గోరాశాస్త్రి-తెలుగు స్వతంత్ర

Gora Sastry(Govindu Rama Sastry)సంపాదకీయం కాదు (గోరాశాస్త్రి)
‘మేధావి’ మొదలు ఆమెరికా తొత్తు వరకు అనేక భూషణ దూషణాదులకు గురై, ఒడిదుడుకుల జీవితాన్ని 50 పడిలోకి లాగిన గోరాశాస్త్రి పరిణామం విచిత్రమైనది. ఒరిస్సా కోరాపుట్టి జిల్లాలోని తోరామాళ్ గ్రామంలో సుందరి, నరసింహం దంపతులకు 1919 అక్టోబరు మూడున జన్మించిన గోరాశాస్త్రికి అక్షరాభ్యాసం గావించినది ఒకానొక సాయిబట. ‘అందుకే యిలా వుంది’ అంటారు. గోరాశాస్త్రి విద్యాభ్యాసం బి.ఎ. వరకే సాగినా, ఆ కాస్తా నగరం, రాజమండ్రి, రామచంద్రాపురం, బరంపురం, భద్రాచలం, కాకినాడలలో జరిగింది. ఆయన విద్యార్థిగా, తెలివితేటల్ని చిలిపితనంతో రంగరించి కొనసాగించిన ఘట్టాలనేకం.(దశరథ మహారాజు ఎన్నేళ్ళు పాలించెను? అన్న పంతులు ప్రశ్నకు ‘చచ్చేంతవరకు’ అని శాస్త్రిగారి సమాధానానికి నువ్వురా’ అని శ్లాఘింపచేసుకున్నారు చిన్నతనంలోనే.)చివరకది పెద్దాడ రామస్వామిగారి హయాంలో అసంపూర్తిగా ఆగిపోయింది.జీవితంలో ప్రవేశించిన శాస్త్రిగారు జర్నలిజంలోకి రాకపూర్వం చేసిన ఉద్యోగాలెన్ని! చూడండి వరస: బొంబాయిలో సినిమా స్టూడియో మేస్త్రీ; ఒకానొక మద్రాసు కంపెనీకి ఆంధ్రలో అమ్మకందారు; ఆంగ్లో-ఇండియన్ లకు విజయవాడలో తెలుగు బోధన; (ఎండలకు తాళలేక మానేసిన వుద్యోగమిది) సహకార స్టోర్సు గుమాస్తా, వ్యాపారస్తుల దళారి; రాజమండ్రిలో ప్లాట్ ఫారంపై చిల్లర మల్లర పుస్తకాల అమ్మకం; రాజమహేంద్రవరంలోనే ఒక ట్యుటోరియలం కళాశాలలో ట్యూటర్; ఏలూరులో బియ్యం వ్యాపారం (కొనటానికి వచ్చిన మనుషులు నచ్చకపోతే అమ్మేవారు కాదట!), రెండవ ప్రపంచ యుద్ధకాలంలో విశాఖపట్టణంలో దాడులు గురించిన హెచ్చరిక పని; కొన్నాళ్ళు నౌకాదళంలో స్టోర్ హౌస్ మాన్; ఖుర్దారోడ్ లో రైల్వే రిలీవింగ్ గుమాస్తా.జీవితాన్ని కాచి వడపోయటానికి యింతకన్నా మరేమి చెయ్యాలి? ఆ అనుభవాలెంతకావు!1945 డిసెంబరు గోరాశాస్త్రి జీవితంలో పెద్ద మలుపు. ‘ఆనందవాణి’ పత్రికా సంపాదకులు ఉప్పులూరి కాళిదాసు అప్పటికే గోరాశాస్త్రి రచనలు తమ పత్రికలో ప్రచురించటం, యింకా చెంచూరి నాగేశ్వరరావుగారి ‘కథానిక’ ఆంధ్రపత్రిక, దీపిక, నవశక్తి, శ్రమజీవి పత్రికలలో కథలు ప్రచురితం గావటం, ఆంగ్లంలో రచనలు సాగించటం కద్దు. కారణాంతరాలచే ఖుర్దా రోడ్డు స్టేషన్ కు వచ్చి గోరాశాస్త్రిని కలిసిన ఉప్పులూరి కాళిదాసుగారే, వుత్తరోత్తరా స్వతంత్రంలో శాస్త్రిగారు చేరటానికి కారకులయ్యారు. శాస్త్రిగారి ఆంగ్ల రచనల వాసనలు ఖాసా సుబ్బారావుగారికి చవిచూపి, శాస్త్రిగారిని తంతి ద్వారా పిలిపించి, స్వతంత్రలో చేర్పించటానికి కాళిదాసుగారే నిమిత్త మాత్రులు. అంతటితో శాస్త్రిగారి చిల్లర మల్లర ఉద్యోగాల జీవనం జర్నలిజంలో స్థిరపడింది.అప్పటికే శాస్త్రిగారికి వివాహమైంది. తర్వాత వారికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం.మంతెనవారి పాలెం, కొత్తపట్టణాలలో జరిగిన రాజకీయ పాఠశాలలకు వెళ్ళి, పాల్గొని రాజకీయ అనుభవాన్ని గడించారు.మొత్తంమీద మద్రాసు ప్రవేశం శాస్త్రిగారి జీవితంలో ఉచ్ఛదశ, మద్రాసులో ఒక దశాబ్దంపాటు తన ప్రతిభా వ్యత్పన్నతను, సృజనాత్మక శక్తిని, యితరేతర శక్తులను వెల్లడించటానికి, అవన్నీ పరాకాష్ఠ అందుకోటానికి గోరాశాస్త్రిగారికి ఒక ప్రక్క ఆకాశవాణి, యింకోవిధంగా స్వతంత్ర చక్కని అవకాశాన్ని కల్పించాయి. శాస్త్రిగారిచే పుంఖాను పుంఖంగా శ్రవ్య నాటికలు రాయించటానికి నాంది పలికిన వారు బాలాంత్రపు రజనీకాంతరావుగారు. ఆ కృషి కొనసాగించినవారు జనమంచి రామకృష్ణగారు.1945లో ఆంగ్ల స్వతంత్రలో ప్రవేశించిన శాస్త్రిగారు మూడేళ్ళు తిరగక మునుపే తెలుగు స్వతంత్రకూడా ప్రారంభించారు. ఆనందవాణిలో వ్రాస్తున్న ‘వినాయకుడి వీణ’ శీర్షిక ‘తెలుగు స్వతంత్ర’కు మారింది. తనతోపాటు చుట్టూ ఉన్నవారిలో వెలుగు ప్రసరింపజేసే సాధనంగా తెలుగు స్వతంత్ర ఉపకరించింది. ఎక్కడ ప్రతిభ వుంటే అక్కడికి వెళ్ళి ఏదో విధంగా తృణమో, పణమో ముట్టచెప్పో చెప్పలేకో ఎలాగైతేనేమి వందలాది కొత్త రచయితలను ముఖ్యంగా స్త్రీలను – తెలుగు స్వతంత్ర ఆంధ్రులకు పరిచయం చేయటానికి కారకులు గోరాశాస్త్రిగారే. ఈ విషయంలో గోరాశాస్త్రిగారిని గురించి అందరికీ ఏకాభిప్రాయమే.శాస్త్రిగారి మద్రాసు జీవితాన్ని గురించి వాస్తవమైన వదంతి గలదు. ఆయన మనస్సు తృతీయ పురుషార్థమునకే సమర్పించాడనీ, శాస్త్రిగారి పక్షాన వకాల్తా పుచ్చుకుని నేను చెప్పదలచిన మాటలివి. వనిత తనంత వలచివచ్చిన కాదనుటకు ఆయనేమి ప్రవరాఖ్యుడా? మోసగించుటకు మాయా ప్రవరాఖ్యుడా? కాగా కేవలం గోరాశాస్త్రివలె ప్రవర్తించాడు. దోషం ఏదైనా వుంటే అవతల పక్షంవారిదే గాని గోరాశాస్త్రిగారికి అఘపఁకమంటదని నా వాదన.ఖాసా సుబ్బారావుగారు ‘స్వతంత్ర’నుండి ‘స్వరాజ్య’కు పోయారు. ‘తెలుగు స్వతంత్ర’ హెచ్.జి.రాజా ఆధ్వర్యాన, గోరాశాస్త్రి సంపాదకత్వాన సాగింది. 1957 ఉగాది కానుకగా తెలుగు స్వతంత్ర దివాలా తీసినదని గోరాశాస్త్రిగారికి వార్త వచ్చింది. అప్పటికే గోరాశాస్త్రిగారికి ఫ్లూరసీ వచ్చింది. డా.పి.శ్రీదేవిగారి బలవంతంపై మద్రాసు నుండి సికిందరాబాద్ మార్చి ‘తెలుగు స్వతంత్ర’లో తెలుగు తీసేసి ప్రారంభించారు. కూడబెట్టిన కొద్ది విత్తము హరించగా, పరిస్థితులు ప్రతికూలించగా, రావలసిన బకాయిలు యెగచేపగా ‘స్వతంత్ర’ అదృశ్యాకారమైంది.శాస్త్రిగారు తాత్కాలికంగా ‘ఆంధ్రప్రభ’ దినపత్రికకు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తూ, ‘ఆంధ్రభూమి’ సంపాదకుడుగా రమ్మనమన్న ఆహ్వానంతో దినపత్రిక సంపాదకులయ్యారు. ఇది పై పైన తడమగా తెలిసిన జీవితగాథ. అంతరలోకంలో ఆసక్తికరమైన విశేషములు అనంతంగా వున్నయ్. అవి మరొక సమయంలో ముచ్చటించవచ్చును.కాని ఒక్క ప్రశ్న మిగిలేవున్నది. శాస్త్రిగారి వ్యక్తిత్వ సారాంశం యేమిటన్నదే ఆ ప్రశ్న. భిన్న కోణాలలో యెవరి అభిప్రాయాన్ని వారు వెల్లడిస్తున్నారు.యజ్ఞోపవీతం చిన్నతనంలోనే తీసేసినందుకు, సహపంక్తి భోజనాలు చేస్తున్నందుకు భ్రష్టుడన్నారు, కొందరు కులాభిమానులు నాస్తికుడన్నారు. కమ్యూనిస్టులు ఆయన్ను అమెరికా తొత్తు అన్నారు. ఒకానొక స్వతంత్ర నాయకుడు కమ్యూనిస్టుగా శాస్త్రిని భావించి వుద్యోగం తీసెయ్యమని యజమానులకు సిఫారసు చేశాడు. జనసంఘ్ వారు తమ పార్టీ సానుభూతిపరుడేనని ఆయన సంపాదకీయాన్ని ఎన్నికల్లో కరపత్రంగా వేసి పంచారు. ఆ తర్వాత జనసంఘాన్ని ఘాటుగా విమర్శిస్తూ వచ్చిన సంపాదకీయాలు సరేసరి... ఏదోఒక మూసలో పోసి చూసే తత్వంతో గోరాశాస్త్రి యిమడడు. మానవ విలువలు మినహా, దేన్నీ మూర్ఖంగా అంటిపెట్టుకొనిగాని, అయినదానికీ కానిదానికీ వ్యతిరేకిగానూ లేడు. బహుశా Anti కి Anti యేమో! ఆయన దిన పత్రికకు సంపాదకుడుగా పనికిరాడన్న ‘శ్రీ’ లేకపోలేదు. కాని ఆయన సంపాదకత్వాన ‘ఆంధ్రభూమి’ రాజధానిలో ప్రథమ శ్రేణి పత్రిక అయింది మరి. అయితే తాను అగ్రశ్రేణి సంపాదకుడిననిగాని, తాను లేకుంటే ఆంధ్ర జర్నలిజం లేదని గాని శాస్త్రిగారు భావించకపోగా, ‘యీ జీతానికి పిండి రుబ్బమన్నా అభ్యంతరం లేదు అవకాశం యిచ్చేవాళ్ళుంటే’ అంటారు శాస్త్రిగారు. మీ సంపాదకీయం అసహ్యంగా వున్నదంటే, ‘రోజూ అట్లుపోసే ముసలమ్మకు సైతం కొన్ని చిదేస్తయి. రోజూ సంపాదకీయం ప్రత్యక్షర రమ్యతతో వ్రాయాలంటే సాధ్యమా? ఏవో నెలకు మూడు బాగా రాయగలమంతే’ అని సమాధానం. సంపాదకీయాన్ని విమర్శిస్తూ వచ్చిన లేఖలను ప్రచురించే సత్సంప్రదాయాన్ని నాటి నుండి నేటి వరకు గోరాశాస్త్రి నిలబెడుతూనే వున్నారు. తనను విమర్శించే వారందరినీ విరోధులుగా చూసే విలక్షణమూ ఆయనలో లేదు. వ్యక్తిగతంగా చూస్తే సాధారణ మోతాదులో – శాస్త్రిగారిలోనూ వున్నయ్. కాని కలంపడితే ఎవరినైనా నిష్పాక్షికంగా చూడగల సామర్థ్యత ఆచరణలో వున్నదాయనకు. అదెంతగాదు!మానసికారోగ్యాన్ని నిలబెట్టుకోటానికి శారిరకంగా క్షీణించిపోవటం అవసరమైతే అందుకు శాస్త్రిగారు సిద్ధం. ఇటీవల ఆందోళనల్లో 25 మంది విద్యార్థులనబడేవారు రాత్రి 9 గంటలకు శాస్త్రిగారిని యింట్లో ‘ఘెరావ్’ చేసి తమ వార్త 6వ పేజీలో యెందుకు వేశారని అడిగితే, ‘యేడవ పేజీలో లేదుగనక’ అని ప్రశాంతంగా గంభీరంగా సమాధానం చెప్పి నిలబడగలిగిన సంపాదకుడు గోరాశాస్త్రి. దినపత్రికలు రాజకీయాల్లో నాయకత్వం వహించాలని ఆయన నమ్మలేదు. స్వస్వరూప జ్ఞానం వున్న వ్యక్తి గనుక సంపాదకీయపు విలువ తూచి చూచాడు.‘దినపత్రిక బ్రతుకు అర్థగంట. ఆ తర్వాత పకోడీ పొట్లాలకే పనికొస్తుంది. కనుక సమయ జ్ఞానం అవసరం’ అంటారు శాస్త్రిగారు. సంపాదకీయాల్లో ఎత్తుగడ, ‘దింపుగడ’ల ప్రస్తావనకాక, ఎంతటి సంక్షోభంలోనైనా తన సహజ లక్షణాలైన హాస్యోక్తి, వ్యంగ్యం, పదాల ఔచిత్యం చూసుకుంటారు. సంపాదకీయాలు చదివేవారెందరో, తర్వాత ప్రభావితులయ్యేవారెవరో ఆయనకు ముంజేతి కంకణమే. దినపత్రిక అంటే సంపాదకీయమే కాదనేది స్పష్టంగా తలకెక్కించుకున్న సంపాదకుడు. మరి జర్నలిజంలోకి ఎందుకు వచ్చారంటే ‘బ్రతుకుదెరువు కోసమేగాదు, బుద్ధితక్కువైకూడా’ అంటారాయన.లోకాన్ని కొన్ని మారులు వంగి కాళ్ళ సందులోంచి చూస్తాడని శాస్త్రిగారిని ఎవరో అన్నారట. ఔను. ఫలితంగా ఆయనకు మిత్రులకంటె శత్రువులు, తటస్థులే జాస్తి. వారి సంఖ్యను బహుళంగా పెంచటంలో శాస్త్రిగారు యథాశక్తి కృషిచేశారు. చేస్తున్నారు. ఆయన మిత్రులను వేళ్ళపై లెక్కింపవచ్చు. అభినందించేవారంతా మిత్రులు కాజాలరు గదా!నాతో మాట్లాడటవే ఎడ్యుకేషన్ అని గిరీశం చెప్పిన మాటలు నేను గోరాశాస్త్రిగారికి అన్వయిస్తాను. కాని ఎద్దడి వెంకటేశం పట్లనే!కృతజ్ఞతలుగోరాశాస్త్రిగారికి సన్మానం చెయ్యాలనీ, సంచిక వెయ్యాలనీ తలపెట్టి దీనంతటికీ కారకులై కృషిచేసిన ఖ్యాతి మండవ శ్రీరామమూర్తిగారిది. శాస్త్రిగారు ఆయన్ను అంతగా ఆకర్షించారు మరి. శ్రీరామమూర్తి తలపెట్టిన కృషికి అనన్య సామాన్యంగా సహాయపడినవారు ఉపద్రష్ట శ్రీధరరావు, సి.ధర్మారావుగారలు, కోనేరు కుటుంబరావుగారు యీ కృషిలో వంతపాడారు. వీరందరికీ నేను చెప్పే కృతజ్ఞతలు చాలవని తెలిసినా చేసేదిలేదు. తెరవెనుక సహాయపడిన యింకా అనేకమందికి, సంచిక ముఖచిత్రం వేసి తోడ్పడిన శీలా వీర్రాజుగారికి మన్ననలు.- ఎన్. ఇన్నయ్య


1969

No comments:

Post a Comment