. Wadvalkar, 3) 4) N.Innaiah
5th row: Jasti Sulapani, Kosaraju Sambasiva Rao, P.S. Narayana |
No comments:
Post a Comment