ఎమ్.ఎన్.రాయ్ తో భుజం మీద చెయ్యివేసి చనువుగా వుండగల మానవ వాద కార్మిక నాయకుడు వి.బి.కర్నిక్. 1930లో ఎమ్.ఎన్.రాయ్ విదేశాల నుండి ముంబయిలో అడుగు పెట్టినప్పుడు తొలుత కలుసుకున్న వారిలో కర్నిక్ ఉన్నాడు. అప్పటి నుండి రాయ్ చనిపోయేవరకు అతి సన్నిహితుడుగా అన్నివిధాల ఉద్యమాలలో అండగా నిలిచాడు.
వసంత భగవంత్ కర్నిక్ ఆయన అసలు పేరు. ముంబయిలో ఆయనను బాబా అని ఆప్యాయంగా పిలిచేవారు. కార్మిక రంగంలో కర్నిక్ మంచి పట్టు సాధించి, రాయ్.కు మద్దత్తు యిచ్చాడు. యన్. యమ్. జోషితో కలసి కార్మిక రంగంలో చాలా పోరాటాలు సాగించాడు. గిర్నీ కర్మాగార్ యూనియన్ మొదలు ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, రేవు కార్మికుల యూనియన్.తో సహా అనేక కార్మిక సంఘాలలో ప్రముఖ పాత్ర వహించాడు. రాయ్ జైల్లో వుండగా కర్నిక్ చేతనైనంత ఆదుకున్నాడు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో, తరువాత వుద్యమంలో కర్నిక్ కీలక పాత్ర వహించాడు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక, ఇండిపెండెంట్ ఇండియా పత్రికలు సాగించడంలో కర్నిక్ జీవితమంతా తోడ్పడ్డాడు. బొంబాయిలో వుంటూ పర్యటనలు చేసేవాడు.
కర్నిక్ మితభాషి. సౌమ్యుడు.
కర్నిక్ బొంబాయిలో రతీలాల్ మేన్ షన్, సాహిత్య సహవాస్ భవనాలలో వుండేవాడు. అక్కడ ఎన్నోసార్లు కలిశాను. ఆంధ్రకు పర్యటన నిమిత్తం వచ్చినప్పుడు కలిశాం. 1970లో ఆయన భార్యను హత్య చేశారు. కర్నిక్ పైకి కనిపించక పోయినా చాలా చలించి, మౌనం వహించాడు.
రాయ్ అనంతరం లెస్లిసహని ఫౌండేషన్ పేరిట ప్రజాస్వామ్య వికేంద్రీకరణ వుద్యమం సాగించారు. శిక్షణ తరగతులు నిర్వహించారు. గుంటూరు, హైదరాబాద్.లో నేను పాల్గొన్నాను. జి.ఆర్.దల్వి ఆహ్వానంపై అడ్మిన స్ట్రేటివ్ స్టాఫ్ కళాశాల సెమినార్లకు కర్నిక్ వచ్చినప్పుడు అది అవకాశంగా తీసుకొని బయట సమావేశాలు పెట్టాం.
డెహ్రాడూన్ స్టడీ కాంప్.లో కలసి వున్నాం. (1975 ప్రాంతాలలో) అప్పుడు జి.డి.పరేఖ్ వున్నారు.
ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్ర విపులంగా రాసిన వి.బి.కర్నిక్, సంక్షిప్త జీవిత చరిత్ర కూడా రాశారు. అవి రెండూ తెలుగులో అనువదించాను. తెలుగు అకాడమీ వారు పెద్ద గ్రంథాన్ని, నేషనల్ బుక్ ట్రస్ట్ వారు చిన్న రచన అనువాదాన్ని ప్రచురించారు. ఆ విధంగా కర్నిక్ రచనలు నేను అనువదించాను. భారత కార్మికోద్యమ చరిత్ర, ట్రేడ్ యూనియన్ చరిత్ర కూడా నేను తెనిగించగా తెలుగు అకాడమీ ప్రచురించింది. స్వాతంత్య్రానికి పూర్వం కార్మిక ఉద్యమ చరిత్రకు అవి అద్దం పట్టాయి. డబ్ల్యు. ఎస్. కాణె యిష్టపూర్వకంగా కర్నిక్ రచన ఎం.ఎన్.రాయ్ జీవితచరిత్రను మార్కెటింగ్ చేసారు. కర్నిక్ లా చదివి తొలిదశలో పూనాలో వుంటూ తరువాత బొంబాయిలో స్థిరపడ్డారు. గాంధీజీ శిష్యుడుగా రాజకీయాలలో ప్రారంభించి యమ్.ఎన్.రాయ్ ప్రభావం వలన రాడికల్ హ్యూమనిస్ట్ గా మారిపోయాడు. 1985 నవంబర్ 5న చనిపోయాడు. ఆయన సన్నిహితులుగా తర్క తీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి, మణిబెన్ కార, జె.బి.హెచ్. వాడియా వి.యమ్. తార్కొండే, ఎ.బి.షా., శిబ్ నారాయణ్ రే ఉండేవారు. ఆంధ్రకు 1940 ప్రాంతాల నుండి ఆయన ఎన్నో పర్యాయాలు వచ్చి వెళ్ళారు.
1962లో నాటి కేంద్రమంత్రి కృష్ణమీనన్.కు వ్యతిరేకంగా ఆచార్య కృపలానీ పోటీ చేయగా కర్నిక్ కృపలానీ పక్షాన నిలిచి పోరాడారు.
పూనాలో చదివి, వకీలు వృత్తి కొన్నాళ్ళు చేసి తరువాత ఎమ్.ఎన్. రాయ్ అనుచరుడుగా ఉద్యమాలలో నిమగ్నుడైపోయాడు. మణిబెన్ కారా జీవిత చరిత్ర రాశాడు. మరాఠీ వారపత్రిక చిత్రను ఎడిట్ చేశాడు. తరచు హైదరాబాద్ ఎడ్మనిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి జి.ఆర్.దల్వి ఆహ్వానంపై రావడం వలన ఆయనను సన్నిహితంగా కలుసుకోవడానికి అనుభవాలు పంచుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. 1985 నవంబరు, 5న 82 ఏళ్ళ ప్రాయంలో కర్నిక్ చనిపోయారు. 1970లో ఆయన భార్యను దుండగులు హత్య చేసినప్పటినుండి కర్నిక్ పైకి కనిపించకపోయినా బాగా కృంగిపోయారు.
No comments:
Post a Comment