ఒసామాబిన్ లాడెన్ కుటుంబ స్త్రీల గతి...




--వెనిగళ్ళ కోమల

(ముస్లిం దేశాల్లో స్త్రీల జీవితం గురించి గతంలో కొన్ని పుస్తకాలు వచ్చాయి. అక్కడ స్త్రీల జీవితం చాలా దుర్భరమని అవి చదివాక తెలుస్తుంది. మహమ్మదు ప్రవక్త జన్మస్థలమైన ‘పవిత్ర సౌదీ అరేబియా’ లో రాజకుటుంబ స్త్రీల జీవితంపై 1990లో ‘ప్రిన్సెస్’ అనే పుస్తకం వచ్చి సంచలనం కలిగించింది. ఇప్పుడు అలాంటిదే మరో పుస్తకం. ఒసామా బిన్ లాడెన్ అంటే ‘పేరు మోసిన ఉగ్రవాది’ అని సెప్టెంబర్ 11, 2001 తర్వాత ప్రపంచానికి తెలియవచ్చింది. అతని అన్న యెస్లామ్ బిన్ లాడెన్. యెస్లామ్ భార్య కార్మెన్ రాసిన పుస్తకం ‘ఇన్ సైడ్ ది కింగ్ డం – మై లైఫ్ ఇన్ సౌదీ అరేబియా’ ఇపుడు అమెరికాలో గొప్ప సంచలనం. సౌదీ అరేబియా రాజకుటుంబీకురాలిగా ‘బంగారు పంజరపు చిలక’ కంటే హీనంగా బతికిన కార్మెన్ వాస్తవ జీవిత చిత్రణ ఈ పుస్తకంలో ఉంది. )

ఒసామా బిన్ లాడెన్ 11 సెప్టెంబర్, 2001 అమెరికామీద జరిగిన దాడులతో తెరపైకి వచ్చాడు. ఒసామా తండ్రి షేక్ మహమ్మద్ మూమూలు స్థాయి నుండి బిన్ లాడెన్ కన్.స్ట్రక్షన్ కంపెనీని స్థాపించే స్థితికి ఎదిగాడు. సౌదీలో అది అతి పెద్ద కంపెనీ. ఆయన 22 పెళ్ళిళ్ళు చేసుకుని, 25 మంది కొడుకులకూ, 29 మంది కూతుళ్ళకూ తండ్రయ్యాడు. 23వ వివాహం చేసుకునే నిమిత్తం వెళుతూ విమాన ప్రమాదంలో చనిపోయాడు.

బిన్ లాడెన్ కుటుంబానికీ, సౌదీ రాజుల కుటుంబానికీ సత్సంబంధాలు వున్నాయి. ఇస్లామును పటిష్టంగా పాటించేవారుగా, దక్షతగల వ్యాపారవేత్తలుగా, ధనవంతులుగా బిన్ లాడెన్ కుటుంబం గుర్తింపు పొందింది.

సౌదీలు మహమ్మద్ ప్రవక్త పుట్టిన దేశవాసులుగా గర్విస్తూ తమదే అసలైన ఇస్లాం అని చెప్పుకుంటారు. ఇస్లాం వ్యాప్తి వారి పరమాధిగా భావిస్తారు. 1930 నుండి ‘ఆయిల్ రిచ్’ దేశంగా సౌదీ అరేబియా ఎదిగింది. విదేశాలకు వెళ్ళి చదివిన వారు అక్కడ విలాసవంతంగా గడిపినా సౌదీలో మక్కా మూసజీవితమే గడుపుతారు.

ఒసామా తండ్రి తెలివైనవాడు. ఆరోగ్యంగా, అందంగా ఉండేవాడు. అతని భార్యలు, పిల్లలు అతని చెప్పుచేతల్లో ఉండేవారు. అతని స్థాయికి కొడుకులెవరూ ఎదగలేకపోయారు. భార్యలను, పిల్లలను ఒకే కాంపౌండులో వేరు వేరు ఇళ్ళల్లో ఉంచి పోషించేవాడు. కొందరు భార్యలకు విడాకులిచ్చినా, వారు మరల వివాహం చేసుకోకపోతే వారిని, పిల్లలను తనే పోషించేవాడు.

బిన్ లాడెన్ స్త్రీల జీవితం సౌదీ స్త్రీల జీవితానికి అద్దం పడుతుంది. ఆ స్త్రీలెప్పుడూ తలల నుండి పాదాల దాకా నల్లని, చిక్కని బురఖా ధరించి వుంటారు. (ఇంట్లో సయితం), అంతటి వేడి దేశంలో ఎప్పుడూ ఆ బురఖాలలో మగ్గుతూ ఉంటారు. పరాయి పురుషులెవరూ స్త్రీ ముఖాన్ని చూడగూడదు. ఆ స్త్రీలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ల గూడదు. భర్త అనుమతి లేకుండా ఏ పనీ చేయగూడదు. భర్త వెంట వెళుతున్నా బురఖా ధరించి కారు వెనుక సీట్లో కూర్చొని ప్రయాణం చేయాలి. భర్తతో కలిసి ఒకే టేబుల్ వద్ద భోజనం చేయకూడదు. భర్తకు లోబడే బ్రతకాలి.

బిన్ లాడెన్ స్త్రీలకు పనీపాటా ఏమీ వుండదు. పిల్లలు పనివాళ్ళ చేతుల్లో పెరుగుతుంటారు. బయటకు వెళ్లడానికి డ్రైవర్ని బండి సిద్ధం చేయమని చెప్పాలన్నా, మగ పనివాళ్ళతో వస్తువులు ఏమన్నా తెప్పించుకోవాలన్నా10 సం. కుర్రాడితో చెప్పి పంపిస్తారు. స్త్రీ ముఖం (నేకెడ్ ఫేస్) చూడగలవారు తండ్రి, సోదరులు, భర్త్త, కొడుకులు, మారు తండ్రి మాత్రమే. మరే పురుషుడూ కన్నెత్తి చూడకూడదు. ఆ అవకాశం స్త్రీ ఇవ్వకూడదు.

బిన్ లాడెన్ కుటుంబంలో స్త్రీలంతా కలిసిమెలిసి ఉంటారు. పిల్లల్ని కంటారు. రోజుకు 5సార్లు నమాజ్ చేస్తారు. వారు పెద్ద చదువుకున్నవారు కాదు. ఆడపిల్లల బడుల్లో అమ్మాయిలకు నేర్పేది అరబ్బీ, కొరాన్ పఠనం, అణుకువగా జీవించాలని బోధించడం. ఆడపిల్లలకు చదువు అవసరమనే చట్టమే లేదక్కడ. పై చదువుల కెళ్ళిన అమ్మాయిలకు కూడా మగ ప్రొఫెసర్లు డైరెక్టుగా పాఠాలు చెప్పరు. వీడియో పాఠాల పద్ధతిలో నడుస్తుంది బోధన. మతాచారాలను పాటిస్తూ స్త్రీ రోజంతా భర్త రాకకోసం ఎదురు చూస్తుంటుంది. అతను రాని రోజులే ఎక్కువ వుంటాయి. అతను వచ్చిన నాడు ఆ స్త్రీ సంతోషంగా అడుగులకు మడుగులొత్తుతూ వుంటుంది. ఆ స్త్రీలకు అలాంటి జీవిత విధానానికి మించి వుంటుందని గానీ, వారు మరో రీతిలో జీవించవచ్చనిగానీ తెలిసే అవకాశమివ్వరు పురుషులు.

బంధువులు ఇంటికెళ్ళినా భర్తతో కలిసి వెళ్ళాలి. పెళ్ళిళ్ళు, పార్టీలు, పిక్నిక్కుల కెళ్ళినా ఆడవారు వేరుగా, మగవారు వేరేగా కూర్చుంటారు. ఆడవాళ్ళూ, ఆడవాళ్ళూ కలిసి చిన్న చిన్న పార్టీలు ఏర్పాటు చేసుకుని కేక్ లు తింటూ, టీ తాగుతూ, పిల్లల గురించీ, బట్టల గురించీ, పనివాళ్ళ గురించీ మాట్లాడుకుంటారు. మగవాళ్ళను విమర్శించకూడదు. ఎలా ఉన్నారు అని అడిగే పరామర్శల్లో కూడా మగవారి పేరెత్తి అడగకూడదు. బహు భార్యలు ఉండవచ్చు. విడాకులు ఇవ్వడం సులభం కనుక, అణుకువగా పడి వుండకపోతే భర్త వదిలేస్తాడేమో అని స్త్రీ అహర్నిశలూ భయపడుతుంటుంది. కొన్ని సందర్భాలలో విడాకులిచ్చి భార్యను వెళ్ళగొట్టి ఆమె జీవితకాలం తన పిల్లల్ని కలవనీయకుండా చేసే భర్తలూ ఉన్నారు. తల్లిగా అక్కడ స్త్రీకంత విలువ ఉన్నది మరి..

మగసంతానం కలిగితే తల్లి పెద్ద కొడుకు పేరుతోనే పిలవబడుతుంది. అంతకుముందు ఆమె పేరేదైనా, ఉదా: ఓమ్ సారా అనే ఆమె పెద్ద కొడుకు అలీ అయితే ఆమెను ఓమ్ అలీ అంటారు. అచ్చంగా ఆడపిల్లల్ని కన్నతల్లి, అమె పిల్లలకు కలిపి భర్త ఆస్తిలో 50 శాతమే దక్కుతుంది. ఆమె భర్త ఏకారణంగానైనా చనిపోతే, భర్త సోదరుడు కానీ, సమీప బంధువుకానీ వారికి గార్డియన్ అవుతాడు. వారి పెంపకం, చదువు, పెళ్ళిళ్ళు అతని నిర్ణయానుసారం జరుగుతాయి. బిన్ లాడెన్ కుటుంబంలోని మగవారు వారి వ్యాపార విషయాలు కానీ, సోదరుల మధ్య ఆధిపత్య పోరు గురించి కానీ భార్యలతో చెప్పరు. ఏ విషయాలూ వారితో చర్చించరు. ఆ స్థాయి వారికి ఉండదనేది వారి నమ్మకం. అన్నదమ్ములు ప్రత్యక్షంగా పోట్లాడుకోరు. అందరికీ ఆస్తిలో భాగం వున్నా ఎవరి వ్యాపారం వాళ్ళు వృద్ధి చేసుకుంటారు. అవసరమైతే కలిసికట్టుగా సమస్యలనెదుర్కొంటారు.

స్త్రీలకు మసీదులో ప్రవేశం లేదు. మక్కాయాత్ర కెళ్ళినపుడే వారు బహిరంగంగా ప్రార్థిస్తారు. అదీ ఆడవారికి నిర్దేశించిన స్థలంలోనే. బయట ప్రపంచంలో కొంత మార్పు వచ్చినా బిన్ లాడెన్ కుటుంబంలో అది కనిపించదు. స్త్రీల జీవితాలు బంధింపబడినవిగా, చిన్నవిగా రంగు మాసినట్లు వుంటాయి. అక్కడ స్త్రీలు భర్తల పెంపుడు జంతువులుగా బ్రతుకుతారు. భర్తలు బహుమతులిస్తే ఉప్పొంగిపోతారు. సొంతంగా ఏ పనీ చేయలేరు. వారు భర్తలతో చర్చించవలసింది కూడా ఏమీ వుండకపోవచ్చు.

బిన్ లాడెన్ కుటుంబంలో భార్యాభర్తలు నిజంగా ప్రేమగా వుండడం తక్కువ కనిపిస్తుంది. సౌదీలో చాలా పెళ్ళిళ్ళు అలానే వుంటాయట. ఒక స్త్రీ సౌదీ నుండి బయటకు ప్రయాణం చేయాలంటే అనుమతి పత్రం మీద భర్త, తండ్రి, కుమారుడు ఎవరిదో ఒకరిది సంతకం తప్పకుండా వుండాలి. ఆడవారి పాస్ పోర్టులలో వారి ఫోటోలుండవు. విదేశీ స్త్రీని పెళ్ళి చేసుకుంటే ఆమె ఫోటో, ముఖం కనబడేలా బురఖాతో వుంటుంది.

బిన్ లాడెన్ కుటుంబంలో సంగీతం, నృత్యం ..హరామ్... అంటారు. పుట్టినరోజు వేడుకలు జరపరు. ఒక గర్భిణీ స్త్రీ మార్కెట్ లో మూర్ఛపోతే వెంటవున్న భర్త ఆమెను రెండు చేతుల్లోకి తీసుకోబోతే పోలీసులు (ముతవా) అభ్యంతరం తెలుపుతారు. మగవారు (భర్త అయినా సరే) స్త్రీని పబ్లిక్ గా తాకరాదు.

ఒసామా బిన్ లాడెన్ తల్లి తరుఫు బంధువు నజ్ వా (సిరియన్)ను పెండ్లాడాడు. ఆమెకు 30 ఏళ్లు రాకుండానే వరుసగా 7 మంది కొడుకుల్ని కన్నది. అతను లెబనాన్ లో చదివే రోజుల్లో విలాస పురుషుడేనట. తరువాత ఇస్లాంను స్ట్రిక్ట్ గా పాటిస్తూ, వ్యక్తిగా ఏ ప్రత్యేకత లేకున్నా, అందరి మన్నన పొందాడు. సౌదీ రాజుల విలాసవంతమైన జీవితాన్ని విమర్శించినందుకు దేశబహిష్కరణకు గురయ్యాడు. ఆఫ్.ఘనిస్తాన్ తాలిబన్ వీరుడిగా, అమెరికా విరోధిగా ఎదిగాడు. కుటుంబంతోనూ, రాజకుటుంబంతోనూ బంధాలు వీడలేదు. అమెరికాని ఎటాక్ చేసింది తనే అంటే వాళ్లు ఒప్పుకోరు. ఒసామా సోదరి షేఖా కూడా అతని మాదిరిగానే ఇస్లాం పక్షపాతి. ఆఫ్ఘ.నిస్తాన్.లో తాలిబన్ల సహాయార్థం ఆమె కూడా వెళ్ళి పనిచేసింది. మిగతా స్త్రీలలో సమావేశాలేర్పాటు చేసి కొరాను గురించి చర్చలు జరుపుకుంటుంది.

బిన్ లాడెన్ ఆడవాళ్లు షాపింగ్ కు వెళ్ళాలంటే ముందుగా కబురెడుతుంది. షాపుల్లో మగవారంతా తప్పుకోవాలి. బురఖాల్లోనే షాపింగు చేస్తారు. అక్కడ అమిత వేడి కనుక వర్శం పడితే వాళ్లంతా వర్షంలో తడిసి ఆనందిస్తారు. మగవారెవరూ ఆ దరిదాపుల్లో మెసలకూడదు. చెట్టు చేమ, గ్రీనరీ లేని ఎడారి దేశం. అందంగా ఉండదు. ఇతర దేశాలకు విహారానికి వెళ్ళినట్లు అక్కడ ఎవరూ వెళ్ళరు. ఇసుక తుఫానుకలొచ్చినప్పుడు అంతటా ఇసుక నిండుతుంది. తిండి పదార్థాలలో కూడా పడుతుంది. పనివాళ్ళు తర్వాత అంతా ఊడ్చేస్తారు. సౌదీలో రెండే విలువలు పాటిస్తారు. ఒకటి ఇంటి పెద్ద (పేట్రియార్క్)కు లోబడి వుండడం, రెండవది ఇస్లాంను పాటించడం. అందుకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా ఫలితాలు దారుణంగా వుంటాయి.

సౌదీ రాజకుటుంబంలోని స్త్రీలు కూడా జైలు జీవితం గడుపుతారు. డబ్బున్నది కనుక పోటీలు పడి పెద్ద పెద్ద ఇళ్ళల్లో నివాసముంటారు. సౌదీరాజులు సంచార జాతులనంతా కలిపి సౌదీ అరేబియాను స్థాపించారు. అదొక్కటే దేశం. ఆ రాజుల వంశం ...అల్ సౌద్ పేరుతో పిలువబడుతుంది. ఆ దేశపు ఆయిల్ సంపదనంతా రాచకుటుంబీకులు సొంత ఆస్తిలా పరిగణిస్తారు. స్త్రీలకు డబ్బుకు లోటులేదు. ప్రతి స్త్రీ ఎంతోమంది భార్యల్లో ఒకరుగా ఉంటారు. భార్యా, భర్తా వేర్వేరు ఇళ్లల్లో పక్కపక్కనే ఉంటారు. మగవారికి మగపనివారు, ఆడవాళ్లకి ఆడపనివారు ఉంటారు. భర్త భార్యతో గడపటం చాలా తక్కువ. స్త్రీలు మిట్టమధ్యాహ్నం దాకా నిద్రపోతారు. లేచి తయారయ్యి బురఖాలు కప్పుకుని షాపింగులకెళతారు. డబ్బున్నది కనుక వస్తువులు ఒకరితో ఒకరు పోటీపడి కొంటారు. ఇంట్లో రకరకాల డ్రెస్సులు వేస్తారు. బయటకు బురఖాతోనే వెళ్లాలి. ఆడవారికే ప్రత్యేకించిన షాపుల్లో ముఖం మీద కవరు పైకి తీసి వాళ్లు వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. కొత్తగా వచ్చే రెస్టారెంట్లలో ‘ఫ్యామిలీ రూమ్స్’ ఏర్పడడంతో భార్యా, భర్తా కలిసి తింటారు. ముఖం మీద ముసుగు పైకెత్తి తింటున్నా వెయిటర్ ఆర్డర్ తెచ్చేముందు తలుపుమీద తట్టి వచ్చేలోపల స్త్రీ ముసుగు ముఖం మీదికి లాక్కుంటుంది.

రాజకుటుంబంలో స్త్రీ ఏ కొంచమైనా తిరుగుబాటు ధోరణి కనిపించిందంటే ఆమెకు మరణమే దండన. మిషాఅల్ అనే యువరాణి తనని వయసుమీరిన వాడికిచ్చి పెండ్లి చేస్తుంటే తెగించి, తను ప్రేమించిన వాడితో పారిపోతుంటే విమానాశ్రయం నుండి పట్టుకుని తీసుకువచ్చారు. తరువాత ఆమె తాతగారే ఆమెను తుపాకీతో కాల్చి చంపించారు. రాచకుటుంబంలో జనాభాను వృద్ధి చేసుకోవడం లక్ష్యం. ఇప్పటికంతా పాతికవేలదాకా యువరాజులు, రాణులు ఉన్నారంటారు.

స్త్రీలు లండన్ వంటి నగరాలకెళ్ళినప్పుడు డాక్టర్లను కలిసి తమ రోగాలకు మందు రాయించుకుంటారు. స్త్రీలు సూర్యరశ్మికి, వ్యాయామానికి దూరంగా ఉండడం వలన ఎముకల వ్యాధులు, ఎక్కువ తినడం వల్ల గుండెజబ్బులు, భర్తల నిరాదరణ వల్ల డిప్రెషన్లతో బాధపడుతూ మందులు మింగుతుంటారు. విడాకుల భయం పెనుభూతంలా వారిని వెంటాడూతూనే వుంటుంది. పిల్లలను విదేశీ గవర్నెస్సులు, ఆయాలు పెంచుతుంటారు. వారిపట్ల ఏ మాత్రం కృతజ్ఞతా భావం వుండదు. విదేశీ ఆయాలు ఎవరైనా సౌదీలో ఇస్లాం రూల్సు పాటించాల్సిందే. బైబిల్ చదవడం, కలిసి ప్రార్థనలు చేయడం అక్కడ ఒప్పుకోరు. వాళ్ళ పిల్లలను స్కూల్లో కట్టడి చేయరాదు. టీచర్లు చేయలేరు కూడా.

మొదటి నుంచి ఆడవాళ్లని మగవారితో వేరుచేసి పెంచడంవలన వారి మధ్య సయోధ్య వుండదు. మగపిల్లలు అధికులమనుకుంటారు. అలానే ప్రవర్తిస్తారు. ఆడవారికి చదువులు లేవు, పని వుండదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫైజల్ రాజు భార్య ఎన్నో వ్యతిరేకతల మధ్య ఆడపిల్లలకు స్కూల్ తెరిపించారు.

కొత్త విషయాలు కనుగొనాలన్నా, కొత్త వాహనాలు వాడలన్నా, ఫోటో ఇమేజ్.లు తీయాలన్నా టీవీ వాడాలన్నా సౌదీ మేథావుల అనుమతి కావాలి. మొత్తం మీద ఆడవారి జీవితాలు బావిలో కప్పల చందమే. ఎలాంటి ప్రాధాన్యతా లేని, మార్పులేని జీవితాలు గడుపుతారు.

కార్మెన్ జీవితం

కార్మెన్ బిన్ లాడెన్ ‘ఇన్ సైడ్ ది కింగ్ డమ్, మై లైఫ్ ఇన్ సౌదీ అరేబియా’ అనే పుస్తకం ద్వారా సౌదీ జీవితంలో లోటుపాట్లను ప్రపంచం దృష్టికి తెచ్చారు.

ఒసామా బిన్ లాడెన్ అన్నయ్య యెస్లామ్ బిన్ లాడెన్ ను (కుటుంబంలో 10వ వాడు) కార్మెన్ పెండ్లాడింది. ఆమె జెనీవా (స్విట్జర్లాండ్)లో పుట్టింది. విహారయాత్రకు యెస్లామ్ కుటుంబం జెనీవా వచ్చినపుడు కార్మెన్ వాళ్ళ యింట్లో అద్దెకు దిగారు. యెస్లామ్ తో ఆమె పరిచయం, స్నేహంగా, ప్రేమగా మారి 1974లో వారిద్దరూ పెండ్లి చేసుకున్నారు.

కార్మెన్ తన కుటుంబం, స్నేహితుల మధ్య జెనీవాలో పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడినా, విదేశీయురాలిని పెండ్లాడడానికి సౌదీరాజు నుండి స్పెషల్ పర్మిషన్ తెచ్చాననీ, సౌదీలో చేసుకుంటే ఆ పెళ్లికి గౌరవం పెరుగుతుందనీ చెప్పి యెస్లామ్ ఆమెని సౌదీలో పెళ్ళికి వప్పించాడు.

జెద్దా ప్రయాణానికే బురఖా ధరించి రావలసి వస్తుంది కార్మెన్.కు. చాలా ఇబ్బందిగా అర్థం లేని ఆచారంగా అనిపించినా కాబోయే భర్త కోరిక మేరకు అన్నీ సహిస్తుంది. కొంతకాలం ఇద్దరూ అమెరికాలో చదువులు ముగించి తిరిగి సౌదీ చేరతారు. అమెకు పశ్చిమ దేశపు స్వేచ్ఛా పూరిత వాతావరణం, ఆ నాగరికత అంతా నచ్చుతుంది. అక్కడే మొదటి బిడ్డ ‘వఫా’ జన్మించింది.

సౌదీ తిరిగి వెళ్ళాక అక్కడి పద్ధతులు అలవరచుకున్నది. యెస్లామ్ కు డబ్బు ఉంది. ఇంట్లో కార్మెన్ కు కొంత స్వేచ్ఛ నిచ్చాడు. ఆ జీవితం ఎంతో గొంతు నులిమినట్లున్నా, వారి అలవాట్లూ, వారిలా నమాజు చేయడం, మగవారికి కనబడకుండా వుండడం, చదువు సంధ్యా లేని ఆడవారి మధ్య వుండడం విసుగనిపించినా భవిష్యత్తులో సౌదీలో పరిస్థితిమారి నవీకరణ జరుగుతుంది, ఆడవారి స్థితి మెరుగుపడుతుందనే ఆశతో మనుగడ కొనసాగించింది. భర్త పశ్చిమ సంస్కృతిని ఎరిగినవాడు కనుక తనకు కష్టం కాదేమో అనుకున్నది.

కార్మెన్ స్వేచ్ఛా వాతావరణంలో పెరిగింది. సౌదీ కట్టడి తాత్కాలికమనే అశతో వున్నదామె. రెండవ పాప ‘నాజియా’ పుట్టింది. మగపిల్లవాడు కలగలేదని భర్తకు ఉన్నా బయటపడలేదు. ఆమె బిడ్డల్ని మురిపెంగా పెంచింది. సౌదీ భాష, అలవాట్లు నేర్పింది.

యెస్లామ్ కార్మెన్ తో తన వ్యాపార విషయాలు చర్చించేవాడు. ఆమె సూచనలు పాటించేవాడు కూడా. మిగతా బిన్ లాడెన్ ఆడవారికంటే తన జీవితం మెరుగుగా వున్నదని, తన భర్త మిగతా అన్నదమ్ములకంటే భిన్నంగా ఉంటాడని, తను అదృష్టవంతురాలినని సంతోషించేది. శెలవులకు జెనీవా అమెరికా వెళ్ళేవాళ్ళు. భర్త వ్యాపార పనులమీద విదేశాలు వెడితే తను వెంటే వెళ్ళేది. అలాంటి స్వేచ్ఛకోసం ఎదురు చూస్తూ వుండేది.

1979లో సౌదీలో కొంత మార్పు వచ్చింది. నవీకరణ దిశలో పయనించబోతున్నదనిపించింది. కార్మెన్ భర్త ప్రోత్సాహంతో బయట నుంచి వచ్చిన డిప్లొమాట్స్, వ్యాపార ఉద్యోగ రంగ పెద్దలకు పార్టీలు ఇచ్చింది. ఆమె ఆశ ఎంతో కాలం నిలువలేదు. ఇరాన్ లో షా ను బహిష్కరణ చేసిన విప్లవం వల్ల మతాచారుల పరిపాలన వచ్చింది. వాటి ఫలితంగా సౌదీలో కూడా విప్లవ ధోరణి బయటపడగా, సౌదీ రాజులు భయపడి ఇస్లామ్ ఉక్కుపాద ధోరణి అమలు పరచి, సౌదీని మధ్యయుగాల సంస్కృతి వైపుకు మరలించారు. ఆ తిరోగమనం చూసి కార్మెన్ నిరాశ చెందింది.

కార్మెన్ భర్తలో కూడా భయాలు, మార్పులూ కనిపించసాగాయి. ఎప్పుడూ ఎదో అనారోగ్యమంటూ దేశవిదేశాల డాక్టర్లను సంప్రదిస్తుండేవాడు. దేనికో భయపడుతున్నట్లు మనో బలహీనతకు గురయ్యాడు. ఆమె మూడవసారి గర్భం ధరిస్తే తనకిష్టం లేదని అబార్షన్ చేయించాడు. జెనీవాలో కొడుకుపుడ తాడేమోనన్న ఆశ అలా భగ్నమైంది.

యెస్లామ్ వింతగా ప్రవర్తించడం సాగించేవాడు. సౌదీలో ఆమెకు కొంత స్వేచ్ఛ ఇచ్చినా, జెనీవాలో వున్నప్పుడు టిపికల్ సౌదీలా ప్రవర్తించేవాడు. పిల్లల వేషభాషలను తప్పు పట్టేవాడు.

సౌదీలో వుండే తన పిల్లలు సున్తీ అనే దురాచారానికి గురికావాలేమో అని, నల్లటి ముసుగు జీవితం వారి స్వేచ్ఛను హరిస్తుందని ఆమె భయపడసాగింది. తన పిల్లలకు ఆడ, మగ, సమానమనే ధోరణి అలవాటు చేసింది. వారిని సమానత్వం, స్వేచ్ఛ, సహనం అనే మూడు విలువలతో పెంచాలనుకున్నది. పిల్లలకు సంగీతం, నృత్యం ఇష్టమైన సౌదీలో అవి తప్పు. బయట దేశాల కెళ్ళినప్పుడు పుస్తకాలు, మ్యూజిక్ సీడీలు, మంచి బట్టలు విపరీతంగా కొని తెస్తుండేది. బిన్ లాడెన్ కుటుంబీకుల సామాను ప్రయాణాలలో చెక్ చేయడం వుండేదికాదు. పిల్లల పుట్టిన రోజులు జరపడం, క్రిస్మస్ వేడుకలు చేయడం బిన్ లాడెన్ కుటుంబంలో వింతగా భావించావారు. విదేశీ కోడలు ‘నరకానికి పోతుంది’ అన్నట్లుగా తనను చూచేవారు. మగపిల్లలు, ఆడపిల్లలు పార్టీ సందర్భంగా కలవడం వారికి ఇష్టం వుండేది కాదు.

మరో భయం కార్మెన్.ను వెంటాడసాగింది. తనకిద్దరూ ఆడపిల్లలే. దురదృష్టవశాత్తు యెస్లామ్ కి ఏమైనా జరిగి చనిపోతే తను, పిల్లలు ఒసామా బిన్ లాడెన్ వంటి వారి అధీనంలో వుండవలసిన దుస్థితి వస్తే తన పిల్లలకు ఆ జీవితం ఎంత నరకప్రాయమవుతుందో అని ఆమె భయపడింది.

1987లో శెలవులకు జెనీవా వచ్చి వారి సొంత ఇంట్లో ఉన్నారు. ఆనందంగా గడుస్తున్నది. యెస్లామ్ ప్రవర్తనలో చెప్పలేని మార్పు గమనించిందామె. అతను తాను అనుకున్నదే జరగాలనే ధోరణిలో ఉన్నాడు. ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తున్నది. ‘నాజియా’ను కనడానికి జెనీవాలో ఆసుపత్రిలో చేరి యెస్లామ్ కు ఫోన్ చేస్తుంది. ‘నేను రెండ్రోజుల్లో వస్తాను. అప్పటి దాకా ఆగలేవా’ అంటాడు. అప్పుడు నవ్వుకున్నది. కానీ ఇప్పుడు అర్థమవుతున్నది – అతనన్నీ తనకు కావలసినట్లే చేస్తున్నాడని, అతను తనను, పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. శెలవులైపోయినా తనను, పిల్లలను సౌదీకి తీసుకెళ్ళే ఏర్పాట్లు చేయలేదు. బడులు తెరిచే సమయం. తాత్కాలికంగా జెనీవా ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తుంది వఫా, నాజియాలను. ఆ స్కూల్ స్వేచ్ఛా వాతావరణం, కంప్యూటర్ లాబ్స్, లాంగ్వేజ్ లాబ్స్, సైన్సు బోధన, సంగీతం, నృత్యం నటన వంటి బోధనేతర విద్యా ప్రణాళిక ఆ పిల్లలకెంతో నచ్చింది. త్వరలోనే చదువులో సామర్థ్యం చూపసాగారు. కార్మెన్ కు భయమేసింది. ఈసారి సౌదీ వెళితే పిల్లలకు అక్కడి జీవితానికి, ఇక్కడి జీవితానికి తేడా తెలుస్తుంది. వారు ఇబ్బంది పడతారేమో అని ఆందోళన చెందసాగింది.

కార్మెన్ మరల గర్భం దాలుస్తుంది. లోగడ వలనే అబార్షన్ చేయించు కోమంటాడు భర్త. అప్పటికే యెస్లామ్, యువరాజులొచ్చారు, వ్యాపారవేత్తలను కలుస్తున్నానంటూ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. అతను అబద్ధాలు చెబుతున్నాడని, పరస్త్రీలతో తిరుగుతున్నాడని కార్మెన్ తెలుసుకుంది. నిలదీసింది. బుకాయించబోయాడు. కానీ తప్పించుకోలేడు. ఈ స్థితిలో ‘కార్మెన్ బిడ్డను కని పెంచుకుంటాను, ఈసారి కిరాతకంగా చంపుకోను’ అని నిక్కచ్చిగా చెబుతుంది. భార్యలో విప్లవ ధోరణి యెస్లామ్ సహించలేదు. జనవరి 1, 1988న ఆమెను, పిల్లలను వదలి సౌదీ వెళ్ళిపోతాడు.

1994 దాకా విడాకుల కేసు స్విస్ కోర్టులో నడుస్తుంది. అతను సౌదీకి కేసు మర్చాలంటాడు. అక్కడికెళితే ఆమె, ఆమె పిల్లల గతి ఏమవుతుందో ఎరిగిన కార్మెన్ ఒప్పుకోదు. యెస్లామ్ ఆమెమీద అభియోగాలు మోపాడు. పుట్టిన మూడవ పాప ‘నూర్’కు తను తండ్రిని కాదని సవాలు చేసాడు. డి.ఎన్.ఎ. టెస్టులో అతనే తండ్రి అని తేలింది. అనంతమైన తన ఆస్తి వివరాలు దాచి, ఆమెకు అతి తక్కువ భరణం వచ్చేలా చేస్తాడు.

ఏది ఏమైనా కార్మెన్ గట్టిగా నిలబడింది. నూర్ పుట్టుక తనకు ధైర్యాన్నిచ్చిందంటుందామె. స్విస్ కోర్టు పిల్లల కట్టడి కార్మెన్ కిచ్చింది. సౌదీలో ‘బంగారు అక్వేరియంలో చేప జీవితం’ నుండి ఆమె తప్పించుకున్నది. తన బిడ్డలను తప్పించింది. తండ్రి కుటుంబం పేరు బిన్ లాడెన్ అవటాన పిల్లలు ఆ పేరుతో కొనసాగారు. తండ్రి ఎలా చేసినా అతని కుటుంబం పేరు తమ పిల్లలకుండాలనుకుంది. ఇక ఆ కుటుంబంలోని వారెవరూ కార్మెన్ తోనూ, పిల్లలతోనూ సంబంధం కొనసాగించలేదు.

2001 సెప్టెంబర్ 11న అమెరికా మీద దాడులు జరిగాయి అని వినగానే అది ఒసామా బిన్ లాడెన్ పనే అని ఆమె గట్టిగా నమ్మింది. అతడు అంతటి ఛాందసుడని ఆమె సౌదీలో చూసింది. ఇప్పుడు బిన్ లాడెన్ పేరు పిల్లలకు, కార్మెన్.కు శాపంగా ఆమె టీవీలోనూ, ప్రింట్ మీడియాలోనూ తనకు, బిన్ లాడెన్ కుటుంబానికీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటించవలసి వచ్చింది. అమెరికన్ల బాధలో తానూ పాలుపంచుకుంది. పిల్లలు ‘బిన్ లాడెన్ స్టిగ్మా’ తమను వెంటాడుతుందని భయపడుతున్నారు. వాళ్ళు అమెరికాలో చక్కగా చదువుకుంటూ జీవితాల్లో సెటిల్ అవుతున్నారు. యెస్లామ్ బిన్ లాడెన్ కుటుంబీకులు తనను, పిల్లలనూ ఇంకెన్ని ఆరోపణలకూ, బాధలకూ గురిచేస్తారోనని ఆమె శంకిస్తున్నది. అమెరికన్లు తన మనోగతాన్ని, బాధను అర్థం చేసుకుంటున్నారంటుంది కార్మెన్. తనకు అండగా నిలబడినవారందరికీ తన పుస్తకం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నది.

కార్మెన్ సౌదీలో కొన్నేళ్ళు నివసించింది. వారి అంతర్గత విషయాలు బాగా ఆకళింపు చేసుకున్నది. వారి వెనుకబడిన తనం, వారే నిజమైన ఇస్లామీయులు అనే మూఢనమ్మకం, ధనవంతులమనే అహం, విదేశీయులంటే వారికున్న చిన్నచూపు, సౌదీ రాజులు ఇస్లాం వ్యాప్తికి వివిధ దేశాలలో దండిగా డబ్బులు ఖర్చు చేయడం, వారి క్రూరత్వం, సౌదీ స్త్రీల అధోగతి కార్మెన్ గమనించిన సత్యాలు.

6 comments:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

Informative Post.Thank you

శరత్ కాలమ్ said...

ముస్లిం దేశాల్లో స్త్రీల స్థితిగతుల గురించి మంచి అవగాహన వచ్చింది. ధన్యవాదాలు.

సౌదీ అరేబియాలో కూడా విప్లవం వస్తే బావుండును కానీ పెట్రోల్ ధరలు మండిపోతాయేమో. అసలే అంతంతగా వున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఇంకా కుదేలవుతుంది.

భాను said...

good post

Phani Pradeep said...

చాలా బాగా రాశారు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Really pitiable.

Atheist said...

Thank you for letting us know all this! :)

-Sharath Chandra Chowdary Bellamkonda

Post a Comment