Secularist Humanist A B Shah

భారత మానవవాద, సెక్యులర్ ఉద్యమంలో ఎం.ఎన్.రాయ్ అనుచరుడుగా కీలక పాత్ర వహించాడు. 1964లో ఆయనతో నాకు పరిచయంకాగా, అత్యంత సన్నిహితులమై మా మిత్రత్వాన్ని కొనసాగించాం. 1982లో ఆయన చనిపోవడం వుద్యమానికి చాలా దెబ్బ తగిలింది.

1966లో అవనిగడ్డ గ్రామంలో (కృష్ణాజిల్లా), 5 రోజుల మానవవాద శిక్షణా శిబిరం సాగింది.

కోనేరు కుటుంబరావు నిర్వహించిన ఆ శిబిరం ఎంతో ఉపయోగకారిగా ఉన్నది. ఎ.బి.షా అన్ని రోజులు వుండి, శ్రద్ధగా పాల్గొని, చర్చలు బాగా నడిపించి, తెలుగు ప్రసంగాల సారాంశాన్ని ఇంగ్లీషులో చెప్పించుకొని, అందరికీ ప్రోత్సాహకారిగా వున్నారు. అది మంచి అనుభవం.

ఆవుల గోపాలకృష్ణ మూర్తి, అధ్యయన తరగతుల, ప్రిన్సిపాల్. ఆయన తెలుగులో మట్లాడి అవసరమైన మేరకు ఎ.బి.షా.కు ఇంగ్లీషులో చెప్పేవారు. శిబిరంలో పాల్గొన్న వారిలో రావిపూడి వెంకటాద్రి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఎన్.వి.బ్రహ్మం ప్రసంగాలు సారాంశం ఇంగ్లీషులో విని, అందులో పలుకు వున్నదని ఎ.బి.షా వారిని ప్రోత్సహించారు.

మల్లాది రామమూర్తి, జి.వి.కృష్ణారావు, కల్లూరి బసవేశ్వరరావు, మేకా చక్రపాణి సి.హెచ్.రాజారెడ్డి, ఎం.వి. రమణయ్య, త్రిపురనేని గోకుల్.చంద్, బచ్చు వెంకటేశ్వర్లు, గవిని వెంకటస్వామి వచ్చి పాల్గొన్నారు.

నేను ఎబిషాకు తోడుగా వుండేవాడిని. కాంప్.లో పాల్గొన్నవారిలో చాలా మంది షాకు కంపెనీ ఇవ్వగలవారు కాదు. అంటే సమావేశానంతరం యిష్ఠాగోష్ఠి కబుర్లు, కొద్దిగా ఔపోశన పట్టడం, (2 పెగ్గులే అనుకోండి) వుండేవి. ఎ.బి.షా. పైప్ తాగేవారు. రావిపూడి వెంకటాద్రి చుట్ట తాగేవారు.

మండవ శ్రీరామమూర్తి మాకు చేదోడుగా కాంప్ విజయానికి ఎంతో కృషి చేశారు. కుటుంబరావు ఏర్పాట్లు, అతిథ్యం చాలా మెచ్చుకోదగినవి. అదొక సఫలమైన స్టడీకాంప్.

ఎ.బి.షా. అనేక పర్యాయాలు నా ఆహ్వానంపై ఆంధ్ర పర్యటన చేశారు. ఎ.బి.కె.తో సన్నిహితులయ్యారు. ఆయన గుండె పోటుతో మంచంలో వుండగా (1967), మేమిరువురం వెళ్ళి, చేతిలో చేయ వేయించుకొని, మద్రాసు వెళ్ళి చికిత్స చేయించుకోమన్నాం. కాని అది జరగక ముందే మరోసారి గుండెపోటుతో అయన చనిపోవడం దారుణంగా జరిగింది.

ఎ.బి.షాను గుంటూరు విజయవాడ హైదరాబాద్ తీసుకు వెళ్ళి వివిధ సభలు పెట్టించాను. కోర్టు న్యాయవాదుల సభలో ప్రసంగాలు చేశారు. ఎ.సి.కె. కాలేజీలో పెద్ద సమావేశంలో ఆయన ప్రసంగం గొప్పగా అభినందించారు. ఎలవర్తి రోశయ్య తెగ మెచ్చుకున్నారు. ఆయనకు ఒక పట్టాన ఎవరి ప్రసంగం నచ్చేదికాదు. ఎ.బి.షా ప్రసంగం ఆద్భుతం అన్నారు. హైదరాబాద్.లో ముస్లిం, హిందూ సంఘాలతో సెక్యులరిజంపై కీలక సమావేశాలు జరిపించాం. ఆలంఖుంద్ మిరి బాగా సహకరించారు.

ఎ.బి.షాతో కలసి నాటి వైస్ ఛాన్సలర్ డి.ఎస్.రెడ్డిని కలసి విందు ఆరగించాం. ఆ తరువాత వైస్ ఛాన్సలర్ నరోత్తమ రెడ్డితో వియ్యమందడానికి ముందు, వివరాలకోసం నా ద్వారా ఆరా తీసాడు. పెళ్ళి అయిన తరువాత, ఎ.బి.షా కుమార్తె, నరోత్తమ రెడ్డి కుమారుడు పెళ్ళి ఉత్తరోత్తరా విఫలమైంది.

ఆలపాటి రవీంద్రనాథ్, వి.ఆర్.నార్లతో షాను పరియం చేశాను.

అప్పట్లో ఎ.బి.షా నచికేత ప్రచురణలు పేరిట కొన్ని మంచి పుస్తకాలు వెలుగులోకి తెచ్చారు. ప్రతి సెమినార్ నుండి ఒక పుస్తకం వచ్చేది. వాటిని అమ్మితే సగం అట్టి పెట్టుకొని, మిగిలింది తనకు పంపమనేవాడు. అలా మానవవాద సాహిత్యం అమ్మాం. తెనాలిలో గురిజాల సీతారామయ్య, విజయవాడలో కోనేరు కుటుంబరావు సహకరించారు. ఎ.బి.షా వ్యాసాలు, సైంటిఫిక్ మెథడ్ పుస్తకం తెలుగులోకి అనువదించాను. విజయవాడలో అనుపమ ప్రచురణల వారు వ్యాసాల పుస్తకం ఆవిష్కరించారు. కొత్త సచ్చిదానందమూర్తి మాట్లాడారు.

రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక సంపాదక వర్గంలో ఎ.బి.షా వుండేవారు. తరువాత క్వెస్ట్ పత్రికను న్యూ క్వెస్ట్గా, అది కూడా బాగా నిర్వహించారు. సెక్యులర్ సొసైటీ స్థాపించి ది సెక్యులరిస్ట్ పత్రిక నడిపారు. పూరి శంకరాచార్యను వేదాలలో హిందువులు గోమాంస భక్షణ చేశారనే విషయమై ఛాలెంజ్ చేశారు. తర్కతీర్థ లక్ష్మణ శాస్త్రి బాగా సహకరించారు. ఎం.పి.రేగే సహకారంతో న్యూక్వెస్ట్ పత్రిక నడిపారు. దిలీప్ చిత్రే కొన్నాళ్ళు సంపాదకులుగా ఉన్నారు.

ఎం.ఎన్.రాయ్ మానవ వాద సూత్రాలను పరిష్కరించి ఆధునిక శాస్త్రం ప్రకారం మార్గాంతరాలు ప్రవేశ పెట్టారు. వేద ప్రమాణంగా రాయ్ సూత్రాలను స్వీకరించడం సరికాదన్నాడు. శిబ్.రే ఆయనతో ఒప్పుకోగా, వి.ఎం. తార్కుండే పేలవంగా రాయ్.ను కోపు వేసుకున్నారు.

ఫిలసాఫికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మోడరన్ సైన్స్ ప్రతిని ఆయన ద్వారా నేను చదివాను. అది ఎడిట్ చేసి ప్రచురించక ముందే ఎ.బి.షా చనిపోయారు.

షా రచనలు చాలా పద్ధతిగా శాస్త్రీయంగా వుంటాయి.

1978లో ఆమెరికాలో గార్డన్ స్టయిన్ నుండి నాకో ఉత్తరం వచ్చింది. భారత దేశంలో మానవవాద, హేతువాద సెక్యులర్ ఉద్యమాల గురించి రాయమని సారాంశం. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ అన్ బిలీఫ్ అనే గ్రంథానికి రాయమన్నారు. ఎ.బి.షా నా పేరు సూచించాడన్నారు. ఒప్పుకొని రాశాను. ఉత్తరోత్తరా గార్డన్ స్టెయిన్.ను కలిశాను. అతడు ప్రచురణ అనంతరం కేన్సర్.తో చనిపోయాడు.

ఎ.బి.షా ద్వారా కొందరు విద్యావేత్తలు పరిచయమయ్యారు. వారిలో వి.వి. జాన్, జె.బి.నాయక్, అమృక్ సింగ్ ప్రముఖులు.

ఎ.బి.షా. గుజరాత్.లో దిగంబర జైన కుటుంబంలో పుట్టి, ఎం.ఎన్.రాయ్ ప్రభావంతో మానవాదిగా మారాడు. మహరాష్ట్రకు వచ్చి పూనా, బొంబాయిలో స్థిర పడ్డారు. ఎమర్జెన్సీలో జయప్రకాశ్ నారాయణ్ పక్షాన నిలిచారు.

వి.కె.సిన్హా నేడు సెక్యులరిస్ట్ పత్రిక నడుపుతున్నారు. ఆయన ఎ.బి.షా శిష్యుడు. బి.ఎ.వి. శర్మ కూడా షా అనుచరుడుగా వుంటూ, బొంబాయి నుండి హైదరాబాద్ వచ్చి, చాలాకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ చనిపోయారు. ఆయన కూడా సెక్యులర్ వుద్యమంలో మేథావిగా పనిచేశారు. అలాంటి వారిలో శ్రీనివాసన్, ప్రభాకర్ పాఢీ ఉన్నారు.

మహారాష్ట్రలో సత్య శోధక్ మండలి పెట్టి, హమీద్ దల్వాయ్.ను పైకి తెచ్చిన వారు ఎబిషా. దిలీప్ చిత్రే అనువాదాల వలన హమీద్ రచనలు ఇంగ్లీషులో రాగా, ముస్లిం పాలిటిక్స్ అనేది నేను తెలుగు చేసి ప్రసారితలో ప్రచురించాను.

భవనం వెంకట్రాం ముఖ్యమంత్రిగా, విద్యామంత్రిగా వుండగా ఎ.బి.షాను పరిచయం చేశాను. ఇరువురూ భావసారూప్యతతో మిత్రులయ్యారు. ఎడ్వర్డ్ షిల్స్, షికాగో నుండి మినర్వా పత్రిక నడిపారు. అది నమూనాగా ఎబిషా హ్యూమనిస్ట్ వే అనే పత్రికను కొద్దికాలం నడిపారు. జి.డి. పరేఖ్.తో సన్నిహిత మిత్రత్వంగల ఎబిషా, ఆయన రచనలు కొన్ని ప్రచురించారు. క్రిటిక్ ఆఫ్ హిందూయిజం, తిలక్.పై వ్యాసాలు, హ్యూమనిస్ట్ వేలో వచ్చాయి. 8 సంచికలతోనే అది ఆగింది.

హైదరాబాద్ లో వై.ఎం.సి.ఎ.లో ఒక సెమినార్ కోసం ఎ.బి.షా వచ్చారు. నారాయణ గూడా తాజ్.మహల్ హోటల్.లో వున్నారు. సెమినార్ సమయానికి టాక్సీ పిలిపించమన్నారు. వై.ఎం.సి.ఎ. ఫర్లాంగ్ దూరాన వున్నది. అయినా ఎందుకు టాక్సీ కావాలన్నారో తెలియలేదు. ఆ తరువాత గాని నాకు జ్ఞానోదయం కాలేదు. సాయంత్రం పక్కనే షాకు తెలిసిన డాక్టర్లు వుండగా అక్కడకు తీసుకెళ్ళాం. గుండెకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. పూనా రైలులో వెళ్ళి పరీక్షలు చేయించుకుని చికిత్స పొందారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రషీదుద్దీన్.ఖాన్, వై. రాఘవయ్య, జి.రాంరెడ్డి, కె.శేషాద్రి పి.వి.రాజగోపాల్ మొదలైన వారిని షాకు పరిచయం చేశాను. ఆయన మేథస్సును గుర్తించారు.

గాంధీ నెహ్రూలపై షా ప్రచురించిన పుస్తకాలు సెమినార్ల ఫలితమే. ఆయన రచనల్లో సైంటిఫిక్ మెథడ్, ట్రెడిషన్ అండ్ మోడర్.నిటి, ఛాలెంజెస్ టు సెక్యులరిజం. పేర్కొనదగినవి. అశ్లీలం అంటే ఏమిటనే చర్చ జరిపి ఒక గ్రంథం తెచ్చారు.


--

No comments:

Post a Comment