రాచకొండ విశ్వనాథశాస్త్రి-

సాహితీపరులతో -

రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనలంటే ఎంతో మందికి యిష్టం లేదు. రావిశాస్త్రి ఏది రాసినా పడీ పడీ చదివి, అభినందించేవారెందరో! ఈ వైవిధ్యానికి కారణాలు లేకపోలేదు. విశాఖపట్నం ప్రాంతంలో భాష, యాస వంటబడితే నచ్చితే, రాచకొండకు తిరుగులేని అభిమానులౌతారు. లేకుంటే దూరంగా పెట్టేస్తారు.
సంస్కృతంలో కాళిదాసు రచనలకు ఉపమానాలు బాగా వన్నెతెచ్చాయంటారు. అదేమో గాని తెలుగులో ప్రజల భాషతో రాచకొండ ఉపమానాలు చాలా గొప్పగా వుంటాయి. బీనాదేవి తప్ప మరెవరూ ఆ దరిదాపులకు రాలేకపోయారు. రచనలతో బాటు కోర్టులను, ప్లీడర్లను, డాక్టర్లను, గుడిసెల జనాన్ని ఎంత పరిశీలించాడో రావి శాస్త్రి. అది ఆయన జీవితమంతా కనిపిస్తుంది. సామాన్యుల జీవితాల్ని కథల్లో, నాటకాల్లో, నవలల్లో రాచకొండ రాసిన తీరు ఒక పట్టాన పట్టు బడేది కాదు.
1995 ప్రాంతంలో అమెరికాలోని ఫిలడల్ఫియాలో రాచకొండ నరసింహశాస్త్రిని కలిశాను. ఆయన రావి శాస్ర్తి సోదరుడుని తెలిసి, కాస్త ఇంటర్వ్యు చేశాను. తన సోదరుడి రచనలు కొన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయదలచినట్లు చెప్పారు. సంతోషించాను. కాని చాలా జటిలమైన ప్రయత్నం అన్నాను. రాచకొండ నుడికారంలోనే ఆ కష్టం వుంది. నరసింహశాస్త్రి డాక్టర్ గా రిటైర్ అయి, విశాఖకు వెళ్ళిపోయారు తరువాత.
గోరాశాస్త్రి నన్ను రాచకొండకు పరిచయం చేశారు. 1970 ప్రాంతాల్లో ఆరంభమైన ఆ పరిచయం చివరి దాకా సాగింది. మేము హైదరాబాద్ నియోమైసూరు కేఫ్ (అబిడ్స్ సెంటర్) లో కలసినప్పుడు, సి. ధర్మారావు వచ్చి చేరేవారు.
రాచకొండ శిష్యుడు, మిత్రుడు, అనుచరుడు సంకు పాపారావును మిత్రుడు తుమ్మల గోపాలరావు పరిచయం చేశారు. పాపారావు అనేక విషయాలు చెప్పారు రాచకొండ గురించి, వారిద్దరికీ చివర్లో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, రాముడికి దేవాలయాలుంటే, హనుమంతుడికీ గుడులుంటాయని సంకు పాపారావు అనేవారు.
కన్యాశుల్కంలో, నిజం నాటకంలో రాచకొండ పాత్రధారి అయినప్పుడు చూచి సంతోషించాను. రాచకొండతో పరిచయమయ్యేనాటికే ఆయన రచనలు కొన్ని చదివాను. ఆ తరువాత చాలా చదివాను. నాకు బాగా నచ్చిన రచనలవి.
కనక మహాలక్ష్మికి మొక్కడం మొదలు విరసం (విప్లవ రచయితల సంఘం) వరకూ పయనించిన రావిశాస్త్రి చివరి దశలో అజ్ఞేయవాది (Agnostic) గా మిగిలానన్నాడు. రచనలకు పరిమితంగాని ఆచరణ వాదిగావడంతో 1975లో ఇందిరాగాంధి విధించిన ఎమర్జన్సీలో జైలు పాలయ్యాడు.
హాస్య ప్రియుడు రావిశాస్త్రి, చతుర సంభాషణకారుడు. బాగా ఔపోసనం నాలుగు పెగ్గులు పట్టించినప్పుడు సమయస్ఫూర్తి జోక్స్ చెప్పి, నవ్వించేవాడు. అందులో పచ్చివీ, ఎండువీ మిళితమై వుండేవి. ఒకసారి మాటల్లో ఒకాయన చెబుతూ రావిశాస్త్రి స్నేహితుని భార్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు. అయితే భోజనం ఎలా మరి అని రావిశాస్త్రి పరామర్శించాడు. వంటావిడ వుందని చెప్పగా మంచిదే... తింటాడన్నమాట అన్న రావిశాస్త్రి సమయోచిత శృంగార పలుకులు, విస్కీమత్తులో నవ్వులు పుట్టించాయి. కోర్టులో మాజిస్త్రేట్ బోనులోని ముద్దాయిని చూస్తూ అనుకున్నాడట. ఇంత చదువుకున్న నేనే దొంగలంజ కొడుకునైతే, వాడెలాంటి వాడు కావాలి అని, పూర్తి శిక్ష కుమ్మేశాడట.
రాచకొండకు ఇరువురు భార్యలు, విశాఖపట్నంలో రిక్షా వాళ్ళందరికీ ఆపద్భాంధవుడైన రాచకొండ తాగినప్పుడు ఎక్కడకు తీసుకెళ్ళాలో వారందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన ఒక రిక్షావాడు ఒకనాడు రాచకొండను అలాంటి దశలో పెద్ద భార్య దగ్గరకు తీసుకెళ్ళి తలుపు తడితే. ఏరా, ఆసికాలా, ఏసికాలా అంటూ తలుపేసుకున్నదట. అప్పుడు రెండో భార్య దగ్గరకు చేరేశాడట. స్వవిషయం చెప్పికూడా రాచకొండ నవ్వించాడు.
రాచకొండ సీరియల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడలేదు గాని, అచ్చయిన తరువాత చదివి ఆనందించిన పాఠకులలో నేనూ వున్నాను. ఆరు సారాకథలు, ఆరు సారోకథలు, నిజం నాటకం, రాజు మహిషి, సొమ్ములు పోనాయండి, అల్పజీవి అభిమాన రచనలు.
పేదల్ని ఆదుకునే ప్లీడర్ గా రావిశాస్త్రి ఒకసారి ఆసక్తికరమైన కేసును ఎదుర్కోవలసి వచ్చింది. రాజమండ్రిలో బోగం యువతికి అండగా నిలచినందుకు, నిరసనగా వినుకొండ నాగరాజు (కమెండో పత్రిక ఎడిటర్ ఉత్తరోత్తరా) కేసు పెట్టాడు. అది చాలా ఏళ్ళు సాగింది. చివరలో రావిశాస్త్రి స్వయంగా కోర్టులో నాగరాజును కలసి పరిచయం చేసుకున్నాడు. అలా ప్రత్యర్థి వచ్చి పరిచయం చేసుకోవడం నాగరాజును ఆశ్చర్యపరచింది. ఇద్దరూ హైదరాబాద్ లో మందు పార్టీ చేసుకుందామనుకున్నారు.
విరసం వారు రాచకొండను తమవాడిగా ముద్రవేసినా, కమ్యూనిస్టేతర వ్యక్తులతో రావిశాస్త్రి సన్నిహితంగానే మెలగాడు. గోరాశాస్త్రితో స్నేహమే అందుకు తార్కాణం. కథ చెప్పడమే కాదు వినడం కూడా తెలియాలంటాడు రావిశాస్త్రి.
విజయవాడలో ఒక సారి రావిశాస్త్రి రెస్క్యూ హోంకు వెళ్ళారు. వ్యభిచార వృత్తిలో వున్నవారిని తప్పించి, సాధారణ జీవితం గడపడానికి ఉద్దేశించిన ఆ Rescue Homeలో రావిశాస్త్రికి లోగడ తెలిసిన వారెందరో వున్నారు. వారిని పేరు పేరునా పిలిచి పరామర్శించి, కష్టసుఖాలు తెలుసుకున్నారు. పక్కనే వున్న తుమ్మల గోపాలరావు యిదంతా చూచి, ఆశ్చర్యపోయారు. రావిశాస్త్రి వారి పట్ల కనబరచిన మానవ సంక్షేమ దృష్టి గమనార్హం.
సుంకు పాపారావు ఎన్నో అంశాలు ఆసువుగా రావిశాస్త్రికి చెబుతుండేవారు. పోలీస్ ఉద్యోగం చేసిన పాపారావు తన అనుభవాలను, పోలీస్ ధోరణిలో చెబితే, తన యితివృత్తాలుగా రావిశాస్త్రి వాడారు. అలాంటివి గుర్తించి పాపారావుకు ధన్యవాదాలు చెప్పారుకూడా. హనుమంతుడి తోక ఎంతుందో R & B (రోడ్డు భవనాల శాఖ) కొలిచిందా ఏమిటి అంటూ సుంకు పాపారావు యధాలాఫంగా హాస్యంగా వాడే విషయాలు రావి శాస్త్రి కలంలో నిలిచాయి.
రచనలు : దేముడే చేశాడు (కథ), అల్పజీవి (నవల), కధాసాగరం (నాటిక), వచ్చేకాలం (నాటిక), ఆరు సారాకథలు, నిజం (నాటకం), ఆరు చిత్రాలు (కథలు), ఆరు సారో కథలు, మరో ఆరు చిత్రాలు, రాజు మహిషి (నవల), విషాదం, కలకంఠి, బాకీ కథలు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, ఋక్కులు, రత్తాలు-రాంబాబు, సొమ్ములు పోనాయండి, మూడు కధల బంగారం నవల, ఇల్లు-నవల.
- నరిసెట్టి ఇన్నయ్య

కళాపూర్ణోదయం-పిహెచ్.డి. సిద్ధాంత వ్యాసం-డాక్టర్ జి.వి. కృష్ణారావు-

(బి.ఎ. డిగ్రీతో తెలుగు వారిలో పిహెచ్.డి స్వీకరించిన వ్యక్తిగా గవిని వెంకట కృష్ణారావును పేర్కొనవచ్చు. పింగళి సూరన రాసిన ‘కళాపూర్ణోదయం’ ప్రబంధానికి భాష్యం చెప్పి, మదరాసు విశ్వవిద్యాలయానికి సిద్ధాంత వ్యాసం సమర్పించి డిగ్రీకోసం చాలా కాలం ఎదురు చూడవలసి వచ్చింది. అదొక వినూత్న వివాదాస్పద ఘట్టం. 1950లో ఆంధ్ర ప్రాంతంలో పిహెచ్.డి. చేయడానికి బి.ఎ. డిగ్రీ అర్హత చాలదు. మదరాసు యూనివర్సిటీలో అలాంటి అవకాశం ఉన్నది గనుక ఆయన దానిని సద్వినియోగం చేసుకున్నారు. ఆయన గైడు నిడదవోలు వెంకటరావు. సిద్ధాంతం పూర్తయి సమర్పించిన తరువాత ముగ్గురు పండితుల నిర్ణయానికి పంపించారు. వారు : పింగళి లక్ష్మీకాంతం, ఖండవల్లి లక్ష్మీరంజనం, గంటి జోగిసోమయాజులు. ఎన్నాళ్ళున్నానిర్ణయం బయటికి రాలేదు. అయితే ‘ఆంధ్రప్రభ’ ఎడిటర్ గా వున్న నార్ల వెంకటేశ్వరరావు దృష్టికి ఆ విషయం వచ్చింది. ఆయన ఆరాతీసి ముగ్గురు పండితుల అభిప్రాయాలు తెప్పించి చూశారు. వారి రిమార్కులలో ఇంగ్లీషు తప్పులు బాగా దొర్లాయి. వారు వెల్లడించిన అభిప్రాయాన్ని బట్టి జి.వి. కృష్ణారావు ఇంగ్లీషు బాగాలేదని కనుక సిద్ధాంత డిగ్రీకి అర్హత లేదని అన్నారు. దానిపై నార్ల రియాక్ట్ అయి, వారు ఇంగ్లీషులో తప్పులు చూపి అలాంటి వారికి కృష్ణారావు ఇంగ్లీషు భాషను వేలు పెట్టి చూపే అర్హత లేదన్నారు. ఆనాడు వెంకటేశ్వర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా వున్న గోవిందరాజుల నాయుడుకి ఈ విషయం చెప్పి ఆ పండితుల గుట్టు రట్టు చేస్తానని, కుల పక్షపాతంతో నిర్ణయం ఆపారని హెచ్చరించారు. అంతటితో కృష్ణారావుకు డిగ్రీ ఇవ్వక తప్పలేదు. ఆ తరువాత ఆయన సిద్ధాంత వ్యాసం చూస్తే పండితులు ఆశ్చర్యపోయారు. కొత్త ఫక్కీలో ప్రబంధాలలో విశిష్టమైన కళాపూర్ణోదయాన్ని స్వీకరించి అందులోని రామణీయకతలను విశిష్టంగా చర్చించి చూపిన సిద్ధాంతం. కృష్ణారావు సిద్ధాంతంలో రమ్యతను చదివినవారు బాగా ఆస్వాదించారు. అప్పుడు కృష్ణారావుగారి అనుమతితో నేను ఆ సిద్ధాంత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాను. 1961-62లో అది ప్రతి ఆదివారం సీరియల్ గా ‘గోలకొండ పత్రిక’ (హైదరాబాదు) లో ప్రచురించారు. నూకల నరోత్తమ రెడ్డి ఎడిటర్ గా ఉన్న పత్రికను, దైనందికంగా దేవులపల్లి రామానుజరావు ఎడిట్ చేస్తుండేవాడు. నా అనువాదాన్ని సీరియల్ గా ఆదివారాలు ప్రచురించారు. అందులో సాంకేతికపరమైన అధ్యాయాన్ని ఇక్కడ ప్రచురించడం లేదు.
నరిసెట్టి ఇన్నయ్య)

1వ అధ్యాయం
కళాపూర్ణోదయం - కథా సంగ్రహం

కృష్ణుడు ద్వారక రాజథానిగా రాజ్యం ఏలినప్పుడు కలభాషిణి అనే కన్య వుండేది. ఆమె వేశ్యాకులంలో పుట్టింది. కులానికి అర్హమైనటువంటి అన్ని లలిత కళలని అభ్యసించింది. ఆమె అతిలోక సౌందర్యవతి. ఒకరోజు చెలికత్తెలతో కలిసి ‘తమిబూదీ గెల దూగుటుయ్యెల లూగుచుండ’ ఆకాశమార్గంలో గురువుగారైన నారదుడితో కలిసి పోతున్న మణికంధరుడు చూశాడు. కలభాషిణి సౌందర్యానికి ఆకర్షితుడై ఉద్రేకాన్ని అణచుకోలేక ముగీనేత్రం కన్న మించిన అందగత్తె అని తన అభిప్రాయాన్ని నారదుడికి తెలియచేశాడు. ఆ మహర్షి ఎటువంటి అభ్యంతరాన్ని పెట్టకుండా అంగీకరించాడు.
ఆ సమయంలోనే నలకూబరుడితో కలసి వాళ్ళకి కొంచెం పైన పోతున్న రంభ ఈ సంభాషణ వింది. శిష్యుడి మాటలకి నారదుడు అంగీకారం తెలియచేయడం ఆమె సౌందర్య గర్వాన్ని గాయపరిచింది. మహర్షే అలా అంటే ఆమె ఏంచేయగలదు ?
తను సౌందర్యంలో ఉన్నతురాలని నారదుడు  అంగీకరించాలని రంభ అనుకుంది. ఈ లక్ష్యంతోటే ఆ రుషికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి, శిష్యుడితోపాటు తన విమానంలోకి ఆహ్వానించింది. మీ మధ్య అనురాగం ఎప్పటికీ ఇలాగే వర్ధిల్లుతూ వుండాలని నారదుడు ఆశీర్వదించాడు. ఇదే సమయం అని అతని ఉద్దేశం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంది రంభ. వ్యంగ్యంగా తనకన్న సౌందర్యవంతులు ప్రపంచంలో ఉండకూడదనే ఆశీర్వాదం ఎలా ఫలిస్తుందని అడిగింది మహర్షిని. అది అలా ఎందుకు అడిగిందో గ్రహించుకోలేనంత మూర్ఖుడు కానీ, సహించేటటువంటి ఓర్పుకల వాడు కానీ కాదు కదా. వెంటనే నారద మహర్షి వ్యంగ్యంగా నవ్వాడు - అందులో ఉన్న శాపాన్ని గ్రహించుకుని ఆయనకి సాష్టాంగపడి నమస్కరించి సాగనంపింది.
ఈ సంభాషణ విన్న కలభాషిణి కిందగా పోతున్నరంభా నలకూబరుల విమానాన్ని అనుసరించింది. అనుసరించలేనంతవరకు వెళ్ళి, అప్పటికే భూమిపై దిగిన నారద మహర్షి దగ్గరకు వచ్చింది. నలకూబరుని అందానికి ముగ్ధురాలై, అతనిని ప్రేమించానని అనుకుంది. మహర్షి సాయంతో అతన్ని పొందాలని అనుకుంది. ఇటువంటి రహస్య ఉద్దేశంతో నారదుని దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసింది. వారిమధ్య జరిగిన మాటల మధ్య దైవం అనుకూలిస్తే ఆమే రంభకి సవతి కావచ్చని సూచించాడు. తరవాత ఆమె పుంజరీకాక్షుడి కొలువుకి రోజూ వస్తుండేదని, మణికంధరుడిచేత కూర్పుచేయబడిన కృష్ణుడి దండకము ఏక సంధాగ్రాహిగా చెప్పగలిగినది ఆమే అని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ దండకంలో ఉన్న లోతుపాతులకోసం ఆమె చేత దండకాన్ని చదివించాడు. తనని శిష్యురాలిగా అంగీకరించి, మీరాని కృష్ణుని అంతఃపురంలోకిగాని రావడానికి అనుమతింపవలసిందిగా వేడుకుంది. అందుకు అతడు అంగీకరించాడు. మహర్షితో రహస్య మంతనాలు జరుపుతోందని గ్రహించుకున్న మణికంధరుడు చాటుగా వెళ్ళాడు. నారదుని దగ్గిరకి వెళ్ళి రంభానలకూబరుల మధ్య వినబడిన కళాపూర్ణోదయ కథను చెప్పమని నారదుని అడుగుతుంది. ఇది చెప్పిన వారికి ఇహలోక సౌఖ్యం వస్తుంది కాబట్టి నేను చెప్పనంటాడు. ఇది చెప్పిన తరవాత కృష్ణుడిని కొలువులో కలుసుకోవడానికి ఇద్దరూ విడిపోతారు.

ద్వితీయాశ్వాసము

సంగీత కళలో లోతు తెలుసుకుని, ప్రావీణ్యం సంపాదించడానికి నారదుడు రోజూ కృష్ణుడి సతుల దగ్గర, తరవాత ఆదేవుడి దగ్గర విద్యను అభ్యసించాడు. ఆ సమయంలో, మణికంధరుడు, అంతఃపురంలో ప్రవేశించడానికి అర్హత లేకపోవడం చేత, గురువుగారికోసం బయట వేచివుండేవాడు. కొంతకాలానికి నారదుడు సంగీతంలో ప్రావీణ్యత సంపాదించగా, కృష్ణుడి భార్యలు నారదుడికి అత్యున్నతమైన యోగ్యతా పత్రాన్ని ఇచ్చారు. కృష్ణుడి అనుగ్రహంతో మణికంధరుడు కూడా నారదుడు, కలభాషిణిలంత ప్రావీణ్యం సంపాదించాడు. కృష్ణుడి దగ్గర సెలవు తీసుకుని, ఇద్దరు శిష్యులతో నారదుడు వెళ్ళిపోయే సమయంలో కృష్ణుడి భార్యల అభినందన పట్ల సందేహాన్ని కనబరిచాడు. అప్పుడు తను కోరిన స్త్రీ రూపం పొందగలిగిన కలభాషిణి వారి అసలు అభిప్రాయాన్ని తెలుసుకుని వస్తానని అంది. నలకూబరుని కలవడానికి కోరుకున్న ఈ వరాన్ని నారదుడు ప్రసాదించాడు. వెంటనే కలభాషిణి అంతఃపురానికి వెళ్ళి వచ్చి వారన్న మాటలన్ని యదార్ధాలని చెప్పింది. ఇందుకు నారదుడు సంతోషించి, ఆమె మొదటి నుండి మనసులో కోరుకున్న ప్రియుణ్ణి కలుసుకుంటుందని చెప్పి, రెండో శిష్యుడితో వెళ్ళిపోతాడు.
ఆరకంగా కొలువుకి పోయే అవసరం తీరిపోగా, కలభాషిణి విచారగ్రస్తురాలయింది. ఆమె ఆలోచనలన్నీ నలకూబరుడి వైపు పరుగులు పెడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా మనస్సు మళ్ళించలేకపోయింది. ప్రియుడి మార్గం గోచరించలేదు. కాలం కష్టంగా గడుస్తోంది. ఒకరోజు ప్రియుడి గురించి ఆలోచిస్తుండగా, ఆకాశమార్గంలో మణిస్తంబుడు అనే సిద్ధుడు మృగేంద్ర వాహనం మీద అక్కడికి వచ్చాడు. ఆమె ఆశ్చర్యపోయేటట్లుగా పేరు పెట్టి పిలిచి, క్షేమసమాచారాలడిగి, ప్రియుడైన నలకూబరుడి గురించి అడిగాడు. తను రావడంలో ఉన్న ఉద్దేశాన్ని తెలియపరిచాడు. ఉత్తమ సంగీతం అతడికి అన్నపానాలతో సమానం. కలభాషిణిని కలుసుకోవడానికి పూర్వం, తన దూరశ్రవణ శక్తి చేత మణికంధరుడి సంగీతాన్ని విన్నాడు. మణికంధరుడు తపస్సు చేయాలని అనుకోవడంతో హృదయాన్ని రంజింపచేసేటటువంటి అతడి సంగీతాన్ని వినే అవకాశాన్ని కోల్పోయాడు. కాబట్టి తన సంగీతంతో చెవులకింపుగా పాడి ఆనందింపచేయమని కలభాషిణిని కోరాడు. మణికంధరుడి తరవాత చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలంచేత, అతనికున్న అలౌకిక శక్తులపట్ల నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి, మణికంధరుడు తపస్సుకు వెళ్ళవలసిన కారణం తెలుసుకున్నాడు.
నారదుడు విడిపోయేముందు మణికంధరుడికి చెప్పిన విషయం సిద్ధుడు వెల్లడించాడు. నారదుడు తుంబురుడి మీద అసూయపడ్డాడు. తన ఘోరమైన తపస్సు చేత విష్ణువు నుంచి వరాన్ని పొందాడు. ఆ కళలో కృష్ణుడిచేత శిక్షణ పొందవలసి వున్న కారణంగా సంవత్సరాల తరబడి నారదుడు అతన్ని దర్శించాడు. తన సందర్శనలో ఉన్న అంతరార్ధం చెప్పిన నారదుడు శిష్యుడితో తీర్ధయాత్రలు చెయ్యమని, తపస్సు చేసి, సంగీతకళతో విష్ణుమూర్తిని సేవించమని చెప్పాడు. ఈ సలహాని అనుసరించి మణికంధరుడు అనే తీర్ధయాత్రాస్థలాలను దర్శించి, తపస్సు చేసుకున్నాడు. మణిస్తంభుడు చెప్పినటువంటి ఈ విషయం చెట్టుకొమ్మకు వేలాడే గబ్బిలం తను స్వర్గం నుంచి వచ్చానని, తపో భంగానికి ఇంద్రుడు రంభని పంపించాడని చెప్పింది. ఈ విషయం చెప్పి సెలవు తీసుకుని పక్షి యధేచ్చగా వెళ్ళిపోయింది.

తృతీయాశ్వాసము

ఇంద్రుడి ఆజ్ఞానుసారంగా రంభ, మణికంధరుడి ఆశ్రమానికి వెళ్ళి, తన సౌందర్య మహిమ వలన అతనికి తపోభంగం చేసింది. కలభాషిణి వలన సంతోషపడిన మణిస్తంభుడు ఈలోపున మణికంధరుడు రంభచేత ఏరకంగా వశపరచుకోబడిందీ, మోహపరవశంలో నలకూబరుడిని ఏరకంగా తలచుకున్నాడో తెలియచేశాడు. ఇంకా అడగ్గా, మణికంధరుడి ఆశ్రమం బయట కూబభుడు రంభకోసం వేచి వున్నాడని చెప్పి, ఆమె నలకూబరుడి వివరాలనే ఆత్రంగా తెలుసుకోవడం  చూసి నవ్వాడు. సిద్ధుడిని కలభాషిణి వేడుకుంది.
కొంచెం సేపు తటపటాయించినట్లుగా నటించి ఆమెతో సింహంపై కూచుని ఆకాశమార్గంలో వెళ్ళసాగాడు. మృగేంద్ర వాహనాలయం సమీపించగానే, వారు ఎక్కిన వాహనం ముందుకు వెళ్ళడానికి నిరాకరించింది. సిద్ధుడు దానిమీద ఎంత కొట్టినప్పటికీ అక్కడ నుంచి అంగుళమైనా కదలలేదు. అప్పుడు సిద్ధుడు కలభాషిణితో ఈ సమీపంలో మృగేంద్రాలయం వుంది. ఆ దేవి జుట్టుపట్టుతో ముందుకు పోవుటకు సింహాలు సాహసించవని చెప్పాడు. కాబట్టి దేవిని పూజించుకుని ముందుకు సాగడం మంచిదని చెప్పాడు. ఆకారణంగా కిందకు దిగి, సింహాన్ని ఆహారానికి విడిచిపెట్టి, పూజకు పువ్వులు తెస్తానని మణిస్తంభుడు వెళ్ళాడు. కలభాషిణి ఆ ఆలయం దగ్గర ఉన్న ఒక ముసలి అవ్వ ద్వారా దేవికి బలి ఇవ్వడానికి సిద్ధుడు తనను అక్కడకు తీసుకు వచ్చిన విషయము తెలుసుకొని భయంతో కంపించిపోయింది. దీంతో ఆమెకి పిడుగు పడినట్లయ్యింది. తను అనుకున్నదేమిటి? ఇక్కడ జరగబోయేదేమిటి? దూరశ్రవణం, దూరదృష్టి శక్తులున్న ఈ సిద్ధుడి నుంచి ఎలా తప్పించుకోగలను? అనుకుని తన బతుకు విధికి వదిలి, అక్కడున్న శిలాశాసనం మీదున్న అక్షరాలని చదివింది. తను బలి కావలసిన విషయం ఆమెకు అర్థమయింది. మహా సామ్రాజ్య నిమిత్తం తనను అతడు బలియ్యబోతున్నాడు.
పువ్వులతో తిరిగి వచ్చిన మణిస్తంభుడు కలభాషిణిని గర్భాలయంలోకి రమ్మన్నాడు. తన చావును తెలుసుకుని ముసలి అవ్వ (సముఖాసత్తి)ని కూడా తనతో రమ్మని కలభాషిణి అడిగింది. వెంటనే ఆ ముసలిది అంతా చెప్పినట్లు సిద్ధుడు గ్రహించాడు. వెంటనే అతడు కలభాషిణిని కొప్పుపట్టి దేవి దగ్గరకి లాగసాగాడు. కలభాషిణి దీనాలాపాలకు సుముఖాసత్తి హృదయం ద్రవించగా, దేవిమీద ఆనతో ఆమెను చంపుటకు అడ్డుపడెను. దీనిని మణిస్తంభుడు ఏమాత్రం లెక్కచేయకుండా నరక బోవుచుండగా సుముఖాసత్తి తన తలని అడ్డుపెట్టింది. దానిని నరికి, మర కత్తిని ఎత్తాడు. కత్తి వేటు పడకముందే కలభాషిణితోపాటు సిద్దుడు, అతిదూరంగా విసిరెయ్యబడ్డాడు.
సుముఖాసత్తి పునర్జన్మ పొంది, యౌవ్వనంతో సౌందర్యవతిగా కనిపించింది. మళ్ళా తన యోగాభ్యాసం మొదలుపెట్టింది. ఇలావుండగా, కలభాషిణి వచ్చి ఆమెని నువ్వెవరివి అని అడిగింది. ఆమే సుముఖాసత్తి అని తెలుసుకుని ఆశ్చర్యపడింది. అప్పుడే వీణను పట్టుకుని మణికంధరుడు అక్కడికి వచ్చాడు. తనింకెప్పటికీ చూడలేననుకున్న తనతో విద్యనభ్యసించిన కలభాషిణి కనిపించగా, అతనికి హృదయం వికసించింది. చాలా ఉత్సాహంతో ఆమె క్షేమసమాచారాలు, అక్కడికి ఏకారణంగా వచ్చావని అడిగాడు. కలభాషిణి తాను మణిస్తంభుడిచేత ఇక్కడికి తీసుకురాబడడం, సుముఖాసత్తి బలికి అడ్డుపడడం చెప్పింది. అప్పుడు మణిస్తంభుడు రంగప్రవేశం చేసి యౌవ్వనవతిని తెలుసుకున్నాడు.
దేవిచేత విసిరివేయబడి, మణికంధరుడి ఆశ్రమ సమీపంలో ఒక పువ్వుల సెజ్జమీద ఇద్దరూ పడ్డారు. ఆ దెబ్బ నుంచి లేచి చూసేసరికి భయకంపితురాలైన కలభాషిణి చాలా అందంగా కనిపించింది. ఆమె సౌందర్యానికి మోహపరవశ్యం పొంది ఆమెని పొందడానికి ప్రయత్నించాడు. అది భరించలేక తప్పించుకోవడానికి సహాయంకోసం గట్టిగా పరుగులు పెట్టింది. దగ్గిరే ఉన్న అన్న నలకూబరుడి రక్షణకోసం వచ్చింది. తనను తాను రక్షించుకోవడానికి సిద్దుడు పారిపోతుండగా పట్టుకుని ఆ స్త్రీని చూపించమని వత్తిడి చేయసాగాడు. ఆ పువ్వుల సెజ్జ దగ్గరకి మణిస్తంభుడు తీసుకు రాగా, రంభ వచ్చి అతన్ని విడిపించి, నలకూబరుని ఒక పొదరింట్లోకి తీసుకునిపోయింది. నలకూబరుడి చేతికెళ్ళిన ఖడ్గం కోసం సిద్ధుడు కాచుకుని ఉన్నాడు.
వాళ్ళిద్దరూ సరససల్లాపాల్లో ఉండగా ఇంకొక రంభ వచ్చింది. నిజమైన రంభ ఎవరో తెలుసుకోలేక నలకూబరుడు ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఇద్దరు రంభల మధ్య దెబ్బలాట మొదలైంది. అటువంటి అవకాశం కోసం చూస్తున్న నారదుడు వచ్చి, వారి దెబ్బలాటలకి ఆనందించి, అసలు రంభ ఎవరో చెప్పకుండానే రంగాన్ని విడిచి వెళ్ళిపోయాడు. తమ ప్రియుడిని తిరిగి పొందడానికి రెండవ రంభ మొదటి రంభని ఇంద్రసభకి రమ్మంది.  నలకూబరుడి ఆజ్ఞమీద ఆమె రాననడంతో, వెంటనే గగన మార్గంలో పయనించలేక అలా అంటోందని చెప్పింది. దీంతో నలకూబరుడి కళ్ళు తెరుచుకున్నాయి. మాయారంభను తెలుసుకున్న అసలు రంభ ఆమెని ఖండింపబడిన తల కలది అయ్యేటట్లు శపించింది.
అలా రంభ, నలకూబరుడితో అనుభవిస్తుండగా ఇంకొక నలకూబరుడు వచ్చి, దెబ్బలాట మొదలుపెట్టాడు. ఇవన్నీ చూస్తున్న మణిస్తంభుడు తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన పోరు మొదలైంది. జరుతున్నది గ్రహించి రంభ వాళ్లిద్దరినీ రహస్యంగా పిలిచి కళాపూర్ణుడి గురించి అడిగింది. మొదటి వాడు చెప్పలేకపోయాడు. వెంటనే మాయా నలకూబరుని వదిలిపెట్టి ప్రియుణ్ణి చేరుకుంది. నలకూబరుడు అతన్ని త్వరలో చావు నెదుర్కుంటావని శపించాడు. అతడు ఎటు వెళ్ళాడో మణిస్తంభుడికి తెలియదు. ఆది దంపతులు స్వర్గానికి వెళ్ళారు. పొదరింట్లో వదిలిన ఖడ్గాన్ని తీసుకుని సిద్ధుడు ఆలయానికి వెళ్ళాడు.
ఇది చెప్పి, పూసెజ్జని వదిలిన తరవాత ఏం జరిగిందో చెప్పమని కలభాషిణిని కోరింది.

చతుర్ధాశ్వాసం

వాళ్ళకి ఆశ్చర్యం కలిగేటట్లుగా కలభాషిణి తనే ఆ మాయలాడినని తనకాశక్తి నారదుడి వరప్రసాదంవల్ల వచ్చిందని చెప్పింది. తన శీలము నలకూబరుడిచేత చెరచబడిందని మాత్రం విచారంగా ఉందని చెప్పింది. ఇంకేదో చెప్పబోతుండగా మణికంధరుడు అసలు విషయాన్ని అంగీకరించాడు. నలకూబర వేషంలో ఆమెతో ప్రేమసల్లాపాలాడి చివరకి ఆ దివ్య ప్రేమికుడి వలన శాపగ్రస్తుడైనట్లు చెప్పాడు. తమ పూర్వ స్నేహాన్ని గుర్తుకు తెచ్చాడు. తను మొదటి నుంచి కలభాషిణినే ప్రేమించినా నారదుడి భయంచేత బయటపెట్టలేదు. ఆమెతో కలిసినందుకు చాలా ఆనందపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కలభాషిణి పట్టలేని సంతోషం కలిగింది. ఆమె కూడా మొదటి నుంచి తను ప్రేమిస్తున్న మణికంధరుడితో కలిసింది. ఆ విషయాన్ని అందులో ఉన్న మానసిక వికారాన్ని విడమరిచి చెప్పగా ఎవరూ నమ్మరని, తను వేశ్యాకులంలో పుట్టడం అందుకు కారణమని చెప్పి, నలకూబరుడి కోరిక చెడ్డదని కలభాషిణి చెప్పింది.
ఆమెలో ఉన్న చిత్తశుద్ధి, సత్యసంధత, నిష్కాపట్యత మణికంధరుడిలో నిజమైన ప్రేమని వెల్లడింపచేసింది. ఆమెని ఓదారుస్తూ, నారదుడు వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలు ఆమెలో ఉన్న సత్యసంధతకు ఋజువులని, దానికి ఈ విధంగా ఒక కథ చెప్పాడు.          
నారదుడి శిష్యుడు కాక పూర్వం, మృగేంద్ర వాహనుణ్ణి తృప్తి పరిచి కవితా పటిమను పొందాడు. ఆ శక్తిని కాశ్మీర సాహిత్య విమర్శకులచేత పరీక్షించుకోవడానికి ఆ దేశం వెళ్ళి, ఒక బ్రాహ్మడితో ఉన్నాడు. అప్పుడు సుగాత్రి, శాలీనులు భగ్నహృదయంతో ఉన్నారు. వాళ్లెవరని అడిగితే ఆ బ్రాహ్మడు ఇలా చెప్పాడు. శారదా పీఠంలో ఉన్న పూజారికి సుగాత్రి అనే కూతురు వుంది. ఏవో కారణాలచేత తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయికి యవ్వనం రాగానే అదుపాజ్ఞలలో వుండే, లజ్జావంతుడగు శాలీనుడు అనే వాడికిచ్చి పెళ్ళి చేశారు. అతడు ఇల్లరికం వుండేటట్లు ఏర్పాటు చేశారు. మొదటి రాత్రి సుగాత్రిని బాగా అలంకరించి అతని దగ్గిరికి పంపించారు. అలంకారాలపట్ల, అందంపట్ల కోరిక లేని శాలీనుడు భార్యను కన్నెత్తి కూడా చూడకుండా గాఢంగా నిద్రపోయాడు. యవ్వనంలో ఉన్న ఆమె సౌందర్యమంతా అలా వృధాగా గడిచిపోయింది.
ఇలా నిర్లిప్తంగా ఉండడం శాలీనుడిని కష్టాలలో పడేసింది. మనవడు కావాలనుకున్న అత్త నిరుత్సాహంతో అయిష్టంగా వుండేది. తోటకి నీరు పెట్టే పని అప్పగించింది. తన భర్తకి తల్లి ఇచ్చినటువంటి ఇలాంటి అమానుషమైన శిక్ష సుగాత్రిని బాధించింది. అది చూస్తూ సహించలేదు, తల్లిని ఎదిరించలేదు. రెండోపని చేస్తే కుటుంబ విషయం రచ్చకెక్కుతుంది. ఇలా వుండగా భర్త తోటలో కష్టపడుతుంటే సుగాత్రి ఇంట్లో వృధాగా గడపలేకపోయింది. తల్లి చూడకుండా మణిమయ భూషణాలు ఒకచోట పెట్టి భర్తతో పాటు పనిచెయ్యసాగింది. ఈ శారీరక శ్రమతో అలిసిపోయింది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆమె చనుదోయి ఎగసిపడసాగింది. అద్భుతమైన అటువంటి ఆమె సౌందర్యం చూసి తన నిర్వికారత్వాన్ని పక్కకు పెట్టి కౌగిట్లోకి తీసుకున్నాడు. రెండు రోజులలో భర్త మనస్తత్వం తెలుసుకుంది. సొంపులే కాని మణిమయ భూషణాలు ఇష్టం కాదని గ్రహించింది. అలా సంతోషంగా గడుపుతుండగా శాలీనుడు ఒక రోజు కోపగించి, భగ్నహృయంతో మరణించాడు.
ఈ కథ చెప్పి మణికంథరుడు సుగాత్రిని చూసి నువ్వు ఆదేశస్థురాలవయి వుండి నీకా విషయం తెలియదా అని అడిగాడు. నవ్వుతూ తనే సుగాత్రినని ఆమె చెప్పింది. ఆ మాట వాళ్ళందరికీ చోద్యం అనిపించింది. మణిస్తంభుడు, సుముఖాసత్తి కలహకారణం ఒకేరీతిగా చెప్పినందుకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ప్రకటించబడ్డారు.
మణికంధరుడి శాపానికి సుముఖాసత్తి విచారిస్తుండగా కలభాషిణి అతడితో కళాపూర్ణ కథ రంభతో ఎందుకు చెప్పలేకపోయావని అడిగాడు. తను ఎప్పుడు అటువంటి కథని వినలేదని చెప్పింది.  తను నారదుడిని అడిగినప్పుడు అతడు గుర్తుకు తెచ్చుకుని తను గురువు నుండి విన్న విషయాన్నిచెప్పాడు. అంతలో సంపత్కలనాకాముడైన ఆలఘవ్రతుడనే మళయాళ బ్రాహ్మడు కలభాషిణి వలన కళాపూర్ణుడి కథ తెలిసినట్లయితే భోగ వైభోగాలు, దీర్ఘాయువు కలుగుతాయని తెలుసుకుని, మృగేంద్రవాహన అనుగ్రహం వలన కథను తెలుసుకోదలచి జపం చేయసాగాడు.
ఈలోపున కలభాషిణి, మణిస్తంభుణ్ణి చూసి, తనని బలి ఇచ్చి కోరిక తీర్చుకోమంది. ఆ జగదాంబ మీద ఒట్టు పెట్టి ఆమె మీద కత్తి ఎత్తడానికి సాహసించలేకపోతున్నానన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు తను అతని కత్తికి బలి అవ్వడం తప్పదని అప్పుడే ఆ పని చేసి అతని కోరిక తీర్చుకోమని కలభాషిణి వేడుతుంది. ఇలా అందరూ చెప్పగా, సందేహంతో చివరకు ఆమెని బలి ఇస్తాడు. ఆలస్యంగా బలి ఇవ్వడం వలన తరవాత జన్మలో  రాజప్రాప్తి పొందేటట్లుగా దేవి అనుగ్రహించింది. ఇంతలో కలభాషిణి ఎటువంటి గాయాలు లేకుండా ద్వారానగరంలో ఉన్న ఉద్యానవనంలో ఉంది. మణికంధరుడు తన ఖడ్గాన్ని, వీణని ఆలయంలో రహస్యంగా దాచి, అలఘవ్రతుడికి మణిహారాన్ని ఇచ్చి, శ్రీశైలంలో తన పాత స్థావరమైన భృగుని దగ్గరకి వెళ్ళాడు.
సుముఖాసత్తి, మణిస్తంభులు అక్కడే కొంత కాలం యోగాభ్యాసం చేసి, వివిధ ప్రదేశాలు చూడడానికి బయలుదేరి వెళ్లారు.

పంచమాశ్వాసం
రెండు సంవత్సరాలు జపం చేసి, తరవాత ఒక రోజు మణిహార సహితంగా దేవిచేత దెబ్బతినడం వలన స్పహతప్పిన అలఘవ్రతుడు రెప్పలు తెరిచి చూడగా రాజు కొలువులో ఉన్నట్లు తెలుసుకున్నాడు. రాజు దగ్గర ఉయ్యాలలో ఒక బాలిక వుంది. అలఘవ్రతుడు మణిహారాన్ని రాజుకిచ్చాడు. రాజు దాన్ని బాలిక మెడలో వేశాడు. ఆమె చిఱునవ్వుతో వుండడం చూసి కొలువులో అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యంతో మహేశుడు ఆ బాలికతో రెండునెలల వయస్సున్న నువ్వు అసలు కథ ఏమిటో చెప్పమని అడిగాడు.  అప్పుడు ఆస్థానం అంతా సావధానంగా వింటూ వుండగా ఆ బాలిక ఇలా చెప్పింది.
అది సరస్వతీ చతుర్ముఖు(బ్రహ్మ)ల చిలుక. ఒకనాడు బ్రహ్మ సరస్వతితో ఉద్యానవనలో సరససల్లాపాలలో వున్నారు. ఆమె మనస్సులో సంతోషంఉన్నా కూడా తన ఆనందాన్ని కప్పిపుచ్చుకుని భర్తపట్ల కోపం వచ్చినట్లు నటించింది. ఆ సమయంలో బ్రహ్మ, బురోవర్తిశాఖా సమాసంజిత సమంజసరత్న పంజరంలో  ఉన్న చిలుక కథ చెప్పమని అడిగింది. చిలుక తన అశక్తతని చెప్పి, అతనినే చెప్పమంది. అతడు ఈ రకంగా చెప్పసాగాడు.
కాసారపురంలో కళాపూర్ణుడు అను రాజు వుండేవాడు. అతని తల్లి సుముఖాసత్తి అనే స్త్రీ, తండ్రి మణిస్తంభుడనే పురుషుడు. పుట్టుకలోనే సర్వ యవ్వనుడై, స్వభావుడనే సిద్ధుడిచేత చాపము, బాణములు, మణి పొందాడు. అవన్ని అలౌకిక శక్తులు కలవి. మదాశయుడనే రాజుని జయించి, తన దాసుడిగా చేసుకున్నాడు. అతని మంత్రి అయిన సత్యదాత్ముని చేత, అంగ దేశ సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు. అతని మణిచేత ఆకర్షింపబడి, మదాశయుని మంత్రులైన చతురాగమాలు అతనిని కొలుస్తుండేవారు. ఒకసారి వాళ్ళలో ఒకరు మణిని గట్టిగా నొక్కి రాజాగ్రహానికి గురై, రాజబహిష్కృతులు కాబడ్డారు. మదాశయుడు తన భార్యా పుత్రిక సమేతంగా వెళ్ళి, మళ్ళీ వచ్చాడు. యవ్వనవతి అయిన మధురలాలసని కళాపూర్ణుడికిచ్చి వివాహం చేశారు.
అంతవరకు కథనంతా శ్రద్ధగా విన్న సరస్వతి, తమ ప్రేమ సల్లాపాలే కథారూపంగా చెప్పబడ్డాయి కదా అని భర్తని అడిగింది. చిరునవ్వుతో అంగీకరించినా కూడా, ఆమెకి స్పష్టం చేయడానికి అతడు అంగీకరించక తప్పలేదు.
ఆ తరవాత ఒకసారి, బ్రహ్మలోకానికి వెళ్ళిన రంభ, సరస్వతిని గొలవడానికి వచ్చింది. సరస్వతి కంఠం నుంచి వచ్చిన మణి నుంచి వచ్చిన శబ్దాన్ని వల్లిస్తున్న చిలుకని చూసింది. రంభ తన సహజమైన ఆసక్తితో సరస్వతీ, చతుర్ముఖుల మధ్య జరిగినదంతా అమాయకపు చిలుక వలన తెలుసుకుంది. తమ రహస్యములు వెల్లడిచేయడం చూసిన సరస్వతి పక్షిని భూమిపై ‘లంజ’గా పుట్టమని శపించింది.  ఆ సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మ దాని ఓదార్చి, తరువాత జన్మలో మధురలాలసగా పుట్టి, కళాపూర్ణుడిని వివాహం చేసుకుని, శీలవతిగా పేరు తెచ్చుకుంటావని చెప్పాడు. ఆ కథ చెప్పినవారు, విన్నవారు చిరకాలం భూమిమీద సుఖసంతోషాలతో జీవిస్తారని రంభతో అన్నాడు. ఆ పక్షే కలభాషిణిగా ద్వారకలో పుట్టి, మణికంధరుడితో మణిహారాన్ని పొందింది.
అప్పుడు అలఘవ్రతుడు తను ఏవిధంగా కళాపూర్ణుడిని కలుసుకుంటానో తెలియచేయమన్నాడు. సభాసదులవలన ఆ విషయం తెలుసుకోమని చెప్పారు. అప్పుడు రాజు తనే కళాపూర్ణుడినని చెప్పి, సత్యదాత్ముడిని, మదాశయుడిని, చతురాగమాలని పరిచయం చేశాడు. ఆ శిశువు మదాశయ, సానుభూతిగార్ల బిడ్డ అని చెప్పాడు.
కళాపూర్ణుడి జన్మ అలఘ వ్రతుడు అడగగా ఆ బాలిక ఇలా చెప్పింది. మృగేంద్ర వాహనంవలన పొందిన శక్తి గల సుముఖాసత్తి, భర్త కోరికమీద రూపులు మార్చుకుని ఆ సమయంలోనే కళాపూర్ణుడిని చూశారు. అతడు వెంటనే ఆకర్షితుడయ్యాడు. ఆ అలౌకిక వ్యక్తి కోసం సత్యదాత్ముడు సింహాసనాన్ని త్యజించి, ఆ విధంగా అతని తల్లిని ప్రేమించటంలో తను చేసిన పాపాన్ని పోగొట్టుకోదలిచాడు.
స్వభావుడు మణిస్తంభుడి మామ. అతడే అల్లుడికి ఖడ్గాన్ని సింహాన్ని ఇచ్చాడు. శతదళాఘ్ని చాలాకాలం యోగాభ్యాసం చేసి, శ్రీశైలం చేరాడు. అక్కడ లోయలో పడిపోబోతుండగా కంధరుడిని చూశాడు. విజయసాధనములగు ఖడ్గం, బాణము, విల్లు ఇచ్చేటట్లు ప్రతిజ్ఞ చేసి, స్వభావుడు ఆవిధంగా మణికంధరుడిని ప్రాణ త్యాగం నుంచి కాపాడాడు.

షష్ఠాశ్వాసం

మణికంధరుడు శ్రీశైలంలో వుండగా శల్యాసుడిచే తరుముకు రాబడిన అభినవ కౌముది, అతనికి ఒక దివ్య ఖడ్గాన్నిచ్చి, రాక్షసుడిని చంపమంది. ధైర్య సాహసోపేతుడవడం చేత రాక్షసుడితో తీవ్రంగా పోరాడి చివరికి ఒకరినొకరు చంపుకున్నారు. ఆ పోరాటంలో చచ్చిన మణికంధరుడే కళాపూర్ణుడుగా పుట్టాడు. అతని ప్రతిజ్ఞ ప్రకారం అభినవ కౌముది అతన్ని పెళ్ళి చేసుకుంది.
అలఘువ్రతుడు ప్రార్థించాడు. అప్పుడు ఆ బాలిక, అతని పూర్వ చరిత్రని ధన నష్టము, భార్యలతో ఎడబాటు, చతురాగమ జన్మము, మదాశయి కొలువు ప్రవేశాన్ని చెప్పింది. అప్పుడు తను మరచిపోయిన తన సేవకుల విషయం తెలుసుకోవడానికి సత్యదాత్ముడు బాలికని సమీపించాడు. అప్పుడు మణిహారంలో ఉన్న మధ్యమణిస్థానం తిప్పగా బాలిక దివ్యశక్తులు పోగొట్టుకుని ఏడవసాగింది. ఈవిధంగా హఠాత్తుగా జరిగిన మార్పుకి ఎవరికి కారణం అర్థం కాలేదు. ఆమెని వివాహమాడడానికి అంగీకరించి, సరిగ్గా పెంచమని తల్లితండ్రులతో కళాపూర్ణుడు చెపుతాడు.

సప్తమ, అష్టమాశ్వాసాలు

మధురలాలస పెరిగి, యవ్వనవతి అయి, కళాపూర్ణుడిని వివాహం చేసుకుంది. తన భార్యలకు ఇచ్చిన ప్రతిజ్ఞ నిలుపుకోవడానికి కళాపూర్ణుడు దిగ్విజయ యాత్రకి వెళ్ళి, రాజులందరినీ లొంగదీశాడు. అభినవ కౌముది వీణ, మధుర లాలసకి మహారాజుల మణులతో పొదగబడిన నూపురములు ఇవ్వబడ్డాయి. సత్యదాత్ముడు అటువంటి నూపురాన్ని తీసుకుని వచ్చి, ఆమెకి సాష్టాంగ ప్రణామం ఆచరించుచుండగా, మధురలాలస అతన్ని వారించి, అతనికి నమస్కరించింది. అప్పుడు ఆమె గత చరిత్రను భర్తకి విడమరిచి చెప్పింది.
సత్యదాత్ముని అసలు పేరు సుగ్రాహుడు. అతడు చాపానుభూతినోదరుడు. అతని జనన కాలగ్రహానికి, సుగుణాలకి మెచ్చుకుని రాజులు ఎంతమందో వారి పుత్రికలని చేసుకోమన్నారు. అందుకు బదులు చెప్పకపోవడం చేత, అందరు ఒక్కసారి దాడి చేశారు. దీంతో అరణ్యానికి పారిపోయి తపస్సు చేసుకుని మణిహారాలు పొందాడు. కాలక్రమంగా పూర్వజ్ఞానమంతా నశించేటట్లు, తనను ఎఱిగిన వారిచేత గుర్తింపబడని విధంగా శాపగ్రస్తుడయ్యాడు. ఆ సంఘటన తెలిసిన తరవాత మళ్ళీ పూర్వజ్ఞానం కలుగుతుందని విముక్తుడయ్యాడు. మధ్యమణి హృదయస్తమైన మణిహారాన్ని పోగొట్టుకున్నాడు. అది బ్రాహ్మణుడికి దొరకగా కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు మణికంధరుడికి, అతడు అలఘవ్రతుడికి ఇచ్చారు. అది మధురలాలసని ఎలా చేరిందో స్పష్టమైంది. మణిస్థానం తిప్పనందుకు సత్యదాత్ముడి గతం చెప్పలేకపోయాడు. ఇదంతా అప్పుడే మధురలాలసకు తెలిసింది. మధురలాలస, కళాపూర్ణులు ఇద్దరూ లక్ష్మీనారాయణ సంవాదాన్ని, మణికంధర పద్యాన్ని, తన రాజ్యంలో ఉన్న సాంఘిక రాజకీయ స్థితిగతులని తెలుసుకోవడానికి మణిహారాన్ని ఉపయోగించుకున్నారు. అభినవ కౌముది, మధురలాలసకి, సుప్రసాద, సరస అనే పుత్రులు వరసగా కలిగారు. ఆవిధంగా రాజు నిరాసక్తుడుగా, సంతృప్తితో చాలాకాలం సుఖంగా జీవించాడు.

అధ్యాయం 10
సూరన తత్వం

ఏ కళా సిద్ధాంతమైనా, కేవలం వ్యక్తిగత అభిప్రాయానికి భిన్నంగా, పటుత్వంగా ఉండడానికి, విజ్ఞానవాద పునాది అవసరం. సూరన కళా సిద్ధాంతం, దాని ఆవశ్యకతకోసం, అతని తాత్విక పరిశీలన కావాలి. కళాపూర్ణోదయంలో వెల్లడించినట్లు, కవి విశిష్ఠాద్వైతి అని ముందరి అధ్యాయంలోనే పరిశీలించారు. తత్ఫలితంగా, విశిష్ఠాద్వైతానుసారంగా విజ్ఞానవాదం, సృష్టి సిద్ధాంతం, ధర్మ శాస్త్రం, మోక్షవిధానం, తరవాత రామణీయకత గురించి తెలుసుకోవడం అవసరం. ఈ విషయం పరిశీలనకి ముందు, ఒక విమర్శకు రేకెత్తిన ప్రశ్నని పరిశీలించాలి. (మల్లాది సూర్యనారాయణ శాస్త్రి రాసిన కళాపూర్ణోదయం పీఠికలో ‘ఇతని మతం’) కళాపూర్ణోదయంలో విశిష్టాద్వైతిగా కనిపించిన సూరన, వాస్తవానికి శుధాద్వైతుడని, తమ ప్రభువు కృష్ణ భూపతి ప్రీత్యర్ధం అలా ముసుగు ధరించాడని అతని వాదన. ఆ విషయమే మరింత విశదీకరిస్తూ, కవి పూర్వీకుల్లో శివపూజ, సౌర్యారాధన, యోగాభ్యాసాలు ఎక్కువగా వుండేవని సూచించారు. కలి అద్వైతి అయినప్పటికీ, శైవభక్తుడు అవడం, అతని కృతులైన రాఘవపాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నాలలో శైవ సంబంధమైన వర్ణలకి ఆస్కారమేర్పడిందని విమర్శకుడి వాదన. అంతేకాక, పింగళి కుటుంబంలో నేటికీ ఉన్న (పుండ్రములు) నుదుటి నామం కవి కళాపూర్ణోదయంలో ఉన్న వైష్ణవ తత్వానికి చిహ్నమని కూడా సూచించారు. తమ సిద్ధాంతానికి అనుకూలంగా ఇంకొక కారణం చూపిస్తూ, నిలువు బొట్టు విశిష్టాద్వైతుల చిహ్నం కాదని, ద్వైతులలోనూ నిలువు బొట్టు పెట్టే వాళ్ళు ఎంతమందో ఉన్నారని చెప్పారు.
పై సూచనలను అనుసరించి, రెండు విషయాలు ఉత్పన్నం అవుతాయి. మొదట సూరన అద్వైతి, రెండవది అతని విశిష్టాద్వైతం కేవలం వేషము మాత్రమే. కవికృతులలోని శైవవర్ణనలు, రెండవదానికి అద్వైతుల నిలువు బొట్టు చిహ్నాలు తమ వాదనలకు అండగా విమర్శకులు చూపించారు. విమర్శకుడు చూపించిన రెండు మార్గాలు ఆశ్చర్యకరమైనవి. పాండురంగ మహత్యం చదివిన వారెవరూ, అందులో ఉన్న శివపార్వతుల వర్ణనలు చూసి, విశిష్టాద్వైతి కాడని చెప్పలేరు. ప్రధమ కారణం కన్నా ద్వితీయం తక్కువ దురదృష్టకరమైనదేమీ కాదు. కారణం అందులో ఉన్న తర్కం ఇది : కొన్ని గోవులు నల్లనివి, ఈ గోవు  నల్లనిది. కనుక గోవులన్నీ నల్లనివే ఇదీ కుతర్కం.
ఇంతవరకూ సాధించిన వాదనలు నిక్షిప్తాలే. అసలు కవి అద్వైతం, విశిష్టాద్వైతం లేక తదితర తాత్విక శాఖా సంబంధించినవాడో ప్రత్యక్షంగా చూపవలసి వుంది. ఈ విషయంలో చారిత్రక సత్యాలు ప్రమాణాలకు మించి, కవికృతులలో ఉన్న దార్శనిక, విజ్ఞాన వాదాలకు మించి, కవికృతులలో దార్శనిక, విజ్ఞాన వాదాలకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష పాఠాలే మరింత ఆధారభూతాలు. వాటికి కొరత లేదు. ఒక గ్రంథంలో ఒకానొక దార్శనిక సంబంధములైన విషయాలుండి, వేరొక గ్రంథంలో మరో తాత్వికశాఖాసక్తి కనబరిచినట్లయితే, కవిలో, వాస్తవంగానో, అవాస్తవికంగానో, మార్పు కలిగినట్లు నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా మార్పు స్వచ్ఛందం. ఎందుకంటే తను అభిలషించిన మానవత్వపు విలువల పట్ల, అతడొక కళాప్రియుడో, వక్రబుద్ధో అయితే తప్ప, చెలగాటం ఆడడు. ఈ విధానమే సూరన కృతులకి అన్వయించి, అతడు కోరిన తాత్విక శాఖను తెలుసుకోవచ్చు.
రాఘవపాండవీయంలో ఉన్న పీఠికలో కవిత్వానికి ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయి. అవతారిక  1 నుంచి 2, 41-48 వరకు.
పై పద్యాల్లో అద్వైతంలో ఉన్న ప్రత్యేకతలైన జీవేశ్వర మోక్ష స్వభావాల గురించి ఏమైనా సూచన వుందా. ఇదిలావుండగా విశిష్టాద్వైత సూత్రాలకి భిన్నంగా ఏమీ లేవు కాబట్టి, ఈ పద్యాలను అనుసరించి కవిని అద్వైతిగానో, విశిష్టాద్వైతిగాగానీ చెప్పడానికి వీలులేదు.  ఈ విషయంలో ప్రధాన గ్రంథాభిప్రాయం పరిశీలించచ్చు. రాఘవ పాండవీయంలో ఉన్న ప్రథమాశ్వాసంలో తాత్విక సంబంధమైన ఈ పద్యాలు ఉన్నాయి.  ప్ర. ప్ర. అ.1 ప.1మరియు 6. ఇవన్నీ పైన పేర్కొన్న పద్ధతిలోనే నడిచాయి. అనగా అద్వైత లేక విశిష్టాద్వైత దార్శనికాలకి ఇందులో ప్రత్యక్ష ప్రమాణం లేదు. వీనిని ఎలాగైనా వ్యాఖ్యానించచ్చు. ద్వితీయాశ్వాసంలో తాత్వికాలోచన గల పద్యాలు రెండే వున్నాయి. ప్ర.ప్ర.అ.2, ప.  ఇవి రెండూ ప్రస్తుత సమస్యకి ప్రత్యక్షంగా తోడ్పడవు. పెదరామయ్య వ్యాఖ్యానుసారం ‘బుధ్నవత్’ అనే పెరుగుట. అద్వైతాన్ని అనుసరించి, జ్ఞానానికి పెరగడం, తరగడం లేదు. కాబట్టి జ్ఞానానికి క్షీణ, అభివృద్ధి దశలని ఆపాదించే విశిష్టాద్వైతానికే ఈ సూచన అనుకూలిస్తోంది. అయినా, కవి విశిష్టాద్వైత పక్షానికి ఇది సరైన మార్గం కాదు. దార్శనిక సంబంధాలైన ఐదు పద్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రశ్నకి ఇవి తోడ్పడతాయేమో తెలుసుకోవడానికి అవి పరిశీలించడం అవసరం. వాటిని క్రింద చూపిస్తున్నాను (5 పద్యాలు) ఇవి ముందువాటికన్న సమస్య మెఱుగు అయ్యేటట్లు చేయలేకపోయాయి. చివరి ఆశ్వాసంలో ఉన్న ముగింపు పద్యాలు కూడా పైన చెప్పబడిన వాటికన్న ఎక్కువగా చెప్పబడలేదు. రాఘవ పాండవీయం అంతా పఠించిన తరవాత వచ్చిన నిర్ణయాలు ఏమిటి? కవి తన ఆకృతిని విరూపాక్షుడికి అంకితమిచ్చినా కూడా విశిష్టాద్వైత వ్యతిరిక్త విషయం ప్రస్తవనని ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అలా కాకుండా అద్వైతం కూడుకున్న ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా కనిపించదు. ఒక పక్క విరూపాక్షుడికి కావ్యం అంకితమివ్వడం. విష్ణుస్తుతి చెయ్యడం వలన కవిని అద్వైతిగా పరిగణించడం ఆలోచనకు మించిన పని. ఈ వాదన సరైనదయినట్లయితే ఈశ్వర, కృష్ణులని ఇద్దరని పాండురంగ మాహాత్యంలో స్తుతి చేసిన రామకృష్ణుడిని అద్వైతిగా పరిగణించాలి. ముఖాముఖిగా అనుకున్న ఇది చాలా దుర్భరమైనది. రామకృష్ణుడి విషయం కేవలం భిన్నమైనదని, విశిష్టాద్వైతం పట్ల తన ధృఢనమ్మకాన్ని, అందరి తాత్విక విధానాన్ని వెల్లడించడంతో అతని విషయం స్పష్టమని అభ్యంతర పెట్టచ్చు. అలా అయితే, అద్వైతో, విశిష్టాద్వైతో అంతిమంగా నిర్ణయించేది అతని తత్వం. అద్వైత, విశిష్టాద్వైత శాఖలలో జీవేశ్వర భక్తి అభిప్రాయాల భిన్నత్వం గ్రహించినట్లయితే పై విషయం స్పష్టమవుతుంది.
అద్వైతానుసారంగా, బ్రహ్మ సత్యం, పరమార్ధం. విశ్వం, జీవం, ఈశ్వరుడు అసత్యాలు. అనగా జీవుడు, ఈశ్వరుడు, విశ్వాలకు ఉనికి లేదని అర్థం కాదు. ఘటనా దృష్టిలోనే అవి వుంటాయి. ఒక ప్రత్యేక స్థితిలో స్వప్నం వాస్తవమై, జాగృదావస్థలో అవాస్తవికమైనట్లే, సంసార స్థితిలో జీవేశ్వరులు ఇద్దరూ వాస్తవాలు. పారమార్ధిక, బ్రహ్మస్వరూప స్థితిలో అసత్యాలు. విద్యారణ్యుడు దీన్నే రమణీయంగా చెప్పాడు.
జీవేశ్వరాలు అసత్యాలై, మాయజనితాలుగా పరిగణించబడ్డప్పుడు బ్రహ్మ సహజంగా పారమార్ధిక లక్ష్యమవుతాడు. అది తెలుసుకోవడానికి, అహంబ్రహ్మోస్మి అనుకోవడానికి అద్వైతం భక్తిని మార్గంగా సూచించింది. దీనిని అనుసరించి, సగుణ బ్రహ్మపూజ అంతిమ లక్ష్యమైన నిర్గుణ బ్రహ్మకు తీసుకెడుతుంది. వేదాంత పరిభాష కర్త ఈ విషయాన్నే-
కాబట్టి, ఈశ్వరుడు అతని పట్ల భక్తి పారమార్ధిక సత్యాలు కాకుండా అక్కడికి చేరడానికి మార్గాలుమాత్రమే. ఇలా రెండూ లౌకిక ధర్మాలై వుండగా, అద్వైతుడి భక్తి, అతని పట్ల దయగల దైవంపైన ఆధారపడివున్నా, పరమార్ధ లక్ష్యం నిర్గుణ బ్రహ్మనే సూచిస్తుంది.
హరిహరనాధుణ్ణి ఉద్దేశించి, అంకితమొనర్చేటప్పుడు తిక్కన రాసిన విషయం ఇలాంటిదే.
‘వ్యవహిత పరమానందాను భూత్త్యైక్య రూపా (ఉద్యో. ఆ. 4. ప 435)’ ఇదే మీ ప్రత్యేక పద్యం గాదు.  ఆశ్వాసాంత పద్యాల నుంచి ఇటువంటివి ఎన్నయినా ఉదహరించి చెప్పచ్చు. పోతన విషయంలోనే కాక, కేవలం అద్వైతులైనటువంటి కవులెంతమంది పట్లో ఇది సత్యం.
విశిష్టాద్వైత విషయం వేరు. జీవేశ్వరులు పారమార్ధిక సత్యాలు. అవి లౌకిక వాస్తవికాలు కాక పారమార్ధిక విలువలు. ముక్తి స్థితిలోనూ జీవుడు వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండానే బ్రహ్మలో ఒకడవుతాడు. అంతేకాక, సాలోక్య, సారూప్య, సామీప్య స్వరూపైక్యాలకు భిన్నంగా అది సాయుజ్యాన్ని పొందుతోంది. అటువంటి నిత్యానంద స్థితిలో తన ప్రత్యేక విధికోసం. వినియోగించబడిన జీవుడు పరమేశ్వరుడిని సేవిస్తాడు. అంటే అతని లౌకిక భక్తి, అద్వైతులలో వలె కరిగిపోకుండా ఉన్నత స్థాయిలో వుంటుందన్నమాట.
ఇలా, అద్వైతులు చెప్పే భక్తి లౌకికావసరమై, కేవలం మార్గదర్శంగా వుండి, ముక్తి స్థితిలో వదిలిపెట్టేది కాగా, విశిష్టాద్వైతులకు అదే పారమార్ధిక విలువ గలదై, అదే దానికి అంతిమ లక్ష్యంగా వుంది. తమ కృతులలో నిర్గుణ బ్రహ్మ పట్ల భక్తి కనబరిచి, లౌకిక భక్తి విలువ చూపించినట్లయితే, ఆ పరిస్థితులలోనే కవి అద్వైతిగా పేర్కొనవచ్చు. ఇట్టి స్థితిలోనే - సృజనాత్మక కవులు, తిక్కన, పోతనగార్లను అద్వైతులుగా పరిగణిస్తున్నారు. లేకపోతే తెలిసేది కాదు. సూరన అద్వైతి అనడానికి కనీసం నిర్గుణ బ్రహ్మ, ఆత్మ స్వభావం, జ్ఞానం, ముక్తి అనే విషయాలపట్ల అద్వైత ధోరణి ఒక్కసారైనా కనిపించాలి.
రాఘవపాండవీయంలో ఒక్క ప్రసక్తి అయినా అలాంటిది వుందా? అంటే, రాఘవపాండవీయంలో ఉన్న తత్వసారం ప్రకారం సూరన అద్వైతి అని ముద్రవేయడానికి ఏం ఆధారాలున్నాయి ?
రాఘవ పాండవీయం కాకపోయినా, ప్రభావతీ ప్రద్యుమ్నం కవిని అద్వైతిగా చూపించచ్చు. కాబట్టి దీనిని పరిశీలించాల్సి వుంది. అందులో ఉన్న విషయం ఎంతవరకూ ఫలితాన్ని ఇవ్వగలదో చూడాలి.
తన తండ్రికి అంకితం ఇచ్చిన ఈ కృతి వలన సూచి, రాఘవ పాండవీయంలో కంటే అదనంగా ఏమీ తెలీదు. ఇందులో పీఠిక ఈవిధంగా విషయాలని వివరిస్తోంది. ప్ర.ప్ర. అ1, (ప 6) (269, 270, 271, 272) ఇందులో ఎక్కడా కవి, తను గానీ, తన వంశస్తులుగానీ అద్వైతు విశిష్టాద్వైతులు అయినట్లు చెప్పలేదు. విమర్శకుడు చెప్పేటట్లుగా, కవి అద్వైతుడయినట్లయితే, కళా పూర్ణోదయంలో చెప్పిన దానిని ఖండించి కానీ, స్పష్టమైన పదాలలో తన అద్వైత నమ్మకాన్ని కానీ, వెల్లడించి ఉండవలసింది.
ప్రభావతీ ప్రద్యుమ్నంలో ఎక్కడా పాఠం కనుపించదు. పైగా, గోకనమంత్రి నందకస్తవం రాసినట్టు పేర్కొనడం విశిష్టాద్వైతప్తవుల ఆచారం తెలియచేయడానికే గాని, అద్వైతులది కాదు. కృష్ణదేవరాయలు, రామకృష్ణుడు తమ కృత్యాలలో విష్ణు ఆయుధాలని స్తుతించడం కన్నా మంచి ఉదాహరణ అక్కరలేదు. మరొక విషయం. కవి తండ్రి, తాతగార్లు మాత్రమే శివభక్తులుగా చెప్పబడ్డారు కానీ, పూర్వీకులలో కానీ, వంశ క్రమంలో ఇతరులు కానీ, అటువంటి భక్తి కలిగినంట్లు చెప్పబడలేదు. కాబట్టి ఆది నుంచి విశిష్టాద్వైత శాఖను అనుసరిస్తున్నపింగళివారి కుటుంబం నేటికీ నిలువు బొట్టువాడడం అనే కారణం చెప్పడం సరైన విషయం. ప్రస్తుత చర్చనీయాంశం సత్యం మీద ఆధారపడి లేదు. ఈ విషయాన్ని ఉజ్జాయింపుగా గ్రహించచ్చు. తండ్రి, తాతలు శివభక్తులు అనటమే, అద్వైతులవడానికి కారణం కాజాలదు. సూరన తండ్రి శైవారాధనలో సోమారాధ్యుని కృపచేత ఆరాధ్యభక్తిని ఆదరించినా, కవి మొదటి నుంచి విశిష్టాద్వైతుడు అనడానికి అడ్డురాదు. కవి అద్వైతుడో, విశిష్టాద్వైతుడో తెలుసుకోవడానికి కవి తాత్త్వుక పలకులనే ఆధారంగా తీసుకోవాలి. తండ్రి ఔన్నత్యాన్ని సూచించే పద్యాలలో ఒక్కటి తప్ప మిగిలిన వాటిలో తాత్విక ప్రస్తావన లేదు. దీనిని అనుసరించి అద్వైతి అని చెప్పడానికి వీలులేదు. (272) కృష్ణుడి కొడుకైన ప్రద్యుమ్నుడి కథ అయినా ఇది ఏ విధంగా విషయానికి తోడ్పడదు. తత్వానికి సూటిగా చెందేవి మూడు పద్యాలు ఉన్నాయి కానీ, అవి ఈ పక్షం నిర్ణయించవు.
కవి అద్వైతుడైనట్లు కొంచెం కూడా సాక్ష్యం లేదు. కిందటి అధ్యాయంలో చూపినట్లు, కళాపూర్ణోదయాన్ని అనుసరించి కవి, విశిష్టాద్వైతుడు కాగా, రాఘవ పాండవీయం, ప్రభావతీ ప్రద్యుమ్నాలు అతడు విశిష్టాద్వైతుడు కాడని ప్రత్యక్షంగా చెప్పడం లేదు. (క.పూ.చతుర్ధాశ్వాసం) ప.33, 34, 37 లక్ష్మీ నారాయణ సంవాదం, కథ అద్వైతుడి కలం నుంచి రావడం అనూహ్యం. ఈ వాస్తవాలను పరిశీలిస్తే తమ ప్రభువైన నంద్యాల కృష్ణభూపతిని సంతృప్తిపరచడానికే విశిష్టాద్వైతపు ముసుగు ధరించారనడాన్ని అంగీకరిస్తారా?
---

11వ అధ్యాయం
కళాపూర్ణోదయం - కావ్యలక్షణాల చర్చ

పింగళి సూరన రచించిన మూడు కృతులు - రాఘవపాండవీయము, కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నం. తెలుగు సాహితీపరులకు ఇవి సుపరిచితం. పింగళిసూరన తరువాత వచ్చిన కవులు, లాక్షిణికులు ఆయనను చెప్పుకోదగినంత నిపుణుడుగా స్తుతించలేదు. అతని ప్రధాన కృతి కళాపూర్ణోదయానికి తగినంత అభినందన రాలేదు. పురాణ మార్గంలో ఉన్న మనుచరిత్ర, వసుచరిత్రలకున్నంతటి కీర్తి నేటికీ కళాపూర్ణోదయానికి రాకపోవడమే సూరన సృజనాత్మక శక్తికి తార్కాణము. సూరన తన రచనలో ఆనాటి పరిస్థితులకు తగినట్లుగా కాక కొత్త పద్ధతిని అనుసరించడమే దానికి నిదర్శనము. అభినవ గుప్తుడు ధృవపరిచిన రసధ్వని  చదవడానికి గాని, అందులో ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవడానికి గాని తరువాత వచ్చిన కవులు, లాక్షిణికులు ప్రయత్నించలేదు. పతనావస్థలో ఉన్నటువంటి అలంకారిక శాఖపట్ల మనసును లగ్నం చేశారు. శబ్ద చిత్రణ, జీవ రహిత కథలు, పుర వర్ణనలు వారిని ఆకర్షించాయి. కవి తన రచనలో ఎంతటి శ్లేష, బంధ కవిత్వం చూపుతాడో, అతని పట్ల అంత గౌరావాధిక్యతలు కనబరిచేవారు. విస్తారమైన మానవానుభవాలతో కూడినటువంటి ఉత్తమ కథ వారిని ఎక్కువగా ఆకర్షించలేదు. ఆకారణంగానే రామరాజభూషణుడు తొణకకుండ కేవలం కల్పనాకథలు కృత్రిమరత్నాలని, ఆద్యసత్కథలను మలిచి వాటిని తోబుట్టువులని చాటగలిగాడు.
ఈ అసూయ ఏర్పడడానికి,  బహుశ జ్ఞానం పారమార్థికమని, కొత్త వస్తువులకు అవకాశమే లేదని, మానవుడి లక్ష్యము కేవలం పూర్వకాలపు సత్ లో ఉన్న ప్రాముఖ్యాన్ని తెలుసుకోవడమేననే మనస్తత్వంలోనే ఇమిడి ఉంది. ఇటువంటి భావాధిక్యత ఉన్నంతవరకు సూరన సమకాలీకులు కానీ, తరువాత వచ్చిన తరాలవారు కానీ కళాపూర్ణోదయానికి చూపవలసినంత అర్హత చూపించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. దీనివలన, సూరన కొంతమంది చేత స్తుతించబడినప్పటికి గొప్పకావ్యం అనే నిజాన్ని మరుగుపరచలేకపోయారు. తడకమళ్ళ వెంకట కృష్ణారావు కథని సంగ్రహంగా చెప్పారు.  కళాపూర్ణోదయాన్ని సరైన దృష్టితో చూడకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, వలన దాని అర్హతకి తగినంత విలువ రాలేదు. 19వ శతాబ్దం నుండి ఈ కావ్యము బాగా చదివి కొన్ని అభిప్రాయాలు వెల్లడయినప్పటికీ అవి న్యాయంగా ఆశించినంతగా ఫలితం రాలేదు.  
చిత్తశుద్ధిగల ఆలోచనా పరుడు, గొప్ప కవి అయిన సూరన నూతనత్వానికి, సృజనాత్మకతకి పెట్టింది పేరు. సూరనే ప్రత్యేకంగా పేర్కొన్నట్లు గరుడ పురాణము, రాఘవపాండవీయము, కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము అతని ప్రధాన కృతులు. తన కవిత్వాన్ని మరణించిన సమయంలో చదవడానికి ఉపయోగించే, అమర్యాదకరమైనటువంటి గరుడ పురాణ సంస్కృత రచన అనువదించటంతో ఆరంభించటం ఆశ్చర్యం వేస్తుంది. అందులో అతనిని ఆకర్షించిన భంగిమలు, కవి సాధించిన విషయాలేమిటో తెలియరాలేదు. అతని రెండవకృతి రాఘవ పాండవీయం - తెలుగు సాహిత్యరంగంలో అద్వితీయమైన ద్యర్థికావ్యము (రెండర్థములు గోచరించేది) అందులో రామాయణ, మహాభారత  గాథలు రెండూ సులభమైన శైలిలో, సహజంగా చెప్పారు. ఎటువంటి అతిశయము చూపకుండానే రెండర్థాలు చూపించడనేది గొప్పతనం. ఇటువంటి కావ్యాలకు సహజమైన రసలోపం ఉన్నప్పటికి తరువాత కవులకన్న ఎంతో మేలైనది. వారు ఒకే కావ్యంలో యిమడ్చలేని కష్టమైన కథలను చేపట్టవచ్చు, త్యర్థి (మూడర్థములు),  చతుర్థి (నాలుగర్థములు) కావ్యాలను రాయవచ్చు. కానీ సూరనలోని సరళత, సహజత్వము చూపలేరు. సూరన పట్ల సమకాలీనులను ఆశ్చర్య ముగ్ధులనుచేసి, అతని శక్తిని గమనించగలిగినట్లు చేయగలిగింది ఈ కృతి.
ముందుగా లాక్షణికులు ఆనాడు పురాణమార్గంలో పోతున్న కవులందరికన్న సూరన మించినవాడని అనుకున్నారు. ఆకారణంగానే అతనిని వారు లాక్షణిక కవిగా గుర్తించారు. ఇదిలా రాయకుండా వుండి వుంటే అతని మిగిలిన కృతులకు కూడా గరుడ పురాణానికి పట్టిన గతి పట్టివుండేది. సూరన చివరి కృతి ప్రభావతీ ప్రద్యుమ్నంలో నాటక శైలిని, మహాప్రబంధ మార్గాల రీతిని కలిపి జోడించారు. వ్యాసమిళితమైన కళాపూర్ణోదయము అద్వితీయమైన గ్రంథం. దాని అర్థాన్ని, ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలంటే విషయాన్ని తెలుసుకోవాలి. వాక్యంలో ఉన్న లోతైన అర్థాన్ని, అందలి (అభిద) మొదలైన భావాలు, అటువంటి దృష్టితోనే కావ్యంలో ఉన్న పాత్రచిత్రణల ప్రాముఖ్యతని, కవి తన కావ్యానికి పొందుపరచిన మహాకావ్యలక్షణాలని గ్రహించాల్సివుంది.
నన్నెచోడుడు కుమారసంభవంలో చేసిన ప్రయోగాలే మహాకావ్యమైన మహాభారతంలో కూడా అటువంటి ప్రయోగాలు ఉన్నాయి. వాటిని లాక్షణికుల దృష్టిలోనే వాడినట్లు (కోరాడ రామకృష్ణయ్యగారు వంటి పండితులు చెపుతున్నారు) కచ్చితంగా చెప్పలేము.  ప్రబంధమంటే కావ్యమని అలంకారిక శాస్త్రం పరిచయమైనవారికి తెలిసినదే. వామనుడు తన కావ్యాలంకార పద పట్టికలో దానిని వివరించాడు.
మహా కావ్యానికి మహా ప్రబంధము అనే అర్థవుంటే, దాన్ని ప్రత్యేకించి రుజువు చేయక్కరలేదు. అది 6వ శతాబ్దం తరవాత అలంకారికులు ఇలాంటి నిర్వచనాలు చేశారు. ఈ విషయమై స్పష్టమైన అభిప్రాయం ఏర్పరుచుకునేముందు దాని చరిత్రను తెలుసుకోవడం అవసరము. మనకు తెలిసినంతవరకు ఈ అభిప్రాయాన్ని నిర్వచించిన వారిలో భానుడు ప్రధముడు. మహాకావ్యాన్ని విశదీకరించి చెప్పడంలో,  వస్తు ప్రధానము, పాత్ర చిత్రణ, నిర్మాణము, దానికున్న ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని గురించి అతని ఉద్దేశ్యం ఇలా చెప్పవచ్చు:
“మహా కావ్యంలోని కథ పురాణ ఇతిహాసాల నుండి గ్రహించబడి, ఉత్తమ పాత్రల్ని, వాటి ఉన్నత చర్యలని వర్ణించేదిగా ఉండాలి. సుదీర్ఘమైనది, అత్యుత్తమమైన సందర్భం కలదిగా వుండాలి. అంటే సంపూర్ణతని అర్థం చేసుకోలేనంతటి పెద్దదని అర్థం కాదు. దానిలో మంత్ర, దూత, ప్రయాణం, నాయకాభ్యుదయం, యుద్ధవర్ణనలు ఉండి అభ్యుదయమై సుఖాంతం కావాలి. ఇదిలావుండగా అది లౌకిక మార్గాన్ని అనుసరించేదిగా వుండాలి. నాయకుడు కులీన వంశంవాడై, ఉత్తమ గుణ సమేతుడై, విజ్ఞానవంతుడై ఉజ్జ్వల గుణాలు కలవాడూ అయి వుండాలి. నాయకుడు అటువంటి వాడైనప్పుడు కష్టాలని అధిగమించడం కానీ, చివరికి విజయాన్ని సాధించడం కానీ సహజంగా జరుగుతుంది.
కథ సుదీర్ఘమైనప్పుడు ఆశ్వాసాలు అధ్యాయాలుగా విడగొట్టబడి, నాటకంలో లాగా మంచి సన్నిహితత్వం కలిగి వుంటుంది. అంటే నాట్యశాస్త్రం దశరూపకంలో పేర్కొనబడినట్లుగా ఇందులో ఐదు సంధులు ఉండాలి. ప్రధమ భాగంలో బీజారంభమవుతుంది. ద్వితీయ భాగంలో అస్పష్టంగా బీజఫలం కనిపిస్తుంది. తృతీయ భాగంలో బీజాభివృద్ధి, ఫలప్రాప్తి లేక అప్రాప్తి చిత్రించబడి తదుపరి ఘట్టం చిత్రింపబడుతుంది. చతుర్థ భాగంలో నిర్వహణ సంధితోపాటు ప్రయత్నము, సంఘటనల కలయిక జరిగి సుఖాంతంలో కథ పూర్తవుతుంది. నాయకుడి గొప్పతనము చూపించడానికి ప్రతి నాయకుడి శక్తి సామర్థ్యాలు, జ్ఞానము చూపించి నాయకుడిచేత అతన్ని చంపించడం ఉచితం కాదు. ప్రతి నాయకుడు కథలో ప్రాధాన్యం వహించకూడదు. విజయంలో పాల్గొని ఆనందాన్ని పొందకూడదు. అలాగే ప్రారంభంలో అతన్ని ఆకర్షణీయంగా చూపించబడకూడదు. న్యూనత కలిగించునటువంటి శబ్దాలు లేకుండా అధిక ప్రాముఖ్యత కలదిగా ఉండాలి. వక్రోక్తితో నిండి వున్న అలంకారాలతో కూడిన కథాగమనం ఉండాలి.”
మహాకావ్యం ఇవ్వవలసిన అనుభవవిషయాన్ని భామహుడు స్పష్టంగా చెప్పుకున్నట్లు లేదు. అది రామణీయకంగా ఉండాలన్నాడు కానీ, రామణీయకత లక్షణాలని గ్రహించేవిషయంలో శ్రద్ధ చూపించలేదు. ఆ కారణంచేతనేనేమో మహా కావ్యంలో ఉన్న రసాలన్ని ప్రత్యేకంగా ఉండాలని చెప్పాడు. దీనివలన ఈ రసాలే రసపదాలంకారాలని, అవి కావ్యమంతా వ్యాపించాలని స్పష్టమవుతోంది. ఈ అనుభవము పురుషార్థాలని వర్ణిస్తూనే, ప్రధానంగా అర్థం పొందడానికి సహాయపడాలని ఆనాడు ప్రత్యేకంగా చర్చించిన వారిలో రెండవవాడైన దండి, భామహుడితోపాటు మరికొన్ని విషయాలని చేర్చాడు. కావ్యవస్తువులో నగర, ఋతు, రథోత్సవము, విప్రలంభము, కుమారోదయము, వివాహము, మంత్ర, దూత, ప్రయాణాది నాయకాభ్యుదయాలని కూడా ఉంచాలి. నిర్మాణ విషయంలో చెప్పదలచిన విషయము సూచనతో ఆరంభం కావాలి.  సర్గలు, అధ్యాయాలు ఎక్కువగా గానీ, తక్కువగా గానీ విస్తీర్ణం వుండకూడదు. అందులో ఉన్న వృత్తాలతో అంతమవ్వాలి. ప్రతినాయకుడి విషయంలో పూర్వీకులతో బేధిస్తూ వారి అభిప్రాయాలని కాదని దండి ఇలా చెప్పాడు “ప్రతినాయకుడి వంశ, వీర్య, శ్రుతులు ముందు వర్ణించి, తరువాత నాయకలక్షణాలను తెలియేజేస్తే కావ్యం మనల్ని ఆకర్షిస్తుందని అనుకున్నాడు. అనుభవ స్వభావాన్ని గురించి కావ్యంలో యిష్టమొచ్చిన విధంగా పదాలు ఉండడం, గుణాల ప్రాధాన్యాన్ని చూపించడం తప్ప ఇంకేమీ చెప్పలేదు.
పైన చెప్పిన అష్టాదశ వర్ణనలలో కొన్నింటిని వదిలినా, మహాకావ్యము కాకపోతుందా? దండి చెప్పిన వాటిలో కొన్ని లోపించినా ఉత్కర్షలు పండితులచే మెప్పించబడినట్లయితే కావ్యం విలువ పోకుండా వుంటుంది.  
ఉద్భటుడు ఈ సాహిత్య రూపం జోలికి పోలేదు. కథా నిర్మాణ విషయంలో ఇతర రచనలతో పరిశీలించాల్సిందిగా వామనుడు సలహా ఇచ్చాడు. మహాకావ్యం గురించి రాసిన మొట్టమొదటి తెలుగు కవి నన్నెచోడుడు. దండి పేర్కొన్న అష్టాదశ విషయాలు ఉన్నదే కావ్యం. కవి వస్తువు, నిర్మాణం గురించి చెప్పకపోయినా నవరస భావభరిత గుణాలతో,  అలంకారాలతో కావ్యం ఆనందింపచేసిదిగా వుంటే చాలు. నన్నెచోడుని దృష్టిలో రసము, అలంకారము మధ్య సంబంధము ఉంటే చాలు.
ప్రతాపరుద్రీయకారుడైన విద్యానాధుడు కూడా ఇటువంటి కావ్య నిర్వచనం చేశాడు. అందులో అతడు కొత్తగా ఏమీ చెప్పలేదు. దండి చెప్పిన అష్టాదశ విషయ సమేతమే మహాకావ్యమని పేర్కొని, అందులో ఒకటి రెండు లేకపోయినా మహాకావ్యము కాకపోదని అంగీకరించాడు.
కావ్యాలంకార చూడామణిలో విన్నకోట పెద్దన ఈ అభిప్రాయాన్నే ప్రతిధ్వనింప చేశాడు. మహా కావ్య లక్షణాల్ని పూర్తిగా వివరాలతో పాటు చర్చించిన మరొక అలంకారికుడు విశ్వనాథుడు. మహాకావ్యంలోని వస్తువులకు సంబంధించి, మూడు సంధులు, తమము, పగలు, సంధ్య, వేట, ఋషులు, స్వర్గము, యోజనాలు కూడా దండి చెప్పిన వాటితో కూడా వుండాలని అభిప్రాయపడ్డాడు. నాయకుడు దివ్యపురుషుడు కానీ, ధీరోదాత్త క్షత్రియుడు కానీ, అయిన కులీన వంశస్థుడు కావాలి. ఒకే వంశస్థులైనటువంటి అనేకమంది రాజులు నాయకులు కావచ్చు.
కావ్య నిర్మాణంలో మొదటగా ప్రార్థనలో, సూచనలో వుండాలి. ఎప్పుడైనా చెడు నిందలతో, పొగడ్తలతోనూ ప్రారంభము కావచ్చు. సర్గలో ఏక వృత్తము వుండాలి. కావ్యం అంతలోనూ వివిధ వృత్తములో ఉన్న ఏక సర్గ ఉండచ్చు. సర్గ చివరిలో తరువాత వచ్చే సర్గ కథను సూచించాలి. కావ్యం అతి తక్కువ, అతి ఎక్కువ విస్తీర్ణం కాకపోయినా ఎనిమిది సర్గలలో వుండాలి. నాటకంలో ఉన్న సంధులన్నింటితోనూ సంపూర్ణ నిర్మాణం కలిగి మహా కావ్యం వుండాలి.
ఇంతకు ముందు పేర్కొన్న అలంకారికుల కన్న మహాకావ్యానుభవాన్ని విశ్వనాథుడు స్పష్టంగా చెప్పాడు. అలంకారాల, గుణాల, రీతుల విషయం అలా వుంచి, మహాకావ్యంలో వీర, శాంతరసాలలో ఒకటి ప్రధానంగా వుండి, మిగిలినవి ఉపాంగాలుగా ఉండాలన్నాడు. సాధారణంగా మహాకావ్యం పురుషార్థాలని సాధించడానికే ప్రయోజనకారిగా ఉన్నా ఏదో ఒక దానిని సిద్ధింప చేయడానికి తోడ్పడితే అంతే చాలు.
అలంకారికుల పై నిర్వచనాన్ని బట్టి పాఠకులకి కావ్యంపట్ల ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే 1) ఇతిహాసం నుంచి గ్రహింపబడి కానీ, కవిచే ఎన్నుకొనబడి, కథావస్తువుతో కలిగి 18 లేక 26 వస్తువులతో సుఖాంతమై వుండాలి.
2) నాయకుడు దివ్యపురుషుడుగా కానీ, ధీరోధాత్త క్షత్రియుడుగా కానీ వుండాలి. అనేక పాత్రలకు సమాన ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చినట్లయితే వాళ్లందరూ ఒకే కులీన రాజ వంశస్థులై ఉండాలి.
3) ఆశీర్వాదం, సూచితం, చెడు నింద, మంచి స్తుతితో ఆరంభమైన కావ్యంలో 8 సర్గలుండి ఎక్కువ విస్తీర్ణం కానీ, తక్కువ విస్తీర్ణం కానీ వుండరాదు. రానున్నటువంటి సర్గలో కథను  సూచితప్రాయంగా చెప్పాలి. నిర్మాణమంతా ఐదు సంధులతో నిర్మాణం వుండాలి.
4) వీర, శృంగార, శాంతరసాలలో ఒకటి ప్రధానంగా వుండి మిగిలినవి ఉపాంగాలుగా ఉండాలి. అది పురుషార్థాల నాలుగింటిని కానీ, ఏదో ఒక దానిని కానీ గుర్తింపచేయడానికి తోడ్పడాలి.
మహాకావ్య లక్షణాలుగా చెప్పబడినవాటిమీద ఆధునికులకు అనేక సందేహాలు వస్తాయి. అలంకారశాస్త్రంలో చెప్పిన ఇరవై ఆరు వస్తువులు తప్ప గ్రామాల వర్ణనలు ఎందుకుండకూడదు? ‘గొప్పదనం, ఔన్నత్యం రాజుల గుత్తసొమ్మా?’ కావ్యము సూటిగా కథతో ఎందుకు ప్రారంభించబడకూడదు. అష్టసర్గలు లేనంత మాత్రం చేత, వివిధ వృత్తాలు ఉన్నంత మాత్రం చేత మహాకావ్యం కాకుండా పోతుందా? ‘మూడు రసాలే ప్రధానాలై ఇతరాలెందుకు కాకూడదు? కరుణ రస ప్రధానమైన రామాయణము మహాకావ్యం కాదా?’. ఈ దృష్టితో పరిశీలించినట్లయితే అలంకారికులచేత చెప్పబడిన కావ్య లక్షణాలు కేవలం పరంపరానుగతాలని, నిరంకుశాలని, రామణీయకతావశ్యతను గాని, కళాత్మక సృష్టిని గానీ గమనించలేదని తెలియటం లేదా?
ఈ ప్రశ్నలన్నింటికి పూర్తి సమాధానం చెప్పడానికి ప్రత్యేక గ్రంథం అవసరం. మహాకావ్యంగా కళాపూర్ణోదయాన్ని పరిశీలించే విషయంలో పై ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి.
మహాకావ్యంలో ఒకే భావము, ఒకటే స్థితి, జీవితానికి సంబంధించిన ముఖ్యభాగం పరిశీలించడం, ఉద్దేశం, ఆలోచనలతోనే స్వయంపూర్ణం, స్వయంభూతమై విశాలమైన అనుభవంతో చర్చించాలి. అప్పుడే అది విస్తీర్ణంలో, గుణంలో, ఔన్నత్యం కలదిగా వుంటుంది. మహతాం మహర్ష అనే భామహుని పదప్రయోగము వలన ఇది స్పష్టము చేయబడింది. శృంగార, వీర, కరుణ, శాంతరసాలు ప్రధానమైనప్పుడే దీనిని పొందడానికి సాధ్యమవుతుంది కాని వేరే విధంగా కాదు. ఈ విషయంలో డాక్టర్ కె.సి.పాండే అన్నమాటలివి. ప్రధానమైన మనోవృత్తుల వలన, పురుషార్థాలకి మార్గం చూపిస్తుంది కాబట్టి ఈ రసాలు ప్రధానాలు. శృంగారానికి రతి స్థాయీభావమయి, కామానికి తరువాత ధర్మార్థాలకి తీసుకుపోతుంది. క్రోధం నుంచి రౌద్రం మొదలై అర్థానికి దారితీస్తుంది. వీరం ఉత్సాహం మీద ఆధారపడి ధర్మార్ధాలని చూపిస్తుంది. శాంతము తత్త్వజ్ఞానం మీద ఆధారపడి మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి ఈ చతురార్ధాలు ప్రధానాలు. సందర్భవశంలో వీటిల్లో ద్వితీయస్థానం ఆక్రమించి ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కటి ప్రత్యేక ప్రాధాన్యత వహించిన నాటకములు లేకపోలేదు. రసాలు స్వతంత్రంగా కాక రతి భాగాలుగానే పురుషార్ధాలని సాధించడానికి సహకరించడం వలన ఆ ప్రాధాన్యతని వహిస్తాయి.
ఈ అభిప్రాయం అభినవ గుప్తుడి నాట్యశాస్త్ర వ్యాఖ్యానంపై ఆధారపడి ఉంది.
భారత అలంకారిక సంప్రదాయం దీనిని సమర్థించింది. అది రామణీయకతానుభవముతో పురుషార్థాల ప్రాప్తికి తోడ్పడుతుంది. కాని శాంతానికి బదులు ప్రధాన రసాల పట్టికలో రౌద్రాన్ని చేర్చడం వింత. కావ్యానుభవం పురుషార్థాల ప్రాప్తికి తోడ్పడుతుందని అంగీకరించినప్పటికీ, శాంతిరసాన్ని ఎందుకు ప్రధాన పట్టిక నుండి తొలగించాలి అనేది ప్రశ్నార్థకము. శృంగార, వీర, రౌద్ర, శాంత రసాలకన్నకరుణరసం ఎలా అనర్హం. జగత్తులో ప్రధానమైన ఇతిహాసాలన్నీ కరుణ రసప్రధానాలనేవి చారిత్రక సత్యం.
అది పురుషార్ధాలను పొందడానికి తోడ్పడిందని, రామాయణాన్ని మహా కావ్యాల పట్టిక నుంచి తొలగించాలి. అటువంటి స్థితి అసంభవము కాబట్టి, కరుణ రసాన్ని కూడా ప్రధాన రసంగా పరిగణించాలి.
అయితే విశ్వనాథుడు ఎందుకు శృంగార, వీర, శాంతరసాలలో ఒకటి మాత్రమే ప్రధానంగా వుండాలని చెప్పాడనే ప్రశ్న మొదలవుతుంది. ఎలా చూసినప్పటికి ప్రతి దానికీ కారణం వుండాలి. అది కనుక్కోవడం అంత కష్టం కాదు. భామహుడు, దండి ప్రత్యేకంగా మహాకావ్య కథ సుఖాంతం కావాలని పేర్కొన్నారు. దీనివలన, విశ్వనాథుడు కరుణరసాన్ని ప్రధాన రసాల పట్టిక నుంచి తొలగించి వుండవచ్చు. రౌద్రాన్ని వదలడానికి అది ఇతర రసములంత సంపూర్ణం కాకపోవడమే. ఒకే రసము ప్రధానమై ఇతర రసాలు ఉపరసాలుగా ఎందుకుండాలనేది సులభంగా చెప్పచ్చు. కావ్యం సంపూర్ణ అంగ నిర్మాణం కలదై వుండడానికి రసాల ఐక్యత అవసరము. అలాకాకపోతే కథామాలికలాగానో, అసంప్రజ్ఞాజనితం వలె కనిపిస్తుంది. రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో అపరాజితాభిప్రాయంగా ఇలా చెప్పాడు “నదులు, పర్వతములు, సాగరాలు, నగరాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైనవాటిని గురించి చేసే వర్ణన కవి శక్తిని, ఖ్యాతిని సూచిస్తుందే కాని, నిష్ఫలము, సంస్కృతీపరులకు అది మనోరంజకము కాదు. ” మహాకావ్యం వస్తు ప్రాధాన్యతను చెడగొట్టకుండా సాధ్యమైనటువంటి విశాల అనుభవాన్ని చూపించాలి. ఆనాటి గద్యం కావ్యంలో అత్యంత ప్రాధాన్యత వహించినప్పటికీ శబ్ద చిత్రణ నుండి వైదొలగలేదు. రాచరిక కాలం నాటి విశాల అనుభవం చూపించాలంటే, నగర మార్గాలు ఆనాటి గద్యము కావ్యాలలో అత్యంత ప్రాధాన్యం వహించినప్పటికీ శబ్ద చిత్రణ నుంచి తొలగిపోలేదు. రాచరిక కాలంనాటి విశాల అనుభవం చూపించాలంటే నగర మార్గాలు, మంత్ర, ప్రయాణ, యుద్ధ రాజ ఔన్నత్యాలను వర్ణించటం, మహాకావ్యం కేవలం కథతోకూడుకున్నదిగా వుండి, అలంకారికులచేత పేర్కొనబడినటువంటి వస్తు వర్ణనలపై ఆధారపడక తప్పదు.  కాబట్టి రాచరిక మహాకావ్యం అన్నిటినీ కాకపోయినా, అధిక సంఖ్యాక వస్తువులని వర్ణించేది. మహాకావ్యం విశాల అనుభవము, ఫలము ఇవ్వబడేటట్లుగా చిత్రించడం వారి మనోభావమవుతుంది. అయితే పైన చెప్పబడిన వాటిని గుర్తించక పోయినా మహాకావ్యం అవుతుంది.
తరవాత నాయకుడు ప్రధానం. అలంకారికతను అనుసరించి నాయకుడు దివ్యపురుషుడు కాని, ధీరోదాత్త లక్షణాలున్నవాడు కాని, కావాలి. సరిగ్గా అర్థం జేసుకున్నట్లయితే, ఈ లక్షణం సరైనది కాదు. గట్టిగా చూసినట్లయితే సామాన్య, హీన వంశాలలో ఉన్నత వ్యక్తి పుట్టడనేది దీని అర్థం. చరిత్ర, ముఖ్యంగా ఆధునిక చరిత్ర, దీనిక వ్యతిరేకంగా ఉన్నది. శృంగార, వీర, కరుణ, శాంత రసాలు ప్రధానమైనవి. కాబట్టి నాయకుడికి ధీరోదాత్త లక్షణాన్ని సులభంగా త్రోసిపుచ్చడం కష్టం. అలంకారికులు నాయకుడు రాజవంశస్థుడు కావాలని ఎందుకు నొక్కిచెప్పారు? దీనికి సమాధానంగా, వారికి భారతీయ తత్వంలో ఉన్న వర్ణాశ్రమ ధర్మాలపట్ల నమ్మకమే.
కావ్య విస్తీర్ణానికి సంబంధించి, విశ్వనాథుడు ఒక్కడే 8 సర్గలకు మించి ఉండాలని చెప్పేవాడు. దేని ఆధారంగా యిటువంటి నిర్ణయం చేసాడో తెలియదు. సంధులన్నింటితోనూ, మహాకావ్యాన్ని 5 లేక 3 సర్గలలోనే పూర్తి చేయచ్చు. అటువంటి కావ్యాన్ని సర్గల సంఖ్య వల్లే  తృణీకరించడం అపహాస్యం. ఈ సందర్భంగా నాటకానికి పెట్టిన తక్కువ సంఖ్య ఐదు అంకాలు. మహా కావ్యం నాటకంలాగా కథా సంవిధానంతో కూడి అక్కడక్కడ వర్ణనలు కలిగి వుండడం, ఆ వర్ణనలకి విస్తీర్ణం కావలసి రావడం, ఈ కారణంగా విశ్వనాథుడు కావ్యానికి నవసర్గలు కనీస సంఖ్యగా నిర్ణయించాడా? ఈ నిర్దేశమును నిరంకుశము తృణీకరించడానికి వీలుకాదు. విస్తీర్ణత విషయమై అరిస్టోటిల్ తన ‘పొయిటిక్స్’ లో  పేర్కొన్నాడు.
(సాంకేతికపరమైన అధ్యాయాన్ని ఇక్కడ నేను పొందుపరచలేదు - అనువాదకుడు)

కళాపూర్ణోదయం
(పిహెచ్.డి. సిద్ధాంత వ్యాసం)
డాక్టర్ జి.వి. కృష్ణారావు

Dr G V Krishnarao