రాయిజం
శ్రీ  జి.వి.కృష్ణారావు

మహతి మాస పత్రిక తెనాలి నుండి ధరణికోట  వెంకటసుబ్బయ్య  సంపాదకత్వాన  1937 veluvadindi   ఆయన పండిత కవి. ఆయన సంస్కృతం నుండి తెలుగులోనికి అనువదించిన శృంగార కావ్యానికి ఆవుల గోపాల కృష్ణమూర్తి పీఠిక రాశారు.

యం.ఎన్.రాయ్ జైలు నుండి విడుదలై కాంగ్రెసు రాజకీయాలలోకి ప్రవేశించిన తొలి రోజులలో జి.వి.కృష్ణారావు రాసిన వ్యాసం ఇది. జి.వి.కృష్ణారావు అప్పుడే కాలేజీలోప్రవేశించాడు. విద్యార్థిగా రాయ్ భావాల ప్రభావంతో  ఈ వ్యాసం రాశారు. దీనికి గల చారిత్రక ప్రాధాన్యత వలన ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. జి.వి. కృష్ణరావు ఆ తరువాత రచయితగా రాయ్ అనుచరుడుగా పేరు పొందాడు.)
కాంగ్రెసు పార్టీలో సోషలిస్టు పార్టీ ఉండటం వల్ల సోషలిస్టు సిద్ధాంతాలకు హాని కలుగుతుంది. కాంగ్రెసును బలపరచటానికి మాత్రము కాంగ్రెసులో ఉండవలసిన అగత్యం సోషలిస్టు పార్టీకి లేదు. అలా కాంగ్రెసులో రెండో పార్టీ ఉండటంవల్ల కాంగ్రెసుకు బలం కలగటానికి బదులు బలహీనత ఏర్పడుతుంది. కాంగ్రెసు వెలుపల ఖచ్చితమైన కమ్యూనిస్టు పార్టీ ఉండవలసిందే. దాన్ని రాయి ఒప్పుకుంటున్నాడు. దానిలో సభ్యుడవుతానంటున్నాడు. బయట సోషలిస్టు పార్టీలో సభ్యుడైన ప్రతివాడూ కాంగ్రెసులో సభ్యుడు కావాలి. పరిపూర్ణంగా కాంగ్రెసు సభ్యుడు లాగానే ప్రవర్తించాలి. అంటే, సోషలిస్టు కార్యక్రమాన్ని కాంగ్రెసు చేత ఆమోదింపజేయాలని కాదు. కాంగ్రెసు లెఫ్టువింగ్ ను నడిపించే శక్తిగా ఉండి అవసరమైతే నాయకత్వం వహించి కాంగ్రెసును రాడికలైజు చేయాలి. అంతేగాని కాంగ్రెసు పార్టీలో సోషలిస్టు పార్టీ ఉండటానికి వీలులేదని రాయి ఈ కారణాల్ని చూపుతున్నాడు—
1.             సిద్ధాంతరీత్యా పొరపాటు (Theoritical blunder)
ఈ రోజున సోషలిజం అంటే కాపిటలిజానికి, సామ్రాజ్య తత్వానికి వ్యతిరేకంగా తీవ్ర విప్లవ సంఘర్షణను వదలుకొని, విప్లానిక ప్రజా బాహుళ్యము యొక్క కార్యక్రమాల ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకోడమన్నమాట. కాబట్టి తమ అధికారాన్ని చలాయించుకోటానికి బూర్జువాయిజ్ దేన్ని సాధనంగా చేసుకొన్నదో,  ఆ పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని బలపరచడమే దీని భావము. సోషలిస్టు పార్టీ, సంస్కారాన్ని తలపెట్టేదే గాని విప్లవాన్ని తలపెట్టదు. ఉన్నటువంటి సాంఘిక స్థితిని వ్యత్యస్తం చేసి వర్గరహితమైన సంఘాన్ని స్థాపించే సాధనం కాదు.
ఇలాటి పక్షం వల్ల హిందూ దేశానికి ప్రయోజనం లేదు. దేశము యొక్క రాజకీయ ఆర్థిక రంగంలో దీనికి స్థానమే లేదు. సంస్కారికమైనటువంటిన్నీ అవిప్లవానికమైనటువంటి స్వభావము వల్ల సోషలిస్టు పార్టీ స్వాతంత్ర్యం కోసం జరిగే సంఘర్షణలో సాధనం కాజాలదు. కృషిక వర్గాన్ని ప్రబోధించి, ఆర్గనైజ్ చేసి విప్లవములోకి దిగకుండా కాపిటలిస్టు విధానంలోనే ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని క్రమంగా చక్కపరుచుకోటానికి సహాయపడి నడుపుతుంది అన్న కారణం ఒకటే ఈ పక్షం కావలనటానికి పనికివస్తుంది. ఈ కారణం కూడా హిందూ దేశంలో దుర్బలమవుతుంది. ఎందుకంటే ఐరోపా అమెరికాలలో మాదిరిగా కాపిటలిస్టు విధానం బాగా అభివృద్ధిలో వున్నప్పుడే, కృషిక వర్గం కేపిటలిస్టు సంఘంలోనే ఉండి తన పరిస్థితుల్ని అభివృద్ధి చేసుకోగలుగుతుంది. కృషిక వర్గం ప్రజాస్వామికమైన రాజకీయపు హక్కుల్ని చలాయించటం వల్ల క్రమక్రమంగా ప్రభుత్వం యొక్క లక్షణాన్ని మార్చవచ్చు ననుకొంటున్నారు. దీనికి ప్రజాస్వామిక ప్రభుత్వమిదివరకే ఉండాలి. ప్రజాస్వామిక ప్రభుత్వమిదివరకే ఉండాలి. ప్రజాస్వామిక ప్రభుత్వమూ, విజృంభించియున్న కాపిటలిజమూ,  రెండూ హిందూదేశంలో లేవు. కాబట్టి ఈ దేశంలో సోషలిస్టు పార్టీ ఉండటానికి వీలులేదు. కాపిటలిస్టు అభివృద్ధికి ఆటంకం లేనటువంటి దేశాల్లో రిఫార్మిష్టు, సోషలిస్టు పార్టీలుంటవి. కాని బానిసత్వంలో ఉన్న మనదేశంలాంటి వలస రాజ్యములలో ఉంటానికి వీలులేదు. బూర్జువాయిజీ హక్కుల్ని ఇవ్వగల్గే స్థితిలో ఉన్నప్పుడే, సంస్కరణ, జన బాహుళ్యాన్ని తప్పుత్రోవని పెడుతుంది.
Further, the decay of Capitalism as a world force has pronounced the death sentence over Socialism (Reformists) and consequently on Socialist parties.
ఐరోపాలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీలు పడిపోవటం మంచి పాఠం నేర్పుతోంది.
ఇదివరకు కంటె తీవ్రప్రయత్నాలతో సోషలిస్టు పార్టీని సాగించినా అది సోషలిస్టు పార్టీగా నడవదు. నడవటానికి కమ్యూనిస్టు పార్టీగా గాని, లేక ప్రజాస్వామిక విప్లవపక్షంగా గాని పనిచేయాలి. రెండూ చారిత్రకంగా అవసరం. రెంటికి సాంఘిక ప్రోద్బలముంది. అట్లాంటప్పుడు అపోహ గలిగించే పార్టీని ఎందుకు ఏర్పరచాలి? నిష్ప్రయోజకమైన జెండా క్రింద ఎందుకు నడపాలి? ఇదివరకు చేసిన ప్రయత్నాకంటె కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి ప్రజాబాహుళ్యం యొక్క సహాయం ఎక్కువగా ఉంది. ప్రజాబాహుళ్యము యొక్క ఉద్యమం వల్లనే  ఈ పక్షం బయలుదేరిందంటే అతిశయోక్తి అవుతుంది. ఇదివరకు ప్రయత్నాలకంటే ఈ ప్రయత్నంలోని ప్రత్యేకత ఏమిటంటే, వర్గవిభేదం కలిగించటం, కాంగ్రెస్ రాడికలైజ్ కావటం ఇది సూచిస్తుంది. కాంగ్రెస్ చేసే తీవ్రసాంఘిక రాజకీయ ప్రయత్నాల్ని ఇది పూర్ణంగా సూచించటం లేదు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ప్రజల్ని కమ్యూనిస్టు ధ్వజం క్రిందకు చేర్చడం ప్రజల ఆదర్శానికి చాలా ముందు పోవడం అవుతుంది.
చారిత్రకంగా అర్థవంతమైన సోషలిస్టు పార్టీగా కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ఉండదలిస్తే, జాతీయవాదులైన జనాన్ని రాడికలైజ్ చేయడానికి సహాయపడక పైగా అడ్డు తగులుతుంది. రాడికలైజేషన్ అంటే దోపిడీ చేయబడుతున్న వర్గాలలో విప్లవ చైతన్యాన్ని వేగిరించడం. దీనివల్ల సామ్రాజ్యతత్వంతో పోరాడటానికి ముందంజ వేయటం జరుగుతుంది. ఈ రాడికలైజేషన్ సోషలిస్టు పార్టీ నాయకత్వమున యెన్నటికీ జరుగదు. ఎందుకంటే, శ్రమత్వం (Gradualism) ఈ పక్షము యొక్క ముఖ్య నియమము, సోషలిస్టు పార్టీ అవలంబించే విధానమూ తంత్రమూ క్రమత్వ సిద్ధాంతం మీదనే నడవాలి. ముక్తసరిగా చెప్పాలంటే, ఇండియాలో సామ్రాజ్య తత్వానికి వ్యతిరేకంగా పోట్లాడవలసిన ఉద్యమం, సంస్కారరీత్యా, క్రమంగా ముందుకు పోవటం  అనే ఆవిప్లవ సిద్ధాంతానికి పాల్పడిన సోషలిస్టు పార్టీ నాయకత్వాన నడవటానికి వీలు లేదు.
2.             రాజకీయంగా పొరపాటు (Political Blunder)
ప్రస్తుతము విదేశ సామ్రాజ్య తత్వం అవిప్లావికమైనటువంటి జాతీయమైన ఫ్రీ కాపిటలిస్టు సంఘానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉంది. జాతీయ స్వాతంత్ర్యం సంపాదించటం, నిరాఘాటంగా సాంఘిక ఆర్థిక నాగరికతాభ్యుదయానికి వలసిన పరిస్థితులను కలిపించటం, ఇప్పటికి కర్తవ్యం. కాబట్టి విప్లవ ప్రజాస్వామికమైన సామ్రాజ్యమునకు వ్యతిరేకమైన శక్తులు కూడటానికి సాంఘిక బలాన్ని పురస్కరించుకొని ఒక పక్షము తన ప్రబోధన విధానం, వ్యవస్థాపక పద్ధతి మార్చుకోవాలి. అట్లాంటి పార్టీ సోషలిస్టు పార్టీ కాదు. సోషలిస్టు కార్యక్రమాన్ని స్వీకరించటానికి యీ పరిస్థితుల్లో వీలులేదు.
3.                తంత్ర రీత్యా పొరపాటు (Technical Blunder)
కాంగ్రెస్ పార్టీని సోషలిస్టు పార్టీ కార్యక్రమం స్వీకరింపచేయటం వట్టి భ్రాంతి. ఒక రాజకీయ పక్ష కార్యక్రమాన్ని ఇంకొక పక్షంచేత స్వీకరింపచేయటం ఎప్పుడూ పడదు. ఆ విషయం ఆ పక్షము యొక్క కార్యక్రమం సోషలిజమ్. నేషనల్ కాంగ్రెస్ యొక్క సాంఘిక ఆధారం (Social Basis) దానికన్న విశాలమైనది. ఆచార్య రీత్యా కాంగ్రెస్ హిందూదేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడేటటువంటి పక్షము ఐనా, ఇప్పటి వరకూ దాని కార్యక్రమమూ, విధానమూ, నాయకత్వము యొక్క సాంఘిక లక్షణాన్ని బట్టి మారినవి. జాతీయ స్వాతంత్ర్య సంఘర్షణలో గట్టిగా పనిచేస్తే విప్లవ ప్రజాస్వామిక కార్యక్రమాన్ని కాంగ్రెసు అనుసరించవలసి ఉంది. ఏ పరిస్థితులలోనైనా సోషలిస్టు పార్టీ కార్యక్రమాన్ని స్వీకరించేటంతదూరం పోదు. కాంగ్రెసు ప్రజాస్వామిక జాతీయ విప్లవము యొక్క కార్యక్రమాన్ని స్వీకరించకుండా ఉండటానికి (దీనివల్ల ప్రీ కాపిటలిస్టు సాంఘిక సంబంధాల్ని ధ్వంసం చేయడం చేత సాంఘిక విప్లవం కలుగుతుంది) కరాచీ తీర్మానము లాంటి మూడో రాడికల్ కార్యక్రమమును నామక: ఆమోదించవచ్చును. దీనివల్ల లాహోరులో జరిగిన స్వాతంత్ర్య తీర్మానములో కనబడుతున్న రాడికలైజేషన్ విధానాన్ని ప్రక్కకు త్రోసివేయడం జరుగుతోంది.
సాంఘిక చారిత్రక కారణాలవల్ల కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు కార్యక్రమాన్ని స్వీకరింపజాలదు. కాబట్టి దానికేమాత్రము ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం చేసేవారు చీలిపోవలసి వుంటుంది. ఈ దురదృష్ట అవస్థ కొంతవరకు  ఈవరకే కలిగింది. దీన్ని మిగిలిపోకముందే సవరించుకోవాలి. కాంగ్రెసు సోషలిస్టు పార్టీ అవలంబించే విధానాన్ని మార్చుకోకపోతే రాడికల్ ప్రజాస్వామిక ఉద్దేశాల ద్వారా కాంగ్రెసును స్వాధీనం చేసుకోటం జరుగదు. కాంగ్రెసులో రాడికల్స్ చిన్న సంఘంగానే వేరుపడటం జరుగుతుంది. రైట్ వింగ్ అధికారాన్ని చెలాయిస్తుంది. కాంగ్రెసు నాయకత్వము కోసం పోరాడవలసింది సోషలిజం జెండా క్రింద కాదు, ప్రజాస్వామిక జాతీయ విప్లవము ద్వారా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రాడికల్ జాతీయ విప్లావిక లక్షణాల ద్వారా కాంగ్రెసును స్వాధీనం చేసుకోగోరుతున్నది. కానీ కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ద్వారా మాత్రం కాదు.
కాంగ్రెసులో ఖచ్చితమైన సోషలిస్టులు సోషలిజం అంటే అభిమానమున్నవారు ఉన్నారు. వీరికి ప్రత్యేకమైన పార్టీ గావాలని ఉంటుంది. ఆ పార్టీ సోషలిస్టు పార్టీ కాదు. కమ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీ చారిత్రకంగా అవసరమైనా, రాజకీయంగా ప్రాముఖ్యత వున్నా, బహిరంగంగా కాంగ్రెసు నాయకత్వానికి ప్రయత్నించజాలదు. జాతీయ ప్రజాస్వామిక శక్తుల్ని ఆకర్షించే కేంద్రంగా మాత్రమే పనిచేయవలసి ఉంటుంది. కమ్యూనిస్టులు కాంగ్రెసుకు వెలుపల స్వతంత్ర పక్షాన్ని ఏర్పరచుకొని కాంగ్రెసు పార్టీలో లెఫ్టువింగు మెంబర్లై కాంగ్రెసు విధానాన్ని మార్చి నడపగలుగుతారు. కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ఒకవేళ కాంగ్రెసు నాయకత్వాన్ని దేశపరిస్థితులకనుగుణ్యంగా కార్యక్రమాన్ని అవలంబించి స్వాధీనం చేసుకోగలుగుతుంది కానీ, సోషలిస్టు కార్యక్రమం క్రింద కాదు. పైగా విప్లవ ప్రజాస్వామిక  కార్యక్రమానికి సోషలిస్టు కార్యక్రమం అని పేరు పెట్టటానికి అర్థం యథార్థమైన సోషలిస్టు కార్యక్రమాన్ని వదిలిపెట్టటం అవుతుంది. ఒకే పార్టీ విభిన్నమైన సోషలిజం యొక్క రెండు రకాలను ప్రచారం చేయజాలదు. జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని సోషలిజం అంటే, యదార్థమైన సోషలిజాన్ని త్రోసివేయాలి. కాబట్టి కాంగ్రెసు సోషలిస్టు పార్టీ సోషలిజం జెండాను ఎగురవేయటానికి కుతూహలం పడటంవల్ల వారి ఆదర్శానికి ద్రోహం చేయటమవుతుంది. ప్రజాస్వామిక జాతీయ విప్లవం కోసం పోరాడితే, తరువాత సోషలిస్టులకు యధార్థమైన సోషలిస్టు కార్యక్రమం కోసం పోట్లాడటానికి ఏదీ అడ్డుపడదు. ప్రజాస్వామికాన్ని సంపాదించిన మీదటనే సోషలిజం స్థాపించటానికి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ఖచ్చితమైన సోషలిస్టులు అంతా కాంగ్రెస్ పార్టీకి వెలుపల స్వతంత్రమైన కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపించి కాంగ్రెస్ లో లెఫ్టువింగుగా పనిచేయాలి. కాంగ్రెసులో ప్రత్యేక పక్షంగా పనిచేయకూడదు. కాంగ్రెస్ యొక్క ప్రత్యామ్నాయ (Alternative) నాయకత్వం క్రింద పనిచేయాలి. సోషలిస్టు పార్టీ కాంగ్రెసు పార్టీలో ఉండకూడదు. ఆ పార్టీ మెంబర్లు వ్యక్తిగతంగా కాంగ్రెసులో చేరి లెఫ్టువింగు వెనుక నుండి నడిపిస్తుండాలి. నిజంగా జాతీయ ప్రజాస్వామిక కార్యక్రమంతో కాంగ్రెసు లెఫ్టువింగ్ నాయకత్వం సోషలిస్టు ప్రోత్సాహం వల్లనే లభిస్తుంది. ఎందుకంటే చారిత్రక కారణాలవల్ల ప్రపంచ పరిస్థితుల వల్ల, హిందూదేశంలో వెనుకపడిన జమీందారీ ప్రజాస్వామిక విప్లవము కృషివర్గము యొక్క పలుకుబడి క్రింద నిర్వహించబడుతుంది.
కాబట్టి హిందూ దేశ విప్లవంలో, ప్రజాస్వామిక దశలోనైనా కృషిక వర్గ పక్షము అనివార్యం కావలసి వుంది. కృషిక వర్గము యొక్క సోషలిస్టు పార్టీ ఆదర్శము కాంగ్రెస్ చేత సోషలిస్టు కార్యక్రమాన్ని స్వీకరింపచేయటం కాదు. జాతీయ స్వాతంత్ర్య సంఘర్షణలో కాంగ్రెస్ ను సాధనంగా వాడుకోవాలి.
కష్టపడుతున్న ప్రజలకొరకు స్వాతంత్ర్యం సంపాదించదలచే వారంతా ఏకీభవించి, ఒకే రాజకీయ పక్షంగా కాంగ్రెస్ లో ఉండి దాని ప్రస్తుత ఆదర్శాలలోనూ, రాజకీయములోనూ, వ్యవస్థాపకత్వములోనూ, ఉన్న లోటును తొలగించి, ప్రజాసామ్రాజ్య తత్వానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన బాహుళ్యపక్షంగా మార్చాలి.
రాయిజమ్ – II
ప్రత్యేక రైతు సంఘాలను స్థాపించవద్దని రాయ్ ఈ కారణాలని చూపుతున్నాడు.
1.             పిష్టపేషణం – (Duplication of efforts)
లాహోరులో జహ్వరులాల్ యిచ్చిన అధ్యక్షోపన్యాసం వల్లనూ, స్వాతంత్ర్య తీర్మానం వల్లనూ, కాంగ్రెసు జాతీయ ప్రజాస్వామిక విప్లవానికి నడుము కట్టుకుంది.  విప్లవానికి రైతు వెన్నెముక వంటివాడు. పల్లెటూళ్ళలో కాంగ్రెసు సంఘాలన్నీ రైతులతో నిండే ఉన్నాయి. అలాంటప్పుడు ప్రత్యేక రైతు సంఘాలు దేనికి? పిష్టపేషణం, వృథాప్రయాసం కాక.
నాకొక మిత్రుడున్నాడు. అతనికి ఆ ఊళ్లో కాంగ్రెసు సంఘంలోనూ, రైతు సంఘంలోనూ ఉద్యోగాలున్నాయి.  కాంగ్రెసు సంఘం ద్వారా కాంగ్రెసు విధానాన్ని బలపరుస్తాడు. రైతు సంఘం ద్వారా కాంగ్రెస్ విధానాన్ని విమర్శిస్తుంటాడు. దేన్ని బలపరుస్తాడు? దేన్ని విమర్శిస్తున్నాడు? ఒక క్షణంలో తన్ను తాను బలపరచుకొంటున్నాడు. మరో క్షణంలో తన్ను తాను విమర్శించుకొంటున్నాడు. ఏమిటిది... పిష్టపేషణం (Duplication of efforts) కాక?  విమర్శనమే కాంగ్రెస్ సభ్యత్వం ద్వారా జరిపితే ఎంత (effective) ప్రయోజనకారిగా ఉంటుంది?
2. రైతు సంఘాలు (Rival bodies) కాంగ్రెసు సంఘాలకి ప్రత్యర్థి సంఘాలవుతవి.
అప్పుడే రైతు సంఘాలు కాంగ్రెస్ సంఘాలను దూషించటానికి ప్రారంభించినవి.  ఈ విధానాన్ని సాగనిస్తే, రైతుల్లో కాంగ్రెస్ మీద అసంతృప్తి ప్రబోధిస్తారు.  ఇందుకు ఉదాహరణగా వంగదేశపు రైతు సంఘం కార్యదర్శి ఇలా పత్రికా విలేఖరికి చెప్పాడు. ‘కాంగ్రెస్’ ధనికుల యొక్క, భూస్వాములయొక్క సంస్థ కాబట్టి, హిందూ దేశస్వాతంత్ర్యమునకు వ్యతిరేకంగా పోట్లాడుతుంది. జాతీయ స్వాతంత్ర్యం కోసం ఒక పక్క  సామ్రాజ్య తత్వముతోనూ, మరోప్రక్క కాంగ్రెస్ తోనూ పోరాడుతాము. సామ్రాజ్యతత్వాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ బూర్జువా కాంగ్రెస్ సంస్థతో పోరాడాలి.” దీనివల్ల కాంగ్రెస్ దుర్బలం కాక ఏమవుతుంది? ఉద్యమం దెబ్బతింటూంది. రైతు “ఎక్కడున్నావోయి అంటే నీవు ఉంచినచోటనే” అంటాడు. రైతు సంఘాలు ఒక వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టాలని సిఫార్సు చేస్తే కాంగ్రెసు (అధికారులు) కాదంటుంది. ఎలెక్షన్ లో కాంగ్రెసుకు వ్యతిరేకించి రైతు సంఘాలు ఓటు చేస్తవి.  ఈ విధంగా కాంగ్రెసు సంస్థకు రైతు సంఘాలు ప్రత్యర్థి సంఘాలవుతాయి. బీహారులో రైతుసంఘం కాంగ్రెసు సంఘాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. కాబట్టి ప్రత్యేక రైతుసంఘాలను స్థాపిస్తే కాంగ్రెసుకు ప్రత్యర్థి సంఘాలవుతాయి. ప్రస్తుతపు పల్లెటూళ్ళ పరిస్థతులలో ఒక పార్టీ కాంగ్రెస్ సంఘాలను ఆక్రమించుకుంటే రెండవ పార్టీ రైతు సంఘాలలో ప్రవేశించి తగాదాలకు దారి తీస్తుంది.
3.    కాంగ్రెసు (Reactionaries) ప్రతిఘాతకుల చేతిలో పడుట
జాతీయ  ప్రజాస్వామిక విప్లవానికి రైతు పునాదివంటివాడు. ఈ రైతును ప్రత్యేక రైతు సంఘాలలోకి లాగుకొంటే మిగిలిన కాంగ్రెసు సంస్థ ప్రతిఘాతకుల చేతులలో పడుతుంది. ప్రజా బాహుళ్యంలో కాంగ్రెసుకు ఉన్న పలుకుబడి మరే సంస్థకు లేదు. ఇలాంటి సంస్థ ప్రతిఘాతకుల చేతులలో పడితే స్వాతంత్రోద్యమము వెనుకబడుతుంది.
4.             (Transformation of the Ryot committees) రైతు సంఘాలను కాంగ్రెసు సంఘాలుగ మార్చుట
ఒక్కసారే అకస్మాత్తుగా  రైతు సంఘాలను రద్దుచేయనవసరము లేదు. కాంగ్రెసును రాడికలైజ్ చేస్తే, అంటే తీవ్రవాదంలోకి దించితే, ప్రజాబాహుళ్యానికి నాయకత్వం వస్తుంది. ప్రజాబాహుళ్యం రైతులే కాబట్టి రైతునాయకత్వం లభిస్తుంది. తద్వారా రైతు కార్యక్రమాన్ని కాంగ్రెసు ఆమోదిస్తుంది. ప్రత్యేక రైతు సంఘాలు చేయటానికి ఏమీ లేక ఉత్సవ విగ్రహాలలాగా ఉండి తరువాత వాటంతటవే రాలిపోతవి. క్రొత్త రైతు సంఘాలని మాత్రము స్థాపించకూడదు. కాంగ్రెసును రాడికలైజ్ చేయటానికి సైంథవుడు లాగా అడ్డుపడతవి.
కాంగ్రెసును రాడికలైజ్ చేసి నాయకత్వము జనబాహుళ్యము యొక్క అధికారంలోకి తీసుకొని రావటం వల్ల సమష్టి నాయకత్వాన్ని అభివృద్ధి చేయటానికి వీలవుతుంది. వ్యక్తిగత నాయకత్వము, తద్వారా ఉద్యమానికి కలిగే నష్టము పరిహరింపబడతవి.
III
వివిధ సంఘాలను స్థాపించి కాంగ్రెసు సంస్థతో ఐక్య సంఘటన తీసుకొని రావాలన్న చర్చ 1935లో ప్రారంభమైంది. దీన్ని రాయ్ తీవ్రంగా నిరసిస్తూ వ్యక్తిగతంగా అందరూ కాంగ్రెసులో చేరాలి, కాంగ్రెసుకు ప్రజాబాహుళ్యానికి మధ్య  ఈ సంఘాల మధ్యవర్తిత్వము అనవసరమన్నాడు. ఎందుకంటే ?
1.    సంఘాల స్వతంత్రత నశిస్తుంది
ఐక్యసంఘటన సిద్ధాంతం ప్రకారము ఈ సంఘాల ద్వారా కాంగ్రెసులో చేరవలసే వుంటుంది. కాబట్టి సంఘం కాంగ్రెసు సంస్థకు శాఖ కావటము తటస్థిస్తున్నది. దీనివలన సంఘం స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలులేకపోతున్నది. వ్యక్తిగతంగా కాంగ్రెస్ లో చేరటానికి వీలుంటే సంఘాలు కాంగ్రెసు పై అధికారుల ఆజ్ఞకు లోబడి వ్యవహరించవలసిన ఆవశ్యకత ఏర్పడదు.
2.    ప్రత్యేక సంఘాలు కాంగ్రెసు సంస్థకన్న చిన్నవి కావటం తటస్థిస్తుంది. కాబట్టి కాంగ్రెసును స్వాధీనం చేసుకోగలిగినంత శక్తి ఏర్పడిన తరువాతనే కాంగ్రెసు శాఖగా చేస్తామని వాదించవచ్చును. అలా చేయటానికి సంవత్సరాలు పడతాయి. ఆ లోగా ఉద్యమం ఏమి కావాలి? ఇంకా విషయమేమిటంటే, హిందూ దేశములో సామ్రాజ్యతత్వం యొక్క దోపిడి, కాపిటలిజమూ పడిపోతూవున్న రోజులలో ప్రజాబాహుళ్యం మీద ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాలు స్థాపించడానికి వీలులేదు.
3.    పెద్ద సంఘాలు విప్లవమునకు తోడ్పడక సంస్కారమునకు తోడ్పడగలవు.
జనసామాన్యంతో వ్యవస్థాపింపబడిన పెద్దసంఘాలకు సంస్కార లక్షణాలు ఏర్పడతాయి.   ఇతర దేశాలలోని ట్రేడ్ యూనియన్ల ఉద్యమ చరిత్రయే దీనికి తార్కాణము. ఒకవేళ హిందూ దేశములో పెద్ద ట్రేడ్ యూనియన్లను స్థాపించ గలిగినను కాంగ్రెసును ఒత్తిడి చేయటానికి విప్లవ పద్ధతిద్వారా మాత్రము సహాయపడవు. ఈ సంఘాల నాయకులు సాధారణంగా కాంగ్రెసు నాయకుల కంటే మితవాదులుంటారు, అంత విప్లవకారులుగా ఉండరు. ఈ సంఘాలు ఎంతవరకు పనికి వస్తవంటే, క్యాపిటలిస్టు ఉత్పత్తి విధానములో శ్రామికునకు తగిన హక్కులను మాత్రము ఇప్పించగల్గుతాయి.
4.    రాజకీయ చైతన్యము ప్రజలలో కలగదు. ప్రత్యేక సంఘాలు కాంగ్రెసునకు అనుబంధంగా ఉండడంవల్ల అందులోని ప్రజాబాహుళ్యమునకు ఆ సంఘాల ద్వారా కాంగ్రెసు చేసే తీర్మానాలలోనూ, ప్రవేశపెట్టే కార్యక్రమాలలోనూ పాల్గొనటానికి వీలులేకపోతున్నది. సంఘనాయకులకు మాత్రమే ఇందులో పాల్గొనటానికి వీలుపడుతున్నది. కాంగ్రెసుకూ జన సామాన్యమునకూ దగ్గర సంబంధం కలుగకపోవటం వల్ల స్వాతంత్రోద్యమములో ప్రజాసామాన్యం అంత ఉత్సాహంగా పాల్గొనజాలదు.
5.    ఐక్య సంఘటనవల్ల సంఘాలు తేలికగా కాంగ్రెసు బూర్జువా నాయకుల చేతిలో పడతాయి.
వ్యక్తిగతంగా రైతులు కాంగ్రెసులో చేరటం, కాంగ్రెసు బూర్జువా నాయకుల చేతులలో చిక్కుకోవడమవుతుందని కొందరంటారు. సంఘాలను కాంగ్రెసు శాఖలుగా చేస్తే ఏమవుతవి? అల్ప సంఖ్యాకులైన నాయకులను కాంగ్రెసు బూర్జువా నాయకులు వశపరచుకోవడము, అతి సంఖ్యాకులైన వ్యక్తులను వశపరచుకోవటం కంటే తేలికగదా?
6.    ఐక్య సంఘటన వల్ల కాంగ్రెసు సంస్థ “ఫెడరేటెడ్ బాడీ ఆఫ్ అటానమస్ యూనిట్స్” “స్వతంత్ర సంఘాల యొక్క సాముదాయిక సమాఖ్య” అవుతుంది. ఇది (constitution) నిర్మాణ కార్యక్రమం నిర్వహించటానికి పనికి వస్తుంది కాని విప్లవోద్యమం నిర్వహించటానికి పనికిరాదు.
సంఘాలను కాంగ్రెసు శాఖలుగా చేయటంవల్ల కాంగ్రెసు పెక్కు సంఘాలవల్ల ఏర్పడిన సంస్థ కాగలదు. దీనితో కాంగ్రెసుకు బహుముఖత్వమేర్పడును. అప్పుడు కాంగ్రెసు కేంద్ర సంస్థగా ఉండుటకు వీలులేకుండా పోతున్నది. వివిధములగు ఆశయములు కలిగినటువంటి వివిధ ఆశయములు కలిగినటువంటి వివిధ సంఘాలవారు కాంగ్రెసు సభ్యులు కావటం చేత పరస్పర ఆశయాలు, ఆదర్శాలు భిన్నమై ఏకీభావము కుదరదు. ఇలాంటి అతుకులమారి కాంగ్రెసు సంస్థ (Institution) ఆచారము, నిర్మాణ కార్యక్రమము నిర్వహించటానికి మాత్రమే పనికివస్తున్నది. ఒకే ఆదర్శంతో, ఒకే కార్యక్రమంతో, మహాఉత్సాహంతో జాతీయ ప్రజాస్వామిక విప్లవంకోసం పోట్లాడవలెనంటే (ఐక్యసంఘటనం) (Collective Affiliation) వల్ల ప్రయోజనం లేదు. వ్యక్తిరూపంగా అందరూ కాంగ్రెసులో చేరవలసిందే.
రాజకీయ చరిత్రలో వారు తెలిసిన ఉదాహరణ ఒకటే ఉన్నది. అది వ్యక్తి రూపంగానూ, ట్రేడ్ యూనియన్ల ద్వారానూ చేరటానికి వీలైన బ్రిటిషు లేబర్ పార్టీ, ఫెడరల్ స్ట్రక్చర్ సంయుక్త నిర్మాణం వల్ల   ఈ పక్షము దుర్బలమైపోయింది. ట్రేడ్ యూనియన్ల ద్వారా చేరిన అల్పసంఖ్యాక ప్రతినిధులు రాజకీయ ప్రబోధితులైన వేలకొలది వ్యక్తిగత ప్రతినిధుల మీద అధికారం చెలాయించడంవల్ల (Reformist and Capitulatory) నూతన స్వరూపముగల పరాజయ పద్ధతులకు (Policy) దారితీసింది. పదిపన్నెండు మంది ట్రేడ్ యూనియనుల ప్రతినిధులు, రాజకీయంగా ప్రబోధితులైన బహుళసంఖ్యాకులైన వ్యక్తిగత ప్రతినిధుల మీద స్వారీ చేయటం, వారి ఉద్దేశాలను అణగత్రొక్కటం ఎంతమాత్రము పనికిరాదు. జనసామాన్యము యొక్క రాజకీయ ప్రబోధమే కోరతగినది కాని, ఒక ట్రేడ్ యూనియనుల ప్రత్యేక శాఖ చేతనే ఇంత అనర్థకం గలిగితే అనేక సంఘాలకు కాంగ్రెసులో ప్రాతనిధ్యమిచ్చుటవలన ఎంత నష్టము కలుగునో వేరే చెప్పనవసరములేదు.
సంఘాలను కాంగ్రెసుకు శాఖలుగా చేయటంవల్ల తీవ్రవాదులు (రాడికల్స్) కాంగ్రెసులో తేలికగా చేరటానికి వీలవుతుందని కొందరంటారు. ఇది కొంతవరకు నిజమే. కాని రాడికల్స్, తమ వర్గ సంఘాలను కాంగ్రెసుకు లోబరచవలసి ఉంటుంది. పైగా రంగంలోకి వచ్చేది రాడికల్సొక్కళ్లే కాదు, అనుమతించిన తరువాత ఎన్ని రైతు సంఘాలైనా, ఎన్ని ట్రేడ్ యూనియనులయినా చేరవచ్చును. రాడికల్స్ కానివారు అధికారంలోకి వస్తారు. అలజడి కలిగించటానికి మాత్రమే అయితే, రాడికల్స్ కొంతమంది చేరవచ్చు. కాంగ్రెసులో చేరి ఒక్క అలజడి కలిగించటముతోనే పనిపూర్తికాదు. మంచి చురుకుదనము ప్రవేశపెట్టి కాంగ్రెసు సంస్థను విప్లవ సంస్థగా మార్చాలి.
IV
పదవీ స్వీకారము
ఇప్పటి పరిస్థితులలో కాంగ్రెసు పదవీస్వీకారం చేయక చేసేదేమీలేదు. కాంగ్రెసు ఉద్యమాన్ని లేవదీయటానికి ఇష్టపడటం లేదు. దీనివల్ల ఏమీ జరగనూలేదు కూడాను. కాబట్టి కాంగ్రెసు పదవుల్ని స్వీకరించి నూతన రాజ్యాంగ విధానానికి సవరణలు సూచించాలి. కాంగ్రెసు అధికారంలో ఉండటంవల్ల స్వపక్షాన్ని బలపరచుకోవచ్చును. సవరణ సూచించటం వల్ల ప్రజలలో ఉద్యమాన్ని మరల అంకురింప జేయవచ్చునని రాయ్ చెప్పాడు. ఈ పదవీస్వీకార మొక్కటే దేశపరిస్థితులకు సరిపోతుంది. స్వాతంత్ర్యంకోసం జాతీయ సంఘర్షణ బలవత్తరమవుతుంది. రాజకీయ చైతన్యము  ప్రయలలో ప్రజ్వరిల్లుతుంది. నూతన రాజ్యాంగ విధానములో కాంగ్రెసు కొన్ని సవరణలు సూచించటంవల్ల బ్రిటీషు సామ్రాజ్యవాదులు కొన్ని హక్కుల్ని ప్రసాదిస్తారనిగాని రాజ్యాంగ విధానంలో కొన్ని మార్పులు చేస్తారని భ్రాంతి పడటం కాదు. స్వాతంత్ర్యం కావాలి. ఆ స్వాతంత్ర్యం బ్రిటీషు సామ్రాజ్యతత్వం వరప్రసాదంగా ఇవ్వదు. నూతన రాజ్యాంగములో సవరణలు సూచించటంవల్ల (United front) ను విశాలం చేసి ఉద్యమాన్ని, ఉచ్ఛస్థాయిలోకి నడిపించడానికి ఒక మంచి సాధనం సమకూర్చడమవుతుంది.
కాంగ్రెసు పదవులను మాత్రం స్వీకరించింది. అధికారంలో ఉండటంవల్ల ఎంతవరకు బలపడవలెనో అంతవరకు బలపడ్డ కొత్త రాజ్యాంగములో సవరణలను సూచించి ఆందోళన చేయకపోతే ప్రజలలో రాజకీయ చైతన్యం కలగదు. ఉద్యమమునకు ఉన్ముఖత్వం ఏర్పడజాలదు. ఇప్పుడైనా ఆందోళనను లేవదీయాలి.
ఇలా చెపుతున్న రాయ్ ని మితవాది అని దోషారోపణ చేస్తున్నారు.  ఆ లెక్కలో బెకనిన్ కంటే మార్క్సు మితవాది. బొఖారిన్ కంటే లెనిన్ మితవాది. ట్రాట్ స్కీ, కెమనిన్, జినో, వీరికంటే స్టాలిన్ మితవాది. విప్లవకారుడు కార్యశూరుడు కాకపోవడం దోషంకాని, అతివాది కాకపోవటం దోషం కాదు. పైగా పరిస్థితులకు సరిపడని అతివాదిత్వం అపాయంకూడా.  ఆ మాటకే వస్తే అతివాదిత్వం అంటే ఏమిటి? కాంగ్రెస్ అవిప్లావికంగా ఉన్న సనాతన జాతీయవాదుల నాయకత్వమున ఉండటంవల్ల బూర్జువా ప్రజాస్వామిక కార్యక్రమానికి ఒప్పుకోవటం లేదు. కనుక కాంగ్రెస్ లో ఉండి నాయకత్వాన్ని తీవ్రవాదులు (రాడికల్స్) స్వాధీనం చేసుకోవాలి. దీనికి  పద్ధతి చెప్పటం మితవాదిత్వం అవుతుందా?

posted by Innaiah Narisetti

( Mahati was Telugu monthly from Tenali town in India edited by Dharanikota Venkatasubbaiah since 1937.Dr G.V Krishna rao was studying in A C college, Guntur at the time of writing this article. M N Roy just entered Indian National congress and came out with alternative ways which attracted youth. This rare article was published due to its historical importance)
Gavini Venkata Krishna rao published his Ph.D thesis on Kalapoornodayam of Pingli Surana.He was only graduate and Madras university allowed to do PH.D. Krishnarao taught in VSR college, Tenali, worked as producer in All India Radio, Vijayawada. His novel Keelu Bommalu was famous.
-      

No comments:

Post a Comment