‘రేగడి విత్తులు’ రచయిత్రి చంద్రలత కలుసుకోలేనినోబుల్ ప్రైజ్ విన్నర్ టోనీ మారిసన్

‘రేగడి విత్తులు’ రచయిత్రి  చంద్రలత  కలుసుకోలేని
నోబుల్ ప్రైజ్ విన్నర్ టోనీ మారిసన్

పైడి చంద్రలత రేగడి విత్తులు నవల రాసినప్పుడు 1997లో తానా (ఉత్తర అమెరికా తెలుగు సంస్థ) పోటీలు నిర్వహించగా, 1,20,000 రూపాయలు బహుమతిని అమెరికాలో గెలుచుకున్నారు. ఆ సభలలో తానా నాకు విశిష్ఠ పురస్కారాన్ని అక్కినేని నాగేశ్వరరావు ద్వారా అందించింది. అదే సభలలో మిత్రురాలు చంద్రలతకు బహుమతి రావడం సంతోషాన్నిచ్చింది. తరువాత ఇండియాలో ఆ నవలపై కొంత రాద్ధాంతం సాగింది. తెలంగాణా ప్రాంతంలో నక్సలైట్లు ఆ నవలను విమర్శిస్తూ దుయ్యబట్టారు. చంద్రలత, ఆమె తండ్రి హేతువాది కోటపాటి మురహరిరావు భయపడ్డారు. హైదరాబాదులో నా దగ్గరకు వచ్చి తెలంగాణా ప్రముఖునితో నవలపై సభ పెట్టించి మాట్లాడిస్తే తమకు అండగా ఉంటుందని అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కె. పురుషోత్తమ రెడ్డి నాకు మంచి మిత్రులు. రేగడి విత్తులు చదివి దానిపై తన అభిప్రాయం సభాముఖంగా మాట్లాడమని కోరాను. ఆయన అంగీకరించారు. మురహరిరావు, చంద్రలత సంతోషించి సభ ఏర్పాటు చేశారు (ఆ సభకు నన్ను ఆహ్వానించలేదనుకోండి). సభ జయప్రదంగా జరగడంతో ధైర్యం వచ్చి తెలంగాణాలో కూడా రేగడి విత్తుల నవలను మార్కెట్ చేసుకున్నారు.
ఆ తరువాత నేను అమెరికాలో ఉండగా మరోసారి చంద్రలత, ఆమె తండ్రి మురహరిరావు నన్ను అభ్యర్ధిస్తూ సుప్రసిద్ద రచయిత్రి టోనీ మారిసన్ ను కలుసుకోవాలని ఉన్నదని దానికి సహాయపడమని కోరారు. ప్రిన్స్ స్టన్ యూనివర్సిటీలో ఉమెన్స్ విభాగానికి అధిపతిగా ఉన్న టోనీ మారిసన్ కు ఫోన్ చేసి  చంద్రలతకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాను. అయితే వారు ఇచ్చిన టైమ్ కు చంద్రలత వెళ్ళక పోగా అదే సమయంలో ఏదో పేరంటానికి (లేదా విందుకు) వెళ్ళారు. రాలేకపోతున్నామని వారికి తెలియచేయలేదు. తరువాత ఆ శాఖ నుండి నాకు ఫోన్ రాగా సిగ్గుతో, అవమానంతో వారికి క్షమాపణ చెప్పుకున్నాను. చంద్రలతకు తెలియచెయ్యగా ఏవో కుంటిసాకులు చెప్పారే గాని అంత ముఖ్యమైన అప్పాయింట్ మెంట్ అటెండ్ కాలేకపోయామనే భావన ఏమాత్రం వెలిబుచ్చలేదు. రచయిత్రులకు ఇలాంటి లక్షణం ఉండకూడదని నా సలహా
చంద్రలత టోనీమారిసన్ ను కలిసి ఉంటే ఇంకొక మంచి నవల రాసుండేవారేమో.  

  • నరిసెట్టి ఇన్నయ్య

లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ లో ఇన్నయ్య రచనలు లింక్:

లైబ్రరి  ఆఫ్ కాంగ్రెస్ లో ఇన్నయ్య రచనలు  లింక్:
http://catalog2.loc.gov/cgi-bin/Pwebrecon.cgi?DB=local&Search_Arg=innaiah+narisetti&Search_Code=GKEY^*&CNT=100&type=quick

ఆదర్శవ్యక్తులు:‘ఖట్టర్ కాకా’ :తెలుగు సేత: జె.లక్ష్మిరెడ్డి

మైథిలీ మూలం
ఖట్టర్ కాకా’
హరిమోహన్ ఝా     
ఆదర్శవ్యక్తులు

నా చేతిలో పుస్తకం చూసి చిన్నాన్న అడిగాడు - ఏదో లావు పుస్తకంతో బయలుదేరావే!
నేనన్నాను - ‘ఆదర్శ చరితావళి’
చిన్నాన్న చిరునవ్వు నవ్వి అన్నాడు - ఈ రోజుల్లో ఎవరైనా ఇందులోని ఆదర్శాల ప్రకారం నడిస్తే నేరుగా పిచ్చాసుపత్రికే పోతారు!
నేను - అలా ఎందుకంటారు చిన్నాన్నా? చూడండి, సత్యవాది, దానవీరుడు అయిన హరిశ్చంద్ర మహారాజు ఎలాంటివాడో! ‘సూర్యుడు గతి తప్పినా, చంద్రుడు గతి తప్పినా ప్రపంచ గతి మారినా హరిశ్చంద్రుడు మాత్రం తన సత్యాన్ని వదలడు’ అని గదా అంటారు.
చిరునవ్వుతో చిన్నాన్న అన్నాడు - ఓహో, ఏమి సత్యం! ఏమి సత్యం1 కలలో నీ భూమి నాకు దానం చేశావనుకో. అలా అని తెల్లవారి నా పేర దస్తావేజులు తయారు చేయిస్తావా? కలలో నేనెవరికైనా కన్యాదానం చేశాననుకో, అలా అని అతన్ని అల్లునిగా చేసుకుంటానా?’
నేను - చిన్నాన్నా, అక్కడ ఉద్దేశ్యం సత్యం గొప్పతనాన్ని చూపించడం.
చిన్నాన్న- అక్కడే కదా, మూర్ఖత్వం మొదలయేది! కలలో మనుషులు అర్థం-పర్థం లేని ఎన్నో సంఘటనలు చూస్తారు. అవి నిజమనుకొని నడుచుకుంటే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? కానీ మన వాళ్ళ బుద్ధిలోనే ఈ వైచిత్రి ఉంది. జాగ్రతావస్థ కంటే స్వప్నావస్థకే మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. ఈ పునాది పైనే గదా వేదాంత భవనం నిలిచి ఉంది. మనకు ప్రపంచమంతా స్వప్నంలాంటిది. సర్వం మిథ్య. ఇంకా చెప్పాలంటే సుషుప్త స్థితి నుండి కూడా ఒక అడుగు ఆవల తురీయావస్థ (సమాధి అవస్థ)ను ఆదర్శంగా భావిస్తాం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో జాగృతి నగారాలు మారు మ్రోగుతుంటే మనం మాత్రం ఈ మంత్రం జపిస్తూ ఉంటాం --
యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
(ఏ దేవి సర్వప్రాణుల్లోనూ నిద్ర రూపంలో నెలకొని ఉంటుందో, ఆ దేవికి నమస్కారం, ఆ దేవికి నమస్కారం, ఆ దేవికి నమస్కారం)
నేను - చిన్నాన్నా, మనది మొదటి నుండీ ఆధ్యాత్మిక దృష్టి కదా!
చిన్నాన్న వ్యంగ్యంగా అన్నాడు -- అవును. అందువల్లనే  మనం పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా భావిస్తాం--
‘యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః’                      (గీత 2..69)
(సమస్త జీవులకు ఏది రాత్రిగా ఉంటుందో, అందులో వశీకృతాత్ముడు మేల్కొని ఉంటాడు. జీవులన్నీ ఎందులో మేల్కొని ఉంటాయో, అది ఆత్మద్రష్ట అయిన ఋషికి రాత్రి)
ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు మనం నిద్రపోతూ ఉంటాం. అందరూ నిద్ర పోయేప్పుడు, రాత్రి చీకట్లో మేల్కొని ఉంటాం, ఏ పక్షి నుండి ప్రేరణ పొందామో మరి..
నేను - చిన్నాన్నా, మీ వ్యంగ్యం చాలా  లోతైన గాయం చేస్తుంది. పైకి మామూలుగా కనిపించినా.
చిన్నాన్న - తప్పు చెప్పడం లేదు నేను, ఈ దేశపు పక్షులు కూడా తత్త్వదర్శులే. చిలక, జటాయువు, గరుత్మంతుడు, కాకి, అన్నీ మన గురువులే. ఇక ఉలూకం (గుడ్లగూబ) విషయం చెప్పవలసిన పనే లేదు. దానిలో ఏ  విశేషతా వైశేషిక దర్శనాన్ని ‘ఔలూక్య దర్శనం’ అని ఎందుకనేవారు?
నేను - రాజర్షి జనకుని లాంటి బ్రహ్మజ్ఞానులు కూడా ఈ దేశంలో పుట్టారు కదా!
చిన్నాన్న - అరే, ఆ బ్రహ్మజ్ఞానమే కదా మన కొంప ముంచింది.. మిథిలాధిపతి జనకుని సిద్ధంతం ఇది -
‘మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహతి కించన’1
(మిథిల అంతా కాలి భస్మమైపోయినా నాకు కలిగే నష్టం ఏమీలేదు) దేశవాసులందరూ దీన్నే ఆదర్శంగా తీసుకుని జీవించడం మొదలు పెడితే ఈ దేశం ఏమైపోతుంది..
(1. అనంతం బతమే విత్తం యస్య మే నాస్తికించన… (నా వద్ద అపారమైన ధన సంపద ఉంది. అయితే అందులో ఏ కొంచెం కూడా నాది కాదు). ఇది  దీనికి ముందు పాదం. (అనువాదకుడు)
నేను - చిన్నాన్నా, వాళ్ళ ఆదర్శం ..పద్మపత్ర మివాంభసా.. (పద్మపత్రం నీళ్ళలో ఉన్నట్లు ప్రపంచంతో నిర్లిప్తంగా ఉండాలి)
చిన్నాన్న - ఉపమానం మాత్రం చాలా బాగుంది. అయితే కనీసం ఒక్క రోజైనా అలా ఉండు, చూద్దాం. నీవు పద్మపత్రం లాగా నిర్లిప్తంగా కూర్చొని ఉండు, నేను వెళ్ళి నీ ఇల్లూ-వాకిలీ అన్నీ స్వాధీనం చేసుకుంటాను..
నేను - చిన్నాన్నా, జనకుడు విదేహుడు (దైహిక చింతలు లేని వాడు), ఆయనకు మట్టి గడ్డలెంతో, సుందరి స్తనాలూ అంతే.
చిన్నాన్న నవ్వి అన్నాడు - అలా అయితే విదేహుడు కావడంలో అనిర్వచనీయమైన ఆనందం ఉంది… అయినా నాకొక విషయం చెప్పు. నిజంగా విదేహుడైతే ఆయనకు రాముడెంతో, రావణుడూ అంతే అవాలి కదా! అలాంటప్పుడు ధనుషయజ్ఞం బెడదంతా పెట్టుకోవలసిన అవసరం ఏముంది? ఇక రావణుడే ధనుస్సు విరిచి ఉంటే!
నేను - అది పోనీ, మహర్షి యాజ్ఞ్యవల్కుణ్ణి తీసుకోండి. ఎంతటి జ్ఞాని అయినా ఆయన..
చిన్నన్న నవ్వుతూ అన్నాడు - ఎంతటి జ్ఞాని అంటే ఇద్దరు - ఇద్దరు భార్యలు కావలసి వచ్చారు. ఆత్మకోసం మైత్రేయి, శరీరం కోసం కాత్యాయని.
నేను - కానీ గార్గితో ఆయన శాస్త్ర చర్చ ఎంత ఉన్నత స్థాయిలో జరిగింది?
చిన్నాన్న - పూర్తిగా పిల్లల స్థాయిలో జరిగింది. గార్గి ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలడిగి ఆయనకు దిక్కుతోచకుండా చేయడం మొదలు పెట్టగానే కోపంతో ఇలా అన్నాడు - ..ఇలాగే ఇంకా అడిగావంటే నీ తల తెగి కింద పడిపోతుంది!
నేను - కాని, ఎలాంటి త్యాగి ఆయన?
చిన్నాన్న - ఎలాంటి త్యాగి అంటే, శాస్త్రార్థం చేయటానికి ముందే ఆవులన్నీ ఇంటికి తోలించుకున్నాడు. తర్వాత మరెవరన్నా తోలుకు పోతారేమోనని!
నేను - ఇక్కడి బ్రాహ్మణులు ఎంత  విరాగులు?
చిన్నాన్న - అవును, ఎలాంటి వారంటే ఎల్లప్పుడూ వాళ్ళ ముక్కుమీద కోపం ఎక్కి కూర్చొని ఉండేది. భృగువు విష్ణువును కాలితో తన్నాడు. పరశురాముడు తల్లి తల నరికాడు.
నేను - మహర్షి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఎలాంటివారు!
చిన్నాన్న - ఇద్దరికీ వేశ్యాసంసర్గం ఉంది. ఒకాయన ఊర్వశి గర్భం నుండి వచ్చాడు. మరొకాయన మేనకకు గర్భం తెప్పించాడు. ఋషుల లోగుట్టు అప్సరసలకు బాగా తెలుసు!
నేను - దేవర్షి నారదుడు ఎంత గొప్ప భక్తుడు?
చిన్నాన్న- అవును. అందుకే మోహం పుట్టించి మోహిని కోతిని ఆడించినట్లు ఆడించింది.. అరే, సుందరాంగులు ఇక్కడి మునులను మొదటి నుండీ వేళ్ళపైన ఆడిస్తూ వచ్చారు. ఒక్క ఓరచూపుతో వాళ్ళ తపస్సంతా చిటికెలో పటాపంచలు చేసేయగలరు వారు!
నేను - ప్రహ్లాదుడు, విభీషణుడు, ఎలాంటి ధర్మాత్ములు!
చిన్నాన్న - ఒకరు తండ్రిని చంపిస్తే, మరొకరు అన్నను చంపించాడు. ఇలాంటి ఆదర్శ పురుషుల నుండి భగవంతుడు దేశాన్ని రక్షించుగాక!
నేను - భీష్మ పితామహుడు ఎలాంటి నీతిమంతుడు?
చిన్నాన్న - అందుకే నిండు సభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తూ ఉండడం చూసి కూడా కిమ్మనకుండా ఉండిపోయాడు…
నేను - ద్రోణాచార్యుడు ఎంత గొప్పవాడు..
చిన్నాన్న - అందుకే, స్వార్థ బుద్ధితో ఏకలవ్యుడు లాంటి శిష్యుని బొటనవేలు కోయించుకున్నాడు. ఈ కాలం విద్యార్థి అయితే దూరం నుండే బొటనవేలు ఆడించి ‘టాటా’ చెప్పి ఉండేవాడు.
నేను - అరుణి ఎలాంటి గురుభక్తుడు?
చిన్నాన్న - అవును! చేలో గండికి అడ్డకట్ట వేసి రారా బాబూ, అని గురువు పంపితే వెళ్ళి గండిలో తానే పడుకున్నాడు! కల్తీలేని మూర్ఖత్వపు ఆదర్శం చూపించి వెళ్ళాడు. అలాంటి విద్యార్థులే దీపంలో నూనె లేకపోతే పగలంతా ఎండుటాకులు ఏరి తెచ్చి, రాత్రి వాటిని కాల్చి చదువుకోడానికి కూర్చునేవారు!
నేను క్షోభ పడుతూ అన్నాను - చిన్నాన్నా, అయితే ఈ కథలవల్ల ఏమీ ప్రయోజనం లేదా..
చిన్నాన్న - ప్రయోజనం ఎందుకు లేదు? ఉండేది. ఈ రోజుల్లో గురువులు చతురులు. శిష్యులు మందబుద్ధులు. అందువల్ల గురుభక్తికి సంబంధించిన ఇలాంటి ఉపాఖ్యానాలు సృష్టించారు. ఆచార్యులు శిష్యులను ఆవులు మేపుకొని రావడానికి పంపేవారు, వారితో కట్టెలు కొట్టించేవారు. ప్రతి కథలోను ఏదో ఒక అభిప్రాయం ఉంది. ఎవరో అడగకుండా చెట్టు నుండి జామకాయ కోసుకొని ఉంటాడు. అతణ్ణి సిగ్గుపడేట్లు చేయడం కోసం అలాంటి చిన్న తప్పుకు పెద్ద పాప ఫలం అనుభవించిన శంఖలిఖితుని కథ రాశారు. ఎవరో ఒక రాజు బ్రాహ్మణునికి ఆవునిచ్చి మళ్ళీ వెనక్కు తీసుకొని ఉంటాడు. అలాంటి వాళ్ళను భయపెట్టడం కోసం నృగుడనే రాజు కథ సృష్టించారు. నృగ మహారాజు అన్నివేల ఆవులు బ్రాహ్మలకు దానం చేస్తే అవన్నీ లెక్కకు రాలేదు. కానీ దానమిచ్చిన ఏదో ఒక ఆవు దారితప్పి ఆయన  మందలోకి తిరిగి వచ్చినందుకు ఆయన కొన్ని వేల సంవత్సరాలు ఊసరవెల్లిగా బావిలో పడి ఉండవలసి వచ్చిందట.. అబ్బాయీ, నృగుని వంశీయులకు ఏ కొంచెం బుద్ధీ - తెలివి ఉండినా వాళ్ళు పొరపాటున కూడా గోదానం పేరు ఉచ్ఛరించి ఉండరు!
నేను - చిన్నాన్నా, మీతో వాదించడం ఎవరి తరం! కానీ చూడండి, ఈ భరత భూమిని ఎలాంటి - ఎలాంటి రాజులు పాలించారో.. భరతుని వల్ల ఈ దేశం పేరు ‘భారతదేశం’ అయింది. ఆయన తండ్రి దుష్యంతుడు జాతికే భూషణుడు కదా!
చిన్నాన్న - మునికన్య శకుంతల దుష్యంతుని మూలంగా తన కన్యాత్వం కోల్పోయింది. అయినా తర్వాత అతడామెను గుర్తించడానికి కూడా నిరాకరించాడు. అలాంటి కాముకుణ్ణి, పిరికివాణ్ణి జాతి భూషణుడంటున్నావా! జాతి దూషణుడనాలి. దుష్యంతుడనే పదానికి అర్థం కూడా అదే కదా! అరే, ఒకరిని మంచి ఒకరు కాముకులు, విషయాసక్తులు అయిన రాజులు ఇక్కడుండేవారు. యయాతి మహారాజు వృద్ధావస్థలో ఇంద్రియాలు శిథిలమైపోయినా భోగకాంక్ష తీరక పుత్రుని యౌవనం అరువు తీసుకొని భోగాలు అనుభవించాడు! ఇలాంటి ప్రచండ కామాసక్తికి ఉదాహరణ మరే దేశ చరిత్రలోనైనా ఉందంటావా?
నేను - చిన్నాన్నా, మీరు రెండో పార్శ్వాన్ని ఎందుకు చూడరు? ఈ దేశంలోనే శిబి, దధీచి లాంటి ఆదర్శ దానవీరులు కూడా పుట్టారు కదా!
చిన్నాన్న - అవును, శిబి చక్రవర్తి తన మాంసం కోసి ఇచ్చాడు. దధీచి వెన్నెముక దానం చేశాడు. అందుకని రేపు నీవు కూడా నీ ముక్కు కోసి ఎవరికైనా దానం చేస్తే నిన్ను నేను ఆదర్శంగా భావిస్తానా?
నేను - చిన్నాన్నా, మీరింతగా కొట్టి పడేస్తే నేనేమి చెప్పగలను?  కానీ చూడండి. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు ఈ ఏడుగురూ అమరత్వం పొందినవారుగా చెప్పబడ్డారు -
‘అశ్వత్థామా బలిర్వ్యాసోః హనుమాంశ్చ విభీషణః
కృపః పరశురామశ్చ మప్తైతే చిరజీవినః’
చిన్నాన్న చిరునవ్వుతో ఇలా అన్నాడు - ఈ శ్లోకానికి అసలు అర్థం తెలుసా? దరిద్ర బ్రాహ్మణుడు, మూర్ఖుడైన రాజు, ముఖస్తుతి చేసే పండితుడు, అంధభక్తుడు, కృతఘ్నుడైన తమ్ముడు, గర్విష్ఠి అయిన ఆచార్యుడు, కోపిష్ఠి బ్రాహ్మణుడు, ఈ ఏడుగురు ఈ భూమిపైన ఎల్లప్పుడూ ఉంటారు, అని. ఇది దేశ దౌర్భాగ్యమే అనుకో.
నేను - మన దగ్గర ఒకరిని మించి ఒకరు ఆదర్శ వ్యక్తులు ఎందరో ఉన్నారు. అయినా మీకు ఒక్కరు కూడా నచ్చరు… చూడండి. సతీసావిత్రిలాంటి ఆదర్శ స్త్రీలు ఈ దేశంలో పుట్టారు.
చిన్నాన్న - ఈ స్త్రీలలో ఎవరూ తమ తండ్రి మాట వినలేదు.  తల్లిదండ్రుల నెదిరించి తమ ఇష్టానుసారం ప్రేమపెళ్ళి చేసుకున్నారు. వీరినా నీవు ఆదర్శం అనేది.. ఈ రోజు నా కూతురు కూడా అదే పని చేస్తే నాకెలా ఉంటుంది? అందువల్లే  నేను సతీ సావిత్రి ఉపాఖ్యానం మా అమ్మాయిలను చదవనివ్వను. చూడు, ఈ ‘చరితావళి’ మీ ఇంట్లోకి వెళ్ళకూడదు.
నేను బాధపడుతూ అన్నాను - ఈ ఆదర్శాల వల్లనే కదా, మన దేశం ధర్మ ప్రాణదేశంగా చెప్పబడుతుంది! ఇక్కడ నిరుపమానమైన ఆదర్శాలను స్థాపించారు.
చిన్నాన్న - నిజమే. ఇందులో వారికి వారే సాటి. ప్రపంచంలో మరెవ్వరూ వారికి సాటి రారు. మోరధ్వజునిలో అతిథ్యోన్మాదం పెచ్చరిల్లి కొడుకును రంపంతో చీల్చి, వండి అతిథి ముందుంచాడు.. దీన్ని ఆదర్శమంటావా లేక పిచ్చితనమంటావా? ఒకరిలో దానోన్మాదం అతిశయిస్తే మరొకరిలో సత్యోన్మాదం అతిశయిస్తుంది! సుమతి అనే ఒకామెకు సతీత్వపైత్యం మితిమీరడంతో తన కుష్టురోగి భర్త భోగతృష్ణ తీర్చడంకోసం అతణ్ణి పైకెత్తుకొని వేశ్య ఇంటికి తీసుకొని పోయింది! వీళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలా? నేను మాత్రం వీళ్ళు మానసిక రుగ్మత ఉన్న మనుషులనే అంటాను.
నేను - మన రాజులు, బ్రాహ్మణులు ఉన్నత సిద్ధాంతాలను పాటించేవారు కారా?
చిన్నాన్న - అరే అబ్బాయ్, రాజు వద్ద బలం ఉండేది. బుద్ధి ఉండేది కాదు. బ్రాహ్మణుని వద్ద బుద్ధి ఉండేది, బలం ఉండేది కాదు. ప్రతి మాటకు ఒకరు శస్త్రం వెలికి తీస్తే, మరొకరు శాస్త్రం వెలికి తీసేవారు. ఒకరి చేతిలో చాపం ఎక్కుపెట్టి ఉంటే, మరొకరి నాలుకపైన శాపం రెడీగా ఉండేది. బ్రాహ్మణులకు తిక్కరేగితే ఏవో శాస్త్రవచనాలు కల్పించేవారు. రాజులకు తిక్కరేగితే ఏవో ప్రతిజ్ఞలు పూనేవారు. ఈ ప్రతిజ్ఞలవల్ల ఈ దేశంలో ఎన్ని ప్రాణాలు పోయాయో చెప్పలేము.
నేను - ప్రాణం పోయినా మాట తప్పకూడదనే పట్టుదల మనవాళ్ళలో ఉండేది కాదా!
చిన్నాన్న - అదే మూర్ఖత్వమంటాన్నేను. సిద్ధాంతాలు మనకోసం పుట్టాయి కాని సిద్ధాంతాలకోసం మనం పుట్టలేదు. అవి మనకు సాధనాలే కాని సాధ్యాలు (లక్ష్యాలు) కావు. లక్ష్యసిద్ధికి ఉపకరించక అడ్డంకులుగా మారినప్పుడు ఇక అవి మనకెందుకు? చెవిని తెగ్గోసే స్వర్ణాభూషణాన్ని అగ్గిలో పడేయడమే మంచిది కదా! చిన్ననాటి నీ మేజోళ్ళు ఇప్పుడు సరిపోవు. అందువల్ల వాటికి తగినట్లుగా నీ కాళ్ళు తెగ్గొట్టుకుంటావా?
నేను - మన సిద్ధాంతం మేజోళ్ళ లాగా మార్చుకొనే వస్తువు కాదు కదా!
చిన్నాన్న - ఎందుకు కాదు? ఒకానొకప్పుడు  భర్త చితిపైన సతి అయే స్త్రీని దేవతగా పూజించేవారు. ఇప్పుడు ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు పట్టుకొని పోతారు.
నేను - కానీ సిద్ధాంతవాదులు చట్టంలోని సెక్షన్లననుసరించి నడుచుకోరు కదా!
చిన్నాన్న - నడుచుకోకుంటే మానె. కనీసం బుద్ధిననుసరించి అయినా నడుచుకోవాలి కదా! కళ్ళు మూసుకొని ఆచరించదగిన సిద్ధాంతం అంటూ ఏదీలేదు. ఒక గురువు శిష్యుణ్ణి ‘నిండు తూర్పు దిశగా పో’ అని ఆదేశించాడనుకుందాం. అప్పుడా శిష్యుడు ముక్కుకు సూటిగా నడుస్తూ ఒక తాటి చెట్టుకు ఢీకొని ఒక అంగుళం కూడా చెట్టుకు కుడివైపుకు గాని ఎడమవైపుకు గాని మళ్ళి నడవను, అని మొండికేస్తే, దాన్ని ఆదర్శం అంటావా లేక మూర్ఖత్వం అంటావా ఈ మొండితనం కారణంగా ఎందరు రాజుల తలలు తెగిపోయాయి, ఎందరు రాణులు మాడి మసి అయ్యారు.. ఎన్ని రాజమందిరాలు శిథిలమై పోయాయి… మన చరిత్ర అంతా ఇలాంటి మూర్ఖత్వంతోనే నిండి ఉంది.
నేనడిగాను - చిన్నాన్నా, అయితే ఇలాంటి పౌరాణిక ఉపాఖ్యానాలు ఎందుకు రాశారు?
చిన్నాన్న - అరే, రాజులను మోసపుచ్చడానికి, శిష్యులతో శూద్రులతో సేవ చేయించుకోడానికి, స్త్రీలను అధీనంలో ఉంచుకోవడానికి, ఇన్ని ఉపాఖ్యానాలు కల్పించడం జరిగింది. ఉపాఖ్యాన రచయితలు ఏ నైతికాదర్శాన్ని చిత్రిస్తారో, ఒక సతి చీర చెరుగు నుండి అగ్నిజ్వాల వెలువడుతుంది. మరొకామె యమధర్మరాజు చేతుల్లో నుంచి భర్తను లాక్కొని  తీసుకొస్తుంది. ఇంకొకామె సూర్యనుని రథచక్రాన్ని ఆపి కాలగమనాన్నే అడ్డగిస్తుంది.. అతిశయోక్తి లేకుండా విషయం చెప్పడం మన వాళ్ళకు చేతకానేకాదు. దీని ఫలితం ఏమయింది? మన ఆదర్శ చిత్రాలు ఫోటోలు కాకుండా కార్టూన్లు అయిపోయాయి!
నేను - అయితే ఈ పౌరాణిక ఆదర్శాలకు విలువంటూ ఏమీ లేదంటారా?
చిన్నాన్న - మ్యూజియంలో ఉండే తుప్పు పట్టిన పాత డాలు - కత్తులకు ఏ విలువ ఉంటుందో, ఆ విలువే ఉంటుంది. అవి ప్రదర్శనకోసమే ఉంటాయి. ఉపయోగించడం కోసం కాదు.
నేను - అయితే ఈ పౌరాణిక ఆదర్శాలకు విలువంటూ ఏమి లేదంటారా?
చిన్నాన్న - మ్యూజియంలో ఉండే తుప్పుపట్టిన పాత డాలు-కత్తులకు ఏ విలువ ఉంటుందో, ఆ విలువే ఉంటుంది. అవి ప్రదర్శన కోసమే ఉంటాయి. ఉపయోగించడం కోసం కాదు.
నేను - చిన్నాన్నా, మన పాత్రల చిత్రణలో ఇంత అతిశయోక్తి ఎందుకుంది?
చిన్నాన్న - అరే అబ్బీ, అతిశయోక్తి మన రక్తంలోనే ఉందిరా! వేదాలకాలం నుండి మనం ఎవరిని  పొగుడుతామో, వాళ్ళను ‘త్వమర్కః త్వం సోమః’ (నీవు సూర్యునివి, నీవు చంద్రునివి) అని అకాశనికెత్తేస్తున్నాం. ఎవరిని నిందిస్తామో, వాళ్ళను పాతాళానికి తొక్కేస్తున్నాం. ‘ఏ కొండపైన హనుమంతుడు కాలు మోపుతాడో, ఆ కొండ క్షణంలో పాతాళానికి దిగబడిపోతుంది’ అన్నట్లు. మధ్యేమార్గం మనకు తెలియనే తెలియదు.
నీవే చూడు, మన సాహిత్యమంతా అతిశయోక్తులతో నిండి ఉంది. నాయిక పెద్ద - పెద్ద కళ్ళు అందంగా ఉంటే అవి ఆకర్ణాంతం (చెవుల దాకా) వ్యాపించి ఉన్నాయన్నారు. పుష్టపయోధరాలు పొంకంగా ఉన్నాయనిపిస్తే వాటిని స్వర్ణ కలశాలతో సమానంగా చేసేశారు. అరే, దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏ హద్దూ లేదు..
‘ముఖమస్తీతి వక్తవ్యం దశహస్తా హరీతకీ’
(నోరు ఉంది కాబట్టి అనేయవచ్చు. కరక్కాయ పది చేతుల పొడవుంటుందని!)
ఎవరికి ఏది తోస్తే అది రాసి పారేశారు. ఒకరు కొండనెత్తుకుంటారు1 ఒకరు సముద్రాన్నే తాగేస్తారు1 ఒకరు భూమిని పళ్ళతో ఇరికించుకుంటారు! ఒకరు సూర్యుణ్ణి మింగేస్తారు! ఒకరు చతురాననుడైతే, ఒకరు పంచాననుడు, మరొకరు షడాననుడు, మరొకరు దశాననుడు! ఒకరు చతుర్భుజుడైతే ఒకరు షడ్భుజుడు, మరొకరు సహ్రసభుజుడు.. ఒకరు వెయ్యి ఏండ్లు యుద్ధం చేస్తే ఒకరు ఐదువేల ఏండ్లు తపస్సు చేస్తారు.. మరొకరు పదివేల సంవత్సరాలు భోగిస్తారు! ఈ అతిశయోక్తుల ఉప్పెనలో మనం సత్యాన్ని మంచేశాం.
నేను - అయితే ఇవన్నీ  కపోలకల్పనలేనా?
చిన్నాన్న వ్యంగ్యంగా ఇలా అన్నాడు - ఎంతవరకైతే మన దేశంలో ఇలాంటివి రాసే దిగ్గజ పండితులు ఉంటారో, అంతవరకు ఈ మాట అనే ధైర్యం ఎవరికుంటుంది? మన ఒక్క మహావీరుడు ఆంజనేయుడు వస్తే చాలు, అన్ని దేశాల సైన్యాలను తన తోకతోటి చుట్టేసుకుంటాడు! ఒక్క అగస్త్యముని వస్తే చాలు. ఓడలతో సహా అన్ని సముద్రాలూ తాగి ఖాళీ చేసేస్తాడు! ఒక్క వరాహ అవతారం అయితే చాలు. భూమినంతా ఎత్తి ఫుట్ బాల్ లాగా విసిరి పారేయగలడు! ఒక్క వామనుడు వస్తే చాలు. ఒక్క అఢుగులో చంద్రుణ్ణి ఆక్రమించేస్తాడు.  వేరే - వేరే దేశాల వాళ్ళు కొత్త కొత్త అద్భుతయంత్రాలు కనిపెడుతూ ఉంటే, కనిపెట్టుకుంటూ ఉండనివ్వండి. మన పని మాత్రం అవతారాల ద్వారానే జరిగిపోతుంది. ఒక్క అవతారం ఇప్పుడే వస్తే అన్ని సమస్యలూ చిటికెలో తీరిపోతాయి. ఒక్క హూంకారంతో ఆహారధాన్యాల పర్వతం ఎదుట నిలుస్తుంది, ఒక్క బాణంతో ఎదుట పాలు-పెరుగుల సముద్రం తరంగాయిత మవుతుంది..
నేను - చిన్నాన్నా, మీరు అతిశయోక్తుల అజస్ర ధారనే ప్రవహింప చేశారు!
చిన్నాన్న నవ్వుతూ అన్నాడు - అరే, నన్ను ఎవరి వంశం వాడనుకున్నావు? రక్తధర్మం ఎక్కడికి పోతుంది? విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇతర దేశాలు ఉండనే ఉన్నాయి. కల్పనా విలాసం కొనసాగించే బాధ్యత మోయడానికి కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా?
సరే అబ్బాయ్, ఇక నీ ఆల్బమ్ తీసుకెళ్ళు, ఇలాంటి ఆదర్శాలు నాకక్కరలేదు. నేను యదార్థవాదిని.

తెలుగు సేత:   జె.లక్ష్మిరెడ్డి

తాత్విక వైఫల్యం-నైతిక సంక్షోభ సమస్యలు--ఎమ్.ఎన్.రాయ్

మనం నేడు నైతిక సంక్షోభంలో ఉన్నాం. ఈ సంక్షోభ సమస్యలు అవగాహన చేసుకోవడానికి అనుభవ వాద దృక్పథాన్ని స్వీకరిద్దాం. అసలు సంక్షోభం ఉన్నదనే భావనతో మనం ప్రారంభించనక్కరలేదు. సమకాలీన ప్రపంచ పరిస్థితిని నిశితంగా సమీక్షించడంలోనే కొత్తదారి అనుసరించవచ్చు. నేటి పరిస్థితిని గమనించిన ఆలోచనాపరులు తప్పనిసరిగా తాత్విక రీతులను, సిద్ధాంత ప్రతిపాదనలను పునరాలోచించవలసి వచ్చింది. తత్ఫలితంగా సంక్షోభం ఉన్నదనే నిర్ణయానికి వారు వచ్చారు. ఈ సమస్యను ఇంతవరకూ విద్యావేత్తల దయాదాక్షిణ్యానికి వదలివేశారు. కానీ ఈ సమస్యలు కేవలం ఆలోచనకే పరిమితం కాకుండా కేవలం తార్కిక, నైరూప్య విద్యావిషయక సమస్యలుగానే మిగిలిపోకుండా, వాస్తవ జీవితంలో కూడా ఎదురవుతున్నాయి. నాగరిక ప్రపంచం నిన్నమొన్నటి నుంచే కాదు, రెండు తరాలుగా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నది. ఉన్మత్తతతో కూడిన యుద్ధ పరంపరలు, హింస, నైతిక వివేచనా ప్రమాణాలు ప్రజాజీవితంలో ప్రతిచోటా క్రమంగా జారిపోవడం, స్పష్టంగా కనిపించింది. మానవ మేధస్సును ఈ సమస్యలు గందరగోళపరచాయి. జాతీయ అంతర్జాతీయ రంగంలో ఇన్నాళ్ళుగా మానవ జాతికి సాంఘిక జీవనంలో దారిచూపిన సిద్ధాంతాలు, భావాలు, ఈ కొత్త సంక్షోభంలో తోడ్పడలేక పోయాయి. ఈ అనుభవం వల్ల మానవచరిత్ర ఒక దశకు చేరుకొన్నదనే అభిప్రాయానికి వచ్చారు. పరిస్థితిని సమీక్షించి గతాన్ని సింహావలోకనం చేసి, ప్రస్తుత భావాలను పరిశీలించి, కోరుకొన్న ఆదర్శాలను నిశితంగా విమర్శించి, మానవుడు, నిరాశ, నిస్పృహ చెంది నిస్సహాయ స్థితికి రావడానికి దోషం ఎక్కడ ఉందో అంచనా వేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. పరిస్థితులను నిశితంగా పరిశీలించిన అనంతరం కొత్త అనుభవం, జ్ఞానం చూపే వెలుగు ఆధారంగా కొన్ని పాత విలువలను నిరాకరించడమో, మార్చడమో చేయాలి. కొత్త భావాలు, ఆదర్శాలు ఆలోచించి రూపొందించాలి. అవే భవిష్యత్తుకు మార్గదర్శకంగానూ, ఉత్తేజాన్ని ఇచ్చేవిగానూ ఉంటాయి. ఇవన్నీ నైరూప్య వైజ్ఞానిక సమస్యలు కావు. నా రాజకీయ క్రియాశీల జీవితంలో నా సమస్యలుగా వీటిని ఆలోచించటం ప్రారంభించాను. అనేక మందివలె నేను కూడా నమ్మకంతో ప్రారంభించాను. అయితే ప్రాచీన మత భావన సరిపోదని, మతాన్ని వివేచనాత్మకం చేయాలనీ, దేవుణ్ణి వైజ్ఞానికంగా భావించాలని అనుకున్నాను. నేనప్పుడు జాతీయ వాదిని. జాతీయ వాదోద్యమంలో అనుభవాలు, దాని సాధ్యాసాధ్యాలకు మించి నన్ను సందేహాస్పదుణ్ణి చేశాయి. జాతీయ వాద పద్ధతులను, ‘ఆధ్యాత్మిక’ సిద్ధాంతాలను కూడా నేను అనుమానించాను. మార్క్సిజం వాస్తవమైనది గానూ, జాతీయ వాదిని గందరగోళపరచే సమస్యలకు సరైన పరిష్కార మార్గంగానూ నాకప్పుడనిపించింది. హేతుబద్ధమైన మతానికి అతీతంగా జీవన విధానాన్ని మార్క్సిజం ద్వారా ఆమోదించటం సంభవించింది. అయితే నేనెన్నడూ సనాతన మార్క్సిస్టును కాను. మార్క్సిజాన్ని తొలుతనుంచీ నిశితంగానే పరిశీలించాను. మార్క్సిజం సహాయంతో జీవిత సమస్యలను పరిష్కరించాలనే ప్రయత్నానుభవం వల్ల, కమ్యూనిజం సర్వరోగ నివారిణి కాదని నిర్ధారణకు వచ్చాను. దేశంలో ప్రజా సంక్షేమం పెంపొందించడానికి, ప్రజాస్వమిక స్వేచ్ఛను వ్యవస్థాపించడానికి, సాంఘిక న్యాయాన్ని సమకూర్చడానికి, రాజకీయ, పునర్నిర్మాణం జరగాలని దేశంలోని మేధా సంబంధమైన, సాంస్కృతిక, భావ పరిస్థితులు మారకుంటే ఇది సాధ్యం కాదని నిశ్చయానికి వచ్చాను. భారత మానవాళి స్థితిగతులను మెరుగుపరచాలనే వివిధ ప్రయత్నాలలో సాధించిన అనుభవమే ఇదంతా. క్రమంగా పాత నమ్మకాలు, భావాలు, ఆదర్శాలు దోషబద్ధమైనవనే గుర్తింపు కలిగింది. ఇది కేవలం వ్యక్తిగతానుభవం కాదు. మానవ అనుభవాల సమ్మేళనం వల్ల రాబట్టిన సర్వసాధారణ విషయమే. మార్క్స్ రాజకీయ సిద్ధాంతాలు, సామాజిక విషయాల దోషాలు, అసంబద్ధతలు అనుభవంలో రుజువైనప్పటికీ పదార్థవాదం ఒక్కటే సాధ్యమైన తత్వమని దృఢ నిశ్చయానికి వచ్చాను. ఇదొక అంధ విశ్వాసం కాదు, మేథస్సు నిర్ణయ ఫలితమే. కాబట్టి పదార్థవాదానికి, ముఖ్యంగా దాని విశ్వ శాస్త్రానికీ ఎదురవుతున్న, బలీయమైన శక్తులను గమనించాను. పదార్థవాదానికి నీతిశాస్త్రం ఉండదన్నారు. ప్రకృతి తత్వానికి, నైతిక తత్వానికి తార్కిక సంబంధం లేదన్నారు. ఒకవేళ విశ్వశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలను పదార్థ శాస్త్రం ఎదుర్కొన్నప్పటికీ, అంతమాత్రాన తర్కబద్ధమైన నీతిశాస్త్రం రాబట్టే అర్హత పదార్థవాదానికి లేదన్నారు. కనుక నేటి నైతిక సంక్షోభానికి పదార్థతత్వం, మార్గాంతరం చూపలేదన్నారు. పదార్థ విశ్వశాస్త్రం నుంచి, తార్కికంగా, మతరహితమైన, వివేచనాత్మకమైన నీతిశాస్త్రాన్ని రాబట్టవచ్చు. అలౌకికంగానూ, ఇంద్రియాతీత శక్తితోను నిమిత్తం లేని నైతిక తత్వమే నేడు కావాలి. ఒక అర్థ శతాబ్దం నుంచి పదార్థవాదాన్ని విశ్వశాస్త్రంగా గుర్తించడం విషయం పరిశీలిస్తున్నారు. ఈ శతాబ్దారంభంలో కొందరు పదార్థ శాస్త్రజ్ఞులు పదార్థానికి మూలం అణువు కాదని కనుగొన్నారు. ఆ సాక్ష్యాధారంతో, తొందరపడి పదార్థం ‘పదార్థం కాకుండా పోయిందని’ ప్రకటించారు. 19వ శతాబ్ద సహజ తత్వం ఎంతవరకు సబబు, సరైనది అనే విషయమై కొందరు సందేహం వ్యక్తపరిచారు. ప్రపంచానికి ఆధారం ఘనపదార్థం కాదని పదార్థ విజ్ఞానం బయటపెట్టటంతో, పదార్థ వాద నిర్మాణం అంతా కూలిపోతున్నట్లు తత్వవేత్తలు ఊహించారు. నేటి సంక్షోభానికి ఆరంభం అక్కడే అయింది. మతానికీ-విజ్ఞానానికీ, మతపరమైన ఆలోచనకూ-విజ్ఞానపరమైన ఆలోచనకూ, విశ్వాసానికీ-వివేచనకూ, మార్మిక అజ్ఞానవాదానికీ- అనుభవరీత్యా వ్యవస్థాపితమైన మానవ జ్ఞానార్జనపట్ల నమ్మకానికి, చిరకాలంగా సాగుతున్న పోరాటం కొత్తగా ప్రజ్వరిల్లింది. జీవన్మరణ పెనుగులాటలో బహుశ చివరి దశ కావటంలో ఈ పోరాటం ఎక్కువకాలం కొనసాగి నాగరిక మానవాళిని సంశయ స్థితిలో ఉంచింది. 2వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఏమి జరిగిందో, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మనం అనుభవ పూర్వకంగా చూస్తున్నాము. బౌద్ధవాదం నాడు శాస్త్రీయ ఆలోచనగా ఉన్నది. దాదాపు వేయి సంవత్సరాలు విలసిల్లిన బౌద్ధవాదం హిందూ వాదాన్ని అత్యంత ఉన్నత దశనుండి కిందకు తోసింది. చివరికి సనాతన సంప్రదాయమే విజయం పొందింది. ప్రత్యక్ష జ్ఞానం లేకపోవడం, సర్వసాధారణమైన మేధా సంబంధమైన వెనుకబడినతనం వల్ల ఇలా జరిగింది. బౌద్ధవాదం ఓడిపోవడం దేశంలో దురదృష్టకరమైన అనుభవాలలో ప్రధానంగా పేర్కొనదగింది. చరిత్రలో జరిగిన ఆ దెబ్బ నుంచి దేశం ఎప్పటికీ కోలుకోలేదు. అటువంటి ప్రమాదంతోనే సమకాలీన ప్రపంచానికి సమస్య ఎదురవుతుంది. మతాన్ని అత్యున్నత దశనుంచి అథఃపాతాళానికి త్రోసింది వైజ్ఞానికి ఆలోచన. అదృశ్యమవుతున్న శత్రువు ఆఖరి దెబ్బకు తట్టుకో చూస్తున్నది. పదార్థవాదంపై ‘వైజ్ఞానిక’ ఆయుధాలతో పోరాడుతున్న సునిశిత తత్వాలను విడమరచి చూస్తే అవి హేతుబద్ధం చేసిన మతాలే. మానవుడికి ఎన్నడూ ఏమీ తెలియదని వాదిస్తున్న వీరు నవ్యమార్మిక వాదాన్ని ప్రబోధిస్తూ, జీవితానికి మతపరమైన ప్రయోజనమున్నదనే వాదాన్నితిరగదోడుతూ, మానవుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నారు. నేటి సంక్షోభానికి కీలకం ఇక్కడే ఉంది. దీని నుంచి బయట పడాలంటే మానవజాతికి ఒక తత్వం అవసరం. అందులో మానవుడే విశ్వంలో కేంద్రంగా ఉండాలి. తన విధికి తానా సృష్టికర్త అయిన మానవుడు మతం మీద విజ్ఞానం అంతిమ విజయాన్ని ఉత్సవంగా జరుపుకోవాలి. సాంస్కృతిక సంక్షోభం కొందరు సాంస్కృతిక సంక్షోభాన్ని గురించి మాట్లాడుతున్నారు. అటువంటి సంక్షోభం ఉంటే అది కేవలం సునిశితమైన మేధావులు అనుభవించేది మాత్రమే. వాస్తవానికి అది వారి మేధస్సులోని సంక్షోభం మాత్రమే. లేకుంటే విజ్ఞానంతో కూడిన ఆధునిక మానవుడు పాతకాలపు దేవుడి స్థానంలో గణిత సంబంధమైన దేవుడికి పట్టం కట్టాలని ఆతృత పడటం, దైవంతో నిమిత్తం లేని వారంతా ఆత్మకోసం అన్వేషించటం మొదలైన వింత సంఘటనలు ఎలా అర్థం చేసుకోవాలి? శంకరాచార్యుని పాండిత్యవాదం మేధాసంపత్తిలో అత్యున్నత దశకు చెందినది. దేశంలో బీటలు వారిన మతపరమైన ఆలోచన తిరిగి స్థాపించడానికి శంకరుడి వాదన తోడ్పడింది. మొదట అలా బీటలు వార్చింది బౌద్ధవాదం. నేడు కూడా ప్రజ్ఞాశాలురైన పండితులు శంకరుడు చేసిన కొంటెతనంలో సఫలీకృతులు కావచ్చు. ప్రాపంచిక అనుభవాలూ, ప్రత్యక్షవాదం, ‘వాస్తవ వాదం’ మొదలైన మిడిమిడి వైజ్ఞానిక వాదాలతో మతాన్ని తిరగదోడవచ్చు. ఈ ప్రమాదానికి తట్టుకోవాలంటే స్వయం సంపూర్ణ తత్వం అవసరం. పదార్థ విశ్వశాస్త్రంతో ప్రారంభించి, మతరహిత పరిణామయుతమైన నీతి శాస్త్రంతో ముగించే తత్వం కావాలి. అటువంటి తత్వం మానవుడి మనుగడ గురించి సమగ్రమైన చిత్రణ ఇస్తుంది. మానవుని ఉనికిని వివరిస్తుంది. మానవ అవగాహనకు అందుబాటులో ఉండే భౌతిక ప్రపంచాన్ని దాటిపోకుండా, కోరిక, ఉద్రేకం, ప్రేరణ, అంతర్భుద్ధి, ఇచ్ఛ, వివేచన అంటే ఏమిటో వివరించడానికి సాధ్యపడుతుంది. నేటి సంక్షోభం అన్నిచోట్లా వ్యాపించింది. మెలకువ కలిగిన సునిశిత వ్యక్తులులా అందరూ ఆ విషయాన్ని గ్రహించకపోవచ్చు. ఆ మాటకొస్తే సంక్షోభంలో చిక్కుకున్నవారే తమ స్థితిని గ్రహించకపోవచ్చు. అందువల్ల పరిష్కారం ఇంకా జటిలమవుతున్నది. సంక్షోభాన్ని గురించి విస్తారంగా తెలుసుకొనేటట్లు చేయడం ప్రథమ కర్తవ్యం. సంక్షోభానికి కారణమేదైనా, సామాన్యుడి నిత్యానుభవ జీవిత సంఘటనలో ఇది వ్యక్తమవుతూ ఉంటుంది. వ్యావహారిక రీత్యా సర్వసాధారణమైన చైతన్యాన్ని తీసుకరావచ్చు. సంక్షోభాన్ని గురించిన ఈ చైతన్యం ఒకసారి కలిగిస్తే దానికి కారణాలు, మార్గాంతరాలు తెలుసుకోవలానే కోరిక ప్రబలుతుంది. ఉదాహరణకు మన దేశాన్ని చూద్దాం. అనేక శతాబ్దాలుగా సామాన్య ప్రజలు దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇదంతా విదేశీయుల వల్ల అని నమ్మారు. ఇప్పుడు విదేశీయులు వెళ్ళిపోయారు. పరిస్థితి బాగుపడిందా? త్వరలో మెరుగుపడే ఆశ ఉన్నదా? ధరలు పెరిగాయని ప్రజలకు తెలుసు. వారికి కావలసినంత ఆహారం, వస్త్రాలు లభించవు. రైతులు పండిస్తూనే ఉన్నారు. కాని వస్తువుల ధరకు ఆహారం అందుబాటులో ఉండదు. రైతులు తమకు కావలసిన వస్తువుల నిమిత్తం 3 రెట్లు అధికంగా ధర ఇచ్చికొనుక్కోవలసి వస్తున్నది. వస్త్రాల ఉత్పత్తి సమృద్ధిగా జరుగుతున్నది. అయినా కొరత ఉన్నది. ధరలు ఆకాశానికి అంటుతున్నది. ఇదొక చిక్కు సమస్య, ప్రస్తుతం మూక స్వామ్యంలో మోస పోతున్న ప్రజలకు, దోషం సమస్య, ప్రస్తుతం మూక స్వామ్యంలో మోసపోతున్న ప్రజలకు, దోషం ఎక్కడ ఉందో చూపవచ్చు. ఎవరికీ దురుద్దేశాలు అంటగట్టకుండానే, పరిస్థితిని ఇంత హీనంగా ఉందనవసరం లేదని, ప్రజలు అనుభవించే కష్టాల నుంచి విమోచన సాధ్యమనీ సునాయాసంగా చూపవచ్చు. అయితే పరిస్థితి ఇలా ఎంచుకున్నదని ప్రజల ప్రశ్నించడం విచారణ అనేది జ్ఞానానికి దారి తీస్తుంది. జ్ఞానం శక్తి నిస్తుంది. అప్పుడు ఆత్మ విశ్వాసం సమకూడుతుంది. ఆత్మ విశ్వాసం కోల్పోయిన మానవుడు నిస్సహాయత వ్యక్తపరుస్తాడు. తన సృజన శక్తిలో నమ్మకాన్ని విస్మరిస్తాడు. సంక్షోభానికి అదే తుది కారణం. నేటి సంక్షోభానికి ఆచరణ యుక్తమైన పంధా కావాలి. విలువలతో కూడిన వివాదాస్పద విషయాలను రూపు రేఖలు లేకుండా చర్చించటం ప్రారంభిస్తే, సంక్షోభానికి మూలం పట్టుకోవడం సాధ్యపడదు. యుద్ధం నేడు ప్రపంచంలో ఎక్కడ విన్నా మరో యుద్ధం మాట వినిపిస్తున్నది. నేడు కావలసింది శాంతి. యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. అయినా యుద్ధం ముంచుకొస్తున్నది. ఆధునిక యుద్ధాన్ని గురించి తెలిసిన ప్రతి ఇంగిత జ్ఞాని కూడా యుద్ధాన్ని వ్యతిరేకించాలి. ఈ వ్యతిరేకత కేవలం నైతిక పరమైన ఉద్దేశాలతోనే గాక స్వార్థం వల్ల కూడా జరగాలి. నేడు యుద్ధం అంటే రెండు వైపులా పదును గల కత్తివంటిది. యుద్ధం ఉభయ పక్షాలను నాశనం చేస్తుంది. యుద్ధంలో ఓటమికి ఎంత అవకాశం ఉందో గెలుపుకూ అంతే ఉంది. యుద్ధంలో విజయం అంతా వినాశనంతో కూడిన విజయమే. అందుకే ఎవరూ యుద్ధాన్ని కోరుకోవడంలేదు. అయినప్పటికీ యుద్ధం తప్పనిసరి అని ప్రతివారూ ఆలోచిస్తున్నట్లున్నది. ఈ స్థితిని ఎవరు కల్పించారు? ఇదేదో విధివలె మారింది. ప్రతివారికీ భయానక పరిణామం పట్ల ఆందోళన ఉంది. అయినా ఈ పరిణామం తప్పదంటున్నారు. మానవుడి నిస్సహాయత, నిరాశ ఒక స్థాయికి చేరుకొన్నాయి. భవిష్యత్తును గురించి మానవుని దృక్పథమే సంక్షోభానికి మూలం. రాజకీయ సిద్ధాంతాలు రాజకీయ వ్యవహారాలు ప్రతిచోటా ఎలా ఉన్నాయో పరిశీలింపబడి, సరైనవని అనిపించే రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయి. అన్నీ ప్రజాస్వామ్యాన్ని గురించే ప్రస్తావిస్తాయి. కానీ ప్రజల యొక్క, ప్రజల చేత ప్రభుత్వం ఏర్పడటం ఎక్కడా లేదు. 19వ శతాబ్దంలో రూపొందించిన భావాలు, ఆదర్శ సిద్ధాంతాలకూ, నేటి ఆచరణకూ పెద్ద అఖాతం ఉంది. ఎందుకని? ఆధునిక కాలంలో ఆర్జించిన జ్ఞానం నుంచి మానవుడు తమ మేథస్సును, వివేచననూ ఉపయోగించి పూర్తి అవకాశాలు సాధించకోలేకపోయాడు. వాస్తవ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి ఆధునిక జ్ఞానాన్ని అన్వయించలేక పోయారు. గత ఏభై సంవత్సరాలలో ఈ వైఫల్యం ఇంకా స్పష్టమయింది. మానవుడు నేటి నిస్సహాయత, నిరాశ దశలను చేరుకొన్నాడు. మానవ ప్రతిభ పూర్తిగా వ్యయం అయిపోయినట్లు అనిపిస్తున్నది. సిద్ధాంతాలు అద్భుతంగా ఉన్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టనందువల్ల నేటి సంక్షోభం ఏర్పడిందనడం సరికాదు. ఈ ధోరణి ఆత్మవంచనే. రాజకీయ సిద్ధాంతాలూ, ఆర్థిక విషయాలూ, ఆధునిక జీవిత సమస్యలను పరిష్కరించ గలిగితే ప్రపంచం దారి తెన్నూలేన నేటి స్థితికి చేరేదేకాదు. ఉదారవాదం, ప్రజాస్వామ్యం, మార్క్సిస్టు సిద్ధాంతాలు ఆచరణలో పెట్టారు. అన్నీ లోపంతో కూడినవని తేలింది. అందుకే సంక్షోభం, నిరాశ, నిస్పృహ, నిస్సహాయత జనించాయి. ఫాసిజాన్ని విమర్శించారు, ఖండించారు. అయితే ఆధునిక ప్రపంచంలో గాలివానవలె, అది ఎట్లా రాగలిగింది? ఫాసిజం తలెత్తిందంటే, ఇంతవరకూ, ఆలోచించి ఆచరణలో పెట్టిన ప్రజాస్వామ్యం విఫలమయింది. సమకాలీన చారిత్రానుభవాన్ని చూస్తే, సంప్రదాయబ్ధమైన, విప్లవ పూరిత, సమాజిక, రాజకీయ ఆర్థిక భావాలు తృణీకరించదగినవని స్పష్టపడింది. ఉత్తమమైన స్వేచ్ఛా సమాజాన్ని నిర్మించడానికి కావలసినంత ఉత్పత్తి చేయటం సాధ్యమే. పరిస్థితిని వాస్తవంగా విశ్లేషించి చూచిన అనంతరం ఒకే ఒక నిర్ణయాన్ని రాబట్టవచ్చు. ఇప్పటివరకూ ఆదరించిన భావాలు, ఆచరించిన ఆదర్శాలు దోషపూరితమే కాక, ఎండమావులవంటివి కూడా. ఇతర కాలాలలలో, భిన్న పరిస్థితులలో, ఇవి బహుశ మంచి ఫలితాలను ఇచ్చేవేమో.. నేడవి కాలదోషం పట్టినవి, అసంబద్ధమైనవి. 18, 19వ శతాబ్దాల భావాలతో 20వ శతాబ్ద సమస్యలను పరిష్కరించబోతే, వైఫల్యం, నిరాశ తప్పవు. ఇప్పటి వరకూ సాధించిన భౌతిక ప్రగతి స్థాయికి మానవుడి భావాలు అందుకోలేవు. భౌతిక ప్రగతికీ భావ పరిణామానికీ ఉన్న అఖాతమే సంక్షోభానికి మరొక కారణం. నిశిత పరిశీలకుడికీ, విమర్శనాత్మక విద్యార్థికీ సమకాలీన ప్రపంచ పరిస్థితి అంతా దిగజారిపోయిన పతనావస్థగా కనిపిస్తుంది. వినాశకారి అయిన యుద్ధంగానీ, ఆధునిక నాగరికత క్రమంగా పతనం గావటం కాని జరిగి మళ్ళీ అంధకార యుగంలోకి వెళ్ళవచ్చుననిపిస్తుంది. ఈ చిక్కు నుంచి మార్గాంతరం లేదా? మానవుడి ప్రతిభావ్యుత్పన్నతలు నేడు ఎన్నో అంచలుగా బహిర్గతమవుతున్నవి. అతడికి ఎక్కువ తెలియడమే గాక, గతంతో పోల్చితే అనేక పనులు చేయగల సత్తా సమకూడింది. కనుక నిరాశకు తావులేదు. ప్రమాదాలను రాకుండా చేయటం కుాడా సాధ్యమే. ఈ నిర్ణయాన్ని బట్టి ఆలోచన సాగాలి. మానవుడి సృజన శక్తికి, ముందుకు పోవాలనే పిపాసకు ఏదో అడ్డుపడుతున్నది. మేథస్సుకు అవధులు ఏర్పడుతున్నవి. స్వేచ్ఛా హద్దులు విస్తరించుకోటానికి ఆటంకం ఏర్పడుతున్నది. ఈ విషయాలన్నీగమనిస్తే కొత్తతత్వం అవసరమనిపిస్తుంది. అటువంటి తత్వాన్ని రూపొందించటానికి ముందు అనుభవ గుణపాఠంతో రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలన్నిటినీ - సంప్రదాయమైనవీ, విప్లవాత్మకమైనవీ కూడా సమీక్షించి ఉంచవలసి ఉంటుంది. అప్పుడు మన నిర్ణయానికి బలం చేకూరుతుంది. సమకాలీన ప్రపంచం ఇంతవరకూ సంక్షోభానికి సంబంధించిన భిన్న సిద్ధాంతాలు, సంక్షోభాన్ని తొలగించుకోటానికి చేసిన సూచనలు తార్కికంగా దోషబద్ధం కావటమో, ఆచరణలో నిష్ప్రయోజనం కావటమో గమనించాం. ఈ సిద్ధాంతాలన్నీ వివేచనాత్మక వైజ్ఞానిక దృక్పథంతోనే ఆధునిక జీవిత సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నించాయి. మానవుడు తనలో విశ్వాసాన్ని కోల్పోవటమే సంక్షోభానికి మూలమని ఈ సిద్ధాంతాలన్నీ చెపుతున్నాయి. జీవితానికి మతపరమైన ప్రయోజనం ఉన్నదనే దృక్పథాన్ని హేతుబద్ధంగానో, మార్మికంగానో ఈ సిద్ధాంతాలన్నీ చెబుతున్నాయి. జీవితంలోనూ, చరిత్రలోనూ మానవునికి మానవునిగా ప్రాధాన్యతలేదని సర్వసాధారణంగా ఈ సిద్ధాంతాలు పేర్కొంటున్నవి. మార్మికమైనవి, తెలియరానిది, తెలుసుకోజాలనిది అనే వాటిలో విశ్వాసం చూపితే మానవునికి అదొక్కటే నైతికంగా సాధ్యమని అర్థం వస్తుంది, అదికూడా వదిలేస్తే మానవుడు లక్ష్యరహితంగా నిస్సహాయంగా జీవిత సముద్ర సంక్షోభంలో కొట్టుకపోతాడు. సమకాలీన ప్రపంచాన్ని గురించి ఈ విధంగా వర్ణించి వివరించాడు. అయితే మానవ చరిత్రలో ఈ నమూనాలో చూడటం దేనికి? సోరోకిన్ తన పిడివాద సిద్ధాంతంలో చూపినట్లుగా, ముందే నిర్ధారితమైన వలయాలలోనే పయనిస్తున్నట్లు ఎందుకు భావించాలి? హేతుబద్ధమైన, ‘వైజ్ఞానిక’ సిద్ధాంతాలలో అంతర్లీనంగా ప్రథమ కారణం లేదా ఆదిశక్తిపట్ల నమ్మకం కనబడుతున్నది. ఈ సిద్ధాంతం వెనక గల మత సారాంశం కూడా స్పష్టమే. భావాదర్శ సంస్కృతి అత్యున్నత సంస్కృతి రూపంగా భావించటం జరుగుతున్నది. సోరోకిన్ చూపే ఆదర్శభావ సంస్కృతులలో అస్పష్టత ఏమీ లేదు. అది ఆధ్యాత్మికమైనది. ఇంద్రియ గ్రహణ సంస్కృతి పదార్థవాద పరమైనది. పదార్థవాదాన్ని అతిహీనంగా చిత్రించారు. కాని నియతివాదాన్ని అంత సులభంగా కొట్టిపారవేయలేకపోయారు. జీవితానికి ప్రయోజనం ఉందనే వాదం నిర్ధారితవాదమే. మానవ చరిత్రగతి అంతా ఒక నిర్ణీత క్రమంలో, విషవలయంలో పునరావృతమవుతూ ఉంటుందన్నారు. అంతే కాదు. ఈ విధానం ముందే నిర్ధారితమయింది కూడా. ఎందుకంటే నిర్ధారిత విధానం ఈ క్రమంలో అంతర్గతంగా లేదు కనక అదొక దైవికమైన యంత్రమన్నమాట. సోరోకిన్ నిర్మొహమాటంగా మతపరమైన తిరోగమన వాదాన్ని కోరాడు. విశ్వాసాన్ని పునరుద్ధరించాలన్నాడు. ఈ సిద్ధాంతాన్ని మతపరమైనది అన్నంత మాత్రాన దీనిని తిరస్కరించినట్లు అర్థం కాదు. ఇందులో పరస్పర విరుద్ధ లక్షనాలను బయట పెట్టారు. అదికూడా స్పష్టమే. ఇంద్రియ జ్ఞానానికి సంబంధించిన సంస్కృతి చెడ్డదైతే అందులోనుంచి భావాదర్శాలకు సంబంధించిన మంచి సంస్కృతి ఎలా జనిస్తుంది? మానవ జీవితాదర్శం భక్తి సంస్కృతిలో పరిపక్వత చెందేటట్లయితే, మానవుడు మళ్ళీ భగవంతుని కరుణా కటాక్షాలను ఎందుకు కోల్పోవాలి సాంస్కృతిక వలయాలకు సంబంధించిన మొండి సిద్ధాంతంలో అర్థంలేదు. మానవుడు విశ్వాసం అనే భద్రతావస్థ నుంచి చాలా దూరం జరిగిపోయాడు. ఆ అవస్థలో ఆధ్యాత్మిక బానిసత్వమే తప్ప ఇంకేదీ లేదు. దారీ తెన్నూలేని జీవిత సాగరంలో పయనిస్తూ మానవుడు ఆత్మ విశ్వాసాన్ని పెంచుకొని అందులోనే వాస్తవమైన భద్రతను కనుగొనాలి. *సోరోకిన్ ప్రకారం మానవుడు మళ్ళీ దైవ విశ్వాసంలో భద్రతను చేకూర్చుకోవలసి ఉంటుంది. ** మారటన్, బెర్డెవ్ లు చెప్పేదాంట్లో కూడా ఆట్టే చెప్పుకోదగినంత భిన్న విషయాలేమీ లేవు. మానవుడు విశ్వాసం, భయానుభవం నుంచి దూరమై పోతూ మళ్ళీ వాటివైపుకే వస్తాడు. వీరందరూ ఆక్రందించేది ఒక్కటే, మళ్ళీ మతపరమైన ఆలోచన వైపుకు పోదాం. సనాతన తిరోగమన వాదం నుంచి ఈ కొత్త మత తత్వాలకు గల తేడా ఏమిటంటే, వీరు హేతువాదం, విజ్ఞానాలతో పొత్తు పట్టుకోవటమే. అయితే విశ్వాసాన్ని వివేచనతోనూ, మత జ్ఞానాన్నీ మార్మిక వాదాన్ని మానవతా వాదంతోనూ, మధ్య యుగాల వాదాలను ఆధునిక వాదాలతోనూ పొందికచేసే ప్రయత్నాలలో వైఫల్యం కాక తప్పదు. నైతిక విలువలు పునరుద్ధరించాలనే విజ్ఞప్తిని బలపరచవలసి వుంటుంది. అయితే ఆధునిక మానవుని నీతికి, అలౌకిక ఆధారంతో నిమిత్తం లేని ప్రమాణం కావాలి. (*1889లో రష్యాలో జన్మించిన పిటివిన్ అలెగ్జాండర్ రోవిచ్ సోరోకిన్ అమెరికాలో సుప్రసిద్ధ సామాన్య శాస్త్రజ్ఞుడుగా పేరొందాడు. ** జాక్ మారటన్ 1882లో పుట్టాడు. ఫ్రెంచి తత్వవేత్త, మతజ్ఞాని రాజనీతిజ్ఞుడు.) మార్క్సిస్టు సిద్ధాంతం మార్క్సిస్టు సిద్ధాంతం కూడా ప్రయోజనవాదమే, ఉత్పిత్తి శక్తులవల్ల చరిత్ర సృష్టించబడింది. అందులో మానవుడు చేయగలిగింది అత్యల్పం, ఆవశ్యకతను మానవుడు గుర్తిస్తే అప్పుడు స్వేచ్ఛాపరుడవుతాడు. ఒకసారి నీవు స్వేచ్ఛాపరుడవు కావని గ్రహిస్తే మార్మికమైన ఉత్పత్తి శక్తులతో కాళ్ళూ చేతులూ కట్టివేయబడినాయని తెలుసుకుంటే నీవు స్వేచ్ఛాపరుడవు. మార్క్సిస్ట్ స్వేచ్ఛా భావన అంటే వ్యక్తి బానిసగా ఉండటం, స్వచ్ఛందంగా బానిసలంతా కలిసి సమాజంగా ఏర్పడితే అటువంటి సమాజం ఊహలలోనూ, ప్రచార సాహిత్యంలోనూ తప్ప స్వేచ్ఛాపూరితం కాదు. వాస్తవానికి మార్క్సిజమనే ఆధునిక విశ్వాసంలోకి మారిన మానవుడు కావాలని తన స్వేచ్ఛా హక్కును ధారాదత్తం చేసుకొన్నాడు. నీతిపట్ల మానవ ద్వేష ధోరణిని ప్రబలించుకొంటున్నాడు. 19వ శతాబ్దంలో సిద్ధాంతాలకూ ఆచరణకూ వచ్చిన వైరుధ్యం, మార్క్సిజం వ్యాపించడానికి తోడ్పడింది. అది వ్యాపించిన కొద్దీ సంక్షోభం ప్రజ్వరిల్లింది. పదార్థవాదం వ్యతిరేకమని చూపింది. ఆ విధంగా మతపరమైన తిరోగమనవాద ప్రవక్తలకు పట్టు చిక్కేటట్లు చేసింది. ప్రాచీన, సామాజిక రాజకీయ విధానాలు పతనం కావడం, ఆచరణలో వాటి సిద్ధాంత ప్రమాణాలు అపఖ్యాతి పొందటంవల్ల నేటి సంక్షోభానికి దారితీసింది. ఈ సిద్ధాంతాల దోషాలూ, అసంబద్ధతలూ, వైఫల్యాలు నిస్పృహ వాతావరణాన్ని, నిరాశను, విసుగును సృష్టించి పరిస్థితిని ఇంకా ప్రకోపింపచేసాయి. మానవునికి భౌతిక సంక్షేమాన్ని, భద్రతను సమకూర్చి పెట్టే సమాజిక నియంతృత్వం, భావ బానిసత్వంతో కూడిన ఆధునిక అటవీ విధానాన్ని, ఒకవైపున, మధ్య యుగాలలోని విశ్వాసంతో కూడిన మార్మిక వాదాన్ని అన్వేషిస్తూ, భ్రమతో కూడిన భద్రత చూపుతూ, ఈ రెండు విధానాలలో నేటి నాగరికత మానవుడు ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని చెపుతున్నారు. సిద్ధాంతాల మధ్య వచ్చే సంఘర్షణ రాజకీయ ధ్రువీకరణకు దారితీసింది. అది ఏనాడైనా ప్రపంచాన్ని భీకర మారణాయుధాల సమరంలోకి లాగవచ్చు. ఈ రెండు మార్గాలు అనుసరించని అనేకమంది స్త్రీ పురుషులు ఈ చిక్కు నుంచి మార్గాంతరాన్ని అన్వేషిస్తున్నారు. ప్రమాదం ఒకవైపున ముంచుకొని వస్తున్నప్పటికీ ఇంకా ఆశ ఉన్నది. ఇదే నేటి సంక్షోభం. ఆశ విశ్వాసంగా మారాలి. మానవ చరిత్రలో మానవుడి మేథస్సుకు ఇంత పెద్ద పరీక్ష అనే బానిసత్వం నుంచి బయటపడటానికి సాహసిస్తాడు. నాగరిక ప్రపంచం నవ్య మానవవాద తత్వ ప్రేరేపణ కింద నేటి సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. కొత్త తత్వాభివృద్ధికి దోహదం చేస్తున్నామంటే దివ్యదర్శనం అయిందని భావించకూడదు. కొత్తదనం పాతనుంచే పెంపొందుతుంది. మానవ జ్ఞాన సంపదను అవకాశంగా తీసుకొని, ఆలోచనా చరిత్ర ఆధారంగా నేడు మనం కావాలనుకొంటున్న కొత్త తత్వాన్ని మానవ నాగరికత నుంచి, మానవాలోచనా స్రవంతుల నుంచి పెంపొందించవచ్చు. మానవ సంపద ఔన్నత్యాన్ని అభినందించలేని స్థితిలో, తాత్కాలిక - శాశ్వత విలువల తేడా గమనింపలేని దశలో నేటి సంక్షోభం జనించింది. మానవుడు తలెత్తినప్పటి నుంచీ భద్రత, ఐక్యత, ఏకీకరణ వంటి ఆదర్శాలు కొనసాగుతుండగా, అవే కొత్త తత్వానికి ప్రాతిపదికలు కావాలి. ఆ విధంగా కనుగొన్న తత్వం క్లిష్ట సమస్యలను పరిష్కరించటంలో తోడ్పడలగలదు. ఈ సమస్యలే సంప్రదాయ తత్వవేత్తలను కలవరపరచినవి. అయితే పరిష్కారం సిద్ధాంతపరంగా కాక కొత్త తత్వం ఇచ్చే ప్రేరేపణ వలన, ఆచరణలో కనిపిస్తుంది. ద్వంద్వవాదం అది భౌతిక ఊహలకు అనుకూలంగా భౌతిక విచారణకు తిలోదకాలిచ్చిన ప్రాచీన ఆలోచనాపరుల కాలం నుంచీ, తత్వం ద్వంద్వవాదం అనే దోషంతో కలుషితమైంది. ఆధునిక విజ్ఞానం పదార్థవాదాన్ని ఒకే ఉనికి వాదం (ఏకసత్తావాదం) పెంపొందించటానికి తోడ్పడింది. ప్రకృతే కనుక విశ్వశాస్త్రమైతే, పదార్థం-మనసు అనేవి నిరంకుశంగా విడదీసి చూడటం కుదరదు. ఏకసత్తా వాదంతో కూడిన సమాజవాదం నీతిశాస్త్రంలో పరిణామాన్ని అంగీకరించదు. విలువలకు సంబంధించిన ప్రపంచం, వాస్తవాలకు సంబంధించిన ప్రపంచం అని వేరుగా చూడనివ్వదు. ఏకసత్తా తత్వంలో ద్వంద నీతిశాస్త్రం ఉండదు. విలువలు వాటంతటవే జనిస్తాయి. అవి మన అంతరాత్మలో పుడతాయి. వాస్తవాల నుంచి వాటిని రాబట్టలేదు. విలువలే వాస్తవాలు. మధ్యకాలంలోని మతతత్వవేత్తలందరూ నిర్మొహమాటంగా ద్వందవాదులే. మతజ్ఞానంపై తిరుగుబాటు చేసిన డేకార్ట్, లెబ్నిజ్, కాంట్ వంటి హేతువాదులు కూడా ద్వందవాద విషవలయం నుండి బయటపడలేకపోయారు. ఆ వ్యూహంలో చిక్కుకొన్న తరవాత మానవుణ్ణి స్వేచ్ఛాపరుడుగా భావించటం కష్టం. ద్వంద్వవాద తత్వంలో తార్కికంగా పొందికైన సిద్ధాంతం, మానవుడికి భద్రత ఇవ్వగలిగింది మతం మాత్రమే మతపరమైన వ్యక్తి దైవేచ్ఛకు లొంగాలి. లేదా, ప్రయోజనవాద క్రమానికి సంబంధించిన నైతిక నియమానికి లొంగి ఉండాలి. స్వేచ్చలేకపోవటమే నీతిగా భావించాలి. అధునాతన ప్రాపంచిక అనుభవవాదులు కూడా మతపరమైనవారే. ప్రత్యక్షానుభవానికి అందుబాటులోలేనిదంతా అది భౌతికమని, లేదా పదార్థం కానిదని వారంటారు. పైకి వైజ్ఞానిక ప్రాతిపదికగా కనిపిస్తున్నప్పటికీ, వారు నవ్య మార్మిక వాదాన్ని రాబట్టి, మానవుడికి, అతని శరీరానికి మించి దేన్ని గురించి తెలుసుకొనే శక్తి లేదని అంటున్నారు. ప్రపంచం అంతా చొచ్చుకు పోవటానికి వీలులేని మార్మిక ముసుగుతో ఉన్నదని, అంధకార బంధురమైన మారుమూలలలో సునాయాసంగా దైవాన్ని ఊహించవచ్చని చెపుతున్నారు. ఈ విధంగా మానవుడి అజ్ఞానం ఆధారంగా దేవుణ్ణి ప్రతిష్ఠాపించటానికి నవ్య ప్రాపంచికానుభవ వాదులు తమ కొత్త మార్మిక వాదంతో ప్రయత్నిస్తున్నారు. జీవశాస్త్ర పరిధిలో ‘తప్పిపోయిన బంధం ఏదో’ ద్వంద్వవాద తత్వానికి ప్రధాన ఆధారమైంది. మతం ఏనాడో కోప్లోయిన ఆధారాన్ని ఈ శాస్త్రం ఇంకా సమర్థించటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. అజీవ ప్రపంచం నుంచి మానవుడు ఆవిర్భవిస్తున్నాడు. మానవ పరిణామ సిద్ధాంతం మూలానికి పోతే అత్యంత ప్రాచీన జీవనంతో సంబంధం నెలకొల్పవచ్చు. కాని అక్కడితో పరిణామం తెగిపోతున్నది. మృతప్రాయమైన పదార్థం నుంచి జీవితం ఎలా ఆవిర్భవిస్తుంది? ఆధునిక ‘వైజ్ఞానిక’ ద్వంద్వవాదం వేసే ప్రశ్న ఇదే. సుప్రసిద్ధ జీవ శాస్త్రజ్ఞులు ఈ ప్రశ్నను స్వీకరించి సమాధానం చెప్పారు. అనుభవ జ్ఞానాధారంగా వారిచ్చిన సమాధానం తత్వవేత్తలకు సంతృప్తికరం కావాలి. జీవకణ రసాయనిక మూలం తెలిసిన తరవాత, జీవానికి నిర్జీవానికీ ఇన్నాళ్ళుగా వూహించుకుంటున్న వారధి లేని అఖాతం అదృశ్యమయింది. ఒకవేళ అనుభవ సాక్ష్యాధారం, పరిశోధనా సమాచారం వాస్తవంగా లేదనుకొన్నా నవ్య జీవశక్తి వాదులనుకునే అధునాతన తత్వవేత్తల సిద్ధాంతం తార్కికంగా నిలబడదు. పదార్థం కాకుంటే జీవితానికి ఆధారం ఏమిటి? దైవం పోసిన ఊపిరి. ఎవరైనా ఇటువంటి గౌరవప్రదమైన ప్రాతిపదికలపై ఆధారపడదలిస్తే వారు తత్వవేత్తలు మాత్రం కాజాలరు. మరేదైనా సమాధానం చెబితే మాత్రం శూన్యం నుంచి ఏదో వచ్చిందనే దోషం చేసిన వారవుతారు. సర్వ శక్తివంతుడైన దైవం సృష్టి చేసిందనే మొండివాదాన్ని వైజ్ఞానిక తత్వాధారంతో సమర్ధించలేకపోతే నిర్జీవ పదార్థం నుంచి జీవితం కొత్తగా ఆవిర్భవించిందనే విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది. పదార్థవాదంలోని ఉనికి అంతా ఒకటే అనే తత్వంతో అప్పుడు ప్రపంచానుభవం సరిపోతుంది. జీవ నిర్జీవ పరిణామక్రమం అంతటిలోనూ నిరంతర క్రమం కొనసాగుతున్నది. జీవితం పుట్టుకను గురించి మార్మిక ముసుగు తొలగిపోయిన తరవాత, మానవుడిని జీవ సంఘటనగా పరిగణించాలి. మానవుడి లక్షణాలు గాని, ప్రవర్తన గాని వివరించటానికి పదార్థానికి సంబంధం లేని ఆధారాలు వెతకనవసరం లేదు. ప్రేరణలు, (సహజాతము), అంతర్భుద్ధి అనేవి అనిర్వచనీయ మార్మిక పదార్థాలు కావు. ‘ఆత్మ’ దైవాంశం కాదు. మానవుడి మేథస్సు, ఉద్రేకాల సముదాయంగానూ, మానవాళికి మార్గగామిగానూ ఆత్మను పేర్కొనవచ్చు. లేకుంటే ఆత్మ కల్పితమవుతుంది. జీవ సంఘటనలకు సంబంధించిన సరైన జ్ఞాన ప్రాతిపదికపై విలువలను రూపొందిచదలచినప్పుడు అన్ని విలువలు ఒక ప్రధాన విలువ నుంచి రాబట్టటం సాధ్యం. ఇన్నాళ్ళుగా నైతిక తత్వంలో ఉన్న గందరగోళాన్ని తొలగించి పదార్థ ఏకైక ఉనికి వాదం ఆధునిక మానవునికి కొత్త దారులు చూపుతుంది. దీనినే సాంఘిక ఉనికికి అన్వయిస్తే, నవ్య మానవవాదం అంటాము. ప్రధానమైన విలువ ఏది? ఉనికి అని ఎవరైనా చెప్పవచ్చు. కాని ఆధునిక ఉనికివాదులతో మనలను కలిపే చిక్కు తెచ్చిపెట్టుకోకూడదు. నా దృష్టిలో ఉన్నతమైన విలువ అంటే స్వేచ్ఛ మాత్రమే. మిగిలిన మానవ విలువలన్నీ స్వేచ్ఛ నుంచి రాబట్టారు. మానవ ఉనికిలో స్వేచ్ఛా పిపాస అనేది మౌలిక విషయం, కనక, స్వేచ్ఛ ప్రధాన విలువ అయింది. స్వేచ్ఛను మర్మబద్ధం చేయటానికి వీలులేదు. జీవపరిణామ క్రమంలో స్వేచ్ఛా పిపాసను చూడవచ్చు. జీవితంలో తాదాత్మ్యం చెందకపోయినా ఇంచుమించు సమంగా స్వేచ్ఛ కూడా కొనసాగుతూ వచ్చింది. ఆత్మతో సంబంధం లేని జంతుజాలంతో ప్రారంభించి, లభించిన సంపద ఆధారంగా, నైతిక విలువను రాబట్టటం జరిగింది కనక మానవ ఉనికికి మించిపోయి మరేదో ప్రమాణం కోసం వెతకనక్కరలేదు. జంతు ప్రపంచం ఆధారంగా వచ్చిన మానవ లక్షణమే నీతి. నైతికంగా వుండాలంటే మానవునిగా వుండాలి. ఇందుకు దైవ ప్రమాణంగానీ, మార్మిక అన్వేషణ కానీ అవసరం లేదు. నీతిగా ఉండటానికి మానవుడు దేవునికి బానిస కానక్కరలేదు. ఆధునిక నైతిక తత్వవేత్తలవలె తన ఈర్ష్య, అసూయలకు లొంగిపోనక్కరలేదు. మానవ నీతి పరిణామ క్రమంతో కూడినది. నివసించటమే జీవిత లక్ష్యం. మనుగడ పోరాటమే జీవ పరిణామానికి మౌలికంగా ప్రోత్సాహమిస్తుంది. జీవ పరిణామం అంతటిలోనూ ఈ విధానం ఉన్నది. మానవ స్థాయిలో ఇదే ఉన్నత విలువగా, తెలిసికోరుకొనే స్వేచ్ఛగా మారుతుంది. స్వేచ్ఛా పోరాటం మనుగడ కోసం సాగించే పోరాటం మానవుడి అనంత స్వేచ్ఛా పోరాటానికి నాంది పలికింది. ఈ స్వేచ్ఛా పిపాసతోనే మానవుడు ఏదైనా చేస్తాడు. అతడు చేసే ప్రతి పని, సాంస్కృతిక అభివృద్ధి, వైజ్ఞానిక ప్రగతి, కళల సృష్టి ఉద్దేశంతో చేసినవే. విశ్వం అనంతం ఇందులో మానవుడు పరిమితం. విశ్లేషించి చూస్తే విశ్వమంతా మానవునికి పరిసరమే. తత్ఫలితంగా మానవుని స్వేచ్ఛా పోరాటం శాశ్వతం. అతడు విశ్వాన్ని ఎప్పుడూ జయించలేడు. కనక మానవ ప్రపంచంలో స్వేచ్ఛా పిపాస ఒక్కటే శాశ్వతమైంది. ఈ పిపాస వల్లనే జ్ఞానార్జన చేస్తున్నాడు. తెలుసుకోటంవల్ల పరిసరాలను జయిస్తున్నాడు. ఈ విధానంలో అతడు మరో సమస్యను కూడా పరిష్కరిస్తున్నాడు. సత్యమంటే ఏమిటి? మానవ జ్ఞానానికికి వస్తువే సత్యం. సత్యం ఒక విలువ. అది వాస్తవం నుంచి రాబట్టేది కాదు. సత్యమే వాస్తవం. సత్యం బాహ్యపరంగా నిజమైంది. మానవతత్వ విలువలలో స్వేచ్ఛాన్వేషణ, జ్ఞానం, సత్యం అనే క్రమంలో విలువలుంటాయి. ఈ విలువలు స్వతంత్ర ప్రతిపత్తిగల దైవాలు కావు. అవి పరస్పర సంబంధంగలవి. ఈ సంబంధం తార్కికమైనది. ఉనికి మూలానికి చెందినది. కనక అవినీతి మార్గాలతో స్వేచ్ఛను పొందటం సాధ్యం కాదు. జ్ఞాన వికాసవంతుడు అబద్ధాల కోరు కాలేడు. స్వేచ్ఛ, జ్ఞానం, సత్యం అనే విలువలు జీవితంలో ఆచరించటంలోనే అనుభవించగలం. మానవవాదం కూడా తత్వమంత ప్రాచీనమైంది. మానవుడు సార్వభౌమత్వం ఆధారంగా, మానవవాది జీవిత సమస్యలను పరిష్కరించగోరుతాడు. అయినప్పటికీ మానవుడంటే ఏమిటో వివరించకపోగా మార్మికమైన ముసుగులో కొనసాగుతాడు. ఇప్పుడు ఇంచుమించు మానవుడు ఎలామానవుడు అయ్యాడో, అతని సార్వభౌమత్వానికి సృజన శక్తికి మూలం ఏమిటో తెలుసుకోగలిగాము. జీవాలన్నిటికీ చైతన్యం ఉండగా అందుకు భిన్నంగా మానవునికి తెలుసుకునే శక్తి ఉన్నది. జ్ఞానం అతడికి శక్తి నిచ్చింది. ఈ శక్తి ఇతరుల మీద పరిపాలన చేసేటందుకు కాక జాతి సౌకర్యార్థం, సృష్టించేటందుకు, స్వేచ్ఛాదర్శాన్ని ఇంకా కొనసాగించేటందుకు ఉపయోగపడుతుంది. జ్ఞానానికి వస్తువుగా సత్యం ఉన్నందున, వికాసంవంతుడైన మానవుడు తాను అభిలషించే నైతిక విలువలకు తనలోనే ప్రమాణాన్ని కనుగొంటాడు. జ్ఞానాన్ని పెంపొందించుకోవటం, ఇంతకు ముందే ఆర్జించిన జ్ఞానాన్ని అందరికీ విస్తరింప చేయటమే మానవతావాది లక్ష్యం. సంక్షోభాన్ని గురించి వివరించటానికి అనుభవానికి పూర్వమే జ్ఞానమున్నది అనే భావనతో నేను ప్రారంభించను. నేటి కళలూ, సాహిత్యం, సునిశిత ప్రజల వ్యక్తిత్వ విచ్ఛేదంలో నేను సంక్షోభాన్ని ఈ ఉద్దేశ్యంతో చూడను. ఇది సంక్షోభ చిహ్నమైనప్పటికీ, అల్పమైన చిహ్నం మాత్రమే. ఈ సంక్షోభం నాగరిక ప్రజా జీవితాన్నంతటినీ ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. మేథస్సుకు సంబంధించిన, సంస్థాగతమైన పరికరాలు నేటి అవసరాలకు సరిపడేటట్లు లేవు. రెండు పెత్తందారీ విధానాల మధ్య ఎంపిక చేసుకోవటం కాక, మరో మార్గాంతరాన్ని కనుక్కొనాలి. జీవితానికి మతపరమైన ప్రయోజనం ఏదో ఉన్నదని తిరగదోడే ప్రవక్తలు, లోక వ్యవహారాలకు వ్యతిరేకంగా, ఆధ్యాత్మిక పెత్తందారీ విధానాన్ని ప్రచారం చేస్తున్నారు. అదొక్కటే మానవుణ్ణి మళ్ళీ నైతిక విధానంలోకి తీసుకెళ్ళగలదంటున్నారు. వారి చికిత్సా విధానం నయం చేయవలసిన రోగం కంటే ప్రమాదకరమైనది. మానవుడు తొలి అజ్ఞాన పాపఫలితంగా జనించిన ఆధ్యాత్మిక బానిసత్వంపై తిరుగుబాటు చేయటానికి శతాబ్దాలు పట్టింది. మానవుడి తిరుగుబాటు ప్రమాణాన్ని అనేక శతాబ్దాలపాటు శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు మందుకు తీసుకుపోయారు. వారి ఆలోచన అంతా విజ్ఞానపరంగా ఉండటంవల్ల, గాలిలో మేడలు కట్టడం కాక, ప్రత్యక్ష జ్ఞాన ప్రాతిపదికపై తత్వాన్ని నిర్మించారు. ఒక స్థాయి చేసుకునే సరికి అనుభవం ఆధారంగా పాత సిద్ధాంతాలను, ఆలోచనా రీతులను ప్రశ్నించవలసి వచ్చింది. మతపరమైన ఆలోచనా సంప్రదాయం, సునాయాసంగా గడిపే విశ్వాస జీవితం అనేవి ఆధునిక సంస్కృతి వెనుక పొంచి ఉన్నాయి. శాస్త్రజ్ఞులు కలవరపాటు చెందనప్పుడు, తత్వవేత్తలు మాట్లాడ జాలని స్థితి వచ్చినప్పుడు, మతపరమైన వారు ఆ అవకాశాన్ని తీసుకొని పై పైకి వచ్చారు. అయితే మొదటి దాడికే పతనం చెందేటంత అస్థిరమైన వైజ్ఞానిక నిర్మాణం లేదు. నైపుణ్యతను ఒక్కొక్క రంగంలో బాగా సాగదీసిన ఫలితంగా విజ్ఞానంలో బలహీనత ఏర్పడింది. ప్రకృతికి సంబంధించిన వివిధ దృక్పథాలను విజ్ఞానంలో భిన్న శాఖలు పరిశీలించినవి. ఏ ఒక్క శాఖ కూడా సంపూర్ణ వాస్తవాన్ని చూపదు. ఉదాహరణకు - పదార్థ విజ్ఞానాన్ని సంపూర్ణ సత్యంగా చూపటం ఒక దోషం. విజ్ఞానంలో భిన్న శాఖలు సాధించిన వాటిని సమన్వయీకరిస్తే గాని సమగ్ర చిత్రణ రాదు. అటువంటి వాస్తవ చిత్రణ చేసే బాధ్యత తత్వానిదే. అయితే జ్ఞాన వికాసానికి సంబంధించిన స్వల్ప కాలాన్ని మినహాయిస్తే, విద్యా సంబంధమైన తత్వం ఎన్నడూ మతపరమైన లేదా అధి భౌతిక సంప్రదాయాల నుంచి సంపూర్ణంగా తెగతెంపులు చేసుకోలేదు. కనక, మానవాభివృద్ధికి నాయకత్వం వహించివలసి వచ్చినప్పుడు తత్వం విఫలం చెందింది. నేటి సంక్షోభానికి మూలకారణాన్ని అన్వేషించేటప్పుడు ఈ తాత్విక వైఫల్యాన్ని గమనంలోకి తీసుకోవాలి. అందుకే ఇది మేథా సంబంధమైన సంక్షోభం అంటున్నారు. మేథస్సులో ఒట్టిపోయిన వారు సహజంగానే నేతికంగా దిగజారిపోతారు. వారిలో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయిన వారు తమ నైతిక సంక్షోభాన్ని ప్రపంచంలో చూపుతున్నారు. మాక్1, పాన్ కరా2 నుంచి బర్గ్ససన్3 వరకూ వైజ్ఞానిక అజ్ఞాన వాదాన్ని బోధించాడు. ఆధునిక శాస్త్రీయ తత్వవేత్తలందరూ ఇతర జీవాలకూ మానవుడికీ గల విచక్షణను ముఖ్యంగా తెలుసుకునే శక్తిని చూపటంలో విఫలమైనారు. అదృష్టవశాత్తు ఇటువంటి తత్వాలు మానవజాతిలో ఎక్కువమందికి పట్టలేదు. మార్మికవాదంలోనూ, అయోమయవాదంలోనూ భద్రంగా తలదాచుకోటానికి మేధావులు పోటీ పడుతుండగా, వారికి నాయకత్వం వహించిన ప్రవక్తలు మానవుణ్ణి గురించి చెపుతూ, ఆధ్యాత్మిక బానిసత్వాన్ని అంగీకరిస్తే తప్ప నైతికంగా మానవుడు ఉండలేడని చెప్పారు. వారి అయోమయ పద్ధతులకనుగుణంగా తత్వం లేకుంటే ఆగ్రహం చెందేవారు. కాని మాటలకు అర్థాలున్నాయి. ఒకసారి వారి మాటల గారడీలో చిక్కుకుంటే, ఉద్దేశపూరిత పదజాలాన్ని అంగీకరిస్తే మనం వారి మాయలో పడినట్లే. అప్పుడు మానవతా లక్ష్యానికి ద్రోహం చేసినవారమవుతాం. మన మనసులలో స్పష్టంగా ఉన్నదాన్ని స్పష్టమైన మాటలలో వ్యక్తం చేయవచ్చు. మనం ప్రజల భాష మాట్లాడాలి. వారి దృక్పథం నుంచి సమస్యలను చూడాలి. వారి నిత్య జీవితానుభవం నుంచి గమనించాలి. విజ్ఞానం, దాని ప్రాధాన్యతను సాధారణ భాషలో వారికి అందించవచ్చు. 19వ శతాబ్ద పాతసిద్ధాంతాలు కొందరు పండితులకు అతి సామాన్యమైనవిగా తోచవచ్చు. విజ్ఞానానికి జీవితానికి వారు సంబంధం ఏమిటో గమనించలేరు. ఆవిరి నేటికీ శక్తిని సృష్టిస్తుంది. విద్యుత్తును మానవుడి ప్రయోజనాలకు మలచవచ్చు. మందులు రోగాలను నయం చేయటం, రాకుండా ఆపడం జరుగుతున్నది. జీవ శాస్త్రం నిత్యానుభవంలో అనేక విషయాలను వివరిస్తున్నది, డార్విన్ వాదం ప్రజానీకానికి, ముఖ్యంగా వెనుకబడిన దేశాలకు ఇంకా చేరవలసి ఉన్నది. మనోవిజ్ఞానం మానసిక జీవిత మర్మాలపై వెలుగును ప్రసరింప చేస్తున్నది. ప్రజలు ముఖ్యంగా మనదేశ ప్రజలు ఇటువంటి జ్ఞానాన్ని పొందాలి. దీనివల్ల వారికి శక్తి లభిస్తుంది. పనులు చేయటానికీ, పనికి ఉపక్రమించటానికీ శక్తి వస్తుంది, మతాధికారం వారిని ఇన్నాళ్ళుగా సంప్రదాయ బద్ధమైన అజ్ఞానయుత బంధంలో ఉంచితే, అదంతా సడలిపోవటానికి జ్ఞానం ఎంతో మద్దత్తునిస్తుంది. సామాజిక విజ్ఞాన లోతుపాతులు సామాన్యులు గ్రహించవలసిన పని లేదు. ఆర్థిక రంగం విచ్ఛిన్నం కావడం వారికి నిత్యానుభవమే. ఆర్థిక సిద్ధాంతాలు తెలుసుకోవలసిన అవసరం కూడా వారికిలేదు. సమృద్ధిగా ఉంటూ ఉండగానే కరువును వారనుభవిస్తుంటారు. ఒకసారి వారి అనభవం గురించి జాగరూకులను గావిస్తే, ప్రస్తుత పరిస్థితులను పునర్నించాల్సిన అవసరాన్ని వారే గ్రహిస్తారు. అలాగే వారి అనుభవం రీత్యా రాజకీయ సమస్యలను అందుబాటులో ఉండేటట్లు చేయవచ్చు. తుదకు, ప్రజలే అన్ని విషయాలను అదుపులో పెట్టగలరని చూపవచ్చు. సులభంగా కనిపించే ఈ విషయాలను అదుపులో పెట్టగలరని చూపవచ్చు. సులభంగా కనిపించే ఈ విషయాల వెనక, మానవుడి ఆత్మ విశ్వాసం అవసరమవుతుంది. పనులను చేయడంలో ప్రజలే విశ్వాసాన్ని పొందుతారు. మానవజాతిని నడిపించవలసిన వారే సంక్షోభాన్ని సృష్టించారు. వారు విఫలమయ్యారు. సామాన్య ప్రజానీకం పునరుజ్జీవనం వల్లనే ఆధునిక నాగరికతను రక్షించగలం. అటువంటి పునరుజ్జీవనాన్ని ప్రేరేపించటానికి, నిర్మించడానికి, ఫలప్రదం గావడానికి నవ్య మానవ వాదం కృషి చేయాలి. ఎర్నెస్ట్ మాక్ (1839-1916) ఆస్ట్రియన్ భౌతిక విజ్ఞాని, మనో శాస్త్రజ్ఞుడు, తాత్వికుడు. జీ అన్రీ పాన్ కరా (Poincare) (1854-1912) ఫ్రెంచి గణిత శాస్త్రజ్ఞుడు. (1859-1941) ఫ్రెంచి తత్వవేత్త, రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. ఎలెన్ రాయ్ అనువాదం - నరిసెట్టి ఇన్నయ్య