రాజకీయాలు -అధికారం- పార్టీలు
పార్టీ నుంచి ఉద్యమానికి*
ఎమ్.ఎన్.రాయ్
మానవజాతికి మానవుడే మూలం, అని కార్ల్ మార్క్స్, నిర్లక్ష్య చిత్త ప్రవృత్తిలో వున్న సందర్భాలలో చెప్పాడు. ఇది వినిపించేటంత స్పష్టంగా బహుశ, ప్రోటాగోరస్, మానవుడే అన్నింటికీ కొలమానం అని చెప్పాడు గదా, దానికి మించి ఒక కొత్త సూత్రాన్నిరూపొందిద్దామనే ప్రయత్నంలో మార్క్స్ ఇలా అని ఉండవచ్చు. పందొమ్మిదో శతాబ్దంలో, తాత్విక రాడికల్స్ కి చెందిన ప్రయోజనాత్మక వాదానికి, నాడు గ్రీకుల తర్క సిద్ధాంతం (సోఫిస్ట్) ఆధారం అయింది. బూర్జువా సిద్ధాంతవాదులంటూ మార్క్స్ వారిని ఖండించారు. అయితే సాంఘిక న్యాయానికి శక్తివంతమైన ప్రవక్త కాలేదని మార్క్స్, మానవతా సంప్రదాయాన్ని మాత్రం వదిలేశాడు. తన భావ సంపదను విచక్షణతో కూడిందని రుజువు చేసేందుకు తన భావన కలుషితం కానిదని చూపటం కోసమో, ప్రాచీన మానవతావాద సూత్రంలోని దోషాన్ని నిరాకరించటానికి ప్రయత్నించాడు. వ్యూయర్ బాహ్ చెప్పిన ఆధునిక మానవతావాదాన్ని మార్క్స అభిలషించాడు. కమ్యూనిజం వైపుకు పయనించటంలో మార్క్స్ ఇక్కడే కొంతవరకూ మార్మికంగా ఉన్న సిద్ధాంతాన్ని విమర్శించాడు.
గందరగోళంగానూ, స్వప్న జగత్తులోనూ మానవతావాదిగా మార్క్స్ పయనించటం ఆరంభించి, శతాబ్దం దాటిపోయింది. ఈ వంద సంవత్సరాలలో ఆధునిక నాగరికత మానవతా సంప్రదాయానికి దూరంగా జరిగి అనేక సమష్టి వాద ఆదర్శాలను ఆచరించి చూచింది. అవన్నీ ఎండమావులని రుజువయింది. ఇటీవల అన్నిటికీ మూలమైన మానవుని తిరగదోడే ధోరణి కనిపిస్తున్నది. మానవతావాదం మళ్ళీ రావాలని ఉద్యమిస్తున్నారు. ఆధునిక నాగరికతలో వెనుకబడిన దశకు చెందిన భారతదేశం. కనక కొత్త ఆలోచన ఉద్యమాల ప్రతిధ్వని చాలా కాలాయాపన తరవాత గాని ఈ దేశానికి చేరదు. హ్యూమనిస్టు ఉద్యమాన్ని తిరగదోడాలనే ప్రభావం కూడా దేశంలో ఇంకా గాఢంగా ప్రబల లేదు. పేలవమైన ప్రతిధ్వని మాత్రమే మనవరకూ వచ్చింది. నవ్య మానవతావాదం, రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమ భావాలు ఈ ప్రతిధ్వని ప్రకంపనాలే.
రెండో ప్రపంచ యుద్ధానంతరం మానవతావాదాన్ని తిరగదోడాలనే స్పష్టమైన ధోరణి ఐరోపా మేదావులలో వచ్చింది. అయితే ఈ ఉద్యమంలో పరస్పర విరుద్ధ లక్షణాలవల్ల కొన్ని బాధలు ఎదురవతున్నాయి. మానవతా వాదాన్ని మత ప్రాతిపదికగా తిరగదోడాలని కొన్ని ధోరణులు కనిపించాయి. ఈ ఉద్యమానికి జాక్ మారిటన్ అనే ఫ్రెంచి తత్వవేత్త నాయకుడు. క్రైస్తవ మతాన్నుంచి ఉత్తేజాన్ని పొంది మానవతా వాద ఉద్యమాన్ని తిరగదోడాలని ఆయన ఉద్దేశ్యం. అయితే ఆధునిక నాగరికతకు చెందిన మానవతా సంప్రదాయం పునర్వికాసం నుంచి జనించింది. అంటే దేవునికీ, మత వ్యవస్థకూ తిరుగుబాటుగా వచ్చిన చారిత్రక సత్యాన్ని ఫ్రెంచి తత్వవేత్త ధోరణి విస్మరించటం జరిగింది.
మారిటన్ చెప్పే నవ్య మత పాండిత్యవాద స్థాయికి పోకుండానే, మానవతావాదాన్ని తిరగదోడాలనేవారూ ఉన్నారు. దేవుడు లేకుండానే మతాన్నీ, దైవ సాక్షాత్కారం లేకుండానే క్రైస్తవ ధోరణులను తిరగదోడి 18వ శతాబ్దంలోని మానవతావాద సహజమత ధోరణులను పునరుద్ధరించారని వీరి సంకల్పం. పెద్ద మతాలన్నీ, తొలుత ఒక విధంగా మానవతా ఉద్యమాలే. కాని అలౌకికతలో నమ్మకంవలన అవి వేరే దారిలో పయనించాయి. మతం ఎన్నో అలంకార తొడుగులను వేసుకోవచ్చు. దేవునికిచ్చిన మానవ రూపాన్ని వదిలేసి, నిరాకార విశ్వచైతన్యమంటూ దైవాన్ని చిత్రించవచ్చు. ఏమైనా అలౌకికతలో ఆధారం ఉంటే తప్ప మతం నిలబడదు. మానవతావాదానికి తొలి ప్రాధాన్యత మానవుడే. మానవుడే ప్రారంభం, అంతం కూడా. మానవుడి కంటే మించినదేదో ఉన్నదనే నమ్మకాన్ని మానవతావాదం అంగీకరించదు.
గతంలో మానవతావాద లోపం అలా ఉండగా, కాలానుగుణంగా అదొక ఉద్వేగ సిద్ధాంతమంటూ అపఖ్యాతిపాలు చేశారు. పునర్వికాస కాలంలోని సహజ మానవతా వాదం కూడా లోపంతో కూడినదే. దేవుడిమీద తెలిసో, తెలియకో మావుడు చేసిన తిరుగుబాటుకు ప్రాతినిధ్యం వహిస్తూనే మానవుడంటే ఏమిటో చెప్పలేకపోయింది. దేవునిమీద నమ్మకానికి బదులు మానవునిలో నమ్మకం ఉంచారు. నమ్మకానికి మానవుడు ఒక వస్తువుగా తోడ్పడ్డాడు. అంతేగాని జ్ఞానానికి ఒక వస్తువుగా మాత్రం కాదు. సింహాసనం మీదనుంచి దేవుణ్ణి తోసివేసి మానవుణ్ణి కూర్చోబెట్టారు. మానవుడంటే ఒక మార్మిక విషయంగా, దైవంలో నమ్మకం వల్ల రాబట్టిన ఆత్మ అనే అతి భౌతిక భావనకు భిన్నం కాదనీ అనిపించారు.
తొలుత ఉన్న మతపరమైన మానవ తావాదం కంటే, పునర్వికాసకాలంలోని సహజ మానవతావాదం అభివృద్ధి చెందినదే. అయితే మార్మిక లక్షణాల వల్ల మానవుడి ఉనికి, చైతన్యతలను భౌతిక ప్రపంచం దృష్ట్యా చూడకపోవటం వల్ల సంతృప్తికరమైన సమాధానం రాలేదు. 17వ శతాబ్దంలోని వివేచనావాదం తెచ్చిపెట్టిన సంశయాలతో పరిశీలించినప్పుడు, మానవతావాదం చరిత్ర గర్భంలోకి తోసివేయబడింది. మళ్ళీ, ప్యూయర్ బాహ్ లో కొత్తగా మానవతావాదానికి జీవం వచ్చింది. అందులో సహజ సంప్రదాయంతోపాటు మార్మికత కూడా ఉన్నది. అతడు హెగెల్ శిష్యుడు కార్ల్ మార్క్స్ కు భావరంగంలో పితామహుడు.
క్రైస్తవ మతాన్ని ప్యూయర్ బాహ్ చీల్చి, చెండాడుతూ విమర్శించాడు. అది అన్ని మతాలకూ వర్తిస్తుంది. మానవుని ఉహనుంచే దేవుని సృష్టి జరిగిందనీ, అయినప్పటికీ మానవుని నిర్వచించకుండా, మార్మిక విషయంగా, కొత్త విశ్వాసానికి ఆధారంగా వదిలేసారనీ చూపుతున్నది.
శతాబ్దాలుగా జరిగిన మానవ ప్రయత్నమంతా ఒక దశను చేరుకొన్నది. ఇది పూర్తి గావించటానికి, మానవుని స్వేచ్ఛాపరునిగ గావించటానికి, మానవుడంటే ఏమిటి? అనేది వివరించవలసి ఉన్నది. ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆధునిక విజ్ఞానం చూపుతున్నది. ప్రత్యేకంగా సృష్టి జరిగిందనే పవిత్ర సిద్ధాంతానికి భిన్నమతాలు విభిన్న రీతులలో తోడ్పడుతున్నాయి. పందొమ్మిదో శతాబ్దపు తొలిదశలో ఈ సిద్ధాంతానికి చావుదెబ్బ తగిలింది. భూగర్భ పరిశోధనల వల్ల చిరకాలంగా భూమిమీద ప్రాణి ఉన్నదని తేలింది. ఆధునిక జీవశాస్త్రం పుట్టడానికి ఈ విషయాలు ఆధారంగా నిలిచాయి. ఏభై సంవత్సరాలు తిరగకముందే డార్విన్, జీవుల పుట్టుపూర్వోత్తరాల గురించి, మానవుని పరిణామాల గురించి విప్లవాత్మకమైన విషయాలను కనుక్కొన్నాడు. ప్రకృతి పొరలలో జీవ పరిణామాన్ని చూసిన అనంతరం, జంతుజాలంలో మానవుడి ఆదిమ దశను తెలుసుకొన్న తరవాత, మానవుని గురించి మర్మం అంటూ లేకుండా పోయింది. దేవుడు తన ఇచ్ఛకు అనుగుణంగా ప్రవర్తించే రీతిలో మానవుని సృష్టించాడనే సిద్ధాంతానికి అర్థం లేకుండా పోయింది.
ఆ దశలో కార్ల్ మార్క్స్ వచ్చి ఫ్యూయర్ బాహ్ మీద కొంతవరకూ సరైన విమర్శ చేశాడు. కాని ఫ్యూయర్ బాహ్ కంటే మెరుగుగా చెప్పేబదులు మానవతావాదాన్ని చాలాకాలం తలెత్తకుండా పాతివేశాడు. ఫ్యూయర్ బాహ్ తత్వంలో ఉన్న లోపాన్ని గ్రహించి సరిదిద్దటానికి మార్క్స్ ప్రయత్నించాడు. మానవుడు సంఘజీవి అనీ, వ్యక్తి ఉనికీ, చైతన్యత సంఘంలో ఉంటాయనీ అన్నాడు. ఫ్యూయరం బాహ్ కంటే మెరుగ్గా చెప్పదలచి, చివరకు వ్యక్తిని సమష్టి వాదంతో కూడిన సమాజంలో ముంచేశాడు. అయినప్పటికీ మానవతావాదిగానే మార్క్స్ ప్రారంభించాడు. వ్యక్తి అభివృద్ధి చెందటం అంటే అందరూ అభివృద్ధి చెందటమంటే ప్రాచీనమైన భావనను మార్క్స్ అనుసరించాడు. ఆధునిక నాగరికతలోని మానవతా సంప్రదాయం చాలా దృఢమైనది కావటంతో, ప్రవక్తగా సంస్కరించాలనే మార్క్స్ గూడా ఈ విషయాన్ని అశ్రద్ధ చేయలేకపోయాడు. మానవునికి సంబంధించిన మార్మిక భావనను సరిగానే తృణీకరించినప్పటికీ, తన ఆదర్శానికి వ్యతిరేకంగా పయనించాడు. మానవుడు సామాజిక జీవి. ఏకాకిగా మానవుని ఉనికి, చైతన్యం ఉండవు. కనక మానవుడి వివేచన కోసం సామాజిక పునర్నిర్మాణం జరగాలని హెగెల్ శిష్యుడుగా వాదించాడు. దారితప్పిన కమ్యూనిస్టు ఊహాదర్శం కొత్త మతం అయింది. పాత దేవుడిస్థానే ఊహించుకున్న సమష్టిత్వం వచ్చి పడింది. సాంఘిక ప్రగతి, సామాజిక ఆవశ్యకత అంటూ నామకరణం చేశాడు. వ్యక్తిని ఈ దేవతకు బలి ఇవ్వటం ప్రారంభించాడు. వ్యక్తిగా మానవుడు తన స్వేచ్ఛను సమర్పించుకొంటే, అది సమష్టిత్వంలో మళ్ళీ వస్తుందన్నారు. కొత్త సిద్ధాంతం అట్లా తిప్పికొట్టింది. 17వ శతాబ్దంలో పెంపొందిన ఆధునిక రాజకీయ సిద్ధాంతాలన్నీ వ్యక్తితో ప్రారంభించాయి. సమాజానికి మూలం ఏమిటి అనేది సమస్య అయింది. పౌరులకు చెందిన సమాజాన్ని ఎవరు స్థాపించారు… దీనికి మూలం ఏమిటో తెలిస్తే ఆధునిక రాజకీయ సంస్థలకు మార్గదర్శకత్వం లభిస్తుంది. విశ్లేషించి చూస్తే ఇదంతా మానవ స్వభావానికి చెందిన సమస్య. సమాజ మూలాన్ని అనేకమంది ఆలోచనాపరులు భిన్న రీతులలో వివరించారు. మానవునిలో అంతర్గతంగా వివేచన వున్నదని వారంతా భావించారు. చివరకు సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ప్రజాస్వామ్యానికి ప్రమాణంగా మారింది. తాత్వికంగా దీనికి అనేక భాష్యాలు చెప్పారు. రూసో వ్యాఖ్యానానికి, లాక్ భాష్యానికీ తేడా ఉన్నది. వ్యక్తి సార్వభౌమత్వమనే మానవతా వాద సూత్రంపై లాక్ చెప్పిన ఉదారవాదం ఆధారపడింది. రూసో జనేచ్ఛ సిద్ధాంతాన్ని ఆధారంగా, నియంతృత్వానికి ప్రవక్త అయి సామాజిక ఒడంబడిక అనే సిద్ధాంత ప్రతిపాదన నుంచి రాబట్టటం కనిపిస్తుంది.
మధ్యకాలాలలో రాజులకు దైవాంశ సంభూత హక్కు ఉంటుందనే సిద్ధాంతానికి బదులుగా, ప్రజల సార్వభౌమత్వమనే అతి భౌతిక భావన వచ్చి చోటు చేసుకున్నది. రాజులు దైవ హక్కుతో పరిపాలన చేస్తే, రూసో ప్రజాస్వామ్యం కూడా అతి భౌతిక ప్రమాణంతోనే కొనసాగింది. సృష్టికర్త కంటే సృష్టి గొప్పది అనుకోవాలని దీని సారాంశం. సృష్టికర్తే మొట్టమొదట బలైనవాడుగా భావించబడుతున్నాడు. మధ్యయుగాలకంటే ఆధునిక ప్రజాస్వామ్యం కొంత అభివృద్ధి చెందిందనే భావించవచ్చు. కాని వ్యక్తులు రాజ్యాంగపరంగా కట్టుకథలవలె మారిపోయారు. మేథస్సు, ఇచ్ఛ, ఉద్వేగంతో ఉన్న వ్యక్తులకు గ్రహణం పట్టింది. ఆధునిక ఉదారవాదంలో వ్యక్తి ‘ఆర్థికవాదమైన వ్యక్తిగా’ మారాడు. ఆధునిక ప్రజాస్వామ్యంలో మానవతా సంప్రదాయం ఇలా దిగజారిపోయింది. 19వ శతాబ్దపు రాడికల్ తాత్వికవాదంలో ఇది పరాకాష్ఠనందుకొన్నది. అప్పుడు వ్యక్తి స్వేచ్ఛను విశ్వాసంతోనే చూచేవారు. కాని పెట్టుబడిదారీ సమాజంలో ‘ఆర్థికపరమైన వ్యక్తి’ బానిసగా, లేదా బానిసలను ఆకట్టుకొనేవాడుగా మాత్రమే ఉండగలడు. వ్యక్తి ఇలా అపఖ్యాతిపాలు కావడంతో, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన ఉదార ప్రజాస్వామ్యవాదం ఎంతో పతనం చెందింది. మార్క్సిస్టు సమష్టి వాదానికి ఇదంతా దారితీసింది. అందులో వ్యక్తికి సంపూర్ణంగా సంస్థాగతమైన గ్రహణం పట్టి, వ్యక్తి స్వేచ్ఛకు నియంతృత్వపరమైన, సామాజిక నిర్మాణం అవసరమనే వాదన జరిగింది.
తుదకు నియంతృత్వాలతో వచ్చిన సంఘర్షణవల్ల ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం వాటిల్లింది. నేటి సంక్షోభంంలో నాగరిక మానవజాతి చిక్కుకున్నది. చరిత్రలోని ఈ పెద్ద సంక్షోభం రాజకీయ ఆర్థికపరంగానే గాక నైతిక భావ సంబంధంగా కూడా ఇటువంటి సంక్షోభం మానవజాతి మనుగడనంతటినీ ప్రభావితం చేస్తున్నది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మానవతావాద ఉద్యమాన్ని తిరగదోడాలనే భావన వచ్చింది. ఇది మానవ ప్రయత్నంలో తెలిసిచే్స్తున్న పని. రాజకీయంగా, ఆర్థికంగా ఏవోే శక్తులు యాంత్రికంగా పనిచేస్తాయనే ధోరణికి ఇది చాలా భిన్నమైనది.
నాగరిక సమాజం పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా, లేదా ఆధునిక, పాశవిక విధానంలోకి పోకుండా ఉండాలంటే చరిత్రలో లోగడ జరిగిన దోషాలను పునరావృతం కాకుండా చూడవలసింది. మానవుడికి సంబంధించిన మార్మిక అతి భౌతిక ధోరణికి స్వస్తి చెప్పి, భౌతిక ప్రపంచంలో మానవుడికి స్థానాన్ని చూపవలసి ఉంటుంది. మనిషికి సంబంధించిన ఉనికి, మార్పు స్పష్టంగా అవగాహన చేసుకుని, మేథస్సు, ఇచ్ఛ, ఉద్వేగం, ప్రేరణలు, అంతర్భుద్ధి అనే వాటిని మార్మిక దృష్టితో చూడకంగా, మరేదో శక్తికి లొంగిపోకుండా ఉండటం అవసరం.
ఇది నవ్య మానవవాదం. మానవుడు సార్వభౌమత్వం, గౌరవానికి సంబంధించిన ప్రాచీన సిద్ధాంతమే ఆధునిక విజ్ఞానం వల్ల స్పష్టపడుతుంది. ఇందులో కొత్తగా కనుక్కోవలసిందేమీ లేదు. మానవుడంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పటంలో ప్రకృతి శాస్త్రాలు మార్మిక దృష్టిని తొలగించాయి. మానవునికి మూలాన్ని ప్రకృతిలోనే కనుక్కోవడంతో మానవునిలో భౌతికం కానిదేదో ఉన్నదనే సిద్ధాంతానికి తావులేకుండా చేసింది. మానవుని అవగాహనకు అందుబాటులో లేని అలౌకికత ఉన్నదనే విషయాన్ని విజ్ఞానం తోసిపుచ్చింది. మానవునికి తనమీద సంపూర్ణంగా ఏనాడూ ఆత్మవిశ్వాసం లేదు. అజ్ఞానాంధకార కాలం నుంచీ ఈ పరిస్థితి కొనసాగుతుంది. తనలో తనకు విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన మానవుడు నేటి సంక్షోభానికి కారణభూతుడయ్యాడు. ఈ సంక్షోభం నైతికమైనది, భావసంబంధమైనది. సంస్థాగత మార్పులవల్ల ఇది పోయేది కాదు.
మానవుడు తనలో విశ్వాసాన్ని మళ్లీ పొందాలి. నాగరిక ప్రపంచంలో సంక్షోభం తగ్గడానికి ఒక్కటే మార్గం. మానవుడు తాను దైవసంబంధమైన ప్రతిబింబమని చిరకాలంగా వస్తున్న నమ్మకం నుంచి బయటపడి, తన కాళ్ళపై తాను నిలబడకపోతే, సంక్షోభం నుంచి బయటపడలేడు. ఇటువంటి నమ్మకాలకు ఆధారంగా ఉన్నవాటిని ఆధునిక జీవశాస్త్రం పూర్తిగా నాశనం గావించిందని నవ్య మానవవాదం చెపుతున్నది. ఇప్పటివరకూ ఉన్న ప్రాతిపదిక అంతా అజ్ఞానంతో కూడి ఉన్నది. మానవ స్వభావానికి సంబంధించిన సత్యాన్ని ఆధునిక విజ్ఞానం బయటపెట్టింది. మానవుడు ప్రాయికంగా హేతువాది. నమ్మటం అతని స్వభావం కాదు. ప్రశ్నించటం, తెలుసుకోడం మానవుని పిపాసలో మూలాంశాలు. అజ్ఞానాంధకారంలో తడుముతూ పోయే మానవుడు, తనకు అదుపులేని శక్తులపట్ల అంధవిశ్వాసాన్ని చూపుతూ నిస్సహాయుడుగా ఉంటాడు. విజ్ఞానపు వెలుగు ప్రసరించడంతో ఈ పరిస్థితి పోతుంది. మానవుడికి జ్ఞానవస్తువు ఒకటే అందుబాటులో ఉన్న సత్యం. జ్ఞానానికి అందనిది ఏదైనా సరే భ్రమగానే మిగిలిపోతుంది.
మానవుడు అజ్ఞాన స్థితిలో ఆదిమ వివేచన దశలో మతాన్ని సృష్టిచుకున్నాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి అలౌకిక శక్తులు ప్రాతిపదికగా ఉండాలనుకున్నాడు. జ్ఞానం వల్ల అతడిలో గర్భితంగా ఉన్న వివేచన బయటపడేసరికి, అనవసరమైన విజ్ఞాన ప్రాతిపదికలను త్యజించాడు. మానవుడు స్థాణును కాడు. నిరంతరం, అనంతంగా అతడు పెంపొందుతాడు. మానవతా వాదం వికాసానికీ, అతడి జ్ఞానానికీ సమన్వయం చేస్తుంది. ప్రకృతికి సంబంధించిన మానవుడు వివేచనకు తగినట్టుగా మలుచుకుంటూ ఉండాలి. ఆధునిక విజ్ఞాన సహాయంతో పెంపొందే మానవతావాదం కొత్త, సమగ్ర మానవతావాదంగా ఉంటుంది. మానవుడు మనుగడను గురించి మూలానికి వెళ్ళి తెలుసుకుంటుంది కనక ఇది నమూల మానవతావాదంగా ఉంటుంది. అతీంద్రియ, అలౌకిక ప్రతిపాదనతో నిమిత్తం లేకుండా, మానవుడి ప్రాధాన్యతను ీ వాదం ప్రకటిస్తుంది. వివేచనాత్మక, నైతిక సమాజం మానవతావాదానికి ఆదర్శంగా ఉంటుంది. మానవుడు స్వాభావికంగా, హేతువాదిగా, నీతివాదిగా ఉండటమే ఇందుకు కారణం. ఇలా ఉండటం ఐచ్ఛికమే గాని, బలవంతంగా కాదు. తెలిసి, వివేచనతో ఉండే వ్యక్తి నీతిపరుడు కనక మానవుడు సహజంగా నీతిమంతుడన్నమాట. నీతి అలౌకికం కాదు, అంతర్బద్ధి కాదు. అదొక మానవ లక్షణం. జ్ఞాన, వికాసానుభూతితో పాటు ఈ లక్షణం విలసిల్లుతుంది. నవ్య మానవవాదంలో ఇవి మౌలిక సూత్రాలు. ప్రకృతిలో మానవునికి మూలాన్ని కనుగొని, మానవుని లక్ష్యంగా పేర్కోవటం ఇందులోని విశేషం.
మానవతావాదం మార్మిక భావనతో జతగూడి ఉన్నంత కాలం, తన విషయం ధ్యానం చేసుకుంటూ, తన లోకంలో తాను ఉంటూ, ఇతరులు ఉన్నారనే విషయం మర్చిపోయి, సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను పట్టించుకోలేదు. నవ్య మానవాదం, ధ్యానంతో కూడిన ఆలోచన కాదు. అదొక జీవిత తత్వం. ఆలోచన, భావన, ఆచరణ కలిస్తేనే జీవితం అవుతుంది. ప్రజాస్వామ్యానికి సుస్థిరమైన ప్రాతిపదిక కల్పించాలనీ, వివేచనాత్మక మానవుల అభిప్రాయం మీద పునాదులు ఏర్పడాలని ఈ తత్వం భావిస్తుంది. ఇంతవరకూ ఆచరణలో ఉన్న రాజకీయాలు ప్రజల సార్వభౌమత్వాన్ని కట్టుకథ కింద మార్చివేశాడు. మానవత, రాజకీయాలు దీనికి వాస్తవికతను కల్పించదలిచాయి.
స్వేచ్ఛాజీవులు ఉంటే తప్ప దేశం స్వేచ్ఛాయుతం కాదు. తాము స్వేచ్ఛగా ఉండగలమనే నమ్మకం కావాలి. మంచితనం, నీతి, ధర్మం పాటించటంవల్ల ఆనందం సమకూరు తుందనుకోవాలి. ఇలా చేయటానికి అలౌకిక పెత్తనం ఏదీ అవసరం లేదు. సక్రమ మార్గాన నడవటానికి స్వర్గం నుంచి కాపలాదార్లు అవసరం లేదు. సక్రమ మార్గాన నడవటానికి స్వర్గం నుంచి కాపలాదార్లు అవసరం లేదు. మానవుడు నైతికంగా తన సత్తాపై ఆధారపడక పోతే స్వేచ్ఛ అనేది భ్రమగానే ఉంటుంది. స్వేచ్ఛాజీవులతో తప్ప, మరొకవిధంగా సమాజం స్వేచ్ఛాయుతం కాదు. ఇటువంటి సూత్రాల ఆధారంగా, చరిత్ర కొత్త మార్గాన్ని అవలంబించకపోతే, మానవజాతికి మిగిలే ఆశ ఉన్నదనిపిస్తుంది. మానజాతి కొత్తదారిని పయనించే శక్తితో కూడినదని తెలుస్తుంది. అనుచరుల్లా, గుడ్డిగా వుండే నాయకులు దారి చూపలేరు. సమకాలీన ప్రపంచనాయకులు ప్రజాస్వామ్యంలో గాని, నియంతృత్వంలో గాని, తమ ఈర్ష్యాద్వేషాలకు తామే బలి అవుతున్నారు. ఇతరుల్లా తాము కూడా మనుషులం అన్న విషయం విస్మరించారు. అతీత మానవులనుకొనేవారు మానవునికంటే తక్కువ స్థాయికి దిగజారిపోయారు. మానవత కానిదేదైనా, మానవునకంటే తక్కువే. ప్రజాస్వామిక రాజకీయవాదులు, నియంతలు కూడా శక్తివంతమైన రాజ్యాలవల్లనే తామూ శక్తివంతంగా ఉండగలమనే అనుకుంటున్నారు. తోటి పౌరుల అభిమానం, ప్రేమ, వాత్సల్యం వారు చూరగొనలేకపోతున్నారు. నాయకుడుగా, అతీత మానవుడుగా, శక్తివంతమైన రాజ్యాధిపతిగా తప్ప వ్యక్తిగా అతడు మన్ననలు పొందలేకపోతున్నాడు. అటువంటివారు కొత్తదారులు చూడలేరు. సంక్షోభం నుంచి బయటపడటానికి ఒకేదారి - మానవత్వం చూపే దారి ఉన్నది.
పార్టీ రాజకీయాలు, విషవలయంలా సంప్రదాయంగా మారి కూర్చున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, రాజకీయాలను వేరే విధంగా ఆచరించవచ్చునని చెప్పినా అటువంటి వ్యక్తిని చూసి నవ్వుతున్నారు. ప్రస్తుతం మనం చెప్పేది కూడా అవాస్తవికమనీ, ఆచరణయుక్తం కాదనీ కొట్టి పారవేయవచ్చు. కాని ఎవరో ఒకరు ఉపక్రమించాల్సిందే. ఆచరించటానికి వీలులేని ప్రతిపాదన మానవతావాదంలో లేదు. తత్వాన్ని పక్కకు పెట్టినా, అనుభవరీత్యా ఈ సమస్యను పరిష్కరించవలసి ఉన్నది. ఉదాహరణకు, ఇండియాలో ఏమి జరుగుతున్నది? అధికారంలో ఒక పార్టీ ఉన్నది. ప్రజల ఓటువల్ల పార్టీకి ఆ స్థానం లభించింది. అంగీకరించిన ప్రమాణాలను అన్నిటినీ బట్టి చూస్తే ఇది ప్రజాస్వామిక పక్షమే. మనకున్నది ప్రజా ప్రభుత్వమే. వచ్చే ఎన్నికలలో ఇంకా ఎక్కువ సంఖ్యాబలంతో కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు. అప్పటికి ఓట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. బాలెట్ పెట్టెను దేవతలా పూజించి, ఓటువేసే ఆచారం ప్రబలి ఉన్నది. ఇప్పుడున్న అంధవిశ్వాసం, మన మనస్తత్వం, వీరారాధన వల్ల కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచటం కష్టం. ప్రజలు సమర్ధించిన పార్టీని అధికారం నుంచి దించటం ఎందుకు? ప్రజాస్వామిక విధానంలోనే ఒకే పార్టీ పాలన నిరవధికంగా ఉండవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అర్థం పోలేదా? ప్రతిపక్షాల గురించి ప్రస్తావిస్తున్నారు. పెత్తందారీ ప్రజాస్వామ్య ధోరణిలో ప్రతిపక్షానికి స్థానం ఉన్నదా… దేశంలో ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి, కాంగ్రెసుమీద ఆధిక్యత సంపాదించాలంటే, మహాత్ముని బలంతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పార్టీని ఓడించాలంటే, ప్రతిపక్షాలకు ఇద్దరు మహాత్ములైనా ఉండాలి. కాంగ్రెసు మహాత్ముడు కుల్లాయి కట్టినందువల్ల ప్రతిపక్ష మహాత్ములు నగ్నంగా ఉండాలి. అప్పుడు ప్రజల అజ్ఞానాన్ని ఆధారంగా మతపరమైన ఈర్ష్యాద్వేషాలను వూతంగా స్వీకరించి, రాజకీయంగా గిట్టుబాటు చేసుకోవచ్చు.
ఇదా ప్రజాస్వామ్యం? ప్రజలయొక్క, ప్రజలవల్ల ప్రభుత్వం మాత్రం ఇది కాదని చెప్పవచ్చు. ప్రజలను మోసగిస్తున్న కొందరు రాజకీయవాదుల పరిపాలన మాత్రమే జరుగుతున్నది. రాజకీయాచరణలో అధికారానికిస్తున్న ప్రాధాన్యతను గమనిస్తే, కాంగ్రెసును తొలగించి, ప్రతిపక్షాన్ని తెచ్చే మార్గమే లేదు. ప్రజల మనస్తత్వం మారనంతవరకూ ఇది జరగదు.
రాజకీయ పార్టీ తన కార్యక్రమాన్ని అమలుపరచటానికి అధికారంలోకి రావాలని నమ్ముతున్నది. కనక రాజకీయాచరణకు అధికారం ఒక్కటే గీటురాయిగా ఉన్నది. అధికారాన్ని పట్టుకోటానికి ఏ మార్గాన్నైనా అనుసరిస్తున్నారు. లక్ష్యం కోసం మార్గాన్ని సమర్థిస్తున్నారు. అందుకే రాజకీయాలలో నీతి లేకుండా పోయింది. పవిత్ర బోధనలవల్ల ఈ స్థితి మారదు. నీతికి స్థానం ఉండాలంటే, రాజకీయాలకు వేరే ప్రయోజనం ఉండాలి. ఓటర్లను ఆకర్షించటానికి ఏ పార్టీ అయినా, ఎదుటి పార్టీకంటే ఎక్కువ హామీలివ్వాలి. ఈ ఆటలో నిర్లక్ష్యంగా హామీలివ్వటానికి పోటీ పడతారు. దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రభుత్వం ఆచరించగలదా, లేదా అని చూడాలి. ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు రాజకీయ ఆర్థిక సమస్యలను అవగాహన చేసుకోలేనప్పుడు, పార్టీలు ఇష్టం వచ్చినట్లు ఆచరించే ధోరణి ఉన్నది. ప్రజాస్వామ్యం ఇటువంటి వాతావరణంలో మూకస్వామ్యంగా దిగజారిపోతున్నది.
వామ పక్షాలకు కూడా హామీలిచ్చేందుకు ఏమున్నది? సోషలిజం తన ధ్యేయమని, వర్గరహిత సమాజం కావాలని కాంగ్రెసే ప్రకటించింది. తాము నమ్ముకున్న నాయకులే. బ్రిటిషు సామ్రాజ్య వాదులను లొంగదీసిన వారే. అలా హామీ ఇస్తున్నప్పుడు, అధికారంలోకి రావాలనే దృష్టితో కొత్తవారు చేసే హామీలను ప్రజలు ఎందుకు నమ్మాలి.
ఇందులోని గుణపాఠం ఏమిటి? ప్రతిపక్షానికి ఆశలేదు. కాకుంటే అధికారంలో ఉన్న పార్టీ కంటే, ప్రజలను మోసగించటంలో మార్గాన్వేషణ చేసుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖండించి విప్లవాత్మక మార్గాంతరంగా ప్రజలను ఆయుధాలను చేపట్టమని పిలుపు ఇవ్వాలి. కాని అదీ పనిచేసేటట్లు లేదు. రాజ్యం శక్తివంతమైనది. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నది. అంతేకాక ఆధునిక సైన్యం రక్షణగా ఉన్నది. వేలాది మందిని తిరుగుబాటు చేసేటట్లు కమ్యూనిస్టులు ప్రయత్నించినా, మూక ఉమ్మడి హత్యలు తప్ప వేరే మిగిలేదేమీలేదు. అప్పటికీ అధికసంఖ్యాకుల పక్షంగానే ప్రభుత్వం నిలబడుతుంది.
కనక, రాజ్యాంగరీత్యా, హింసాయుత విప్లవంతో, పరిస్థితి మారే అవకాశం ఇప్పట్లో కనిపించటంలేదు. దేశ సాంస్కృతిక, వాతావరణం ఇలాగే ఉంటే పరిస్థితి ఎప్పుడూ మారదని కూడా చెప్పవచ్చు. అందువల్ల ప్రజల మనస్తత్వాన్ని, దృష్టిని, సాంస్కృతిక వాతావరణాన్నీ మార్చాలి. ఎక్కువమంది ప్రజలు స్వయంగా ఆలోచించగలిగితే మూకస్వామ్యపు ప్రచారంతోనూ, గుడ్డి నమ్మకాలతోనూ కొట్టుక పోకపోతే, ప్రజల వెనుకబడిన తనం ఆధారంగా పార్టీలు నిర్మించుకున్న పునాదులను కదిలించవచ్చు. దేశం స్వేచ్ఛవైపుకు అప్పుడే పయనిస్తూంది.
రాజకీయ పార్టీగా ఉంటూ ఈ పని చేయటం సాధ్యమా! మా పార్టీ ఇతర పార్టీల కంటే భిన్నమనీ, మాకు అధికారం అక్కరలేదనీ చెప్పవచ్చు. అయితే ఎవరు నమ్ముతారు? ‘అవును, ఒకసారి అధికారంలోకి వస్తే మీరు మాత్రం ఇంకొకరకంగా చేస్తారా?’ అని తిప్పికొట్టవచ్చు. మేము ఇతరులకంటే చిత్తశుద్ధి గలవారమని ప్రజలు ఎందుకనుకోవాలి? ఇతరులు కూడా వారి అభిప్రాయాలు చిత్తశుద్ధిగానే నమ్ముతారు కదా! మనం చెప్పేది నమ్మదగినదిగా ఉండాలి. అధికారం కోసం, జరిగేపోటీకి దూరంగా ఉండాలి. రాజకీయ ఆచరణకు అధికారం ఒక్కటే ప్రోత్సాసాహాన్నిస్తుందని చెప్పటం సరి కాదని చూపాలి. వ్యక్తిలో స్వేచ్ఛా పిపాస బాగా చైతన్యవంతంగా ఉంటేతప్ప ప్రజాస్వామ్యం సాధ్యపడదు.
గతపదేళ్ళుగా మేము తార్కికంగా పెంపొదిస్తున్న ఆలోచన, రాజకీయ పార్టీగా ఉండగానే సాగించిన చింతన యిప్పుడు కొనసాగించదలచాము. సామాజిక, రాజకీయ మార్పుకు, ముందుగా తాత్విక విప్లవం వుండాలని అప్పుడే ప్రతిపాదించాం. ప్రపంచ చరిత్ర నుంచి నాడే గుణపాఠం నేర్చి. ఇండియాకు అది అన్వయించదలచాం. 17, 18వ శతాబ్దాలలో వచ్చిన రాజకీయ మార్పులకు ఐరోపాలో పునర్వికాసం తగిన వాతావరణాన్ని సృష్టించింది. ఆధునికకాలంలో ఐరోపాకున్న అనుభవం ఇంకా భారతదేశానికి రాలేదు. పాత సంప్రదాయాలను అంటిపెట్టుకునే ఈ దేశం వేలాడుతున్నది. మెడచుట్టూ గుదిబండలా తయారైన మృతప్రాయపు గతాన్ని వదిలించుకోకపోతే, దేశం ముందుకు నడవలేదు. ప్రజాస్వామిక స్వేచ్ఛ సాంఘిక ప్రగతి, సాంస్కృతిక పునరుజ్జీవనం రావటం కష్టం. దేశంలో సాంస్కృతిక దృష్టి మార్చాలి. మానవులం అనే భావన ప్రజలలో రావాలి. స్వయంగా నిలబడి తమ విధిని తామే తీర్చిదిద్దుకోగలమనే నమ్మకం ఏర్పడాలి. క్రూరమైన దైవం చేతుల్లో ఆట బొమ్మలమనే నమ్మకం పోవాలి. నేటి స్థితికి కర్మ కారణం కాదనీ, విధిని మార్చగలమని, లేకుంటే మార్పు సాధ్యం కాదనీ తెలుసుకోవాలి. ప్రజాస్వామిక మానవతా సంస్కృతి, పునాదులలో గట్టిగా వుంటే, ఉపరితల నిర్మాణం స్థిరంగా ఉంటుంది. జీవితం అంతా బంధమనీ, పీడకల అనీ, భారతీయులు ఎక్కువగా నమ్ముతున్నారు. దీనివల్ల, సృజనాత్మక చర్యకు చొరవ తీసుకోలేక మొద్దుబారిపోతున్నారు. ఆ స్థితి నుంచి విమోచన పొందాలి. పూర్వజన్మలలో చేసిన దాని ఫలితంగా ఈ జీవితం నిర్ధారణ అయినట్లు భావిస్తున్నారు. ఈ కర్మ సిద్ధాంత తర్కాన్ని, విడమరచి చూస్తే, మానవుడు తన విధికి తానే సృష్టికర్త అని, తాను సృష్టించిన ప్రపంచాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. ప్రాచీన విశ్వాసాల నుంచి సరైన నిర్ణయాలు రాబట్టాలి. ఆ విధంగా మన సాంస్కృతిక సంపద నుంచి తాత్విక విప్లవానికి తగిన ఉత్తేజాన్ని పొంది, జీవిత దృక్పథాన్ని మార్చుకోవాలి. పునర్వికాసానికి అర్థం అదే. రాడికల్ హ్యూమనిస్టు ఉద్యమం ప్రాచీన విలువలను తిరిగి అంచనా వేసి మేథస్సుకు కావలసిన వాతావరణాన్ని సిద్ధంచేసి, స్వయంశక్తి మీద ఆధారపడే వారితో, స్వేచ్ఛాపరులు, సంతోషంగా గడుపుతూ, పొందికగా సమాజ వ్యవస్థను నిర్మించే వారికై కృషిచేస్తుంది.
వ్యక్తీ చొరవ, వ్యక్తి ప్రయత్నం, వ్యక్తి స్వేచ్ఛల మీద రాడికల్ హ్యూమనిస్టు ఉద్యమం ఆధారపడుతుంది. నియమ నిబంధనావళిలో ఈ ఉద్యమాన్ని బంధించలేము. దీనితో అంగీకరించే వారిని, ఏదో ఒక వ్యవస్థలో సభ్యలు కావాలని అడిగే సమస్యలేదు. కాని అటువంటి వారు తమ నమ్మకాన్ని ఆధారంగా నడచుకోవాలి. మన చుట్టూ గిరి గీసుకోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే, వ్యవస్థలకు స్వస్తి చెబుతున్నాము. బయటివారినిగా ఎవరినీ చూడటంగానీ, కృషిఫలితమంతా మాదేనంటూ గుత్తకు పుచ్చుకోటం గానీ, ఖ్యాతిని ఆపాదించుకోటంగానీ, జరగదు. లోగడవలె, ఇప్పుడు కూడా జ్ఞానమార్గాన పయనిస్తూ, చూసిన సత్యాన్ని గ్రహిస్తూ, మనంగా నిలబడటం జరుగుతుంది. ఈ భావాలకు అర్థం వుంటే, చెప్పేదానిలో సత్యం ఉంటే, జ్ఞానార్జనాభిలాషులు, స్వేచ్ఛ, సమన్వయం, సంతోషం వైపుకు కదలివస్తారు. ప్రపంచాన్ని తిరిగి నిర్మించాలంటే, మనలో ఆత్మ విశ్వాసం ఉండాలి. స్వేచ్ఛా ప్రపంచాన్ని చూడాలంటే మనం స్వేచ్ఛా పరులం కావాలి.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య
(1948, డిసెంబరు 29న కలకత్తాలో జరిగిన రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ నాల్గవ మహాసభలో ముగింపు ఉపన్యాసం).
(ఎలెన్ రాయ్ ఈ ఉపన్యాసాలన్నిటినీ సంకలనం చేసి ఆంగ్లంలో పుస్తకంగా తీసుకువచ్చారు.)
No comments:
Post a Comment