బండారు రత్న సభాపతి

Ratnasabhapathi with his wife
ప్రతిపక్షం నుండి పదవిలోకి పయనించిన




శ్రీ రత్నసభాపతి

బండారు రత్న సభాపతి సోషలిస్త్ గా ప్రారంభించి ,శాసన సబ్యుడుగా,మంత్రిగా, భూమి తనఖ బాన్ అధ్యఖుడుగా ,గ్రంధాలయ సంఘ ప్రెసిడెంట్ గా పదవులు నిర్వహించారు .1990లో కిద్ని వైఫల్యం తో మాట పడి పోయి మరణించారు .మంచి వక్త, చక్కని రచయిర.అధికార ప్రతిపక్షాలలో

రాణించారు




శ్రీ రత్న సభాపతి ఆంధ్రప్రదేశ్ సహకార భూమి తనఖా కేంద్ర బాంకుకు అధ్యక్షస్థానంలో నియమితులై ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ పదవిలో ఆయన్ను చూచిన సన్నిహిత మిత్రుడొక ఉత్తరం వ్రాస్తూ యిలా వ్యాఖ్యానించాడట – “చైనాలో పూర్వం ఒక బంగారు పిట్ట ఉండేది. దాని కంఠస్వరం వర్ణనాతీతంగా ఉండేది. అందువలన చైనావారు ఆ పిట్టను ఒక పంజరంలో అట్టిపెట్టారు” ఈ అభిప్రాయం ఎలావున్నా, కొంచెం పూర్వాపరాలు తెలుసుకోనిదే ఎవర్ని గురించీ అంచనా వేయలేం. ఆ దృష్టితో ఒక్కసారి రత్నసభాపతి గత జీవితచరిత్రను ప్రస్తావించక తప్పదు.



బాల్యము



బండారు రత్నసభాపతి కడప జిల్లాకు చెందిన రాజంపేట నియోజకవర్గంలోని ఎల్లంపేట గ్రామస్థులు. ప్రకృతి సౌందర్యం బాగా ఆనందించగలవారు. ఎల్లంపేటలో హాయిగా కాలక్షేపం చేయగలరు. ఒక ఏడాది క్రితం వరకు కరెంటు కూడా లేని ఎల్లం పేటకు నేటికీ మంచి రోడ్డు లేదు. ఒంటిమిట్ట నుండి బస్సులు ఊళ్లోకి వెడతాయి. మట్టిరోడ్డు ఆధారంగానే. చెయ్యేరు – గుంజన ఏర్లు కలిసిన ఒక నది - చిన్నదే. ఎల్లంపేట పక్కగా ప్రవహిస్తుంది. కనుక వూరికి నీటి సౌకర్యం వున్నది. మెట్ట మాగాణి పంటలు, మామిడి, బత్తాయితోటలు ఆ వూరి సౌభాగ్యాలు. ఊరిలో బలిజ, కమ్మ కులాలు ప్రధానమైనవి.



రత్నసభాపతి బలిజ కులానికి చెందిన వారు. సెట్టి బలిజలు, గాజుల బలిజలు, రాజ మహేంద్రవరం బలిజలని మూడు తెగలున్నవి. అందులో సభాపతి మొదటి తెగకు చెందినవారు. బలిజలు వ్యవసాయానికి, రత్నాల వర్తకానికేకాక ఉపాధ్యాయవృత్తికీ – యీ జిల్లాలో పేరుమోసినవారు. అందులో రత్నసభాపతి మొదటి కోవకు చెందిన కుటుంబీకులు. ఆయన చిన్నతనంలో వాళ్ళయింట బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట. మణుగు బంగారం వాళ్ళ తండ్రిగారి వాటాగా ఉండేదట. అట్లాంటి సంపన్న కుటుంబంలో జన్మించిన రత్న సభాపతి మరొక ఆరుగురు తోబుట్టువులతో ఆ సంపదను హారతి కర్పూరంచేశారు. నేడుతండ్రీలేడు. ఆ బంగారమూ లేదు. పొలాలు, తోటలు మాత్రం మిగిలాయి. వ్యవసాయంలో రత్న సభాపతికి శ్రద్ధ, ఆసక్తి మిక్కుటముగా వున్నవి.



రత్నసభాపతి ఇంటర్మీడియేట్ అనంతపురంలోనూ, బి.ఎ. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోనూ చదివారు. బి.ఎ. చదువుతుండగా రాజకీయాలలో ఆసక్తి కలిగి, అందులోకి ప్రవేశించారు. పి.వి.జి. రాజు ఆయనకు చదువుల్లో సహాధ్యాయి. మధ్యలో మద్రాసు వదలి కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోయారు రాజుగారు. రత్న సభాపతి బి.ఎ.తో చదువుకు స్వస్తి చెప్పారు. అప్పటికి యింకా కంఠశోషగానే ఉన్నాయి సోషలిస్టు రాజకీయాలు. సోషలిస్టు రాజకీయాలు వారిని ఆకర్షించాయి. కళాశాలలోని ఒక ఆర్థిక శాస్త్రాచార్యులు (కల్లుకరన్) రత్నసభాపతికి సిద్ధాంతపరమైన రాజకీయాల్లో ఆసక్తిని కలిగించారు. అప్పటికీ యిప్పటికీ ఆయన్ను తలుస్తూ, పుస్తక పఠనాసక్తిని పోనివ్వకుండా పట్టుకొస్తున్నారు. నెహ్రూ, ఎం.ఎన్.రాయ్, జయప్రకాశ్ రచనలతో ప్రభావితుడైనాడు. 1948 జనవరి 1న కాంగ్రెసు నుండి సోషలిస్టు వేరుబడి కాపురం పెట్టినప్పుడు, అందులో చేరారు రత్నసభాపతి.



సోషలిస్టు సభాపతి



ప్రధానంగా జిల్లాస్థాయి పార్టీలోనూ కొంతవరకు రాష్ట్రస్థాయి పార్టీలోనూ ప్రముఖపాత్ర వహిస్తూ, సోషలిస్టు కార్యకర్తగా అనుభవాల్ని సంతరించుకుంటూ వచ్చారు. తినటానికి, తిరగటానికి లోపంలేని ఆస్తిపాస్తులు వున్నవి. అయినా (అప్పుడు సోషలిస్టు సిద్ధాంతమే ప్రధానాశయం) 1954లో కర్నూలు జిల్లా కరివెది గ్రామం నుండి ఈనాందారీ సత్యాగ్రహం తలపెట్టి సోషలిస్టు జైలుపాలౌతున్నప్పుడు, రత్నసభాపతి ముమ్మరంగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. కార్యకర్తల్ని సంఘటితపరచి, ఆ వుద్యమానికి జీవనాడి అయ్యారు.



సోషలిస్టు పార్టీ అఖిల భారత సమావేశాలన్నిటిలో పాల్గొంటూ, పరిచయాలను, అనుభవాల్ని పెంచుకున్నారుకాని తృప్తిలేదు. పార్టీలో డాక్టర్ లోహియాతో సన్నిహితంగా వుండేవారు.



సరిగ్గా ఆ సమయంలోనే భూదానోద్యమాన్ని పురస్కరించుకొని, వినోబాభావే కడప జిల్లా పర్యటన చేస్తున్నారు. రత్నసభాపతి వారిని ఇంటర్వ్యూ అడిగారు. ఒక్క ప్రశ్నకే అవకాశం ఇస్తామని వినోబాభావే అన్నారట అప్పుడే ఉపన్యాసం ముగించి. ఉపన్యాసంలో ‘మంచి’ ప్రభుత్వం కావాలని నొక్కి వక్కాణించారట భావేగారు రత్నసభాపతి తన ఒక్క ప్రశ్నను అడుగుతూ, “మంచితనాన్ని ఎట్లా నిర్వచిస్తారు గడ్డం పొడవునుబట్టా, తెల్లబడిన వెంట్రుకను బట్టా’’ అనిఅడిగారట. వినోబాకు ఆగ్రం వచ్చి ఉండాలి. ఆ ఇంటర్వ్వూ కాస్తా రద్దు. యీ వుదంతం ఆచార్య జయప్రకాశ్ కు ఉత్తరం వ్రాశారట బావే. జయప్రకాశ్ ఈ విషయాన్ని లోహియాకు వ్రాస్తూ, సభాపతితో మాట్లాడమన్నారట. తరువాత హైదరాబాద్ వచ్చినప్పుడు లోహియా పరామర్శించి, జయప్రకాశ్ తో చర్చించమన్నారట. కానీ ఆ చర్చల ఫలితంగా సభాపతి ఏమీ మారలేదు. జయప్రకాశ్ గోరుముద్దలు కలిపి నోట్లో పెడతాడు. ఆలోచనకు తావులేదు. కాని డా. లోహియా సమస్యను లేవనెత్తి, కొంత దూరం తీసుకువెళ్ళి, ఆలోచనకు వదిలేస్తాడు. అదీ వారిద్దరిలో ప్రధానమైన తేడా అంటారు రత్నసభాపతి., ప్రైవేట్.గా, జయప్రకాశ్.ను ‘రాజకీయ నపుంసకుడని’ లోహియా అనేవాడట. గత నలుబది సంవత్సరాల రాజకీయరంగములో జయప్రకాశ్ వహించిన పాత్రను పరిశీలించిన వారికి డా.లోహియా అన్నమాట సత్యానికి దూరం కాదంటాడు సభాపతి. జయప్రకాశ్.తోపాటు పర్యటించి, ఆయన కార్యక్రమాలు రాయలసీమలో ఏర్పాటు చేసి, సోషలిస్టు పార్టీ ప్రచారం చేసిన అనంతరం రత్నసభాపతికి కలిగిన అభిప్రాయలివి.



సోషలిస్టు పార్టీ చీలిపోయినప్పుడు రత్నసభాపతి సహజంగానే లోహియాకు చేరవయ్యారు. హైదరాబాద్.లో ‘మేన్ కైండ్’ పత్రికలో రచనలు ప్రచురించారు. లోహియాతో కలిసి కూర్చుని సుదీర్ఘ చర్చలు చేసేవారు. ఆ మధురస్మృతుల్ని రత్నసభాపతి నేటికీ స్ఫురణకు తెచ్చుకుంటూనే ఉంటారు. మొత్తం మీద లోహియా ప్రభావం ఆయనపై ఎక్కువగానే ఉన్నదని చెప్పాలి. లోహియాకు కూడా రత్నసభాపతి ఎంతో నచ్చాడనటానికి ఒక్క మాటేచాలు. ‘రత్నసభాపతి కాంగ్రెసులో చేరాడని విన్న తరువాత నాకు మానవులపై నమ్మకం సడలింది’ అని లోహియా మాన్ కైండ్.లో వ్రాశాడు..



1955లో ఆంధ్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పి.ఎస్.పి. అభ్యర్థిగా బద్వేల్ నుండి మొత్తం పోలైన ఓట్లలో 64.36% ఆధిక్యతతో రత్నసభాపతి నెగ్గారు. శాసనసభలో ప్రవేశించారు. ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఆ తరువాత కొద్దికాలమే ఉన్నది. 1956 నుండి రంగం హైదరాబాద్.కు మారింది. శాసనసభలో తమ పక్షపు నాయకుడుగా రత్నసభాపతి, ఉపనాయకుడుగా రాజమల్లు వుండేవారు. అది సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం! అంతా నల్లేరుపై బండివలెసాగేది. అసెంబ్లీ ఎలక్షన్.లో వోడిపోయిన అనంతరం జె.వి.నరసింగారావును విద్యుత్ బోర్డు ఛైర్మన్.గా నియమించారు. ఆయనపై రత్నసభాపతి విరుచుకుపడి, “అవినీతి చర్యల ద్వారా కాజేసిన వాటాలో జె.వి. నీ భాగమెంత” పదవియిచ్చిన సంజీవరెడ్డి భాగమెంత.. ఆట్టేకాలం తిరగకముందే, సోషలిస్టు ప్రముఖులైన పి.వి.జి.రాజును, రత్నసభాపతిని కాంగ్రెస్.లోకి ఆహ్వానించారు. అఖిలభారత స్థాయిలో సోషలిస్టు పక్షం చీలిపోయిన తరువాత, ఆంధ్రలో పి.వి.జి. లోహియాతో తగాదాపడి సోషలిస్టు డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆ తరువాత జరిగిన కథయిది. అంటే 1959లోనన్నమాట. అప్పుడు లోహియాకు స్వస్తిపలికిన సభాపతి, సోషలిజానికి విడాకులు యిచ్చి పి.వి.జి. వర్గంతో సంజీవరెడ్డిగారి కాంగ్రెసులో చేరారు. సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ‘కులాన్ని’ కట్టుదిట్టం చేశాడని రత్న సభాపతి అభిప్రాయం.



1962 సాధారణ ఎన్నికలలో రత్న సభాపతి కాంగ్రెసు అభ్యర్థిగా నిలబడి శ్రీ చిదానందంగారితో పోటీచేసి వోడిపోయారు. కాని సంవత్సరం తిరగకముందే చిదానందం కీర్తి శేషులుగావటం, బద్వేలులో ఉప ఎన్నిక రావడం తటస్థించింది. మళ్ళీ కాంగ్రెసు సీటు యివ్వమని రత్నసభాపతి కోరారు. సంజీవరెడ్డి సుముఖత చూపినా, బసిరెడ్డిగారు తెచ్చిన వత్తిడి వలన సంజీవయ్యగారు ససేమిరా యివ్వకూడదన్నారు. జిల్లాలో రెడ్డి, యాంటిరెడ్డి రాజకీయాలు యిందుకు ప్రధాన కారణం. మొత్తం మీద రత్నసభాపతికి సీటు రానేలేదు. 1963 నుండి 1967 ఎన్నికలవరకు రత్నసభాపతి రాజకీయరంగం నుండి తాత్కాలికంగా నిష్క్రమించి, వూళ్ళో వ్యవసాయం, చూసుకున్నారు.



1965లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటినుండి రత్నసభాపతి రాజంపేట నియోజకవర్గానికి అంటిపెట్టుకున్నారు. ఏమి మాట్లాడినా, ఏం చేసినా రత్నసభాపతి తన నియోజకవర్గాన్ని విస్మరించలేదు. అంతేకాదు, అక్కడి పరిస్థితులు ఆయన రాజకీయాల్ని మలచినవి. అందుకే కులప్రసక్తి తీసుకు రాక తప్పదు. పార్టీ మార్పులు ప్రస్తావించకా కుదరదు. ఇది రాజకీయాల్లో నూటికి 99 మందికి వర్తిస్తుందికూడా.



1967 సాధారణ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెసు స్థానానికి రత్నసభాపతి ప్రయత్నించారు. సంజీవరెడ్డి అనుకూలంగానే వున్నారు. కాని అప్పటికే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ చాలా మార్పులు వచ్చాయి. జిల్లా నుండి బసిరెడ్డి మళ్ళీ తీవ్ర వ్యతిరేకత చూపారు. రత్నసభాపతి ఢిల్లీ వెళ్ళి ధేబర్.ను, సంజీవయ్యను కలసినా ప్రయోజనం లేకపోయింది. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా రాజంపేట నుండి నెగ్గిన శ్రీ మారా రెడ్డికి 1967లో స్వతంత్ర పార్టీవారు మళ్ళీ సీటు ఇచ్చారు. కాంగ్రెసును ఎన్నుకున్నారు. రత్న సభాపతిని స్వతంత్రపక్షంగా పార్టీతరఫున నిలబడమని లచ్చన్న కోరినా ఆయన ఇండిపెండెంటుగానే నిలబడ్డారు. స్వతంత్రపార్టీ మద్దత్తు యిచ్చింది. రత్నసభాపతి నెగ్గారు. కాంగ్రెసు నుండి బయటకు పోవద్దనే సంజీవరెడ్డి సలహాను రత్నసభాపతి వినిపించుకోలేదు.



ప్రతిపక్షనాయకుడుగా



1967 నుండీ అసెంబ్లీలో రత్నసభాపతి నిజంగా చరిత్ర సృష్టించారు. బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంపై ధ్వజం ఎత్తారు. సంజీవరెడ్డి కులంవరకే పరిమితమైతే, బ్రహ్మానందరెడ్డి కులానికి అవినీతిని కూడా జోడించారని రత్నసభాపతి సిద్ధాంతం.



తొలిదశలో బ్రహ్మానందరెడ్డి వ్యతిరేకపక్షంవారు కాంగ్రెసులోనే ముసుగులో గుద్దులాట ఆరంభించారు. ఎ.సి.సుబ్బారెడ్డి, జలగం వెంగళరావు, కాజరామనాథం, సుధాకర్, రత్నసభాపతి యిత్యాదులందరూ కలసి జన కాంగ్రెసు స్థాపించారు. దాని నాయకత్వ విషయంలో తగాదాలు పడ్డారు. రత్నసభాపతిని నాయకుడుగా పెట్టాలని ఎ.సి.సుబ్బారెడ్డి, వెంగళరావులు తలచారు. కాని రామనాథం ఎదురు తిరగగా, రాజీపడి రత్నసభాపతిని ఉపనాయకుడుగా ఉంచారు. ఇది వెంగళరావుగారి సలహాపై జరిగింది. వెంగళరావు, రత్నసభాపతిగార్ల స్నేహం పార్టీలతో నిమిత్తం లేకుండా కొనసాగింది. పరస్పర గౌరవం చూపుకున్నారు. నాటికీ నేటికీ అది అట్లానే ఉన్నది. ఇది రాజకీయాలలో గమనార్హమైన విషయం.



జన కాంగ్రెసు, కాజరామనాథం నాయకత్వాన ఏర్పడినా అది ఆట్టేకాలం సాగలేదు. నిజమైన నాయకుడుగా రత్నసభాపతి చలామణి అయ్యారు. కాని పార్టీ సమావేశాల్లో జరిగే నిర్ణయాలు వెంటనే బ్రహ్మానందరెడ్డిగారికి తెలుస్తున్నాయని అనుమానం వచ్చింది. జనకాంగ్రెసు చీలింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లచ్చన్నగారి నాయకత్వాన ఏర్పడింది. స్వతంత్రపార్టీ అందులో ప్రధానమైంది. కాంగ్రెసువారు క్రమంగా చీలిపోగా, రత్నసభాపతి, లచ్చన్నలు చేరువయ్యారు. లచ్చన్న తాత్కాలికంగా ‘అపరలోహియా’గా కన్పించాడు రత్నసభాపతికి. లచ్చన్నగారి ప్రయత్నంతో, ఆయనపైగల గౌరవంతో రత్నసభాపతి స్వతంత్రపార్టీలో చేరాడు. అంతకుముందే ఢిల్లీలో మరణశయ్యపై వున్న లోహియాను చూచివచ్చారు రత్నసభాపతి. లోహియా బ్రతికివుంటే బహుశ మళ్ళీ సోషలిస్టు పార్టీలో చేరేవాడినేమోనంటారు.



1967 నుండి 1972 వరకూ శాసనసభ్యుడుగా రత్నసభాపతి అనేకమంది అవినీతి చర్యల్ని బయటపెట్టారు. చెంచు రామానాయుడు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, ఓ.పుల్లారెడ్డి, డాక్టర్ నాయక్, యింకా అనేక అధికార అనధికారుల గుట్టులు వెల్లడించారు,. కుప్పతెప్పలుగా వచ్చిపడే సమాచారాన్ని జాగ్రత్తగా సమీకరించి, చిత్రికపట్టి, కొన్నిటిని స్వీకరించి, మరికొన్నిటిని త్యజిస్తూ, రత్నసభాపతి అసెంబ్లీలో రికార్డు స్థాపించారు.



1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఆందోళనను సమర్థిస్తూ, వరంగల్లులో ఉపన్యాసాలు చేసి, రాష్ట్రాన్ని చీల్చమని రత్నసభాపతి చెప్పారు.



అట్లాగే 1973లో జరిగిన ప్రత్యేకాంధ్రోద్యమంలోనూ రాష్ట్రాన్ని చీల్చమని అభిప్రాయం వ్యక్తపరచారు. రెండు ఆందోళనలలో ఆయన ధోరణి పొందికగా వున్నది.



1972 ఎన్నికలలో గెలిచిన రత్నసభాపతి స్వయంగా కడపనుండి జీపు నడుపుకుంటూ స్వగ్రామానికి పోతూన్నప్పుడు దారిలో ప్రమాదం సంభవించింది. చికిత్స అనంతరం పునర్జన్మ ఎత్తారు. ఏది చేసినా మేజర్ ఏక్సిడెంటే అని చూడటానికి వచ్చిన కాకానివారు వ్యాఖ్యానించారు. స్వతంత్రపార్టీలో వుండగా రత్నసభాపతి కొత్తవ్యక్తులతో కొత్త కొత్త అనుభవాలు సంతరించుకున్నారు. మసానీకి బాగా సన్నిహితుడయ్యారు. ఇద్దరూ మాజీ సోషలిస్టులు గావటం, మేథాశక్తి సంపన్నులు కావడం వలన కలయికకు ఆధారం లభించింది. అయితే మసానీకి దగ్గర అయ్యేకొద్దీ లచ్చన్నకు (రంగాకు) దూరంగాక తప్పలేదు. తొలుత లచ్చన్నగారి వారపత్రిక ‘బహుజన’ బాగా నడపాలని రత్నసభాపతి చేతులు కాల్చుకుని తరువాత ఆ ప్రయత్నం విరమణ చేశారు. ఇక రంగా అంటే ప్రత్యేకంగా ఆయనకు ప్రేమ లేదు. 1958 ప్రాంతాల్లోనే ‘మాన్ కైండ్’లో రంగా పుస్తకాలను దుయ్యబడుతూ సమీక్షలు వ్రాశాడు. ఎంత పరుషంగా వ్రాశాడంటే, చివరకు లోహియాకూడా, కాస్త దుడుకు తగ్గించమని సలహా చెప్పేటంతవరకూ! ఆ తరువాత రత్నసభాపతి స్వగ్రామం ఎల్లంపేటలోనే రంగాగారు ఎవరినో చూడటానికి వచ్చి రత్నసభాపతిని కూడా కలిశారు.



అఖిలభారత స్థాయిలో రత్నసభాపతికి గౌరవం లభించింది. అయితే లచ్చన్నకు యిది గిట్టక రత్నసభాపతిని తగ్గించనారంభించారు. మసానీ బాగా ప్రోత్సహిస్తున్నాడు. ఆ కాలంలోనే రత్నసభాపతిని ఇజ్రాయిల్ ప్రభుత్వం తమదేశానికి ఆహ్వానించింది. పరిశీలకుడుగా వెళ్ళివచ్చారు. మొత్తం మీద స్వతంత్ర పార్టీలో వుంటున్నా, రత్నసభాపతి మాత్రం పూర్తిగా ఆ పార్టీలో యిమడలేకపోయారు. తనకు తోడన్నట్లుగా తెలంగాణా నుండి పురుషోత్తమరావుగారిని కూడా పార్టీలో చేర్చటానికి రత్నసభాపతే కారణభూతులయ్యారు.



ఆంధ్ర ఉద్యమం అంతా చల్లారిపోతున్న రోజుల్లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని లచ్చన్న ఒక ప్రతిపాదన తెచ్చారు. తాను కౌన్సిల్.కు రాజీనామా యిచ్చారు. ఆ విధంగా రత్న సభాపతి మాటకు నిలబడి శాసనసభా సభ్యత్వానికి రాజీనామా యిచ్చారు! . మళ్ళీ రాజంపేటకు ఉపఎన్నికలు వచ్చే లోపుగానే, ముఖ్యమంత్రిగా తన చిరకాల మిత్రులు వెంగళరావు ఎన్నిక అయ్యారు. రత్న సభాపతిమళ్ళీ పోటీ చేయడానికి తగినంత డబ్బు, మంది, మార్బలం వాగ్దానంచేసిన పార్టీ కాస్తా ఎగవేసింది. అంటే లచ్చన్నగారు అనుకున్నట్లు సహాయం చేసే స్థితిలో లేరు. జాగర్లమూడి చంద్రమౌళి వంటివారు ఎవరిదారు వారు చూసుకోండి అన్నట్లు రత్న సభాపతికి సలహా చెప్పారు. ఆ పరిస్థితిలో వెంగళరావుగారి పక్షం నుండి రత్న సభాపతికి కొన్ని సూచనలు వచ్చినవి. పోటీ చేయవద్దని, కాంగ్రెసులో చేరమని (1973 డిసెంబరులో) వాటి సారాంశం. ఇట్లా రాజీనామా యిచ్చిన సందర్భాలలో లోగడ పోటీ పెట్టని ఉదాహరణలు వున్నాయనీ, ఆ సంప్రదాయం పాటించి తనపై పోటీ పెట్టకుండా వుండరాదా అని రత్నసభాపతి గారి తిరుగు సూచన. కాంగ్రెసులో చేరతాడని వదంతులు వ్యాపించాయి. చేరమని రాజంపేట నియోజకవర్గంలో ‘తనవారు’ రత్న సభాపతికి సలహా యిచ్చారు. కాని సభాపతి చేరడంలేదన్నారు. పోటీకి తలపడ్డారు. రత్న సభాపతికి సీటు యివ్వటానికి, కౌన్సిల్ సభ్యత్వం యివ్వటానికి బసిరెడ్డి అంగీకరించలేదని మరొకవార్త. అవి జిల్లా రాజకీయాల బలాబలాల సమస్య. మొత్తం మీద వెంగళరావుగారే నెగ్గారు. పోటీ చేయకుండా రత్నసభాపతి ఆపారు. కాంగ్రెసులో చేరినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.





రాజకీయాల్లో జడత్వము



రత్నసభాపతికి దృష్టి లోక్ సభపై లేకపోలేదు. ...బహుద.. అనే పేరిట ఒక వారపత్రిక నడిపి, నియోజకవర్గంలో బాగా పనిచేయాలని ఆలోచించారు. ఆ పరిస్థితిలో భూమి తనఖా బ్యాంకు పదవి లభించి మరొక మలుపు తిరిగింది ఆయన సేవా జీవితం. స్వతంత్ర పార్టీలో తన కొత్త అనుభవాల్ని వెల్లడిస్తూ సభాపతి ఇలా అంటారు -“వేదికలపై అధికారంలో వున్నవారిని విమర్శించటం, మళ్ళీ వాళ్ళ దగ్గరకే పోయి పనులు చేయించుకోవడం యిది రంగా, లచ్చన్న వర్గానికి బాగా అలవాటైంది” అని. అదిసరే. లోహియా భావాలమాటేమిటి? అంటే- లోహియా బ్రతికుంటే నేడు ఇందిరా గాంధీ విధానాలను సమర్థించేవారని జోస్యం చెబుతున్నారు. మరి యిన్ని పార్టీలు మారటం, అందులోనూ అందికా పొందికాలేని సోషలిస్టు పార్టీ – స్వతంత్ర పార్టీలలో చేరటం గురించి ఏమంటారంటే-



ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వాలు, లోగడ కమ్యూనిస్టులు చేసిన నినాదాలు, చెప్పిన ఆర్థిక మార్పులు, కాపీకొట్టి, అమలు పరచటానికి ప్రయత్నించుతుందిగాదా, దీన్ని మీరేమంటారు అని ఎదురు ప్రశ్నించారు సభాపతి.



పార్టీలు మార్చటం నేరమనేది కాలదోషం పట్టిన సిద్ధాంతమని, అవకాశ వాదం గనుక పదిమందికీ తోడ్పడగలిగితే మార్పులో తప్పులేదంటారు. రాజకీయాలలో వున్నవారు, ఓటర్లను దృష్టిలో పెట్టుకోటం వాస్తవమౌతుందంటారు. ఇవన్నీ చాలా యదార్థమైనా వివాదాంశ విషయాలు గాన, ఒక పట్టాన అందరూ అంగీకరించేవి మాత్రం కావుగదా.



రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇంగ్లండ్.లో లేబరు ప్రభుత్వం ప్రకటించిన ప్రజాసంక్షేమ విధానాలను కన్సర్వేటివం పార్టీ తూ.చ. తప్పకుండా అనుసరించక తప్పలేదు. మారుతున్న రాజకీయ వాతావరణంలో ఇచ్చిపుచ్చుకునే గుణం మామూలైంది. విరుద్ధ భావాలూ, వ్యవస్థలూగల అమెరికా, రష్యాలు స్నేహం పెంచుకోవాలని తాపత్రయపడటం. ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యా యిది తప్పనిసరి అని రాజకీయవేత్తలే కాకుండా మేధావులు కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇంకా దగ్గర ఉపమానం చెప్పాలంటే అహింసనే పరమధర్మంగా మలచుకొని మూడు మతాలను ముక్కాళ్ల పీటగాచేసి దేశరాజకీయాలు నడిపిన గాంధీజీకి, పై వాటిలో ఈషణ్మాత్రమైన నమ్మకంలేని నెహ్రూని వారసుని చేసుకోవాలని బహిరంగంగా కోరుకొన్నాడు. తదను గుణంగా మసలుకొని తన పాత్రను సమయోచితంగా నిర్వహించి నెహ్రూ చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయాడు.



కమ్యూనిస్టు వ్యవస్థకు కవలపిల్లలైన రష్యా, చైనాలు యీవేళ గర్భశతృవులుగా ఒకరినొకరు ద్వేషించుకోవడం, కమ్యూనిస్టు వ్యవస్థకు గర్భశతృవైన బూర్జువా అమెరికాతో స్నేహం చేయాలని ప్రయత్నించటం. ఇవన్నీ ఏ వాదంకింద వస్తవో చెప్పలేం. ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఎవరు ఏ విధంగా సంచరించాలి. సంచరించగూడదు అనేది ఆ పరిస్థితి సృష్టించిన వాతావరణం. దాని వెనుక మరుగుబడివున్న ఎత్తుగడలు, స్వార్థాలు, కారణాలు – వీటన్నిటినీ కలిపి చూస్తేనేగాని ఒక అభిప్రాయానికి రాలేం. ఒక వ్యక్తి పదిమందికి ఉపయోగపడటం కోసం తన భావాలను కొన్నిటిని కొంతకాలంపాటు అటకమీద పెట్టినా ఫరవాలేదనుకొంటాను అని నా వాదం అంటాడు సభాపతి. ఏదీ చివరి మాట కాదు. అందులో రాజకీయాల్లో, దేనికీ జడత్వం లేదు యీ సృష్టిలో అంటాడు రత్నసభాపతి.









శాసనసభలో సభాపతి



ప్రత్యేక తెలంగాణా పోరాటం రోజుల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్య జోరుగా సాగింది. అట్లాంటప్పుడు రత్నసభాపతి ఏదో మాట్లాడబోతుంటే, ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అడ్డుతగిలి “నీ సంగతి నాకు తెలుసులే” అన్నారు. ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన సభాపతి, వెంటనే తేరుకుని “అవును. నా సంగతి మీకుగాక మరెవరికి తెలుస్తుంది. నా సంగతి నా పెళ్ళాం సంగతి హైదరాబాద్ గోడలపైన వుందిగదా” అనటంతో, బ్రహ్మానందరెడ్డి మళ్ళీ గుక్క తిప్పుకోలేక కిక్కురుమనకుండా కూర్చొన్నాడు. అవిశ్వాస తీర్మానంపై శ్రీమతి ఈశ్వరీబాయి మాట్లాడుతుంటే, ఒక సందర్భంలో మంత్రి జి.సి.వెంకన్న లేచి, షటప్ అన్నారు. ఈశ్వరీబాయి వెంటనే చెప్పుతీసి చూపిస్తూ, దీనితో కొడతాననటంతో సభ నివ్వెరపోయింది. స్పీకరు కీ.శే.బి.వి.సుబ్బారెడ్డి ఛాంబర్స్.లోకి రత్నసభాపతిని పిలిచి యిదంతా నీవు చేశావుగదా అనడిగితే, చెప్పు భాగోతం వరకూ తన పాత్ర లేదని నిజం చెప్పాడు రత్నసభాపతి.



ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ శ్రీ ఒ. పుల్లారెడ్డిపై అవినీతి చర్యల ఆరోపణలు చేసి, తీవ్ర విమర్శలుచేయటం రత్నసభాపతి అసెంబ్లీ జీవిత ఘట్టాలలో చాలా ప్రముఖమైనది. అసలు రత్నసభాపతిని మాట్లాడటానికి అనుమతించాలా లేదా అనే చర్చ చాలాసేపు జరిగింది – 1971 ఆగస్టు 25న ఆ చర్చలో ఒకసారి రత్నసభాపతి, “ఎంతసేపండి, చచ్చిపోతున్నాం” అన్నారు.



బ్రహ్మానందరెడ్డి లేచి, “చచ్చిపోయినా, కొంచెం బయటకు పోయినా అసలు కర్మకాండ బాగా జరుగుతుంది” అన్నారు.



వ్యక్తిగత ద్వేషాలు ఆ స్థాయికి పోయాయి...



తిమ్మారెడ్డిపై వచ్చిన ఆరోపణలు తొలుత అసెంబ్లీ మెంబరు అయిన ఒక విప్లవ నాయకుడికి అందాయి. కాని ఆయన కారణాంతరాలచే ఫైలు స్వీకరించలేదు. అట్లాంటి దశలో అది రత్నసభాపతి చేతికొచ్చింది. ఇంకేముంది. తాబేలును త్రిప్పి బాదారు.



పాత ఎం.ఎల్.ఎ. కార్వర్టర్స్.లో స్పెషల్ ఇంట్లో వుంటుండగా, ఒకనాడు పొద్దున్నే ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి, రత్నసభాపతి పాదాలు చుట్టేసుకున్నాడు. గయోపాఖ్యానం పునరావృతమైంది. క్షమిస్తానంటే గాని వదలనన్నాడు. ఎవరా అని విచారిస్తే, అప్పుడు శాసనసభలో రత్నసభాపతి నిశిత విమర్శకు గురవుతున్న ఒక పెద్ద డాక్టర్. ఇట్లా తెరచాటున ఎన్ని వింతలు, విడ్డూరాలు జరిగాయో చెప్పనలవికాదు.



ఏమైనా, శాసనసభలో మాట్లాడబోయేముందు రత్నసభాపతి చాలా హోంవర్క్ చేసేవారు. లైబ్రరీలో గ్రంథాలు తిరగేసేవారు. అసెంబ్లీలో ఇంగ్లీషు, తెలుగులో అనర్గళంగా మాట్లాడేవారు. ఆంధ్రదేశంలో తయారయిన బహుకొద్దిమంది రాజకీయ వక్తలలో యితడు పేర్కొనదగినవాడని చెప్పవచ్చు. అసెంబ్లీలో మాట్లాడటం అదొకకళ. దీనికి కొన్ని పరిమితులున్నవి. ఆ పరిమితులలో వుండి విషయాన్ని ప్రజల దృష్టికి తేవలె. తరచు ఇంగ్లీషులో తర్జుమా చేసేవారు. లేదా తెలుగులో చెప్పి తిరిగి అంగ్లంలో చెప్పేవారు. అట్లా చెప్పగలిగితేగాని, సభలో దృష్టిని ఆకర్షించలేమనే దృష్టి వారిది. వ్రాయటం వరకు తెలుగుకంటె ఆంగ్లంలో సునాయాసంగా వ్రాస్తారు. బాగా వ్రాస్తారు. ఎందరికో ఘోస్ట్ రచయితగా రత్నసభాపతి తోడ్పడ్డారని చెబితే, రహస్యం బయటపెట్టినట్లే అవుతుందిగాని, వాస్తవానికి దూరంకాదు.



ఆంధ్రప్రదేశ్.లో కొన్ని అవినీతిచర్యలు బయటపెట్టడంలో రత్నసభాపతి పాత్ర ఎంత వుందో, వాటిని విచారణకు పెట్టి న్యాయాన్యాయాలు తేల్చటంలో వెంగళరావుగారి పాత్ర కూడా అంతేవుంది. ఇరువురూ ఎం.ఎల్.ఎ.లుగా స్నేహితులు. కొత్త ఎం.ఎల్.ఎ. కార్టర్స్.లో తరచు కలుసుకొని, విషయాలు చర్చించుకుంటూ, కలసి భోజనాలు చేసిన ఘట్టాలు ఎన్నో వున్నవి. ఆ తరువాత యాదృచ్ఛికంగా రత్నసభాపతిగారు ప్రతిపక్షంలో వుండటం, వెంగళరావుగారు అధికారంలో పరిశ్రమల, హోంమంత్రిగా వుండటం సంభవించినా – యిరువురి సంబంధాలు, అన్యోన్యత – యీ పదవులతో నిమిత్తం లేకుండానే సాగింది.



రత్నసభాపతికి యిష్టమైన రచయితలు మోరిస్ వెస్ట్, ఆర్థర్ హెయిలీ, ఇర్వింగ్ స్టోన్, ఎలేడ్రురీ యిత్యాదులున్నారు. టైం న్యూస్ వీక్లీవంటి వారపత్రికలు చదవటం అభిలాష, విషయాలను చదవటం, మనసుపెట్టి పట్టించుకోవటం, జ్ఞాపకం పెట్టుకోటం రత్నసభాపతికి అలవాటు.



రత్నసభాపతికి అక్షరాలా మానవుడు, మానవుడికి వుండాల్సిన సమస్త లక్షణాలు వారిలో ఉన్నవి. వాటిని ఏ మోతాదులో ఎట్లా వాడాలో, ఎవరి దగ్గర ఎట్లా ప్రయోగించాలో తెలుసు. రాగద్వేషాలు యిష్టా యిష్టాలు మెండు. అభిప్రాయాలు ఏర్పచుకోవటంలోనూ, మార్చుకోవటంలోనూ, అతివృష్టి అనావృష్టి కనిపిస్తుంది. చెప్పదలచుకున్నది ఘాటుగా చెబుతాడు. అంతేగాదు. స్థాయీ భేదాలతో మీటగలడు. శెట్టిగారుగా ఎల్లంపేటలోనూ, తోలువలుస్తానంటూ కడప రాజకీయాల్లోనూ, ఎంతో హుందాగా రాష్ట్రస్థాయిలోనూ మేథాసంపన్నత చూపటంలో అఖిలభారత నాయకుల దగ్గర శైలి, బాణీ మార్చగలడు. ఐ.ఎ.ఎస్. అధికార్లతో సన్నిహిత మిత్రుడుగా మెలగగలడు. ఐ.ఎ.ఎస్. అంటే కొమ్ములొచ్చినట్లు కాదని నిరూపించగలడు. ఇవన్నీ అనుభవైకవేద్యాలు. జీవితంలో వెలుగునీడలు చూచిన వ్యక్తి రత్నసభాపతి.



ఇప్పుడు సంవత్సరంగా ఈ పదవిలో ఉన్నారు. మనిషినిబట్టి సంస్థ మారుతుందనీ, సరుకుంటే చూపొచ్చుననీ రత్నసభాపతి నిరూపించాడు. అయితే నూటికి నూరుపాళ్ళు జయప్రదం అయ్యాడనటంలేదు. తాను పరిగెడదామనుకున్నంత త్వరగా పాలనాయంత్రాంగంగానీ, తన ఉద్యోగులుగాని గమనాన్ని హెచ్చించటానికి సిద్ధంగా లేరు. అయినా ఎదురీదుతున్నాడనే చెప్పాలి. చేసిన వరకైనా బాగా చేసాడనిపిస్తున్నాడు. వాటి ఫలితాలు ప్రయోజనాలు పల్లెటూళ్లకు ప్రాకటానికి కొంతకాలం పట్టక తప్పదు. అయితే యీ పదవి తాత్కాలికమని రత్నసభాపతికి గుర్తున్నదా... ఉన్నన్నినాళ్ళు చేసి చూపెడదామనీ, శాశ్వతంగా అంటిపెట్టు కుందామనే ఆశలేదనీ అనుకుంటున్నారా లేదా... మన రైతులు సాంప్రదాయాల్ని పాటిస్తున్నారనీ వ్యవసాయ రంగంలో అది యిక ప్రయోజనం లేదనీ రత్న సభాపతి ఉద్దేశ్యం. వ్యవసాయం కేవలం బ్రతుకుదెరువుకు ఆధారమైన వృత్తిగా భావించరాదంటాడు. ఇతర పరిశ్రమలవలె వ్యవసాయాన్ని పరిశ్రమగా పరిగణిస్తేనే రైతుల దృష్టి మారుతుందంటాడు. అంటే వ్యవసాయం కూడా ఒక పెట్టుబడి అనీ, దానిపై లాభాలు రావాలనీ రైతు ఆశించాలన్నమాట. అట్లా అయితేనే అతను భూమిని అభివృద్ధి చేస్తాడు. దీనికి తగిన డబ్బు అతనివద్ద లేనిమాట నిజమే. అందుకే రైతు అభివద్ధికి రుణాలు గుప్పించాలి. రైతు అభివృద్ధి అయితేనే భూమి అభివృద్ధి అయి, అదొక పరిశ్రమగా భావించబడి, సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. ఇన్నాళ్ళూ భూమి అభివృద్ధి జరగాలనే దృష్టి ఉండేది. అది సరికాదు. అది తిరగేసి చెప్పిన సిద్ధాంతం అని రత్నసభాపతి ఉద్దేశ్యం. ఈ ఆశయాన్ని ఆచరణలో పెట్టటానికి ప్రయత్నించి కృతకృత్యుడౌతాడని ఆశిద్దాం.



రత్నసభాపతి రెడ్ల వ్యతిరేకి అనీ, కమ్మ ద్వేషి అనీ, స్వకులాభిమాని అనీ యిట్లాంటి ప్రచారాలు చాలా వింటుంటాం. వీటి నుండి దూరంగా రత్నసభాపతి పారిపోవటంలేదు. కులం గురించి ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలున్నవి.



కులం వాస్తవం, రాజకీయాలతోసహా అన్నిరంగాల్లోనూ కులం విలయతాండవం చేస్తున్నది. ఇది గమనించకుండా, నేలవిడిచి సాముచేసేవారు చేయవచ్చు. కానీ రాజకీయాల్లో వున్నవారు అట్లా చేయజాలరు. కులాల్లో అణగారిపోయిన కులాలున్నవి. వాటికి చారిత్రక కారణాలున్నవి. అణగారిన కులాలను ఉద్దరించాలని పెద్దలు చెబుతున్నారు. కాని ఎట్లా? లోహియా చెప్పిందే పరిష్కారమార్గం అంటారు రత్నసభాపతి. అన్నికులాలకు సమాన ప్రతిపత్తి, స్థాయి, అంతస్థు సమకూడాలి. అంటే ఇన్నాళ్ళూ అసమానంగా ఉన్న కులాలమధ్య విచక్షణ తొలగాలి. వెనుకబడిన కులాలకు 60 శాతం రిజర్వేషన్లు అన్నింటా వుండాలి. ముఖ్యంగా రాజకీయాధికారం వారికి సంక్రమించాలి. అప్పడుగాని సమానత్వం సాధించలేం. ఇదీ, స్థూలంగా సభాపతిగారి అభిప్రాయం.



లౌకికంగా చూస్తే, రత్నసభాపతికి అన్నికులాల్లోనూ ఆప్తులున్నారు. కనుక సులభంగా ఫలనా కులానికి వ్యతిరేకి అనటంకంటె, సూక్ష్మంగా చూడటం మంచిది. ఆయన తన కులంవారిని తోలువొలుస్తానన్న సందర్భాలూ వున్నవి. అంతమాత్రం చేత స్వకులాభిమాని కాదనగలమా?



రత్నసభాపతి శారీరకంగా ఆట్టే ఆరోగ్యవంతుడు కాదుకానీ, మానసికంగా మాత్రం చాలా గట్టి అభిప్రాయలున్నవాడు. హార్దంగా నవ్వుతాడు. ఆప్యాయంగా పలకరిస్తాడు. పిట్ట కథలు చెప్పి కడుపుబ్బ నవ్వించగలడు. కటువైన సత్యాలు చెప్పి ఏడిపించగలడు. సినిమాలంటే యిష్టం. జీవిత మాధుర్యాలు చవిచూడటం ప్రీతి. ఎంతకష్టించగలడో అంతగా ‘రిలాక్స్’ కాగలడు. ఘాటైన అభిరుచులున్నవి. అంతకంటె ఘాటైన అభిప్రాయాలున్నవి.



సభాపతి 20 ఏళ్ళుగా శాసనసభలోనూ బయటా ప్రతిపక్ష విమర్శకుడుగా రాణించాడు. విమర్శను చేయటం తేలిక. ఇప్పడు పదవిలో ఉన్నాడు. ఈ సరికి ఆచరణలో కష్టనష్టాలు గ్రహించే వుంటారు. అంతమాత్రాన చేతులు ముడుచుకు కూర్చోలేదు. ఇన్నాళ్ళూ అంతగా వెలుగులోకి రాని భూమి తనఖా బాంకును ఇప్పడు ప్రజల చేరువకు తెచ్చాడు. చేయదలచింది స్పష్టంగా కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పాడు, చేశాడు. ఎవరి అర్హ స్థానం వారికి చూపట్టాడు. తక్కువవాడు కాదనిపించాడు. అదే కావలసింది.



ఈ పదవిలో ఉన్నా లేకున్నా, చేసిన నాలుగు రోజులూ గుర్తుపెట్టుకోదగిన పనులు చేస్తున్నాడు. అంతకంటే ఏంకావాలి?



రత్నసభాపతి కొలువుదీర్చి పేరోలగంలో వున్నప్పుడు విన్న కొన్ని అనుభవాలు, హాస్యోక్తులు, చతురోక్తులు, నర్మగర్భోక్తులు పేర్కొనదగినవి.



ఒక పర్యాయం, ఎన్నికలలో గెలిచిన తరువాత రత్నసభాపతిని మరొక ఎం.ఎల్.ఎ.ను క్రైస్తవ సంఘంవారు సన్మానానికి పిలిచారట. ముందుగా ఆ ఎం.ఎల్.ఎ. అక్కడున్న జీసస్ క్రైస్తు అనేమాటలు చూచాడట. అంతకు ముందురోజు పిలవటానికి వచ్చిన వారు జీసస్ అనే చెప్పారు. ఇప్పడు క్రైస్తు అని కూడా వున్నది. సభావేదిక పై తెలియనట్లు వుండరాదుగదా. అందువలన లేచి మాట్లాడుతూ జీసస్ ఎంత గొప్పవాడో క్రైస్తు కూడా అంతే గొప్పవాడంటూ మాట్లాడాడట. రత్నసభాపతి లేచి వారు మాట్లాడిన అనంతరం యిక – నేను మాట్లాడటం ఉచితంగా వుండదని తప్పుకున్నారట..



ఈ విధంగా ఎన్నో వున్నవి. తనమీద తానే జోక్ వేసుకోటం మరొక ప్రత్యేక లక్షణంగా సభాపతిని చెప్పుకోవచ్చు. ఏమైనా పొగడ్తలు ఎక్కువైతే, పొగిడించుకునేవారికి తాత్కాలికంగా బాగానే వుంటుంది. అది పొగడ్త అని గ్రహిస్తే చాలు ఆరోగ్యం నిలబడుతుంది. నీరు పాలు విడదీసి చూసే విచక్షణ సభాపతికి ఉన్నదని, యింకా పదికాలాలపాటు ప్రజాసేవ చేయాలనీ ఆశిద్దాం.



పరిపాలన ...వూబి...లో రత్నసభాపతి..



రాజకీయాల్లోవుంటూ, నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన రత్న సభాపతి, అధికారంలోకి రాగానే త్వరత్వరగా పనులు చేయాలనుకోవటం సహజం. కాని యిక్కడ మహమ్మారి ఉన్నదని అది నాగజెముడువలె అల్లుకుని వున్నదని మరచిపోయాడు. పరిపాలన, నియమాలు, నిబంధనలు, చట్టాలు అన్నీ ఎక్కడికక్కడ సంకెళ్ళు అని తెలిసినా, వాటి వుచ్చులు యింతగా బిగుసుకొనివుంటాయని గ్రహించలేదు. సంవత్సరం అయ్యేసరికి తలబట్టేటంత ఆటంకాలు ఎదురైనాయి. అందులో కొన్ని ప్రస్తావిస్తాను.



పేరు మార్చటానికి నవమాసాలు



భూమితనఖా పేరు స్థానే ‘వ్యవసాయాభివృద్ధి’ అనే నామకరణం చేయాలని, ఇదే సరైనదని రత్నసభాపతి ప్రతిపాదించి నవమాసాలు నిండుతున్నవి. ఆ సచివాలయంలో యీ ప్రతిపాదన ఎక్కడ పడిపోయిందో?



సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది



1965 నుండి ప్రాథమిక భూమితనఖా బాంకులలో వివిధ వ్యక్తులు చేసిన దుర్వినియోగం ఎనిమిది లక్షల రూపాయలు దాటింది. సుమారు 50 మంది వ్యక్తులు యిందులో యిరుక్కున్నారు. అంటే పదేళ్ళనుండి యీ కేసుల విషయం పరిష్కారం కాలేదన్నమాట. సభావతి వచ్చి చూచి, దీనికి కారణం ద్వంద్వపాలనలో వున్నదని తెలుసుకున్నాడు. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్నట్లు, డబ్బిచ్చేది తనఖా బాంకు అయితే, కేసుల పరిష్కారం సహకార రిజిస్ట్రార్.ది. వారి పర్యవేక్షణ తేలదు. కనుక కేసు పరిష్కారం కాదు. ప్రాథమిక భూమితనఖా బాంకుల కార్యదర్శి, మేనేజర్లపై యాజమాన్యం కేంద్ర తనఖా బాంకుకు ఉన్నట్లయితే, చూస్తూ వుండగా యిట్లా సొమ్ము పోయేది కాదు. పోయినా తిరిగి రాబట్టటానికి వీలుండేది. ఈ ప్రతిపాదన రత్నసభాపతి చేస్తే, సహకార రిజిస్ట్రార్ అంగీకరించారు. వారి సిబ్బందికి యిబ్బందిగా వున్నది. ఇక సచివాలయం సంగతి సరేసరి. వారసలే ఒప్పుకోలేదు. కాని ఎక్కడి గొంగళి అక్కడే వున్నది. సహకార వ్యవస్థలో ప్రజలు స్వచ్ఛందత ఎక్కవగానూ, ప్రభుత్వ జోక్యం కనీసంగానూ వుండాలి. మనదగ్గర అందుకు విరుద్ధంగా వున్నది...



రైతులు అప్పులకు దరఖాస్తులు పెట్టుకున్న 25 రోజులలోగా మంజూరు చేసి వారికి, అందేటట్లు చూడాలని రత్నసభాపతి హుకుం జారీ చేశారు. అందరూ ఆనందించారు. కానీ గ్రామోద్యోగులు అడ్డంపడి, తమ దగ్గరవున్న రికార్డు నకలు యివ్వటానికి, చేతులు చాపుతున్నారు. ఇందుకు మార్గాంతరంగా రత్న సభాపతి మరొక సూచన చేశారు. తాలూకా కార్యాలయంలో శిస్తు చెల్లించే సమాచారం, గ్రామపటం, సహాణి పత్రిక, రికార్డు (అడంగల్) అంతా వుంటుంది గదా. దాని నకళ్లు ఒక్కసారే భూమితనఖా బాంకుకు యిస్తే, మళ్ళీ మళ్ళీ ఆ కార్యాలయాల చుట్టూ తిరగడం గాని గ్రామోద్యోగులకు రూ.200 ల వరకూ సమర్పించుకునే అవసరం గాని వుండదని రత్నసభాపతి ప్రతిపాదన. రెవిన్యూ శాఖ ఒక పట్టాన ససేమిరా అంటుంది. “రెవిన్యూశాఖ అంటే ఎనుబోతుగదా.”


















ఎన్. ఇన్నయ్య

No comments:

Post a Comment