ఆదర్శవ్యక్తులు:‘ఖట్టర్ కాకా’ :తెలుగు సేత: జె.లక్ష్మిరెడ్డి

మైథిలీ మూలం
ఖట్టర్ కాకా’
హరిమోహన్ ఝా     
ఆదర్శవ్యక్తులు

నా చేతిలో పుస్తకం చూసి చిన్నాన్న అడిగాడు - ఏదో లావు పుస్తకంతో బయలుదేరావే!
నేనన్నాను - ‘ఆదర్శ చరితావళి’
చిన్నాన్న చిరునవ్వు నవ్వి అన్నాడు - ఈ రోజుల్లో ఎవరైనా ఇందులోని ఆదర్శాల ప్రకారం నడిస్తే నేరుగా పిచ్చాసుపత్రికే పోతారు!
నేను - అలా ఎందుకంటారు చిన్నాన్నా? చూడండి, సత్యవాది, దానవీరుడు అయిన హరిశ్చంద్ర మహారాజు ఎలాంటివాడో! ‘సూర్యుడు గతి తప్పినా, చంద్రుడు గతి తప్పినా ప్రపంచ గతి మారినా హరిశ్చంద్రుడు మాత్రం తన సత్యాన్ని వదలడు’ అని గదా అంటారు.
చిరునవ్వుతో చిన్నాన్న అన్నాడు - ఓహో, ఏమి సత్యం! ఏమి సత్యం1 కలలో నీ భూమి నాకు దానం చేశావనుకో. అలా అని తెల్లవారి నా పేర దస్తావేజులు తయారు చేయిస్తావా? కలలో నేనెవరికైనా కన్యాదానం చేశాననుకో, అలా అని అతన్ని అల్లునిగా చేసుకుంటానా?’
నేను - చిన్నాన్నా, అక్కడ ఉద్దేశ్యం సత్యం గొప్పతనాన్ని చూపించడం.
చిన్నాన్న- అక్కడే కదా, మూర్ఖత్వం మొదలయేది! కలలో మనుషులు అర్థం-పర్థం లేని ఎన్నో సంఘటనలు చూస్తారు. అవి నిజమనుకొని నడుచుకుంటే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? కానీ మన వాళ్ళ బుద్ధిలోనే ఈ వైచిత్రి ఉంది. జాగ్రతావస్థ కంటే స్వప్నావస్థకే మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. ఈ పునాది పైనే గదా వేదాంత భవనం నిలిచి ఉంది. మనకు ప్రపంచమంతా స్వప్నంలాంటిది. సర్వం మిథ్య. ఇంకా చెప్పాలంటే సుషుప్త స్థితి నుండి కూడా ఒక అడుగు ఆవల తురీయావస్థ (సమాధి అవస్థ)ను ఆదర్శంగా భావిస్తాం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో జాగృతి నగారాలు మారు మ్రోగుతుంటే మనం మాత్రం ఈ మంత్రం జపిస్తూ ఉంటాం --
యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
(ఏ దేవి సర్వప్రాణుల్లోనూ నిద్ర రూపంలో నెలకొని ఉంటుందో, ఆ దేవికి నమస్కారం, ఆ దేవికి నమస్కారం, ఆ దేవికి నమస్కారం)
నేను - చిన్నాన్నా, మనది మొదటి నుండీ ఆధ్యాత్మిక దృష్టి కదా!
చిన్నాన్న వ్యంగ్యంగా అన్నాడు -- అవును. అందువల్లనే  మనం పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా భావిస్తాం--
‘యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః’                      (గీత 2..69)
(సమస్త జీవులకు ఏది రాత్రిగా ఉంటుందో, అందులో వశీకృతాత్ముడు మేల్కొని ఉంటాడు. జీవులన్నీ ఎందులో మేల్కొని ఉంటాయో, అది ఆత్మద్రష్ట అయిన ఋషికి రాత్రి)
ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు మనం నిద్రపోతూ ఉంటాం. అందరూ నిద్ర పోయేప్పుడు, రాత్రి చీకట్లో మేల్కొని ఉంటాం, ఏ పక్షి నుండి ప్రేరణ పొందామో మరి..
నేను - చిన్నాన్నా, మీ వ్యంగ్యం చాలా  లోతైన గాయం చేస్తుంది. పైకి మామూలుగా కనిపించినా.
చిన్నాన్న - తప్పు చెప్పడం లేదు నేను, ఈ దేశపు పక్షులు కూడా తత్త్వదర్శులే. చిలక, జటాయువు, గరుత్మంతుడు, కాకి, అన్నీ మన గురువులే. ఇక ఉలూకం (గుడ్లగూబ) విషయం చెప్పవలసిన పనే లేదు. దానిలో ఏ  విశేషతా వైశేషిక దర్శనాన్ని ‘ఔలూక్య దర్శనం’ అని ఎందుకనేవారు?
నేను - రాజర్షి జనకుని లాంటి బ్రహ్మజ్ఞానులు కూడా ఈ దేశంలో పుట్టారు కదా!
చిన్నాన్న - అరే, ఆ బ్రహ్మజ్ఞానమే కదా మన కొంప ముంచింది.. మిథిలాధిపతి జనకుని సిద్ధంతం ఇది -
‘మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహతి కించన’1
(మిథిల అంతా కాలి భస్మమైపోయినా నాకు కలిగే నష్టం ఏమీలేదు) దేశవాసులందరూ దీన్నే ఆదర్శంగా తీసుకుని జీవించడం మొదలు పెడితే ఈ దేశం ఏమైపోతుంది..
(1. అనంతం బతమే విత్తం యస్య మే నాస్తికించన… (నా వద్ద అపారమైన ధన సంపద ఉంది. అయితే అందులో ఏ కొంచెం కూడా నాది కాదు). ఇది  దీనికి ముందు పాదం. (అనువాదకుడు)
నేను - చిన్నాన్నా, వాళ్ళ ఆదర్శం ..పద్మపత్ర మివాంభసా.. (పద్మపత్రం నీళ్ళలో ఉన్నట్లు ప్రపంచంతో నిర్లిప్తంగా ఉండాలి)
చిన్నాన్న - ఉపమానం మాత్రం చాలా బాగుంది. అయితే కనీసం ఒక్క రోజైనా అలా ఉండు, చూద్దాం. నీవు పద్మపత్రం లాగా నిర్లిప్తంగా కూర్చొని ఉండు, నేను వెళ్ళి నీ ఇల్లూ-వాకిలీ అన్నీ స్వాధీనం చేసుకుంటాను..
నేను - చిన్నాన్నా, జనకుడు విదేహుడు (దైహిక చింతలు లేని వాడు), ఆయనకు మట్టి గడ్డలెంతో, సుందరి స్తనాలూ అంతే.
చిన్నాన్న నవ్వి అన్నాడు - అలా అయితే విదేహుడు కావడంలో అనిర్వచనీయమైన ఆనందం ఉంది… అయినా నాకొక విషయం చెప్పు. నిజంగా విదేహుడైతే ఆయనకు రాముడెంతో, రావణుడూ అంతే అవాలి కదా! అలాంటప్పుడు ధనుషయజ్ఞం బెడదంతా పెట్టుకోవలసిన అవసరం ఏముంది? ఇక రావణుడే ధనుస్సు విరిచి ఉంటే!
నేను - అది పోనీ, మహర్షి యాజ్ఞ్యవల్కుణ్ణి తీసుకోండి. ఎంతటి జ్ఞాని అయినా ఆయన..
చిన్నన్న నవ్వుతూ అన్నాడు - ఎంతటి జ్ఞాని అంటే ఇద్దరు - ఇద్దరు భార్యలు కావలసి వచ్చారు. ఆత్మకోసం మైత్రేయి, శరీరం కోసం కాత్యాయని.
నేను - కానీ గార్గితో ఆయన శాస్త్ర చర్చ ఎంత ఉన్నత స్థాయిలో జరిగింది?
చిన్నాన్న - పూర్తిగా పిల్లల స్థాయిలో జరిగింది. గార్గి ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలడిగి ఆయనకు దిక్కుతోచకుండా చేయడం మొదలు పెట్టగానే కోపంతో ఇలా అన్నాడు - ..ఇలాగే ఇంకా అడిగావంటే నీ తల తెగి కింద పడిపోతుంది!
నేను - కాని, ఎలాంటి త్యాగి ఆయన?
చిన్నాన్న - ఎలాంటి త్యాగి అంటే, శాస్త్రార్థం చేయటానికి ముందే ఆవులన్నీ ఇంటికి తోలించుకున్నాడు. తర్వాత మరెవరన్నా తోలుకు పోతారేమోనని!
నేను - ఇక్కడి బ్రాహ్మణులు ఎంత  విరాగులు?
చిన్నాన్న - అవును, ఎలాంటి వారంటే ఎల్లప్పుడూ వాళ్ళ ముక్కుమీద కోపం ఎక్కి కూర్చొని ఉండేది. భృగువు విష్ణువును కాలితో తన్నాడు. పరశురాముడు తల్లి తల నరికాడు.
నేను - మహర్షి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఎలాంటివారు!
చిన్నాన్న - ఇద్దరికీ వేశ్యాసంసర్గం ఉంది. ఒకాయన ఊర్వశి గర్భం నుండి వచ్చాడు. మరొకాయన మేనకకు గర్భం తెప్పించాడు. ఋషుల లోగుట్టు అప్సరసలకు బాగా తెలుసు!
నేను - దేవర్షి నారదుడు ఎంత గొప్ప భక్తుడు?
చిన్నాన్న- అవును. అందుకే మోహం పుట్టించి మోహిని కోతిని ఆడించినట్లు ఆడించింది.. అరే, సుందరాంగులు ఇక్కడి మునులను మొదటి నుండీ వేళ్ళపైన ఆడిస్తూ వచ్చారు. ఒక్క ఓరచూపుతో వాళ్ళ తపస్సంతా చిటికెలో పటాపంచలు చేసేయగలరు వారు!
నేను - ప్రహ్లాదుడు, విభీషణుడు, ఎలాంటి ధర్మాత్ములు!
చిన్నాన్న - ఒకరు తండ్రిని చంపిస్తే, మరొకరు అన్నను చంపించాడు. ఇలాంటి ఆదర్శ పురుషుల నుండి భగవంతుడు దేశాన్ని రక్షించుగాక!
నేను - భీష్మ పితామహుడు ఎలాంటి నీతిమంతుడు?
చిన్నాన్న - అందుకే నిండు సభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తూ ఉండడం చూసి కూడా కిమ్మనకుండా ఉండిపోయాడు…
నేను - ద్రోణాచార్యుడు ఎంత గొప్పవాడు..
చిన్నాన్న - అందుకే, స్వార్థ బుద్ధితో ఏకలవ్యుడు లాంటి శిష్యుని బొటనవేలు కోయించుకున్నాడు. ఈ కాలం విద్యార్థి అయితే దూరం నుండే బొటనవేలు ఆడించి ‘టాటా’ చెప్పి ఉండేవాడు.
నేను - అరుణి ఎలాంటి గురుభక్తుడు?
చిన్నాన్న - అవును! చేలో గండికి అడ్డకట్ట వేసి రారా బాబూ, అని గురువు పంపితే వెళ్ళి గండిలో తానే పడుకున్నాడు! కల్తీలేని మూర్ఖత్వపు ఆదర్శం చూపించి వెళ్ళాడు. అలాంటి విద్యార్థులే దీపంలో నూనె లేకపోతే పగలంతా ఎండుటాకులు ఏరి తెచ్చి, రాత్రి వాటిని కాల్చి చదువుకోడానికి కూర్చునేవారు!
నేను క్షోభ పడుతూ అన్నాను - చిన్నాన్నా, అయితే ఈ కథలవల్ల ఏమీ ప్రయోజనం లేదా..
చిన్నాన్న - ప్రయోజనం ఎందుకు లేదు? ఉండేది. ఈ రోజుల్లో గురువులు చతురులు. శిష్యులు మందబుద్ధులు. అందువల్ల గురుభక్తికి సంబంధించిన ఇలాంటి ఉపాఖ్యానాలు సృష్టించారు. ఆచార్యులు శిష్యులను ఆవులు మేపుకొని రావడానికి పంపేవారు, వారితో కట్టెలు కొట్టించేవారు. ప్రతి కథలోను ఏదో ఒక అభిప్రాయం ఉంది. ఎవరో అడగకుండా చెట్టు నుండి జామకాయ కోసుకొని ఉంటాడు. అతణ్ణి సిగ్గుపడేట్లు చేయడం కోసం అలాంటి చిన్న తప్పుకు పెద్ద పాప ఫలం అనుభవించిన శంఖలిఖితుని కథ రాశారు. ఎవరో ఒక రాజు బ్రాహ్మణునికి ఆవునిచ్చి మళ్ళీ వెనక్కు తీసుకొని ఉంటాడు. అలాంటి వాళ్ళను భయపెట్టడం కోసం నృగుడనే రాజు కథ సృష్టించారు. నృగ మహారాజు అన్నివేల ఆవులు బ్రాహ్మలకు దానం చేస్తే అవన్నీ లెక్కకు రాలేదు. కానీ దానమిచ్చిన ఏదో ఒక ఆవు దారితప్పి ఆయన  మందలోకి తిరిగి వచ్చినందుకు ఆయన కొన్ని వేల సంవత్సరాలు ఊసరవెల్లిగా బావిలో పడి ఉండవలసి వచ్చిందట.. అబ్బాయీ, నృగుని వంశీయులకు ఏ కొంచెం బుద్ధీ - తెలివి ఉండినా వాళ్ళు పొరపాటున కూడా గోదానం పేరు ఉచ్ఛరించి ఉండరు!
నేను - చిన్నాన్నా, మీతో వాదించడం ఎవరి తరం! కానీ చూడండి, ఈ భరత భూమిని ఎలాంటి - ఎలాంటి రాజులు పాలించారో.. భరతుని వల్ల ఈ దేశం పేరు ‘భారతదేశం’ అయింది. ఆయన తండ్రి దుష్యంతుడు జాతికే భూషణుడు కదా!
చిన్నాన్న - మునికన్య శకుంతల దుష్యంతుని మూలంగా తన కన్యాత్వం కోల్పోయింది. అయినా తర్వాత అతడామెను గుర్తించడానికి కూడా నిరాకరించాడు. అలాంటి కాముకుణ్ణి, పిరికివాణ్ణి జాతి భూషణుడంటున్నావా! జాతి దూషణుడనాలి. దుష్యంతుడనే పదానికి అర్థం కూడా అదే కదా! అరే, ఒకరిని మంచి ఒకరు కాముకులు, విషయాసక్తులు అయిన రాజులు ఇక్కడుండేవారు. యయాతి మహారాజు వృద్ధావస్థలో ఇంద్రియాలు శిథిలమైపోయినా భోగకాంక్ష తీరక పుత్రుని యౌవనం అరువు తీసుకొని భోగాలు అనుభవించాడు! ఇలాంటి ప్రచండ కామాసక్తికి ఉదాహరణ మరే దేశ చరిత్రలోనైనా ఉందంటావా?
నేను - చిన్నాన్నా, మీరు రెండో పార్శ్వాన్ని ఎందుకు చూడరు? ఈ దేశంలోనే శిబి, దధీచి లాంటి ఆదర్శ దానవీరులు కూడా పుట్టారు కదా!
చిన్నాన్న - అవును, శిబి చక్రవర్తి తన మాంసం కోసి ఇచ్చాడు. దధీచి వెన్నెముక దానం చేశాడు. అందుకని రేపు నీవు కూడా నీ ముక్కు కోసి ఎవరికైనా దానం చేస్తే నిన్ను నేను ఆదర్శంగా భావిస్తానా?
నేను - చిన్నాన్నా, మీరింతగా కొట్టి పడేస్తే నేనేమి చెప్పగలను?  కానీ చూడండి. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు ఈ ఏడుగురూ అమరత్వం పొందినవారుగా చెప్పబడ్డారు -
‘అశ్వత్థామా బలిర్వ్యాసోః హనుమాంశ్చ విభీషణః
కృపః పరశురామశ్చ మప్తైతే చిరజీవినః’
చిన్నాన్న చిరునవ్వుతో ఇలా అన్నాడు - ఈ శ్లోకానికి అసలు అర్థం తెలుసా? దరిద్ర బ్రాహ్మణుడు, మూర్ఖుడైన రాజు, ముఖస్తుతి చేసే పండితుడు, అంధభక్తుడు, కృతఘ్నుడైన తమ్ముడు, గర్విష్ఠి అయిన ఆచార్యుడు, కోపిష్ఠి బ్రాహ్మణుడు, ఈ ఏడుగురు ఈ భూమిపైన ఎల్లప్పుడూ ఉంటారు, అని. ఇది దేశ దౌర్భాగ్యమే అనుకో.
నేను - మన దగ్గర ఒకరిని మించి ఒకరు ఆదర్శ వ్యక్తులు ఎందరో ఉన్నారు. అయినా మీకు ఒక్కరు కూడా నచ్చరు… చూడండి. సతీసావిత్రిలాంటి ఆదర్శ స్త్రీలు ఈ దేశంలో పుట్టారు.
చిన్నాన్న - ఈ స్త్రీలలో ఎవరూ తమ తండ్రి మాట వినలేదు.  తల్లిదండ్రుల నెదిరించి తమ ఇష్టానుసారం ప్రేమపెళ్ళి చేసుకున్నారు. వీరినా నీవు ఆదర్శం అనేది.. ఈ రోజు నా కూతురు కూడా అదే పని చేస్తే నాకెలా ఉంటుంది? అందువల్లే  నేను సతీ సావిత్రి ఉపాఖ్యానం మా అమ్మాయిలను చదవనివ్వను. చూడు, ఈ ‘చరితావళి’ మీ ఇంట్లోకి వెళ్ళకూడదు.
నేను బాధపడుతూ అన్నాను - ఈ ఆదర్శాల వల్లనే కదా, మన దేశం ధర్మ ప్రాణదేశంగా చెప్పబడుతుంది! ఇక్కడ నిరుపమానమైన ఆదర్శాలను స్థాపించారు.
చిన్నాన్న - నిజమే. ఇందులో వారికి వారే సాటి. ప్రపంచంలో మరెవ్వరూ వారికి సాటి రారు. మోరధ్వజునిలో అతిథ్యోన్మాదం పెచ్చరిల్లి కొడుకును రంపంతో చీల్చి, వండి అతిథి ముందుంచాడు.. దీన్ని ఆదర్శమంటావా లేక పిచ్చితనమంటావా? ఒకరిలో దానోన్మాదం అతిశయిస్తే మరొకరిలో సత్యోన్మాదం అతిశయిస్తుంది! సుమతి అనే ఒకామెకు సతీత్వపైత్యం మితిమీరడంతో తన కుష్టురోగి భర్త భోగతృష్ణ తీర్చడంకోసం అతణ్ణి పైకెత్తుకొని వేశ్య ఇంటికి తీసుకొని పోయింది! వీళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలా? నేను మాత్రం వీళ్ళు మానసిక రుగ్మత ఉన్న మనుషులనే అంటాను.
నేను - మన రాజులు, బ్రాహ్మణులు ఉన్నత సిద్ధాంతాలను పాటించేవారు కారా?
చిన్నాన్న - అరే అబ్బాయ్, రాజు వద్ద బలం ఉండేది. బుద్ధి ఉండేది కాదు. బ్రాహ్మణుని వద్ద బుద్ధి ఉండేది, బలం ఉండేది కాదు. ప్రతి మాటకు ఒకరు శస్త్రం వెలికి తీస్తే, మరొకరు శాస్త్రం వెలికి తీసేవారు. ఒకరి చేతిలో చాపం ఎక్కుపెట్టి ఉంటే, మరొకరి నాలుకపైన శాపం రెడీగా ఉండేది. బ్రాహ్మణులకు తిక్కరేగితే ఏవో శాస్త్రవచనాలు కల్పించేవారు. రాజులకు తిక్కరేగితే ఏవో ప్రతిజ్ఞలు పూనేవారు. ఈ ప్రతిజ్ఞలవల్ల ఈ దేశంలో ఎన్ని ప్రాణాలు పోయాయో చెప్పలేము.
నేను - ప్రాణం పోయినా మాట తప్పకూడదనే పట్టుదల మనవాళ్ళలో ఉండేది కాదా!
చిన్నాన్న - అదే మూర్ఖత్వమంటాన్నేను. సిద్ధాంతాలు మనకోసం పుట్టాయి కాని సిద్ధాంతాలకోసం మనం పుట్టలేదు. అవి మనకు సాధనాలే కాని సాధ్యాలు (లక్ష్యాలు) కావు. లక్ష్యసిద్ధికి ఉపకరించక అడ్డంకులుగా మారినప్పుడు ఇక అవి మనకెందుకు? చెవిని తెగ్గోసే స్వర్ణాభూషణాన్ని అగ్గిలో పడేయడమే మంచిది కదా! చిన్ననాటి నీ మేజోళ్ళు ఇప్పుడు సరిపోవు. అందువల్ల వాటికి తగినట్లుగా నీ కాళ్ళు తెగ్గొట్టుకుంటావా?
నేను - మన సిద్ధాంతం మేజోళ్ళ లాగా మార్చుకొనే వస్తువు కాదు కదా!
చిన్నాన్న - ఎందుకు కాదు? ఒకానొకప్పుడు  భర్త చితిపైన సతి అయే స్త్రీని దేవతగా పూజించేవారు. ఇప్పుడు ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు పట్టుకొని పోతారు.
నేను - కానీ సిద్ధాంతవాదులు చట్టంలోని సెక్షన్లననుసరించి నడుచుకోరు కదా!
చిన్నాన్న - నడుచుకోకుంటే మానె. కనీసం బుద్ధిననుసరించి అయినా నడుచుకోవాలి కదా! కళ్ళు మూసుకొని ఆచరించదగిన సిద్ధాంతం అంటూ ఏదీలేదు. ఒక గురువు శిష్యుణ్ణి ‘నిండు తూర్పు దిశగా పో’ అని ఆదేశించాడనుకుందాం. అప్పుడా శిష్యుడు ముక్కుకు సూటిగా నడుస్తూ ఒక తాటి చెట్టుకు ఢీకొని ఒక అంగుళం కూడా చెట్టుకు కుడివైపుకు గాని ఎడమవైపుకు గాని మళ్ళి నడవను, అని మొండికేస్తే, దాన్ని ఆదర్శం అంటావా లేక మూర్ఖత్వం అంటావా ఈ మొండితనం కారణంగా ఎందరు రాజుల తలలు తెగిపోయాయి, ఎందరు రాణులు మాడి మసి అయ్యారు.. ఎన్ని రాజమందిరాలు శిథిలమై పోయాయి… మన చరిత్ర అంతా ఇలాంటి మూర్ఖత్వంతోనే నిండి ఉంది.
నేనడిగాను - చిన్నాన్నా, అయితే ఇలాంటి పౌరాణిక ఉపాఖ్యానాలు ఎందుకు రాశారు?
చిన్నాన్న - అరే, రాజులను మోసపుచ్చడానికి, శిష్యులతో శూద్రులతో సేవ చేయించుకోడానికి, స్త్రీలను అధీనంలో ఉంచుకోవడానికి, ఇన్ని ఉపాఖ్యానాలు కల్పించడం జరిగింది. ఉపాఖ్యాన రచయితలు ఏ నైతికాదర్శాన్ని చిత్రిస్తారో, ఒక సతి చీర చెరుగు నుండి అగ్నిజ్వాల వెలువడుతుంది. మరొకామె యమధర్మరాజు చేతుల్లో నుంచి భర్తను లాక్కొని  తీసుకొస్తుంది. ఇంకొకామె సూర్యనుని రథచక్రాన్ని ఆపి కాలగమనాన్నే అడ్డగిస్తుంది.. అతిశయోక్తి లేకుండా విషయం చెప్పడం మన వాళ్ళకు చేతకానేకాదు. దీని ఫలితం ఏమయింది? మన ఆదర్శ చిత్రాలు ఫోటోలు కాకుండా కార్టూన్లు అయిపోయాయి!
నేను - అయితే ఈ పౌరాణిక ఆదర్శాలకు విలువంటూ ఏమీ లేదంటారా?
చిన్నాన్న - మ్యూజియంలో ఉండే తుప్పు పట్టిన పాత డాలు - కత్తులకు ఏ విలువ ఉంటుందో, ఆ విలువే ఉంటుంది. అవి ప్రదర్శనకోసమే ఉంటాయి. ఉపయోగించడం కోసం కాదు.
నేను - అయితే ఈ పౌరాణిక ఆదర్శాలకు విలువంటూ ఏమి లేదంటారా?
చిన్నాన్న - మ్యూజియంలో ఉండే తుప్పుపట్టిన పాత డాలు-కత్తులకు ఏ విలువ ఉంటుందో, ఆ విలువే ఉంటుంది. అవి ప్రదర్శన కోసమే ఉంటాయి. ఉపయోగించడం కోసం కాదు.
నేను - చిన్నాన్నా, మన పాత్రల చిత్రణలో ఇంత అతిశయోక్తి ఎందుకుంది?
చిన్నాన్న - అరే అబ్బీ, అతిశయోక్తి మన రక్తంలోనే ఉందిరా! వేదాలకాలం నుండి మనం ఎవరిని  పొగుడుతామో, వాళ్ళను ‘త్వమర్కః త్వం సోమః’ (నీవు సూర్యునివి, నీవు చంద్రునివి) అని అకాశనికెత్తేస్తున్నాం. ఎవరిని నిందిస్తామో, వాళ్ళను పాతాళానికి తొక్కేస్తున్నాం. ‘ఏ కొండపైన హనుమంతుడు కాలు మోపుతాడో, ఆ కొండ క్షణంలో పాతాళానికి దిగబడిపోతుంది’ అన్నట్లు. మధ్యేమార్గం మనకు తెలియనే తెలియదు.
నీవే చూడు, మన సాహిత్యమంతా అతిశయోక్తులతో నిండి ఉంది. నాయిక పెద్ద - పెద్ద కళ్ళు అందంగా ఉంటే అవి ఆకర్ణాంతం (చెవుల దాకా) వ్యాపించి ఉన్నాయన్నారు. పుష్టపయోధరాలు పొంకంగా ఉన్నాయనిపిస్తే వాటిని స్వర్ణ కలశాలతో సమానంగా చేసేశారు. అరే, దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏ హద్దూ లేదు..
‘ముఖమస్తీతి వక్తవ్యం దశహస్తా హరీతకీ’
(నోరు ఉంది కాబట్టి అనేయవచ్చు. కరక్కాయ పది చేతుల పొడవుంటుందని!)
ఎవరికి ఏది తోస్తే అది రాసి పారేశారు. ఒకరు కొండనెత్తుకుంటారు1 ఒకరు సముద్రాన్నే తాగేస్తారు1 ఒకరు భూమిని పళ్ళతో ఇరికించుకుంటారు! ఒకరు సూర్యుణ్ణి మింగేస్తారు! ఒకరు చతురాననుడైతే, ఒకరు పంచాననుడు, మరొకరు షడాననుడు, మరొకరు దశాననుడు! ఒకరు చతుర్భుజుడైతే ఒకరు షడ్భుజుడు, మరొకరు సహ్రసభుజుడు.. ఒకరు వెయ్యి ఏండ్లు యుద్ధం చేస్తే ఒకరు ఐదువేల ఏండ్లు తపస్సు చేస్తారు.. మరొకరు పదివేల సంవత్సరాలు భోగిస్తారు! ఈ అతిశయోక్తుల ఉప్పెనలో మనం సత్యాన్ని మంచేశాం.
నేను - అయితే ఇవన్నీ  కపోలకల్పనలేనా?
చిన్నాన్న వ్యంగ్యంగా ఇలా అన్నాడు - ఎంతవరకైతే మన దేశంలో ఇలాంటివి రాసే దిగ్గజ పండితులు ఉంటారో, అంతవరకు ఈ మాట అనే ధైర్యం ఎవరికుంటుంది? మన ఒక్క మహావీరుడు ఆంజనేయుడు వస్తే చాలు, అన్ని దేశాల సైన్యాలను తన తోకతోటి చుట్టేసుకుంటాడు! ఒక్క అగస్త్యముని వస్తే చాలు. ఓడలతో సహా అన్ని సముద్రాలూ తాగి ఖాళీ చేసేస్తాడు! ఒక్క వరాహ అవతారం అయితే చాలు. భూమినంతా ఎత్తి ఫుట్ బాల్ లాగా విసిరి పారేయగలడు! ఒక్క వామనుడు వస్తే చాలు. ఒక్క అఢుగులో చంద్రుణ్ణి ఆక్రమించేస్తాడు.  వేరే - వేరే దేశాల వాళ్ళు కొత్త కొత్త అద్భుతయంత్రాలు కనిపెడుతూ ఉంటే, కనిపెట్టుకుంటూ ఉండనివ్వండి. మన పని మాత్రం అవతారాల ద్వారానే జరిగిపోతుంది. ఒక్క అవతారం ఇప్పుడే వస్తే అన్ని సమస్యలూ చిటికెలో తీరిపోతాయి. ఒక్క హూంకారంతో ఆహారధాన్యాల పర్వతం ఎదుట నిలుస్తుంది, ఒక్క బాణంతో ఎదుట పాలు-పెరుగుల సముద్రం తరంగాయిత మవుతుంది..
నేను - చిన్నాన్నా, మీరు అతిశయోక్తుల అజస్ర ధారనే ప్రవహింప చేశారు!
చిన్నాన్న నవ్వుతూ అన్నాడు - అరే, నన్ను ఎవరి వంశం వాడనుకున్నావు? రక్తధర్మం ఎక్కడికి పోతుంది? విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇతర దేశాలు ఉండనే ఉన్నాయి. కల్పనా విలాసం కొనసాగించే బాధ్యత మోయడానికి కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా?
సరే అబ్బాయ్, ఇక నీ ఆల్బమ్ తీసుకెళ్ళు, ఇలాంటి ఆదర్శాలు నాకక్కరలేదు. నేను యదార్థవాదిని.

తెలుగు సేత:   జె.లక్ష్మిరెడ్డి

No comments:

Post a Comment