.
.
ఎ.బి.షా గురించి
అమృతలాల్ భిక్కు భాయి షా (ఎ.బి. షా - 1920-1982) భారతదేశంలో శాస్త్రీయ పద్ధతి ప్రచారం చేయడానికి 1964లో పూనుకున్నారు. ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ పరిశీలనల ప్రభావంతో సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించిన షా. సంక్షిప్త వివరణతో సైంటిఫిక్ మెథడ్ (1964) రాశారు. దేశంలో సెక్యూలర్ ఉద్యమ నిర్మాతగా షా నిర్విరామ కృషి చేశారు. రాజకీయ, ఆర్థిక, విద్య, మత సమస్యలకు శాస్త్రీయ పద్ధతి అన్వయించిన ఖ్యాతి షాకు దక్కుతుంది. రానున్న తరాలకు యీ పద్ధతి ఎంతో ఉపయోగకారి.
ఇది ఎందుకు అవసరం?
మాది శాస్త్రీయం అనడం నేడు పరిపాటి అయింది. పవిత్ర గ్రంథాలను శాస్త్రీయం అంటూ భక్తులు వాదిస్తున్నారు. అంటే భగవద్గీత, వేదాలు, బైబిల్, కొరాన్ శాస్త్రీయం అనగలుగుతున్నారన్నమాట. ఏదైనా సరే శాస్త్రీయం అయితే, చాలా గౌరవప్రదం అని భావిస్తున్నారు. ఈ జాబితాలో యిటీవల వాస్తును, జ్యోతిష్యాన్ని పోటీపడి చేర్చుతున్నారు. ఇక చికిత్సల సంగతి చెప్పనక్కర లేదు. ఆక్యుపంక్చర్ మొదలు హోమియోపతి వరకూ శాస్త్రీయ పరిధిలో చేర్చుతున్నారు. ఈ సందర్భంగా ఏది శాస్త్రీయం, ఏది అశాస్త్రీయం తెలుసుకోవడం మంచిది. కొందరు సైంటిస్టులు, సాంకేతిక విజ్ఞానులు మూఢనమ్మకాలలో శాస్త్రీయత చూపుతున్నారు.
భారత రాజ్యాంగం సైంటిఫిక్ ధోరణి విధిగా ఫెంపొందించాలన్నది. ప్రాథమిక విద్యాస్థాయి నుండే శాస్త్రీయతను ఆకర్షణీయంగా, ఉదాహరణలతో పిల్లలకు చెప్పాలి. శాస్త్రీయత అంటే సైంటిఫిక్ అనే అర్ధంలో వాడాలి. ఇందులో ప్రధానమైన అంశం తనను తాను దిద్దుకుంటూ, సరి చేసుకుంటూ ముందుకు సాగడం. శాస్త్రీయతలో తిరుగులేని, మార్చడానికి వీల్లేని ప్రమాణాలుండవు. కొత్త విషయాలు కనుగొంటుంటే పాతవి చరిత్రలోకి పోతాయి. ఇది నిరంతర కృషి. ఒకసారి చెప్పింది ఎవరూ మార్చడానికి వీల్లేదనే ధోరణికి శాస్త్రీయతలో చోటు లేదు. శాస్త్రీయత గురించి సులువుగా, విడమరచి చెప్పడం కష్టం. బాగా అవగాహన వుంటేనే అది సాధ్యం.
కీ.శే. ఎ.బి.షా. శాస్త్రీయత గురించి టూకీగా, లోతుపాతులతో చెప్పారు. విద్యార్థులందరూ దీనిని చదవాలనే దృష్టితో హెచ్. నరసింహయ్య, బెంగుళూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ వుండగా బి.ఎ. స్థాయి విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శాస్త్రీయత గురించి తెలుసుకుంటే, పిల్లలకు చాలా ఉపయోగం. సమాజాభివృద్ధికి ఎంతో దోహదకారిగా, శాస్త్రీయ పద్ధతి వుంటుంది. ఈ రచనను, ఆ లక్ష్యంతో, అందిస్తున్నాము.
సాంస్కృతిక ప్రభావంలో సైన్స్ పాత్ర
విజ్ఞానాన్ని అన్వయించినందువల్ల భౌతిక స్థితిగతులు మెరుగయ్యాయి. సాంస్కృతిక జీవనంపై కూడా బలమైన మార్పు కనబరచింది. బైబిల్, ఖురాన్, రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు వంటి ప్రమాణ గ్రంథాలు కోట్లాది ప్రజలకు, అందుబాటులో ఉండే ధరకు లభించడానికి ముద్రణాయంత్రం తోడ్పడింది. విద్యావ్యాప్తికి అవకాశం కలగడమేగాక ఎవరు కావాలన్నా విజ్ఞానం లభించే స్థితి వచ్చింది, ఈ విధంగా జ్ఞానాన్ని పవిత్రస్థానాల నుంచి మతరహిత రంగానికి తేవడంతో, ఇన్నాళ్ళు కొద్దిమంది అల్ప సంఖ్యాకులు స్వార్థంతో మానవజాతిని మూఢనమ్మకాలలో, మార్మిక స్థితిలో అట్టిపెట్టగా, అది నేడు తొలగే అవకాశం లభించింది. కులం హెచ్చుతగ్గులు పోగొట్టడానికి రైళ్ళు కొంత తోడ్పడ్డాయి. జ్ఞానం, పరస్పర సానుభూతితో మానవజాతి ఒకటిగా పెంపొందించడానికి అచ్చుయంత్రం ఉపకరించింది. లోగడ దేవుడి ఆజ్ఞానుసారం సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయనేవారు.
నేడు అందరికీ అందుబాటులో రేడియో, పుస్తకాలు, పత్రికలు, సినిమాలు ఉండడం వల్ల సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదం కలిగింది. దూరంగా ఉన్న ప్రదేశాలలో ఏమిజరుగుతున్నదో తేలుసుకోవడానికి నేడు ఎవరూ లక్షాధికారి కానక్కరలేదు. హ్యూయన్ సాంగ్ లాగ యాత్రికుడు కానక్కరలేదు. సముద్రంలోతులలో జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరూ గజయీత గాళ్ళుగా మారనక్కరలేదు. సమకాలీన, ప్రాచీన ప్రపంచ విషయాలు గ్రహించడానికి ఎవరూ ఐరోపా, అమెరికా వెళ్ళనక్కరలేదు. ఆరుభాషలు నేర్వనక్కరలేదు. ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలు, సంపద, స్థితిగతులు, కులం, వృత్తితో కూడా నిమిత్తం లేకుండా, పుస్తకాలు ప్రచారసాధనాలతో ఇటువంటి కృషి జరుగుతున్నది. చావు అనేది అందరికీ సమానత్వం ఇచ్చింది. సైన్సు వల్ల సమానత్వం అనేది అందరికీ సాధ్యమని చెబుతున్నది. జ్ఞానం, సమాచారంలాగే కళలు కూడా గ్రామాలలో గుడిసెలకు చేరాయి. అజంతా, ఎల్లోరాగుహల శిల్పాలు చూడవచ్చు. రవిశంకర్, గులాం అలీఖాన్ సంగీతం వినవచ్చు. షెక్స్ పియర్ నాటకాలు లండన్లో ప్రదర్శిస్తుంటే తిలకించవచ్చు. ఓవల్ రంగస్థలంలో క్రికెట్ ఆటను ఆనందించవచ్చు. చంఢీఘడ్ భవన సౌందర్యాన్ని, న్యూయార్క్ ఆకాశహర్మ్యాలను తిలకించవచ్చు. ఇంట్లో నుంచి కదలకుండా ప్రపంచంలోని కళలను, వినోదాలను అనుభవించవచ్చు. కళలు, ఆలోచనలను ఆధునిక సాంకేతిక శాస్త్రం మన ఇళ్ళకు తెచ్చి పెట్టింది. అర్థ శతాబ్దం కిందటి వరకూ సాధ్యం కానప్పటికీ, నేడు పౌరుడు ప్రపంచవ్యక్తిగా భావించుకునే స్థితిని కల్పించింది.
- నరిసెట్టి ఇన్నయ్య
సాంకేతిక శాస్త్రం మనుషుల్ని మార్చేస్తుంది.
చాలామంది దృష్టిలో విజ్ఞానం అంటే సాంకేతికశాస్ర్తమే. ఇందులో ఆశ్చర్య పడవలసిందేమీ లేదు. మన జీవితవిధానంలో సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పులు అలాంటివి. విజ్ఞానం లేకుండా ఆధునిక సాంకేతిక శాస్ర్తం ఊహించలేం. అయితే, సాంకేతిక శాస్త్రమే విజ్ఞానం కాదు. విజ్ఞానం చేసే పని జ్ఞానాన్వేషణే. సిద్ధాంతానికీ అన్వయానికీ ఉన్న సంబంధమే విజ్ఞానానికీ, సాంకేతిక శాస్ర్తానికీ ఉంది. విజ్ఞాన సిద్ధాంతాలను ఆచరణలో పెడితేనే సాంకేతిక శాస్త్రం తలెత్తుతుంది. ఉదాహణకు విద్యుదయస్కాంత తరంగాలు విజ్ఞానంలో భాగం. వీటి నియమాలను చూపే రేడియో, సాంకేతిక శాస్త్రంలో భాగం. ఈ ఉదాహరణ వల్ల మామూలు వ్యక్తి దృష్టిలో విజ్ఞానం అంటే సాంకేతికశాస్ర్తం ఎందుకైందో తెలుస్తుంది. సాంకేతిక శాస్త్రంలో మెరుగుదల ప్రభావాలు ఎవరికైనా కనిపిస్తాయి. విజ్ఞానసిద్ధాంతంలో ఉత్తరోత్తరాగాని అది స్పష్టపడలేదు.
ఇలా చెబుతున్నామంటే, మానవజీవితంపై సాంకేతిక శాస్త్రం ప్రభావం అశ్రద్ధ చేయదగిందని గాని, కృత్రిమం అనిగాని అర్థంగాదు. ఆ మాటకొస్తే అది తెచ్చిన మార్పుల ప్రాధాన్యం చాలా ప్రగాఢమైంది. మానవుడి భౌతిక, సాంస్కృతిక రంగంపై ఈ ప్రభావం ఎంతగా ఉన్నదంటే, ఆధునిక సాంకేతిక శాస్త్ర యుగారంభానికి పూర్వం జీవితం ఎలా ఉండేదో ఊహించడానికి చాలా ప్రయత్నం కావాలి. ఈ మార్పులు రెండు విధాలుగా ఉన్నాయి. చాలా మార్పులు మంచికే దోహదం చేశాయి. అశోకుడు, అలెగ్జాండర్, అక్బర్, మొదటి ఎలిజిబెత్ కాలంతో పోల్చి చూస్తే, సాంకేతిక మార్పుల వల్ల మానవజీవితం సంతోషంగానూ, భద్రతతోనూ ఉందనవచ్చు. అయితే కొన్ని మార్పులు మానవస్వేచ్ఛకూ, మానవ ఉనికికీ భంగం కల్పించేవిగా పరిస్థితులను సృష్టించాయి. మంచిచెడుల పట్టికను చూస్తే ఆధునిక సాంకేతికశాస్ర్త ఫలితాలు ఇప్పటివరకూ చెడుకంటే, చాలా మంచినే సమకూర్చి పెట్టినట్లు స్పష్టమౌతుంది.
ఈ నిర్ణయాన్ని కొంత వివరించడం మంచిది. నేడు విజ్ఞానం వల్ల చెడు ఫలితాలు వచ్చాయని వింటున్నాం. యంత్రానికి మానవుడు లొంగిపోయా డంటున్నారు. మానవ సంబంధాలలో లలితమైనవన్నీ వ్యాపార లక్షణాలుగా మారాయంటున్నారు. కొద్దిమంది చేతుల్లో అనూహ్యమైన వినాశక శక్తిని అందించిందంటున్నారు. కనక గత మూడువందల సంవత్సరాలలో జీవితాన్ని ఎలా విజ్ఞానం మార్చి వేసిందో సింహావలోకనం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి సింహావలోకనం వల్ల విజ్ఞానం మానవజీవితంపై చూపిన ప్రభావాన్ని తులనాత్మకంగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది. అంతే గాక, సాంకేతికశాస్త్రం కంటే విజ్ఞానం చాలా ప్రభావాన్ని చూపుతుందని గ్రహించవచ్చు.
మానవజీవితంపై విజ్ఞాన ప్రభావం మూడు విధాలుగా ఉంటుంది. 1. సాంకేతికం, 2. సాంస్కృతికం, 3. తాత్వికం, విజ్ఞానం మానవుడికి ఏం చేసిందో ఈ మూడు కోణాలలో పరిశీలిద్దాం.
విజ్ఞానపు సాంకేతిక ప్రభావం
విజ్ఞానంతో సాధ్యపడిన నాగరికతాభివృద్ధి అంశాలను లెక్కించడం సాధ్యం కాదు, అవసరమూ లేదు. మనం గుర్తించడానికి వీల్లేనంతగా సాంకేతిక శాస్ర్తం చేసిన మార్పులను కొన్ని ప్రధాన రంగాలలో ప్రస్తావిద్ధాం.
1793లో విట్నె శాస్త్రజ్ఞుడు జిన్ యంత్రాన్ని కనుక్కోక పూర్వం, ప్రత్తిని చేతితో తీసేవారు. ఇది చాలా జాప్యంతో కూడినదని వేరే చెప్పనక్కరలేదు. కనక ఉత్పత్తి స్వల్పంగా ఉండేది. అందరికీ చాలినంత వస్త్రం నేయడం, పత్తి ఉన్నా సరే సాధ్యమయ్యేది కాదు. విట్నె కనిపెట్టిన జిన్ యంత్రం వల్ల రోజుకు ఒక్కొక్క కార్మికుడు లోగడకంటే 50 రెట్లు ఆదనంగా పత్తిని బాగుచేయగలిగాడు. ఈ నాటికీ అందరికీ తగినంత వస్త్రం లభించక పోవడానికి కారణం ఆర్థికపరమైన వెనుకబడిన తనమే గాని, సాంకేతికం మాత్రం కాదు.
పత్తి విషయంలో లాగే ఇంచుమించు వినిమ వస్తువులన్నిటిలో ఇదే వాస్తవం. వస్త్రంలాగే, ఆహారాన్ని కూడా సమృద్ధిగా అందించవచ్చు. జనాభాను అదుపులో పెట్టి, వ్యవసాయంలో వైజ్ఞానిక పద్ధతులు అవలంబిస్తే సరిపోతుంది. ఉదాహరణకు, ఇప్పటి జనాభా ఇక పెరగకుండా కుటుంబ నియంత్రణ అవలంబించవచ్చు. పంటలు మార్చుతూ తగిన ఎరువులు వాడవచ్చు. నీటివనరులు, కట్టలు పోయడం, చీడ నివారణతో పంటతెగుళ్ళు అరికట్టడం, లోతుగా భూమిని దున్నడం, అందుకు మేలైన నాగళ్ళు వాడడం, ఇలా వెయ్యి పద్ధతులు అనుకరించవచ్చు. అప్పుడు ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా, శక్తిమతంగా ఉండవచ్చు. నేటివలె కళ్ళు పీక్కుపోయి దిగాలుపడి ఉండనక్కర లేదు. మనకు నేడు ఆహారవస్తువుల కొరత ఉందంటే, సాంకేతికశాస్త్ర లోపం కాదు. సాంకేతిక శాస్త్రాన్ని అధికోత్పత్తి కోసం, ఆహారాన్ని సరిగా పంపిణీ చేయడం కోసం వినియోగించక అడ్డుపడే సామాజిక, సాంస్కృతిక లక్షణాలలో కారణాలను చూడవలసి ఉంది.
మనకు లోగడ తెలిసిన వస్తువులలో ఉత్పత్తి అధికం కావడానికి సాంకేతిక శాస్త్రం తోడ్పడటమే గాదు. మనం కలలోనైనా ఊహించని కొత్త వస్తువులను సృష్టించింది కూడా. ఉదాహరణకు, అక్బర్, శివాజీల కాలంలో కృత్రిమ నీలిమందు గాని, ఎరువుల నిమిత్తం నత్రజనిని తయారు చేయడం గాని ఎవరూ ఆలోచించి ఉండరు. అలాగే గనుల నుంచి బంగారాన్ని తీయడానికి సైనైడ్ పద్ధతిని, పెట్రోలియం వస్తువుల తయారీ, విద్యుత్-రసాయనిక పరిశ్రమ, స్టెయిన్ లెస్ స్టీల్, కృత్రిమ రసాయనిక వస్త్రాలు-నైలాన్, రేయాన్ వంటివి ఎవరూ కలగనలేదు.
రవాణా, వార్తా ప్రసారాల రంగంలో విప్లవం వచ్చింది. ఆవిరి యంత్రం కనుక్కోకముందు, అతి వేగంగా వెళ్ళే సాధనం గుర్రం మాత్రమే. గుర్రానికి హద్దులున్నాయి. బతికేది. కొద్ది కాలం, పోషణకు ఖర్చు ఎక్కువ. కనకనే దేశంలో ఎడ్లబండ్లు సర్వసాధారణంగా ఉండేవి. ఉష్ణానికీ, యంత్రశక్తికీ సంబంధం తెలుసుకునే అవకాశాన్నిచ్చింది. సముద్రాలను దాటడానికి, లోగడ తెలియని ఖండాలను కనుక్కోవడానికి దోహదం చేసింది. ఆవిరి యంత్రం ప్రపంచాన్ని ఐక్యపరచడం ప్రారంభిస్తే, జెట్ విమానాలు ఈ కృషిని పూర్తి చేశాయి. కొత్త శక్తి, వనరులు, పెట్రోలు, అణుశక్తి వల్ల మానవ చరిత్రలో మొదటిసారిగా, ‘ప్రపంచమే నా గృహం’ అనే భావాన్ని సాధారణ వ్యక్తిలో కూడా వచ్చేటట్లు చేశాయి. అభివృద్ధి చెందని మనదేశం వంటిచోట, లండన్లో, న్యూయార్క్ లో జరిగే వార్తలను పొరుగూరు వార్తలకంటే త్వరగా తెలుసుకోవచ్చు. విమానం, టేలిగ్రాఫ్, వైర్ లెస్, టేలివిజన్ వంటివి దూరాన్ని ఆటంకంగాకూండా చేసి, ప్రపంచ ప్రభుత్వం ఆవిర్భవించడానికి, సామాన్య మానవ సంస్కృతి రావడానికి ఉపకరించాయి. ఆధునిక ప్రసార సాధనాలు మానవ కుటుంబాన్ని సన్నిహితం చేసి, మానవుడు వినడాన్నీ చూడడాన్నీ వెయ్యి రెట్లు పెంపొందించాయి. కొత్త నక్షత్రాలు, పాలపుంతలు, సూక్ష్మజీవులు, ఎలక్ర్టాన్లు, శబ్దానికి రంగుకు చెందినవెన్నో మానవుడికి తెలిశాయి. ఇటువంటి ఆధునాతన నాగరికతా సౌకర్యాలు భారత గ్రామాలలోని మారుమూలలకు చేరలేదంటే సాంకేతిక అజ్ఞానం కారణం కాదు. దీనికి సాంకేతికేతర కారణాలు ఉన్నాయి.
ఇంజనీరింగ్ భవన నిర్మాణరంగంలో ఇటువంటి విప్లవమే వచ్చింది. పర్వతాలలో సొరంగాలు తవ్వడం, పెద్ద నదులపై వంతేనలు నిర్మించడం, ఆకాశ భవనాలు కట్టడం అందులో వందలాది కుటుంబాలు హాయిగా నివసించగలగడం, పేదలకు గుడిసెలస్థానే శాశ్వత గృహాలను నిర్మించడం, గాలి, వెలుతురు వచ్చే పాఠశాల భవనాలు, ఇవన్నీ లోగడ మహాశక్తి మంతమైన సామ్రాజ్యాలకు కూడా అనూహ్యమే. గతంలో పెద్ద సామ్రాజ్యాల రాజధానులకంటే నేడు పురపాలకవాడలలో సామాన్యుడు బాగా ఉంటున్నాడు. 300 సంవత్సరాలకు పూర్వం ఐరోపావారు వచ్చి స్థిరపడినప్పటి కంటే నేడు ముంబాయిలో జీవితం గుణాత్మకంగా పెంపొందింది.
ఆధునిక వైద్యం మానవజాతికి ఎలా వర ప్రసాదంగా మారిందీ చెప్పనక్కరలేదు. ఒకప్పుడు ఉన్నట్లు నేడు మలేరియా, కలరా, ఆటలమ్మ, ప్లేగు శాపాలుగా లేవు. సన్నిపాతజ్వరం, క్షయ అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు భయానకంగా ఉన్న కేన్సర్ కూడా త్వరలో అలా కాకుండా పోతుందని ఆశించవచ్చు.
శస్త్ర చికిత్సను కూడా వైద్యాభివృద్ధితో పోల్చవచ్చు. కృత్రిమ శరీరభాగాలను అమర్చడం, కొత్త కంటిపాపలను పెట్టడం, గుండె, మెదడు శస్త్ర చికిత్స చేయగలగడం, కొన్ని సందర్భాలలో లింగమార్పుకూడా సాధ్యపడుతున్నది. ఆరోగ్య శాస్త్ర అభివృద్ధి ఫలితంగా చావులు తగ్గాయి. ముఖ్యంగా బాల్య మరణాలు తగ్గిపోయాయి. మంచి ఆరోగ్యంతో జీవన ప్రమాణం కొనసాగించే వీలు చిక్కింది. రెండు వందల ఏళ్ళ కితం పుట్టిన పిల్లలు యుక్తవయస్సు రాకముందే చనిపోతుండేవారు. సగటు జీవితం 30 ఏళ్ళు మాత్రమే ఉండేది. నేడు ఇండియా వంటి పేద దేశంలో సైతం బాల్య మరణాలు చెప్పుకోదగినంతగా తగ్గిపోయాయి. గత మూడు దశాబ్దాలలోనే జీవిత వయస్సు సగటున 36 నుంచి 42 ఏళ్ళకు పెరిగింది. పుట్టిన వారిలో ఎక్కువమంది బతుకుతున్నారు. ఎక్కువకాలం జీవిస్తున్నారు. ఆరోగ్య ప్రమాణాలు మెరుగుగావడం వల్ల సామాన్యుడికి భద్రత, సంక్షేమ దృష్టి వచ్చింది. జాతీయస్థాయిలో కుటుంబనియంత్రణ పథకం లేనందున జనాభా పెరుగుదల అనేది అభివృద్ధి చెందని దేశాలలో పెద్ద సమస్యగా మారింది.
సాంస్కృతిక ప్రభావంలో సైన్స్ పాత్ర
విజ్ఞానాన్ని అన్వయించినందు వల్ల భౌతిక స్థితిగతులు మెరుగయ్యాయి. సాంస్కృతిక జీవనంపై కూడా బలమైన మార్పు కనబరచింది. బైబిల్, ఖురాన్, రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు వంటి ప్రమాణ గ్రంథాలు కోట్లాది ప్రజలకు, అందుబాటులో ఉండే ధరకు లభించడానికి ముద్రణాయంత్రం తోడ్పడింది. విద్యావ్యాప్తికి అవకాశం కలగడమేగాక ఎవరు కావాలన్నా విజ్ఞానం లభించే స్థితి వచ్చింది, ఈ విధంగా జ్ఞానాన్ని పవిత్రస్థానాల నుంచి మతరహిత రంగానికి తేవడంతో, ఇన్నాళ్ళు కొద్దిమంది అల్ప సంఖ్యాకులు స్వార్థంతో మానవజాతిని మూఢనమ్మకాలలో, మార్మిక స్థితిలో అట్టిపెట్టగా, అది నేడు తొలగే అవకాశం లభించింది. కులం హెచ్చుతగ్గులు పోగొట్టడానికి రైళ్ళు కొంత తోడ్పడ్డాయి. జ్ఞానం, పరస్పర సానుభూతితో మానవజాతి ఒకటిగా పెంపొందించడానికి అచ్చుయంత్రం ఉపకరించింది. లోగడ దేవుడి ఆజ్ఞానుసారం సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయనేవారు.
నేడు అందరికీ అందుబాటులో రేడియో, పుస్తకాలు, పత్రికలు, సినిమాలు ఉండడం వల్ల సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదం కలిగింది. దూరంగా ఉన్న ప్రదేశాలలో ఏమి జరుగుతున్నదో తేలుసుకోవడానికి నేడు ఎవరూ లక్షాధికారి కానక్కరలేదు. హ్యూయన్ సాంగ్ లాగ యాత్రికుడు కానక్కరలేదు. సముద్రంలోతులలో జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరూ గజయీత గాళ్ళుగా మారనక్కరలేదు. సమకాలీన, ప్రాచీన ప్రపంచ విషయాలు గ్రహించడానికి ఎవరూ ఐరోపా, అమెరికా వెళ్ళనక్కరలేదు. ఆరుభాషలు నేర్వనక్కరలేదు. ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలు, సంపద, స్థితిగతులు, కులం, వృత్తితో కూడా నిమిత్తం లేకుండా, పుస్తకాలు ప్రచారసాధనాలతో ఇటువంటి కృషి జరుగుతున్నది. చావు అనేది అందరికీ సమానత్వం ఇచ్చింది. సైన్సు వల్ల సమానత్వం అనేది అందరికీ సాధ్యమని చెబుతున్నది.
జ్ఞానం, సమాచారంలాగే కళలు కూడా గ్రామాలలో గుడిసెలకు చేరాయి. అజంతా, ఎల్లోరాగుహల శిల్పాలు చూడవచ్చు. రవిశంకర్, గులాం అలీఖాన్ సంగీతం వినవచ్చు. షెక్స్ పియర్ నాటకాలు లండన్లో ప్రదర్శిస్తుంటే తిలకించవచ్చు. ఓవల్ రంగస్థలంలో క్రికెట్ ఆటను ఆనందించవచ్చు. చంఢీఘడ్ భవన సౌందర్యాన్ని, న్యూయార్క్ ఆకాశహర్మ్యాలను తిలకించవచ్చు. ఇంట్లో నుంచి కదలకుండా ప్రపంచంలోని కళలను, వినోదాలను అనుభవించవచ్చు. కళలు, ఆలోచనలను ఆధునిక సాంకేతిక శాస్త్రం మన ఇళ్ళకు తెచ్చి పెట్టింది. అర్థ శతాబ్దం కిందటి వరకూ సాధ్యం కానప్పటికీ, నేడు పౌరుడు ప్రపంచవ్యక్తిగా భావించుకునే స్థితిని కల్పించింది.
అపస్వరాలు
ఇంతవరకు ఆధునిక సాంకేతికశాస్త్ర సత్ఫలితాలనే గమనించాం. కాని ఇంకోవైపు కూడా లేకపోలేదు. ఆధునిక సాంకేతిక శాస్ర్తంపై విమర్శ చాలా వరకు సరిగాలేని మాట వాస్తవమే. విమర్శకుడు ఎప్పుడూ, ఎన్నడూ లేని స్వర్ణయుగాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. పారిశ్రామిక విప్లవాన్ని కొందరు ఖండిస్తారు. మనిషిని యంత్రంగా మార్చి వేసిందని, పనిలో ఉండే సృష్టి ఆనందాన్ని తీసేసిందని అంటారు. పారిశ్రామిక విప్లవం రాకముందు ఏ సమాజాన్ని చూసినా లక్షలాది ప్రజలు ఆకలితో అలమటించారన్న విషయం విస్మరిస్తున్నారు. ఢక్కా ముఖమల్ నేతపనిలో నిమగ్నులైన పనివారు చిన్నవయస్సులోనే అంధులైన విషయం కూడా మరచిపోయారు. అంత మాత్రాన ఢక్కానేత పని నగిషీతనాన్ని కాదనడం లేదు. ఒక కాలాన్ని నిర్ణియించేటప్పుడు కేవలం ఉద్వేగభావాలతో, కొన్ని లక్షణాలను మాత్రమే స్వీకరించి, కొట్టుకుపోరాదు.
పారిశ్రామిక ఉత్పత్తికి ముందున్న రోజులలోని విమర్శనే, పారిశ్రామిక నాగరికతలోని కొన్ని విషయాలకు అన్వయించవచ్చు. స్వార్థం ప్రబలడం, నైతికవిలువలు పతనం కావడం, కుటుంబం విచ్ఛిన్నం కావడం, యువతరం తిరుగుబాటు ఇటువంటివే. ఒక్క విషయంలో ఆధునిక విమర్శకులు సాంకేతిక శాస్ర్తం గురించి స్పష్టంగా చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక శాస్త్రం ప్రభుత్వాలకు ఇచ్చిన విపరీతశక్తితో పోల్చి చూస్తే, గతంలోని చక్రవర్తులు ఎందుకూ కొరగాని వారనిపిస్తుంది. శాశ్వత సైన్యాభివృద్ధి, రోడ్లు, నీటిరవాణా, వైర్ లెస్ ప్రసారాలు, మరతుపాకులు, సాయుధశకటాలు, జెట్ బాంబర్లు, అణ్వాయుధాలు, పౌరులకు అత్యవసరంగా సరఫరా చేసే నీరు, విద్యుత్ లను కూడా కేంద్రం అదుపులో పెట్టడం, ఆధునిక పద్ధతులలో మనస్సులను మూసబోసినట్లు చేయడం-ఇత్యాదులన్నీ, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడడానికి వీల్లేకుండా చేశాయి. తిరుగుబాటులు విఫలం అయ్యే స్థితిని కూడా కల్పించింది. హంగరీ, టిబెట్లో జరిగినదాన్ని బట్టి, ఈ శతాబ్దంలోనే ఐరోపాలోని అనేక దేశాలలో ఈ విషయం వాస్తవమని రుజువైంది. పాలకవర్గాలు స్వయంగా కొన్ని మానవ విలువలను విశ్వసిస్తున్నప్పుడు మాత్రమే ప్రజలలోని అసంతృప్తి వైదొలగుతుంది. అటువంటి విలువలను పాలకులు అభిలషించడమనేది వారి సంస్కృతిని బట్టి ఉంటుందేగాని, సాంకేతిక శాస్త్రానికి సంబంధం లేదు. సాంకేతిక శాస్త్రం వల్ల వారు కోరుకునే విలువలు సమర్ధవంతంగా సాధించడానికి తోడ్పడుతుంది. వారి సంస్కృతి మానవత ఉదారతత్వంతో ఉంటే తమపాలనను కాపాడుకునే నిమిత్తం ఒక హద్దును మించి బల ప్రయోగం చేయరు. వారికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. వారి సంస్కృతి పెత్తందారీతనానికి, సమిష్టి వాదానికి చెందినదై ఉంటే మార్పును హింసాయుత సమాజంలో తేవాలనుకున్నా చాలా కష్టం. రెండో ప్రపంచ యుద్ధానంతరం సాధారణ ఎన్నికలలో మితవాదులు 1945లో ఓడిపోయినప్పుడూ, 1947లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లార్డ్ అట్లీ ప్రభుత్వ ఆక్రమణలను విరమించడం ప్రారంభించినప్పుడూ ఉదార సంస్కృతి లక్షమాలు కనిపించాయి.
1956లో హంగరీలోనూ, 1959లో టిబెట్లోనూ, నాజీ నియంతృత్వం కింద ఐరోపాలోనూ జరిగినవి జ్ఞప్తికి తెచ్చుకుంటే నియంతృత్వ సంస్కృతి లక్షణాలు అర్థమౌతాయి.
పెత్తంగారీ సంస్కృతికి తోడ్పడే సాంకేతిక శాస్ర్తం మానవస్వేచ్ఛను నాశనం చేస్తుంది. అసలు మానవజాతినే తుడిచిపెట్టే ప్రమాదమూ లేకపోలేదు. అధికార దాహంతో ఉన్నవాడు చేసినా, శాంతి కోరుతున్నప్పటికీ భయపడి ప్రయోగించిన పాలకుడు చేసినా సరే, అణ్వస్త్రయుద్ధ ఫలితం ఒక్కటే. మానవజాతి నాశనం అవుతుంది. మానవుడి సాంస్కృతిక పరిణామాభివృద్ధి వల్ల సాంకేతిక శాస్త్రాన్ని అదుపు చేయడం అవసరం. అంతర్గతంగా ఉన్న పెత్తందారీతనం, మూఢనమ్మకాల నుంచి మానవుడు విమోచన పొందాలి. తన విధికి తానే నిర్ణేత అని మానవుడు భావించడమే గాక, ఈ విషయమై స్పష్టత అవసరం. ఏ సిద్ధాంతమైనా ఆత్మ హత్య సదృశంగా పరిణమించరాదు.
ఇక్కడే విజ్ఞానం యొక్క విమోచనా పాత్ర నిర్వహించాలి. మానవుడిని మానవుడుగా పెంపొందేటట్లు విజ్ఞానం తోడ్పడుతుంది. మానవుడు కేవలం మాంసపు ముద్దకాదు. అతడు ఈర్ష్య అసూయల నుంచి, మూఢనమ్మకాల నుంచి బయటపడాలి, సమస్యలను నిష్పాక్షికంగా చూడడానికీ, వాటి పరిష్కారం ఫలప్రదంగా చేయడానికీ తన ఆలోచనకు తగ్గట్లు హుందాగా ప్రవర్తించడానికీ, నైతికజీవిగా ఉండడానికీ విజ్ఞానం తోడ్పడుతుంది. విశ్వం, అంటే ఏమిటో తెలుసుకోవడానికీ, తనను తాను అర్థం చేసుకోవడానికి సైన్స్ ఉపకరిస్తుంది. గత మూడు వందల సంవత్సరాలలో ప్రకృతి రహస్యాలను తెలుసుకోజాలనప్పుడు ఇదంతా అసంభవం. విజ్ఞానం మానవుడి జీవితాన్ని, విశ్వాసాన్ని మార్చి వేసిన తీరు చాలా ప్రధానమైంది. సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పుకంటే ఇది చాలా గణనీయమైంది.
శాస్త్రంతో విమోచన
విద్యవల్ల విముక్తి లభిస్తుందనేది విజ్ఞానపరంగా వాస్తవం. అజ్ఞానం, మూఢనమ్మకాలు, వాటి వల్ల కలిగిన రాగద్వేషాల నుంచి మానవుడిని విముక్తుడిని చేయడంలో విజ్ఞానం ఉపయోగపడింది. ఇటీవలి వరకు తనను తెలుసుకోవడానికి, విశ్వాన్ని తెలుసుకోవడానికి ఈ నమ్మకాలు అడ్డుపడి, మానవుడిని హేతుబద్ధంగా నైతికంగా పరిపూర్ణదశకు రాకుండా చేశాయి.
ఈ వియోచన ఎలా ఉన్నదో చూడాలంటే, వందేళ్ళ కిందట ఈ దేశంలో ఇంచుమించు అందరూ, నేటికీ కొందరు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, జీవ నిర్జీవ వస్తువులు, సముద్రం, గాలి, మానవుడి గురించి ఏమనుకున్నారో చూస్తే సరిపోతుంది. ఈ నమ్మకాలు మన ఆదర్శాలను నిర్ధారణ గావించాయి. మతేతరంగానూ పారలౌకికంగానూ ఎలా ప్రభావితం చేశాయి, వ్యక్తిగతంగానూ, పరస్పర వ్యక్తుల మధ్య సంబంధాలలోనూ ఈ ప్రభావం ఎలా ఉన్నదీ తెలుసుకోవచ్చు. మానవుడిని గురించి, లోకాన్ని గురించి మన భావాలను, విజ్ఞానం దృష్ట్యా ఎలా పునరాలోచించుకోవాలో పరిశీలించాలి. ఆధునిక విజ్ఞానం సూచించిన ధోరణిలో మన దృష్టిని మార్చుకుంటే మానవుడిలోని సృజనాత్మక శక్తులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. అప్పుడు సాంకేతిక శాస్త్రాన్ని మానవుడి మంచితనం కోసం మలచవచ్చు. విధ్వంస లక్ష్యాలకోసం దుర్వినియోగ పరచకుండా ఆపవచ్చు.
ఖగోళ శాస్త్రం
పురాణాలలో లోకం అంతా స్వర్గనరకాలుగానూ, భూమిగానూ విభజించారు. ఇవి ఒకదానిపై ఎకటి ఆధారపడి ఉండగా భూమి అడుగున పాతాళ లోకంలో, ఆదిశేషు వీటన్నిటినీ మోస్తుంది. ఆ సర్పంపై విష్టువు శయనించి ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ ప్రత్యేక దేవతలకు నివాసాలు. రాహువు, కేతువులు తరచు సూర్యచంద్రులను కబళిస్తుంటాయి. అప్పుడు గ్రహణా లేర్పడతాయి. కాంతి పుంజాలు వెదజల్లే ఈ నిస్సహాయ దేవతలను రాహు కేతువుల కబంధ హస్తాల నుంచి తప్పించటానికి పూజా పునస్కారాలతో ఎన్నో వస్తువులు సమర్పించుకోవలసి ఉంది. గ్రహణాలే కాక, వరదలూ, కరువు కాటకాలూ, భూకంపాలూ అన్నీ ఏదో ఒక దేవతకు అంటగట్టారు. వాటి ముందు మానవుడు నిస్సహాయుడు. ఆరాధనతో దేవతలను శాంతింపజేయటం, లేదా పూర్తిగా లొంగిపోవడం, కాదంటే, యోగాభ్యాసం, తపస్సు వల్ల కొన్ని శక్తులు సంపాదించటం మాత్రమే మానవుడు చేయగలిగింది. అంతేగాని దైవశక్తి పనిచేసే తీరును, వివేచనాత్మకంగా తెలుసుకొని వాటి బారి నుంచి తప్పించుకోవటం, లేదా మరొక మార్గాన్ని చూడటం అనేది జరగదన్న మాట. నియమ బద్దమైన ప్రకృతి అనే భావన వస్తువులలోగాని, తీరు తెన్నులలో గాని చూడలేక పోయారు. సైన్సు వల్ల నియమబద్దత వచ్చింది.
నక్షత్రాలను, గ్రహాలను, దేవతా నివాసాలుగా నేడు అందరు మానవులు నమ్మటం లేదు. దుష్ట దేవతల ప్రయత్నం వల్ల శిష్టమైన వాటిని నాశనం చేయటానికి గ్రహణాలేర్పడుతున్నాయని అందరూ నమ్మటంలేదు. మనం ఇప్పుడు, గ్రహణాలను ఊహించవచ్చు. లోగడ మనలను ఆశ్చర్య పరిచే అనేక సంఘటనలను ఇప్పుడు, గంటలూ, నిమిషాలతో సహా అంచనా వేసి చెప్పవచ్చు. భూమి సూర్యుని చుట్టూ గంటకు 65 వేల మైళ్ళ వేగంతో తిరుగుతున్నదని తెలుసుకున్నారు. దీని కాధారంగా శేషనాగు లేదుగాని, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి నిలబడిందని గ్రహించాం. సూర్యోదయం, సూర్యాస్తమయం, సముద్రాల ఆటుపోట్లు, రుతువుల మార్పులు, ఏడాదికొకసారి పక్షులు, చేపలూ వలసపోవడం, నక్షత్రాల, మనుషుల, జీవజాలాల పుట్టుక, చావు కూడా దేవుడు, దేవతవల్ల గాక, అంతర్గతంగా ఉండే నియామాల వల్ల జరుగుతున్నాయి. మానవుడి వివేచనకు ఇవన్నీ అవగాహన అయ్యేవే. తన సాంస్కృతిక పరిణామ భిన్నదశలలో మానవుడు తనను పోలిన దేవుడిని సృష్టించుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలియటం వల్ల ఇంతకు ముందెన్నడూ లేనంతగా మానవుడి సృజనాత్మక శక్తి విమోచన పొందింది.
విజ్ఞానం పరిణామం, పారంపర్యత, జన్యు శాస్త్రం
ప్రపంచంలో మానవుడి స్థానాన్ని గురించి విజ్ఞానం చెప్పిందాన్ని బట్టి ఇటు వంటి విప్లవమే వచ్చింది. ఆధునిక జీవశాస్త్రం ఆవిర్భవించక ముందు, జీవరాశి మూలాన్ని గురించి 1859లో డార్విన్ సిద్ధాంతం లేక పూర్వం, ప్రత్యేక సృష్టిలో మానవుడికి నమ్మకం ఉండేది. విశ్వమంతా 6 రోజులలో సృష్టి అయిందనీ అందులో 3, 5, 6 రోజులలో జీవ సృష్టి జరిగిందనీ, మానవుడు కూడా ఇందులోనే ఉన్నాడనీ బైబిల్ చెబుతున్నది. బ్రహ్మ, (లేదా) ప్రజాపతి సృష్టి చేసినట్లు హిందువుల నమ్మకం. అందులో 3, 5, 6, రోజులలో జీవ సృష్టి జరిగిందనీ, మానవుడి సృష్టి కూడా ఇందులోనే ఉన్నదనీ బైబిల్ చెబుతున్నది. బ్రహ్మ, (లేదా) ప్రజాపతి సృష్టి చేసినట్లు అంగుష్ఠ దేహ కథనుబట్టి, హిందూమతం నమ్ముతున్నది. చాలా పురాణాలు ప్రపంచానికి, జీవితానికి ఇలాంటి మూలమేదో ఉందని నమ్మారు. అంతే తప్ప ఒక జీవికీ, మరొక దానికీ పరిణామ సంబంధాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు. మానవుడి నుంచి సర్పానికీ, సర్పం నుంచి మానవుడికీ మార్పు జరుగుతుందని, సర్వ సాధారణంగా నమ్మారు. అలాగే ఇతర జీవుల విషయంలో కూడా జరిగింది. ఒక జీవి నుంచి మరొకటి పరిణమించటమనేది అనూహ్యంగా ఉండేది. ప్రతి జీవి విశిష్టమేనని భావించారు. కనక పాకే జంతువు నుంచి పక్షి రావడం గానీ, వానరం నుంచి మనిషి రావడం గానీ, అసలు ఆలోచనకే అందలేదు. దేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని నమ్మడం వల్ల పునర్జన్మ వచ్చింది. జీవితానికి ఆత్మ ముఖ్యమనీ, పారంపర్యతను అదే తీసుకుపోతుందనీ నమ్మారు. ఇప్పటికీ చాలా మంది హిందువులు గుండెలో అంగుష్ఠదేహం ఉంటుందనీ, మరణించినప్పుడు అది బ్రహ్మ రంధ్రంగుండా బయటకు పోతుందనీ నమ్ముతారు. ఈ నమ్మకం వల్ల తల్లిదండ్రులు సంతానం యొక్క వంశానుగత లక్షణాలను అసందర్భం అన్నట్లు చూశారు. శాశ్వతమైన ఆత్మ, చావు పుట్టుకల వలయం నుంచి విమోచన పొందేవరకూ తన కర్మానుసారం మళ్ళీ పుడుతూనే ఉంటుంది. తల్లిదండ్రులు కేవలం నిమిత్తమాత్రులు. వ్యక్తి మంచి చెడ్డల వల్ల తల్లిదండ్రుల నిర్ధారణ జరుగుతుంది.
మానవుడి అంతర్గత శక్తుల గురించి, భూమిపై అతడి స్థితిగతులను గురించి ఇటువంటి దృక్పథం వల్ల కులవ్యవస్థకు తాత్విక మద్దతు సమకూడింది. సమాజంలో హెచ్చుతగ్గులు, దోపిడీ, ఇతర అన్యాయాలకు కూడా అండ ఏర్పడింది. మానవుడు పేదవాడైనా, ఆకలితో అలమటిస్తున్నా, శూద్రుడిని పైకులాల హిందువు అమానుషంగా చూస్తున్నా అందుకు కారణం అసమానత్వంతో కూడిన సాంఘిక నిర్మాణం అని గాక, దురదృష్టవంతుడి కర్మ అని చెప్పారు.
ఇదంతా ఊహమాత్రమేననీ, ఆధునిక జీవ, సాంఘిక శాస్త్రాలు కనుక్కొన్నాయి. వ్యక్తి అంతర్గత శక్తియుక్తులన్నీ, అతడి తల్లిదండ్రుల వల్ల, పరిసరాల వల్ల నిర్ధారితమైతాయని తెలుసుకున్నారు. తండ్రి రేతస్సు తల్లి గర్భంలో అండమూ కలిసి పిండం ఏర్పడి వ్యక్తి పుట్టి పెరుగుతాడ. అండంలోనూ, రేతస్సులో కూడా జీవసంబంధమైన పలుచని పొడవైన సూక్ష్మ పదార్ధాలు, వాటినంటి పెట్టుకొని చిన్న జీవాణువులు ఉంటాయి. ఈ జీవ అణువులే (జన్యువులు) వంశపారంపర్యతను కొనసాగిస్తాయి. ప్రతి జన్యువు కూడా వ్యక్తి పెరుగుదలకూ, లేదా పెరగకపోవడానికీ దోహదం చేస్తాయి. జుట్టు రంగు, ఎత్తు, లింగభేదమూ, తెలివితేటలూ, కళలూ ఆలోచనారంగంలో సృజన శక్తులూ, ఉబ్బసంవంటి వంశపారంపర్య రోగాలకు గురికావటం ఇత్యాదులన్నీ ఈ జన్యువుల వల్లనే జరుగుతోంది. భిన్న వ్యక్తులలో జన్యువుల కలయిక భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో ఒకానొక విధంగా జన్యువుల కలయిక కేవలం తల్లి-దండ్రులకు పుట్టిన అనేకమంది వ్యక్తులను పరిశీలిస్తే వారిలోని జీవాణువుల కలయికను ఇంచుమించు సరిగానే అంచనా వేయవచ్చు. ఆధునిక గణాంకశాస్త్రం వల్ల ఇది సాధ్యమవుతున్నది. ఈ విధంగా అభివృద్ధి చేసిన వంశ పారంపర్య నియమాలనే జన్యుశాస్త్రం అంటున్నారు. దీని ఆధారంగా మేలుజాతి పశువులూ, పంటల శాస్త్రం కూడా పెంపొందింది.
ఈ పై విషయాన్ని గమనిస్తే, సంప్రదాయ భావాల నుంచి మనం ఎంత దూరంగా జరిగాయో అర్థమవుతుంది. మానవ స్వభావం, జీవితాన్ని గురించిన మన భావాలలో కూడా ఇటువంటి మార్పే వచ్చింది. జీవులలోని భిన్న రూపాలు పరస్పర సంబంధం లేకుండా దేనికదే విశిష్టంగా ఉండదని ఆధునిక విజ్ఞానం చెబుతున్నది. ఉన్నత జీవరాసులు కింది స్థాయి నుంచి పరిణమించగా, ఇవి ఇంకా తక్కువ స్థాయి నుంచి వచ్చాయి. ఇదంతా సహజంగా జరిగిన ఎంపికే. దీనికి ఎంతో కాలం పట్టిందని సైన్సు మనకు చెబుతున్నది. మానవుడి పూర్వీకుడు వానరం వద్దనే ఆగలేదనీ, ఏకకణ జీవి అయిన అమీబా వరకూ సంబంధం ఉన్నదనీ తెలుసుకోవచ్చు. జీవితానికి తొలిదశ అటువంటి అతి సాధారణమైంది. ఇలా కనుక్కోవటం వల్ల నిరుత్సాహ పడిపోవడమనేది ఆయా వ్యక్తుల మానసిక రీతిని బట్టి ఉంటుంది. ఉన్నత వంశానికి ప్రాధాన్యం ఇస్తూ, తన పారంపర్యతను చూపుకునే వ్యక్తికి, అమీబా వద్ద మనం ప్రారంభమయ్యామంటే ఇబ్బంది కరంగానే ఉంటుంది. మనిషి ఆలోచనా, హృదయ లక్షణాలను బట్టి ఆధునికయుగంలో మానవుడిని అంచనా వేసుకోవాలి. అప్పుడు మూలాధారం నుంచి ఇంతగా పురోభివృద్ధి చెదినందుకు మానవుడు గర్వించవచ్చు.
మానవుడికే కాదు. జీవానికి మూలమేమిటో కూడా వివరించటానికి వీలవుతున్నది. మతాలన్నీ ఆత్మవంటి జీవశక్తిని నమ్మాయి. ఆధునిక జీవరసాయనిక శాస్త్రం గానీ, పరిశోధనాత్మక మనోవిజ్ఞానంగానీ అటువంటి భావాలకు చోటివ్వడం లేదు. జీవానికి మూలం, స్వభావం వివరించవలసి వచ్చినప్పుడు ప్రత్యేక పరిస్థితులలో జీవపదార్థానికి అనుబంధంగా జీవితం ఆవిర్భవించినట్లు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితులను పరిశోధనాలయంలో మళ్ళీ సృష్టించడం కష్టమే గాక సాధ్యం కూడా కాకపోవచ్చు. జీవితం తొలుత ఏర్పడినప్పుడు పరిస్థితులకూ, నేడు భూమి మీద ఉన్న వాతావరణం, రసాయనిక సమ్మిశ్రితం, చాలా భిన్నంగా ఉన్నందున మళ్ళీ మనం ఆదిమస్థితికి పోయి ఆనాటి పరిస్థితులను సృష్టించలేము. ఆ పరిస్థితుల గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఇది సాధ్యపడక పోవచ్చు. ఇది తప్పించుకోవటానికి చేసే సాధనకాదు. విజ్ఞానంలో ఇటువంటి పరిస్థితులు అనేక సందర్భాలలో ఏర్పడ్డాయి. ఉదాహరణకు సముద్రాలూ, పర్వతాలూ ఏర్పడినప్పటి ప్రత్యేకమంచు పరిస్థితిని గానీ, భూమి ఏర్పడినప్పటి ప్రత్యేక పరిస్థితులనుగాని మనం సృష్టించలేము. అంతమాత్రం చేత ఈ సంఘటనలకు అలౌకికశక్తి ఉన్నదని అనలేము. విజ్ఞానంలో ప్రతి సిద్ధాంతాన్నీ ప్రత్యక్ష పరిశోధనకు పెట్టలేకపోవచ్చు. ముఖ్యంగా కొన్ని సంఘటనలు, పునశ్చరణ చేయడానికి వీలులేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అలాంటి సందర్భంలో ప్రత్యక్ష పరిశోధనకు వీలైన వైజ్ఞానిక సిద్ధాంతాలు పైన పేర్కొన్న దృక్పథాన్ని బలపరుస్తున్నందున మనం ఆమోదిస్తున్నాం. విజ్ఞానేతర వివరణలు ఈ పనిచేయ లేకపోయాయి. ఆ జీవస్థితి నుంచి జీవానికి, తరువాత ప్రాణికోటికీ ఇందులో పరాకాష్ఠగా మానవుడి పరిణామం నిరంతరంగా సాగినట్లు విజ్ఞానం చూపింది. “విశ్వం ఎప్పుడు సృష్టి అయింది?” అనే ప్రశ్న సరిగా వేయలేదని కూడా విజ్ఞానం చెపుతున్నది. దీనికి సమాధానం మనం అనుసరించే కాలప్రమాణాన్ని బట్టి ఉంటుంది. ఏమైనా ప్రత్యేక సృష్టి లేదా సృష్టికర్త అనే ప్రతిపాదన మాత్రం మనకు లభించిన సాక్ష్యాధారాలకు సరిపోవడం లేదు.
ఆధునిక విజ్ఞానం కనుక్కొన్న మరొక విషయం మన దేశానికి ప్రత్యేకంగా ఆసక్తికరమైనది. మనకు శతాబ్దాలుగా కులంతో కూడిన సమాజం ఉంది. నాలుగు వర్ణాలు దీనికి ఆధారం, హిందువులలో పుట్టినవారంతా ఏదో ఒక వర్ణానికి చెందినవారే. అగ్ర స్థానంలో బ్రాహ్మణుడూ, అట్టడుగున శూద్రుడూ ఉంటున్నారు. కర్మ సిద్ధాంతానుసారం గతంలోని కర్మల వల్ల ఒకానొక వర్ణంలో పుట్టడం నిర్ధారణ అవుతుంది. ప్రతి వర్ణానికి కచ్చితంగా నిర్ణయించిన హక్కులూ, బాధ్యతలూ ఉన్నాయి. కింది స్థాయికి పోయే కొద్దీ హక్కులకంటే బాధ్యతలు పెరుగుతాయి. అట్టడుగు వర్ణానికి హక్కులు దాదాపులేనట్లే. అమానుషమైన బాధ్యతలు మాత్రం ఉన్నాయి. దీనంతటికీ దైవ ప్రమాణం సిద్ధాంతరీత్యా ఉన్నది. భగవద్గీతలో కృష్ణుడు తానే గుణకర్మానుసారం నాలుగు వర్ణాలను సృష్టించానంటాడు. ఇటువంటి పద్ధతిలో వ్యక్తి చొరవకు ఆస్కారంలేదు, వ్యక్తి స్వేచ్ఛ, హుందాతనానికి గౌరవం లేదు.
నేడు మతేతర విషయాలలో తక్కువ వర్ణాల వారు ఉన్నత కులాల ఆధిక్యతను ఆమోదించటం లేదు. ప్రజాస్వామ్య సంస్థలు రావడంతో, వారు జయప్రదంగా తిరగబడ గలుగుతున్నారు. ఈ తిరుగుబాటు పూర్తి కావాలన్నా, నిర్మాణాత్మకం కావలన్నా ఉన్నత కులాల కంటే తాము తక్కువ వారమనే భావన పోగెట్టుకోనిదే సాధ్యపడదు. బౌద్ధమతంలోకి మారడం కొంతవరకే ఫలితాన్నిస్తున్నది. హిందూ మతంలో ఉన్న కర్మ, కులానికి ఆధారమైన పునర్జన్మలను బౌద్ధమతం ఆమోదిస్తున్నది. కనక మార్గాంతరంగా విజ్ఞానం కనుక్కొన్న వాటికి అనుగుణమైన ప్రపంచ దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. దీనిని బట్టి ఏర్పడే నైతిక దృక్పథం కూడా వ్యక్తి విలువలను సాధించుకోడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విషయమై విజ్ఞానం ఏమి చెబుతుందో తెలియని వారు హిందూ దృక్పథాన్ని సమర్థించేవారి చేతులలో చిక్కుకున్నారు. ఉదాహరణకు కొందరిలో ప్రవహించే రక్తం పరిశుభ్రమైందనీ, అందుకే ఆ వర్ణాలవారు గొప్పవారనీ అంటున్నారు. విజ్ఞానం కూడా నాలుగు విధాలైన రక్తం ఉన్నట్లు పేర్కొనలేదా? అంటున్నారు. ఇది దోషపూరితమైన వాదం. మానవుల రక్తం నాలుగు విధాలుగా ఉన్నట్లు కనుక్తొన్నప్పటికీ వర్ణానికీ దీనికి ఎక్కడా పొంతనలేదు. ఆ మాట కొస్తే బ్రాహ్మణులూ శూద్రులు కూడా ఒక విధమైన రక్తానికీ చెందినవారైతే ఆ బ్రాహ్మణుడి తమ్ముడూ, శూద్రుని కుమారుడూ వేరే విధమైన రక్తానికి చెందిన వారు కావచ్చు. వ్యక్తి అంతర్గత శక్తులకూ, వర్ణం, కులం, జాతికీ ఏ విధమైన సంబంధం లేదు. వివిధ వ్యక్తుల మధ్య ఉన్న భిన్నత్వం వంశపారంపర్యంగా వచ్చింది. ఈ వంశ పారంపర్యత శారీరకమైందీ, పరిసరాలకు చెందిందీ. మానవుడు దీనిని అదుపులో పెట్టగలడు.
సైకాలజి
ఆధునిక విజ్ఞానం వల్ల విశ్వాన్ని గురించీ అందులో మానవుడి స్థానాన్ని గురించీ మన భావాలు మారాయి. ఇంతేకాదు. విజ్ఞానం ఇంకా లోతుకు పోయి మానవుడి మనస్సు పనిచేసే తీరు కూడా ఎలా ఉంటుందో తెలియజెపుతున్నది. మనం చేసే పనులకు వెనక ప్రగాఢమైన ఉద్ధేశాలు, అచేతన ప్రేరణలు ఉంటాయని కనుక్కున్నారు. అయితే మనం మాత్రం వాటిని కావాలని స్వేచ్ఛగా ఎంచుకొన్నట్లే అనుకుంటాం. మన మానసిక జీవితంలో గర్భిత విషయాలను అవగాహన చేసుకోడానికి మనో విశ్లేషణ తోడ్పడింది. తద్వారా వాటిని వాంఛనీయ పద్ధతులలో పెట్టడం సాధ్యమయింది. మానవుడి మనస్సు పనిచేసే తీరును గురించి అంతర్యం తెలియడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రుషికి, పాపికి, చట్టబద్ధమయిన పౌరుడికి, చట్ట వ్యతిరేక నేరస్తుడికి తేడా చాలా స్వల్పం. అది కనుక్కోవడం కష్టం. ఈ తేడా సామాజికంగా, నైతికంగా ముఖ్యం కాదని భావించరాదు. కాని సహనం ఉండాలని మాత్రమే ఇందలి సారాంశం.
సామాజిక శాస్త్రాలు
వైజ్ఞానిక పద్ధతిని అన్వయించడం కేవలం ప్రకృతి శాస్త్రాలకు, మనోవిజ్ఞానానికే పరిమితం కాలేదు. మానవుడు ఆలోచనా జీవి మాత్రమే కాదు. సామాజిక జీవి కూడా. అతడు శక్తి సామర్ధ్యాలను సమాజంలోనే సాధించగలడు. సమాజంలో మానవుడిని గురించి అధ్యయనం చేసేదాన్ని సామాజికశాస్త్రం అంటున్నారు. కుటుంబం, మతం, రాజ్యం, ఆర్థిక రాజకీయ నిర్మాణం, సాంస్కృతిక జీవనం ఇత్యాది సంస్థలను ఈ శాస్త్రం పరిశీలిస్తుంది. ఇవి సాంఘిక వ్యవస్థకు చెందినవి. వాటి మధ్యగల సంబంధం, వ్యక్తులతో వీటికి గల సంబంధం ఇదే సామాజిక శాస్త్రంలో అధ్యయనం చేస్తారు. భౌతిక శాస్త్రంతో పోల్చిచూస్తే, సామాజిక శాస్ర్తం చాలా పిన్న వయసు లోనిదే. కాని వైజ్ఞానిక పద్ధతిని సామాజికశాస్ర్తం అంటున్నారు. కుటుంబం, మతం, రాజ్యం, ఆర్థిక రాజకీయ నిర్మాణం, సాంస్కృతిక జీవనం ఇత్యాది సంస్థలను ఈ శాస్త్రం పరిశీలిస్తుంది. ఇవి సాంఘిక వ్యవస్థకు చెందినవి. వాటి మధ్యగల సంబంధం, వ్యక్తులతో వీటికి గల సంబంధం ఇదే సామాజిక శాస్త్రంలో అధ్యయనం చేస్తారు. భౌతిక శాస్త్రంతో పోల్చిచూస్తే, సామాజిక శాస్త్రం చాలా పిన్నవయసులోనిదే. కాని వైజ్ఞానిక పద్ధతిని సామాజిక శాస్త్రానికి అన్వయించడంలో, సాంఘిక క్రమం పనిచేసే తీరు, లోతుపాతులు తెలిపాయి. ఏ ఒక్క సాంఘిక వ్యవస్థ కూడా శాశ్వతం కాదని తేలింది. లోగడ స్వయం పాలక సమాజాలుండేవి. రాజరికాలు, పౌరోహిత్య ఆధిపత్యాలు, తమకు దైవదత్తాధికారం ఉందంటూ ఇతరులపై పెత్తనం సాగించాయి. సమాజ వ్యవస్థలో కులమై ప్రధానంగా ఉన్న తీరు గమనించాం. అన్ని విధాలా అందరూ సమానమనే సమాజాలూ ఉన్నాయి. ఏమైనా సాంఘిక పరిణామంలో ఒకటి మాత్రం విశ్వసనీయంగా కనిపిస్తున్నది.
సామాజిక కార్యక్రమాలు వివిధ రూపాలలో విస్తరిస్తూ నాగరికతాభివృద్ధితో బాటు క్లిష్టంగా మారేకొద్దీ, కొద్దిమంది చేతుల్లో అధికారం కేంద్రీకృతమౌతున్నది. సంఘటిత సామాజికశక్తే ప్రభుత్వం. అది మనుషులకు దూరమౌతున్నది. ఏమైనా ఆధునిక సాంకేతిక శాస్త్రంలేనప్పుడు, ప్రభుత్వం. ఎంత శక్తిమంత మైనప్పటికీ, వ్యక్తి స్వేచ్ఛకు అంతముప్పు సంభవించలేదు. స్థానిక సంస్థలకు భంగం వాటిల్లలేదు. ప్రభుత్వం వీటి సంక్షేమానికి చేసింది కూడా అంతంత మాత్రమే. ఇప్పుడు సాంకేతిక జ్ఞానం వల్ల జనాన్ని అదుపులో పెట్టే సాధనాలు, పద్ధతులు ప్రభుత్వాలకు లభించాయి. అందువల్ల ముప్పు ఎక్కువైంది. మానవజాతి మనుగడకే ప్రమాదం అని ప్రస్తావించిన సాంకేతిక విషయానికి ఇది అదనంగా తోడైంది. కేవలం సంక్షేమ సాధనాలకే ప్రభుత్వం పరిమితమైనప్పటికీ, రాజ్యం పెనుభూతంగా ఉన్నంతవరకూ, వ్యక్తులను జనాభా లెక్కకే పరిగణించినంత వరకూ వ్యక్తికి ప్రమాదం ఉంది. వ్యక్తి స్వేచ్ఛ, గౌరవం అనే వాటిని సాంకేతిక సమాజంలోని సమర్థత, జటిలత్వంతో పెందికగా, ఇమడ్చడమనేదే నేటి సమస్య, యుద్ధాన్ని లేకుండా నివారించడంతో ఇది ముడిపడి ఉంది. ఈ సమస్యను మానవుడు పరిష్కరించగలడనేది భవిష్యత్తు తేల్చాలి. మానవుడు పరిష్కరిస్తే మాత్రం, జీవితానికి అన్వయించినట్లే చెప్పవచ్చు. పాపాన్ని, ప్రమాదాన్ని చూసి ప్రవక్తలు విచారపడవచ్చు. కాని మార్గాంతరం వారు సూచించ లేదు.
మతం
సాంఘిక వ్యవస్థల భిన్న స్వరూపాలలాగే, మానవుడి సాంస్కృతిక జీవనంలో కూడా పరిణామస్వభావం ఉంది. నేడు మనం దైవంగా భావిస్తున్న విషయం కొన్ని సమాజాలలో అసలు లేనట్లు మానవశాస్త్రం చెబుతున్నది. జెసూట్స్ మిషనరీలు వెళ్ళేటంతవరకు జపాన్ లో దేవుడు అనే మాట లేదు. (చూడు ఆర్థర్ కోస్లర్ రాసిన ది లోటస్ అండ్ ది రోబో, పుట 232) వర్షం, గాలిని దైవాలుగా పూజించిన సమాజాలున్నాయి. నక్క, కాకి, బల్లి, జంతుజాలాన్ని, పాములను, దేహాన్ని వదలిన ఆత్మలు నివసిస్తున్నాయనే విశ్వాసంతో చెట్లను ఆరాధించారు. మానవత్వారోపణగల దేవుళ్ళను కొన్ని సంఘాలు పూజించాయి. ఒకే ఒక పరమాత్మను కొలిచే సమాజాలున్నాయి. అల్లా అందుకు ఉదాహరణ.
ఏకేశ్వరారాధనను ఇంచుమించు అభివృద్ధి చెందిన అన్ని మతాలు అవలంబిస్తున్నాయి. అందులో కూడా చాలా విధాలున్నాయి. పరిణామం కూడా ఉంది. యూదులకు జెందిన జెహోవా, మానవుడిలాగే ఈర్ష్య, పగ సాధింపు లక్షణాలు గలవాడు. సునిశితమైన హిందువుల బ్రహ్మ రాగద్వేషాతీతుడు, జైన, బౌద్ధాలు పరమాత్మును విశ్వసించవు. అటువంటి అవసరం కూడా ఉందని అంగీకరించవు. అయితే హిందూ మతంలాగే ఇవి కూడా కర్మ, పునర్జన్మలను అంగీకరిస్తాయి. యాత్రికులు, పరిశోధకులు పరిశీలించి సేకరించిన వివిధ మతదృక్పథాలు, కొంతవరకు మతమూర్ఖత్వాన్ని తగ్గించడానికి తోడ్పడ్డాయి. మతానికి సమాజ పాత్రను అవి చూపెట్టాయి. ప్రకృతిలోనూ, సమాజంలోనూ మానవుడి పాత్రను గమనించేటట్లు చేశాయి. విజ్ఞానం వచ్చే వరకు మానవుడికి ఇటువంటి అవగాహన లేదు. మతాలన్నీ, వాటి తత్వం ఎలాంటిదైనప్పటికీ, రెండు ప్రధాన విషయాలలో తోడ్పడ్డాయి. మానవుడు తన అనుభవాన్ని దేనిని బట్టి ఇముడ్చుకోవాలో, మతం చూపింది. జీవితంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, మంచి చెడ్డలు నిర్ణయించాలి, తోటి వారిని గురించి నిర్ధారించడం ఎలా అనే ప్రమాణాలను మతం సమకూర్చింది. ఇందులో మేథస్సుకు సంబంధించిన విషయం నేడు ప్రకృతి, సామాజిక శాస్ర్తాలు స్వీకరించాయి. విజ్ఞానం ఆధారంగా ఏర్పడిన నీతి శాస్ర్తం, మతరహిత ధోరణిని అవలంబించడం, లోకాతీత విషయాలతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా ఉండడానికి తోడ్పడటం జరిగింది.
నీతి శాస్ర్తం
ఎవరు ఏ మతాన్ని అనుసరించినప్పటికీ వ్యక్తుల మధ్య సంబంధాల గురించి నీతిశాస్త్రం చెబుతున్నది. సమాజంలో ఉన్న సభ్యులు నియమాలను పాటించాలని, లేదా శాంతి యుతంగా అభ్యంతర పెట్టాలని ఉద్దేశించారు. సత్యానికి విలువ ఇవ్వాలి. సత్యం పలకాలి. చట్టవ్యతిరేక ఆచరణలను అంగీకరించరాదు. సంకుచిత స్వార్థాలను వదలి ఉన్నతమైన నిస్వార్థ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తోటి వ్యక్తి సంతోషంగా ఉండడాన్ని గౌరవించాలి. పొరుగువాడు ఇటువంటీ పనిచేసేటప్పుడు ఇతరుల హక్కులను భంగం వాటిల్లరాదు. హిందువులు ముస్లింలు, క్రైస్తవులు, జొరాస్ర్టియన్లు ఇలా ఎవరైనా సరే-మతంతో నిమిత్తం లేకుండా సభ్యులు ప్రవర్తించాలని సమాజం భావిస్తున్నది. భిన్న సమూహాలకు, జాతులకు వేర్వేరు నైతిక నియమాలు లేవు. మానవజాతి మౌలికంగా భావించే నైతిక సాంఘిక వ్యవస్థకు చెందిన విలువలను కాలరాస్తున్నందుకు దక్షిణాఫ్రికాను, నవచైనాను మనం ఖండిస్తున్నా, దక్షిణాఫ్రికా పాలకులు క్రైస్తవ మతం పేరిట, చైనా నాస్తికత్వం పేరిట ఇలా చేసినప్పటికీ, అందువల్ల మన తీర్పులో మార్పు రాదు. ఈ విధంగా, విజ్ఞానం వల్ల నైతిక శాస్ర్తం మతేతరంగానూ, విశ్వసనీయంగానూ రూపొందడాన్ని గమనించవచ్చు.
మతేతర విధానం వల్ల నీతి శాస్త్రానికి గల చారిత్రక సాపేక్షికత బయటపడింది. 15 వందల సంవత్సరాల క్రితం, మనుస్మృతి మానవస్వేచ్ఛను నిరాకరించడం నీతిగానూ, స్త్రీలకు పవిత్రజ్ఞానం లేకుండా చేయడం సరైంది గానూ పరిగణించింది. పండిత రమాబాయి, అనీబిసెంట్, మదామ్ క్యూరీలను చూసిన తరవాత మత ధర్మాలు నీతి బాహ్యమని ఖండించకుండా ఉండలేము. బానిసత్వం, నియంతృత్వంలాగే ఇది కూడా అమానుషమే.
ఇంతకూ సారాంశం ఏమిటి?
ప్రకృతి అవరోధాల నుంచి, అజ్ఞానం నుంచి మానవుడిని విజ్ఞానం కాపాడిన తీరు గమనించారు.
ప్రకృతిని రక్తసిక్తమైనదిగా కవి ఒకప్పుడు వర్ణించాడు. అప్పుడు అతడిచులు మృగాలు, అంటువ్యాధులు, వరదలు, కరువుకాటకాలు, బలం గలవాడిదే రాజ్యం అన్న నియమాలు- అన్నీ మృత్యు ప్రాయంగా కనిపించాయి. విజ్ఞానం, సాంకేతికం వల్ల అవగాహన పెరగడమేగాక, ప్రకృతిని అనుకూలం చేయడానికి వీలైంది. ఇదంతా చూస్తే, ప్రామిథస్ కూడా తన కల నిజమైందనుకుంటాడు. ప్రామిథస్ ఒక గ్రీకుదేవత. ఇతడు మానవులకు నిప్పు రహస్యాన్ని వెల్లడించాడు. జేమ్స్ వాట్ ఆవిరి శక్తి రహస్యాలను బయట పెట్టినట్లు, దేవుళ్ళకు రాజైన జ్యూస్ తన కుమారుడు ప్రామిథస్ ను ఈ పని చేసినందుకు శిక్షించాడు. ప్రకృతి సంఘటనలు, ఆకాశంలో పరిభ్రమించే గోళాలు, నక్షత్రాలు, రుతువుల మార్పులు, జీవం పుట్టుక మరణం, మానవుడి మనసు పనిచేసే తీరు వాటి అంతర్గత నియమాలననుసరించి జరుగుతున్నట్లు ఇప్పుడు మనకు తెలుసు. ఇవి నిర్ధారణ వాదాన్ని చూపుతున్నాయి. బయట నుంచి అలౌకిక శక్తి ఏదో అదుపులో పెడుతున్నదనే నమ్మకం పొసగడం లేదు. అంతర్గత నిర్థారణ వాదం ప్రకృతికి, మానవుడిలోని స్వేచ్ఛకు వ్యతిరేకం గాదు. పెద్ద యంత్రంలో ఒక మేకులాగ మానవుడు మారిపోవడం లేదు. విజ్ఞానం వల్ల మానవుడు నియమాలను అతిక్రమించక, వాటిని చాకచక్యంతో తప్పుకుంటున్నాడు. తన చర్యల ఫలితాలను అతడు ముందే చూడగలుగుతున్నాడు. అందువల్ల తగిన విధంగా పథకం వేసుకోగలుగుతున్నాడు. శూన్యం నుంచి వచ్చాం. శూన్యంలోకి పోయాం అనే అర్థ రహిత జీవిత విధానం అనుసరించనక్కరలేకుండా పోతున్నది. నియతివాదం మానవుడి స్వేచ్ఛను ఇంకా విస్తరించింది. ఇది విధివాదానికి వ్యతిరేకం. సర్వశక్తిమంతమైన దైవంలో నమ్మకం ఉంటే విధిలో నమ్మకం ఉన్నట్లే.
ప్రకృతి అనుగుణంగా అలవరచుకోడానికే గాక, దాని స్వభావాన్ని పరిశీలించడానికి కూడా చేయూతనిస్తుంది. మానవుడు వంతెనలు జెట్ విమానాలు నిర్మిస్తాడు, కలలుగంటాడు, పథకాలు వేస్తాడు, కవితలల్లుతాడు. తత్వం రాస్తాడు, రైల్వే టైంటేబిల్ ఏర్పరుస్తాడు, ఆశ్లీలసాహిత్యం సృష్టిస్తాడు. బద్దకిస్తాడు, ఆనందిస్తాడు, భావాలకోసం తోటివాడిని చంపుతాడు, కావాలని తాను చనిపోతాడు కూడా. భూకంపాలలాగే మానవుడి చర్యలు అన్ని సమయాల్లో ముందుగా ఊహించలేము. కాని అతడు చేసింది వివేచనాత్మకంగా అవగాహన చేసుకోవచ్చు. జరగబోయే దానికి జరిగిన దానికి ముడి పెట్టవచ్చు. మానవుడి అంతరలోకాన్ని తెలుసుకోవడం అనేది విజ్ఞాన పద్ధతి ఫలితమే.
సైన్స్ అంటే ?
క్రియాత్మక నిర్వచనం
విజ్ఞాని చేసేదే విజ్ఞానం అని నిర్వచనం చెప్పవచ్చు. బయట నుంచి చూసే వారు విజ్ఞాన స్వభావాన్ని గురించి అసంబద్ధంగా, సాధారణీకరించి చెప్పకుండా జాగ్రత్తపడడానికి ఇదొక ప్రయోజనాత్మక నిర్వచనం కావచ్చు. అయినప్పటికీ, విజ్ఞాని చేసేది కేవలం ఒక సర్వసాధారణ విషయం కాదు, అతడు పరిశోధనలు చేసి, ఫలితాలు రాసుకుంటాడు. సహజ, సాంఘిక సంఘటనలను గమనిస్తాడు. తన అధ్యయనంపై ధ్యానమగ్నుడై, సమస్యలను పరిష్కరిస్తాడు. ఎంతో కాలం తీవ్రంగా ఆలోచిస్తాడు. కొన్ని వారాలపాటు తన మనస్సులోనే సమస్య అలా అట్టి పెడతాడు. పరిష్కారం ఒక కొత్త ప్రతిపాదనగా మెదలుతున్నట్లు లేదా, మెరపులాగా కొత్త పద్ధతి తట్టడం కనుక్కొంటాడు. వివిధ దశలలో అతడు వీటిలో దేనికైనా చేయవచ్చు. ఒకే సమయంలో వీటిలో ఒకటికి మించి కూడా చేస్తుండవచ్చు.
విజ్ఞాని పనిచేసే తీరు ఇలా ఉంటే, పైన ఇచ్చిన క్రియాత్మక నిర్వచనం విజ్ఞానాన్ని అవగాహన చేసుకోడానికి మనలను అట్టే దూరం తీసుకుపోదు. విజ్ఞాని ఉద్దేశాన్ని మనం పరిగణనలోకి స్వీకరించక పోవడంలో నిర్వచన లోపం ఉంది. సహజ సంఘటనలు అవగాహన చేసుకోడానికి అవి ఎలా జరుగుతాయో తెలుసుకుంటే చాలు. కాని మానవకార్యకలాపాలు అవగాహన చేసుకోడానికి కనిపించే వాటి వెనుక ఏమున్నదో చూడాలి. అవి ఎందుకు స్వీకరించాడో కనుక్కోవాలి. విజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోడానికి విజ్ఞాని చేసేపని పరిశీలిస్తే చాలదు. విజ్ఞానం తన అభ్యాసంగానో, జీవిత లక్ష్యంగానో ఎందుకు చేపట్టాడో కనుక్కోవలసి ఉంది.
పిపాసగా విజ్ఞానం
విజ్ఞానం అంటే జ్ఞానాన్వేషణ. అంటే విజ్ఞానిలో ఉన్న జ్ఞానాభిలాష, కొన్ని విషయాల తీరు తెన్నుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని సంతృప్తి పరచడం, అటువంటి పిపాసకు తృప్తి లభించినప్పుడు, కనుక్కోవడంలోనూ, అవగాహనలో వచ్చే మహదానందం అన్నమాట. విజ్ఞాన కార్యకలాపాలకు కేవలం జ్ఞానాభిలాష ఒక్కటే ఉద్దేశ్యం కాదనేది వాస్తవమే. మానవుడి మనస్సు అనుకున్నంత అతి సాధారణమైంది గాదు, ఇతర ఉద్దేశాలను కాదనేటంతగా ఏక మార్గాన మనస్సు ఉండదు. ధనాభిలాష, అధికారం, ప్రతిష్ఠకై ప్రాకులాడటం, మానవజాతిని అభివృద్ధి చేడం. వీటిలో ఏదైనా విజ్ఞాని ఉద్దేశాలు గావచ్చు. ఇతర విషయాలన్నీ సమానంగా ఉండగా, ఎవరైనా విజ్ఞానాన్ని అభిలషిస్తే, పరిశ్రమ, రాజకీయాలు, విద్యకంటే ప్రాధాన్యం ఇస్తే, అతడి మేధస్సు అలా పయనించిందనే చెప్పాలి. కొత్త విషయాలు కనుక్కోవాలి అనే ప్రయత్నాలతో వైఫల్యాలు ఉన్నాయని తెలిసికూడా అతడీ దారి చేబడుతున్నాడని గుర్తుంచుకోవాలి. ఏదో తీవ్ర పరిస్థితి వస్తే తప్ప, ప్రకృతిని, మానవుడిని అవగాహన చేసుకోవాలనే పిపాసను అతడు అణచలేడు. మిగిలిన అవకాశాలెన్ని ఉన్నా కాదంటాడు. ఈ విషయంలో విజ్ఞాని ప్రాచీన కాలపు రుషి వంటివాడు. సత్యాన్వేషణకై రుషులు సంపదను కాలదన్నడం వంటిదన్న మాట. ఆధునిక సన్యాసిగా విజ్ఞానికి ఒక సమకాలీన తాత్వికుడు పేరు పెట్టాడు.
వైజ్ఞానికి సత్యస్వభావం
విజ్ఞానికీ రుషికీ ప్రేరణ పొందడంలో పోలిక ఉన్నప్పటికీ, సత్యాన్ని గురించిన వారి భావనలో చాలా తేడా ఉంది. రుషి దృష్టిలో సత్యం అంటే మార్మిక మైంది. అంతర్భుద్ధి, పారలౌకిక లక్షణాలు గలది. వైజ్ఞానిక సత్యం విమర్శనాత్మక నిర్మాణంతోనూ, ప్రాపంచికానుభవంతోనూ, మతంతో నిమిత్తం లేని స్వభావంతోనూ ఉంటుంది. వీటిని వివరించవలసి ఉంది.
ప్రతిపాదన, నిర్ణయాలు అనే పద్ధతిలో అంతర్వాణి (Inner Voice) ఇమడదు. జీవితంలో ఏకత్వం, కవి అంతస్సాక్షి, చిత్రకారుడి రూపకల్పనా దృష్టి, మార్మికుడి ఆనందసాగర భావన, పైకి భిన్నంగా కనిపించే వాస్తవాలను, ఐక్యపరచే నియమాలను కనుక్కొనే విజ్ఞాని దృష్టి ఇవన్నీ వాస్తవానికి చెందినవి. అంతర్భుద్ధి అవగాహన ఒక మెరుపులాగే వస్తుంది. రుషికీ దివ్యదృష్టి కలిగిందన్నమాట. ఈ అంతస్సాక్షి దోషపూరితం కానక్కరలేదు. నిజం, అబద్ధం అనేవి వీటికి అన్వయించవు. పైన ఉదహరించిన నాలుగింటిలో కవి, మార్మికుడి విషయంలో భావన ప్రధానమైతే, చిత్రకారుని విషయంలో సృష్టి ముఖ్యం. ఈ దృష్ట్యా వాటిని నిజం, అబద్ధం అనడం అర్థం లేదు. కొద్ది మార్పులతో ఈ విషయాన్నే కళలకు కూడా అన్వయించవచ్చు. అజంతా, ఎల్లోరా చిత్రాలు, శిల్పాలు కళాఖండాలుగా వచ్చు. ఎందుకూ కొరగానివి కావచ్చు. అంతేగాని అందులో నిజం, అబద్ధం ప్రసక్తి లేదు. అని ఉన్నాయి అంతే. కాని విజ్ఞాని కనుక్కొన్న నియమం విషయంలో అబద్ధమో, నిజమో నిర్ధారించవచ్చు. నియమం అనగానే కొన్ని సంబంధాలు వ్యక్తమౌతాయి. ఈ సంబంధాన్ని వాస్తవంతో సరిచూసినప్పుడు, విజ్ఞాని కనుక్కొన్నట్టలు చెబుతున్న సత్యం సరైందో కాదో చెప్పవచ్చు. 1916లో ఐన్ స్టీన్ తన సాధారణ సాపేక్షతా సూత్రాన్ని చెప్పినప్పుడు, విజ్ఞానవేత్తలు, దీన్ని ఆమోదించే ముందు 1919లో కీలకమైన పరీక్షకు పెట్టారు. అప్పుడు ప్రకృతిని గురించి ముఖ్యమైన సత్యంగా ఈ సూత్రాన్ని ఆమోదించారు.
వైజ్ఞానిక సత్యం వివేచనాత్మకం
సాపేక్షతా సిద్ధాంతం రూపొందించిన ఐన్ స్టీన్, హఠాత్తుగా అంతర దృష్టితో చెప్పాడా, సుదీర్ఘమైన ఆలోచన చేశాడా (ఇవి రెండూ పొసగనివి కావు) అగమ్య గోచరంలో అన్వేషించాడా అనే విషయాన్ని బట్టి అతడి సిద్ధాంతం ఆధారపడి లేదు.
ఒకానొక విశిష్టమైన వ్యక్తికి హఠాత్తుగా సాక్షాత్కరించడం, అనుభవం లేనివారికి పూర్తిగా అవగాహన కాదనటానికి వీలులేదు. ఈ సిద్ధాంతం కొన్ని ప్రతిపాదనలతో కూడింది. ఒకవిధమైన సంఘటనలను, వాటి సంబంధాలను ఈ ప్రతిపాదన నిర్ధారణగా చెపుతుంది. ప్రతిపాదనలో కొన్ని మౌలిక ప్రాతిపదికల తాత్విక ఫలితాలు రాబట్టటం జరిగింది. వీటి విలువ ప్రత్యక్ష ప్రాపంచిక అనుభవాన్ని బట్టి లేదా పరోక్షంగా ఊహించి నిర్ధారణ రూపంలో ఉంటుంది. దీనినే వివేచనాత్మక రూపం అంటారు.
వైజ్ఞానిక సత్యం వివేచనాత్మకం, కనక స్పష్టంగా ఆలోచించగలవారికి ఎవరైనా, వైజ్ఞానిక భాషను లోతుపాతులతో గ్రహించగల అభిరుచి ఉన్నవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంటే వైజ్ఞానిక సత్యం బహిరంగ సత్యం అన్నమాట. కళాకారుడి లేదా మార్మికుని సాక్షాత్కారం లాగేకాక, వైజ్ఞానిక సత్యంలో వ్యక్తి పరమైంది గాని, గోప్యమైంది కాని ఏమీ లేదు.
వైజ్ఞానిక సత్యం ప్రాపంచిక అనుభవపరమైంది, మత రహితం కూడా
ఈ ప్రపంచంలో జరిగే వాటితో మాత్రమే విజ్ఞానానికి సంబంధం ఉంటుంది. మానవ పరిశీలనకు అందుబాటులో లేని ఊహాపూరిత ప్రపంచంతో సైన్సుకు నిమిత్తంలేదు. ఈ దృష్టితో చూస్తే వైజ్ఞానిక సత్యానికి సంబంధించిన విషయమంతా ప్రపంచానికి సంబంధించిందే. అంతమాత్రాన విజ్ఞానంలో ఊహకు (పరికల్పనకు) స్థానం లేదని అనుకోలేదు. ఆధునిక వైజ్ఞానిక సిద్ధాంతాలలో భావనలలో, ముఖ్యంగా ఆధునిక పదార్థ విజ్ఞానంలో మన సిద్ధాంతాలకంటే ఎక్కువ ఊహ అవసరమవుతున్నది. మన అవగాహన పెరగటం, మన వివేచన సునితంగా ఉండటం వల్ల మన ఊహ కూడా సంప్రదాయ బద్ధమైన సంకెళ్ళనుంచి విమోచన పొంది, గతంలో ఊహించినవారికి అందుబాటులో లేనంతగా విస్తరిస్తున్నది. కాని వైజ్ఞానిక సిద్ధాంతం కొన్ని సందర్భాలలో ఊహతోకూడినట్లు కన్పించినా, ఒక ప్రమాణాన్ని సంతృప్తి పరచవలసి ఉంటుంది. ఏదో ఒక క్లిష్ట అనుభవదశలో భౌతిక వాస్తవంతో సంబంధం పెట్టుకోకతప్పదు. అలాకానట్లయితే కట్టుకధకూ, విజ్ఞానానికీ విచక్షణ లేకుండా పోతుంది. ఈ విషయంలోనే వైజ్ఞానిక సత్యానికి, పారలౌకిక సత్యానికి తేడా ఉన్నది. పారలౌకిక సత్యం పరీక్షకు నిలబడలేదు.
వైజ్ఞానిక సత్యంలో గల అనుభవానికి, మతరహిత విధానానికి సన్నిహిత సంబంధం ఉంది. చిట్ట చివరకు మానవుడికి మంచి జరుగుతుందనే భావన, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మంచి ఉంటుందనే భావన మతరహిత ప్రాధాన్యం తగ్గిపోతుంది. అంతే గాక సిద్ధాంతాన్ని వాస్తవం దృష్ట్యా పరీక్షించటం, ఆదర్శాన్ని ఆచరణ దృష్ట్యానూ, వాస్తవాన్ని ఆదర్శం దృష్ట్యానూ పరిశీలించనవసరం లేకుండా పోతుంది. జీవితానికి సంబంధించిన పారలౌకిక దృష్టిని బట్టి, జీవన్మరణ బంధనం నుంచి ఆత్మ విమోచన చేయటానికి లోకంలో జీవితం అనేది ఒక సోపానంగా భావించనందున పరోలక దృష్టితో పోల్చి చూసినప్పుడు సెక్యులర్ ఆదర్శాలు (స్వేచ్ఛ, సమానత్వం) సెక్యులర్ ధర్మాలు (అందరి మంచికై సహకారం, సహనం) ద్వితీయ ప్రాధాన్యం కలవిగానే భావించబడుతున్నాయి. పారలౌకిక సత్యాన్ని నిశిత పరిశీలనకు గురిచేయటానికి వీలులేదు కనక దీనికి నమ్మకమే ఆధారంగా ఉంటుంది. నచ్చ చెప్పటానికి బదులు ఒత్తిడి చేయటం వల్ల పారలౌకిక సత్యానికి ప్రమాణం రూపొందిస్తున్నారు. మానవతలో వివేచనతో కూడిన నీతిశాస్ర్తం ఉంటుంది. సెక్యూలరిజంలో చెప్పేదాన్ని బట్టి మానవుడు స్వేచ్ఛగా ఆత్మ గౌరవంతో ఈ ప్రపంచంలోనే సంపూర్ణ భౌతిక సాంస్కృతిక జీవితాన్ని అనుభవిస్తాడు. సత్యాన్ని గురించి ఇటువంటి వివేచనాత్మకమయిన భావనగల సెక్యులరిజం, మానవుడు తనను, తన పరిసరాలను అవగాహన చేసుకో గలడంటుంది. ఈ అవగాహనలను నిర్మాణాత్మకంగా ఉపయోగపెట్టు కోవడానికి వీలుగా తోటివారితో మానవుడు సహకరించగలడు. నీతి శాస్త్రానికి మతంతో సంబంధం లేని ఆదర్శానికి పొత్తు కుదరటం వల్ల దీన్ని సాధించుకునే మార్గాన్ని చూపటం వల్ల ప్రపంచంలో నీతికి స్థానాన్ని ఏర్పరుస్తుంది, అదే వైజ్ఞానిక సత్యం విశిష్టత.
వైజ్ఞానిక విజయభేరి
విజ్ఞానానికి మరొక దృక్పథం ఉంది. సాంకేతికాభివృద్ధి, జ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తూ మానవ విలువలను సాధించుకోవటానికి వీలుగా భౌతిక, సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంటే విజ్ఞానం ప్రకృతిని, అజ్ఞానాన్ని, పేదరికాన్ని, జబ్బులను వీటన్నిటి వల్ల వచ్చే దోషాలను జయిస్తున్నదన్న మాట. ఓపెన్ హైమర్ అభిప్రాయాన్ననుసరించి ఎనిమిదేళ్ళలో నేటి జ్ఞానం రెట్టింపు అవుతున్నది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఈ జ్ఞానాభివృద్ధికి 30 సంవత్సరాలు పట్టింది. అంతకు ముందు ఆధునిక విజ్ఞానయుగంలో ప్రవేశించటా నికి శతాబ్దాలు పట్టింది. జ్ఞానాభివృద్ధి ఇంత వేగంగా జరగటానికి సాంకేతిక శాస్త్రం ఎంతో తోడ్పడింది.
విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టటమే సాంకేతికశాస్త్రం. కాని అనేక సందర్భాలలో ఒకానొక పరికరం కొత్త జ్ఞానాన్ని ఆర్జించుకోవటానికి తోడ్పడుతుందో, అదనంగా శక్తిని సమకూర్చుకోవటానికి ఉపయోగపడుతుందో నిశ్చయంగా చెప్పటం కష్టం. రాడార్ లాగ, దీని పాత్ర కూడా రెండు విధాలుగా ఉంటుంది. విజ్ఞానానికి సాంకేతికానికి, సిద్ధాంతానికి అన్వయానికి గిరిగీసి తేడా చూపడం దుర్లభం. జ్ఞానమే శక్తి అనే విషయాన్ని ఆధునిక విజ్ఞానం, సాంకేతిక శాస్త్రాలకు అన్వయించి నప్పుడు చాలావరకు వాస్తవం అనిపిస్తుంది.
విజ్ఞానం తప్పనిసరిగా అన్వయించగలం అనటానికి వీలులేదు. ఉదాహరణకు విశ్వశాస్త్రజ్ఞానం సాంకేతికంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ ఇంకా స్పష్టం కాలేదు. అయినప్పటికి 20వ శతాబ్దిలో సునిశిత వైజ్ఞానికులు కొందరు ఆకాశం అంచులు కనుక్కోవటానికి, ప్రకృతి ఎలా ఆరంభం అయిందీ తెలుసుకోవటానికి, ప్రకృతిలోని భాగాలు ఒకదాని నుంచి మరొకటి అతి వేగంగా దూరమయి పోతున్నప్పటికీ మొత్తం మీద ప్రకృతి నిర్మాణం అలాగే కొనసాగటం ఎలా సాధ్యమనేది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
సమాజంపై సాంకేతిక విజ్ఞాన ప్రభావం
ఇంకొకందుకు కూడా విజ్ఞానానికీ, సాంకేతికానికీ తేడాను గమనించటం అవసరం. విజ్ఞానం జ్ఞానతృష్ణకు చెందింది. ప్రకృతికి సంబంధించిన జ్ఞానం, అందలి కార్యకారణ సంబంధాలు విజ్ఞాన విషయాలుగా ఉంటున్నాయి. సాంకేతిక శాస్త్రం శక్తి సాధనం. విజ్ఞానం విమోచన శక్తిగా మాత్రమే పనిచేస్తుంది. సాంకేతిక శాస్త్రం మానవుడి స్వేచ్ఛను అదుపులో పెట్టగలదు, విస్తరించగలదు. ముఖ్యంగా భారీ సాంకేతిక శాస్త్రంలో ఇది వాస్తవమే. ఉత్పత్తి పెరగటం, కాలాకాశ అవధులు పోవటం సాంకేతిక శాస్త్ర పరంగానే జరిగింది. కాని అధికార కేంద్రీకరణ, మానవుడు లోని పాశవికత్వం చోటుచేసుకోవడం ముఖ్యంగా నగర సమాజాలలో చూడవచ్చు. మానవజాతి నంతటిని రూపు మాపే అణ్వస్త్రాల ప్రమాదం ఆధునిక సాంకేతిక శాస్త్రంలో గర్భితంగా ఉంది. అధికార కేంద్రాలపై అదుపు ఉన్న వారు నైతికంగా, మేధస్సు సంబంధంగా పరిణమించకపోతే ఈ ప్రమాదం తప్పదు.
ఈ ప్రమాదానికి విజ్ఞానాన్ని తప్పుపట్టడం సరైందని కాదు. ఫలానా సాంకేతిక శాస్త్రం కావాలని విజ్ఞానం చెప్పదు. ఒకానొక సమాజం మరమగ్గాలను, లేదా నేత మిల్లులను ఉపయోగిస్తుందా అనేది ఆ సమాజంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రెండు విధాలైన సాంకేతిక పద్ధతులకు ఆధారంగా ఉన్న పదార్థశాస్త్రం ఒక్కటే. ఈ పదార్థ విజ్ఞాన సూత్రాలను అవగాహన చేసుకోవటం మానవ జాతి సాంస్కృతిక చరిత్రకు ఎంతో ఉపయోగకరం. కనక విజ్ఞానాన్ని ఎక్కువ ఉంచాలనేది సమస్య కాదు. మానవ లక్షణాలకు సాంకేతిక శాస్త్రాన్ని అనుకూలం గావించటమే సమస్య.
ఇందు నిమిత్తం సాంఘిక, విద్యా సంబంధమైన ధోరణి కావాలి. అధికారంలోని చైతన్యతను అధ్యయనం చేసి, అధికార కేంద్రీకరణ జరగకుండా మన సంస్థలను తీర్చి దిద్దుకోవాలి. అంటే అధికారం ఏ ఒక్క ముఠా గుత్తాధిపత్యం కింద లేకుండా చేయాలి. ఇందుకు వికేంద్రీకరణ ఒక్కటే చాలదు. గ్రామస్థాయిలో సహితం ఏ ఒక్క ముఠావారు కూడా వివిధ అధికారాలను చేజిక్కించుకొని మిగిలిన సమాజాన్ని అటాడించే పద్ధతులను పోగొట్టాలి.
ఈ లక్ష్య సాధనకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఉదాహరణకు మన సాంస్కృతిక సంపద అంతా పెత్తందారీ లక్షణాలలో ఉన్నది. కనక మనలో ఉత్తములు కూడా అధికారాన్ని ఆరాధిస్తూ మానవ విలువలను బలిచేయటం కద్దు. ఈ ధోరణి వల్ల దేశంలో మానవతా విలువలు పెంపొందకుండా ఆటంకం వాటిల్లుతుంది. ఈ విలువలను సాధ్యమైనంతవరకు విస్తరింపచేస్తే సాంకేతిక శాస్త్రం మానవుడికి హాని చేయజాలదు. అదీకాక సాంస్కృతిక పరిణామంలో అధికారం స్వభావం గురించి మనకు అంతగా తెలియదు. ఇది సామాజిక విజ్ఞానానికి సంబంధించిన సమస్య. విజ్ఞానం, సాంకేతికం ఎలాంటి సామాజిక సంబంధాలు తెచ్చి పెడుతుందనేది కూడా సామాజిక శాస్త్రజ్ఞులే పరిశీలించాలి.
ఈ చిక్కులను విడదీయడానికి, సామాజిక పునర్నిర్మాణానికి, వైజ్ఞానిక పంథా అవసరం. మన విద్యారంగంలో ప్రస్తుత పద్ధతుల స్థానే కొత్త విధానాలను ప్రవేశపెడితే తప్ప పెత్తందారీ సంప్రదాయ భారాన్ని పోగొట్టుకోజాలం. వివిధ విజ్ఞాన శాఖలు కనుక్కొన్న వాటిని సమన్వయించి చూస్తే గాని అధికారంలోని లోతుపాతులు అవగాహన కావు. అలాగే సామాజిక రంగంలో భిన్న శాఖలను కొత్త దృక్పథంతో పరిశీలించాలి. ఇందుకు వైజ్ఞానిక పద్ధతి అంటే ఏమిటో తెలుసుకోవాలి.
శాస్త్రీయ పద్ధతి
బేకన్ అనుసరించిన ఆగమన (Inductive) పద్ధతినే విజ్ఞానంగా భావించారు. సర్వసామాన్యంగా సంప్రదాయానుసారంగా వస్తున్న తర్కానికి, మత విజ్ఞానానికీ విశిష్ట పద్ధతిని తొలుత బేకన్ (1561-1626 క్రీ.త) రూపొందించారు. మన విజ్ఞానాన్ని గురించి ఇక్కడ అట్టే వివరణ అక్కరలేదు. అదంతా చివరకు అలౌకిక, మానవాతీత శక్తిపై ఆధారపడుతుంది. మానవ వివేచన పరిధిలోకి అది రాదు.
ఇక బేకన్, సంప్రదాయ తర్కాన్ని విమర్శిస్తూ, ఆగమన పద్ధతిని, ప్రవేశపెట్టాడు. దీన్ని ఇలా పేర్కొనవచ్చు. ముందుగానే ఏర్పరచుకున్న భావాలను, ద్వేష ధోరణులను పక్కనబెట్టి, ఏ మాత్రం అవకాశం లభించినా రకరకాల ప్రతిపాదనలు చేసే విధానం నుంచి నిగ్రహం చూపాలి. దీనికి బదులు, వాస్తవాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఈ వాస్తవాలను పరిశీలించాలి, వర్గీకరించాలి. అంచెలవారీగా వాటికి అన్వయించే సూత్రాలను బట్టి సిద్ధాంతాన్ని రాబట్టాలి. సర్వసాధారణ సూత్రాలకు రావడమనేది చిట్ట చివరకు చేయవలసిన పని మాత్రమే. లేకుంటే, ప్రకృతి విషయమై ముందే ఊహించడం జరుగుతుంది. అంతేగాని ప్రకృతికి భాష్యం చెప్పడం జరగదు.
వైజ్ఞానిక ప్రతిపాదనలో అంచనా వేసే శక్తి
అందరికీ తెలిసిన వైజ్ఞానిక పద్దతిలోని ఒక అంశాన్ని వదిలేసినట్లున్నది. ప్రతి ప్రతిపాదన కూడా బేకన్ చెప్పిన ధోరణిలో రాబట్టినప్పటికీ, అంటే-ఒక్కొక్క విషయం ఆధారంగా సర్వసాధారణ ధోరణికి చేరినా, వైజ్ఞానిక సిద్ధాంత స్థాయికి చేరుకోవాలంటే మాత్రం, రుజువు అనేది తప్పదు. నిగమన తర్కం సహాయంతో, ప్రతిపాదనలో ఇమిడిన విషయాలు పరిశీలించడం, కొత్త పరిశీలనతో ఇవి సరిపోతున్నాయో చూడడం ముఖ్యం. మామూలుగా ప్రతిపాదనలన్నీ భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించిన అంచనాలే అయి ఉంటాయి, కొన్ని సందర్భాలలో మాత్రం జరిగిపోయిన వాటిని గురించి తెలియదన్నమాట. గతాన్ని అధ్యయనం చేసే భూగర్భ, జీవపరిణామ శాస్త్రాలలో ఈ విషయాలు ఉంటాయి. అయితే గతాన్ని, భవిష్యత్తును గురించిన అంచనాలలో సర్వసాధారణ లక్షణం ఒకటున్నది. ప్రతిపాదనే లేకుంటే వాస్తవాల అన్వేషణ జరగదనేది ఇందలి విశేషం, రుజువుకు ఇదే ముఖ్య విషయం.
చారిత్రక సందర్భం
అయితే కొన్ని ముఖ్యవిషయాలలో ఈ విధమైన వైజ్ఞానిక ధోరణి అసంపూర్తి మాత్రమేగాక తప్పుతోవను పట్టించవచ్చుకూడా. బేకన్ సూత్రీకరణను సరిగ్గా అవగాహన చేసుకోవడానికి అతడు నివసించిన కాలం, సందర్భాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఆధునిక యుగారంభంలో బేకన్ రాశాడు. అప్పట్లో విజ్ఞానవేత్తలు తమ స్థానానికై పెనుగులాడ వలసివచ్చింది. అంతేగాక మత విజ్ఞానం సనాతన పద్ధతుల నుంచి బయటపడి విజ్ఞానం తానుగా ఒక మార్గాన్ని చూడగలదనే ధోరణిని శాస్త్రవేత్తలు అవలంబించలేకపోయారు. బ్రూనోను తగలబెట్టారు. గెలీలియో వెనుకంజ వేయవలసి వచ్చింది. గ్రహాల చలనంలో కెప్లర్ దైవసంబంధమైన సంగీతాన్ని విన్నాడు. ఆనాడు విజ్ఞాన వేత్తలలో ఉన్నత స్థాయిలో ఉన్న న్యూటన్ సహితం, ప్రకృతి తత్వంపై చూపిన శ్రద్ధను, మత విజ్ఞానంపై కూడా చూపాడు. నేటి నైతిక సామాజిక ధోరణితో చూస్తే ఇదంతా అవాంఛనీయంగా వినిపించినా ఆనాడు ఇదేమంత ఆశ్చర్యకరమైన విషయంకాదు. ప్రాచీన కాలంలోని వివేచనలోని పెత్తందారీతనం చాలా ప్రభావాన్ని చూపెట్టింది. దానికి విరుద్ధంగా పోవాలంటే, వ్యతిరేకించే వాస్తవాన్ని ప్రవేశపెట్టాలంటే ఒక పట్టాన ఆమోదంపొందే అవకాశం ఆనాడు లేదు.
అరిస్టాటిల్ నుంచి న్యూటన్ వరకు దాదాపు రెండు వేల సంవత్సరాల కాలంపాటు పెంపొందిన వైజ్ఞానిక శాస్త్రం చాలా స్వల్పంగానే ఉంది. సంప్రదాయ బద్ధంగా వస్తున్న లోకాన్ని గురించిన భావంపై ఈ విజ్ఞాన ప్రభావం అంతగా ఉండే అవకాశంలేదు. కనకనే గతం యొక్క భారం ఎక్కువగా ఉండడానికీ తగిన కారణం ఉన్నదనుకోవచ్చు. దీనికి తోడు మరొకముఖ్యమైన విషయంకూడా పేర్కొనాలి. బేకన్ ఈ వైజ్ఞానిక సమస్యను ప్రస్తావించాడు. ప్లేటోతో, పాతుకుపోయిన ఈ పంథాననుసరించి కంటికి కనిపించే వస్తువులు అన్నీ, అసంపూర్తి రూపాలు మాత్రమే. వీటి వెనుక శాశ్వతమైన భావాలు ఉన్నాయి. ఆ భావాలే వాస్తవమైనవీ, సమగ్రమైనవీ, మిగిలినదంతా అనుకరణ మాత్రమే. కనక అసంపూర్తి అయినవి, అంతవాస్తవం కానివి అన్నారు. ఉదాహరణకు సజీవంగా ఉన్న గుర్రంగాని, మనిషిగాని గుర్రపుతనానికి, మనిషితనానికి అనుకరణ అన్నమాట. కనక ఇవి హీనమైనవి. మానవుడు లేదా గుర్రానికి సంబంధించిన నిజస్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి సంతృప్తికరమైన తోవ చూపలేవు. అంటే ప్రాపంచికానుభవంతో కూడిన అధ్యయనం వస్తువుకు సంబంధించిన సమగ్రసత్యాన్ని తెలుసుకోవడానికి తోడ్పడదు. మూలానికి బదులు ప్రతిమలను అధ్యయనం చేయటమే ఇందుకు కారణం. భౌతిక వస్తువులను కంటితో చూస్తున్నట్లే, అంతరదృష్టితో కూడిన వివేచనతో భావాలను అవగాహన చేసుకోవడం, గ్రహించడం, చూడటం వల్ల సరైన జ్ఞానం లభిస్తుంది అంటారు.
ఇటువంటి విజ్ఞాన సిద్ధాంతం వల్ల, సర్వసాధారణమైన సూత్రాలకు అవరోధం తప్పదు. కేవలం వివేచన ఆధారంగా సూత్రాలను రూపొందించడం వల్ల సర్వ సాధారణమైన సత్యాల ఆధారంగా పరిశీలించవలసిన విషయాలను వివరించలేక పోవటం జరిగింది. ప్లేటో జ్ఞాన సిద్ధాంతం ఆధారంగా మాత్రమే తర్క న్యాయ (Syllogism) ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రధాన ప్రతిపాదనలోని సత్యాన్ని తెలుసుకుంటే తప్ప, న్యాయ తర్క విధానం మూలాన్నే ప్రశ్నించినట్లవుతుంది. అయితే ప్రధాన ప్రతిపాదన విశ్వవ్యాప్తమైన సత్యంగా గ్రహిస్తే రూపొందించిన నిర్ణయం ప్రాధాన్యం లేకుండాపోతుంది. ఉదాహరణకు సర్వసామాన్యమైన సోక్రటీస్ కు సంబంధించిన తర్క న్యాయ విధానంలో, అతడికి సంబంధించిన కొత్త జ్ఞానాన్ని చూడాలంటే, మానవుడిలో చావు ఇమిడి ఉన్నదని గ్రహించాలి. ఇందులో మధ్య ప్రతిపాదన సూటిగా రుజువు పరచవచ్చు. సంప్రదాయబద్ధమైన విజ్ఞాన సిద్ధాంతంలో వాస్తవాలకూ, వాటిని సేకరించి భాష్యం చెప్పే పద్ధతికీ ద్వితీయ స్థానం మాత్రమే ఉంది.
పై విషయాల ఆధారంగా చూస్తే వైజ్ఞానిక పద్ధతికి బేకన్ తోడ్పాటు గ్రహించవచ్చు. బేకన్ సంప్రదాయ పద్ధతిని ఖండించాడు. వాస్తవాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రతిపాదనకు తుది నిర్ణయంగా వాస్తవాలు స్వీకరించాడనటం వైజ్ఞానిక పద్ధతి పరిణామంలో ఒక నూతన దశ అనుకోవచ్చు. ఇక ముందు మతం చెప్పే పిడివాదంగానీ, అది భౌతిక వాదులు సూక్ష్మంగా ఊహించే పద్ధతిగానీ మానవుడి ప్రకృతి అన్వేషణను ఆపజాలవు. ప్రకృతి నియమాలను తనకనుకూలంగా మలచుకొని ముందుకు పోయే ధోరణిని కూడా ఆటంక పరచలేవు. తార్కికంగా ఆలోచించటమనే పద్ధతి మానవుడి విశిష్ట లక్షణం. దీనికి ప్రాపంచికానుభవం చుక్కాని లాగ పనిచేస్తుంది. తెలియని విషయాలకు దారులు వేస్తుంది. ప్రగతికీ, ఆనందానికీ అనూహ్యమైన బాటలు నిర్మిస్తుంది.
బేకన్ ఆగమన పద్ధతిలో పరిమితులు
ఏ రంగంలోనైనా ప్రప్రథమంగా జరిగే కృషిలో ఉండే పరిమితులలాగే, బేకన్ కృషిలోకూడా కొన్ని పరిమితులు లేకపోలేదు. అన్వేషణలో సాధనలు సునితంగా పెంపొందేకొద్దీ ఈ విషయాలింకా స్పష్టమవుతున్నాయి. సత్యాన్వేషణలో సృజ నాత్మకత, ఊహకుగల పాత్రను ఇతను అశ్రద్ధ చేశాడు. వాస్తవాలపై అతిగా ఆధారపడ్డాడు. వాస్తవాలను ఆవరించి ఉన్న సూత్రాల ఆధారంగా సిద్ధాంతాలు రాబట్టట మొక్కటే ప్రధానంగా స్వీకరించాడు. ఆనాడు సంప్రదాయికంగా ఉన్న పద్ధతిని సర్వసాధారణ సూత్రాలకు హఠాత్తుగా దారితీసే విధానాన్ని ఖండించాడు. దీనివల్ల అందులో ఉండే ఆవశ్యక విషయాన్ని కూడా తోసిపుచ్చినట్లయింది.
అనుభవానికి మించి పోవడానికి అంగీకరించకపోతే కేవలం నిస్సార పంథా అవుతుంది. వాస్తవాలు, ఒకేరీతిగా ఉన్నా, భౌతిక విజ్ఞాని, చిత్రకారుడు, కవి, వాటిని భిన్న దృక్పథాలతో పరిశీలించి విభిన్న సృష్టి చేసే నిమిత్తం అదే వాస్తవాలను ముడిసరుకుగా వాడుకుంటారు. వాస్తవాలకు భాష్యం చెప్పటంలో ఎవరి మనోపరిధి వారికి ఉన్నది. ఆ కోణంలో వారు పరిశీలించి మళ్ళీ సృష్టించుకోడంలో తమ ధోరణినే అవలంభిస్తారు. ఇంకా ముందుకు వెళ్ళి చెప్పాలంటే కేవలం వాస్తవాలంటూ లేవు. ఏ వాస్తవమైన చర్చనీయాంశం కావాలంటే, ఒక భాషలోకి మలచవలసి ఉంటుంది. ఒక నిర్దిష్టమైన భావనా పరధిలోకి తీసుకురావలసి ఉంటుంది. ఒక సంస్కృతిలో నివసించే ప్రజలు చాలామంది సాధారణ భావాలను ఒక విధంగా గ్రహిస్తారు. కనకనే వాస్తవాలను ఇంచుమించు ఒకే దృష్టితో చూస్తారు. భావనారీతులలో ఇటువంటి అంగీకారం ఉండటం వల్ల మానవుడు సాంస్కృతిక సృష్టిని కొనసాగించటానికి, పరస్పరం అవగాహన చేసుకోవటానికి వీలవుతున్నది. అయితే ఈ అంగీకారం సంపూర్ణం కాకపోవటం అదృష్టమనాలి. లేకుంటే అభివృద్ధికి అవకాశమే ఉండేదికాదు.
కేవలం ప్రాపంచిక అనుభవాలు, సత్యాన్వేషణలో పరిమితంగానే ఉపయోగపడతాయి. అనేక వాస్తవాలకు సంబంధించిన సాధారణ లక్షణాలు మాత్రమే స్వీకరించి సిద్ధాంతాలు రాబట్టినంతవరకూ సంతృప్తికరమైన ఫలితాలు దక్కుతుంటాయి. వైజ్ఞానిక దశలో ఇది వర్గీకరణస్థాయికి చెందింది. 20వ శతాబ్ది ఆరంభం వరకూ జీవశాస్త్రం, ప్రస్తుతం పరిశోధనలో ఉన్న మనస్తత్వ శాస్త్రం ఈ స్థాయిలోనే ఉన్నాయి. అటువంటప్పుడు అధ్యయనం చేసే విషయాన్ని అవగాహన చేసుకోవటానికి, సిద్ధాంతపరమైన భావాలకు సంబంధం చూడవచ్చు. బేకన్ సూచించినట్లు వాస్తవాల నుంచి సిద్ధాంతాన్ని రాబట్టటం ఇక్కడ గమనించవచ్చు. అయితే వర్గీకరణ స్థాయి నుంచి విజ్ఞానం ముందుకు పోయిన తరవాత, ప్రతిపాదనలూ, భావాలపై ఆధారపడటం వాటిని రుజువు పరచటానికి పరోక్షంగా మాత్రమే సంబంధాలు నెలకొల్పటం జరుగుతున్నది. ఎలక్ట్రాన్, రేణువు, రసాయనికాలలోని వేలెన్సే అనేవి ప్రత్యక్షంగా పరిశీలించే వాటితో సంబంధం లేనట్టివే, కేవలం ప్రపంచం అనుభవవాదమనే సిద్ధాంతానికి భిన్నంగా పోతున్నప్పటికీ, ఆధునిక భౌతిక విజ్ఞానం, రసాయన శాస్త్రాల సిద్ధాంతాలలోని వైజ్ఞానిక విలువలను ప్రశ్నించే పరిస్థితి లేదు.
చిక్కు సమస్య – పరిష్కారం
మనం గందరగోళ సన్నివేశంలో చిక్కుకున్నాం. సంప్రదాయబద్ధమైన తార్కిక పంథాను వదిలిపెట్టనంత కాలం విజ్ఞానం ఏమంత ముందుకు సాగలేదని మనకు తెలుసు. అయితే బేకన్ పేర్కొన్న ఆగమన పద్ధతిని పరిశీలిస్తే అది కూడా అసంపూర్ణమేనని తేలింది. కేవలం అతి సామాన్యమైన విజ్ఞాన విషయాలను కనుక్కోవడంలోనే ఇది తోడ్పడింది. ఈ చిక్కు నుంచి బయటపడడానికి బేకన్ మార్గాంతరాలను సూచించినా అతడు దానిని స్వీకరించినట్లు లేదు. ప్రతిపాదన చేయడానికి వాస్తవాలు అధ్యయనం కావించడం తప్పనిసరి అని బేకన్ పేర్కొన్నాడు. విజ్ఞానవేత్త పనిచేసే తీరుకూడా నిగమన ధోరణిలో పరిశీలించవచ్చు. ప్రకృతిని అవగాహన చేసుకోవడానికి ఇలా జరగవలసి ఉంటుంది. అంటే విజ్ఞాన వేత్త ఎలా పనిచేస్తున్నాడో పరిశీలిస్తే వైజ్ఞానిక పద్ధతి అంటే ఏమిటో తెలుసుకో వచ్చునన్నమాట.
విజ్ఞానం అంటే జ్ఞానాన్వేషణ అనీ, విజ్ఞానానికి వివేచనాత్మకమైన నిర్మాణం, ప్రాపంచిక వాస్తవాలు ఆధారంగా ఉంటాయని తెలుసుకున్నాం. విజ్ఞానం అంటే వాస్తవాలలో ఇమిడి ఉన్న వివేచనను అన్వేషించటమేనని చిత్రీకరించవచ్చు. కొత్త వాస్తవాలను కనుక్కొన్నప్పుడు అంతవరకూ అంగీకరించిన సిద్ధాంతాల ఆధారంగా వాటిని వివరించటం సాధ్యం కాదని తేలింది. ఆమోదించిన సిద్ధాంతాలను నిశితంగా పరిశీలిస్తే వాటిలో తీవ్రమైన తర్కబద్ధమైన దోషాలున్నాయని తెలుస్తున్నది. కొత్త సత్యాలు కనుక్కోకముందే విషయాలు బయటపడ్డాయి. ఐన్ స్టిన్ ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించకపూర్వమే ఈ లక్షణాలతో ఉన్న పరిస్ధితి గమనించవచ్చు. మైకెల్ సన్ – మోర్లే చేసిన అనేక పరిశోధనల వల్ల కాంతి వేగం సెకండుకు 3 లక్షల కిలోమీటర్లని పరిశీలకుడి కొలమానంలో తేలింది. పరిశీలకుడు కాంతి వైపు పయనించినా, కాంతికి దూరంగా వెళ్ళినా, కాంతి వేగంతో పోల్చి చూసుకున్నప్పుడు పరిశీలకుడు సూటి మార్గంలో పోయినంత సేపూ, కాంతి వేగం ఒకే తీరులో ఉంటున్నది. సంప్రదాయబద్ధమైన భౌతిక విజ్ఞాన సిద్ధాంతానికీ, ఈ వాస్తవానికీ పొసగదు కనక సిద్ధాంతపరమైన భౌతిక శాస్త్రజ్ఞుడు ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించవలసి వచ్చింది. ఐన్ స్టీన్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించటంలో ఈ విషయం ప్రధాన పాత్ర వహించలేదు. మైకేల్ సన్-మోర్లేల పరిశోధన సాపేక్షతా సిద్ధాంతాన్ని కనుక్కోవటంలో ఏమంత పేర్కొనదగిన పాత్ర నిర్వహించలేదని ఐన్ స్టిన్ చెప్పాడు. ఐన్ స్టిన్ కు పట్టిందల్లా అంచనాలలో క్రమత్వం లేకపోవటం అన్నదే. విద్యుత్ అయస్కాంత సంఘటనల నియమాలలో ఇది వ్యక్తమయింది. పరిశీలనకు అందుబాటులో ఉన్న భౌతిక సత్యాలతో ఐన్ స్టిన్ పేర్కొన్న లొసుగుకు సంబంధం లేదు. ఇది సాపేక్షతా సిద్ధాంతం పరిష్కరించిన వాటిల్లో చాలా ముఖ్యమైన సమస్య.
క్లిష్ట సన్నివేశం
పైన పేర్కొన్న పరిస్థితిని బట్టి ఐన్ స్టీన్ సిద్ధాంతంలో ఎదుర్కొన్న చిక్కు సన్నివేశం గమనించవచ్చు. ఉన్న జ్ఞానం, సమస్యను పరిష్కరించలేక పోతున్నది. కనక పరిష్కారం నిమిత్తం మానవుడు వివేచనాత్మక అన్వేషణ చేయవలసి వచ్చింది. ఒక కొత్త ప్రతిపాదన సహాయంతో మానవునికి వివేచనా పరిధిలోనికి సన్నివేశాన్ని తీసుకురావడం జరిగింది. విజ్ఞానవేత్తకు అందు బాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా రాబట్టిన ప్రతిపాదనగా దీనిని పేర్కొన్న వచ్చు. అయితే ఇది సృజనాత్మక ఊహ గనక కేవలం భౌతిక రీతులలో చెప్పటానికి వీలులేదు. ఉన్నత స్థాయి శిక్షణ, క్రమశిక్షణ గలవారు ఊహించిన తీరుగా మాత్రమే ఈ సృజనాత్మక విధానాన్ని పేర్కొనవచ్చు. భావాలను రాబట్టటంలో ప్రతిపాదనలు చేయడంలో వాస్తవాలు తోడ్పడవచ్చు. విశ్లేషణ, వర్గీకరణ, సారాంశం చూడటం, సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి, ముఖ్యమైన విషయాలు పై కేంద్రీకరించిన మధ్యలో వచ్చిన వాటివల్ల పక్కదారులు పట్టకుండా ఉండే రీతులను అనుసరించడం, శాస్త్రజ్ఞునికి ముఖ్యమైన విషయాలను ఎంపిక చేసుకోవడం, వర్గీకరించటం అంటేనే మానసికంగా ఒక విధమైన క్రమశిక్షణ ఉండి ఉండాలి. విషయం బాగా తెలిపి, నిర్ణయం తీసుకోడానికి వీలైన సునిశిత మనస్తత్వం, శిక్షణ అవసరం, అంతేగాక కొత్త నమూనాలు ఊహించటం, వాస్తవాల పరిశీలనకు సంబంధం లేని అంశాలను ఆలోచించగలగటం కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయని గ్రహించాలి. సాపేక్షతా సిద్ధాంతంలోనూ, తేజఃకణ సిద్ధాంతం (క్వాంటమ్ సిద్ధాంతం)లోనూ ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యం ఉందని, చిక్కు, సన్నివేశం వచ్చినప్పుడు అది బయటపడుతుందని స్పష్టపడింది. భావనారీతులను పునఃపరిశీలన చేయటానికి ఈ విధానం తోడ్పడింది.
ప్రతిపాదనను పరిశీలించడం
ఒకసారి ప్రతిపాదనను రూపొందించిన తరవాత ఉత్తరోత్తరా అంచేలన్నింటినీ సులభవంగానే రూపొందించుకోవచ్చు. అవేమిటంటే (1) ప్రతిపాదన వల్ల తార్కికంగా వచ్చిన ఫలితాలను, పరిస్థితిని తెచ్చిపెట్టిన సన్నివేశాన్ని, అందుకు సంబంధించిన వాస్తవాలనూ కొత్తగా కనుక్కొన్న వాటినీ తెలుసుకోవడం, (2) లోగడ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని ఆలోచించటానికి వీలులేని విషయాలను అంచనావేసి పేర్కొన్నటం, (3) అంచనాలు సరైనవో, కావో తేల్చి చెప్పే పరిశోధనలు చేయటం, (4) ప్రతిపాదన ఏ మేరకు మిగతా వైజ్ఞానిక సిద్ధాంతంతో పొందికగా ఇముడుతుందనేది సరిచూసుకోవటం.
సాపేక్షతా సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంచెలు ఎలా పనిచేశాయో చూద్దాం.
సంప్రదాయ బద్ధంగా వస్తున్న విద్యుత్-అయస్కాంత క్షేత్ర సిద్ధాంతానికి సంబంధించి ఐన్ స్టిన్ కు అసంతృప్తి ఉంది. అయితే కేవలం పొందికకోసమే న్యూటన్ భౌతిక విజ్ఞానానికి సంబంధించిన సామాన్య గణిత శాస్త్రానికి బదులు క్లిష్టమైన టెన్సార్ కాలిక్యూలసం గణితాన్ని ఎన్నుకొన్నారనుకోటం సరికాదు. మైకలే సన్-మోర్లీ పరిశోధనల వల్ల లభించిన పరోక్ష విషయాలను ఈ నూతన గణిత విధానం సంతృప్తికరంగా వివరించటమే అసలు విషయాలను ఈ నూతన గణిత విధానం సంతృప్తికరంగా వివరించటమే అసలు విషయానికి మూలమని తెలుసుకోవాలి. సాపేక్షతా సిద్ధాంతంలో ఒక భాగంగా సంప్రదాయ సిద్ధాంతం ఇమిడిపోయినట్లే సంప్రదాయ సిద్ధాంతం నుంచి రాబట్టదగినవన్నీ సాపేక్షతా సిద్ధాంతం నుంచి కూడా రాబట్టవచ్చు. న్యూటన్ భౌతిక విజ్ఞానం తోసిపుచ్చిన కొన్నిటిని సాపేక్షతా సిద్ధాంతం అంచనా వేసి ఊహించింది. ఉదాహరణకు సంప్రదాయ సిద్ధాంతానుసారం కాంతికి సాంద్రతలేదు. కనక కాంతి మార్గం ఎక్కడైనా సరే సూటిగానే ఉంటుంది. సాపేక్షతా సిద్ధాంతం పదార్థానికీ, శక్తికీ గల సమాన విలువ ఒకదాని నుంచి మరొకదానిలోకి మార్చే విధానం చూపెట్టింది. దీని వల్ల బరువైన వస్తువు సమీపంగా కాంతి కిరణం పయనిస్తున్నప్పుడు ఆ వస్తువు యొక్క గురుత్వాకరణ శక్తి వల్ల కాంతి కిరణం వస్తువు వైపుకు ఒంగుతుంది. ఈ ఒంపు స్వల్పమే అయినప్పటికీ సూర్యుని సమీపంలో పయనించే కిరణాన్ని పరిశీలించటానికి వీలున్నది. 1919లో వచ్చిన సూర్యగ్రహణం సందర్భంగా ఈ విషయాన్నే పరిశోధనాత్మకంగా ధ్రువపరిచారు.
ప్రస్తుతం ఉన్న సిద్ధాంతానికి బదులు కొత్తది ప్రవేశపెట్టాలంటే నూతన వాస్తవాలను అంచనాలు వేయగలగటం ప్రధాన లక్షణంగా ఉండాలి. ఆధునిక విజ్ఞాన చరిత్రలో ఇటువంటివి తరచు తటస్థపడుతుంటాయి. రాసికి సంబంధించిన రాగాలకే ఇవి పరిమితంకావు. 1895లో డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు అంతమైన జీవులకూ, తరవాత పరిణమించిన వాటికీ మధ్య ఒకప్పుడు కొన్ని జీవులు ఉండేవని అంచనావేశాడు. అటువంటి మధ్యస్థ జీవుల అవశేషాల నిమిత్తం అన్వేషణ జరిగింది. ఈ అన్వేషణ ఫలప్రదమయింది.
ఒక ప్రతిపాదన యొక్క అంచనాలను పరీక్షించటానికి కొన్ని సంద్ర్భాలలో సాంకేతిక పరమైన సున్నిత ఆధారాలు అవసరమవుతాయి. అలాగే మరికొన్ని సందర్భాలలో సాంకేతికపరమైన సున్నిత ఆధారాలు అవసరమవుతాయి. అలాగే మరికొన్ని సందర్భాలలో ఇతరులకు తెలియని వాటిని కనుక్కోగల మేధావి అవసరమవుతాయి. అలాగే మరికొన్ని సందర్భాలలో ఇతరులకు తెలియని వాటిని కనుక్కోగల మేధావి అవసరమవుతాడు. క్లిష్టమైన సాధన సంపత్తి ఉండటం ఒకటేచాలదు. గలీలియో, న్యూటన్ అతి సాధారణమైన పరికరాలతో పరిశోధనలు చేశారు. పరిశోధించబోయే ప్రతిపాదనకు అది సిద్ధాంతంలో పొసగుతుంది. అవి చూడటానికి మేధాశక్తి కావలసిన ఉంటుంది. గాలివాన లాంటిది తెలుసుకోటానికి నిర్ధిష్టమైన సాంకేతిక పరికరాలు అవసరమవుతాయి. అటువంటివి లేకుండా ప్రతిపాదనను పరీక్షకు పెట్టటం అసాధ్యం.
ఒకసారి ప్రతిపాదన, అనుకున్న అంచనాలలో ఇమిడిపోతే వైజ్ఞానిక సిద్ధాంతంలో అదొక భాగమవుతుంది. కొత్త సిద్ధాంతం అంతకు ముందున్న వైజ్ఞానిక ఆలోచనపై ఏ మేరకు ప్రభావం చూపెట్టిందనేది పరిశీలించటం కూడా సర్వసాధారణంగా జరుగుతున్నది. కొత్త సిద్ధాంతం లోగడ ఆమోదించిన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండకుండా పొందుపరచేటందుకే ఈ విధానాన్ని అవలంబిస్తారు. మౌలికమైన మార్పులు అతివేగంగా జరిగిపోతుంటే, పాత కొత్తల మధ్య అఘాతలకు కాలమే వారధి నిర్మిస్తుందని తాత్కాలికంగా ఊరుకోవటం కూడా జరుగుతున్నది.
వైజ్ఞానిక పద్ధతికి ఏం కావాలి?
వైజ్ఞానిక పద్ధతిలో శాస్త్రజ్ఞుడి ప్రకారం ప్రకృతి నియమాలను తేలికగా అవగాహన చేసుకోలేదు. గురుత్వాకర్షణే చలనానికి సంబంధించిన సర్వసాధారణ పరిష్కారమార్గం కనుక్కోలేదు. టెన్సార్ విశ్లేషణ లేనట్లయితే ఈ గణితం కూడా రూపొందేదికాదు. కేవలం గణిత శాస్త్రజ్ఞులు రికీ, టులియో లెవిసీవిటా అనే వారిద్ధరూ ఐన్ స్టిన్ రంగంలోకి రాకపూర్వం పాతికేళ్ళ కిందటనే కనుక్కొన్నారు. ప్రకృతి సాధారణమైనది అని అంటే, మానవ వివేచనాత్మక సిద్ధాంతాలుగా రూపొందించ వచ్చు అని భావించాలి. విజ్ఞాన రంగంలో సాధారణత్వాన్ని ప్రమాణంగా స్వీకరించినప్పుడు, రెండు అర్హమైన సిద్ధాంతాల మధ్య ఏది ఎంపిక చేసుకోవాలో నిర్ణయించటం సాధ్యపడుతుంది. రెండు సిద్ధాంతాలు ఉన్నప్పుడు అందులో ఒకటి మానవుడి వివేచనాత్మక జిజ్ఞాస సంతృప్తికరంగా ఉంటే, అది ఆమోదయోగ్య మవుతుంది. అటువంటి సిద్ధాంతానికి మితమైన ప్రతిపాదనలు చాలు, వీటికి సంబంధించిన గణిత ప్రతిపాదనలు క్లిష్టమైనవిగా ఉండవచ్చు. అది వేరే విషయం.
ఒక తీరు (Uniformity) ఉండాలనేది, సాధారణతత్వం అనే ప్రతిపాదనకు మెరుగులు దిద్దగా వచ్చిన విషయమే. ఐన్ స్టిన్ సిద్ధాంతాన్ననుసరించి ఈ రెండు లక్షణాలూ సన్నిహిత సంబంధంగలవే. ప్రకృతి కొన్ని విశ్వజనీనమైన నియామాలతో ఉన్నదని దీని అర్థం. గురుత్వాకర్షణ నియమంగానీ, విద్యుత్ అయస్కాంత తరంగాలు చలనంగానీ అన్ని చోట్లా ఒకే తీరుగా ఉంటుందన్న మాట. అలా కానట్లయితే విశ్వానికి సంబంధించిన శాస్త్రం అనూహ్యమవుతుంది. ఆకాశంలో నక్షత్రాలూ, పాలపుంతలూ, వాటి చలనం అధ్యయనం చేయటానికి భూమిపైన శాస్త్రజ్ఞులు రూపొందించిన భౌతిక నియమాలనే అన్వయిస్తున్నారు. కొన్ని సమకాలిక నియమాలు రూపోందించటంలో కాలాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు. కాని మనదృష్టిలో కాలగమనమనేది, వ్యక్తిగతంగా చూసు కుంటే ముఖ్యమైనదే కావచ్చు. పదార్థం, ద్రవ్యరాశి, శక్తికి సంబంధం చూపే గణిత నియమాన్ని 1905లో కనుక్కొన్నప్పటికీ ఇంకా ఆ సూత్రం సరైనదిగానే భావిస్తున్నారు. రేడియం క్రమంగా విచ్చన్నమవుతూ, సీసంగా మారడానికి పట్టే కాలాన్ని ఎక్స్ సంవత్సరాలనుకుందాం. విచ్చిన్న విధానం ఎప్పుడు ఆరంభమైనప్పటికీ ఎక్స్ సంవత్సరాలకు ఉండే విలువ మారదు. ఒకే తీరంటే అర్థం ఇదే. పురావస్తు సమస్యలకు ఈ రేడియో యాక్టివ్ విచ్ఛిన్న సూత్రాన్ని అన్వయించడానికి, ఒకే తీరు ఉంటుందని భావించటమే కారణం. ఈ విధంగా ప్రకృతి నియమాలకు సంబంధించి, ప్రవేశం లాగే కాలం కూడా ఒకే తీరులో ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఒకే తీరు అనే నియమం కార్యకారణ (Causality) సంబంధానికి దారి తీస్తుంది. విజ్ఞానంలో కార్యకారణం అంటే ప్రతి సంఘటనకూ పూర్వ సంఘటన ఉంటుందని, ఈ సంఘటనలకు, వాటి పూర్వ సంఘటనలకు ఉండే సంబంధం ఇంచుమించు శాశ్వతమైనదనీ అర్ధం. ఇంచుమించు అంటున్నామంటే ఏ రెండు సన్నివేశాలు కూడా ఒకే విధంగా ఉండవని భావించాలి. ఒక సంఘటన ఎలాంటిదో నిర్ధారించటానికి అందలి ముఖ్యమైన ధోరణులను స్వీకరించాలి. ఒక సంఘటనకూ దాని పూర్వ సంఘటనకూ ఉండే సంబంధం ప్రదేశానికి కాలానికి చెందకుండా స్వతంత్రంగా ఉంటుందని అంటున్నామంటే మౌలిక ధోరణలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే. ముఖ్యమైన వాటికీ తలవని తలంపుగా జరిగే వాటికీ కార్యకారణతలో విడదీసి చూడగలగటం తార్కికంగా అవసరం కాదు. ఇది నిత్యానుభవంలో మనం గమనిస్తున్నదే. వైజ్ఞానికాభివృద్ధిలోని ఒక దశలో ఏది ముఖ్యమైనది అని నిర్థారించటం విజ్ఞానం తెలిసినవారు చేస్తారు. ఇక్కడ అంతవరకూ ఉన్న పద్ధతిని అంటి పెట్టుకోకుండా, సృజనాత్మక ధోరణి చూపటానికి అవకాశమున్నది. ఒక పదార్ధ చలనాన్ని తెలుసుకోటానికి త్వరణం (వేగం దిక్కు) (Velocity) తెలియాల్సిన పనిలేదని, గమనం తెలిస్తే చాలునని గలీలియో భావించాడు. అరిస్టాటిల్ కాలం నుంచీ పదార్ధ చలనం (మెకనిక్స్) అధ్యయనం చేయాలంటే త్వరణం తప్పక తెలుసుకోవాలనీ భావించారు. (త్వరణం అంటే వేగం, వెళ్ళేదారి) అయితే సంప్రదాయానికి కట్టుబడనంత మాత్రాన ఊహాపోహలకు దిగజారే అవకాశం లేదు. ఏ ప్రతిపాదనకైనా వాస్తవమే ప్రమాణంగా కనిపిస్తున్నది. ప్రకృతిలో మానవుడు ఒక భఆగం. నియమబద్ధమైన విశ్వం నుంచి వచ్చిన మానవుడు మౌలికంగా వివేచనాత్మకంగా ఉంటాడని అనడంలో ఉద్దేశం ఇదే. (ఎం.ఎన్. రాయ్, సమూల ప్రజాస్వామ్య సిద్ధాంతాలు) అయితే వివేచనాత్మకతలో నీతిగూడా ఇమిడి ఉందా అనే విషయాన్ని ఈ పుస్తకం చివరలో పరిశీలిద్దాం. ఆ విషయం తెలుసుకోవడా నికి పూర్వం వైజ్ఞానిక సిద్ధాంత స్వభావం అంటే ఏమిటో స్పష్టమైన భావన ఉండవలసిన అవసరం ఉంది.
విజ్ఞాన సిద్ధాంత స్వభావం
విజ్ఞాన సిద్ధాంతం మూసబోసింది కాదు
వైజ్ఞానిక సిద్ధాంతాలలో, ఒక్కొక్క ప్రత్యేక సిద్ధాంతం ఏదో ఒక మేరకు కొన్ని ప్రమాణాలను సంతృప్తిపరుస్తుంది. ఈ సిద్ధాంతాలన్నీ, అన్ని సందర్భాలలోనూ పరస్పరం సంబంధం కలవికావు. అంటే ఇవన్నీ కలిసి ఒకే సిద్ధాంతంగా రూపొందవు. విజ్ఞానాభివృద్ధిలో ఏ దశ తీసుకున్నా వివిధ స్థాయిలలో అనేక సిద్ధాంత నిర్మాణాలు గమనించవచ్చు. ప్రతి నిర్మాణం కూడా మరి కొన్ని నిర్మాణాల ప్రభావంతో ఏర్పడినట్టిదే. అలాగే అనేక సిద్ధాంతాలకు సంబంధ లేకుండా కూడా ఒకానొక వైజ్ఞానిక నిర్మాణం ఉండొచ్చు. జీవోత్పత్తి మూలానికీ, పర్వతాలు ఏర్పడటానికీ, పరమాణు పదార్ధ శాస్త్రానికీ ఏమి సంబంధం లేకపోవచ్చు. ఈ విషయం అవగాహన చేసుకోటం ఏమంత కష్టం కాదు ప్రపంచంలో సంఘటనలన్నీ ఒకదానితో మరోకటి తప్పిసరిగా సంబంధం కలిగి ఉండాలని ఏమీ లేదు. కొంకణ తీరంలో వర్షపాతానికీ, హిమాలయాలలో మంచు పడడానికీ సంబంధం ఉన్నట్లు చెప్పే అవకాశం లేదు ఇటలీలో అగ్నిపరత్వం బద్ధలు కావడ వల్ల నీలగిరిలో కాఫీపంట బాగా పండిందనడానికీ అవకాశం లేదు. సహజ సంఘటనలను విడివిడిగా పరిశీలించే అవకాశం ఉంది. స్వతంత్ర ప్రతిపత్తిగల సంఘటనలను ఇలా అధ్యయనం చేయవచ్చు. విజ్ఞాన సిద్ధాంతాలు పనిచేసే తీరు వివేచనాత్మకంగా రూపొందించే అవకాశం ఉంది. అంతమాత్రాన ఈ సిద్ధాంతాలన్నీ ఒకే మొత్తంగా మూసపోసినట్లు ఉండవు. సిద్ధాంతాలలోని భాగాలన్నీ తప్పనిసరిగా, విడదీయటానికి వీలులేనివిగా, కలిసి ఉండవలసిన పని లేదు.
జ్ఞానమంతా ఒకే విధానంగా ఉంటుందనే భావనకు రెండు ఆధారాలు కనిపిస్తున్నాయి. మానవుడికి క్రమత్వం అంటే ఇష్టం ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషిస్తుంటాడు. ఇటువంటి అన్వేషణ వల్ల విజ్ఞానరంగంలో కూడా ఒకే క్రమాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తాడు. కాని ఇటువంటి ప్రయత్నానికి కేవలం రామణీయక విలువ మాత్రమే ఉంది. అన్ని సందర్భాలలోనూ ఇది సఫలం కానక్కరలేదు.
ఆలోచనా రంగంలో విశ్వజనీనమైన పద్ధతులు వ్యాపించి ఉండగా, అటువంటి వాతావరణంలో విజ్ఞానం పెంపొందింది. ఉదాహరణకు హెగెల్ పద్ధతిని చూస్తే ప్రపంచంలో పరిశీలించదగిన ప్రతిదాన్నీ ఒకటి రెండు మూల సూత్రాల ఆధారంగా వచ్చినట్లు వివరించే ప్రయత్నం చేసినట్లు గమనించవచ్చు. అటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటంలో, ఎవరికి వారు విశ్వజనీనమైన పద్ధతులను, ప్రత్యామ్నాయాలను చూపాలని ఆశించారు. ఆ విధంగా మార్క్సిజాన్ని, పరిశీలించవచ్చు. విశ్వజనీనత కావాలనే విధానాలలో ఇది ఆఖరి పద్ధతిగా భావించవచ్చు. సోషలిజానికి ఇదే విజ్ఞాన సిద్ధాంతంగా పెర్కొంటున్నారు. గతి తార్కిక నియమాలనుంచి సామాజిక సూత్రాలను, ప్రకృతి సంఘటనలను రాబట్టడం జరిగింది.
20వ శతాబ్దం ప్రారంభదశవరకూ ఈ స్థితే కొనసాగింది. తాత్విక మద్దతుతో నిమిత్త లేకుడా, విజ్ఞానం తన కాళ్ళపై తానే నిలవగలిగిన స్థితికి చేరుకున్నది. సిద్ధాంత కర్తలను తేజఃకరణ సిద్ధాంతం (క్వాంటం సిద్ధాంతం) చెదురుమదురుగా నిలిచింది. వారు దీన్నుంచి కోలుకునే అవకాశం ఇంకా కనుచూపు మేరలోలేదు. ఇక ముందు కూడా అటువంటి అవకాశం లభిచేటట్లు లేదు. ఒకే విధమైన విజ్ఞానపద్ధతి ఆవశ్యకత ఇంకేమాత్రం ఉన్నట్లు లేదు. విజ్ఞానం ప్రభావం వల్ల విశ్వజనీనమైన తాత్విక పద్ధతులు చాలావరకూ మారాయి.
విజ్ఞాన సమైక్యత-పద్ధతులు, నిర్మాణం
విజ్ఞానం అంటే అనేక సిద్ధాంతాలతోనూ, వాటికి ఆధారంగా నిలిచిన వాస్తవిక సమాచారంతోనూ ఉన్నట్టిదే అయితే విజ్ఞానంలో ఐక్యతను కనబరచడానికి తోడ్పడేది ఏమిటి. అన్ని విభాగాలకు సర్వసాధారణంగా ప్రతి విజ్ఞాన సిద్ధాంతం కూడా చేబట్టిన విషయ పరిశోధన ప్రకారం, చేరుకున్న దశను ప్రమాణంగా స్వీకరిస్తుంది. విజ్ఞాన సిద్ధాంతాలకు గల ఈ ప్రమాణాలే ఒక నిర్మాణ సమైక్యతను సమకూర్చి పెడుతున్నాయి. విజ్ఞానేతర సిద్ధాంతాలు ఇలాంటి ప్రమాణాన్ని స్వీకరించవు. మనం సాగిపోయే కొద్దీ ఐక్యత ఏమిటో స్పష్టపడు తుంది.
భౌతిక, రసాయనిక, భూగర్భ, జీవశాస్త్రాలకు, ఆరంభం ఉందిగాని అంతం లేదు. ప్రారంభ ప్రాతిపదికలన్నీ రుజువు అవసరం లేనివిగా భావించబడు తున్నాయి. అవి రుజువు పరచనక్కరలేదంటే, వాటిని ఇంకో సూత్రం నుంచి రాబట్టే అవసరం లేదన్నమాట. మరో సూత్రం నుంచి గనక రాబట్టగలిగితే, అదే ఆరంభదశ అవుతుందన్న మాట. ఇలా అనంతంగా వెనక్కు పోకుండా ఉండాలంటే, ఎక్కడోచోట ఆరంభించడం తప్పనిసరి అవుతుంది. ఈ ఆరంభదశనే విజ్ఞానంలో ప్రతిపాదన అంటాం.
తార్కిక పద్ధతులననుసరించి ఈ ప్రతిపాదనల మూలంగా అనేక నిర్ణాయాలను రాబట్టడం జరుగుతుంది. అవి ప్రాపంచిక అనుభవంతో రుజువుపరచదగినవే. వాస్తవాల ఆధారంగా రుజువైన నిర్ణయాలను శాస్త్రీయ సిద్ధాంతం వివరించినట్లే భావిస్తారు. మరికొన్ని నిర్ణాయాలు ఇంతకు ముందు తెలియని ప్రతిపాదనలను సూచిస్తాయి. అటువంటి నిర్ణాయాలను అంచనాలనీ, గతాన్ని తెలియపర్చేవనీ అంటాం. వీటిని నిర్ణీత పరిశీలన ప్రకారం వాస్తవాలను కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. అవి కనుక్కొన్న వాస్తవాలను ఆధారం చేసుకొని అంచనావేసిన వాటిని రుజువు పరచగలిగితే ప్రతిపాదనలకు వాస్తవ ప్రమాణం లభిస్తుంది. అంటే సిద్ధాంతం రుజువైనట్లే.
ప్రతిపాదనల నుంచి రాబట్టిన నిర్ణయాలన్నీ సిద్ధాంతంలో మధ్యస్థ స్థాయికి చేరుకున్నట్లే విజ్ఞాన సిద్ధాంతానికి అంతం లేదంటే, ఇక ముందు ఎలాంటి పరిణామాలు పెంపొందుతాయో ముందు చెప్పజాలం అని అర్థం. కొత్తగా అనేక విషయాలు రాబట్టవచ్చు. లేదా కొత్త వాస్తవాలు వెలుగులోకి రావచ్చు. విజ్ఞాన సిద్ధాంతం ఆకాశహర్మ్యం వంటిది. ఎన్ని అంతస్తులైనా ఆకాశంలో కట్టుకుంటు పోవచ్చునన్నమాట.
ఈ విషయం రుజువు పరచడానికి న్యూటన్ పదార్ధ చలన సిద్ధాంతమే ఆధారం. మూడు చలన సూత్రాలు ఆరంభదశలో ఉన్నాయి. ఆ తరవాత గురుత్వాకర్షణ సిద్ధాంతం వచ్చింది. తదనంతరం అనేక ఫలితాలకు దారితీసిన సంఘటనలనేకం వచ్చాయి. కెప్లర్ సూచించిన గ్రహచలన సూత్రాలు, సముద్ర తరంగాల సూత్రాలు, గైరోస్కోప్ చలనం, పదార్థచలన సిద్ధాంతం-తుపాకి గుండు చలన సిద్ధాంతం-ఇవన్నీ పరిశీలనతో రుజువు పరచదగినవే అయినప్పటికీ, ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతంలో న్యూటన్ సిద్ధాంతాన్ని పొందుపరచేటంత వరకూ, న్యూటన్ సిద్ధాంతం. ఆగిపోయిందనడానికి వీల్లేదు.
ఈ పరిశీలనను విపులీకరించి చూద్దాం.
విజ్ఞాన సిద్ధాంత లక్షణాలు
విజ్ఞాన సిద్ధాంతంలోని ప్రతిపాదన, ఒక రకమైన వాస్తవాలకు మరొక విధమైన వాస్తవాలతో సంబంధం ఏర్పరుస్తుంది. దీనినే కార్యకారణ సంబంధం అంటారు. ప్రతిపాదనలో రెండు విషయాలు సంతృప్తికరంగా ఉండాలి.
1. పరిశీలించిన వాస్తవాలన్నిటికీ సంబంధించిన ప్రకటనలు, ప్రతిపాదన యొక్క తార్కిక ఫలితాలుగా రాబట్టే వీలుండాలి.
2. ఇంతకు ముందు తెలియని, పరిశీలించదగిన సంఘటనలను ముందుగా ఊహించడం లేదా, లోగడ జరిగిన వాటిని చెప్పగలగడం.
న్యూటన్ విశ్వవ్యాపిత గురుత్వాకర్షణ సిద్ధాంతం, మాక్స్ వెల్ విద్యుదయస్కాంత క్షేత్ర సిద్ధాంతం కూడా పైన పేర్కొన్న రెండు నిబంధనలను సంతృప్తి పరచినవి. విజ్ఞానస్థాయి కోల్పోకుండానే, పై రెండింటిలోనూ ఒక నిబంధనను మాత్రమే సంతృప్తి పరచడం జరిగింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇటువంటి మినహాయింపుకు కారణాలు లేకపోలేదు.
అనేక సిద్ధాంతాలను కలిపి స్వీకరిస్తే రెండు నిబంధనలూ సరిపోవచ్చు. ఒకే సిద్ధాంతంలో రెండు పరిస్థితులను సంతృప్తి పరచలేకపోవచ్చు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న ఉష్ణ సిద్ధాంతం పదార్థ చలన ప్రతిపాదనపై ఆధారపడింది. ఈ క్షేత్రపరిధికి చెందినవాటితో నిమిత్తం లేకుండానే, చాలా మట్టుకు జరిగే సంఘటనలను ఉష్ణ సిద్ధాంతం వివరించగలదు. కాని ఉష్ణ సిద్ధాంతం ఆధారంగా, రెండు చోట్ల కలిసిన భిన్న లోహపు తీగెల అతుకుల ఉష్ణ తాభేదం వల్ల కలిగే విద్యుత్ ప్రవాహం గురించే వివరించడం గాని, ముందుగా ఊహించడం గాని వీలుపడలేదు. దీనికి గాను నేటి విద్యుత్ కు సంబంధించిన సిద్ధాంతం అవసరమయింది.
ఈ చర్యల వల్ల విజ్ఞాన సిద్ధాంతంలోని భిన్నస్థాయీ భేదాలు గమనించవలసిన ఆవశ్యకత గుర్తించాలి. పదార్ధ చలనం, వేడి, ధ్వని, విద్యుత్తు, అయస్కాంతం ఇత్యాది పదార్థ సంఘటనలకు వేర్వేరుగా సిద్ధాంతాలున్న మాట నిజమే. వీటన్నిటినీ కలిపి సంప్రదాయ పదార్థ విజ్ఞాన సిద్ధాంతం అంటున్నాం. విభాగాలను పక్క పక్కనే అట్టిపెట్టిన ఫలితాలనూ, అన్నిటినీ కలిపిచూస్తే లభించే సిద్ధాంతానికి చాలా తేడా ఉంది. విడిగా ఉన్న సిద్ధాంతాలన్నీ పరస్పర సంబంధం గలవి. కనక సమైక్యతలో పొందిక ఉంది. ఒక ప్రతిపాదనల రాశి నుంచి తార్కికంగా వీటన్నిటినీ రాబట్టే వీలున్నది. అంటే విడి శాఖలకంటే, సంప్రదాయ పదార్థ విజ్ఞానం యావత్తు భిన్న స్థాయిలో ఉన్న సిద్ధాంతమన్న మాట. మొత్తంగా ఉన్న సిద్ధాంతం సంతృప్తి పరచినట్లు, విడిగా ఏ ఒక్క శాఖకూడా సంతృప్తి నివ్వలేకపోవచ్చు. ఈ వాస్తవం దృష్ట్యా, విజ్ఞాన సిద్ధాంత స్వభావాన్ని చర్చించేటప్పుడు, ఇమిడి ఉన్న స్థాయి భేదాలను ప్రస్తావించకతప్పదు. అయితే అవిపైకి చెప్పేటట్లు లేకపోవచ్చు.
ఒకనొక విజ్ఞాన సిద్దాంతం పరీక్షశ్రకు నిలవకపోవడానికి తగిన కారణాలు ఉన్నాయి. సిద్ధాంతపరమైన స్థాయిబేధం దీనితో ముడిపడిఉంది. అంటే ఉష్ణ సిద్ధాంతానికి, సంప్రదాయ పదార్థ సిద్ధాంతానికీ గల సంబంధంకాదు. సహజంగా స్వాభావిక దశలో ఉన్న సిద్ధాంతాలకు అంచనావేసే శక్తి స్వల్పంగా ఉంటుంది. నిగమనంతో రూపొందించే స్థాయికి చేరుకున్న సిద్ధాంతానికి అంచనావేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ తేడాను పరిశీలిద్ధాం.
విజ్ఞానాన్వేషణ ఒకానొక సమస్యతో కూడిన సన్నివేశంలో ఆరంభమై ఈ కింది దశలలో సాగిపోతుంది.
1. సమస్యను విడగొట్టి చూడడం.
2. పరిశీలన, పరిశోధనతో అవసరమైన వాస్తవాలను సేకరించడం, వాటి మధ్యగల సర్వసాధారణ లక్షణాలను బట్టి వర్గీకరించడం.
3. పరిశీలించిన వాస్తవాలన్నిటినీ వివరించి సమస్యను పరిష్కరించగల ప్రతిపాదన చేయడం.
4. ఆ ప్రతిపాదన ప్రకారం వీలైతే, అందులో ఇమిడి ఉన్న తార్కిక విషయాల ఆధారంగా అంతవరకూ తెలియని సంఘటన గురించి అంచనా వేయడం.
5. అలావేసిన అంచనాలను పరిశీలించి పరీక్షకు పెట్టడం.
గలీలియో తుపాకి గుండు చలనానికి సంబంధించిన సమస్యను పరిష్కరించిన తీరు గమనిస్తే ఈ దశలన్నీ తేటతెల్లమౌతాయి. అప్పటివరకూ అరిస్టాటిల్ పేర్కొన్న పదార్థ విజ్ఞాన ప్రభావంలోనే శాస్త్రవేత్తలు ఉండిపోయారు. కదలే వస్తువువేగం, ఆ వస్తువుపై పనిచేస్తున్న ఒత్తిడిని బట్టి ఉంటుంది. ఒత్తిడి ఆగినప్పుడు పదార్థ చలనం కూడా ఆగిపోతుంది. ఇది సాధారణ ఆలోచనకు సరిపోతుంది కూడా. అరిస్టాటిల్ భావాలకు సరిపోయోటట్లుండే అనేక సంఘటనలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. మనం నడిచేటప్పుడు శ్రమపడుతుంటాం గదా. శ్రమ ఎక్కువైతే వేగంగా వెళ్ళగలం కూడా. ఇక బల్లను నెడుతుండగా, ఎప్పుడు నెట్టడం ఆపేస్తామో అప్పుడు బల్ల కదలకుండా ఆగిపోతుంది. గలీలియోకు పూర్వం ఒత్తిడికీ వేగానికీ సంబంధం ఉన్నదని ఇందలి భావన. వేగం (త్వరణం) ఎక్కువైందన్న మాట. ఒత్తిడి తగ్గితే ఆ మేరకు పదార్థ వేగం తగ్గుతుంది.
తుపాకి గుండు వెళ్ళే పద్ధతిలో ఈ నియమం పనిచేయడం లేదు. తుపాకి నుంచి పేల్చిన గుండు చాలా సేపటి వరకు, దానిపై ఎలాంటి ఒత్తిడి లేకుండానే, వేగంగా దూసుకుపోతుంది. ఆ గుండుపై గురుత్వాకర్షణ తప్ప మరే ఒత్తిడీ పనిచేయడం లేదు. తుపాకి పేల్చినప్పుడు మాత్రమే గుండుపై ఒత్తిడి పనిచేసింది. పేల్చడం అయిపోగానే గుండు బయటబడిన తరవాత ఇక తుపాకీ ఒత్తిడి అనేదేమీ లేదు. ఇలాగే ఇతర చలనాల విషయంలోనూ కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. చేత్తో విసిరేసినరాయి, ఒకచోట నుంచి పడినరాయి, కర్రతో కొట్టినబంతి, నేలపై దొర్లుకుంటూ పోయే చక్రాలబండి ఇలాంటివి ఉదాహరణలుగా స్వీకరించవచ్చు. అరిస్టాటిల్ భావాలతో ఈ చలనాలను వివరించలేం.
ఇలా అనేక సందర్భాలలో చిక్కు ఏర్పడితే, మనం పొందుపరచ దలచిన చట్రంలో దీనికి సంబంధించిన సిద్ధాంత భావన ఉండి ఉండాలి. ఒత్తిడికీ వేగానికీ అరిస్టాటిల్ వివరించిన బావనలోనే, తుపాకి గుండు వేగాన్ని అధ్యయనం చేయడంలో గల చిక్కు ఇమిడి ఉందని గలీలియో విశ్లేషించి, నిర్ణయానికి వచ్చాడు. దీన్ని పరిష్కరించాలంటే ఒత్తిడికి సంబంధించి కొత్త భావన అవసరం. ఒత్తిడిని ఎలా నిర్వచించాలనేదే గలీలియోకు ఎదురైన సమస్య.
గలీలియో ఈ సమస్యను విశ్లేషించడంలో, మూలంలోనే చిక్కు ఉన్నదనే గాక ఇంకెంతో బయటపడింది. ఇలా కృషి చేయడానికి వీలైన సమాచారం ఆయన చేసిన పరిశోధనలో లభించింది. అన్ని విధాలైన చలనాలకు సంబంధించిన ఒత్తిడి విషయంలోనూ సమస్య ఒకటే గనక, వశ్లేషించడానికి గాను అతి సాధారణమైన చలనాన్ని పరిశోధనకు స్వీకరించాడు. తుపాకి గుండు వేగం కొంత జటిలమైంది. తుపాకీని పేల్చడం వల్ల వచ్చే ఒత్తిడితో బాటు, భూమిపైన కదిలే అన్ని పదార్ధాలపైన భూమికి చెందిన గురుత్వాకర్షణ ఒత్తిడి పనిచేస్తుంటుంది. ఎత్తైన ప్రదేశం నుంచి భూమిపై పడే వస్తువుపై భూమి గురుత్వాకర్షణ ఒత్తిడి మాత్రమే పనిచేస్తుంది. కనక ఇటువంటి దానిని విశ్లేషించడం సులభం. ఇటువంటి పరిశోధన ఆధారంగా ఒత్తిడికి సంబంధించిన భావన ఏర్పడితే, అన్ని విధాలైన చలనాలకూ అది అన్వయించవచ్చని గలీలియో అనుకొన్నాడు. ఆ విధంగా సమస్యను విశ్లేషించడంలో, ఎటువంటి సమాచారం కొరకు చూడాలో నిర్థారించవీలైంది. అంటే అన్వేషణలో రెండో దశకు చేరాడన్నమాట.
ఈ దశలో గలీలియో సేకరించిన సమాచారాన్ననుసరించి భూమి గురుత్వాకర్షణ అనేది పదార్థపు ద్రవ్యరాశి అని గ్రహించాడు.
వస్తువు వేగాన్ని ఏ మేరకు మార్చగలదో ఆ నిష్పత్తిలో గురుత్వాకర్షణ పనిచేసిందన్నమాట.
ఒకానొక పదార్థ వేగంలో, నియమిత కాలంలో వచ్చే మార్పును పదార్థత్వరణం అంటారు. సెకండుకు 500 అడుగుల నుంచి 505 అడుగుల వేగానికి మార్చడానికి ఆ పదార్థంపై పనిచేసిన ఒత్తిడి ఎంతో, సెకండుకు 15 అడుగుల వేగం నుంచి 20 అడుగుల వేగానికి మారినప్పుడు పనిచేసే ఒత్తిడి అంతేనని గలీలియో ప్రతిపాదించాడు. రెండు సందర్భాలలోనూ పదార్థ ద్రవ్యరాశి ఒకటేనన్నమాట. ద్రవ్యరాశి మారితే, ఆ నిష్పత్తిలో వేగంపై ఒత్తిడి కూడా మారుతుంది.
ఒకసారి ప్రతిపాదనను రూపొందిస్తే, పరిశీలన ఆధారంగా రుజువుకు పెట్టడం చాలా సులభమైన విషయమే.
త్వరణం (వేగం దిక్కు) కాదుగాని, మార్పు ఏ మేరకు జరుగుతుందనేది ప్రధానం. ఆచరణ ప్రధానంగా గల సామాన్యుడికి ఇది చిక్కు సమస్యగా ఉంటుంది. గలీలియో రెండోదశ నుంచి మూడో దశకు పయనించడమేగాక, ఇంకా విజ్ఞానంలో మధ్యకాలాల నుంచి ఆధునిక స్థాయికి రావడాన్ని కూడా ఇది సూచిస్తుంది.
ఎఫ్.ఎఫ్.సి. నార్త్ రప్ (తన గ్రంథం ది లాజిక్ ఆఫ్ ది హ్యూమానిటీస్ అండ్ సైన్స్ స్ (అధ్యాయాలు 2, 3, 4)లో) పేర్కొన్నట్లు, విజ్ఞాన పద్ధతిలో మొదటి దశను విశ్లేషణస్థాయి అందాం. రెండో దశను సహజ చారిత్రకస్థాయి అని పిలుద్దాం. చివరి మూడవ దశలను సమిష్టిగా, నిగమన (Deductive) రీతిలో ఏర్పరచిన సిద్ధాంతం అని పేర్కొందాం. అందులో విశ్లేషణస్థాయి అంటున్నామంటే సమాచారాన్ని సేకరించడం, పరిశీలన, పరిశోధనల సహాయంతో సందర్భానికి ఉపకరించే సమాచారాన్ని వర్గీకరించడం తప్ప, చేయగలిగింది లేదన్నమాట. ఇది ఆగమనపద్ధతి (Inductive) నేటి మనోవిజ్ఞాన స్థాయి ఈ దశలోనే ఉంది. ఈ శతాబ్దారంభంలోని తొలి దశబ్దాలలో జీవశాస్త్రం ఇటువంటి స్థాయిలోనే ఉండేది. అంతమాత్రాన సహజ చారిత్రక స్థాయి అనేది మూడవ, నాలుగవ విజ్ఞాన దశలకంటే తక్కువదనిగాని, అప్రధానం అని గాని భావించరాదు. సహజ చారిత్రక స్థాయి పునాదులు సరిగా ఉంటేనే సిద్ధాంతం ఫలవంతంగా రాగలదని ఆశించవచ్చు.
మూడో అంచెలో తలపెట్టే ప్రతిపాదనలో, అంతకు ముందు స్థాయిలో సేకరించిన సమాచారాన్ని వివేచనాత్మకంగా వివరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ సందర్భంలో వివరణ అంటే, చేసిన ప్రతిపాదన దాని తార్కిక ఫలితాలు కూడా ప్రాపంచిక అనుభవరీత్యా వాస్తవాలే. అంటే విజ్ఞాన సిద్ధాంతానికి ప్రతిపాదన అనేది ఒక మెట్టు అన్నమాట.
ప్రాతిపదికలు-తొలిపదాలు
ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగా ఉన్నదే మరొక సిద్ధాంతానికి నిర్ణయం కావచ్చు. వంశపారంపర్యత, జన్యుశాస్త్ర సిద్ధాంతాలలోని నిర్ణయాలు పశువుల కృత్రిమ సంపర్క సిద్ధాంతానికి ప్రాతిపదికలయ్యాయి. ఇలా ఒక సిద్ధాంతం నుంచి మరొక సిద్ధాంతానికి తార్కికంగా కారణాలు అన్వేషిస్తూ అనంతంగా వెనక్కు పోజాలం. ఎక్కడో చోట ప్రతిపాదన ఆరంభం కావాలి. దానిని సమర్థించడం ప్రాపంచిక అనుభవరీత్యానే తప్ప, తార్కికంగా కాదని గ్రహించాలి. అవి నిజమైనవని అంగీకరిసే. వాటిని మరొక ప్రాతిపదిక నుంచి రాబట్టవచ్చు. అంతమాత్రాన నిజమైనవనడంలేదు. అవి ఫలప్రదమైనవి. వాటి నుంచి నిజమైన నిర్ధారణలను రాబట్టడానికి వీలౌతున్నది.
ఒక సిద్ధాంతంలో తార్కికంగా వెనక్కు వెళ్ళడానికి వీల్లేని వాటిని ప్రాతిపదికలు అంటున్నాం. ఒకానొక సిద్ధాంతంలోని ప్రాయికమైన భావనల మధ్య కొన్ని సంబంధాలను ప్రాతిపదిక నిర్ధారిస్తుంది. ప్రాతిపదికలలాగే, ఈ భావనలు కూడా అప్పటి వరకు ఉన్న ప్రాతిపదికల ఆధారంగా రూపొందించినవే. వీటిని వాటితో నిర్వచించే పరిస్థితి ఉండదు. కనక అలాంటి వాటిని అనిర్వచనీయ పదాలనీ, తొలి పదాలు అనీ అంటాం. ప్రతి సిద్ధాంతం కూడా ఇలాంటి తొలి పదాలతోనూ, ప్రాతిపదికలతోనూ ప్రారంభిస్తుంది. లేకుంటే అనంతంగా వెనక్కు పోతూనే ఉండవలసి వస్తుంది. అప్పుడు ఏ సిద్ధాంతమూ సాధ్యం కాదు.
తొలి పదాలు, ప్రాతిపదికలు అనేవి ఆధునిక విజ్ఞానానికే ప్రత్యేక లక్షణాలని భావించరాదు. ప్రాచీన, ఆధునిక వివేచనాత్మక సిద్ధాంతాలన్నింటికీ ఇవి ప్రారంభదశలే. సంప్రదాయ పదార్థ విజ్ఞానంలో రేణువు (పార్టికల్)ను నిర్వచించలేదు. న్యూటన్ చలన సూత్రాలు, గురుత్వాకర్షణ నియమాలు కూడా ప్రాతిపదికలే. స్థిర పదార్థం (రిజిడ్ బాడీ) అనేది రాబట్టిన పదమే. కెప్లర్ గ్రహచలన సిద్ధాంతాలు పైన పేర్కొన్న ప్రాతిపదికల నుంచి రాబట్టినవే.
నైరూప్యాలు-మేధోభావనలు
ప్రతి సిద్ధాంతానికి తొలి పదాలు, ప్రాతిపదికలు ఉండడం తప్పనిసరి అయినప్పటికీ, అవి అవగాహనకు అందనట్టివవనిగాని, అయోమయమైన వనీ అనుకోరాదు. వాటికి అర్థం లేదని, భావించరాదు. ఇతరపదాల సహాయంతో వీటిని వివరించడం, నిర్వచించడం కుదరనప్పటికీ, ఒకటి రెండు పద్ధతులతో తెలిసేటట్లు చేయవచ్చు. కొన్ని వస్తువులకు ఎరుపు సాధారణ వర్ణమైనట్లు మనం పేర్కొంటాం. అలాగే మరికొన్ని సందర్భాలలో సాధారణ లక్షణాన్ని చూపవచ్చు. ఇటువంటి పద్ధతిని నైరూప్యం అంటారు. (ప్రోఫెసర్ నార్త్ రఫ్ గ్రంధంలో ఈ విషయాన్ని వివరించాడు). కలగాపులగంగా ఉన్న అనేక వస్తువుల సముదాయం నుంచి ఒక సాధారణ లక్షణాన్ని రాబట్టి, దానికి ఒక స్వతంత్రభావ ప్రతిపత్తిని, తార్కిక స్థాయిని సమకూర్పు తున్నామన్నమాట. మనం సాధారణంగా వాడే పదాలు మంచితనం, చతురస్రం, ఒక దానికంటె ఎక్కువ, నీలం అనేవి ఇలాంటి భావనలే. నైరూప్యతలో ప్రధానలక్షణం ఏమంటే ప్రపంచంలోని వస్తువుల విధానాలు ఆధారంగా పూర్తి అర్థాన్ని చిత్రీకరించవచ్చు.
తొలిపదం అర్థం కావాలంటే ఆ పదం వచ్చే ప్రాతిపదికలను ప్రస్తావించాలి. ఇతర భావాలతో దీనికిగల సంబంధాన్ని ప్రత్యేకించి పేర్కొనవచ్చు. అంటే గర్భితంగా నిర్వచించడమేనన్నమాట. అణుపదార్థ విజ్ఞానంలోని ఎలక్ట్రాన్, వేవ్ పాకెట్ గాని, సంప్రదాయ పదార్థ విజ్ఞానంలోని పార్టికల్ గాని తత్వంలోని ఆత్మ గాని వివరించాలంటే, ఇదొక్కటే పద్ధతి. వేవ్ పాకట్ అనే పదాలు నిర్దిష్టంగా ఒకానొక వస్తువుకు చెందుతాయని చూపడం సాధ్యంకాదు. కనక ఇలాంటి భావనలు ఎరువు వంటి నైరూప్యాలు కాదు.
ప్రాతిపదికల ఆధారంగా పూర్తి అర్థాన్ని వివరించగల భావనలను మేధోభావనలంటాం. ఇందుకు ఉదాహరణలు ఎలక్ర్టాన్, ఎనర్జి, ఎంట్రోఫి, ఎలక్ట్రొ మేగ్నటివ్ వేవ్స్, గ్రావిటేషనల్ వేవ్స్, కెమికల్ బాండ్, ఆత్మ ఇత్యాదులు.
నైరూప్యతతో పోల్చిచూస్తే మేధో భావనలో వాస్తవికత తక్కువ అని ఊహించరాదు. నైరూప్యతలో సైతం ప్రపంచానుభవంతో పోల్చినప్పుడు కొంత మేరకు అఖాతం ఉంటుంది. ఎర్రదనం, జీవితం అనే వాటికి వస్తుగతంగా చూడడానికి విడిగా ఏవీలేవు. దానికంటే ఎక్కువ, ఎడమపక్కకు, అతని యొక్క సోదరుడు ఇత్యాదుల సంబంధాలలోని నైరూప్యతలలో ఈ విషయం స్పష్టమే. మేదో భావనలలో, ప్రపంచవస్తువులకూ భావనలకూ అఖాతం ఇంకా ఎక్కువ. ఒక వస్తువును లేదా వస్తువులను చూసి, ఫలానా భావనకు అవి మారురూపాలని మేధస్సులో అవగాహన చేసుకునే వాటిలో చూపలేం. మనం చేయగలిగిందల్లా, ఒకానొక సన్నివేశాన్ని చూసి, వివేచనాత్మక వివరణ, అవగాహన కావాలంటే మేధోభావన, వాటిని గర్భితంగా నిర్వచించే ప్రాతిపదికలు అవసరం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటున్నది. ఈ ప్రాతిపదికల నుంచి తార్కికంగా మనం కొన్ని వాస్తవ ప్రకటనలు రాబట్టవచ్చు. నైరూప్యతలలాగే వీటిని కూడా ప్రాపంచకానుభవంతో పరిశీలించి రుజువు పరచవచ్చు. ఒక విధంగా ఇది ప్రాయోజికతావాదంగా అనిపించవచ్చు. అయితే ఆలోచనారంగంలో ఈ మాత్రం ప్రాయోజికతావాదం ఉంటుంది. మానవుడి మేధస్సుకు, అది అవగాహన చేసుకోదలచిన ప్రపంచానికి ఈ విధానం ఒక్కటే వారధి.
మేధాభావనలు ఆధునిక విజ్ఞానానికి, తత్వానికి మాత్రమే పరిమితంకాదు. సహజచారిత్రక దశస్థాయి నుంచి విజ్ఞానం ముందుకు సాగిపోయినప్పుడు, కేవలం వర్ణనగాక, వివరణ అవసరమైనప్పుడు, మేధాభావనలతో కూడిన ప్రాతిపదికలు వస్తాయి. సహజ చారిత్రక దశ పూర్తిగాక పూర్వమే కొన్ని సందర్భాలలో తాత్వికులు, శాస్త్రజ్ఞులు మేధాభావనలు చేసిన ఉదాహరణలు లేకపోలేదు. ప్లేట్లో భావాలు కణాదుడు, ఎసిక్యూరస్ లు పేర్కొన్న అణువు హెగెల్ (భావం) ఇందుకు మచ్చు తునకలు. విజ్ఞానాభివృద్ధిలోని ఒక స్థాయిలో భావనలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ఉత్తరోత్తరా ఇంకా సునిశితమైన వాటిని ఇముడ్చుకోవలసి ఉంటుంది. అయితే మాటలు పాతవే ఉండవచ్చు. 19వ శతాబ్దిలో రసాయనిక శాస్త్రం పేర్కొన్న అణువుకూ ఆధునిక రసాయనిక విజ్ఞానం చెప్పే అణువుకూ అర్థం పూర్తిగా మారిపోయింది. మేధాభావన దశపై ఆధారపడనిదే ఏ విజ్ఞానం కూడా పరిపక్వస్థాయికి చేరదు.
నైరూప్యతపై ఆధారపడిన సిద్ధాంతాలలో అంచనావేసే శక్తి బహుస్వల్పం పరిశీలించిన సమాచారం ఆధారంగా తొలిపదాలు, ప్రాతిపదికలు రాబట్టిన దృష్ట్యా అంతకు మించి ముందుకు పోజాలని స్థితిలో నైరూప్యదశ ఉంటుంది. ప్రతిపాదన నుంచి వాస్తవాలను రాబట్టినప్పటికీ, వర్ణన చేయడం తప్ప, సిద్ధాంతం ఏమంతగా ముందుకు సాగలేదు. మేధాభావనపై ఆధారపడిన సిద్ధాంతం, అవధులు దాటిపోయి. కొత్త పరిశోధనలకు, నూతన విషయాలు కనుక్కోవడానికి దారితీయగలదు. నిత్యానుభవం నుంచి భావన ఎంతదూరమైతే అంత ఫలవంత మౌతుందని చెప్పవచ్చు. అందుకే గణితభావనలు, పద్ధతులు అన్వయించిన చోటల్లా, సాధారణ అనుభవంకంటే ఎంతో ఫలప్రదమైనట్లు రుజువైంది.
సాధారణంగా నైరూప్యతతో సాగిపోతుంటాం. మన దృష్టి, శక్తి సామర్ధ్యాలు స్పర్శేంద్రియాధార ఊహలు కొన్ని హద్దులకు పరిమితమై ఉంటాయి. విజ్ఞానరంగంలో ప్రతి విభాగం కూడా తన సిద్ధాంతానికి గణిత రూపాన్నివ్వాలని కలలు కంటుంది. పదార్థ విజ్ఞానం ఈ విషయంలో గణనీయదశకు చేరింది. ఏ విజ్ఞాన విభాగమైనా ఇలా చేయగలదా అనేది ఆయా విషయాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ విజ్ఞానం ఈ స్థాయికి చేరుకోగలగడం చాలా సందేహాస్పదమైన విషయం.
అంత మాత్రాన గమన రూపంలో సిద్ధాంతంగా రాజకీయ శాస్త్రం ముందుకు పోలేదని భావించరాదు. సహజ విజ్ఞఆనంలోగల నిర్దిష్టత కచ్చితంగా పేర్కొన్నడం అనే స్థాయికి చేరుకోలేదనే ఇక్కడ ఉద్దేశ్యం. అయితే రాజకీయాలలో వాస్తవాలను వివరించవచ్చు. ఒకే తీరును సాధించవచ్చు. అంచనావేయవచ్చు. లోగడ ఇలా చేయలేదంటే, ఆగమన కృషి జరగలేదు. రాజకీయ సిద్ధాంతాన్ని రూపొందించడానికి ఇటువంటిపని జరగాలి. ఏ మేరకు ప్రతిపాదనలు రూపొందించవచ్చునో ఆ మేరకు మార్క్స్ ప్రయత్నించి ఇంచుమించు సఫలీకృతుడైనాడు. అతడు నిర్మాణ క్రమం కోరినవాడు. బైబిల్ లోని పాత నిబంధనల ప్రవక్తవంటివాడు. కనక తన ఆలోచనలకు పదును పెట్టే తీరులో తనలోని సామాజిక శాస్త్రాల ధోరణికి స్వేచ్ఛను ఇవ్వలేదు.
విజ్ఞాన సిద్ధాంత నిర్మాణం
వివరణ-అంచనా
ఒక సిద్ధాంతం వైజ్ఞానికంగా ఉండాలంటే, పరిశీలించదగిన వాస్తవాలను, వాటి తార్కిక అవసరాల దృష్ట్యా వచ్చే ఫలితాలను వివరించగలిగి ఉండాలి. ప్రకృతి విజ్ఞానంలో ఎటువంటి వివరణకైనా ఇది కనీస అవసరం. మానవుడికి సంబంధించిన విజ్ఞానంలో తార్కిక ఆవశ్యకతలే గాక, మానసిక విషయాలను కూడా పరిగణనకు స్వీకరించాలి. మానవుడి కార్యకలాపాలలో తార్కిక ఆవశ్యకత అంటే, మానవుడి పిపాసలు, ఉద్దేశాలు ఇమిడే ఉంటాయి. ఈ విధంగా చూస్తే, ప్రకృతి విజ్ఞానంకంటే మానవ సామాజిక విజ్ఞానాల తర్కం ఉన్నతమయినది. (వీటి విస్తృత చర్చకు ఎఫ్.ఎన్.సి. నార్త్ రప్ రచన, ఎర్నెస్ట్ కాజైనర్ రాసిన లాజిక్ ఆఫ్ హ్యూమానిటీస్ చూడండి) ప్రస్తుతం ప్రకృతి విజ్ఞానానికే మనం పరిమితమౌతున్నాం.
నైరూప్యత ఆధారంగా ఉన్న సిద్ధాంతాలలో, ప్రతిపాదనలోకి తెలిసిన వాస్తవాలను వినడం మినహా అదనంగా చేసేదేమి లేదు. కాని సిద్ధాంతంలో నమ్మకం కుదరాలంటే గతాన్ని భవిష్యత్తును గురించి చెప్పగలిగిన సత్తా ఉండాలి. ఈ విషయాలు మామూలుగా అయితే అంత అవసరం లేనివిగా భావిస్తారు. ప్రకృతి సామాజిక శాస్త్రాలకంటే, పదార్థ విజ్ఞానం ఆధిక్యతలో ఉండగలగడానికి కారణం, గతాన్ని భవిష్యత్తును గురించి చాలావరకు చెప్పగలగడమే. ఉదాహరణకు న్యూటన్ పేర్కొన్న గురుత్వాకర్షణ సిద్ధాంతం, చలన సిద్ధాంతం విభిన్న రంగాలలోని సంఘటనలను ఏకం చేశాయి. కొన్నిటిని అంచనా వేయగలగడం కూడా జరిగింది. లేకుంటే వాటి జోలికే ఎవరూ పోలేరు. గ్రహాల చలనం, గ్రహణాలు, తోక చుక్కలు కనిపించడం, అలల ఆటుపోటులు, తుపాకి గుండు దూసుకుపోవడం, ఎత్తుతోబాటు బరువులో మార్పు, సూర్యుని వంటి నక్షత్రాలు స్థిరంగా, అండాకారంలో ఉండడం వంటి వాటిని ఉదాహరణగాను చెప్పవచ్చు. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం అద్భుతమయిన అంచనాలుగా 1845లో కనుక్కొన్న నెప్ట్యూన్ గ్రహం, 1930లో కనుక్కొన్న ప్లూటో గ్రహం పేర్కొనదగినవి. యాడమ్స్, లెవిరియర్లు ఎవరికివారే వరుణ (నెప్ట్యూన్) గ్రహాన్ని కనుక్కొన్నారు. యురేనస్ గ్రహ చలనంలో, న్యూటన్ సిద్ధాంతాన్ననుసరించి, ఏదో ఇంకొక గ్రహం ఉండాలని భావించారు. ఇలాంటి పరిశోధన ఫలితంగానే ప్లూటో గ్రహాన్ని కూడా కనుక్కొన్నారు.
అయితే, న్యూటన్ కు పూర్వం శతాబ్దాల తరబడి, గ్రహణాలు, ఆటుపోటుల గురించి సరిగానే అంచనా వేయగలిగారు గనక న్యూటన్ సిద్ధాంతం విజ్ఞాన రంగంలో ముందుకు వెళ్ళినట్లు చెప్పలేకపోవచ్చు. ఇక్కడ కేవలం అంచనా వేయడం మాత్రమే ప్రధానం కాదు. ఏ ప్రాతిపదికపై అంచనా వేశారనేది ముఖ్యం. పరిశీలించదగిన వాస్తవాల నుంచి ఒక నమూనాను కనుక్కోవడం ఒక ఎత్తు. ఆ నమూనాకు మూలం కనుక్కొని ఇందుకుగాను అవసరమయిన గర్భత విషయాలు గ్రహించడం మరొక ఎత్తు. ప్రతి రోజూ సూర్యోదయం తూర్పున ఇంచుమించు ఒకే సమయాన జరుగుతుందనీ, రుతువులు ఒకదాని తరవాత మరొకటి వస్తాయని ఆటవికులకు కూడా తెలుసు, వీటికి వెనక ఎవరో దేవతలున్నారు. అనుకున్నంతవరకూ అతడి జ్ఞానం అస్తవ్యస్తంగానే ఉంటుంది. చలికాలంలో పగలుతక్కువగా ఉండడం, ఒకోసారి దేవతలున్నారు. అనుకున్నంతవరకూ అతడి జ్ఞానం అస్తవ్యస్తంగానే ఉంటుంది. చలికాలంలో పగలుతక్కువగా ఉండడం, ఒకోసారి ఆలశ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడం వంటివన్నీ ఆయా దేవతల మనస్సులోని మార్పుననుసరించి జరుగుతాయనుకున్నాడు. కనక ప్రకృతి గురించిన అతడి అవగాహనలో భద్రతా రాహిత్యమే కనిపిస్తుంది. భూమి సంవత్సరానికో పర్యాయం స్యూరునిచుట్టూ పరిభ్రమించడం, భూమి తన అక్షంపై తాను తిరగడం అనేవి ఖగోళ శాస్త్రజ్ఞుడు అవగాహన చేసుకున్నాడు. క్రమంగా ఉండడం, అందులో కొంత దారి తప్పడం అనేవి వస్తు తరహాలని, వీటిని వివేచనాత్మకంగా సంతృప్తికరంగా అవగాహన చేసుకోవచ్చని మానవుడు తెలుసుకున్నాడు. న్యూటన్ సిద్ధాంతంలో జరిగింది ఇదే, ఏదొక విధంగా అనిగాక, ఆవశ్యకత అనేదానికీ, మితమయిన స్థాయి నుంచి విశ్వజనీనతకు న్యూటన్ సిద్ధాంతం దారితీసింది.
ఇతర సిద్ధాంతాలతో సఖ్యత
ఇతర సిద్ధాంతాలలో సఖ్యతగా ఉండటమనేది విజ్ఞాన సిద్ధాంతం సంతృప్తిపరచవలసిన లక్షణాలలో ఒకటి. భూమి, చంద్రుడు కూడా సూర్యునితో బాటే ఒకే కక్షలో ఉన్నప్పుడు గ్రహణం వస్తుందని గ్రహచలన సిద్ధాంతం పేర్కొంటున్నది. కనక రాహువు, కేతువుల దుష్టపథకం వల్ల గ్రహణం ఏర్పడుతుందని అంగీకరించ వీల్లేదు. విజ్ఞానం, వైద్యం చెబుతున్న రీతిగా కలరా, స్పోటకం అనే వ్యాధులకు కారణాలు, చికిత్స అంగీకరిస్తే, క్షుద్రదేవతల ఆగ్రహం వల్ల ఆ వ్యాధులు వస్తాయని ఒప్పుకోరాదు ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. తాత్కాలిక ప్రతిపాదనలు విజ్ఞాన సిద్ధాంతంలో ఉండవు. కొత్తగా కనుక్కొన్న వాటిని వివరించడానికి గాను ఒకదాని తరవాత మరొక ప్రతిపాదన చేస్తూ పోరాదు. ఇలా చేస్తే మౌలిక ప్రాతిపదనపై నమ్మకం సడలుతుంది.
ఒక పర్యాయం ప్రతిపాదన సంతృప్తికరంగా ఉందంటే, అందులో ఇంకే మార్పులూ చేయరాదని అర్థం కాదు. పాతవాటిని బలిపెట్టకుండా, కొత్త వాస్తవాలను వివరిస్తూ, సమర్థనీయమైన మార్పులు ఉంటే ఆహ్వానించవచ్చు. సాక్ష్యాధారాలు లభిస్తుంటే, సాధారణీకం గావిస్తుంటాం. అది వాంఛనీయం. కాని ప్రతిపాదనకు ఉప ప్రతిపాదనలు చేస్తుంటే, మౌలిక సిద్ధాంతంలో దోషం ఉన్నట్లే. కొత్త వాస్తవాలను సహజమైన సాధారణీకరణ ద్వారా గనక సిద్ధాంతం వివరించలేకపోతే, తొలి పదాలు, ప్రతిపాదనలు సమూలంగా మార్చాలన్నమాటే.
పదార్థ విజ్ఞానంలో ఇదే జరిగింది. సంప్రదాయ పదార్థ విజ్ఞానం అనేక ప్రతిపాదనలపై ఆధారపడింది. అందులో కొన్ని పేర్కొందాం.
1. పరిశీలకుని వేగంతో నిమిత్తం లేకుండా కాలం, దూరం ఉంటాయి. ఇవి మారవు.
2. యూక్లిడ్ చెప్పిన తీరులో ప్రదేశం ఉన్నది. దూరాన్ని కొలవాలంటే కాలంతో నిమిత్తం లేదు.
3. ప్రదేశం యావత్తు ఈథర్ ఆవరించి ఉంది. పదార్థ రేణువుల మధ్య విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారమయ్యేచోట సైతం ఈధర్ ఉంది.
4. శక్తిని అనంతంగా విభజిస్తూ పోవచ్చు.
5. ద్రవ్యరాశి ఎప్పుడూ పదార్థాన్ని అంటి పెట్టుకొని మారకుండా ఉంటుంది. శక్తితో దీనికి సంబంధం లేదు. ఎంత వేగంగా ఏ వైపుకు వెడుతున్నప్పటికీ ద్రవ్యరాశి అలానే ఉంటుంది.
6. పదార్థ విశ్వంలో కార్యకారణ నియమం కచ్చితంగా ఉంది. సూత్రప్రాయంగా ప్రతి సంఘటననూ అవసరమైనదిగా, తిరుగలేనిదిగా దానికారణాలను బట్టి వివరించవచ్చు.
మైకల్ సన్-మోర్లే పరిశోధనల ఫలితంగా వచ్చిన పరోక్ష ఫలితాలు, ఇంకా అనేకానేక పరిశోధనలు 19వ శతాబ్దం చివరి వరకూ జరిగినవాటిని గమనిస్తే పైన పేర్కొన్న వాటి ఆధారంగా ఉన్న పదార్థ విజ్ఞానం సమూలంగా మార్చాలని తేలింది. ప్రతిపాదనల జోలికి పోకుండా సిద్ధాంతాన్ని మార్చాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోగా, పరస్పర విరుద్ధ విషయాలకు దారితీసింది.
ఐన్ స్టీన్, ప్లాంక్ లు తుదకు ఈ సన్నివేశంలో వచ్చిన సమస్యను పరిష్కరించారు. వారి సాపేక్షతా, క్వాంటం (తేజఃకణ) సిద్ధాంతాలు సంప్రదాయ పదార్థ విజ్ఞాన ప్రాతిపదికలకు పూర్తిగా భిన్నమైంది.
పోటీపడుతున్న సిద్ధాంతాల మధ్య ఎంపిక
ఒకోసారి అనేక సిద్ధాంతాలు పోటీపడుతూ రంగంలో ఉండవచ్చు. ప్రతిదీ కూడా పైన పేర్కొన్న స్థితిని సంతృప్తి పరచవచ్చు. అటువంటప్పుడు ఈ కింద పేర్కొన్నవాటిలో ఏదొకటి సాధ్యమౌతుంది. ప్రత్యామ్నాయ సిద్ధాంతాలనేవి మౌలికంగా ఒకే సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహించవచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ స్వీకరిద్దాం. మరాఠీ, గుజరాతీ, తమిళం, హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలలోని అనేక వాక్యాలు ఒకే అర్థాన్ని ఇవ్వవచ్చు. భిన్న మాటలలో వ్యక్తపరుస్తున్నా, విభిన్న వాక్యాలన్నీ సమానమేనని అనవచ్చు. అలాగే ఒకే సిద్ధాంతానికి సరిపడే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సమానంగా ఉన్నాయంటే వాటి తొలిపదాలు, ప్రతిపాదనలు సరిపడేవి కావడమైనన్న మాట. ప్రతిపాదకులకు తొలుత ఈ విషయం అవగాహనకాకున్నా ఇది సాధ్యమే. ఇలాంటి ప్రతిపాదనలు పరస్పరం మౌలిక భేదం ఉన్నా, ఒకే రూపం గలవిగా పేర్కొనవచ్చు. ఒక సమస్యను పరిష్కరించడానికి అనేక ప్రతిపాదనలు ఉన్నప్పుడు, అవి మౌలికభేదం గల ఒకే రూపంగలవికాకుంటే, సాధారణత్వం ఒక్కటే ప్రమాణంగా స్వీకరించాలి. సాధారణత్వం మాత్రమే. అంటే తొలిపదాలు, ప్రతిపాదనలు బహు స్వల్పంగానూ, సాధారణ స్వభావంతోనూ ఉంటాయని అర్థం. సాపేక్షతా సిద్ధాంతంలో చాలా చిక్కుతోకూడిన గణితం ఉన్నప్పటికీ, తార్కికంగా న్యూటన్ పదార్థ చలనంకంటే ఇది సాధారణంగా ఉంటుంది. ఈ రెండు సిద్ధాంతాలలో మిగతా విషయాలు సమానంగా ఉన్నాసరే, సాపేక్షతా సిద్ధాంతాన్ని స్వీకరించాలి.
కొన్ని సందర్భాలలో సాధారణీకరణ అనే ప్రమాణం కూడా విఫలంగా వచ్చు. న్యూటన్, హ్యుగిన్స్లు ప్రతిపాదించిన వెలుగునకు సంబంధించి ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఇందుకు ఉదాహరణగా స్వీకరించవచ్చు. అటువంటప్పుడు పరిశోధనా సాక్ష్యాధారులు లభించేవరకూ వేచి ఉండడం మినహా చేయగలిగింది లేదు. అప్పుడు ఒక సిద్ధాంతానికి అనుకూలంగా మిగిలిన సిద్ధాంతాలను తోసిపుచ్చడానికి వీలౌతుంది.
అసలు పరీక్ష
విజ్ఞాన సిద్ధాంతానికి మరొక ప్రమాణం ఉంది. తెలిసిన వాస్తవాలన్నిటినీ వివరించడం, లోగడ ఆమోదించిన సిద్ధాంతాలతో సరిపోవడమే చాలదు. విజ్ఞానంగా భావించడానికి అసలైన పరీక్షకు నిలబడగలగాలి. అసలు పరీక్ష అంటే, దానితో సిద్ధాంతగతి నిర్ధారణ అవుతుందన్నమాట. ప్రతిపాదన అలా ఉంచి, పరిశోధన జరిగినప్పుడు వచ్చే ఫలితాలు ప్రతిపాదనలో సరిపడకపో వచ్చు. అటువంటప్పుడు ప్రతిపాదన సరికాదని రుజువు అవుతుంది. అంటే ప్రతిపాదన నిలవాలంటే ఇటువంటి కీలక పరీక్షకు గురికావలన్నమాట.
కాంతి ప్రసారాన్ని గురించి న్యూటన్, హ్యూజిన్ లు ప్రతిపాదించిన వివాదాలను పరిశీలిద్దాం. కాంతి కిరణాలను ఫోటాన్లు అంటారని, అవి సూటిగా పయనిస్తాయనీ పెర్కొన్నాడు న్యూటన్. అయితే కాంతి అండాకార తరంగాలుగా ఈథర్ లో ప్రసారమవుతుందని హ్యూజిన్స్ అన్నాడు. తరంగంలో ప్రతి బిందు కేంద్రం కూడా కాంతి ద్వితీయ మూలంగా ఉంటుంది. ఈ రెండు ప్రతిపాదనలు ప్రతిబింబం, వక్రీభవనం ఆశక్తి తెలిసిన విషయాలను వివర్తిస్తున్నాయి. దృష్టికి సంబంధించిన శాస్త్రంలోని ఈ అంశాలకు సంతృప్తికర సమాధానం లభిస్తుంది. ఆమోదించిన సిద్ధాంతాలకు విభిన్నంగా లేవు. విజ్ఞాన దృష్య్టా ఏదో ఒక సిద్ధాంతాన్నే సమర్ధించాల నేదేమి లేదు. పదార్థ విజ్ఞాన శాస్ర్తజ్ఞులు తమ తమ మనో ప్రవృత్తిని బట్టి ఏదో ఒక సిద్ధాంతాన్ని సమర్ధించారు. రెండు సిద్ధాంతాల మధ్య స్పర్థకూడా ఒక కీలక పరీక్షకు గురయ్యే వరకూ అసలు విషయం తేలలేదు. చివరకు పెట్టిన పరీక్ష చాలా సాధారణమైనది. సాంకేతిక పదజాలంతో నిమిత్తం లేకుండా ఈ పరీక్షను వివరించవచ్చు.
ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో రాయి వేశామనుకోండి. రాయిబడిన చోట నుంచి తరంగాలు గుండ్రంగా అన్ని దిక్కులలో వ్యాపించడాన్ని గమనిస్తాం. దీనిని కేంద్రంగా స్వీకరించి గమనిస్తే ఈ తరంగాలతో నీరు పైకీ కిందకూ అన్ని దిక్కులలో కదలడాన్ని పరిశీలిస్తాం. మొదట వేసిన చోటే మరొక రాయి వేశామనుకోండి. మరొక తరంగ ప్రవాహం మొదలై వ్యాపిస్తుంది. అప్పుడు మొదటి తరంగం రెండో తరంగం ఉబ్బెత్తుగా లేచి తారసిల్లిన చోట నీటికణాలు పరిశీలించవచ్చు. అని తొలుత ఉన్న దూరంకంటె రెట్టింపుగా అటూ ఇటూ ఊగుతాయి. అలాగే రెండ కెరటాల మధ్య ఉన్న పల్లపు ప్రాంతపు పరిస్థితి కూడా ఉంటుంది. కాని ఒక కెరటం లేచినచోట మరొ కెరటపు పల్లపు ప్రాంతం ఉంటే గందరగోళం ఏమీ ఉండదు. నీటి కణాలు ప్రశాంతంగా ఉంటాయి.
కాంతి గనుక తరంగ స్వరూపంతో ఉండేటట్లయితే కొన్ని అనుకూల పరిస్థితులలో రెండు తరంగాలు కలిసినప్పుడు జోక్యం గమనించవచ్చు. ఇలాంటి జోక్యమే ఉంటే రెండు తరంగాలవల్ల ఏర్పడిన గందరగోళం లేకుండా పోవాలి. ఈథర్ కణాల గందరగోళం ఉండరాదు. అంటే అలాంటిచోట్ల కాంతి ఉండరాదు. ఒకదానికి బదులు రెండు కాంతి తరంగాలు ఉన్నప్పటికీ ఇలా జరగాల్సి ఉంటుంది. న్యూటన్ కణ సిద్ధాంతం సరైనదైతే వెలుగు ఫొటాన్లరూపంలో కణ ప్రవాహంగా ప్రసరిస్తే, రెండు ఫొటాన్లు పరస్పరం తారసిల్లినచోట, కాంతి తీవ్రత ఉండాలి. అలా కలసిన చోట వెలుగు అసలే కనిపించకుండా పోరాదు. చీకటి దృశ్యాలు ఉంటే, న్యూటన్ ప్రతిపాదన తప్పని, హ్యూజిన్ ప్రతిపాదన సరైనదని తేలిపోతుందన్నమాట.
పరిశోధనల వల్ల తేలిందేమంటే వెలుగుచీకట్లు రెండూ హ్యూజన్ అంచనా వేసిన రీతిలో కనిపించాయి. న్యూటన్ ప్రతిపాదనను తృణీకరించారు.
సాపేక్షతా సిద్ధాంతం కూడా ఇలాంటి పరీక్షకు గురికావలసి వచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం ద్రవ్యరాశి, శక్తి- ఒకదాని నుంచి మరొకదానికి మార్చడానికి, వీలున్నది, కనక శక్తితో కూడిన కాంతి కిరణాలు గురత్వాకర్షణ క్షేత్రానికి ఆకర్షితం కావడం జరుగుతుంది. సూర్యుడికి సమీపంగా పయనించే నక్షత్ర కాంతి కిరణాలు, సూర్యుని బలమైన ద్రవ్యరాశి ఆకర్షణ మూలంగా, సూర్యునివైపుకు కొంత మేరకు వంగుతాయి. సూర్యుని తీవ్రవెలుగు ప్రసారం వల్ల మామూలుగా నక్షత్ర కిరణాలు ఇలా వంగడాన్ని గమనించలేం. కాని సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భంగా సూర్యుడి కిరణాలు భూమి మీద సూటిగా పడవు. అప్పుడు ఏర్పడిన అంధకారం మూలంగా దూరాన ఉన్న నక్షత్రాల నుంచి వచ్చే కాంతి మార్గాన్ని గమనించవచ్చు. అంచనా వేసినట్లు ఈ కాంతి కిరణాలు గనక సూర్యుడి వద్ద వంగకపోతే, ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతం రుజువయ్యేదికాదు. 1919లో వచ్చిన గ్రహణం ఆధారంగా పరిశోధనలు జరిపి, తారల నుంచి వచ్చే కాంతి కిరణఆలు సూర్యునివద్ద వంపుగా ఉండడాన్ని గమనించారు.
సారాంశం ఏమంటే, విజ్ఞాన సిద్ధాంతం కొన్ని కీలక పరీక్షలకు నిలబడాలి. అక్కడ విఫలమైతే ప్రతిపాదించిన సిద్ధాంతం సరైనదికాదన్న మాట. దీనికే అసలు పరీక్ష అంటారు. ఏ ప్రతిపాదనకైనా ఇది అన్వయించక తప్పదు. ఇటువంటి పరీక్షకు నిలబడని సిద్ధాంతం నిజం కాకపోవచ్చు. సత్యం అంటే ఏమిటో ఆయా వ్యక్తులు భావించే దానిని బట్టి నిజం ఉంటుంది. కాని విజ్ఞాన దృష్టిలో మాత్రం, అటువంటి ప్రతిపాదన నిజమూ కాదూ, అబద్ధమూ కాదు. అది విజ్ఞాన పరిధికి చెందదు, అది భౌతిక, రమణీయక సిద్ధాంతాలు ఎంత సునిశితమైనా, హేతుబద్ధంగా ఉన్నప్పటికీ, అవి మేధస్సు అవగాహనతో చేసిన భావనలైనప్పటికీ, వాటికి విజ్ఞాన స్థాయి మాత్రం చేకూరదు. మేధస్సుకు అవగాహన అయ్యే భావనలలో దేవుడు ఆత్మ ఎలక్ర్టాన్ ఉన్నాయి. ఇందులో ఎలక్ర్టాన్ ఒక్కటే విజ్ఞాన భావన. దీనికి చెందిన సిద్ధాంతం విజ్ఞాన పరమైనది. ఇది పరీక్షకు నిలబడుతుంది. దేవుడు, ఆత్మ భావనలు విజ్ఢానేతరాలు, వీటికి పరీక్షకు నిలబడే సత్తా లేదు. ఇతర సిద్ధాంతాలతో పొందికగా ఉండాలనే ప్రమాణం కూడా చేర్చి చూస్తే, ఈ భావనలు అశాస్త్రీయాలే.
విజ్ఞానంలో రాశి విధానాలు
అంచనావేసే శక్తి ఉంటేగాని పరీక్షకు నిలబడటం సాధ్యం కాదు. అంచనా అనేది తుదిఘట్టం. కీలకమైన పరీక్షలో విఫలమైతే ప్రతిపాదనతో పొందికగా ఉన్న ఇతర విషయాలను చూసి సరిపెట్టుకోడానికి వీల్లేదు. పరీక్షకు అర్థాన్ని గమనిస్తే ఇటువంటి సందర్భాలలో రాశివిధానాలు (Quantitative Methods) చాలా ఫలవంతంగా ఉన్నట్లు గమనించవచ్చు. అయితే పరీక్ష నిమిత్తం, వైజ్ఞానిక స్థాయి కోసం, రాశి విధానాలనేవి తార్కిక విశ్లేషణకు, నిగమన పద్ధతులకు పనికి వచ్చే మేరకే స్వీకరిస్తాయి. ఉదాహరణకు, మేఘాలు ఏర్పడే విషయమై ప్రతిపాదనలు, అలోపతి వైద్యం ప్రకారం రోగకారణాలు, నయం చేసే రీతులలో రాశివిధానాల ప్రయోజనం అట్టేలేదు. అయినప్పటికీ వైజ్ఞానిక ప్రమాణాన్ని, పరీక్షకు నిలబడటాన్ని సంతృప్తి పరచడం వల్ల అవి కూడా వైజ్ఞానికాలే.
అంచనా వేయడంలో నిర్ధిష్టంగా ఉండడానికి, ప్రతిపాదనలో ఇమిడి ఉన్న విషయాలను ఇంకా సునిశితంగా పరిశీలించడానికి రాశిపద్ధతులు ఉపయోగపడే మాట నిజమే. కాని ఒకానొక సిద్ధాంతం విజ్ఞానయుతంగావడానికి దాని తార్కిక నిర్మాణం, దానికే ప్రపంచానుభవంతో కూడిన వాస్తవాలకూ గల సంబంధం ముఖ్యం. ఇదంతా గణితపద్ధతులలో ఉన్నా లేకున్నా ఫరవాలేదు. అంతవరకూ వస్తున్న నమూనారీతులన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఒక ప్రతిపాదన చేయడం అందులో ఇమిడి ఉన్న విషయాలను నిగమన తర్కంలో ఉన్నాయోలేదో చూడడం, తరవాత పరిశీలిస్తూ పరీక్షకు గురికావించడం జరగాలి. దీనిలో ఇమిడి ఉన్నవన్నీ సరిపోతే, సిద్ధాంతానికి (తార్కికంగా) అందరూ ఆమోదిస్తారు.
(ఇది కచ్చితంగా సరైందనలేం. కొన్ని సందర్భాలలో అంచనాలు విఫలమైనప్పటికీ, వ్యవస్థాపిత సిద్ధాంతాన్ని అట్టిపెడతారు. కలవరపెడుతున్న విషయాన్ని భవిష్యత్తు కనుక్కోవచ్చుననే ఆశతో ఇలా చేస్తారు. యురేనస్ గ్రహం విషయంలో ఇంతే జరిగింది. సిద్ధాంతం ఏ మేరకు సఫలమైందనే దాన్ని బట్టి, అంచనా విఫలమై సిద్ధాంతం కూడా విఫలమైనట్లు పరిగణించే పరిస్థితి వస్తుంది).
వైజ్ఞానిక నిర్మాణ నమూనాను ప్రతిపాదన-నిగమన నమూనా అంటారు. విషయం ఏదైనా అన్ని విజ్ఞాన సిద్ధాంతాలకు ఈ నమూనా సర్వసాధారణంగా ఉంటుంది. ఆర్థిక, నైతిక, రాజకీయ విషయాలలో ఈ పద్ధతి అంతగా అన్వయించలేకపోడానికి సాంఘిక శాస్త్రాలలో మార్పులే కారణం. మానవేచ్చ పనిచేయడంతో నిర్దిష్టంగా అంచనావేయడం సాధ్యపడటం లేదు. పరిమితంగా తప్ప, గణిత విధానాలు అన్వయించడం కూడా కుదరడం లేదు. మానవ ప్రవర్తన అధ్యయనానికి సైతం అన్వయించగల స్థాయికి గణితం ఇప్పుడే చేరుకుంటున్నది. సాంఘిక శాస్త్రాలలో అగ్రగణ్యం ఉన్న ఆర్థిక శాస్త్రం వంటివాటికి వైజ్ఞానిక పద్ధతులు అన్వయిద్దామనుకున్నప్పటి ఆగమన పద్ధతి ప్రాధాన్యం ఒక శతాబ్దం నుంచే గుర్తించడం జరిగింది. సామాజిక రాజకీయ శాస్త్రాలలో ఈ పద్ధతి ఇప్పుడిప్పుడే వస్తున్నది. నైతికశాస్త్రంలో ఇది మొదలు కాలేదు. కనక సాంఘిక శాస్త్రాలు ప్రతిపాదన-నిగమన నమూనాను చెప్పుకోదగినంతగా అన్వయించలేదు. సాంఘిక శాస్త్రాలలో ఆగమన ప్రాతిపదికలు సరిగా ఉన్నచోట, సిద్ధాంత ప్రతిపాదనలు, వైజ్ఞానిక సిద్ధాంతంగా ఉంటాయి. అంటే రూపొందించిన సిద్ధాంతాలు నిజమా, అబద్దమా అంటే, పరీక్షా ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. అయితే సిద్ధాంత నిర్మాణం మాత్రం దెబ్బతినదు.
విజ్ఞాన సత్యం సంభావ్యమే
విజ్ఞాన సిద్ధాంతాన్ని గురించి ఇంతవరకు జరిపిన చర్చవల్ల లోగడ చెప్పని విజ్ఞానసత్యం ఒకటి తెలుస్తోంది. విజ్ఞానం నిర్మాణంలో వివేచనాత్మకమనీ, విషయంలో ప్రపంచానుభవం గలదనీ, మతరహిత స్వభావంతో కూడినదనీ పరిశీలించాం. విషయపరంగా ప్రపంచానుభవంతో కూడినదంటే, ఇందలి సత్యం సంభావ్యమనీ, కచ్చితంకాదనీ అర్థం, కేవల వివేచనా లేదా, అంతర్భుద్ధి వల్ల వెల్లడించే సత్యాల వంటిది కాదన్నమాట. మార్మికవాదిగాని కేవలం వివేచనాత్మకుడుగాని పెర్కొనే సత్యంకంటే, విజ్ఞానపరమైన సత్యం తక్కువ అని అనుకోరాదు. ఈ రెండు సందర్భాలలోనూ సత్యం అనే పదాన్ని వివరణ లేకుండా వాడితే తప్పుదారిన పట్టించినట్లవుతుంది. మార్మికుని సత్యం ప్రకారం ప్రపంచానుభవంతో సరిపోయినా, లేకున్నా ఫరవాలేదు. కేవల హేతువాది చెప్పే సత్యం ప్రాయికంగా ఒకప్రతిపాదన స్వభావం గలది మాత్రమే. కనక ఇందులో నిర్ధారణ భిన్న రంగానికి చెందినది.
సత్యం అనే పదాన్ని రెండు భిన్నమైన అర్ధాలలో వాడుతున్నారు. ఒకానొక ప్రకటన సత్యమైనదంటే, అర్థం ఏదైనా కావచ్చు.
1. లోగడ పేర్కొన్న ప్రతిపాదన తాత్కాలికంగా సత్యమైనదిగా భావిస్తుంటే అందులోంచి సత్యాన్ని సరిగ్గా రాబట్టడం జరగవచ్చు.
2. ప్రపంచరీతిని సరిగా చిత్రించవచ్చు.
మొదటి ప్రకటన తార్కికంగా సత్యమైంది. కనక తార్కికంగా సరైందనవచ్చు. సత్యం అంటే ఇక్కడ తార్కికంగా సరిపడినదన్న మాట. రెండోది ప్రాపంచికాను భవం దృష్ట్యా వాస్తవం. ఒకో పర్యాయం ఒక ప్రకటన తార్కికంగా సరైంది కావచ్చు. ప్రాపంచికానుభవంలోనూ సరైందికావచ్చు. లేదా రెండింటిలో ఏదో ఒకదానికే చెందవచ్చు. ఈ విషయం సాధ్యమవడానికి ఉదాహరణలు చూద్దాం.
ఎ బి
1. మనిషి నాలుగు కాళ్ళతో ఉంటాడు. 1. కనక నాకు నాలుగు కాళ్ళున్నాయి.
2. నీరు రాయికంటే భారమైంది. 2. కనక రాయి నీటిలో మునగుతుంది.
3. రోమ్ కు ఉత్తరదిశగా లండన్ ఉంది. 3. కనక రోమ్ కంటే లండన్ చల్లగా
ఉంటుంది.
4. నీరు గాలికంటే తేలిక. 4. కనక రాయి నీటిలో తేలుతుంది.
పై ప్రకటనలన్నింటిల్లోనూ, మొదటి భాగం ప్రతిపాదనకాగా, రెండో భాగం దాని నుంచి వచ్చిన నిర్ణయం. ఈ నిర్ణయాలను పరిశీలిద్దాం.
1 బి) తార్కికంగా సరైందే, ప్రపంచ అనుభవంలో తప్పు.
2 బి) తార్కికంగా చెల్లదు. ప్రపంచంలో వాస్తవమే.
3 బి) తార్కికంగా సరైంది. ప్రపంచంలోనూ వాస్తవమే.
4 బి) తార్కికంగా చెల్లదు. అనుభవంలో దోషపూరితం.
ఈ ఉదాహరణ వల్ల, తార్కికంగా సరిగా ఉండడం, ప్రపంచ సత్యం అనేవి స్వతంత్ర ప్రతిపాదనలని గ్రహించవచ్చు.
పూర్వాపర సంబంధాలను బట్టి తర్కం నిర్ధారణ అవుతుంది. ప్రపంచాను భవం అనేది వాస్తవాన్ని బట్టి ఉంటుంది. తర్కంలో ఒక ప్రకటన చెల్లడమో, చెల్లకపోవడమో తప్ప, మధ్యే మార్గంలేదు. తార్కికంగా సరైన ప్రతిపాదనలోని సత్యం ఎంత నిర్ధారితమైనదో, తార్కికంగా చెల్లని ప్రతిపాదనకూడా అంతే నిర్ధారణతో కూడింది. ప్రపంచానుభవంతో కూడిన సత్యంలో వాస్తవాలు రెండు విషయాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు వర్షం కురుస్తున్నది అనే ప్రతిపాదనలో వాస్తవమో, అసత్యమోతప్ప, సందేహానికి చోటు లేదు. కాని, హంసలు తెల్లనివి అంటూ ఒక సర్వ సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు, ఇందలి సత్యం కచ్చితమని చెప్పజాలం. అన్ని హంసలనూ పరిశీలించే వీలులేదు. గనక ఇలా చెప్పజాలం. భవిష్యత్తులో రానున్న హంసల విషయం పరిశీలించడం అసలే సాధ్యపడదు. కనక అటువంటి ప్రతిపాదన కొన్నిటికే పరిమితం. ఆ మేరకు ఈ ప్రతిపాదనలోని సత్యం నిర్ధారితం కాదు. ఇదంతా కేవలం కోడి గుడ్డుపై వెంట్రుకలు లెక్కించడం వంటిదేమీ కాదు. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఒక నల్లని హంసను చూశారు కూడా.
సర్వ సాధారణమైన ఇలాంటి ప్రతిపాదనల మాట అలా ఉంచి, విజ్ఞాన సిద్ధాంతంలో ఒకే ఒక ప్రతిపాదన సైతం సంభావ్యంగానే భావించాలి. అలాంటి ప్రతిపాదనలు సైతం సాధారణ సత్యాలుగా భావించే వాటి నుంచి రాబట్టినవేగదా. ప్రతిపాదనలలో భావనలు, సంబంధాలుకూడా ఇమిడి ఉంటే, పరిశీలించదగిన ప్రాపంచిక విషయాలు ఉంటే, పరిమిత సంఖ్యకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాటికి సంబంధించిన సత్యం అసంపూర్తి సాక్ష్యాధారాలపైనే ఉంటుంది. అటువంటి వాటి నుంచి రాబట్టిన ఏ ప్రతిపాదన అయినా నిర్ధారితంగా ఉండదు. నిగమనం అంటే సర్వసాధారణత్వం నుంచి ఒకానొక ప్రతిపాదనకు దారితీసే పద్దతే గదా.
మేదస్సు అవగాహనతో కూడిన భావనలపై ఆధారపడి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితిలో మెరుగు ఉండదు. ఇమిడి ఉన్న వాటన్నిటినీ పూర్తిగా పరిశీలించినప్పటికీ అది ప్రాపంచికానుభవం సత్యంగా గాక, ప్రతిపాదనల సంభావ్యతనే సూచిస్తుంది. కొన్ని ప్రతిపాదనలు ఒక గణిత సిద్ధాంతాన్ని నిర్ధారించ వచ్చు. అయితే సిద్ధాంతం మాత్రం ప్రతిపాదనలను రుజువు చేయలేక పోవచ్చు. భిన్న ప్రతిపాదనల నుంచి తార్కికంగా సిద్ధాంతాలను నిర్దిష్టంగా రాబట్టవచ్చు. ప్రతి పాదనలలోని సత్యాన్ని సిద్ధాంతాలలో ఇమిడి ఉన్న వాటికి అన్వయించవచ్చు. ఇమిడి ఉన్నవాటి సత్యం ఆధారంగా ప్రతిపాదనలు నిర్ధారితాలని చెప్పజాలం. దీనిని బట్టి తేలేదేమంటే మేధస్సు భావనల ఆధారంగా ఏర్పడిన వైజ్ఞానిక సిద్ధాంతం, అందుకు సంబంధించిన ప్రాపంచికానుభవ సత్యం కూడా సంభావ్యంగానే నిలుస్తాయి. నైరూప్యతకూ వీటికీ తేడా ఉంది. మేథోభావనలకు సరిపడే ప్రాపంచిక పరిశీలక విషయాలు లేవు. ఇక్కడే చిక్కులో ప్రవేశిస్తున్నాం. విజ్ఞానం అభివృద్ధిచెందే కోద్దీ తార్కికంగా కచ్చితమయిన సిద్ధాంతంలో సత్యం తగ్గిపోతున్నదన్నమాట. కేవలం వివేచనాత్మక పద్దతిలో ఇటువంటి చిక్కులేదు. అటువంటి పద్ధతిలో ఆద్యంతాలు తర్కం పైన ఆధారపడడాన్ని చూడొచ్చు.
ఈ స్థితిలో వైజ్ఞానిక సత్యాన్ని గురించి పరిశీలించదగిన అంశం మరొకటి ఉంది. ఒక సిద్ధాంతం స్థానంలో మరొకటి చోటు చేసుకున్నప్పుడు, తొలుత ఉన్న సిద్ధాంతాన్ని ఉత్తరోత్తరా వచ్చిన సిద్ధాంతం స్వీకరించినట్లే. ఐన్ స్టీన్ సిద్ధాంతం సంప్రదాయ పదార్థ విజ్ఞానాన్ని స్వీకరించింది. అయితే సంప్రదాయ పదార్థ విజ్ఞానం పేర్కొన్న ప్రపంచ దృక్పథం దోషపూరితమని, ఆధునిక పదార్థ విజ్ఞానం చూపింది. అయితే వీటిలో ఏది సరైంది. అని ప్రశ్నించడం సబబే, ఉజ్జాయింపుగా వాస్తవం అనడానికీ, దోషపూరితం అనడానికీ చాలా తేడా ఉంది. కానీ రెండూ విభిన్న విషయాలకు సంబంధించినవని తెలిస్తే చిక్కువిడిపోతుంది. న్యూటన్ సిద్ధాంతం ఐన్ స్టిన్ సిద్ధాంతానికి సన్నిహితమైనదంటే సంప్రదాయ పదార్థ విజ్ఞానం నుంచి రాబట్టిన గణితాన్నే దృష్టిలో పెట్టుకున్నారు. గ్రహచలనానికి చెందిన కెప్లర్ నియమాలు ఒక ఉదాహరణగా చూపవచ్చు. సాపేక్షతా, సిద్ధాంతంలోని గణితసూత్రాలలో కెప్లర్ నియమాలు ఉన్నాయి. పరిశీలించే వస్తువుకు సంబంధించి, పరిశీలకుడి గమనవేగాన్ని గ్రహించకపోవడంలోనే ఈ సన్నిహితత్వం ఉంది. ఏ సిద్ధాంతమైనా కొంత కాలం నిలబడాలంటే, దాని అంచనాలు సరిగా ఉండాలి. చాలా సందర్భాలలో ఇలానే జరుగుతుంది.
ఒకానొక గణిత సిద్ధాంతాన్ని రాబట్టడానికి అనేక ప్రతిపాదనలు ఉపకరించ వచ్చు. పూర్వ ప్రతిపాదన వల్లనే ఉత్తరోత్తరావచ్చే ఫలితం ఉండకపోవచ్చు. ఒక సిద్ధాంతం మరొక సాధారణ సిద్ధాంతంలో కలిసినప్పుడే అది పెంపొందే అవకాశం లభించవచ్చు. లోగడ సిద్ధాంతంతో పోల్చి చూస్తే, సాధారణ సిద్ధాంత ప్రతిపాదనలు భిన్నమైనవికావచ్చు. తొలి సిద్ధాంతానికి చెందిన గణిత అంచనాలు కొత్త ప్రతిపాదనలో వాస్తవాలుగా కొనసాగవచ్చు. అప్పుడు తొలుతఉన్న ప్రపంచ దృక్పథం తనవిలువను కోల్పోతుంది. కొత్త సిద్ధాంతం సమర్పించే దృక్పథంలో పాత అంతా కలిసిపోతుంది. సంప్రదాయస్థితి నుంచి ఆధునిక స్థాయికి పెంపొందిన పదార్థ విధానంలో ఇదే జరిగింది. అందుకే నేటికీ న్యూటన్ పదార్థ విజ్ఞానాన్ని రోడ్లు, వంతెనల నిర్మాణంలో, విద్యుత్తును ఉత్పత్తి చేసి, పంపిణీ చేయడంలో, మోటార్లు తయారు చేయడంలో ఇంకా అనేక విషయాలలో వాడుతున్నాం. వాటిని ఆధునిక విజ్ఞానానికి సమీపంలో ఉన్న సూత్రాలుగా భావించడమే. ఇందుకు దోహదం చేసింది. ఇవన్నీ ప్రాపంచికరీతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో దోషాలు ఏమంత పట్టించుకోదగినవి కావు. అయితే న్యూటన్ పదార్థ విధానం భౌతిక విశ్వాసానికి సంబంధించిన మౌలిక విషయాలగురించి సరిగ్గా చెప్పిందని మాత్రం ఒప్పుకోవడం లేదు. విశ్వంలో ప్రతి సంఘటనకూడా మరో సంఘటనతో కార్యకారణ సంబంధంతో ఉందని ఇప్పుడు ఒప్పుకోలేం. దూరాన్ని కొలవాలంటే కాలవ్యవధితో నిమిత్తం లేదనేది కూడా ఇప్పుడు అంగీకరించం. ఈ విధంగా న్యూటన్ రోజులలోని పదార్థ విధానం కాస్తా ఆధునిక పదార్థవిధానంలో ఐక్యమైపోయింది. ఆ విధంగా సజీవంగా ఉందనవచ్చు. న్యూటన్ పదార్థ విధానపు ప్రపంచ దృక్పథం మాత్రం మౌలికంగా దోషపూరితమైంది గనక తోసిపుచ్చడం.
Is astrology scientific? ఏది విజ్ఞానం? ఏది కాదు?
తన పరిధిలో పరిశీలనకు వచ్చిన వాస్తవాలను సంతృప్తికరంగా వివరించకపోతే వైజ్ఞానిక సిద్ధాంతం ఏదీ కూడా అట్టేకాలం నిలబడదు. కాని విజ్ఞాన చరిత్ర నిండా ఉత్తరోత్తరా దోషాలని రుజువైన సిద్ధాంతాలు లేకపోలేదు. న్యూటన్ పేర్కొన్న వెలుగుకణ సిద్ధాంతం ఇందులో ఒకటి. ఇంత మాత్రానే విజ్ఞాన స్థాయికి భంగం వాటిల్లదు. మనో విశ్లేషణవంటి అన్వేషణారంగాలనేకం ఉన్నాయి. వాటిలో సర్వసాధారణంగా ఆమోదించే వైజ్ఞానిక సిద్ధాంతం ఇంకా రావలసి ఉంది. అంటే మనో విశ్లేషణ ఉబుసుపోక అనుకోరాదు. చాలా ఆసక్తికరమైన, ఉపయోకరమైనకృషి ఈ రంగంలో జరిగింది. అనేక సందర్భాలలో ఈ పద్ధతి ప్రయోగించే చికిత్సా విధానాలను చూస్తుంటే దీనిని తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ సిద్ధాంతంగా పేర్కొన్న దానిలో అద్భుతమైన అంతర్ దృష్టి కనిపిస్తున్నదేగాని, కీలకమైన పరీక్షకు గురికాలేదు. విజ్ఞాన సిద్ధాంతంగా ఆవిర్భవించడానికి మనో విశ్లేషణ అన్వయించే పద్ధతులు, ఉద్దేశాలు ఉన్నాయికూడా. దీనికి వ్యతిరేకంగా వ్యవస్థాపితమైఉన్న సిద్ధాంతం ఏదీ లేదు. అందు వల్లనే, మనో విశ్లేషణ రానురాను విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందవచ్చు. ఆ లక్ష్యం చేరుకోడానికి ఎంతో దూరం పయనించవలసి రావచ్చు.
మరో విధమైన సిద్ధాంతాలు కూడా ఇక్కడ చర్చించబోతున్నాం. వాటిలో పరిమితంగా ప్రాపంచికానుభవ సత్యం కొంతమేరకు ఉన్న సందర్భాలు లేకపోలేదు. అయినా అవి విజ్ఞానపరంగా లేవు. ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించే వాటిననుసరించి, అందులో ఇమిడి ఉన్నవాటిని పరోక్షంగానైనా రుజువుపరచవీల్లేదు. అదే రంగంలో విజయవంతంగా పనిచేస్తున్న వైజ్ఞానిక సిద్ధాంతాలలో పెసగకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా అటువంటి విజ్ఞాన-విజ్ఞానేతర సిద్ధాంతాలను (ఒకే రంగంలో) కొన్నింటిని చూద్దాం.
ఖగోళం-జ్యోతిష్యం
ఈ రెండూ మానవుడు చిరకాలంగా పరిశీలిస్తున్న ఆకాశానికి చెందినవే. ఆకాశంలో ఒకే తీరుగా చలిస్తున్నవాటిని, అందుకు సంబంధించిన భౌతిక సంఘటనలను మానవుడు పరిశీలిస్తున్నాడు. ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించేటంత వరకూ జ్యోతిష్యం-ఖగోళ శాస్త్రం భిన్నమైనవని భావించనేలేదు. మానవ వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. మానవుడి వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహానికి కూడా ఒక దేవత ఉంటుందనీ, ఆ దేవత మానవుడి వ్యవహారాలలో ఆసక్తి చూపడమేగాక, ప్రభావితం చేస్తుందని భావించారు. గ్రహాల చలన నియమాలను కనుక్కొన్న కెప్లర్ సైతం జ్యోతిష్యంలో నమ్మకం గలవాడే. అతడి సమకాలీనులకు ఈ ధోరణిలో దోషం కనిపించలేదు. ఆకాశంలోని ఈ నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్న తరవాత, సామాజిక సంస్థలు పనిచేసే తీరు, మానవుడి శారీరక మానసిక రీతుల గురించి తగినంతగా తెలిసిన అనంతరం, గడ్డినుంచి గింజలు వేరు చేయడానికి వీలుచిక్కింది. ఖగోళశాస్త్రం విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందింది. మానవుడిపై గ్రహాల, నక్షత్రాల ప్రభావం ఉంటుందనే జ్యోతిష్యం విజ్ఞానపరంగా అపఖ్యాతి పాలైంది. ఇది అవగాహన చేసుకోవడం సులభమే. ప్రతిపాదన చేసిరాబట్టే నిర్మాణం ఖగోళంలో ఉంది. అనేక పరిశీలనాంశాలకు స్పష్టమైన వివరణలను ఖగోళ శాస్త్రం ఇస్తోంది. పరీక్షకు తట్టుకొనే ప్రమాణానికి నిలబడకలుగుతోంది. ఇందుకు భిన్నంగా, జ్యోతిష్యంలోని మూల సూత్రం దోషపూరితమైంది. నక్షత్రాలకు, గ్రహాలకు అంటి పెట్టుకొని దేవతలు అనేవారెవరూ లేరు. ఆకాశంలోగాని భూమిపైన గాని ఎక్కడా అలాంటి వారు లేరు కనక వారు మానవుడి వ్యవహారంలో ఆసక్తి చూపే ప్రశ్నేరాదు. జ్యోతిష్యం అశాస్త్రీయం. మనకు గల ప్రత్యక్షజ్ఞానానికి, వ్యవస్థాపిత సిద్ధాంతాలకు పొసగకుండా జ్యోతిషం ఉంది. జ్యోతిష్యం అశాస్త్రీయమే కాదు. విజ్ఞాన వ్యతిరేకం కూడా, జ్యోతిష్యంలో లాగే, యోగసిద్ధాంతం వంటి వాటిల్లోనూ ఇలాంటి విజ్ఞాన వ్యతిరేక ధోరణి ఉంది. విజ్ఞానం రుజువు పరచిన నియమాలను పాటించకుండా, గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి జ్ఞానాన్ని మానవుడు యోగం ద్వారా సిద్ధింపజేసుకోవచ్చుననటం వాస్తవ వ్యతిరేకమే.
ఆలోపతి-ఆయుర్వేదం
అలోపతి-ఆయుర్వేద వైద్యరంగాలలోనూ ఇటువంటి విచక్షణే చేయవలసి ఉంది. అనుభవం, పరిశీలన ఆధారంగా ఆయుర్వేదం అనేక ప్రాపంచిక విషయాలను చిలికించింది. జ్యోతిష్యం లాగ కాక ఆయుర్వేదంలో రోగ నిర్ణయానికీ, చికిత్సకూ సంబంధించి విజ్ఞాన సిద్ధాంతాన్ని ఏర్పరచడానికీ వీలుగా ఆధారం ఉంది. అయితే ఆయుర్వేదం ఇంకా విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందలేదు. వాత, పిత్త, కఫం అనే ప్రతిపాదనలుగానీ, రస, కామ, రక్త, మాంస, మేధ, అస్తి, మజ్జ, శుక్ర అనే ఏడు సారాంశాల విషయంగానీ, ఆధునిక శారీరక శాస్త్రం కనుక్కొన్న వాటితో సరిపోవడం లేదు. ఈ విధంగా ప్రత్యక్షంగా వ్యవస్థాపితమైన జ్ఞానంతో పొందికగా లేకపోవడం వల్ల ఆధునిక విజ్ఞానానికి ఆయుర్వేదం ఆమోద యోగ్యం కాదు.
ఆయుర్వేదానికి భిన్నంగా ఆలోపతి సిద్ధాంతం ప్రత్యక్షపరిశీలనపై ఆధారపడి ఉంది. మానవుని శరీరంలో ఏది ఎలా పనిచేస్తుందో గమనించారు. ఇది ఒకవేళ అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రశ్నించటానికి వీలులేని వాస్తవాల నాధారం చేసుకొని గట్టి ప్రాతిపదికలు చేసింది. ఆధునిక వైద్య శాస్త్రంలో కొన్ని రోగాలకు మాత్రమే నిర్దిష్టంగా చికిత్సలు కనుక్కొన్నారు. కాని రోగ నిర్ణయం మాత్రం తిరుగులేనిది. కాన్సర్ (పుట్టుకురుపు) ఎలా పెంపొందుతుందో, దీనిని ఎలా నయం చేయాలో ఇంకా తెలియదు. తొలిదశలో కనుక్కొంటే మాత్రం నయం చేయగలుగుతున్నారు. మధుమేహం, చలిజ్వరం, ప్లేగు, సన్నిపాతజ్వరం, కలరా, రక్తపుష్ఠి లేకపోవటం, నంజువ్యాధి, ఎముకలు సరిగ్గా ఎదగకపోవటం ఇత్యాదుల విషయంలో వివరాలతో సహా రోగనిర్ణయం తెలుసు. వీటిలో కొన్నిటికి ఆయుర్వేదం చికిత్స చేసి ఫలితాలు సాధిస్తున్నది. అయితే ఈ రోగాలకు చెప్పే కారణాలు, ఎలా నయమవుతున్నాయో వివరించే విధానం కృత్రిమంగానూ, దోష పూరితంగానూ ఉన్నాయి.
ఎలక్ట్రాన్-దేవుడు
ఎలక్ర్టాన్ దేవుడు అనే భావాలు మరొక ఉదాహరణగా స్వీకరించవచ్చు. ఇవి రెండూ సూటిగా చూడడానికి వీలులేదు. ఎలక్ట్రాన్ చలనాన్ని పరిశీలిస్తున్నామని విజ్ఞానవేత్తలు చెప్పారంటే ఆటలో బంతిని గమనించినట్లు ఇది గూడా చూశారని భావించరాదు. గ్యాస్ లో రేణువులు ఒకానొక మార్గంలో ఉన్నప్పుడు, ఎలక్ర్టాన్ నుంచి శక్తిని పొంది, విజ్ఞానం పేర్కొనే నియమాలననుసరించి కాంతి కిరణాలను ప్రసరిస్తాయి. విజ్ఞానవేత్తలు గమనించేది ఈ కాంతి మార్గాన్నే. ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు విజ్ఞాన వేత్త గ్రహిస్తాడు. మనం చూడని ఎడ్లబండి రోడ్డు మీద వెళ్ళిపోయిన తరవాత ఆ దారిన పడిన గుర్తులనుబట్టి ఎడ్లబండిగాక, ఇంకేవీ వెళ్ళలేదని తెలుసుకుంటాం. పైగా ఎంతదూరం అలా వెళ్ళింది గమనించవచ్చు కూడా. ఇదంతా మనం చూడని ఎడ్లబండి వెళ్ళిపోయిన తరవాత చెబుతున్న మాటలే. పైన చెప్పిన ఆవిరిలో ఎలక్ర్టాన్ మార్గం కూడా ఇలాంటిదే. ఎలక్ర్టాన్ పరిమాణం మనం సూటిగా చూడటానికి వీలులేనంత చిన్నది. కాని దాని చలనాన్ని అంచనా వేయవచ్చు. వెలిగిన మార్గానికి మరొక కారణం లేదనికూడా చూపవచ్చు. కనకనే ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు నిర్ధారణగా చెప్పవచ్చు. బంతి పోవడానికీ, ఎడ్లబండి వెళ్ళిపో వడానికీ, తేడా ఉంది. ఎలక్ర్టాన్ వెళ్ళిన తరవాత కాంతి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గాలిలో రేణువులు ఎలక్ట్రాన్ వల్ల ప్రకంపించి నందువల్ల మనకు వెలుగురావడం లేదు. ఎలక్ర్టాన్ తన శక్తిని వాటికి ఇవ్వడం వల్లనే వెలుగువస్తుంది.
అయినప్పటికీ ఎలక్ట్రాన్ వైజ్ఞానిక భావన అంటున్నాం. మేధస్సుతో అవగాహన చేసుకునే భావన ఇది. ప్రాపంచిక విధానాలకు చెందేతీరు ఇందులో ఉంది. దీనికి కొంత ద్రవ్యరాశి, పరిమాణం చేర్చవచ్చు. దీని ప్రవర్తనకు సంబంధించిన నియమాలను రూపొందించవచ్చు. ఈ కార్యకారణ విధానంలో సాక్షి వంటి పరిశీలకుడు ఎవరూ అవసరం లేదు. ఎలక్ర్టాన్ ప్రాపంచిక అనుభవరీత్యా వాస్తవమైనది. ఎలక్ర్టాన్ ప్రవర్తనను పరిశీలించేవాడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడనే దానితో నిమిత్తం లేకుండా, అది స్వతంత్రంగా కాల ప్రదేశాలలో ఉన్నది.
దైవ భావన విషయంలో ఇదే సూత్రం అన్వయించదు. దేవుడు తప్పనిసరిగా ఉంటాడనుకొంటే, దేవునికి నియమాలను ఏర్పరచడం సాధ్యపడదు. పరిశీలకునితో నిమిత్తం లేకుండా, కాల-ప్రదేశాలలో ప్రాపంచిక అనుభవ విషయంగా చూసేటందుకు వీలులేని విషయమిది. దైవభావన విజ్ఞాన పూరితంకాదు. ప్రాపంచిక వాస్తవానికి చెందని విషయమిది. మానవుడు, ప్రకృతి గురించి విజ్ఞానం చెపుతున్న దాన్నిబట్టి చూస్తే దైవానికి అంటగట్టే లక్షణాలు అనవసరమనీ లేదా, అశాస్త్రీయమని అనిపిస్తున్నది. దైవం విషయంలో లాగే, ఆత్మ భావనలో కూడా ఇటువంటి వాదమే చెల్లుతుంది.
ప్రజాస్వామ్యం-మార్క్సిజం
సమాజ విజ్ఞానం నుంచి మనం చివరి ఉదాహరణ చర్చిద్దాం. సమాజ సిద్ధాంతానికి సంబంధించి మార్క్సిజాన్ని శాస్త్రీయమైందిగా భావిస్తున్నారు. గతి తార్కిక పదార్థవాదం అనే ప్రకృతి సిద్ధాంతం నుంచీ దీని రూపొందించారు. ఈ విధమైన ఆలోచనను తమకాలంలోని వైజ్ఞానిక సామాజిక వాస్తవాల దృష్ట్యా, మార్క్స్, ఏంగిల్స్ లు అనేక సంవత్సరాల కృషితో పెంపొందించారు. వీరిద్దరూ వాస్తవాల విషయంలో విజ్ఞాన ఖనులుగా భావించబడ్డారు. అయితే ఆ వాస్తవాలన్నీ అంత ఉపయోగకరమైనవి కాదు. మార్క్స్, ఏంగిల్స్ లు వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ పొందినవారు కారు. జర్మన్ తత్వవేత్త హెగెల్ ప్రభావం కింద మార్క్స్ ఉన్నారు. కేవల భావం అనే పేరిట గతితార్కికాభివృద్ధి దృష్ట్యా ప్రపంచంలోని భిన్న సంఘటనలను వ్యాఖ్యానించడానికి హెగెల్ పూనుకున్నాడు. హెగెల్ పద్ధతిని అనుసరించి మార్క్స్ కు, ఏంగిల్స్ కు ఉన్న మోజు వల్ల వారు, వారి కాలంలోని పదార్థ విజ్ఞానం, గణితశాస్త్రాన్ని కూడా వక్ర భాష్యంలో చిత్రీకరించారు. కాని గతితార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి సామాజిక సిద్ధాంతాన్ని రూపొందించవచ్చునా లేదా అనే విషయాన్ని అలా ఉంచుదాం. కాని గతి తార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి, రాబట్టిన సామాజిక సిద్ధాంతం ఏదీ కూడా సరైంది కావడానికి వీలులేదు. (సోవియట్ శాస్త్రజ్ఞులూ, విజ్ఞాన తత్వవేత్తలు కూడా గతితార్కిక భౌతిక వాదం పట్ల ప్రస్తుతం ఏదో మొక్కుబడిగానే గౌవరం చూపుతున్నారు. ఈ విషయం సరళమైన విమర్శకు సిడ్నీ హుక్ రాసిన డైలెక్టికల్ మెటీరియలిజం అండ్ సైంట్ ఫిక్ మెథడ్ చూడవచ్చు. ఈ విషయంలో ఐన్ స్టిన్ కూడా తనతో ఏకీభవిస్తున్నట్లు హుక్ పేర్కొన్నారు.) మార్క్సిజం అంచనా వేసిన అనేక ప్రధాన ప్రాతిపదికలు దారుణంగా, దోష పూరితాలని రుజువయ్యాయి. పారిశ్రామికీకరణ పెంపొందే కొద్దీ బూర్జువావర్గం తప్ప సమాజంలో మిగిలిన వారందరిలోనూ పేదరికం ధోరణి పెరిగిపోతుందని మార్క్స్ అంచనా వేశాడు. బూర్జువావర్గం మాత్రం కొద్దిమందే అయినా బాగా సంపన్నులుగా పెరిగి పోతారన్నారు. దీని ఫలితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కమ్యూనిస్టు విప్లవం వస్తుందని మార్క్స్ అంచనా వేశారు. విప్లవానికి సంరక్షకులుగా కార్మిక వర్గం ముందు నడుస్తుందన్నాడు. కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా పెట్టుబడిదారీ వర్గాలకు భిన్నమైన వారికి అధికారం సంక్రమించటానికి విప్లవం తోడ్పడుతుంది. పెట్టుబడిదారులు తప్ప మిగిలిన వారందరూ రాజకీయ ఆర్థిక స్వేచ్ఛను అనుభవించేటట్లు కార్మిక వర్గం జాగ్రత్త వహిస్తుందన్నారు. సంధికాలం అనంతరం (ఇదెంతకాలం ఉంటుందో మార్క్స్ సూచించలేదు. పెట్టుబడిదారీ అవశేషాలు తొలగిపోవటానికి వీలుగా రెండు తరాలు ఉంటుందని అంచనా వేసుకోవచ్చు). రాజ్యం హరించిపోవడానికి నాంది పలుకుతుంది. ఆస్తి యాజమాన్యం ఉన్న వర్గాలంటూ ఏమీ లేవు గనక ఎవరికీ ఒత్తిడి చేయవలసిన పనిలేదు. ఎవరినీ దోపిడీచేసే అవకాశం లేదు.
ఈ అంచనాలన్నీ దోషపూరితమని రుజువయ్యింది. కమ్యూనిస్టులు తొలుత రష్యాలోనూ, తరవాత తూర్పు ఐరోపాలోనూ, పిమ్మట చైనాలోనూ విప్లవాన్ని తెచ్చారు. ఇవన్నీ పారిశ్రామికంగా వెనకబడిన దేశాలే. (చెకోస్లోవేకియా ఇందుకు మినహాయింపు) తూర్పు ఐరోపాలో విప్లవంలాగే ఎక్కడ కూడా కుట్రతో తప్ప మార్క్స్ కలలు గన్నట్లు ప్రజావిప్లవం రాలేదు. పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాలలాగ ఈ దేశాలు సంపన్నమైనవి కావు. కమ్యూనిస్టేతర దేశాలలో పారిశ్రామికీకరణాభివృద్ధి వల్ల ప్రజలలో పేదరికం పెరగలేదు. పైగా ఆర్థిక సమానత్వాలు తగ్గిపోయి, కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు. కమ్యూనిస్టు దేశాలలోని కార్మిక నియంతృత్వం. ఇతర నియంతృత్వాలు తగ్గిపోయి, కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు. ప్రజలపై అధికారం చెలాయించే నియంతృత్వంగా తయారయింది. ప్రజలపై అధికారం చెలాయించగల హక్కు లభించడం, దానిని వీరు ఇష్టం వచ్చినట్లు, అమానుషంగా వాడటం జరిగింది. సోవియటే రష్యాలో మూడు తరాల అనంతరం కూడా నియంతృత్వం పట్టుసడలే ధోరణిగానీ, రాజ్యం హరించుకుపోయే లక్షణాలుగాని కనిపించలేదు. అక్కడ పెట్టుబడిదారీ అవశేషాలు ఏమాత్రం లేవు కూడా. (సోవియట్ యూనియన్ తరవాత విచ్చిన్నమై, కమ్యూనిజం అధికారాన్ని కోల్పోయింది).
జ్యోతిష్యంలాగే మార్క్సిజం కూడా పరీక్షకు గురి అయ్యే ప్రమాణాన్ని అన్వయించనందున, వైఫల్యాలతో సర్దుకుపోతోంది. ప్రతివైఫల్యానికి ఏదో ఒక సాకు ఉంటుంది. సోషల్ డెమోక్రట్ల విద్రోహచర్య, కార్మిక వర్గ అపరిపక్వత, వామపక్ష సెక్టీరియనిజం మొదలైనవి పేర్కొంటారు. ఇవన్నీ, సంఘటనలు జరిగిపోయిన తరవాత అన్వేషించే సాకులే. సిద్ధాంతం మాత్రం లోగడవలె ఇప్పుడు కూడా నిస్సారమైందే. పదజాలాన్ని మాత్రం సంపన్నం చేశారు. విధేయులుగా ఉండేవారు సంతోషించారు. కృశ్చేవ్ దోషాలను బయటపెట్టినప్పుడూ, మావోదురాక్రమణ చేసినప్పుడూ మూఢ విశ్వాసులమత్తు వదిలిపోయింది. ప్రాపంచిక అనుభవానికీ, విజ్ఞానానికీ మార్క్సిజం పనికిరానిదన్నప్పుడు, పరీక్షించడానికి తగిన ప్రమాణాలు ఈ సిద్ధాంతానికి అన్వయించవనే అర్థం. ఆచరణలో మాత్రం మార్క్సిజం అమానుష, సామాజిక ఫలితాలకు దారితీసింది. చరిత్రలో ఎన్నడూలేనంతగా భారీ ఎత్తున ఈ అమానుష కృత్యాలు జరిగాయి. మానవజాతికి ఇది చాలా ప్రధానమైన విషయం. అయితే మార్క్సిజం యొక్క వైజ్ఞానిక స్థాయిని నిర్ణయించటానికి ఈ విషయాలు సందర్భ సహితాలు కావు.
మానవుడిని గురించి గాని, విశ్వం గురించి గాని ఇదే తుది సత్యమంటూ ప్రజాస్వామ్యం దేనినీ పేర్కొనదు. స్వేచ్ఛ, వ్యక్తి, గౌవరం, మనుషులలోని అంతర్యంలోనూ, పరిసరాల దృష్ట్యా ఎంతతేడా ఉన్నప్పటికీ మానవులందరినీ సమానంగా గుర్తించడం, ఇతరులతో సహకరిస్తూ సంపూర్ణ జీవితాన్ని గడపడం అనేవాటిని ప్రజాస్వామ్యం ప్రధానంగా స్వీకరిస్తుంది. ఇటువంటి విలువలను సాధించడానికి ఉత్తమోత్తమ సామాజిక వ్యవస్థను కనుక్కొనే పంథాను ప్రజాస్వామ్యం నమ్ముతుంది. అటువంటి మార్గం ప్రాపంచికానుభవంతో కూడిందేగాక, తాత్కాలికం కూడా. ప్రతివ్యక్తి కూడా ఈ విలువలను క్రమంగా సాధ్యమైనంత మేరకు సాధించ కుంటూ పోతాడు. అటువంటి సామాజిక క్రమాన్ని సాధించుకోడానికి ఏదీ ఉత్తమ పద్ధతి అని పరిశీలిస్తాడు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది కీలకమైన విలువ. సమాజంలోని వ్యక్తి మాత్రమే స్వేచ్ఛను సాధించగలడు. కనక ప్రజాస్వామ్యం అందరికీ ఓటు హక్కు కోరుతుంది. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు కావాలంటున్నది. తమ ప్రతినిధులుగా ఉండదగనివారిని అధికారం నుంచి తొలగించే హక్కు వారికి ఉండాలంటుంది. ఆర్థికంగా అసమానత్వాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తే, రాజకీయ సమానత్వం అనేది కేవలం ఆటగామాత్రమే ఉంటుంది. అటువంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆర్ధికాధికారాన్ని వికేంద్రీకరించాలని ప్రజలు కోరారు. ఉత్పత్తి సాధనాలను జాతీయం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చునని తొలుత భావించారు. ఆర్థిక స్వేచ్ఛను కోరిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గ్రేట్ బ్రిటన్ లో లేబర్ పార్టీని అధికారంలోకి ఎన్నుకోగా, వారు జాతీయీకరణతో ప్రయోగం చేశారు. కాని ప్రజాస్వామిక, కమ్యూనిస్టు దేశాలలో జాతీయీకరణ ప్రయోగం కనువిప్పుకలిగించింది.
జాతీయీకరణకంటే, ఆర్థిక రంగాన్ని అదుపులో పెట్టడం వల్ల అనుకున్నవి సాధించవచ్చునని తేలింది. జాతీయకరణ వృధా అనీ, చికాకుకలిగించే పద్ధతి అని రుజువైంది. కమ్యూనిస్టు దేశాలన్నిటిల్లోనూ రాజకీయాధికారానికి ఆర్థికాధికారం తోడు అయింది. జాతీయకరణ వల్ల కలిగిన ఫలితమే ఇదంతా, ఒక పక్కన ప్రభుత్వానికి విపరీతాధికారాలుండగా, మరొక పక్క పౌరడు బానిస స్థాయికి దిగజారాడు. ఈ అనుభవం నుంచి ప్రజాస్వామ్యం గుణపాఠం నేర్చుకుంది. కనుక పిడివాదం లేని పంథాను అనుసరించాలని ప్రజాస్వామ్యం చెబుతుంది. సోషలిజంపై తీవ్రచర్చ జరిగింది. ప్రాశ్చాత్య ప్రపంచంలో ఇది ఇంకా మారు మ్రోగుతూనే ఉంది. దీని ఫలితంగానే 20వ శతాబ్దపు సోషలిజం అనే సిద్ధాంతం వెలువడింది. (సోషలిస్ట్ యూనియన్ ప్రచురించిన ట్వంటియత్ సెంచరీ సోషలిజం చూడండి. పెంగ్విన్ బుక్స్) మార్క్సిజం ఇంకా జాతీయకరణనే పట్టుకువేలాడుతోంది. ముందుగా రూపొందించిన చట్రంలో వాస్తవాలను ఇమడ్చాలని ప్రయత్నిస్తున్నది. అనుభవాన్ని బట్టి సిద్ధాంతాన్ని స్వచ్ఛందంగా మార్చుకోవాలనుకోవడం లేదు.
వైజ్ఞానిక సిద్ధాంతాన్ని అన్వయించడానికి గాను కొన్ని ఉదాహరణలు పరిశీలించాం. ఇది ఇతర విషయాలకు వర్తింపజేయవచ్చు. కులం, ఏకపక్షంగా నిరాయుధీకరణ, సమిష్టివ్యవసాయక్షేత్రాలు, శాంతి ప్రయోజనాల సాధన, పారిశ్రామికీ కరణకు పథకాలు-ఇత్యాదులను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఎక్కువ స్వేచ్ఛను, వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే. ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి స్వేచ్ఛను, వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే. ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి ఉద్దేశాలను ప్రశ్నించకుండానే, ఏ మేరకు ప్రయోజనాన్ని సాధించామో పరిశీలించవచ్చు. అలా చేయడానికి గాను అనువైన వాస్తవాలను ఎక్కడ, ఎలా కనుక్కోవడమో వ్యక్తికి తెలియాలి. ఇందుకు తగిన శ్రమ చేయాలి. ఎలాంటి అరమరికలు లేకుండా నిష్పాక్షికంగా అన్వేషణ చేసే ధోరణి అలవరచుకోవాలి. అనేకమంది వ్యక్తులు ఈ విధమైన కృషి చేస్తే తప్ప, ప్రజాస్వామ్యానికీ మానవ విలువలకూ భద్రతలేదు. సంపన్నమైన సుసంఘటిత సమాజాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. మనసమాజం సంపన్నమూ కాదు, సుసంఘటితమూ కాదు.
విజ్ఞానం - మానవ సంబంధాలు
వైజ్ఞానిక పద్ధతిలో సర్వ సాధారణత్వం
ఆధునిక విజ్ఞానం పెంపొందడానికి వైజ్ఞానిక పద్ధతే ముఖ్యకారణం. ఆర్థిక పరిసరాలు మొదలైన ఇతరేతర కారణాలు అంతగా ప్రాముఖ్యం వహించలేదు. వైజ్ఞానిక అన్వేషణ మూడు అంచెలలో సాగుతుంది. విశ్లేషణదశ, సహజచారిత్రక దశ, సాధారణ సూత్రాల నుంచి రాబట్టే సిద్ధాంతం అనేవి పేర్కొనదగినవి. వైజ్ఞానిక సిద్ధాంతానికి తుది ప్రమాణం వాస్తవాలు మాత్రమే. సిద్ధాంతం మారవచ్చు. నిరాకరణకు గురికావచ్చు. కొత్తగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి సమగ్ర సిద్ధాంతంలో ఇమడవచ్చు. ఈ విధానంగా వైజ్ఞానిక సత్యమనేది తాత్కాలిక మైంది. వైజ్ఞానిక పద్ధతి తనను తాను చక్కదిద్దుకుంటూ పోయే స్వభావం ఉన్నది.
ఇందులో విజ్ఞానానికి మాత్రం పరిమితమైన విలువ అంటూ ఏమీ లేదు. ప్రకృతి పనిచేసే తీరు, మానవ సంస్థలు కృషి చేసే విధానం అర్థం చేసుకోవాలన్నప్పటికీ వాటిలోని భాగాలు తెలుసుకోటమేగాక, పరస్పర సంబంధాలు కూడా గ్రహించవలసి ఉంటుంది. అంటే సమస్యను విశ్లేషించిన, మూలాధారమేదో కనుక్కోవాలన్న మాట. అందుకు సంబంధించిన వాస్తవాలన్నీ సేకరించాలి. వాస్తవాలను వివరించే సిద్ధాంతాన్ని రూపొందించాలి. సమస్య పరిష్కార మార్గాన్ని సూచించాలి. సారాంశమేమంటే వైజ్ఞానిక పద్ధతులతోనే అన్వేషణ జరపాలన్న మాట. ప్రకృతి శాస్త్రాలకు వైజ్ఞానిక పద్ధతి తప్పనిసరి అయినట్లే మానవ సంబంధాల విషయంలోనూ ఈ పద్ధతి కావాలన్నమాట.
ఈ నిర్ణయం వల్ల చాలా పరిణామాలకు దారితీసే అవకాశముంది. వాటిల్లో కొన్నిటిని పరిశీలిద్దాం.
వైజ్ఞానిక పద్ధతిలో సహనం
సిద్ధాంతాలన్నీ వాస్తవాలవల్ల విలువను సమకూర్చు కుంటాయి. కనక సూత్రప్రాయంగా జ్ఞానం అంతా అస్థిరమైందే. అంటే కార్యాచరణకు ఆధారపడదగిన ఏ మార్గదర్శకత్వం లేదని భావించరాదు. కావలసినంత ఆధారంఉంది. తొలకరి ఏ తేదీనవస్తుందో ముందుగా నిర్ధారణగా చెప్పలేము. కొంకణ తీరంలో ఈ సంవత్సరం ఫలానా తేదీన తొలకరి ఆరంభమవుతుందని చెప్పలేము. మార్పు చెందే విషయాలు అనేకం ఉన్నందున వాతావరణం నిక్కచ్చిగా అంచనా వేయటం సాధ్యపడదు. అంత మాత్రాన వేసవి నిరవధికంగా కొనసాగుతుందని గానీ, లేదా తొలకరి జూన్లో గాక ఏప్రిల్ లోనే మెదలవుతుందని గానీ భావించరాదు. కొన్ని పరిమితులకు మనకు లభిస్తున్న జ్ఞానం ఆధారంగా వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతాం. స్వల్ప మార్పులకు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాం. వాతావరణ సిద్ధాంతానికి సంబంధించిన అనుభవ ఆధారాలను ఇంకా విస్తృతం చేసుకోవటం ద్వారా ఆ స్థిరత్వాన్ని తగ్గించుకుంటూ పోవచ్చు. అయితే పూర్తిగా ఆస్థిరత్వం తొలగించటం సాధ్యం కాకపోవచ్చు కూడా.
ఇంకే మాత్రం అస్థిరత్వాన్ని తగ్గించలేమనుకున్న తరవాత, అందులో భిన్నాభిప్రాయాలకు, వివిధ పంథాలకు అవకాశముండవచ్చు. కాని మూల సిద్ధాంతాలనికి విరుద్ధంగా మాత్రం ఇవేవీ ఉండరాదు. వైజ్ఞానిక సిద్ధాంతం ప్రాపంచికానునభవంతో ఉండటం వల్ల అది తాత్కాలికమైనదిగా భావించాలి. న్యూటన్ పదార్థ విజ్ఞానం ఎంతో సుస్థిరతను చేకూర్చుకున్నప్పటికీ, ఆ తరవాత అదే సిద్ధాంతం మరొక సమగ్ర సిద్ధాంతంలో ఇమిడిపోయింది. ఈ సమగ్ర సిద్ధాంతం సమస్యలను భిన్న కోణాలనుంచి పరిశీలించింది.
అస్థిరత, తాత్కాలిక స్వభావం అనే రెండు లక్షణాల వల్ల విజ్ఞానంలో పిడివాదానికి, మేథస్సుతో కూడిన తలబిరుసుతనానికి చోటు లేదు. వైజ్ఞానిక పద్ధతిలో భిన్నాభిప్రాయానికి, భేదాభిప్రాయానికి సహనం ఉంటుంది. అన్వేషణ నిరంతరం సాగకపోతే విజ్ఞానం స్తంభించిపోతుంది. కనక భేదాభిప్రాయాన్ని సహనంతో చూడటం గాక అందులో సత్యం ఉండవచ్చుననే గౌరవంకూడా చూపటం విజ్ఞానానికి శ్రేయస్కరం. సహనం అంటే ఉదాసీనతగా భావించరాదు. అంగీకరించని దానితో సహజీవనం చేస్తున్నట్లుగా తలచరాదు. ఇతరుల అభిప్రాయాలు మన అభిప్రాయాల లాగే గౌరవించదగినవని గుర్తించే లక్షణంగా భావించాలి. అయితే ఇవన్నీ వైజ్ఞానిక పద్ధతికి కట్టుబడి ఉండాలి.
మానవ సంబంధాలలో వీటి ఫలితాలుస్పష్టమే. బ్రిటన్లో ప్రతిపక్షాన్ని గౌరవంగా చూడటం కేవలం నామమాత్రమే కాదు. కాగా ప్రజాస్వామిక నడవడికి కట్టుబడి ప్రతిపక్షం వ్యవహరించాలి. అభివృద్ధి, మార్పు కోరేవారు నచ్చజెప్పే పద్ధతిని అనుసరించాలేగాని, ఒత్తిడితోనూ, జిత్తులతోనూ ద్రోహచర్యకు పూనుకోరాదు.
సహకారంతో కూడిన పోటీ
సహకారంతో కూడిన పోటీధోరణిలో వైజ్ఞానిక కృషి సాగుతుంటుంది. అంతమాత్రాన శాస్త్రజ్ఞులు రుషులు అనుకోరాదు. ఇతర మానవులకున్న బలహీనతలన్నీ ఏదో ఒక మోతాదులో వీరు చూపుతారు. కాని ఇతర శాస్త్రజ్ఞులకంటే ముందుకు పోవాలని భావించినప్పుడు, తమ వైరి శాస్త్రజ్ఞులు చేసిన కృషిని సహితం మెచ్చుకోవటమేగాక, ప్రతిభను ఎక్కడ కనుగొన్నా సరే గుర్తిస్తారు. సహకారం సమైక్యత అనేవి శాస్త్రజ్ఞుని లక్షణాలు అనటానికి వైజ్ఞానిక పద్ధతే కారణం. భాష, జాతి, మతం, ఆదర్శాలు ఇత్యాది సుంకుచిత అవరోధాలు, స్వల్ప ఎత్తుగడల వల్ల విజ్ఞానార్జనకు అవరోధం ఏర్పడుతుంది.
అశాస్త్రీయ విజ్ఞానవేత్తలు
తరచు విజ్ఞానవేత్తలు తమపరిధికి సంబంధించని విషయాలలో అర్థం, పర్థం లేని మాటలు వల్లించడం గమనిస్తాం. ఇది కేవలం వారి దోషమే కాదు. ఒక నిపుణుడు తన పరిధికి చెందని రంగంలో కూడా తాను గొప్పవాడినని భావించడం కద్దు. బ్రిటన్లో ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు పదార్థ విజ్ఞానంలో తాను జరిపిన గొప్ప కృషివల్ల, దేవుడున్నాడా అనే విషయం మొదలు, చిత్తానికి స్వేచ్ఛ ఉన్నదా అనే సమస్యవరకూ మాట్లాడే అర్హత ఉందనుకొంటాడు. శస్త్ర చికిత్సలో నిపుణుడు అంతర్జాతీయ రాజకీయాలలో సునిశిత లోతుపాతులను అవగాహన చేసుకున్నట్లు భ్రమ చెందుతాడు. ఒక రుషి తనను తత్వవేత్తగా, విద్యావేత్తగా స్వీకరించాలనుకుంటాడు. మామూలు మనుషులలో కూడా దోషం లేకపోలేదు. ఆదిమ మానవుడు మంత్రగాడివైపు ఆశ్చర్యపోయి చూసినట్లు, అతడే సర్వశక్తి మంతుడని భావించినట్లు, నిపుణుడు తనకు సంబంధించిన పరిధిలో ఏది చెప్పినా అదే ప్రమాణవాక్యంగా స్వీకరించటానికి సిద్ధంగా ఉంటాడు. 1830 ప్రాంతాలలో సర్ జేమ్స్, సర్, ఆర్థర్ ఎడింగ్టన్లు ఇటువంటి ప్రతిష్ఠనే పొందారు. ఒక రంగంలో నిపుణుడైతే ఇక అన్ని విషయాలపై అతడు మాట్లాడగలడని సాధారణ మానవులంతా నమ్ముతారు. ఎంతో కాలం శిక్షణ, అధ్యయనం చేసిన తరవాత గానీ ఒకానొక రంగంలో నైపుణ్యం సాధ్యంకాదు. అప్పుడే ప్రత్యేకమైన మేధస్సుతో కూడిన క్రమశిక్షణకూడా అలవడుతుంది. ప్రకృతి విజ్ఞానంలో ఇది స్పష్టం. ఈ రంగంలో ఒక సమస్యను ప్రతిపాదిస్తే అది అవగాహన చేసుకోటానికి కూడా సాంకేతికంగానూ, భాషాపరంగానూ ఎంతో శ్రమపడవలసి ఉంటుంది. నిపుణుడు కాని వ్యక్తి ఇటువంటి శ్రమచేయడు. ప్రకృతి శాస్త్రాల సమస్యను మానవుడి ఉద్వేగాలపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపకపోవడమే ఇందుకు కారణం, తత్వంలోనూ, సామాజిక శాస్త్రాలలోనూ పరిస్థితి వేరేవిధంగా ఉన్నది. ఆత్మ, దేవుడు, సమానత్వం, సాంఘిక న్యాయం, మొదలైన వాటిని గురించి ప్రతివాడూ తనకు తెలుసుననుకుంటాడు. అలా కాకున్నప్పటికీ ఈ విషయాలలో ఇతరులు చేసే వాటి ప్రభావం మిగిలినవారిపై ఉంటున్నది. విజ్ఞానవేత్త తన వృత్తికి సంబంధించిన పని నుంచి కొంత ఉపశమనం పొందటానికి, తత్వంపైనో, రాజకీయాల గురించో రాస్తే అతడికి ఎక్కడో ఒకచోట అభిమానులు తయారవుతుంటారు. కనకనే విజ్ఞానం సాంస్కృతికంగా విమొచన కలిగించే పాత్రను నిర్వరిస్తుందని నొక్కి చెప్పటం అవసరం. ఇందుకుగాను మానవుడి సమస్యలకు వైజ్ఞానిక పద్ధతుల ప్రాధాన్యతను చూపడం అవసరం. జాన్ డ్యూయీ చెప్పినట్లు ఆధునిక ప్రపంచంలో మేధస్సును ఒక క్రమంలో పెట్టటానికి ఈ వైజ్ఞానిక పద్ధతి వినియోగపడుతుంది.
అంతర్వాణికి అవకాశం లేదు-
వాస్తవాలకు మొగ్గు - పెత్తందారీతనం చెల్లదు
విజ్ఞానంలో వాస్తవాలకు ఆస్కారం ఉన్నదిగానీ, పెత్తనానికి అవకాశం లేదు. ఒక సిద్ధాంత వాస్తవాన్ని తేల్చడానికి వాస్తవాలే తుది నిర్ణయాలు గనక వాటికి ఈ ప్రాధాన్యం లభించింది. రెండొందల సంవత్సరాల పాటు ప్రపంచంయావత్తు న్యూటన్ పదార్థ విజ్ఞానాన్ని ఆమోదించింది. కొన్ని కీలక పరిశోధనలతో సాపేక్షతా సిద్ధాంతం సరయిందని రుజువయ్యే సరికి, పదార్థ విజ్ఞానంలో న్యూటన్ తుదిపలుకు పలికాడనే విషయాన్ని తోసిపుచ్చడానికి విజ్ఞానవేత్తలెవరూ తటపటాయించలేదు. విజ్ఞానేతర రంగంలోని వారి ధోరణి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇటలీలోని పీసా విశ్వవిద్యాలయం ఆచార్యులను ఆహ్వానించి తన టెలిస్కోప్ ద్వారా జుపిటర్ కు చెందిన ఉపగ్రహాలను చూడమని గలీలియో కోరగా వారంతా నిరాకరించారు. వారు విద్యావిహీనులుకారు. చిత్తశుద్ధిలేని వారుకారు. ఇటలీ సమాజంలో ఎంతో సంస్కృతీపరులూ, బాగా చదువుకున్న వారు కూడా అలాంటివారు గలీలియో ఆహ్వానాన్ని ఎందుకు నిరాకరించినట్లు. వాస్తవాలకు భయపడా, లేక గలీలియో తలతిక్కవాడని భావించారా. ఇవాళ వింతగా కనిపించవచ్చుగానీ ఆనాడు గలీలియో తలతిక్కవాడనే వారు భావించారు. జుపిటర్ కు ఉపగ్రహాలున్నాయనీ, ఆరిస్టాటిల్ ఎక్కడా రాయలేదు కదా. కనక అలాంటి ఉపగ్రహాలు ఉండటానికి వీలులేదు. టెలిస్కోప్ ద్వారా స్వయంగా చూశామని ఎవరైనా అంటే అలాంటివారు భ్రాంతిలో ఉండి ఉండాలి. అటువంటి భ్రాంతిపరులపట్ల చూపవలసింది దయమాత్రమే, మెచ్చుకోలుకాదు.
శబ్ద ప్రమాణం అనేది నాటి ఫ్రొఫెసర్ల ధోరణి నిర్ధారించటానికి తోడ్పడింది. అదే ప్రమాణంతో గెలీలియో, చావుకు వెరచి, తన అభిప్రాయాలు మార్చుకోవలసి వచ్చింది. ఇటువంటి శబ్ద ప్రమాణంతోనే బ్రూనోను ఉరికంబం ఎక్కించారు. మనదేశంలో సీత సహగమనానికీ, అమానుషమైన అంటరాని తనానికీ, ఇంకా అనేక నమ్మకాలూ, ఆచారాలు జీవితంలో పెనవేసుకుపోవడానికీ, శ్రుతి, స్మృతి అనే ప్రమాణాలే కారణం.
భారత కమ్యూనిస్టులూ, వారి సహచరులూ అనుసరించే ధోరణిని బట్టి శబ్ద ప్రమాణాన్ని వారెలా పూజిస్తారో సాదాహరణగా చూపవచ్చు. భారతదేశంపై చైనా దురాక్రమణను చాలా సంవత్సరాల పాటు వాళ్ళు గ్రహించలేక పోయారు. ఐక్యరాజ్య సమితిలో దురాక్రమణ అంటే ఏమిటో నిర్వచించలేదన్నారు. ఒకవేళ నిర్వచించగలిగినా, కమ్యూనిస్టుదేశం దురాక్రమణ వంటి దోషానికి గురి కాదని, కమ్యూనిజం మానవ సోదరత్వాన్ని ప్రబోధిస్తున్నదని అన్నారు. లామాల ప్యూడల్ పరిపాలన నుంచి విమోచనగావించే నెపంతో నిస్సహాయంగా ఉన్న టిబెట్ ను కమ్యూనిస్టు చైనా కబళించి వేసింది. 12వేల చదరపు మైళ్ళ భారతభూభాగాన్ని చైనా వశం చేసుకుంది. ఇదంతా వారి దృష్టిలో ప్రధానం కాదు. చైనా ప్రభుత్వం బాండుంగ్ ప్రకటనలో భాగస్వామి అనీ, పంచశీల సూత్రాలకు కట్టుబడి ఉన్నదనీ వాదించారు. గలీలియో టెలిస్కోప్ నుంచి జుపిటర్ ఉపగ్రహాలు చూడటానికి నిరాకరించిన ప్రొఫెసర్లు అరిస్టాటిల్ ఆ విషయం చెప్పలేదంటూ, శబ్ద ప్రమాణాన్ని అడ్డం పెట్టుకున్నారు. కమ్యూనిస్టు నిరంకుశత్వాన్ని, దురాక్రమణను సాధ్యమని మార్క్స్ చెప్పలేదు. గనక కమ్యూనిస్టులు వాస్తవాన్ని చూడలేక పోయారు.
సిద్ధాంతాల నిర్ణయానికి వాస్తవాలే తుది ప్రమాణమైనప్పుడు వైజ్ఞానిక ధోరణిని అనుసరించి సాంఘిక విధానాన్ని, అందులో నివసించే వారి అనుభవాన్ని బట్టే నిర్ణయించాలి. తన పక్షాన శాసనం చేయటానికీ, విధానాలు నిర్ణయించటానికీ, ప్రాతినిథ్యం వహించటానికీ ఎవరు ఉండాలనేది నిర్ణయించే హక్కు పౌరులదే మిగిలిన సాంఘిక వ్యవస్థలతో పోల్చిచూసినప్పుడు ప్రజాస్వామ్యానికి తనను తాను సరిదిద్దుకునే స్వభావం ఉంది. ఇది వైజ్ఞానిక దృక్పథం నుంచి వచ్చిందే.
అంతర్వాణికి అవకాశం లేదు
వైజ్ఞానిక పద్ధతిలో వాస్తవాలపై ఆధారపడే విధానంవల్ల జ్ఞానం అందరికీ చెందడం, ప్రపంచానుభవంతో కూడింది గావడం విశేషంగా పేర్కొనాలి. అన్వేషణలో అలౌకికత్వానికి చోటులేదు. నమ్మకానికి బదులు జ్ఞానం అనేది ఆధారంతో కూడిన వాస్తవాలపై నిలబడుతుంది. అనుభవంతో పరీక్షించటానికి వీలులేని వాటిని సత్యాలుగా అలౌకిక వాదం పేర్కొంటుంది. ఈ కారణాల వల్లనే, వైజ్ఞానిక పద్ధతికి మార్మిక వాదం కూడా పొసగదనే చెప్పాలి. మార్మికుని అనుభవం వైజ్ఞానిక పరిశోధనకు, ఆసక్తికీ వస్తువు కావచ్చు. మానవుడి మనస్సు కొన్ని పరిస్థితులలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోటానికి ఈ అన్వేషణ ఉపయోగపడు తుంది. మార్మికుడు తన అనుభవానికి భాష్యం చెపుతూ దైవంతో లీనమైనట్లు పేర్కొంటాడు. అందులో వైజ్ఞానికంగా నిలబడేదేమీ లేదు. సరైన జ్ఞానం లభించక ముందు, లోగడకూడా మూర్ఛలకూ అంటువ్యాధులకూ గ్రహణాలకూ తోకచుక్కలకూ వక్రభాష్యాలు చెప్పారు. సూర్యగ్రహణానికి సనాతనులు చెప్పే వ్యాఖ్యానంలో ఎంత నిజం ఉన్నదో, మార్మికుడు తాను అనుభూతి పొందాననే సత్యంలోనూ అంతే నిజం ఉన్నది.
మార్మికవాదం, అలౌకికవాదం జ్ఞానానికి సంబంధించినంతవరకూ నిస్సారమైనవి అలాగే మహాత్ముని అంతర్వాణిని కూడా ఇతరులకు ఎలాంటి మార్గాన్ని చూపలేని సారంలేని విషయంగానే భావించాలి, ఒక విషయాన్ని గురించి వివేచనాత్మకంగా ఆలోచిస్తున్నప్పుడు అందులో తుదిఘట్టంగా ఉపచేతనావస్థలో, మెరుపు మెరసినట్లు అంతర్ దృష్టి పడవచ్చు. అయితే ఉత్తరోత్తరా దానిని వాస్తవ సంఘటనలు సమర్థించేవిగా ఉంటాయి. కాని అంతర్వాణి ప్రతిపాదనలను నిశిత పరిశీలనకు గురిచేసి పరీక్షించి వాస్తవాన్ని చూడవలసి ఉన్నది. ఒక వ్యక్తి అంతర్వాణి ఏమేరకు నమ్మదగింది అని తేల్చి చెప్పటానికి ఒక పద్ధతి ఉన్నది, అంధవిశ్వాసం, వీరారాధన లేకుండా ఇతరులకు వినిపించి అవగాహన అయ్యేటట్లు చేయాలి. అలా చేయకపోతే రెండు ప్రమాదాలున్నాయి. అంతర్వాణి ఆధారంగా తప్పు తోవలుపట్టి హిమాలయాలంత పెద్దదోషం చేయవచ్చు. ఇకాం ఘోరం ఏమంటే అంతర్వాణిని విశ్లేషించక పోవడం, అంతర్వాణి చెప్పినవి దోషాలని సంఘటనలు రుజువు చేస్తున్నా గుణపాఠం నేర్చుకోకపోవటం సంభవమే.
మానవ వ్యవహారాలలో ఉద్రేకాలు
ఉద్రేకాల పాత్ర ఏమిటో వైజ్ఞానిక పద్ధతి స్పష్టపరుస్తుంది. విశ్లేషణకు సాధనగా ఉపకరించేది వివేచనేకాని ఉద్రేకం కాదు. కనక ఒక సన్నివేశంలో సమస్యలను పరిష్కరించటానికి ఉద్రేకాలను వివేచనకు లొంగి ఉండేటట్లు చేయాలి. మానవ జీవితంలో ఉద్రేకానికి చోటు లేదని కాదు. పైగా, చూస్తూ ఊరుకోటం గాక గాఢమైన ఉద్రేకాలను కనబరచటం, అందాన్ని మెచ్చుకోడం మానవ జీవితంలో ముఖ్యమైన విషయం. మానవద్వేషితప్ప మరెవరూ మానవుడిని కేవలం లెక్కలు వేసే యంత్రంగా పరిగణించరు. ఉద్రేకాలన్నీ ఆనందానుభూతులుకావు. రామణీయకత భిన్న కోణాలలో మానవుడు చూడగలడనే విషయాన్ని నిరూపిస్తుంది. గాంధీ తన జీవితంలోని చివరి దశలో ఎదురైన ఒంటరితనాన్ని, ఓటమిని గ్రహించిన వ్యక్తిగా పరిణితి చెందిన వ్యక్తిగా భావించవచ్చు. గాంది హత్య, ఏటా వర్థంతి రోజున ఉపవాసం అనే వాటికే ప్రాధాన్యం ఇచ్చే వారు ఇంకా అపరిపక్వదశలోనే ఉన్నారన్నమాట. అవగాహన అనేది ఉద్రేకాలు పరిపక్వదశకు వచ్చినప్పుడు పనిచేసే తీరన్నమాట. జ్ఞానాభివృద్ధి వల్ల అవగాహన వస్తుంది. ఉద్రేకాన్ని వివేచనకు లోబరచాలంటున్నామంటే మానవుడి అంతరంగిక జీవితాన్ని తగ్గించడం కాదు. పైగా ఉద్రేకాల మూలాధారాన్ని వికసింపజేసి, దీని ఫలితంగా వచ్చే శక్తిమంతమైన ఉద్వేగాలకు సరిగా అవగాహన చేసుకొని, ఆచరణకు దిగటానికి తోడ్పడటమై ఇందలి ఉద్దేశం. ఉద్రేకం బలంగా ఉన్నప్పుడు పైకి వ్యక్తం కావాలనుకొంటుంది. ఇవి తరచు ఏదో ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బయటపడటం. ఒక్కోసారి గురిలే కుండా బయటపడటం జరుగుతుంది. ఆగ్రహావేశంతో ఉన్న గుంపు బస్సుపై రాళ్ళు వేయటమనేది విధ్వంసక చర్య. దీని వల్ల సాధించే ప్రయోజనం ఏమీ లేదు. మిగిలేది గందరగోళం, దిగజారుడు విధానం మాత్రమే. ఒకవేళ ఆచరణ అనేది ఫలప్రదమైనప్పటికీ, దీనిని తెలివిగా ఒక పథకం ప్రకారం పట్టుదలతో నిర్వహించటం అవసరం. ఈ విధంగా వివేచన ఆధారంగా ఉద్రేకం ఉంటే జీవిత పోరాటంలో ఇంకా ఉత్తమంగానూ, వదిలేస్తే ఎండు గడ్డిపై నిప్పుపడినట్లే ఉంటుంది. తీవ్రమైన సంవేదన సమస్థనీయంకాదు.
వైజ్ఞానిక పద్ధతి - నీతి శాస్త్రం
నీతిశాస్త్ర సమస్య
ఉద్రేకానికి సంబంధించి వైజ్ఞానిక పద్ధతి ఏమి చెబుతున్నదో, అదే నీతి శాస్త్రానికి కూడా వర్తిస్తుంది. నైతిక విలువలు మానవుడిలోని అంతర్గత అపేక్షలకు రూపాలు మాత్రమే. ఈ విషయం స్పష్టం కావాలంటే నీతిశాస్త్ర సమస్య ఏమిటో అవగాహన చేసుకోవాలి.
శతాబ్దాల తరబడి నైతిక సిద్ధాంతం, విలువలకు అర్థాన్నీ, ఔచిత్యాన్నీ ఇచ్చింది. సత్యం, అందం, మంచితనం, అనే విలువలను ఆమోదించాలన్నా, నిరాకరించాలన్నా ముందుగా రెండు ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాలి. ఈ మాటలకు అర్థం ఏమిటి? ఒకానొక సన్నివేశంలో ఈ పదాలకు ఎలాంటి అవగాహన ఉంటుంది? ఒక యువతి తాను కోరుకున్న యువకుడిని పెళ్ళి చేసుకోడానికి ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటప్పుడు మంచితనం చూపటమంటే ఏమిటి? తన సహచరుడుని ఎన్నుకొనే హక్కును సమర్థించుకోవడమా? లేదా తన తల్లిదండ్రుల పక్షాన నిలబడి మంచి బిడ్డ అనిపించుకోవడమా? విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని అబద్ధాలాడమని నాయకుడు ప్రభోదిస్తే, చిత్తశుద్ధి గల రాజకీయ కార్యకర్త ఏం చేయాలి? ఇలాంటి సన్నివేశాలలో సత్యం మంచితనం అనే విలువల వల్ల లాభం లేదు. ఆ మాటలు ఆచరణలో పెట్టడాన్ని బట్టి, ప్రాపంచిక అనుభవం దృష్ట్యా వ్యక్తి నిర్ణయాన్ని బట్టి వాటికి అర్థం ఉంటుంది.
మాటలకు అర్థాలు మాత్రమే కాక, రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే గాక, విలువల వాస్తవికత కూడా తెలియాలి. అప్పుడే ఎంపిక చేసుకోగలరు. ఒక సన్నివేశంలో ఏది మంచో తెలిసినప్పటికి, ఎందుకు మంచిని చూపాలీ, మంచి వల్ల నష్టం జరగబోతున్నదని తెలిసికూడా ఎందుకు నిజం చెప్పాలి. అనే ప్రశ్నలు ఎదురౌతాయి. ఇక్కడ అవకాశవాదానికి తావు లేదు. నైతిక ప్రమాణాలలో విధిగా అనుసరించవలసిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. పోలీసు లేనప్పుడు కూడా అతడంటే భయపడే తీరుకూ, ఈ విలువలకూ తేడా ఉన్నది. మంచి ప్రవర్తన వల్ల ఒకానొక వ్యక్తికి ఉపయోగం లేకపోయినప్పటికీ మనం అతడి నుంచి మంచి నడవడినే కోరుకుంటాం.
అలౌకిక నీతిశాస్త్రం
పై ప్రశ్నలకు అందరూ ఆమోదించగల సమాధానాలంటూ ఇటీవల వరకూ లభించలేదు. తగినంత ప్రపంచజ్ఞానం లేకపోవడం, సంతృప్తికరమైన విచారణ పద్ధతులు లోపించటమే ఇందుకు కారణం. నైతిక సిద్ధాంతం చరిత్రను బట్టి చూస్తే, ఒక సమస్యను సరిగ్గా రూపొందించకపోతే సున్నితమైన అన్వేషణ సైతం ఎటూ సాగిపోలేక ఆగిపోయే స్థితి వస్తుంది. ఆధునిక కాలం వరకూ అనేక మంది ఆలోచనాపరులు నైతిక విలువలకు సిద్ధాంత ప్రాతిపదికగా శాశ్వతమయిన మార్గాన్ని అన్వేషించారు. అలౌకిక సత్యానికీ, నైతిక విలువలకూ ముడిబెట్టారు. ప్రపంచం అనేది ఆదర్శ ప్రపంచానికి నమూనా అని ప్లేటో చెప్పాడు. ఇటువంటి ప్రపంచ భావాలను అంతర దృష్టితో నమూనా ప్రపంచాన్ని చూడవచ్చు. ఇటువంటి సిద్ధాంతం ప్రకారం మనం నిత్య జీవితంలో చూసే ఎద్దులూ, సైకిళ్ళూ అన్నీ కూడా ఆదర్శ ప్రాయమయిన ఎద్దులూ సైకిళ్ళూ అనే భావాలను నకళ్ళేనన్న మాట. అసలు భావాలకు వివేచనాత్మక ఆలోచనతో స్పష్టంగా చూడవచ్చు. అంతేకాదు. దేన్ని మనం మంచి అంటున్నామో అది కూడా మంచి అనే భావానికి అనుకరణే. దీనిని కూడా హేతువు సహాయంతోనే కనుక్కోవాలి.
అలౌకిక నీతి శాస్త్రంలో పెత్తందారీ స్వభావం
ఇటువంటి ఆదర్శ ప్రపంచం ఉందని అంగీకరిస్తే నైతిక విలువలు విశ్వజనీనంగానూ, కేవలమయినవి గానూ, కాలానికీ, ప్రదేశానికీ సాంఘిక, సాంస్కృతిక పరిసరాలకూ సంబంధం లేకుండానూ ఉంటాయని ఒప్పుకోవాలి. ఈ విలువలను కొన్ని సూత్రాలద్వారా రూపొందించారు. ఆ సూత్రాలు వాస్తవిక ప్రపంచంతో సంబంధం లేనివి. మానవుడి స్వేచ్ఛనూ గౌరవాన్నీ గుర్తించని సూత్రాలే. అవి వ్యక్తి వికాసం, ఆనందంతో నిమిత్తం లేకుండా ఈ విలువలు ఉంటాయన్న మాట. పరోక్షంగానైనా, అనుభవానికి గురిచేయకుండా, ఈ సిద్ధాంతానికి సంబంధించిన మూల సూత్రాలున్నాయి. ఇందులో వాస్తవాలకు చోటు లేదు. ద్రష్ట మాటలే ప్రమాణాలు. ఈ పంథాకు తార్కిక ఫలితం ఏమిటంటే, మానవజీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ సిద్ధాంతపరమయిన నియంతృత్వం ఉంటుందన్నమాట. ప్లేటోకు ఈ విషయం తెలుసు. అయినా సరే అది అవాంఛనీయమని అతడు భావించలేదు.
అలౌకిక సూత్రాల నుంచి విలువలకు రూపెందిస్తే మారుతున్న మానవ పరిస్థితులకు సంబంధం లేకుండా ఈ విలువలు దిగజారిపోయే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఇటువంటి నైతిక సిద్ధాంతం కొత్తకాదు. వివాహంతో నిమిత్తం లేకుండా ఒక స్త్రీ బిడ్డను కంటే, తల్లిగానూ, పౌరురాలుగానూ ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, చాలామంది భారతీయులు, అటువంటి స్త్రీని అవినీతి పరురాలుగానే ఇంకా భావిస్తున్నారు. ఒక బ్రాహ్మణుడు ఎంత పెడితుడైనప్పటికీ, తోటివారికి నిస్వార్థంగా ఎంత సేవచేసినప్పటికీ, అతడు గనక మాంసాన్ని తింటూ, మద్యపానం సేవిస్తే సనాతనుల దృష్టిలో అతడి గుణాలెందుకూ పనికి రాకుండా పోతాయి. తనను తాను బలిచేసుకోవటమే ధర్మంగానూ, సమాజంలో ఆధిపత్యం వహిస్తున్న ప్రమాణాలను పాటించటమే మంచి ప్రవర్తనగానూ భావిస్తున్నారు. సత్యం, సుందరం, మంచితనం అనేవాటికి అధిభౌతిక అర్థాలు సమకూర్చారు. మానవులందరికీ మార్గదర్శకులమంటూ కొందరు బయలుదేరి చెబుతున్నారు. నైతిక విలువలను వివేచనాత్మక విశ్లేషణకు, ప్రాపంచిక అనుభవానికి గురిచేయకుండా, పురోహితుడి బోధనలాగ మార్చి వేశారు. మానవుడి ఆశలు, కోర్కెలతో నిమిత్తం లేకుండా గుడ్డిగా బయటివారి పెత్తనానికి లోబడి, విలువలను అంగీకరించాలంటున్నారు.
నైతిక అన్వేషణ ఇలా వక్రమార్గాన పడటానికి, సమస్యను రూపొందించటం లోనే కీలకం ఉంది. వ్యక్తుల మధ్య సంబంధంగా నీతిని గ్రహించే బదులు, మానవుడి మనుగడ ప్రయోజనానికి ఇదొక పునాది అన్నట్లు భావించారు. మానవుడి జీవితానికి లక్ష్యం అనేది, జీవితంలో గాక వెలుపల ఎక్కడో ఉన్నదని, ముందే ఏర్పరచుకున్న ఒక భావన వల్ల, ప్రారంభదశలోనే వక్రమార్గం పట్టించారు. ప్లేటో దృష్ట్యా శాశ్వతమైన ప్రపంచభావానికి చేరువగా రావడమే సమాజ వ్యవస్థ అనిపించుకుంటుంది. హిందువుల ననుసరించి ఈ లోకంలో వ్యక్తి మనుగడ చాలించి మోక్షాన్ని పొందటమే లక్ష్యం. ఆ రెండు సందర్భాలలోనూ వ్యక్తికి స్వతహాగా ఏమీ విలువలేనట్లు పరిగణించారు. ఫలితంగా నీతి శాస్త్రమనేది అలౌకిక అన్వేషణగా మారింది. సమాజంలో ఉన్న వ్యక్తి సమస్యలకూ, ఆ సక్తులకూ ఏమాత్రం శ్రద్ద వహించలేదు.
నైతిక అన్వేషణకై ఉద్దేశించిన విధానమే దాని పద్ధతిని కూడా నిర్ణయించింది. లక్ష్యం అలౌకికమైంది కాబట్టి విజ్ఞానంతో ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. వాస్తవాలనూ, అనుభవాన్నీ దృష్టిలో పెట్టుకొని నైతికపరమైన అన్వేషణచేస్తే ఆమోదయోగ్యం కాకుండా పోయింది. అనుసరించవలసిన పద్ధతిలో అంగీకారం లేనందున అన్వేషణా ఫలితాలను ఆమోదిస్తారనుకోటం ఒట్టి ఆశే.
Ethical values నైతికవిలువల విశ్వజనీనత
ప్రతి సమాజం కూడా కొన్ని ప్రమాణాలను అనుసరించి విలువలను పాటిస్తుంది. సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన సమాజాలలో వీటినే నైతిక విలువలు అంటారు. దాతృత్వం, తోటివారి పట్ల దయ, నిజాయితీ, వినయం, ఇత్యాది నైతిక విలువలు పేర్కొన్నదగినవి. అనేకమతాలు కూడా మానవుడి పట్ల గౌరవాన్ని ప్రబోధించాయి. మత విశ్వాసం గలవారు తమ తమ వ్యక్తుల పట్ల ఇటువంటి గౌరవాన్ని చూపాలని పేర్కొన్నాయి. మానవ గౌరవాన్ని ఈ విలువలు అంతగా పట్టించుకోలేదు. కాలం గడిచేకొద్దీ ఈ మతాల పిడివాదం, కర్మకాండ లలోని పటుత్వం సడలిపోయింది. మానవజాతి ఐక్యత అనే ప్రబోధం ఒక్కటే నైతిక విషయంగా మిగిలింది. నైతిక పరమైన అన్వేషణ పద్ధతులు లేనప్పుడు ఈ విధానాన్ని వివరించటం ఎలా?. ప్రపంచవ్యాప్తంగా అన్వేషణాపద్ధతులు ఆమోద యోగ్యంగా ఉండేటట్లు ఆవిర్భవించటానికి పూర్వం, విశ్వవ్యాప్తమైన విలువలకు మూలాధారంగా దేన్ని చూపాలి?.
ఈ ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించేటప్పుడు నైతిక విలువలు పనిచేసే తీరు, అవి ఏమేరకు సరి అయినవి, అనే వాటికి కూడా సమాధానం లభిస్తుంది. ప్రస్తుతం విలువ, విశ్వజనీనత, సరైనది, అనే మాటలు నైతిక విలువలకు అన్వయించి చూద్దాం.
నైతిక పదాలకు అర్థం
సమాజంలో వ్యక్తి ఒక వస్తువును పొందడం లేదా, ఒక కార్యకలాపం జరగడం వాంఛనీయమనుకుంటే, విలువ అనే పదానికి అర్థం లభిస్తుంది. మానవుడు ఆశ్రమవాసిగా ఏకాకిగా కాక, సమాజంలో ఒక విశిష్టవ్యక్తిగా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొనే ధోరణి ప్రధానం. వ్యక్తిత్వంలోని ప్రతిభకూ, వాంఛలకూ సంబంధం ఉంది. విలువ అనేది కేవలం వ్యక్తిపరం కాదు. వ్యక్తిని తీర్చి దిద్దే సమాజానికీ, వ్యక్తి వల్ల ప్రభావితమయ్యే సమాజానికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి విలువ అనేది కేవలం మేధస్సుకు, రామణీయకతకు సంబంధించింది కాక, వ్యక్తుల మధ్య సంబంధంగా తలెత్తుతుంది. అంటే ఇతర వ్యక్తులతో నిమిత్తం లేకుండా ఏకాకిగా మేధస్సు, లేదా రామణీయకత విలువలను సాధించవచ్చని అర్థం కాదు. తోటి వ్యక్తితో సంబంధం ఉన్నప్పుడే నైతిక విలువలను సాధించటం సంభవం. దీని వల్ల ఇతర విలువలకూ, నైతిక విలువలకూ తేడాలు గమనించవచ్చు. జ్ఞానం అనేది మేధా సంబంధమైన విలువ. సత్యం, స్వేచ్ఛ అనేవి నైతిక విలువలు, సంగీతం రామణీయకతకు చెందిన విలువ. కాని ఒక రాగాన్ని కూర్చడానికి స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన సంగీతాన్ని వినే అవకాశం ఉండటం నైతిక విలువలు. అడవి మృగం ఎదురైనప్పుడు చూపే సాహసం మనుగడకు సంబంధించిన విలువ. అదే యుద్ధరంగంలో అయితే నైతిక విలువ అవుతుంది.
నైతిక విలువల విశ్వజనీనత-బాహ్యసత్యం
నైతిక విలువలకు ఉన్న సామాజిక దృక్పథాన్ని బట్టి, కొంత మేరకు వాటికి బాహ్య సత్య దృష్టి ఏర్పడుతుంది. సృజనాత్మక వ్యక్తిపరమైంది. అప్పుడు బాహ్య సత్యం అనేది అరుదుగా సాధ్యపడుతుంది. నైతికవిలువలు విశ్వవ్యాప్తంగా ఉండా లంటే, బాహ్యసత్యం అనేది అవసరం. ఒక నిర్ణయం గనక వ్యక్తిగతమైందైతే, దానికి లభించే విలువ కూడా నిర్ణయంలోని స్వభావాన్ని బట్టి గాక, యాదృచ్ఛికమైందే అవుతుంది. వ్యక్తిపరమైన అసూయలకు మించిన నిర్ణయమే బాహ్యసత్యంతో కూడింది.
నైతికవిలువలు విశ్వజనీనమైనవి అనగానే, అన్ని కాలాల్లోనూ అన్ని సమాజాలలోనూ ప్రతివారూ వీటిని ఆమోదించారనుకోరాదు. కొన్ని విలువలు విశ్వజనీనమైనవి అంటే, రెండు ప్రతిపాదనలను గట్టిగా చెబుతున్నామన్నమాట. నైతికంగా చైతన్యవంతులైనవారిలో అత్యధిక సంఖ్యాకులు ఆ విలువలను గమనిస్తారు. ఒక వ్యక్తి ఈ విలువల గురించి తీవ్రంగా ఆలోచిస్తే, అవి సరైనవని భావిస్తాడు. తన వ్యక్తిగత ఆసక్తులు, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోడు. ఇప్పుడు ఎవరైనా అలా చేయలేక పోతున్నారంటే అన్ని కోణాల నుంచి సమస్యను పరిశీలించలేదని భావించాలి. ఉపనిషత్తు పేర్కొనే అంధకారం నుంచి వెలుగులోకి తీసుకుపో, అనే సూత్రమూ, సోక్రటీస్ సూత్రీకరించిన జ్ఞానమే ధర్మం అనడమూ, ఒకే అర్థాన్ని సూచిస్తాయి.
నైతిక విలువల విశ్వజనీనత గురించి ఇంతవరకూ చేసిన చర్చ అంతా, చుట్టూ తిరుగుతూ ప్రారంభించిన చోటుకే వచ్చినట్లు అనిపించవచ్చు. విశ్వజనీనత అనేది వాస్తవంకానప్పుడు, అన్వేషణా పద్ధతినుంచి వచ్చినప్పుడు, సమస్యను ఇంకొక రంగానికి మళ్ళించినట్లయింది. అటువంటి పద్ధతి ఉంటుందా?. ఉంటే తెలుసుకోవటం ఎలా?. తెలుసుకుంటే అది విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్య మైన పద్దతి అనిహామీ ఏమిటి? మొదలైన ప్రశ్నలు జనిస్తాయి.
ఒక్కక్షణం ఆలోచిస్తే ఈ ప్రశ్నలు నీతిశాస్త్రానికి ప్రత్యేకించినవి కావని స్పష్టపడుతుంది. దేన్ని అన్వేషించినా, ప్రకృతి విజ్ఞానంతో సహా అన్ని రంగాలలోనూ ఏదో ఒక దశలో ఈ ప్రశ్నలు జనిస్తాయి. విజ్ఞానవేత్తలు ఆచరించే వైజ్ఞానిక పద్దతి ప్రపంచవ్యాప్తంగా సరైందని ఎవరుగట్టిగా చెపుతారు. విజ్ఞానాన్ని అధ్యయనం చేసే విద్యార్థులతో సహా బహు కొద్దిమందికే బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి పై ప్రతిపాదనను ఆమోదించటం, నిరాకరించటం అనేది కష్టం. అయినా ప్రపంచ వ్యాప్తంగా సరైందని ఎందుకంటున్నామంటే, వివేచనాత్మాకంగా సంతృప్తినివ్వడం, ప్రాపంచిక అనుభవంరీత్యా ఫలితాలనివ్వడం గమనిస్తున్నాం గనకనే మూడు వందల సంవత్సరాల నుంచీ క్రమంగా పరిణమిస్తూ, మూలంలో నిమిత్తంలేకుండా, నిర్మాణ క్రమాన్ని విజ్ఞానంచూపుతోంది. వైజ్ఞానిక అన్వేషణా లక్ష్యాన్ని అంగీకరించిన వారు, వైజ్ఞానిక పద్ధతిని కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఆ పద్ధతి ఒక్కటీ లక్ష్యానికి చేర్చగలదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది సరైంది అంటున్నాం. వైజ్ఞానిక పద్ధతిలో విశ్వజనీనత అనటంలో ఎటువంటి సూచనకూడా చేయడం లేదు. ప్రతివారూ ఒకేరీతిలో అనుసరించాలని అనడం లేదు. విజ్ఞానవేత్తలు సైతం అన్ని సందర్భాల్లోనూ ఒకే మార్గాన పోరు, క్వాంటమ్ సిద్ధాంతం పట్ల ఐన్ స్ట్టీన్ ధోరణి ఇందుకు ఉదాహరణంగా చూపవచ్చు. పదార్థ అస్థిరత్వం ఉందని కనుక్కొన్నప్పటికీ, ఐన్ స్టీన్ ఒక పట్టాన ఇందుకు అంగీకరిం చలేక పోయాడు. క్వాంటమ్ సిద్ధాంతంలో ఉన్న దోషాన్ని ఏనాటికైనా తొలగించ వచ్చునని ఆశించాడు. దేవుడు చదరంగం ఆడతాడని అతడు నమ్మజాలక పోయాడు.
నైతిక అన్వేషణా లక్ష్యం
పైన పరిశీలించిన వాటిని నీతి శాస్త్రానికి అన్వయించి చూద్దాం.
నైతిక అన్వేషణ లక్ష్యం ఏమిటి?. ఈ అన్వేషణలో అనుసరించే పద్ధతి ఏమిటి?. నైతిక విలువలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని దేన్నిబట్టి చెప్పగలం?.
ఇంతవరకూ జరిగిన చర్చనుబట్టి, నైతిక అన్వేషణాలక్ష్యం అంతాకూడా కొన్ని ప్రమాణాలను కనుక్కోవటమేనని చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య సంబంధా లను ఇవి సూచిస్తాయి. వ్యక్తి జీవిత వికాసానికి సాధ్యమైనంత మేరకు ఇవి ఉపకరిస్తాయి. కాబట్టి ఇతరుల ఆసక్తి చూపని వాటితో నీతిశాస్త్రానికి నిమిత్తంలేదు. ఒక వ్యక్తి మాంసాహారా?. శాఖాహారా?. మద్యపానం సేవిస్తాడా? లేదా అనే విషయాలు వ్యక్తి ఆరోగ్యం పైనా, అతడి ఆర్థిక వ్యవహారాలపైనా ఆధారపడి ఉంటుంది. కాని వాటిని బట్టి నైతిక నిర్ణయం చేయడం కుదిరే పనికాదు. వ్యక్తి ఏమి చేసినా సమాజం పట్టించుకోవచ్చు. సమాజం ఎంత పెత్తందారీతనంతో ఉంటే అంతగా వ్యక్తిని పట్టించుకుంటుంది. ఏం చదువుతున్నాడు, ఎవరితో స్నేహం చెస్తున్నాడు, పిలక పెంచుతున్నాడా లేదా, జంద్యం వేసుకున్నాడా లేదా, ఎటువంటి దుస్తులు ధరించాడు, ఏమి ఆహారం తీసుకున్నాడు. ఎవరిని వివాహమాడాడు అనేవన్నీ మన సమాజానికి సమస్యలుగా తయారయ్యాయి. వ్యక్తికి అట్టే స్వేచ్ఛలేదు. వ్యక్తి స్వేచ్ఛను అదుపు పేట్టే విషయంలో జాగ్రత్త వహించాలని ఈ విషయాలన్నీ సూచిస్తున్నాయి. ఇక్కడ స్వేచ్ఛను ఎలా వినియోగించుకోవాలనేదిగాక, ఎలా అణచాలనేది ప్రధానమైందిగా ఉంది.
నైతిక అన్వేషణ లక్ష్యాన్ని బట్టి, సంతృప్తికరమైన సాంఘికవ్యవస్థకు కొన్ని ప్రధాన లక్ష్యాలున్నాయి. మానవులలో కనిపిస్తున్న ప్రతిభ ఎన్నో విధాలుగా ఉంది. కాని వ్యక్తివికాసానికి సర్వసాధారణ పరిస్థితులుకొన్ని అవసరం, ఆహారం, వస్త్రాలు, గృహం, మంచి ఆరోగ్యం, అవసరాల కొరతలేని స్వేచ్ఛ, ఇతరులు ఒత్తిడి పెట్టకపోవడం, ప్రభుత్వం జలవంతం చేయకబోవడం, అనేవి కనీస అవసరాలుగా ఉండాలి. ఇతర జంతువులకూ, మానవుడికీ ప్రధాన తేడా ఉంది. మానవుడికి ఆలోచించే శక్తి ఉంది. ఆలోచనలనూ, ఆవేదనలనూ భావం ద్వారా, కళల ద్వారా వెల్లడించగలడు. కాబట్టి మానవుడుగా జీవనాన్ని సాగించటానికి స్వేచ్ఛాయుత ఆలోచన యథేచ్ఛగా వ్యక్తం చేయడం, సంఘాలుగా ఏర్పడటం, ప్రతిభలకు వన్నె తెచ్చే చదువు అవసరమవుతాయి. ప్రతి మానవుడికీ మనుగడ అనేది ముఖ్య మైనప్పటికీ, కేవలం జంతువులలాగ ఉండలేడని అనుభవం చెబుతున్నది. సంతృప్తికరమైన బతుకుతెరువు మానవుడికి అవసరం. ఎంత దయామయ మైన నియంతృత్వం కూడా ఆ వ్యవస్థను నిలుపుకోడానికి క్రూరనియంతృత్వంగా దిగజారిపోతుంది. శారీరక, సాంస్కృతిక విషయాలు మానవుడిలో విడదీయ రానివిగా కలిసిపోయాయి. ఆహారం లేకపోతే మనిషి బతుకును సాగించలేడు. ఇంకా ముఖ్యమైన విషయమేమంటే తనను తాను గుర్తించనిదే మానవుడు ఆహారాన్ని సంపాదించుకోలేడు. అందుకే స్వేచ్ఛకై పోరాడతాడు. కమ్యూనిస్టు విప్లవం దెబ్బతినిపోయింది. రష్యా, పోలండ్, హంగరీలలో ప్రజల తిరుగుబాట్లకూ, తూర్పు జర్మనీనుంచి పారిపోవాలనీ, చైనా నుంచి తప్పించుకు పోవాలనీ భావించడానికి మానవుడిలో ఉన్న స్వేచ్ఛ అనే లక్షణమే కారణం.
సాంఘికభద్రత, మానసిక స్వేచ్ఛ అనేవి వ్యక్తి వికాసానికి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ పరిస్థితులు బాగా సాధించుకోడానికి తోడ్పడే సాంఘిక వ్యవస్థల్ని, మానవలక్షణాలను కనుక్కోవడమనేది నైతిక అన్వేషణలో ఉంటుంది. ఈ అన్వేషణ రెండు విధాలుగా సాగుతుంది. మానవులు బతికుండగానే నైతిక విలువలను సాధించుకోవాలి. కనక చారిత్రక, సాంస్కృతిక పరిస్థితుల దృష్ట్యా నైతిక అన్వేషణ జరగటం అనేది తప్పనిసరి అన్నమాట. ఈ విధంగా చూస్తే నైతిక అన్వేషణలోకానికి చెందింది కూడా. మానవుడు తన సహకారాకృషితో పరిసరా లను సరిదిద్దగలడు. ప్రభావితం చేయగలడు. ఈ విధంగా చూస్తే వర్తమాన పరిధికే నీతి పరిమితం కానక్కరలేదు. భవిష్యత్తులోకి తొంగి చూసి, ఆశలనూ, ఆశయాలనూ రూపొందించుకొని మానవుడు నేటి కలలను రేపు నిజం చేసుకో గలడు. ఇందుకు తగిన తెలివితేటలూ, పట్టుదల మానవుడికి ఉన్నాయి. నీతి శాస్త్రం ముందు చూపుగల ప్రమాణశాస్త్రం. వ్యక్తి ఏమి చేయాలి. చేయకూడదు అనేవాటిని సాధారణమయిన నియమాలతో నైతిక శాస్త్రం పేర్కొంటుంది. మానవ ప్రవర్తనకు ఉపకరించే సంస్థలను ఏర్పరచుకోడానికి నైతిక శాస్త్రం తోడ్పడుతుంది.
నైతిక అన్వేషణా క్రమం
వైజ్ఞానిక అన్వేషణ వంటిదే నైతిక అన్వేషణ కూడా, రెండింటిలోనూ ఒకానొక లక్ష్యంతో ప్రారంభిస్తాం. తొలుత దీనిని స్థూలంగానే గమనిస్తాం. అన్వేషణ సాగుతున్న కొద్దీ వివరాలలోకి పోతాం. రెండు రంగాలలోనూ, ప్రపంచపరంగా అన్వేషణ సాగుతుంది. వాస్తవాలతో కూడిన అనుభవం అనేది ఆధారంగా ఉంటుంది. కార్యకారణ సంబంధంతో అవగాహనకు ప్రయత్నిస్తాం. వైజ్ఞానిక అన్వేషణలో కార్యకారణ సంబంధం స్పష్టమే. నైతికరంగంలో మానవవ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. ఈ రెండు అన్వేషణలూ ప్రాపంచిక అనుభవంతోనూ, విశ్లేషణతోనూ ఉన్నాయి. ప్రతిపాదన చేసి రాబట్టే పద్ధతినే రెండూ అనుసరిస్తాయి.
నైతిక విలువల్లో బాహ్యసత్యం, విశ్వజనీనత అనేవి పైన చెప్పిన పద్దతిని అనుసరించి కనుక్కొన్నవే. కనక వీటికి ఉన్న పరిమితులు కూడా గుర్తించాలి. తాత్కాలికమూ, ఆస్తిరత్వమూ అనేవి నీతిరంగంలోనూ ఉన్నాయి. కాబట్టి నైతిక విలువలు సాపేక్షకాలు, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులననుసరించి ఈ విలువలకు హద్దులేర్పడతాయి. అన్వేషణలో వినియోగించే జ్ఞానం విధానం కూడా ఇందులో జతచేర్చి చూసుకోవాలి. ఆధునిక రవాణా సౌకర్యంవల్ల ప్రపంచ సంస్కృతి ఆవిర్భవించటం సాధ్యమే. అటువంటప్పుడు పరిసరాల పరిమితులు తమ ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. విజ్ఞానంలాగే నైతికసిద్ధాంతం కూడా విశ్వజనీనం అవుతోంది. స్థానిక సంప్రదాయం, సాంఘిక వ్యవస్థల్లో తేడా ఉన్నప్పటికీ విశ్వజనీనత సాధ్యపడుతోంది. వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం అనే విలువలు ప్రజాస్వామిక పాశ్చాత్య ప్రపంచంలోని మానవులనే గాక, నియంతృత్వంలో ఉన్నవారిలో కూడా స్పందన కలిగిస్తున్నాయి. ఏ నైతిక సిద్ధాంతంలోనయినా కొంత మేరకు చారిత్రక, సాంఘిక సాపేక్షతా విధానం తప్పనిసరి అయినప్పటికీ మౌలికమయిన విలువలు విశ్వవ్యాప్తంగా ఉంటున్నాయి.
నైతిక విలువలు తప్పనిసరి
భిన్న సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులలో నివసిస్తున్న మానవులు అనేక మంది, విశ్వజనీనమైన విలువలను ఆమోదించడంతో సరిపోదు. ఈ విలువలలో నైతికమైన బాధ్యతకూడా ఉంది. మానవులందరూ వీటిని ప్రమాణంగా అంగీకరిస్తారు. విశ్వజనీనమైన నైతికవిలువల విషయమై కొంత వివరణ అవసరం.
ఇక్కడ కూడా విజ్ఞానాన్వేషణతో పోల్చి చూడవచ్చు. సత్యంలో కూడా విధిగా పాటించవలసిన గుణం ఉంది. మానవుల ఆసక్తులు, సహజమైన ధోరణులు భిన్నంగా ఉన్నప్పటికీ ఇది తప్పదు. సత్యంలో నచ్చజెప్పే శక్తి ఉన్నదంటే అందరికీ వెల్లడించి చూపే గుణం ఇందుకు ప్రధానంకాదు. ఎందుకు, ఎలా సంభవిస్తుంది అనే విషయమై మానవుడు చూపే ఆతృతలో దీని అంతటికీ మూలం ఉంది. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నట్లే ఉత్తమ జీవితమంటే ఏమిటో కనుక్కొనే వరకూ మానవుడు విశ్రాంతి చెందడు. సోక్రటీస్, క్రీస్తు, చార్యాకుడు, గౌతమ బుద్దుడు వంటివారిని చూస్తుంటే ఇది తెలుస్తుంది. జిజ్ఞాస, అందాన్ని ఆరాధించటంలాగా, నైతిక పిపాసకుడా మానవుడిలో అంతర్గతంగా ఉంది. బహుశా ఇందుకు మూలం జీవరాశిలో చూడవచ్చునేమో. వైజ్ఞానిక, రామణీయ కతలాగే నైతికతృష్ణ కూడా మానవజీవితంలో ప్రధానదృక్పథంగా ఉండవచ్చు. ఇదేగనక వాస్తవమైతే నైతిక విలువల్ని పాటించడం జీవితానికి, సామూహిక ధోరణికి బలాన్ని సమకూర్చడమే అవుతుంది.
నైతిక విలువల విశ్వజనీనతను, మానవుడి నైతిక తృష్టలోని అంతర్భాగంగా గ్రహిస్తే వాటికి బలం చేకూరుతుంది. వైజ్ఞానిక పద్ధతిలో చేసే అన్వేషణ వల్ల చాలా విలువలు రాబట్టేవని తేలింది. వాటి తార్కిక వాస్తవికత కూడా మౌలికమైన వాటితో సమానమైనదే ప్రాథమిక విలువలు సహితం ప్రాపంచిక అనుభవరీత్యానే సరైనవి. సమానత్వం, సాంఘిక న్యాయం, పౌరహక్కులనేవి కొన్ని మౌలిక విలువల వల్ల తార్కికంగా వచ్చాయనవచ్చు. విజ్ఞాన సిద్ధాంతంలో ప్రాధమిక పదాలూ, ప్రతిపాదనలలాగే, నైతిక సిద్ధాంతంలో ఈ విలువలను ప్రారంభదశగా స్వీకరించాలి.
మానవ వ్యక్తిత్వానికీ, పవిత్రతను సమకూర్చటం ఒక్కటేచాలా, లేదా మరికొన్ని విలువలు చేర్చాలా అనేది వివరాలకు సంబంధించిన విషయం. ఇతర సిద్ధాంతాలలాగే నైతిక సిద్ధాంతంలో కూడా అంగీకరించటమనేది తార్కికవాదనకు సంబంధించింది కాదు. అది మనందరి అనుభవ ఫలితమే. మానవ సంపద వల్ల రూపురేఖలు దిద్దుకున్న ధోరణి ఇందులో ఉంది. ప్రారంచిక అనుభవానికీ, మానవ ఆలోచనకూ వారధిగా తర్కం ఉండజాలదు. మానవుడి భావాలను విశ్లేషించి, వాటిలో ఇమిడి ఉన్న అర్థాన్ని మనకు స్పష్టం చేయటమే తర్కంచేయగల పని. మౌలిక విలువల్ని గురించి అంగీకారానికి వస్తే, వాటి నుంచి మిగతా విలువలు రాబట్టి అంచలవారీగా ఏర్పాటు చేసి దేనికి ఎంత విలువ ఇవ్వాలో తర్కం చూపు తుంది. మౌలిక విలువలు సరైనవి అవునా, కాదా అనేదానికి తార్కికమైన రుజువు ఉండదు. తర్కంలో ఇమిడి ఉన్న ఈ పరిమితిలోని మానవుడిని, ఉద్రేకాల ఆవశ్యకతను గమనించకపోవటంతో నిర్ధారణ కావాలని అన్వేషిస్తుంటాం. తత్వవేత్తలు తరతరాలుగా అలౌకకవాదంతో కూడిన నీతిశాస్త్రాలను, అధిభౌతిక సిద్ధాంతాలను నిర్మించారు. అటువంటి ప్రయత్నాలన్నీ విఫలంగాక, తప్పదని, వైజ్ఞానిక పద్ధతి స్పష్టం చేసింది. మానవుడి జ్ఞానానికి గల పరిమితిని, అవకాశాన్ని ఈ పద్ధతి సూచించింది. అనేక నైతిక సిద్ధాంతాలు ఉండవచ్చుననీ, అసలు ఎటువంటి నైతిక ధోరణీ లేకుండా కొందరు మానవులు ఉండగలరనీ తార్కికంగా చూపవచ్చు. కాని అనుభవరీత్యా మానవులలో కొన్ని సర్వసాధారణ మైన జిజ్ఞాసలు ఉన్నాయని స్పష్టపడింది. ఈ జిజ్ఞాసలు విశ్వజనీనమైన భావాలలో, విలువలలో వ్యక్తమవుతున్నాయి. ఇది, తప్పనిసరిగా పాటించే అవసరమున్నట్లు కొన్ని సమాజాలలో వ్యక్తులతో స్వభావం తెలుపుతోంది. చారిత్రకంగా వీటికి గల సాపేక్షతాగుణం, కాలానుగుణంగా పరిణమించిన తీరునుబట్టి ఈ విలువలకు గత విశ్వజనీనత పోదు. వీటిల్లోని పరిణామ స్వభావం మానవ వివేచనా శక్తికి నిదర్శనం. చైతన్య స్థాయిలో పరిణామం అనేది సాంస్కృతిక అభివృద్ధిగా, పరిసరాలలో ఇమిడిపోయేదిగా ఉంటుంది. అంతేగాని ఉదాసీనంగా లొంగిపోవటం జరగదు. మానవుడు తన అనుభవాన్ని ఆధారంగా నేర్పడం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఇటువంటి పరిణామానికి అవకాశముంది. మానవుడు వివేచనాత్ముడు కాబట్టి నైతికంగా ఉండగలడు. అంతేగాని అతనిలో మూక స్వభావం ఉన్నందువల్ల ఇలా ప్రవర్తించటం లేదు. తెలిసి ఎంపిక చేసుకునే పద్ధతి వల్ల మానవుడిలో నీతికి విశిష్టత !