కాళోజి నారాయణరావు-కాళోజి నారాయణరావు


కాళోజి


`ప్రభుత్వ టెర్రరిజాన్ని విమర్శించే మీరు పద్మ విభూషణ్ ఎందుకు పుచ్చుకున్నార`ని అడిగాను. కాళోజి అందుకు సంజాయిషీ కథ చెప్పారు. వరంగల్లులో వుంటున్న తనకు ప్రధాని పి.వి. నరసింహారావు నుండి ఫోను వచ్చిందట. ఇంట్లో ఫోను లేనందున, కలెక్టరేట్ కు ఫోను చేసి పిలిపించమన్నారట. డెఫ్యూటి కలెక్టర్ జీపులో వచ్చి కలెక్టర్ గారు పిలుస్తున్నారు రమ్మంటే, సరేనని జీపు ఎక్కి, అడిగారట. నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి తీసుకెడుతున్నారా అని. ఆయన నవ్వి. లేదండీ, ఢిల్లీ నుండి మీకు ఫోను వచ్చిందట, అందుకని అన్నారట. కలెక్టరేట్ లో సాదరంగా ఆయన్ను కూర్చోబెట్టి, ప్రధాని నరసింహారావుకు ఫోను కలిపారట. కాళన్నా, నీవు అన్నీ వద్దంటావు. కాని యీ సారి అలా అనొద్దు. పద్మ విభూషణ్ స్వీకరించడానికి ఒప్పుకో అంటే, కాళోజీ `సరే` అన్నారట.
పి.వి. నరసింహారావు, కాళోజీ చిరకాల మిత్రులు. ఒరే అనే టంత చనువు వున్న స్నేహితులు, దీని వెనుక వేరే కథ వుంది. స్టేజి, డ్రామాలలో ఆరితేరిన ఎ.ఆర్. కృష్ణకు పద్మభూషణ్ యివ్వమని సిఫారసు చేస్తూ, కాళోజీ రాసిన లేఖ అందుకున్న ప్రధాని పి.వి. నరసింహారావుకు ఆలశ్యంగా గంట కొట్టిందట- కాళోజీకి పద్మభూషణ్ యివ్వాలని. ఎ.ఆర్. కృష్ణకు పద్మశ్రీ యిచ్చారు. మొత్తం మీద శ్రీశ్రీ వలె కాళోజీ కూడా ప్రభుత్వ లాంఛనాలకు మెత్తబడ్డారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి, జైళ్ళ పాలైన కాళోజి, గేయాలు రాసి, ప్రజాకవిగా పేరొందారు. సాధారణ జీవితం గడుపుతూ గాంధేయుడి వలె నివశించారు.
కాళోజీతో పరిచయమైన తరువాత ఉభయులం కొన్ని సార్లు కలసి భోంచేశాం, ఔపోశనం పట్టాం. కాళోజీ నాన్ వెజి టేరియన్ తినేవాడు. ఇష్టం గా రం తాగేవాడు. తాపీగా భోజనం చేస్తూ బోలెడు కబుర్లు చెప్పేవాడు.
కాళోజి ఒక సారినాతో అన్నాడు. తప్పుడు ప్రదేశాల్లో గుచ్చినా సరే, అక్యు పంక్చర్ సూదులు, పనిచేస్తున్నాయట అని. నేను అశాస్త్రీయ చికిత్సలను విమర్శిస్తున్నట్లు తెలిసి, నన్ను సమర్థిస్తూ, వ్యంగ్యంగా అక్యుపంక్చర్ వైద్యులను దెప్పిపొడిచారు.
కాళోజి గేయాలు చదివాను. సింపుల్ గా సూటిగా వుంటాయి. నాగొడవ పేరిట రాసిన గేయాలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళాయి. ఉద్యమాలలో పాల్గొన్న కాళోజి, గాంధి, నెహ్రూ, రాజాజీ ఎం.ఎన్. రాయ్ ను మెచ్చుకునేవారు. రాయ్ ను యూనివర్శల్ పర్సన్ అనేవారు.  కాళోజీ, 1969 లో ప్రత్యేక తెలంగాణాను సమర్ధించి, అలాగే నిలిచిపోయారు.
నక్సలైట్ ఎన్ కౌంటర్ల విషయంలో స్పందించిన కాళోజీ, పౌర హక్కుల సంఘ సమావేశాలలో పాల్లొన్నారు. అప్పుడు తరచు కలిసే వాళ్ళం.
1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు కాళోజీ. డిపాజిట్ పోయింది. కాని ఆయనకు మహిళా సంఘాలు, అభ్యుదయ సంఘాలు మద్దత్తు యిచ్చాయి. ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతటా పర్యటించాల్సిన వెంగళరావు, తన నియోజక వర్గానికి అతుక్కుపోయి, పోటీ తీవ్రంగా తీసుకోవడం గమనార్హం. అప్పుడు ఆంధ్రజ్యోతి దిన పత్రిక బ్యూరో ఛీఫ్ గా, నేను సత్తుపల్లి వెళ్ళి, కాళోజీని కలసి, మెచ్చుకున్నాను.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కాళోజి జర్నలిస్టులతో కలిసి, మద్యం సేవిస్తూ కబుర్లు చెప్పేవారు. కొన్నాళ్ళు హైదరాబాద్ లోని హనుమాన్ టేకిడిలో నివసించారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా ఫెన్షన్ రావడంతో, ఆయనకు ఆర్థికంగా వెసులు బాటు లభించింది. బాగా వృద్ధాప్యం వచ్చే వరకూ, కాళోజి జీవించారు. ఆయనతో కాలక్షేపం ఎప్పుడూ ఆహ్లాదంగానే వుండేది.
రచనలు : నాగొడవ (గేయాలు), లంకా పునరుద్ధరణ (కథలు).
అనువాదాలు : ఖలీల్ జీబ్రాన్, దిప్రాఫెట్, రెబెల్ ఇండియా.

- నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment