‘రేగడి విత్తులు’ రచయిత్రి చంద్రలత కలుసుకోలేనినోబుల్ ప్రైజ్ విన్నర్ టోనీ మారిసన్

‘రేగడి విత్తులు’ రచయిత్రి  చంద్రలత  కలుసుకోలేని
నోబుల్ ప్రైజ్ విన్నర్ టోనీ మారిసన్

పైడి చంద్రలత రేగడి విత్తులు నవల రాసినప్పుడు 1997లో తానా (ఉత్తర అమెరికా తెలుగు సంస్థ) పోటీలు నిర్వహించగా, 1,20,000 రూపాయలు బహుమతిని అమెరికాలో గెలుచుకున్నారు. ఆ సభలలో తానా నాకు విశిష్ఠ పురస్కారాన్ని అక్కినేని నాగేశ్వరరావు ద్వారా అందించింది. అదే సభలలో మిత్రురాలు చంద్రలతకు బహుమతి రావడం సంతోషాన్నిచ్చింది. తరువాత ఇండియాలో ఆ నవలపై కొంత రాద్ధాంతం సాగింది. తెలంగాణా ప్రాంతంలో నక్సలైట్లు ఆ నవలను విమర్శిస్తూ దుయ్యబట్టారు. చంద్రలత, ఆమె తండ్రి హేతువాది కోటపాటి మురహరిరావు భయపడ్డారు. హైదరాబాదులో నా దగ్గరకు వచ్చి తెలంగాణా ప్రముఖునితో నవలపై సభ పెట్టించి మాట్లాడిస్తే తమకు అండగా ఉంటుందని అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కె. పురుషోత్తమ రెడ్డి నాకు మంచి మిత్రులు. రేగడి విత్తులు చదివి దానిపై తన అభిప్రాయం సభాముఖంగా మాట్లాడమని కోరాను. ఆయన అంగీకరించారు. మురహరిరావు, చంద్రలత సంతోషించి సభ ఏర్పాటు చేశారు (ఆ సభకు నన్ను ఆహ్వానించలేదనుకోండి). సభ జయప్రదంగా జరగడంతో ధైర్యం వచ్చి తెలంగాణాలో కూడా రేగడి విత్తుల నవలను మార్కెట్ చేసుకున్నారు.
ఆ తరువాత నేను అమెరికాలో ఉండగా మరోసారి చంద్రలత, ఆమె తండ్రి మురహరిరావు నన్ను అభ్యర్ధిస్తూ సుప్రసిద్ద రచయిత్రి టోనీ మారిసన్ ను కలుసుకోవాలని ఉన్నదని దానికి సహాయపడమని కోరారు. ప్రిన్స్ స్టన్ యూనివర్సిటీలో ఉమెన్స్ విభాగానికి అధిపతిగా ఉన్న టోనీ మారిసన్ కు ఫోన్ చేసి  చంద్రలతకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాను. అయితే వారు ఇచ్చిన టైమ్ కు చంద్రలత వెళ్ళక పోగా అదే సమయంలో ఏదో పేరంటానికి (లేదా విందుకు) వెళ్ళారు. రాలేకపోతున్నామని వారికి తెలియచేయలేదు. తరువాత ఆ శాఖ నుండి నాకు ఫోన్ రాగా సిగ్గుతో, అవమానంతో వారికి క్షమాపణ చెప్పుకున్నాను. చంద్రలతకు తెలియచెయ్యగా ఏవో కుంటిసాకులు చెప్పారే గాని అంత ముఖ్యమైన అప్పాయింట్ మెంట్ అటెండ్ కాలేకపోయామనే భావన ఏమాత్రం వెలిబుచ్చలేదు. రచయిత్రులకు ఇలాంటి లక్షణం ఉండకూడదని నా సలహా
చంద్రలత టోనీమారిసన్ ను కలిసి ఉంటే ఇంకొక మంచి నవల రాసుండేవారేమో.  

  • నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment