హ్యూమనిస్ట్, స్టంట్ పిక్చర్స్ నిర్మాత - జె.బి.హెచ్ వాడియా (1908 – 1986)



వాడియా వారి నాడియా (1908-1986) వాల్ పోస్టర్లు నేను ఇంటర్ చదివే రోజులలో (1954) గుంటూరులో ప్రచారంలోకి వచ్చాయి. అదో పెద్ద ఆకర్షణ 1935లో హంటర్ వాలీ సినిమా, 1936లో మిస్ ఫ్రాంటియర్ మెయిల్ వచ్చినా ఇరవై ఏళ్ళ తరువాత గాని ఆంధ్ర నగరాలలో అవి తెరపైకి వచ్చాయి. వాల్ పోస్టర్లలో నాడియా బొమ్మ ప్రధానంగా ప్రదర్శించారు. నల్ల కళ్ళజోడు పెట్టుకొని, టైట్ పాంట్.తో, హంటర్ పట్టుకున్న పోస్టర్లు యువకుల్ని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ నాడియా గుర్రంపై స్వారీచేస్తూ, రైలు పక్కనే పోతూ, హఠాత్తుగా గుర్రంపైనుండి రైలు మీదకు దూకి, రైల్లోని విలన్.ను కొట్టి మళ్ళీ గుర్రంపై దూకి స్వారీ చేస్తుంది. అదంతా ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోనివ్వకుండా వున్న థ్రిల్ దృశ్యాలే. అంతా సక్సెస్. డబ్బు బాగా వచ్చింది.

విఠలాచార్య స్టంట్ సినిమాలు రాక ముందు 30 ఏళ్ళకే హిందీ స్టంట్.లు వచ్చాయి. ఆనాడు నాడియా సినిమాలు విద్యార్థుల్ని, యువతను గంగ వెర్రులెత్తించాయి.




1943 నాటికి నాడియా మౌజ్ సినిమాలో ఉద్విగ్న పూరిత హీరోయిన్.గానూ నటించింది. హీరోయిన్ విదేశస్తురాలు. ఆమె తొలి భారత హీరోయిన్.గా స్టంట్ సినిమాలలో నటించింది. ఆ తరువాత ఇండియాలో స్థిరపడి, పెళ్ళి చేసుకున్నది.


దీనంతటికీ జె.బి.హెచ్. వాడియా (జెంషెడ్ బొమర్జీ హోమి) పాత్ర కీలమైనది. ఆయన స్టూడియోస్ బొంబాయిలో మూవీటోన్స్ పేరిట ఉన్నవి. ఆస్ట్రేలియా నుండి 5 ఏళ్ల ప్రాయంలో తండ్రితోబాటు ఇండియాకు వచ్చిన నాడియా ప్రతిభను గుర్తించి, సినిమాలలో ప్రవేశపెట్టిన ఖ్యాతి వాడియాదే. నాడియాకు 20 ఏళ్ళు వచ్చినప్పుడు వాడియా ఆమెను చూచి సినిమాలకు తగిన పాత్ర అని స్వీకరించాడు.
ఆమె అసలు పేరు మేరీ ఆన్ ఎవాన్. తల్లి గ్రీస్, తండ్రి వెల్ష్. నాడియా క్రమేణా వాడియా కుటుంబానికి చేరువై, అతని సోదరుడిని పెళ్ళి చేసుకోవాలనుకున్నది. కానీ అతని తల్లి సనాతన పార్సీగా అందుకు అంగీకరించలేదు. 1960 వరకు, వేచి వుండి, ఆమె మరణానంతరం వాడియాను నాడియా పెళ్ళి చేసుకున్నది. నేను 1970 ప్రాంతాలలో ఆమెను వాడియా ద్వారా కలిసాను. అప్పటికి ఆమె సినిమాలు మానేసింది.
ఎం.ఎన్.రాయ్.ను అనుచరుడుగా సన్నిహితుడుగా రాడికల్ హ్యూమనిస్ట్ వుద్యమంలో కీలక పాత్ర వహించిన వాడియా, తనను ‘రాయిస్టు’ అని పిలుచుకునేవాడు. రాయ్.తో తన అనుబంధాన్ని గురించి, రాయ్, ది మాన్ అనే శీర్షికన చక్కని చిన్న గ్రంథం రాశాడు (M.N. Roy, the man, an incomplete Royana 1983) ఈ పుస్తకాన్ని హిదయ తుల్లా, భారత ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
ఎం.ఎన్.రాయ్ అభిమానిగా వాడియాతో నేను సంబంధాలు పెట్టుకొని, హైదరాబాద్ ఆహ్వానించాను. ఆయన రాగా సమావేశాలు పెట్టాం. తన అనుభవాలను ఆసక్తికరంగా చెప్పారు. అబిడ్స్ సెంటర్.లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫీసు ఉండేది. అక్కడే మీటింగు జరిగింది. అబ్బూరి రామకృష్ణారావు, ఎ.ఎల్.నరసింహారావు, ఆవుల సాంబశివరావు, జాస్తి జవహర్ లాల్, ఎన్.కె. ఆచార్య, ఎ.ఎస్. వడ్వాల్కర్ మొదలైన వారంతా ఆసక్తిగా పాల్గొన్నారు. అదొక మంచి అనుభూతి.
రాయ్.పై డాక్యుమెంటరీ తీయనున్నట్లు వాడియా చెప్పారు. కాని అది వెలుగు చూడలేదు. మొత్తం నేను ఇంటర్.లో నాడియా సినిమాలు చూస్తూ ఆనాడు ఊహించని వాడియాను కలుసుకోగలిగాను. సన్నిహితుడనయ్యాను.
కాసా డా వించి ఆయన బొంబాయి నివాసం పేరు. రాయ్ దంపతులు ఎప్పడు బొంబాయి వచ్చినా అక్కడే వుంటూ, వాడియా ఆతిథ్యం పొందేవారు. ఆయనతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపటం బొంబాయి వెళ్లినప్పుడల్లా కలవడం మంచి అనుభవం. సినిమాలలో మతపరమైన మూఢ నమ్మకాలు ప్రవేశపెట్టకుండా జాగ్రత్తపడిన సినీ నిర్మాత అతను. ఎమ్.ఎన్.రాయ్.కి సంబంధించిన అరుదైన ఫోటోలు సేకరించాడు. ఆయన కుమారుడు రాయ్.పై డాక్యుమెంటరీ తీయాలనుకునే సంకల్పం ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు.
1970 ప్రాంతాల్లో జె.బి.హోమి వాడియాతో పరిచయమైంది. ఆయన ఎం.ఎన్.రాయ్ శిష్యుడు. అదే మా యిరువురినీ దగ్గరకు చేర్చింది. బొంబాయిలో ఆయన ఎం.ఎన్.రాయ్.కు మంచి ఆతిథ్యం యిస్తుండేవాడు. మా ఆహ్వానంపై వాడియా హైదరాబాద్ వచ్చారు. అప్పట్లో ఆబిడ్స్ సెంటర్ లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫీసు వుండేది. అక్కడ మీటింగు పెట్టాం. వాడియా మాట్లాడారు. తరువాత తన సినిమాల గురించి, ముఖ్యంగా నాడియా గురించి అడిగాం. ఎన్నో సంగతులు ఓపికగా చెప్పారు. ఆ సమావేశానికి ఆవుల సాంబశివరావు, ఎ.ఎల్.నరసింహారావు, అబ్బూరి రామకృష్ణారావు, ఎ.ఎస్.వడ్వాల్కర్, ఆలపాటి రవీంద్రనాథ్, ఆలంఖుంద్ మీరి ప్రభృతులు పాల్గొన్నారు.
వాడియా హ్యూమనిస్ట్ కావడంతో సినిమాలలో స్టంట్.లు, థ్రిల్ తప్ప మూఢనమ్మకాలు రానివ్వలేదు.
బొంబాయి స్టూడియోలో ఎం.ఎన్.రాయ్.పై డాక్యుమెంటరీ తీశారు. ఆయన కుమారుడు స్టూడియో కృషికొనసాగిస్తున్నారు. వాడియో తన అనుభవాలతో ఎం.ఎన్.రాయ్ పై మంచి పుస్తకం రాశారు. వి.బి.కర్నిక్, వి.ఎం.తార్కుండే, జి.డి.పరేఖ్, ఇందుమతి, జి.ఆర్.దల్వి, ఎ.బి.షాలతో వాడియా సన్నిహితంగా వుండేవారు.
1970 ప్రాంతాలలో బొంబాయిలో జె.బి.హెచ్. వాడియా ద్వారా నాడియాను చూచాను. అప్పటికే ఆమె సినిమాలలో నటించడం ఆపేసింది. కాని చదువుకునే రోజులనుండీ ఆమెను చూడాలని, వీలైతే మాట్లాడాలనే ముచ్చట తీరింది.
నాడియా అసలు పేరు మేరీ ఆన్ ఎవాన్స్. ఇండియాలో పెట్టుకున్న పేరు నాడియా. ఆస్ట్రేలియన్.కు పుట్టిన మేరీ ఆన్ ఎవాన్స్ 5 ఏళ్ళ ప్రాయంలో ఇండియా వచ్చింది. తండ్రితోబాటు నేటి పాకిస్తాన్ సరిహద్దులలో గుర్రపుస్వారీ నేర్చి, బ్యాలే డాన్స్.లో తర్ఫీదు అయి, జర్కో సర్కస్.లలో పనిచేసింది. 1930 ప్రాంతాలలో వాడియా దృష్టిలో పడగా, ఆమెను ఆహ్వానించి, హీరోయిన్.గా రూపొందించాడు.
ఏక్ నన్ని మున్నిలడికి అనే సినిమాతో 1970 నుండీ సినీరంగానికి స్వస్తి పలికింది. 1996లో చనిపోయింది. పార్సీ కుటుంబంలో స్థిరపడింది. సౌమ్యంగా మాట్లాడేది.
జె.బి.హెచ్. వాడియా అసాధారణ సినీ నిర్మాత, దర్శకుడు, మానవవాది.
ఆయన ఎం.ఎన్. రాయ్ శిష్యుడు. రాయిస్టునని సగర్వంగా చెప్పుకునేవాడు. రాయ్ స్థాపించిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో పనిచేశాడు. బొంబాయి వస్తే రాయ్ ఆయన ఇంట్లో వుండేవాడు. వాడియా మంచి అతిథి సత్కారం చేసేవాడు. సంస్కారంగల సినీనిర్మాత. సినీరంగాన్ని రాజకీయాల్ని వేరు చేసి నడిపాడు. వాడియా 1986లో చనిపోయారు.

1 comment:

webtelugu said...

Click here to watch all telugu channels free online , no software , registration needed .total free
http://www.tamil10tv.com/2010/01/watch-telugu-movie-channels-free-online.html

Post a Comment