శశాంక-సాహితీపరులతో సరసాలు




కవిగా శశాంకతో నాకు బొత్తిగా పరిచయం లేదు. లెక్చరర్ శశాంక కొంత తెలుసు. మిత్రుడుగా బాగా సన్నిహిత స్నేహం వుంది. హైదరాబాద్ లోని ఆదర్శనగరంలో 1970 ప్రాంతాల్లో వుంటుండగా, నేను న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్ లో వుండేవాడిని. అప్పుడే కలుసుకుంటూ వుండేవాళ్ళం.
శశాంకతో నా పరిచయం అంతా గోరా శాస్త్రి ద్వారానే, శశాంక అప్పుడప్పుడు జీరాలోని గోరా శాస్త్రి యింటికి రాగా, అక్కడే సరస సల్లాపాలు జరిపాం. గోరాశాస్త్రి చనువుతో శశాంకను ఏవేవో అంటుండేవాడు. శశాంక చిన్నవాడుగనుక ఆ మాటలన్నీ పడేవాడు.
నేను శశాంక యింటికి వెళ్ళి వరండాలో కూర్చొని ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవారం. ఇరువురం దేవులపల్లి కృష్ణశాస్త్రి యింటికి వెళ్ళి కాలక్షేపం చేసేవారం. సేత అనసూయలు అప్పుడు ఆదర్శనగర్ లో వుండేవారు. వారూ పరిచయమయ్యారు.
1969లో గోరా శాస్త్రికి 60వ జన్మదిన సభ తలపెట్టినప్పుడు శశాంక సహకరించారు. అందరం కర్నూలు వెళ్ళి సన్మాన సభలో పాల్గొన్నాం. సి. ధర్మారావు, మండవ శ్రీరామమూర్తి, శశాంక, నేను ఆ సమావేశాల్లో చురుకుగా కార్యక్రమాలు జరిపాం. ఫోటోలు తీయించుకున్నాం.
నేను ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళినా, శశాంక కవితాలోకం వేరు. నా చర్చలు, ప్రసంగాలు అన్నీ వేలూరి సహజానంద నిర్వహించేవారు. కనుక శశాంక కవితా విభాగంలోకి వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడైనా దండమూడి మహీధర్, శశాంక, నేనూ కాంటీన్ లో లాంచనంగా కలసి కబుర్లు చెప్పుకునేవారం. రవీంద్ర భారతిలో కార్యక్రమాలకు గోరాశాస్త్రితో కలసి నేను వెళ్ళినప్పుడు, శశాంక జత అయ్యేవారు. అక్కడ పాతూరి వారు, సి. ధర్మరావు చేరేవారు. శశాంక మిత భాషి. చక్కగా నవ్వుతూ పలకరించేవారు. సంజీవరెడ్డి నగర్ మారిన తరువాత మా కలయిక సన్నగిల్లింది. శశాంక చెణుకులు గోపాలశాస్త్రి వద్ద సరసాలు బాగుండేవి.
గోరాశాస్త్రి గారింట్లో వి.ఎస్. రమా దేవిని కలసినప్పుడు, ఒక పర్యాయం శశాంక వచ్చారు. అప్పుడు జరిగిన సంభాషణలన్నీ కవితా గోష్టిని తలపించాయి.
నాకు ఈమని శంకరశాస్త్రి గారితో కించిత్తు పరిచయం వుండేది. ఆయన వీణా కార్యక్రమాలకు నేను, నా భార్య కోమల, కుమార్తె నవీన వెళ్ళేవాళ్ళం. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక గేయాన్ని వీణపై పలికించగా, అదేమిటో తెలియకుండానే, అభినందించాం. శశాంక రాసిన గేయం అది అన్నారాయన. సంతోషించాం. ఆ విధంగా ప్రత్యక్ష పరోక్ష రీతులలో శశాంకతో సన్నిహితత్వం వుంది. ఆయన కుమారుడు పార్వతీశం ఆ తరువాత దూరదర్శన్ లో పరిచయమయ్యారు.
రచనలు :  నయా జమానా కవితలు, స్వర లహరి కవితలు, రాగ వల్లరి కవితలు.

- నరిసెట్టి ఇన్నయ్య

ఎం.వి. శాస్త్రి--సాహితీపరులతో సరసాలు

ములుకుట్ల వెంకటశాస్త్రి


జర్నలిస్ట్ గా ఆరంభించి, తలవని తలంపుగా ఆంధ్రలో పునర్వికాసోద్యమానికి నాంది పలికిన ములుకుట్ల వెంకటశాస్త్రి (ఎం.వి. శాస్త్రి) పాత్ర గమనార్హం.
స్వాతంత్ర్యోద్యమ రోజులలోకుందూరి ఈశ్వరదత్తు, పీపుల్స్ వాయిస్ పేరిట మద్రాసు నుండి ఇంగ్లీషు పత్రిక నడిపారు. ఇది పిఠాపురం రాజా ఆర్థిక సహాయంతో నడిచిన జస్టిస్ పార్టీ పత్రిక. 1936లో ఫైజ్ పూర్ లో (మహారాష్ట్రాలో ఒక గ్రామం) కాంగ్రెసు పార్టీ మహాసభ డిసెంబరులో జరిగింది. ఆ సభా విశేషాలు రాసే నిమిత్తం ఎం.వి. శాస్త్రిని పీపుల్స్ వాయిస్ పక్షాన పంపారు. కాకినాడలో చదువు ముగించిన ఎం.వి. శాస్త్రి ఉత్సాహంగా వెళ్ళారు. అక్కడ జైలు నుండి విడుదలై వచ్చి, రాజకీయాలలో హేతుబద్ధంగా, అంతర్జాతీయ వ్యవహారాలు అవలీలగా మాట్లాడిన ఎం.ఎన్. రాయ్ మాటలు ఎం.వి. శాస్త్రిని ఆకట్టుకున్నాయి. గాంధీ మత, మిత ధోరణిని వ్యతిరేకిస్తూ మాట్లాడిన రాయ్ ను ఆంధ్రకు ఆహ్వానించి వచ్చారు శాస్త్రి.
1937 జూలై చివరలో మద్రాసులో యువజన సభలో పాల్గొన్న ఎం.ఎన్. రాయ్ ఆగస్టు 1న తొలిసారి ఆంధ్రలో అడుగుపెట్టారు. నెల్లూరులో వెన్నెల కంటి రాఘవయ్య ఆధ్వర్యాన జరిగిన వ్యవసాయ కార్మికుల మహాసభకు ఎం.ఎన్. రాయ్ ప్రధాన వక్తగా వచ్చారు. అక్కడ జబ్బుపడ్డారు. కాకినాడ నుండి ఎం.వి. శాస్త్రి వెంటనే వచ్చి ఎం.ఎన్. రాయ్ ను కాకినాడకు తీసుకెళ్ళారు. అక్కడ శాస్త్రిగారి వద్ద రాయ్ కోలుకుంటున్నప్పుడే, విశాఖపట్టణం నుండి అబ్బూరి రామకృష్ణారావు (యూనివర్శిటీలో లైబ్రేరియన్, థియేటర్ నిపుణులు) వచ్చారు. ఆ విధంగా ఎం.ఎన్. రాయ్ ను వారిరువురూ ఆంధ్రకు పరిచయం చేశారు. వారి జీవితాల్లో అదొక పెద్ద మలుపు అయింది. ఎం.వి. శాస్త్రి అప్పటి నుండీ రాయ్ అనుచరుడుగా పనిచేశారు. రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో ప్రధాన పాత్ర వహించారు. 1942లో ఆంధ్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ మహాసభల్ని కాకినాడలో నిర్వహించారు. బెంగాల్ నుండి కె.కె. సిన్హా ప్రారంభోపన్యాసకులుగా వచ్చారు.
ఆంధ్రలో ఎప్పుడు పర్యటనకు వచ్చినా శాస్త్రి దగ్గరకు వచ్చేవారు రాయ్ దంపతులు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికలో శాస్త్రి అనేక వ్యాసాలు రాశారు. ఇంగ్లీషులో వ్యాసాలు రాయడంలో శాస్త్రి గారు దిట్ట. చాలా హేతుబద్ధంగా, మంచి శైలిలో, హాస్యం తొణికిస్తూ రాసేవారు. రాయ్ 1954లో చనిపోయిన అనంతరం, అడ్వొకేట్ గా ప్రాక్టీసు చేసిన శాస్త్రిగారు రాజగోపాలాచారి వాదనల పట్ల, ఉదారవాద, స్వేచ్ఛాభావాల పట్ల ఆకర్షితులయ్యారు.
1959లో రాజాజీ స్వతంత్ర పార్టీ స్థాపకులుగా ఆంధ్ర పర్యటించినప్పుడు కాకినాడలో శాస్త్రిగారింట్లో జరిగిన విందులో నేను పాల్గొన్నాను. ఆనాడు గొప్ప సభ జరిగింది. రాజాజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించిన ఉషశ్రీ విఫలమయ్యారు. చివరకు శాస్త్రిగారి సలహాపై గౌతులచ్చన్న అనువదించి, మెప్పించారు. శాస్త్రి స్వరాజ్య పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. కె. సంతానం సంపాదకుడుగా మద్రాసు నుండి నడిచిన ఆ పత్రిక మేధావులను ఆకర్షించింది. ముఖ్యంగా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని అడ్డుకున్నది.
ఎం.వి. శాస్త్రి ఆంధ్రలోని రాడికల్ హ్యూమనిస్టులలో ఆవుల గోపాలకృష్ణ మూర్తికి సన్నిహితులుగా వుండేవారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎం.వి. శాస్త్రి నిలిచారు. ములుకుట్ల వెంకటశాస్త్రికి ఓటు వేయమంటూ ఆయన ఒక ఆకర్షణీయ విజ్ఞప్తి ఓటర్లకు పంపారు. శాస్త్రిగారు నెగ్గి, ఎం.ఎల్.సి.గా ఒక టరమ్ పనిచేశారు.
శాసనమండలిలో పరిమితంగా మాట్లాడినా, చాలా లోతైన భావోపన్యాసాలు చేశారు. హుందాగా ప్రవర్తించారు. 1962 నుండి ఆయన ఎం.ఎల్.సి.గా హైదరాబాద్ లో వుంటూ వచ్చారు. అప్పుడే స్వతంత్ర పార్టీ సమావేశాల్లోనూ పాల్గొన్నారు.
రాజగోపాలాచారి ముఖ్యంగా ఎం.వి. శాస్త్రి తీర్మాన పాఠాన్ని మెచ్చుకునేవారు. శాస్త్రిగారు రాస్తే రాజాజీ యథాతథంగా అక్షరం మార్చకుండా ఆమోదించేవారు. ఆయన ఇంగ్లీషు అంత బాగా వుండేది. శాస్త్రి గారికి అందరూ అమ్మాయిల సంతానమే. పెళ్ళిళ్ళ రీత్యా వారిలో కొందరు అమెరికా వెళ్ళారు. శాస్త్రి గారు అనేక పర్యాయాలు అమెరికా పర్యటించారు. హైదరాబాదులో వుండగా దంటు భాస్కరరావుతో కలిసి శాస్త్రిగారు వినోద, సాహిత్య కార్యకలాపాలు ఆనందించేవారు. శాస్త్రిగారి వ్యాసాలు, శాసన మండలి ఉపన్యాసాలు గ్రంథస్తం కావలసివుంది. 1990లో శాస్త్రిగారు మరణించారు. శాస్త్రిగారితో 1956 నుండి నాకు పరిచయమైంది. సన్నిహితంగా మెలిగాము. అది చివరి దశవరకూ సాగింది. జీవితం అంతంలో శాస్త్రిగారు హేతుబద్ధమైన విధానాన్ని విడనాడారు. నమ్మకాల్లోకి వెళ్ళిపోయారు.

- నరిసెట్టి ఇన్నయ్య


విజయరాజ కుమార్ నరిసెట్టి

విజయరాజ కుమార్ నరిసెట్టి గురించి తెలుగు వికిపీడియా లో వున్న విషయం


Please click on this link for detailed matter:
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C_%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%A8%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF

బెజవాడ రామచంద్రారెడ్డి--సాహితీపరులతో సరసాలు




మాట మధురం. రాత రమణీయం. రూపు గంభీరం. ప్రవర్తన హుందాగలది. బెజవాడ రామచంద్రారెడ్డి వ్యక్తిత్వ వర్ణనలో అతిశయోక్తి లేదు.
ఆయన పరిచయం అయ్యే నాటికి షష్ఠిపూర్తి చేసుకున్నారు. నావంటి గ్రాడ్యుయేట్ తో సన్నిహితంగా మిత్రుడుగా మెలగగలగడం, ఆకర్షించడం బెజవాడ రామచంద్రారెడ్డి విశాల దృక్పధమే కారణం.
1958 నుండీ 1973 వరకూ సన్నిహితులుగా వున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాం. ఆయన కార్డు రాస్తే సంతోషించేవాడిని. కారణం ఒక వైపు గోటితో చిత్రం గీసి పంపేవారు. అలాంటి నఖ చిత్రాలు దాచుకొని, చివరకు స్టేట్ పురావస్తు శాఖకు యిచ్చాను. సంజీవదేవ్ అక్షరాలవలె బెజవాడ వారి రాతచాలా చూడముచ్చటగా వుండేది.
బెజవాడ గోపాలరెడ్డికీ రామచంద్రారెడ్డికీ బంధుత్వం వుంది. కాని రాజకీయంగా శత్రుత్వమే. దక్షిణాదిన ఉద్యమ తీవ్రతకు పేరొందిన పెరియార్ రామస్వామి నాయకర్ ప్రభావితుడైన రామచంద్రారెడ్డి జస్టిస్ పార్టీలో చేరారు. ఆయన చదువుకూడా మద్రాసు పచ్చయప్ప కళాశాలలో. అది జస్టిస్ పార్టీకి కాణాచి. బి.ఎ. చదివి లా చేసి, 1923లో బార్ లో చేరికూడా, ఆయన ప్రాక్టీసు చేయలేదు. రాజకీయాలు, సాహిత్యంలో నిమగ్నులై, జీవితమంతా కాంగ్రెస్ వ్యతిరేకిగా, రైతు పక్షపాతిగా వుండేవారు.
బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర వారపత్రిక నెల్లూరు నుండి (1930-40) సంపాదకులుగా నడిపారు. ఆయన సాహిత్య పరిషత్తు అధ్యక్షోపన్యాసాలు, నాటక పరిషత్తు ప్రసంగాలు, రెడ్డి జనమహాసభలో సూచనలు, స్వతంత్రం ద్వారానే మనకు తెలుస్తున్నాయి.
1930 నాటికే మద్రాసు శాసన సభ స్పీకర్ గావడం, 1923 నుండే కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నిక అవుతుండడం రెడ్డి గారి జీవిత మలుపులే. చక్కగా టూకీగా ఆకర్షణీయంగా మాట్లాడడంతో ఆయన అందరినీ ఆకట్టుకోగలిగారు. అయితే 1937లో ఎన్నికలు జరిగినప్పుడు గోపాలరెడ్డి-రామచంద్రారెడ్డి కావలి నుండి పోటీ చేసారు. ఆనాడు ఒకే వేదిక నుండి ఉభయులూ ప్రచారం చేయడం విశేషం. జస్టిస్ పార్టీ పూర్తి ఓటమి చూడగా 7 వేల ఓట్లతో రామచంద్రారెడ్డి తన పరాజయం అనుభవించారు. గోపాలరెడ్డి 20 వేల ఓట్లతో గెలిచారు. పరిమిత ఓటర్లు వుండే వారని మనం గమనించాలి.
రాజకీయాలు ఎలా వున్నా రామచంద్రారెడ్డి గ్రాంధిక వాది సాహిత్య పరిషత్తు అధ్యక్షులుగా ఆయన చురుకైన పాత్ర వహించారు. కవులను, రచయితలను ప్రోత్సహించి, కొందరిని ఆర్థికంగా ఆధుకున్నారు. అవధానాలలో పాల్గొని పృచ్ఛకుడుగా వ్యవహరించారు. అనేక మంది రచయితలు ఆయన చేత పీఠికలు రాయించుకున్నారు.
నాటకాల పట్ల విపరీతమోజు చూపిన రెడ్డి గారు, కళల పోషణ జరగాలని కోరారు. పరిశోధన తత్వం గల వ్యక్తిగా నాటక చరిత్ర గమనించి, విశ్వవిద్యాలయాలలో నాటక కళపై దృష్టి పెట్టాలన్నారు.
మహాభారత ఉపన్యాసాలు 18 రోజులు జరిగితే, రెడ్డి గారు పాల్గొని, రోజూ వ్యాఖ్యానించేవారు. దక్షిణ భారత వ్యవసాయ సంఘం 1943లో స్థాపించి, రైతు రక్షణకు భిన్న తీరులలో కృషి చేశారు.
నెల్లూరులో జమీన్ రైతు వారపత్రిక నిరంతరం బెజవాడ రామచంద్రారెడ్డిపై వ్యంగ్య కార్టూన్లు ప్రచురించింది. 1952 తొలి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నెల్లూరు నుండి లోక్ సభకు రామచంద్రారెడ్డి ఎన్నిక అయ్యారు. నాడు సోషలిస్టు అభ్యర్థిగా ఆయనపై ఇస్కా రామయ్య కూడా పోటీ చేశారు.
నేషనల్ డెమొక్రటిక్ పార్టీ డెఫ్యూటి నాయకుడుగా రెడ్డి గారు లోక్ సభలో వుండగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ నాయకుడు. 1930 ప్రాంతాలలో స్వతంత్ర పత్రిక సంపాదకుడు 1960 నాటికి రాష్ర్ట స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు గావడం విశేషం. అప్పుడే రామచంద్రారెడ్డి గారితో నాకు పరిచయం. ఆయన రాజకీయాలతో నాకు నిమిత్తం లేదు. అయితే నాడు ఆచార్యరంగాకు నేను పి.ఎ.గా (ఆంతరంగిక కార్యదర్శి) వున్నందున ప్రముఖులతో సన్నిహితుడను కాగలిగాను.
రామచంద్రారెడ్డిగారితో 1959లో తొలిసారి బాపట్ల నుండి బొబ్బిలి వరకూ కారులో పర్యటించాను. మేముయిరువురమే వుండడంతో బోలెడు సాహిత్య, నాటక, కళారంగాల సంగతులు చెప్పారు. ఆయనలో సున్నిత హాస్యం వుండేది. ప్రసంగాలు హుందాగా సాగేవి. ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసాలు, నెహ్రూపై విమర్శలు యిష్టపడేవారు. రెడ్డి గారి సరసన రాజాజీని కలవడానికి, మాట్లాడడానికి అవకాశం లభించింది. అప్పటి నుండీ రెగ్యులర్ గా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం.
సాహిత్యంలో కొంత అభ్యుదయం, కొంత సనాతనత్వం మిళితం చేసిన రెడ్డి గారు, తనకు యిష్టమైన వారిని సత్కరించారు. త్రిపురనేని రామస్వామికి గుడివాడలో గండపెండేరం తొడిగిన ఖ్యాతి రెడ్డి గారిదే.
దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువాలతో ఆయనకు చాలా దగ్గర సంబంధాలుండేవి. కొప్పరపు కవుల మొదలు అనేక మందిని ఆయన ఆదరించారు. ప్రతాప రుద్రీయం వంటి నాటకాలు ఓపికగా తిలకించి, విశ్లేషించారు. 1935లో 110 కందపద్యాలతో మాతృశతకం రాశారు. తరువాత రచనలన్నీ వివిధ సంచికలలో, పత్రికలలో, కవికృతులలో కనిపిస్తాయి. ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వ విద్యాలయాలలో పాలక మండలి సభ్యుడుగా రెడ్డి గారు విద్యాభిలాషి. తిరుపతిలో సంస్కృత పరిషత్తు అధ్యక్షులు గానూ వున్నారు.
కవులపై చెణుకులు, అవధానాలలో సరసాలు, కొద్దిగా సెక్స్ జోక్ లు రెడ్డి గారి సొత్తు. రామచంద్రారెడ్డి గారి కుమారులలో పాపిరెడ్డితో నాకు దగ్గర సాన్నిహిత్యం వుండేది. ఓబులరెడ్డి, కృష్ణారెడ్డి, దశరధ రామిరెడ్డి, సీతారామిరెడ్డి గార్లతో హలో  సంబంధమే. బెజవాడ రామచంద్రారెడ్డి గారి గ్రాంధిక వాదం నేడు అదృశ్యంకాగా, ఆయన పనిచేసిన జస్టిస్ పార్టీ స్వతంత్ర పార్టీలు కాలం చేశాయి. నెల్లూరు వర్ధమాన సమాజానికి రెడ్డి గారి పుస్తకాలు, పత్రికలు యిచ్చారు.
ఇక్కడ ప్రస్తావించిన అనేక విషయాలు నేను అడిగి తెలుసుకున్నవీ, వారు భిన్న సందర్భాలలో చెప్పినవీ వున్నాయి. రెడ్డి కుల సభలలో ఎందుకు పాల్గొన్నారో తెలియదు. జస్టిస్ పార్టీలో కొందరివలె ఆయన కులవ్యతిరేక ప్రచారం తీవ్రంగా చేయలేదు. కాని వాడుక భాషను గట్టిగానే నిరసించారు. రెడ్డి గారి చమత్కార బాణాలు : కాంగ్రెస్ కాల్బలము (వలంటీర్లు) పోలీసం లాఠీ దెబ్బలకు కాల్బలమునే చూపినారు అని స్వతంత్ర పత్రికలో రాశారు.
కొప్పరపు కవులతో అవధానంలో పృచ్చకుడుగా రవికలో రెండున్నవి అనే సమస్యను పూరణకుయిచ్చి నవ్వించారు. స్వతంత్ర, తెలుగు వారపత్రికను రామచంద్రారెడ్డి గారు సంపాదకుడుగా వదలేసినప్పుడు, మాలి సుబ్బరామయ్య కొన్నాళ్ళు, వెన్నెల కంటి ఆంజనేయులు కొంతకాలం సంపాదక బాధ్యత వహించారు.
జాషువా కావ్యం ముంతాజు మహలుపై రామచంద్రారెడ్డి గారి వ్యాఖ్య.కన్నెరాళ్ళ గూర్చి కట్టించె షాజాను తాజమహలు. దివ్య తేజ మొదప వన్నెగన్న చెన్ను వర్షించె జాషువ తాజమహలు కవిత తేజమలర” నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డి పాళెంలో, బెజవాడ రామచంద్రారెడ్డి జరిపిన సాహిత్య గోష్టి కార్యక్రమాలు, కళాపోషణ గొప్ప జ్ఞాపకాలు.
రచనలు : మాతృశతకం, అనేక పీఠికలు, సాహిత్య ఉపన్యాసాలు, ఎడిటర్ : స్వతంత్ర  తెలుగు వార పత్రిక.
- నరిసెట్టి ఇన్నయ్య