మానవవాద ప్రచారకుడు వి.ఎం. తార్కుండే



Tarkunde with Innaiah

1940 ప్రాంతాల నుండీ ఆంధ్ర రాడికల్స్.కు చిరపరిచితుడు తార్కుండే తమ పూర్వీకులు ఆంధ్ర నుండి వలస వచ్చారనీ, యింటిపేరు తాడికొండ అనీ, మరాఠీలో తార్కుండే అయిందని చెబుతుండేవారు. పూర్తి పేరు విఠల్ మహదేవ్ తార్కుండే (03.07.1909 – 22.03.2004).

ఎం.ఎన్.రాయ్.కు అటు పార్టీలోనూ యిటు ఉద్యమంలోనూ అత్యంత సన్నిహిత మిత్రుడు, అనుచరుడు సహచరుడుగా ఆయన వున్నాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చి, చదువుకొని అడ్వొకేట్.గా ప్రాక్టీసు చేస్తూ బొంబాయి హైకోర్టు జడ్జి అయ్యాడు. పాస్ పోర్టు పొందే హక్కు పై చరిత్రాత్మక తీర్పు యిచ్చి, సంచలనం సృష్టించారు. పౌరులందరికీ పాస్ పోర్టు పొందే హక్కు ఉన్నదని చెప్పారు. ఎం.ఎన్.రాయ్ తో ఆయనకు సెంటిమెంటల్ అనుబంధం వుంది. రాయ్ సంస్మరణ సభలలో, డెహ్రాడూన్ రాయ్ నివాసంలో గతస్మృతులు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టేవాడు. జడ్జిగా తన స్వేచ్ఛకు పరిమితులు వున్నాయని వుద్యమానికి ఏమీ చేయలేకపోతున్నానని రాజీనామా యిచ్చి, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు పెట్టాడు పూర్తిగా ఉద్యమంలో నిమగ్నుడయాడు. రాడికల్ హ్యూమనిస్ట్, రేషనలిస్ట్, సెక్యులరిస్ట్, రినైజాన్స్ ఉద్యమాలతోబాటు పౌరహక్కుల ఉద్యమం సాగించాడు.

ఎమర్జన్సీలో ఇందిరా గాంధీని వ్యతిరేకించి, జయప్రకాశ్ నారాయణ్.ను సమర్ధించాడు. ముస్లింలలో తీవ్రవాదులను దూరం చేసి, మితవాదులను కలుపుకోవాలనేవాడు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక నడపడానికి, రాయ్ సాహిత్య ప్రచురణకూ చాలా సహాయపడ్డాడు.

దేశవ్యాప్తంగా పర్యటించి సభలు సమావేశాలు, అధ్యయన తరగతులలో ఎందరికో పాఠాలు చెప్పారు. నేను ఆయన్ను బొంబాయిలో డెహ్రాడూన్.లో, ఆంధ్రలో, ఢిల్లీలో అనేక పర్యాయాలు కలిశాను. ఉద్యమంలో పనిచేశాం. ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాం. అనేక వ్యాసాలు, ప్రచురణలు చేసిన తార్కుండేకు ఆయన భార్య గౌరి చేయూత నిచ్చేది.

ఢిల్లీలో మాకు ఆయన ఇంట్లో ఎన్నోమార్లు ఆతిథ్యం యిచ్చారు. స్వయంగా కారు నడుపుతూ నన్ను, ఎం.వి.రామమూర్తిని తీసుకెళ్ళి యింట్లో ఉద్యమ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. బొంబాయిలో ఇందుమతి పరేఖ్ ఇంట్లో చిన్న సమావేశాలలో కలిసేవాళ్ళు. నార్ల వెంకటేశ్వరరావుతో పరిచయం చేశాను. తన రచన ఒకటి తార్కుండేకు నార్ల అంకితం చేశారు. ఆలపాటి రవీంద్రనాథ్ తో కూడా పరిచయం చేశాను.

1982లో తార్కుండే కుమార్తె మాణిక్ పెళ్ళి ఇండియా ఇంటర్ నేషనల్ సెంటర్ ఢిల్లీలో జరిగింది. నేను ఒక్కడినే ఆంధ్ర నుండి ఆ పెళ్ళిలో అతిథిగా పాల్గొన్నాను. ఆయన ఎంతో ఆనందించారు. ఆ తరువాత మాణిక్ నేను ఎప్పుడైనా కలిసేవాళ్ళం. ఆమె ఉద్యమంలో చురుకుగా లేదు. గౌరి కొన్నాళ్ళు వీల్ ఛైర్.లో వుంటూ చనిపోయింది. తార్కుండేను మాణిక్ చూచుకునేది.

రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమానికి ఇండియాలో తార్కుండే వలన గుర్తింపు వచ్చిందని శిబ్.నారాయణ్ రే అనేవారు. ఆయనకు ప్రియ శిష్యుడుగా ఎం.ఎ.రాణె ఒక సంస్మరణ సంచిక చక్కగా వెలువరించారు. రినైజాన్స్ సంస్థ ప్రతి ఏటా తార్కుండే స్మారకోపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో అజాద్ పాంచొలి, బిడి శర్మ శ్రద్ధ వహిస్తున్నారు. నక్సలైట్లను బూటకపు ఎన్ కౌంటర్లలో చంపెస్తున్నారనే విషయమై జస్టిస్ భార్గవ కమీషన్ విచారణ చేపట్టింది. అందులో వి.ఎం. తార్కుండే, మావోయిస్టుల హక్కులకై వారించారు. ఇది 1976 ప్రాంతాల్లో జరిగింది. అప్పుడు తరచుగా ఆయన హైదరాబాద్ వస్తుండేవారు.

ఎం.ఎన్. రాయ్ 22 సిద్ధాంతాలు ఇప్పటికీ సరైనవేనని ఆయన అభిప్రాయం. ఆ విషయంలో ఏ.బి. షా, నేను విభేదించాము. ఆధునిక విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి దృష్ట్యా ఆ సిద్ధాంతాల్లో మార్పులు, చేర్పులు అవసరమని మా వాధన. అలాగే హోమియోపతి తాను కొన్ని సందర్భాలలో వాడానని, కనుక అది పూర్తిగా కొట్టి పారేయటానికి వీల్లేదని తార్కుండే అనేవారు. అప్పుడు కూడా మేము ఆయనతో తీవ్రంగా విభేదించి శాస్త్రీయంగా రుజువయ్యేవరకు హోమియోపతి అంగీకరించరాదు అని గట్టిగా చెప్పేవాళ్ళం. తార్కుండే ఎంత గట్టిగా అభిప్రాయాలను వెల్లడించేవాడో స్నేహితుడిగా అంత సహృదయుడు.

భారత మానవ వాద సంఘాధ్యక్షుడుగానూ, పునర్వికాస ఉద్యమ నాయకుడుగానూ ఆయన దేశమంతా పర్యటించి ఇతర సంఘాలను కలుపుకొని అనేక శిక్షణ తరగతులను నిర్వహించారు. ఎందరినో ఉద్యమానికి సంసిద్ధులను చేశారు. మంచి వక్త వ్యక్తిగత స్నేహాన్ని అభిలషించేవాడు. అతిసాధారణ జీవితం గడుపుతూ ఉన్నతంగా ఆలోచిస్తూ రచనలు చేశారు. ఎమ్.ఎన్.రాయ్ సాహిత్యాన్ని, భావాలను జనంలోకి తీసుకువెళ్ళడానికి బాగా తోడ్పడ్డారు. ఆయనతో పరిచయం, సన్నిహితత్వం ఉండడం ఎంతో సంతృప్తిని కలిగించింది.


Tarkunde's visit to Hyderabad -Speech in Nizam's college
Left to Right: 1 st row:  V.M.Tarkunde, Gopalrao Ekbote, Avula Sambasiva rao  
2nd Row: A.H.V.SubbaRao, P.V.Raja Gopal, Abburi Rama Krishna Rao, A.L.Narasimha Rao
3 rd row: 1)        2) Alam Khundmiri 3) G.R.Dalvi
4th row: 1) N.K.Acharya, 2)A.S. Wadvalkar, 3)        4) N.Innaiah
5th row: Jasti Sulapani, Kosaraju Sambasiva Rao, P.S. Narayana 

హేతువాద ఉద్యమ సారధి - ఎస్ రామనాథన్

మద్రాసులో హేతువాద వుద్యమం ఆరంభించి భారతస్థాయికి తీసుకెళ్లారు. రాజాజీ మంత్రివర్గంలో 1938లో వున్నారు. ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక నిర్వహించారు. మంచి హేతువాద లైబ్రరీ సమకూర్చారు. దేశమంతటా పర్యటించి ఉద్యమానికి ప్రోత్సాహం యిచ్చారు.

హైదరాబాద్.కు ఆహ్వానించాం. అప్పటికే బాగా వృద్ధులైపోయారు. 1976 నాటి మాట. వై.ఎమ్.ఐ.ఎస్. హాలులో అతి నెమ్మదిగా ప్రసంగించారు. అబ్బూరి, ఎ. ఎల్. నరసింహారావు వున్నారు.

మద్రాసులో ఆయన యింట్లోకి వెళ్ళాం. చనిపోయిన తరువాత ఆయన భార్య ఆసక్తి చూపనందుకు లైబ్రరీని, పత్రికను తరలించారు.

సూర్యనారాయణ, జయ గోపాల్ స్వీకరించారు. జయగోపాల్ అమెరికా వెళ్ళి పెళ్ళి చేసుకొని అట్లాంటాలో వెబ్.సైట్ నడిపారు. 2000 ప్రాంతాలలో చనిపోయారు. సూర్యనారాయణ కేరళ వెళ్ళిపోయారు. పత్రికను హైద్రాబాద్ తెచ్చి నడిపినప్పుడు జయగోపాల్ రాశారు. ఆవుల సాంబశివరావు సంపాదకుడుగా ఎన్.కె.ఆచార్య, జాస్తి జవహర్ లాల్, నేను పత్రిక నిర్వహణకు పూనుకున్నాము. ఇది 1970 తరువాతి మాట. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ సూర్యనారాయణ పత్రికను మద్రాసు తీసుకువెళ్ళారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు నడవలేదు.

రామనాథన్ భారత హేతువాద ఉద్యమంలో ఆద్యుడు. రష్యా కూడా పర్యటించారు. ఎంతో శ్రమకు ఓర్చి ఉద్యమాన్ని నడిపారు. ఆయనతో సన్నిహిత సంబంధం ఉండటం గర్వకారణం.

మణి బెన్ కారా – హ్యూమనిస్ట్ హీరోయిన్

Delegate - Free World Labour conference, UK in 1949.



1974లో మణిబెన్ హైదరాబాద్ వచ్చే నాటికి బాగా వృద్ధాప్యం కనిపించింది. అప్పటికే ఆమె మానవ వాద, కార్మిక రంగాలలో ఆరి తేరిన కార్యకర్త, నాయకురాలు. దేశంలోనూ, ప్రపంచంలోనూ పర్యటన చేసి స్త్రీల హక్కుల కోసం నిరంతర కృషి చేసిన మణిబెన్ 1905లో బొంబాయిలో పుట్టారు. ఆమె మద్యతరగతి కుటుంబికురాలు కావటంతో గామడెన్ లోని సెయింట్ కొలంబా హైస్కూల్లో చదివింది. ఆ తరువాత ఇంట్లాండులో సాంఘిక కార్యక్రమాల శిక్షణ అధ్యయనం చేయటానికి బర్మింగ్ హమ్ వెళ్ళారు. తిరిగి వచ్చిన తరువాత కార్మిక రంగంలో దిగిపోయి. నిర్విరామ శ్రమ చేసి, రేవు కార్మికులు, గుడిసెలలో మగ్గుతున్న పేద ప్రజలు, హక్కులు లేకుండా బతుకుతున్న స్త్రీలను పట్టించుకోవటం ప్రారంభించారు. ఆ కృషిలో భాగంగా వివిధ కార్మిక సంఘాలలో బాధ్యతలు స్వీకరించి అఖిలభారత ట్రేడ్ యూనియన్ నాయకురాలిగా ఆవిర్భవించారు. ఆ విధంగా ఆమెకు వి.బి. కర్నిక్, ఎన్.ఎం. జోషి వంటి వారు ఎదురయ్యారు. వారి సహకారంతో కార్మిక రంగంలో ఎనలేని సేవలు చేశారు. గుర్తింపు పొందారు.

బొంబాయిలో ఒక ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పి కొంత కాలం నడిపారు. 1930లో ఆమెకు విదేశాల నుండి అప్పుడే తిరిగి వచ్చిన ఎం.ఎన్. రాయ్ తో పరిచయమైయింది. అది సన్నిహితమై చివరకు రాయ్ నెలకొల్పిన రాడికల్ డెమెక్రటిక్ పార్టీలో ప్రధాన పాత్ర వహించేటట్లు చేసింది. ఆ తరువాత మానవ వాద ఉద్యమంలో ఆమె నిమగ్నురాలైంది. ఈ లోగా జాతీయ రాజకీయాలలో మునిగితేలింది. 1931లో స్విజర్ లాండ్ నుండి ఓడలో వచ్చి బొంబాయిలో దిగిన లూసి గెస్లర్ ను కలిసింది. ఆమె వెంట బ్రిటిష్ గూడఛారులు పడగా మణిబెన్ కాపాడి ఎం.ఎన్. రాయ్ దగ్గరకు రహస్యంగా తీసుకు వెళ్ళింది. కానీ త్వరలోనే పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం లూసీని మళ్ళి విదేశాలకు పంపించేశారు.

పోరాటాల సందర్భంగా 1932లో మణిబెన్ అరెస్ట్ అయింది. ఎం.ఎన్. రాయ్ కు అండగా నిలిచింది. కేంద్ర శాసన సభకు సభ్యురాలిగా ఎన్నికై కొన్నాళ్ళు పనిచేసింది. అనేక మురిగి వాడలలో సాహసించి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె కృషికి తొడుగా ఇందుమతి ఫరేక్ నిలిచారు. ప్రభుత్వం నియమించిన వివిధ స్త్రీ సంక్షేమ సంఘాలలో మణిబెన్ కృషి చేశారు.

ఆమె మా ఆహ్వానంపై హైదరాబాద్ పర్యటించారు. అలా వచ్చినప్పుడు నగరం చూడటమే కాక, నాటి ప్రముఖ మానవ వాద నాయకులు, న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు ఇంటికి నేనూ, కోమల కలసి వెళ్ళాము. అప్పుడు సాంబశివరావు హైదరాబాద్ లోని మలక్ పేటలో ఉండేవారు. ఆయన కుమార్తె మంజులత అప్పుడే ఒక కుమారుడుని ప్రసవించింది. మణిబెన్ ఆ పసివాడికి ఒక జ్ఞాపిక బహూకరించింది. అలా ఇవ్వడం మంచి సంప్రదాయమని మాతో చెప్పింది. హైదరాబాద్ పాత బస్తీలో అనేక వస్తువులపై ఆమె ఆసక్తి కనపరచింది. స్త్రీల సంఘాలలో తన కృషి, అనుభవాలు ఎన్నో వివరించింది. ఎమ్.ఎన్. రాయ్ తో సుదీర్ఘ పరిచయాలు, అనుభవాలు ఎంతో ఓపికగా చెప్పారు.

1979లో ఆమె చనిపోయారు. చివరి వరకు మానవ వాద ఉద్యమ నాయకురాలిగా ఆమె చేసిన కృషి గణనీయమైనది. వి.బి. కర్నిక్ ఆమె జీవిత చరిత్రను సంక్షిప్తంగా ప్రచురించారు. జాతీయ, అంతర్జాతీయ మహా సభలలో ప్రతినిధిగా మణిబెన్ పాల్గొని తన వ్యక్తిత్వాన్ని చూపారు.

వి బి కర్నిక్ – గొప్ప కార్మిక హ్యూమనిస్ట్

కర్నిక, రాయ్, మణిబెన్ 1931

ఎమ్.ఎన్.రాయ్ తో  భుజం మీద చెయ్యివేసి చనువుగా వుండగల మానవ వాద కార్మిక నాయకుడు వి.బి.కర్నిక్. 1930లో ఎమ్.ఎన్.రాయ్ విదేశాల నుండి ముంబయిలో అడుగు పెట్టినప్పుడు తొలుత కలుసుకున్న వారిలో కర్నిక్ ఉన్నాడు. అప్పటి నుండి రాయ్ చనిపోయేవరకు అతి సన్నిహితుడుగా అన్నివిధాల ఉద్యమాలలో అండగా నిలిచాడు.
వసంత భగవంత్ కర్నిక్ ఆయన అసలు పేరు.  ముంబయిలో ఆయనను బాబా అని ఆప్యాయంగా పిలిచేవారు.  కార్మిక రంగంలో కర్నిక్ మంచి పట్టు సాధించి, రాయ్.కు మద్దత్తు  యిచ్చాడు. యన్. యమ్. జోషితో కలసి కార్మిక రంగంలో చాలా పోరాటాలు సాగించాడు. గిర్నీ కర్మాగార్ యూనియన్ మొదలు ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, రేవు కార్మికుల యూనియన్.తో సహా అనేక కార్మిక సంఘాలలో ప్రముఖ పాత్ర వహించాడు.  రాయ్ జైల్లో వుండగా కర్నిక్ చేతనైనంత  ఆదుకున్నాడు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో,  తరువాత వుద్యమంలో కర్నిక్ కీలక పాత్ర వహించాడు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక, ఇండిపెండెంట్ ఇండియా పత్రికలు సాగించడంలో కర్నిక్ జీవితమంతా  తోడ్పడ్డాడు. బొంబాయిలో వుంటూ పర్యటనలు చేసేవాడు.
కర్నిక్ మితభాషి. సౌమ్యుడు.
కర్నిక్ బొంబాయిలో రతీలాల్ మేన్ షన్,  సాహిత్య సహవాస్ భవనాలలో వుండేవాడు. అక్కడ ఎన్నోసార్లు కలిశాను. ఆంధ్రకు పర్యటన నిమిత్తం వచ్చినప్పుడు కలిశాం. 1970లో ఆయన భార్యను హత్య చేశారు. కర్నిక్ పైకి కనిపించక పోయినా చాలా చలించి, మౌనం వహించాడు.
రాయ్ అనంతరం లెస్లిసహని ఫౌండేషన్ పేరిట ప్రజాస్వామ్య వికేంద్రీకరణ వుద్యమం సాగించారు. శిక్షణ తరగతులు నిర్వహించారు. గుంటూరు, హైదరాబాద్.లో నేను పాల్గొన్నాను. జి.ఆర్.దల్వి ఆహ్వానంపై అడ్మిన స్ట్రేటివ్ స్టాఫ్ కళాశాల సెమినార్లకు కర్నిక్ వచ్చినప్పుడు అది అవకాశంగా తీసుకొని బయట సమావేశాలు పెట్టాం.
డెహ్రాడూన్ స్టడీ కాంప్.లో కలసి వున్నాం. (1975 ప్రాంతాలలో) అప్పుడు జి.డి.పరేఖ్ వున్నారు.
ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్ర విపులంగా రాసిన వి.బి.కర్నిక్, సంక్షిప్త జీవిత చరిత్ర కూడా రాశారు. అవి రెండూ తెలుగులో అనువదించాను. తెలుగు అకాడమీ వారు పెద్ద గ్రంథాన్ని, నేషనల్ బుక్ ట్రస్ట్ వారు చిన్న రచన అనువాదాన్ని ప్రచురించారు. ఆ విధంగా కర్నిక్ రచనలు నేను అనువదించాను. భారత కార్మికోద్యమ చరిత్ర, ట్రేడ్ యూనియన్ చరిత్ర కూడా నేను తెనిగించగా తెలుగు అకాడమీ ప్రచురించింది. స్వాతంత్య్రానికి పూర్వం కార్మిక ఉద్యమ చరిత్రకు అవి అద్దం పట్టాయి. డబ్ల్యు. ఎస్. కాణె యిష్టపూర్వకంగా కర్నిక్ రచన ఎం.ఎన్.రాయ్ జీవితచరిత్రను మార్కెటింగ్ చేసారు. కర్నిక్ లా చదివి తొలిదశలో పూనాలో వుంటూ తరువాత బొంబాయిలో స్థిరపడ్డారు. గాంధీజీ శిష్యుడుగా రాజకీయాలలో ప్రారంభించి యమ్.ఎన్.రాయ్ ప్రభావం వలన రాడికల్ హ్యూమనిస్ట్ గా మారిపోయాడు. 1985 నవంబర్ 5న చనిపోయాడు. ఆయన సన్నిహితులుగా తర్క తీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి, మణిబెన్ కార, జె.బి.హెచ్. వాడియా వి.యమ్. తార్కొండే, ఎ.బి.షా., శిబ్ నారాయణ్ రే ఉండేవారు. ఆంధ్రకు 1940 ప్రాంతాల నుండి ఆయన ఎన్నో పర్యాయాలు వచ్చి వెళ్ళారు.
1962లో నాటి కేంద్రమంత్రి కృష్ణమీనన్.కు వ్యతిరేకంగా ఆచార్య కృపలానీ పోటీ చేయగా కర్నిక్ కృపలానీ పక్షాన నిలిచి పోరాడారు.
పూనాలో చదివి, వకీలు వృత్తి కొన్నాళ్ళు చేసి తరువాత ఎమ్.ఎన్. రాయ్ అనుచరుడుగా ఉద్యమాలలో నిమగ్నుడైపోయాడు. మణిబెన్ కారా జీవిత చరిత్ర రాశాడు. మరాఠీ వారపత్రిక చిత్రను ఎడిట్ చేశాడు. తరచు హైదరాబాద్ ఎడ్మనిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి జి.ఆర్.దల్వి ఆహ్వానంపై రావడం వలన ఆయనను సన్నిహితంగా కలుసుకోవడానికి అనుభవాలు పంచుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. 1985 నవంబరు, 5న 82 ఏళ్ళ ప్రాయంలో కర్నిక్ చనిపోయారు. 1970లో ఆయన భార్యను దుండగులు హత్య చేసినప్పటినుండి కర్నిక్ పైకి కనిపించకపోయినా బాగా కృంగిపోయారు.