జీవితమే సఫలము --Part 1

(Innaiah with Paul Kurtz)
ముందుమాట

మతానికీ, కులానికీ అతీతంగా మానవ విలువలతో జీవితాన్ని ఆనందదాయకంగా గడపటం సాధ్యమే. గుడ్డినమ్మకాలూ, ఛాందస భావాలూ, లేకుండా వైజ్ఞానిక దృక్పథంతో కళలూ, రామణీయకతలూ, పోషించుకుంటూ అనువదించటం ఆనందాన్నిచ్చే విషయమే. తెలియని అతీత శక్తుల మిథ్యలో మానసిక దాస్యాలకు గురయి బాధలు పడేకంటే జీవితాన్ని ఫలప్రదంగా సాగించటం సక్రమ పద్ధతి. అందులో మానవ ఉత్సవాలకు, పెళ్ళిళ్లకు, వివిధ కార్యక్రమాలకు చోటు ఉంటుంది. పుట్టుక నుండి చనిపోయేవరకు, వివిధ అంశాలు, మానవ ప్రాధాన్యతతోనే, జరుపుకోవచ్చు. ఇందులో స్త్రీ పురుషులకు సమానత్వం ఉంటుంది. పరిశీలన, పరిశోధన చేయకుండా గుడ్డిగా నమ్మటం కాని, ఎవరో చెప్పారని, కాళ్ళకు మొక్కటం గాని, ఉండరాదు. అలాంటి జీవితానికి మార్గదర్శకాలు సూచిస్తూ సుప్రసిద్ధ మానవవాద నాయకుడు కీ.శే. పాల్ కర్జ్ సరళంగా చిన్న రచన చేశారు. దానిని వరుసగా తెలుగులో అందిస్తున్నాము. (తెలుగుసేత - నరిసెట్టి ఇన్నయ్య).





ఒకటి
మానవవాదం నిర్ధారణగా చెబుతున్న సంగతులు

ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి వివేచన, విజ్ఞానం ఆధారాలు చేసుకుందాం. సమస్యలు పరిష్కరించుకుందాం.

  • భూమిని కాపాడదాం. రానున్న తరాలవారికి భూసంపద అట్టిపెడదాం. ఇతర జీవజాలాన్ని అనవసరంగా బాధలకు గురిచేయం.
  • జాతి, మతం, వర్గం, కులం వంటి సంకుచిత విభజన శక్తులను దాటిపోయి మానవుల మంచికోసం కృషి సాగిద్దాం.
  • బహుళ, స్వేచ్ఛా సమాజాలు కావాలి. పెత్తందారీ వర్గాల నుండి అణచివేసే అధికసంఖ్యాకుల నుండి మానవహక్కులు కాపాడదాం.
  • ఉన్నత నీతి స్థాయిని పెంచుదాం.
  • చిత్తశుద్ధి, పరోపకారం, నిజాయితి, బాధ్యత అందరికీ మంచి చేస్తాయి. మానవవాద నీతి నిశిత పరిశీలనకు, వివేచనాత్మక మార్గదర్శకత్వానికి నిలుస్తుంది. అందరం కలసి ప్రమాణాలు ఏర్పరచుకుందాం. ఫలితాలను బట్టి నైతిక సూత్రాలను పరీక్షిద్దాం.
  • పిల్లలకు నైతిక విద్య అవసరం, వివేచన, దయ పెంపొదిద్దాం.
  • మానవజీవితాన్ని మెరుగుపరిచేది వైజ్ఞానిక పరిశోధన, సాంకేతిక శాస్త్రమే.
  • పరస్పర అవగాహనకు, విభేదాలు పరిష్కరించుకోడానికి సంప్రదింపులు, రాజీలు ఉత్తమ పంథా.
  • విచక్షణ, అసహనం పోగట్టాలి. న్యాయం సాధించుకోవాలి.
  • మతాన్ని రాజ్యాన్ని వేరుచేయాలి.
  • వికలాంగులు తమ శక్తిపై తాము ఆధారపడేట్లు వారికి తోడ్పడాలి.
  • జీవితం ఆనందమయంగా గడపడానికి, వ్యక్తుల ప్రతిభను పూర్తిగా వికసింపజేసుకోడానికి కృషి జరగాలి.
  • వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి. యుక్తవయస్సు నుండీ వ్యక్తులు తమ ఆశయాలు సాధించుకునే అవకాశాలు వుండాలి. లైంగికంగా వారి యిష్టాయిష్టాలు వారికే వదిలేయాలి. సంతాన నిర్ణయంలో స్వేచ్ఛ వుండాలి. ఆరోగ్యసంరక్షణ అవకాశాలుండాలి. గౌరవప్రదంగా చనిపోయే రీతులు అవసరం.
  • విజ్ఞానానికి కళలకు సమాన అవకాశాలు వుండాలి.
  • మానవులంతా విశ్వపౌరులు, రానున్న కొత్త పరిశోధనలలో భాగస్వాములు కావాలి.
  • పరీక్షకు గురిచేయని వాటిపట్ల సందేహాలు ఉండాల్సిందే. కొత్త భావాలను ఆహ్వానించాలి. కొత్త ఆలోచనలు వెతకడాన్ని స్వాగతించాలి.
  • మానవవాదం వాస్తవం. హింసకు, నిరాశకు గురిచేసే మతవాదనలకు మానవవాదం మార్గాంతరం. మానవసేవలో మానవవాదం చక్కని మార్గాంతరం.
  • మనం నిరాశకు లోనుకాగూడదు. ఆశాజీవులంగా వుండాలి. నిస్పృహకంటే ఆశ మంచిది. పిడివాదం కంటే నేర్చుకోవడం ఉత్తమం. పాపం అనే భావన బదులు ఆనందం చోటుచేసుకోవాలి. భయం స్థానంలో సహనం రావాలి. ద్వేషం కాదు ప్రేమ కావాలి. అసహ్యతకు బదులు రామణీయకత చోటుచేసుకోవాలి. గుడ్డి నమ్మకాలబదులు వివేచన రావాలి.
  • మానవులుగా మనలోని ఉత్తమ, ఉన్నత లక్షణాలు సాధించుకోవాలి.

ముగింపు-శామ్ హారిస్ --Letter to Christian Nation




21వ శతాబ్దంలో మానవులు ఎదుర్కొంటున్న పెద్ద నాగరిక సమస్యలు ఉన్నాయి. నీతి ఆధ్యాత్మిక అనుభవం మానవుల బాధలు ఇందులో ప్రధానాంశాలు. నిశిత పరిశీలన చిత్తశుద్ధితో ఈ సమస్యల్ని చర్చించాలి. ఇందులో మత విశ్వాసం గౌరవిస్తూనే చర్చ జరగాలి.
మతాన్ని మన మధ్య నుండి తొలగించే అవకాశం కనిపించడం లేదు. 18వ శతాబ్దంలో బానిసత్వం తొలగించాలని అంటే ఆనాడు అటువంటి అవకాశాలు కనిపించలేదు. 1775లో అమెరికాలో బానిసత్వాన్ని రూపుమాపాలంటే ఆనాడు అలా అన్నవారు కాలం వృధా చేసుకుంటున్నానని భావించారు. ఈ పోలిక సరైనదని కాకపోవచ్చు. ఇదొక సూచన ప్రాయంగా చెప్పే విషయమే. మున్ముందు మనం మతాన్ని దాటిపోయి వెనక్కు తిరిగి చూసుకుంటే మానవచరిత్ర అంత భయానకంగా ఉండేదా? అని ఆశ్చర్యపడతాం, 21వ శతాబ్దంలో ఇలాంటి నమ్మకాలు ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతాం. దేవుడు స్వర్గం పేరిట సమాజంలో అంత ప్రమాదకరంగా ఎలా చీలిపోయాయి అనుకుంటాం. 1859లో డార్విన్ జీవుల పుట్టుపూర్వోత్తరాలు ప్రచురిస్తుంటే అదే సంవత్సరంలో అమెరికాకు బానిసలతో కూడ చివరి ఓడ వచ్చి చేరింది.
మనం మానవ జీవితంలో పుట్టుక వివాహం మరణం వంటివి గమనిస్తూనే మార్పులను చేసుకుంటూ సాగిపోవాలి. పిల్లల్ని క్రైస్తవులుగా ముస్లింలుగా, యూదులుగా పెంచే అసహ్యకర పద్ధతిని దాటి పోవాలి. ప్రపంచంలో ప్రమాదకరంగా దెబ్బతీసిన వాటిని నయం చేసుకుంటూ సమాజాన్ని నిర్మించాలి.
క్రీస్తును ఆమోదించడంతోపాటు జీవితంలో కొన్ని ప్రత్యక్ష మార్పులు జరిగాయి. తోటివారిని అనూహ్యంగా నేడు ప్రేమిస్తున్నారు. ప్రార్థిస్తున్నప్పుడు దివ్య భావనలు పొందుతున్నారు. అటువంటి అనుభవాలను నేను వెక్కిరించడంలేదు. కాని మీతోపాటు అదే సమయంలో ఇతరచోట్ల కోట్లాదిమంది వారి అనుభవాలను చవి చూస్తున్నారని గుర్తుంచుకోవాలి. కృష్ణుడు, అల్లా, బుద్ధుడు మొదలైన వారిని గురించి ఆలోచిస్తున్నవారిని మనసులో పెట్టుకోవాలి. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నవారిని, కళలు, సంగీతం సమకూరుస్తున్నవారిని విస్మరించరాదు. జీవితాలలో మార్పు చేసుకున్నవారి అనుభవాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. వారికి వారి అనుభవాలపట్ల భ్రమలుండొచ్చు. విశ్వాన్ని గురించి అవగాహన చేసుకున్న వానికంటే ఇంకెంతో జీవితం ఉన్నదనుకోవచ్చు. అంతమాత్రాన విశ్వంపట్ల సమర్ధనీయం కాని విషయాలను అవలంబించరాదు.
మతానికి విజ్ఞానానికి ఉన్న విచక్షణ, నైతికాంశాలను దూరం చేసేది కాదు. ఆధ్యాత్మిక అనుభవాలు పక్కన పెట్టడం కాదు. మనం హేతుబద్ధంగా చిత్తశుద్ధితో ఎలాంటి నిర్ణయాలకు వస్తున్నామనేది ముఖ్యం. బుద్ధుడు, జీసస్ మానవుల శక్తియుక్తుల గురించి ప్రస్తావించి మన జీవితాలను ఆనందమయంగా మార్పు చేసుకోవచ్చు అన్నారు. అటువంటి ప్రమాణాలే, స్వీయ విమర్శలే మన చర్చలలోనూ రావాలి.
పరిణామంలో గతం నుండి లోతుపాతులతో మతం జనించింది. చరిత్రకు ముందు మానవులను పొందికగా నడిపించడానికి మతం ప్రధాన పాత్ర వహించిందని రూథర్ ఊహించాడు. ఇటువంటి ప్రయోజనం నేను ఉన్నది అనలేం. చెరచడం దుర్వ్యసనం. అంతమాత్రాన అది మంచిదే అనలేం. సభ్య సమాజంలో అది ఇమిడిపోయింది అనలేం. మన పూర్వీకులలో పరిణామ క్రమంలో అటువంటి చర్య కొన్ని అవకాశాలను ఇచ్చి ఉండవచ్చు. గతంలో మతం కొన్ని అవసరాలను తీర్చింది అన్నంత మాత్రాన సరిపోదు. నేడు విశ్వనాగరికతను నిర్వహించడానికి ప్రధానంగా అడ్డు వస్తున్నది మతమే.
లోగడ ఎందరో మతాన్ని అద్భుతంగా ఎదుర్కొంటూ విమర్శించారు. దేవుడు అస్తమించాడు. అని మా పాఠశాలలో చాటలేకపోయాం. మతం పేరిట మన నాయకులు ఘంటాపథంగా చెప్పే విషయాలు గొప్పవి. మన మీడియా విమర్శించలేకపోయింది. దేవుడి విషయంలో ప్రతి సమాజం దారుణంగా విఫలం అయింది. ఆ భావాన్ని గందరగోళంగా ప్రచారం చేసేవారిని ఎండగట్టలేకపోయింది.
ముస్లిం దాడులు చేస్తూ జాతి యావత్తూ నశించాలని నినాదాలిస్తుంటే నమ్మకం లేనివారు చూస్తూ అవాక్కయిపోయారు. అలాగే మత భ్రమలను సేవిస్తూ మానవుడు బాధల్ని, విస్మరిస్తున్నవారిని చూస్తున్నా అవాక్కయిపోతున్నారు. ఊహించుకున్న దేవుణ్ణి అంటిపెట్టుకున్నవారిని చూసినా అవాక్కయి పోతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి ఆశ్చర్యంతో విలువైన ఫలితం ఉండకపోతుందా అనే ఆశతో ఈ లేఖ రాశాను.
        మూలం                                   అనువాదం
        శామ్ హారిస్    ఎన్. ఇన్నయ్య

మతం, హింస, నాగరికత భవిష్యత్తు-Sam Harris Letter to Christian Nation


11వ భాగం
సృష్టికర్త మీరు నమ్మిన పవిత్రగ్రంథాన్ని రాసినట్లు ఎందరో విశ్వసిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు దైవం పేరిట వచ్చినట్లు చూపారు. మనం ఎలా బతకాలో ఆ పుస్తకాలు చెబుతున్నాయి. పోటీపడుతున్న మత సిద్ధాంతాలు మన ప్రపంచాన్ని విడదీసి వివిధ నైతిక సమాజాల పేరిట సంఘర్షణలకు దారి తీశాయి.
ఇందుకు బదులుగా కొంతమంది ఇంగిత జ్ఞానం కలవారు మత సహనం కావాలన్నారు. మత యుద్ధాలకంటే మత సహనం మంచిదే, కానీ ఈ సాధనలో సమస్యలున్నాయి. ఆలోచిస్తే మత ద్వేషం ప్రబలి పోతుందేమోనని, మతపరంగా దారుణమైన భావాలను కూడా అంటుకోవడంలేదు. మనలను మనమే మోసం చేసుకుంటూ మత విశ్వాసాలకు వైజ్ఞానిక వివేచనకు పొందిక ఉన్నదని సరిపెట్టుకుంటున్నాం. పోటీ పడుతున్న మత విషయాలు విశ్వవ్యాప్తమైన నాగరికత ఆవిర్భవించకుండా అడ్డుపడుతున్నాయి. మతవిశ్వాసం -  ఏ పేర పిలిచినా ఒకే దేవుడున్నాడనడం, జీసస్ మళ్ళీ భూమి మీదకు తిరిగి వస్తాడనడం, ముస్లింలలో ఆత్మాహుతి త్యాగులు సూటిగా స్వర్గానికి పోతారనడం, తప్పుద్రోవను పట్టించే మాటలు.
మతం మానవ సంఘర్షణను చాలా పై స్థాయిలో విజృంభింప చేస్తున్నది. ఆటవికతకు జాతి విద్వేషానికి, రాజకీయాలకు, ఇవి మించిపోయాయి. శాశ్వత శిక్షలు, పారితోషికాలు ఉంటాయనే ఆలోచనలతో మత భావాలు ప్రభావితం చేస్తున్నాయి. పిల్లల్ని మత విశ్వాసంతో భయం అనే వాతావరణంలో పెంచి అమానుషంగా పెంపొదిస్తున్నాం. మూఢ విశ్వాసం, భక్తి రెండు విధాల హింసను పురికొల్పుతున్నాయి. సృష్టికర్త చేయమన్నాడనే నెపంతో మత విశ్వాసులు ఇతర మతస్థుల్ని చంపుతున్నారు. ఇస్లాం టెర్రరిజం అందుకు ఉదాహరణ మతాన్నిబట్టి నీతిని నిర్ణయించే వారు తమ మతాన్ని అంగీకరించి ఇతర మతాలతో సంఘర్షణకు దిగుతున్నారు. ముస్లింలు అందరూ తోటి ముస్లింలతో చేతులు కలపడం అలాగే, ప్రొటస్టెంట్ లు, కాథలిక్ లు, తమ వారితో కలిసి ఇతరులతో పోట్లాడడం జరుగుతున్నది. ఇవి అన్నివేళలా మతం పేరిటే జరుగుతున్నట్లు అనిపించకపోవచ్చు, కాని మత విధానాల నుండి జనించిన ద్వేషం సంఘర్షణలకు దారి తీస్తున్నది. మత విద్వేషాలను భౌగోళిక పోరాటాల విలయతాండవం చేస్తున్నాయి. పాలస్తీనాలో యూదులు – ముస్లింలు, సనాతన సెర్బియన్లు – కాథలిక్ క్రొయేషియన్లు, సనాతన సెర్బియన్లు – బాసియన్లు – అల్బేరియన్ ముస్లింలు, ఉత్తర ఐర్లండ్ లో ప్రొటస్టెంట్ లు – కాథలిక్ లు, కాశ్మీర్ లో ముస్లింలు – హిందువులు, సూడాన్ లో ముస్లింలు – క్సైస్తవులు – యానిమిస్ట్ లు, నైజీరియాలో ముస్లింలు – క్రైస్తవులు, ఇథియోపియాలో అల్ట్రియాలో ముస్లింలు – క్రైస్తవులు, ఐవరీ కోర్టులో ముస్లింలు – క్రైస్తవులు, శ్రీలంకలో తమిళ హిందువులు, ఫిలిప్పైన్స్ లో ముస్లింలు – ఇరాన్ ఇరాక్ లో షియా-సున్నీలు, కాకసన్ లో సనాతన రష్యన్ లు చెచీన్ ముస్లింలు, ముస్లిం అజర్ బైజాన్ – కాథలిక్ – సలాముల ఆర్మేనియన్లు ఇటీవల మతపరంగా విజృంభించి కొట్టుకుంటున్నారు.
ఈ విధంగా మత చీలికలు స్పష్టంగా సంఘర్షణలకు దారి తీస్తుండగా, చాలామంది ఇంకా ఇదంతా చదువు లేనందువల్ల, పేదరికంవల్ల, రాజకీయాలవల్ల సంభవిస్తున్నాయని వివరిస్తున్నారు. నమ్మకం లేనివారు, ఉదారులు, మితవాదులు భావిస్తున్న తీరులో మత విశ్వాసాల పరంగా ఎవరూ జీవితాలను త్యాగం చేయబోవట్లేదు అని అనుకుంటున్నారు. స్వర్గంలో ఎలా ఉండబోతున్నారో వారికి తెలియదన్నమాట. అంటే స్వర్గాన్ని గురించి నిర్ధారణగా ఎవరికీ తెలియదని వారనుకుంటున్నారు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై సెప్టెంబరు 11న విమానాలతో దాడి చేసిన వారు కళాశాలలో చదువుకున్న మధ్యతరగతివారే. రాజకీయ అణచివేతకు గురయినవారు కాదు. స్వర్గంలో అమరజీవులుగా ఎలాంటి ఆనందాలు అనుభవిస్తారో వారు మసీదులలో కూర్చొని చర్చించుకున్నారు. జిహాద్ హింస కేవలం విద్యకు పేదరికానికి రాజకీయానికి సంబంధించింది కాదని ఎంతమంది గ్రహిస్తారు. తగిన వనరులు ఉండి మేథస్సు కలిగి న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే అలాంటి వ్యక్తి స్వర్గానికి పోయి 72 కన్యలతో ఆనందించబోతున్నట్లు నమ్మకం పెరిగినవారు ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి పాశ్చాత్యదేశాలలో సెక్యులరిస్టులు, ఉదారవాదులు, మితవాదులు ఇంకెంతో కాలం వేచి ఉండాలన్నారు. దేవుళ్ళ నమ్మకం అంటే ఎంత శక్తివంతమైనదో వారికి తెలియదు.
మతపరమైన యుద్ధాలను ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయికి తీసుకుపోతున్నాయో గమనించాలి. ముస్లింలు 1.4 బిలియన్లు ఉన్నారు. ప్రపంచంలో అందరూ ఇస్లాంలోకి మారతారని ముస్లిం రాజ్యంలోకి వస్తారని లేదంటే నమ్మకాలు లేని వారుగా చంపబడతారని భావిస్తున్నారు. యూరప్ లో ఇస్లాం అతి వేగంగా వ్యాపిస్తున్నది. ముస్లిమేతరులలో ఉన్నదానికంటే యూరోప్ ముస్లింలలో జనాభా 3 రెట్లు అధికంగా పెరుగుతున్నది. ఈ విధంగా కొనసాగితే 25 సంవత్సరాలలో ఫ్రాన్స్ లో అధిక సంఖ్యాకులు ముస్లింలు ఉంటారు. అది ప్రవాసుల రాకను ఆపేస్తేనే జరుగుతుంది. యూరోప్ లో ఉన్న ముస్లింలు ఆ దేశాల సెక్యులర్ పౌర విలువలను స్వీకరించడానికి సిద్ధపడడం లేదు. కాని ఆదేశాల విలువలను తమకు అనుకూలంగా వాడుకుంటూ తమ పట్ల జాలిచూపాలంటూ మసీదులలో మత ద్వేషాన్ని ప్రచారం చేస్తూ పోతున్నారు. సెక్యులర్ యూరప్ లో ఇస్లాం వాదన బలవంతపు వివాహాలు, గౌరవప్రదంగా హతమార్చడాలు, మూకుమ్మడిగా చెరచడాలు జరుగుతున్నాయి. (కుటుంబాలు ఏర్పాటు చేసిన పెళ్ళిళ్ళను నిరాకరించిన స్త్రీలను, విడాకులు కోరే స్త్రీలను, వ్యభిచరించిన స్త్రీలను పగవారుగా చూస్తున్నారు. అలాంటి స్త్రీలను వారి తండ్రులు భర్తలు తోబుట్టువులు చంపేస్తున్నారు. పైగా అదొక సంస్కృతిగా చెప్తున్నారు. ఇస్లాం ఈ ధోరణులను సమర్ధిస్తున్నది. స్త్రీలను కేవలం పురుషుల ఆస్తిగా పరిగణిస్తున్నారు. తనను చెరచినట్లు ఏ స్త్రీ అయినా చెబితే ఆమెను వ్యభిచారిణిగా ముద్రవేసి చంపుతున్నారు. వివాహము వెలుపల లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపిస్తున్నారు.) యూరోప్ లో జాతి విద్వేషం భయంతో రాజకీయంగా సక్రమ విధానాన్ని అనుసరిస్తున్నామని చూపడానికి చాలామంది మత తీవ్రవాదుల జోలికి పోవడంలేదు. యూరోప్ లో నేడు ఇస్లాం భీతికి వ్యతిరేకంగా నిలిచి మాట్లాడగలుగుతున్నవారు ఫాసిస్టులు మాత్రమే, మిగిలినవారు చెదురుమదురుగానే ఉన్నారు. ఈ ధోరణి నాగరికత భవిష్యత్తుకు మంచిది కాదు.
ఇస్లాం శాంతియుత మతం అని అతివాదులు దీనిని అపహరించుకు పోతున్నారని అనడం కేవలం భ్రమ మాత్రమే. అలాంటి భ్రమలో ఉండడం ముస్లిలకు కూడా ప్రమాదకరం. ముస్లింలతో ఈ విషయం సంభాషించడం చర్చకు దిగడం ఎలాగో స్పష్టపడలేదు. కాని ముస్లింల పట్ల భ్రమపూరితమైన ధోరణిలో ఉండడం మాత్రం తగిన పరిష్కారం కాదు. ముస్లిం ప్రపంచంలో సంఘర్షణలను చూస్తున్నారు. అలా చూడనివారిని ద్రోహులుగా అనుకుని ముస్లింలు చంపేస్తున్నారు.
మనం ముందుగా సహేతుకంగా లేకపోతే ముస్లిం ప్రపంచంతో హేతుబద్ధంగా ఎలా చర్చిస్తాం. మనందరం ఒకే దేవుని ఆరాధిస్తున్నామని చెబితే ఒరిగేదేమీ లేదు. మనం అందరం ఒకే దేవుణ్ణి ప్రార్థించడంలేదు. మతం పేరిట జరుగుతున్న రక్తపాతమే ఇందుకు ఉదాహరణ. ముస్లింలలో సైతం షియాలు సున్నీలు ఒకేదేవుణ్ణి, ఒకే తీరుగా ప్రార్థించలేకపోతున్నారు. ఆ విషయంలో శతాబ్దాలుగా చంపుకుంటున్నారు.
వివిధ మతాల మధ్య విబేధాలను పరిష్కరించడానికి పరస్పర మత చర్చలు దారితీస్తాయనుకోవడం పొరపాటు. ముస్లిం భక్తులకు వారి మతం సంపూర్ణమైనది. అందులో నుండి దారి తప్పితే నరకమే మార్గం. మతాల ప్రతినిధులు తరచూ సమావేశమై శాంతిని నెలకొల్పాలని వివిధ మతాల మధ్య దయ అనేది సాధారణ లక్షణంగా ఉండదని చెప్పటం పరిపాటి. కాని ఏ మతంలోనైనా ఆ మత నమ్మకం దృష్ట్యానే శాంతిని, దయను చూస్తారని మర్చిపోకూడదు. నీవు చెప్పే దయ అరబ్బు ప్రపంచంలో కాలు పెట్టక ముందు ఆహుతి కావడం అనేది లక్షలాది ముస్లింలు సిద్ధంగా ఉన్నారని విస్మరించవద్దు. మతాల మధ్య ఏ స్థాయిలోనైనా ప్రపంచానికి చెందిన దృక్పథాలు ఒక తీరుగా లేవని అవి పొసగవని గ్రహించకపోతే ఎలా? కోట్లాది ప్రజలు ఏది నమ్ముతున్నారో అనేది విడమరచి చూడాల్సిందే.
            మూలం                                   అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య

జీవిత వాస్తవాలు--Sam Harris Letter to Christian Nation


10వ భాగం

భూమిమీద జీవితానికి సంబంధించిన క్లిష్టదశలన్నీ సాధారణ స్థితి నుండి అనేక సంవత్సరాలుగా పెంపొందుతూ వచ్చాయి. ఈ వాస్తవాన్ని నేడు ప్రశ్నించడంలేదు. మానవుడు అంతకుముందున్న జీవుల నుండి పరిణమించిన విషయం సందేహిస్తే, సూర్యుడు ఒక నక్షత్రం అనేది కూడా సందేహించినట్లే, సూర్యుడు సాధారణ నక్షత్రం వలె కనిపించడు. కానీ అది నక్షత్రం అని మనకు తెలుసు. భూమికి సన్నిహితంగా ఉన్న నక్షత్రం సూర్యుడే. సూర్యుడు నక్షత్రమే కాదని భావించి మత విశ్వాసంపై ఆధారపడిన ధోరణి ఊహించండి. అమెరికాలో లక్షలాది క్రైస్తవులు ఖగోళ శాస్త్రజ్ఞులను, ఖగోళ భౌతిక విజ్ఞానులను ఎదుర్కోవడానికి లక్షలాది డాలర్లు వెచ్చిస్తున్నారు. ఆధారాలు లేని విషయాలను సూర్యుడిని గురించి జాతీయ పాఠశాలలో బోధిస్తున్నారు. పరిణామాన్ని గురించి ఇలాంటి స్థితి ప్రస్తుతం కనిపిస్తున్నది.
పరిణామ వాస్తవాలను సందేహిస్తున్న క్రైస్తవులు అది వాస్తవం కాదని, ఒక సిద్ధాంతం మాత్రమేనని అంటుంటారు. వైజ్ఞానికంగా సిద్ధాంతం అనే మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వారి ప్రకటనలో కనిపిస్తున్నది. సైన్సులో వాస్తవాలను ఇతర వాస్తవాల దృష్ట్యా వివరించాలి. ఇలా విస్తృతంగా వివరణ చేసుకుపోయే నమూనాలను సిద్ధాంతం అంటారు. ఆ సిద్దాంతం కొన్ని భవిష్య ప్రణాళికలు వేస్తాయి. వాటిని పరీక్షకు పెట్టాలి. పరిణామ సిద్ధాంతం అనేది వాస్తవం కాదనే అర్థం ఈ సిద్ధాంతంలో లేదు. రోగానికి సంబంధించిన సూక్ష్మజీవుల సిద్ధాంతం, లేదా గురుత్వాకర్షణ సిద్ధాంతం అంటే రోగాన్ని గురించి కాని, గురుత్వాకర్షణ గురించి కానీ సందేహిస్తున్నామని అర్థం కాదు.
బైబుల్ లో ఉన్న అస్థవ్యస్థమైన విషయాలను హేతుబద్ధంగా చెప్పడానికి శాస్త్రీయ భాషలు కొందరు కావాలని వాడారు. అలా చేసిన వారిలో కొందరు పిహెచ్.డి లు కూడా పొందారు. మరికొందరు వీరి అడుగుజాడలలో నడవవచ్చు కూడా. సాంకేతికంగా వారిని సైంటిస్టులు అనవచ్చు. కాని వారు సైంటిస్టుల వలె ప్రవర్తించడంలేదు. విశ్వాన్ని గురించి చిత్తశుద్దిగా వారు అన్వేషించడంలేదు. దేవుని గురించి వారు చెప్పే మాటలు డార్విన్ వైఫల్యాలను గురించి చేసే ప్రకటనలను పరిణామ సిద్ధాంత వివాదానికి సంబంధించినవి కావు. 2005లో 34 దేశాలలో పరిణామం ఏమేరకు ఆమోదిస్తున్నారని సర్వే చేశారు. అందులో అమెరికా 33వ స్థానంలో ఉన్నది. అమెరికాలో హైస్కూలు విద్యార్థులు సైన్సును లెక్కలను అర్థం చేసుకోవడంలో యూరోప్, ఆసియోలకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు. మనం అమెరికాలో అజ్ఞాన నాగరికతను నిర్మించుకుంటున్నాం.
మనకు తెలిసింది ఇది. బైబిలు చెప్పేదానికంటే విశ్వం చాలా ప్రాచీనమైనది. భూమిపై సంక్లిష్టమైన జీవపదార్థాలు మానవునితో సహా లక్షలాది సంవత్సరాల నుండి పరిణమిస్తూ వచ్చాయి. ఇందుకు సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. మనం చూస్తున్న జీవిత వైవిధ్యం జన్యు సంకేతాలలో వ్యక్తమయింది. ఇది డిఎన్ఎ కణాలలో చూశాము. అవి యాదృచ్ఛికంగా గెంతులేస్తున్నాయి.  ఈ గెంతులేయడం మనుగడ సాగిస్తున్న జీవులలో పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకానొక పరిణామం దృష్ట్యా పునరుత్పత్తి సాగుతున్నది. ఈ గెంతువేయడం సహజ ఎంపిక అనేవి ఏకాకిగా నిలిచిపోయిన జనాభాలో వారిలో వారు పెరగకుండా కొన్ని జీవులకే పరిమితమయి చాలా కాలం కొనసాగడం గమనార్హం. మానవులు పరిణామంలో ఈ విధంగా రావడం గమనించాం. జన్యు సాక్ష్యాధారాలుగా మనం కోతుల నుండి భాగం పంచుకున్న తీరు స్పష్టంగా బయటపడింది. జన్యు ఆధారాల పరంగా పూర్వీకులైన కోతులు వాటికి పూర్వీకులైన గబ్బిలాలు ఎగిరే పక్షులు ఇలా జన్యుపరిణామంలో భాగం పంచుకున్నాయి. జీవన శాఖోపశాఖలు పరిశీలిస్తే మౌలికంగా వాటి స్వభావాలు బాగా అర్థమవుతూ ఉన్నాయి. కనుక వ్యక్తిగతంగా కొన్ని జీవులు నేటి రూపంలో సృష్టి అయ్యాయి అనడానికి ఎలాంటి కారణం లేదు. పరిణామం ఎలా ప్రారంభం అయింది అనడం ఇంకా తెలియదు. దాని వెనక దైవం ఉన్నది అనుకోనక్కరలేదు. బైబిలును చదివితే జంతువులు చెట్లు దేవుడి సృష్టిగా పేర్కొన్నారు.  విషయంలో బైబిలు తప్పు అనడం సందేహించనక్కరలేదు.
చాలామంది క్రైస్తవులు పరిణామ వాస్తవాల్ని సందేహించదలచి, వివేచనాత్మక నమూనా పేరిట కొత్త వాదన చేస్తున్నారు. సైన్సుకు ముసుగు వేసి రాజకీయంగా మతపరంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడమే వీరి ఉద్దేశ్యం. బైబిల్ చెప్పే దేవుడిలో గట్టి నమ్మకం చూపలేక ప్రపంచంలో వైదొలగే అవగాహన పెరిగిపోతున్న సందర్భంలో వివేచనాత్మక నమూనా ఉన్నది అనేవారు తమ శాస్త్రీయ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు.
తెలివిగల నమూనా (ఇంటలిజంట్ డిజైన్) అనే వాదన చేసేవారు విశ్వం ఉనికికి వెనుక దేవుడున్నాడని నిర్ధారితమవుతుందని అంటున్నారు. వారి వాదన ఇలా ఉందిః ఉన్నదానినకి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి. కాలం, ఆకాశం ఉన్నాయి. వాటి వెలుపల వాటికి ఏదో కారణం ఉండి ఉండాలి. వాటిని దాటిపోయి సృష్టించగల శక్తి దేవునికే ఉన్నది.  ఇలాంటి వాదన బావున్నదని చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు. అలాంటి వాదన చేసినప్పుడు ఇంకెంతో లోతుపాతులతో చర్చ అవసరం అవుతుంది. కాని వారు చెప్పే తీరులో తుది నిర్ణయం మాత్రం రాదు. కాలాకాశాలకు దేవుడే మూలం అని ఎలా చెప్పగలం మన విశ్వానికి నమూనా తెచ్చిపెట్టిన దేవుడు నిజమే అయితే, అది బైబిల్ లో చెప్పిన, క్రైస్తవులు ఆమోదించిన దేవుడు అని చెప్పనక్కరలేదు. తెలివిగా నమూనా రూపొందిస్తే మన విశ్వాన్ని లోకాతీత సూపర్ కంప్యూటర్ కూడా నడిపించవచ్చు. దుష్టదైవం ఆ పని చేయవచ్చు. విశ్వంతో ఆడుకునే ఇరువురు దేవుళ్లు ఇటువంటి పని చేయవచ్చు.
వాదనలో అనంతంగా వెనక్కుపోయే స్థితిని సృష్టికర్త భావనలో ఉన్నది. దేవుడు విశ్వాన్ని సృష్టిస్తే, దేవుణ్ణి ఎవరు సృష్టించాడు. మళ్ళీ దేవుడే అని సమాధానం ఇస్తే ప్రశ్న మొదటికి వస్తుంది. క్లిష్టమైన విశ్వాన్ని సృష్టించగల దేవుడు చాలా క్లిష్టమైనవాడుకావాలి. రిచర్డ్ డాకిన్స్ జీవ శాస్త్రజ్ఞుడిగా ఈ విషయంలో చెప్పినట్లు అటువంటి సహజ సంక్లిష్ట విధానాలు ఇప్పించగలిగింది పరిణామం మాత్రమే.
వాస్తవం ఏమంటే విశ్వం ఏ విధంగా, ఎందుకు వచ్చిందో తెలియదు. విశ్వ సృష్టిని గురించి పొందికగా మాట్లాడలేం. ఆ విషయాన్ని కాలంతో పోల్చి చెప్పవలసిందే. కాలం-ఆకాశం పుట్టుక గురించి మనం మాట్లాడుతున్నాం అన్నాడు (భౌతిక శాస్త్రజ్ఞుడు స్టీవెన్ హాకిన్స్ కాలాకాశాన్ని ఆద్యంతరహితమైన నాలుగు కోణాలమయంగా చెప్పాడు.) విశ్వం ఎందుకు ఉన్నదో తెలియదని చిత్తశుద్ధిగల మేధావి ఎవరైనా అంగీకరిస్తారు.  ఈ విషయంలో తమ అజ్ఞానాన్ని సైంటిస్టులు ఒప్పుకుంటారు. మత నమ్మకస్థులే ఒప్పుకోరు. మత చర్చలలో ఒక వైపున వినమ్రత, అణకువ ఉన్నట్లు తమలో తాము పొగుడుకుంటూనే సైంటిస్టులను, నమ్మకం లేనివారిని ఖండిస్తూ తలబిరుసుతనంతో ఉన్నారంటారు. మత నమ్మకస్థులు వెల్లడించే ప్రపంచ దృక్పథం వారి అహంభావానికి ప్రతీక. జుగుప్సాకరం కూడా, వారి దృష్టిలోః “సృష్టికర్త నాపై శ్రద్ధ చూపుతాడు. నన్ను ఆమెదిస్తాడు, ప్రేమిస్తాడు, మరణానంతరం నాకు పారితోషికం అందిస్తాడు. పవిత్ర గ్రంథాల ఆధారంగా నవ్వుతున్న న్ను స్వీకరించి ఆ నమ్మనివారిని నరకంలోకి నెట్టేస్తాడు.”
సాధారణ క్రైస్తవులు చర్చిలో ఆదివారాలు బోధలు విని తలబిరుసుతనం పెంపొందించుకుని ప్రవర్తిస్తారు. వైజ్ఞానిక విషయాలలో అలాంటి ధోరణి అనూహ్యం. తలబిరుసుతనంగల సైంటిస్టులలో సైతం ఆ ధోరణి ఉండదు.
భూమిపై పుట్టిన జీవులలో 99 శాతం నశించాయి కూడా తెలివిగల పథకం ప్రకారం సృష్టి జరగలేదనడానికి ఇదొక నిదర్శనం. ప్రకృతిని గమనిస్తే ఎంతో సంక్లిష్ట రీతులు చూడవచ్చు. ఇందులో పథకం ఏదీ లేదు. వచ్చిందే రావడం, వెనుకంజ వేయండ. అనవసర సంక్లిష్ట విషయాలు బాధలు, చాలా కనిపించాయి. ఎగరలేని పక్షులు ఉన్నాయి. కొన్ని రకాల చేపలకు కళ్ళు పనిచేయవు. లక్షలాది సంవత్సరాలుగా అవి చీకటిలో పరిణమించాయి. కొన్ని రకాల తిమింగలాలు పుట్టినప్పుడు పళ్ళను రూపొందించుకున్నాయి. అవి పెరిగి తరవాతనే తిరిగి వియోగంలోకి వస్తున్నాయి. తెలివిగా దేవుడు జీవులను భూమిపైన సృష్టిస్తే ఈ మార్మిక విషయాలకు అర్థం లేదు. పరిణామం దృష్ట్యా ఇందులో గందరగోళం పడాల్సింది ఏమీలేదు.
జీవశాస్త్రజ్ఞుడు జె.బి.ఎస్. హాల్దే చెబుతూ దేవుడు ఉంటే అతనికి తొలిచే పురుగుల పట్ల అపారమైన ప్రేమ ఉండి ఉండాలి అన్నాడు. అలాంటి మాటలు సృష్టివాదాన్ని చావు దెబ్బ తీశాయి. మూడు లక్షల ఏభయివేల తొలిచే పురుగుల రకాలు ఉన్నట్లు తేలింది. అయితే దేవుడికి వైరస్ అన్నా కాడు విపరీతమైన ప్రేమ ఉన్నట్లుంది. భూమి మీద ఉన్న వివిధ రకాల జంతువులలో ఒక్కొక్క దానికి పది తీరుల వైరస్ ఉన్నట్లు జీవ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఇందులో కొన్ని హాని లేని వైరస్ లు. సంక్లిష్ట జీవులు ఆవిర్భవించడానికి కొన్ని వైరస్ లు తోడ్పడి ఉండవచ్చు. అయితే వైరస్ లు ఇతర జీవులను వినియోగించుకుంటాయి. మన కణాలను నాశనం చేస్తాయి. అదీ నిర్దయగా దారుణంగా నశింపచేస్తాయి. హెచ్.ఐ.వి. వైరస్ లు, హానికరమైన బాక్టీరియా పెంపొందుతున్నాయి. వీటికి విరుగుడుగా వస్తున్న మందులకు కట్టుబడకుండా వ్యాపిస్తున్నాయి. పరిణామ క్రమంలో వీటి గురించి ఊహించి వివరించారు. బైబిల్ లో అలాంటిది ఏమీ లేదు. మత విశ్వాసం  ఈ వాస్తవాలను ఎలా చెప్పగలుగుతుంది. వీటి వెనుక దయామయుడైన దేవుడున్నాడని అందులో ప్రయోజనం ఉన్నదని ఏవిధంగా చెబుతారు. దేవుడి అసమర్ధతకు మన శరీరాలే పెద్ద ఉదాహరణ. మన పిండాలలో తోకలు, సంచులు కోతికి ఉన్నట్లు జుట్టు ఉంటాయి. పుట్టుక ముందే అవి చనిపోతాయి కూడా. ఇందుకు పరిణామం జన్యు శాస్త్రం వివరణలు ఇచ్చింది. అదే తెలివిగల పథకం ప్రకారం సృష్టి జరిగి వుంటే మార్మికంగానే మిగిలిపోయి ఉండేవాళ్ళం. పురుషులకు మూత్రం ద్వారా ప్రోస్టేట్ గ్లాండ్ నుండి సూటిగా వెడుతుంది. ఇది జీవిత పర్యంతం ఉబ్బిపోతూనే ఉంటుంది. అరవై ఏళ్ళ తరవాత చాలామందికి  ఈ శారీరక పరిణామం కనిపిస్తుంది. ఇందులో దేవుడి తెలివిగల సృష్టే లేదు. స్త్రీల విషయంలో కూడా ప్రసవించడానికి తోడ్పడే రీతిలో అంగాలు లేవు. దీని ఫలితంగా చాలామంది స్త్రీలలో పిస్టులా పెంపొందుతున్నది. అలా ఉన్నప్పుడు వెనుకబడిన దేశాలలో భర్తలు ఆ స్త్రీలను వెలేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల వివరణబట్టి 20 లక్షల మంది స్త్రీలు ఇటువంటి పిస్టులా (భగంధరవ్యాధి)తో బాధపడుతున్నారు. ఇటువంటి వ్యాధికి శస్త్ర చికిత్స ఉండదు. ప్రార్థనలు చేస్తే అది పోదు. ప్రార్థనలతో చాలా వ్యాధులు పోతాయని విశ్వాసపాత్రులు నమ్ముతారు. ప్రార్థన పరిమిత వ్యాధులకు పనిచేస్తుందని అంటుంటారు. తెగిపడిన కాలు లేదా అంగం ప్రార్థనతో మళ్ళీరాదు. ఎందుకని... ప్రార్థనలకు దేవుడు స్పందిస్తే తెగిపడిన అంగాలను ఎందుకు తీసుకురాలేడు. ప్రార్థన వలన అలాంటివి సంభవమేనని నమ్మకస్తులు ఎందుకు అనుకోరు. దీనిని వివరించే వెబ్ సైట్ చూడండి. (www.whydoesgodhateamputees.com) దేవుడి తెలివిలేని పథకానికి ఉదారహరణ చెప్పాలంటే పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి ఈ అంశాన్ని ముగిస్తాను. ఊపిరి తిత్తులు శ్వాసకోశం రెండూ భాగం పంచుకునే వాహిక గొంతులో ఉన్నది. దీనివలన సృష్టి నమూనాలలో ఎంత జరుగుతున్నదో చెప్పాలంటే, అమెరికాలోనే వేలాది మంది పిల్లలు ఏటా అత్యవసర చికిత్సకు ఆస్పత్రిపాలవుతుంటారు. కొంతమంది ఊపిరాడక చనిపోతుంటారు. మరి కొందరు మెదడు జబ్బులకు గురవుతున్నారు. ఇందులో భగవంతుడి దయ ఏమిటి? బహుశ భగవంతుడు ఒక ఉద్దేశ్యంతో చేసినట్లు ఊహించవచ్చు. అటువంటి బాధలకు లోనయిన పిల్లల తల్లిదండ్రులకు దేవుడు గుణపాఠం చెప్పదలచుకున్నారు. గొంతులో ఊపిరాడక చనిపోయిన పిల్లలకు స్వర్గంలో ప్రత్యేక స్థానం ఏర్పరచాడేమో. అయితే ఇటువంటి దురుద్దేశాలు ఏవిధంగా హేతుబద్ధంగా వివరిస్తారు. అలాంటి వివరణలో నీతి ఏమిటి?

మూలం అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య


మతానికి విజ్ఞానానికి సంఘర్షణ--Sam Harris Letter to Christian nation


9వ భాగం

విజ్ఞానానికి మతానికి ఉన్న సంఘర్షణ పట్ల సైంటిస్టులు చిత్తశుద్ధితో మాట్లాడడం నైతిక ఆవశ్యకత. అయితే జాతీయ సైన్సు అకాడమి ఈ సంఘర్షణ భ్రమపూరితమైనదని పరిగణించింది :
“కొన్ని మతాలకు పరిణామానికి సంఘర్షణ ఉన్నదనే విషయంలో దురవగాహన ప్రబలింది.  మతానికి శాస్త్రీయ పద్ధతులకు మధ్య ఉన్న జ్ఞాన రీతులు నిశితమైన విబేధాలకు దారి చూపుతున్నదనే అభిప్రాయం ఉన్నది. మతాలు, విజ్ఞానం ప్రపంచాన్ని గురించిన భిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. ఇష్టానికి, మానవమనుగడకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా అనేది వైజ్ఞానిక సంబంధమైన ప్రశ్నలు కావు. మానవ జీవితంలో మత, వైజ్ఞానిక జ్ఞాన రీతులు చాలా ప్రధాన పాత్ర నిర్వహించాయి. ఇంకా నిర్వహిస్తాయి కూడా. ప్రకృతిని గురించి తెలుసుకోవడం సైన్సు వివరిస్తుంది. అలౌకిక విషయాలను గురించి సైన్సు ఏమీ చెప్పదు. దేవుడు ఉన్నాడా? లేడా? అనే విషయంలో సైన్సు తటస్థంగా ఉంటుంది.”
ఈ ప్రకటనలో స్వస్థత లేకపోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వధనం లభించదేమో అనే భయం సైంటిస్టులకు నిరంతరం ఉన్నది. కనుక జాతీయ సైన్సు అకాడమీ పన్ను చెల్లించేవారి దృష్టిని గమనించి ఇలాంటి భయాన్ని వ్యక్తం చేస్తుండవచ్చు. మతానికి సైన్సుకు సంఘర్షణ తప్పనిసరి విజ్ఞాన విజయాలు తరచు మత మూఢవాదాలను దెబ్బతీస్తూ ఉంటాయి. మతమౌఢ్యం సైన్సుకు చాలా ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. మానవ మనుగడలో కేవలం ప్రయోజనం గురించే మతాలు ప్రస్తావించి ఊరుకోవు. సైన్సువలె ప్రతి మతం కూడా ప్రపంచాన్ని గురించి ప్రత్యేకమైన అంశాలను ప్రస్తావిస్తాయి. వాస్తవాలను గురించి ఇలాంటి ప్రకటనలు మతాలు చేస్తుంటాయి. సృష్టికర్త నీవు చేసే ప్రార్థనలు వింటాడని, వాటి ప్రకారం కోరికలు తీరుస్తాడని అంటారు. పుట్టినప్పుడు శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందంటారు. దేవుడి గురించి సరిగా నమ్మకపోతే మరణానంతరం చాలా బాధలకు గురవుతాడంటారు. ఇలా చెప్పేవన్నీ విజ్ఞానానికి భిన్నంగా ఉన్న అంశాలే. పైగా మతాలు చెప్పేవాటికి ఘోరమైన సాక్ష్యాలున్నట్లు గొప్పలు చెప్పుకుంటారు.
సైన్సు అంటే తెలుసుకోవడం అని స్థూలంగా చెప్పవచ్చు. ప్రపంచాన్ని గురించి ఏది వాస్తవమో మనం చేస్తున్న ఉత్తమ ప్రయత్నాల ద్వారా కనుగొంటున్నాం. ఇందులో సైన్సులోని తరతమ స్థాయిలు, చరిత్రవంటి మానవ శాస్త్రాలకు సైన్సుకు ఉన్న తేడాలు గమనించనక్కరలేదు. 1941 డిసెంబరు 7న పెరల్ హార్బర్ పై జపానువారు బాంబు వేశారనేది చారిత్రక సత్యం. ప్రపంచ దృష్టిని గమనిస్తున్నప్పుడు వైజ్ఞానిక వివేచనలో ఇది ఒక సత్యంగా నమోదు అవుతుంది. ఆ తేదీన కాక మరొక తేదీన బాంబు వేశారని ఎవరయినా అంటే, లేక బాంబు వేసింది ఈజిప్టువారని ప్రకటిస్తే ఆ విషయాలను సమర్థించుకోవడానికి చాలా వివరణ కావాలి. సైన్సులో మేథస్సుపరంగా చిత్తశుద్ధి ఉంటుంది. కేవలం మన అదుపులో ఉన్న పరిశోధనలు, గణిత నమూనాలే సైన్సు కాదు. ఒక ప్రతిపాదనలో సత్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాన్ని, తార్కిక వాదనలను పరిగణనలోకి తీసుకోవాలి. మతంలో ఇందుకు భిన్నంగా వేరే ప్రమాణాలు ఉన్నాయని ప్రజలు ఊహిస్తారు.
రోమన్ కాథలిక్ మతం ఇటీవల వేటికన్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 30 మంది మత విజ్ఞానులు సమావేశమయ్యారు. క్రైస్తవమతం పుచ్చుకునే బాప్టిజం అనే క్రతువు లేకుండా చనిపోయిన శిశువుల పరిస్థితి ఏమిటని చర్చించారు. మధ్య యుగాలలో కాథలిక్కులు నమ్మినదానిని బట్టి అటువంటి పిల్లలు సహజమైన సంతోషాన్ని అనుభవించే లింబో స్థితికి వెడతారని నమ్మారు. సెయింట్ థామస్ అక్వినాస్ అలాంటి అభిప్రాయాలు చెప్పగా అందుకు విరుద్ధంగా సెయింట్ అగస్టిన్ ఆ పిల్లలంతా నరకంలో శాశ్వతంగా ఉంటారని నమ్మారు. బైబిల్ లో ఈ లింబో అనే స్థితికి ఆధారం లేదు. క్రైస్తవమతం అధికారికంగా దీనిని సిద్ధాంతీకరించలేదు. అయినా శతాబ్దాలుగా ఇదొక ప్రధానాంశంగా కాథలిక్ సంప్రదాయం కొనసాగిస్తున్నది. 1905లో పదవ పోప్ పయస్ ఇలా అన్నారు. “జ్ఞాన స్నానం (బాప్టిజం) లేకుండా చనిపోయిన పిల్లలు లింబో స్థితిలోకి పోయి దేవుని సన్నిధి లేకుండా, బాధలు పడకుండా ఉంటారు.” ఈ విషయాన్ని చర్చించడానికి క్రైస్తవమతం వారిలోని మేధావులను సమావేశపరచింది.
అలాంటి చర్చాపథకాన్ని మనం ఊహించగలమా? ఆ చర్చలు ఎలా ఉంటాయో గమనించండి. ఎవరైనా సరే బాప్టిజం పుచ్చుకొని పిల్లల స్థితి మరణానంతరం ఎలా ఉంటుందో చెప్పగల సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగలరా? చదువుకున్నవారెవరైనా ఈ విషయాన్ని దారుణమైనదిగా, కాలాన్ని వృధాపుచ్చేదిగా, హాస్యాస్పదమైనదిగా భావించరా? చిన్న పిల్లల్ని ఆచారాలకు గురి చేసిన వారిని కాపాడని సంస్థ కూడా  ఆ కాథలిక్ మతమే. మానవ శక్తియుక్తులను ఇంతగా వృధా చేయడం కాథలిక్ మతానికే చెందింది.
సైన్సుకు మతానికి ఉన్న సంఘర్షణ కనీస స్థాయికి తగ్గించవచ్చు. నమ్మేవారికి తగిన కారణాలు ఉండి ఉండాలి. లేదా కారణాలు లేకుండా ఉండాలి. జీసస్ కన్యకు పుట్టాడని, మహ్మద్ రెక్కలున్న గుర్రంపై స్వర్గానికి పోయాడని నమ్మడానికి తగిన ఆధారాలుంటే మనం విశ్వాన్ని వివరించడంలో వాటిని కూడా స్వీకరించవచ్చు. విశ్వాన్ని ఆధారంగా చారిత్రక సత్యాలు వివరించాలంటే అర్థం లేని విషయంగా భావిస్తాము. బైబిల్ కు ఖురాన్ కు మూలం ఏమిటని, జీసస్ తిరిగి లేచి వచ్చాడనడానికి, మహ్మద్ దేవదూత గాబ్రియేల్ తో సంభాషించాడనడానికి, తదితర మత మూర్ఖవాదనలకు ఎక్కడా సాక్ష్యాధారాలు లభించవు. కనుక వివేచన విఫలమయినచోట ప్రజలు నమ్మకంపై ఆధారపడుతున్నారని ఒప్పుకోవాలి.
సాక్ష్యాధారాలు లేకుండా నమ్మితే అదొక ఉన్మత్త స్థితి లేదా మూర్ఖత్వం అనుకోవాలి. కాని దేవునిపై విశ్వాసం ఇప్పటికీ మన సమాజంలో ప్రతిష్ఠాకరమైన నమ్మకంగానే చలామణి అవుతోంది. మనలో మతం అనేది ఒక ఉన్నతమైన అంశం అని మానవుడు యదార్థంగా చెప్పుకునే విషయం అని భావిస్తున్నారు. అలాంటి నమ్మకాన్ని ఉన్నతమైనదిగా చాలామంది పాటించడం ఒక ఆధారంగా చూపుతున్నారు. గ్రీకు దేవుడు వాసిడాన్ ను ఎవరైనా నేడు ఆరాధిస్తుంటే వారిని పిచ్చివాళ్ళుగా చూస్తారు.  

మూలం అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య