పువ్వాడ నాగేశ్వరరావువ్యాసాలు-ఆవుల గోపాలకృష్ణమూర్తి పీఠిక

పరిచయం ఈ వ్యాస సంపుటి రచయిత, రమారమి గత పాతికయేండ్లుగా ఒక ప్రత్యేక, విశిష్ట సాంఘిక దృక్పధంతో విషయ పరిశీలన చేస్తూ యిటీవల చరిత్రపట్ల మనసునిల్పి, కొన్ని రంగాలు కూలంకషంగా తరచి చూచి, సాంఘిక ఉద్యమాల రూపురేఖలను పరామర్శించి, ఒక బృహద్గ్రంథాన్ని తయారు చేయుటకై విషయ సేకరణ చేశారు. ఆ కృషి జరిగే సమయాల్లో ఆంధ్రలో కరణీకములను గూర్చి దేశంలో సంస్కృతమును గురించి దృష్టి సారించి ఆ యా విషయాలను తడవి చూపారు. నాగేశ్వరరావుగారి స్వభావ, తత్త్వములను యెరిగిన వారికి యీ పుస్తకం చదువుతుంటే వారితో మాట్లాడినట్లే ఉంటుంది. 'భాషను బట్టి మనిషిని పోల్చ' వచ్చు నన్న నానుడికి వీరి రచన బలీయమైన తార్కాణం. ఆంధ్ర సాంఘిక జీవితంలో 'కరణీకాలకు' మొన్న మొన్నటిదాకా కొన్ని ప్రాంతాల్లో యిప్పుడు గూడా చాలా ప్రముఖ స్థానం వుంది. గ్రామీణ జీవితాల్లో కరణాలు ఒక కీలక స్థానాన్ని ఆక్రమించారు. చారిత్రక సన్నివేశాలెట్లా ఉన్నా సాంఘిక జీవితాన్ని కొన్ని యెడల రాజకీయ జీవితాన్ని, నియతం చేయగల శక్తి, యీ కీలక స్థానాలకు దక్కింది. అది దృష్టిలో నుంచుకొనే నాగేశ్వరరావుగారు చారిత్రక విషయ సముపార్జన చేశారు. వ్యావహారిక రంగంలోని మర్మలేగాక, భాషా విషయక రంగంలో కూడా కరణీక కుటుంబాలవారి ప్రశస్తి గమనించిననే గాని తెలుగుదనం పాదుకొన్నచోట్లు పరిగణనకు రావు. వైదికమత జైత్రయాత్రా సాఫల్యతను చేకూర్చిన వారిలో ఈ వర్గానికున్న స్థానం మత గురువులకుగాని, పూజారులకు గాని, పురోహితులకుగాని లేదు. జీతం బత్తెంలేని తీవ్రకృషి వైదికానికి వీరు ప్రోది చేశారు. నేటి గ్రామీణ వ్యవస్థలో కరణాల పాత్ర పంచాయతీల ఆగమన, ఉద్ధృతంలో తగ్గినట్లు ఉన్నా కీలక పరిస్థితి కీలకంగానే ఉంది. ప్రభుత్వానికీ, వైదికానికీ, కరణాలు కీలకాలు, పునాదులు. ఒకరిచ్చిన వరుమానంతో తమకు నచ్చిన రెండవ కృషి గూడా చేస్తారు. ఇది మనసులో ఉంచుకొని వ్యాసం చూడండి. ఇతర ఆనుపానులు మీకే దృగ్గోచర మౌతై. ఈ పుస్తకానికి జీవం, మూడోవ్యాసం, సంస్కృత కధా కథనం. స్వరాజ్య పాలనారంభం కాగానే చిన్న పెద్దలందరూ ఆగుబ్బుగా రేగి, సంస్కృతాన్ని పునరుద్ధరించాలని సమావేశాల మీద సమావేశాలు చేసి, విశ్వ సంస్కృత పరిషత్తులను గూడాస్థాపించి, ప్రణాళికా బద్ధ కృషి సాగించారు. సంస్కృతం తెలియనివాడు భారతీయాత్మ నెరుగనివారన్నారు. 'సంస్కృత' మంటే 'సంస్కృతి' అని కూడా నవ్య నిర్వచనం చేశారు. సంస్కృతి, కేవలం ఒక భాషకాదన్న నగ్న సత్యాన్ని గూడా తిరస్కరించి, తికమకపెట్టనారంభించారు. క్రమస్థితిని ఆ నైజం బయటపడుతుంది. దాని బండారాన్ని మన రచయిత, చరిత్ర సమ్మతంగా, నిరాడంబరంగా, నిజంగా బయటకు లాగారు. దానికి తిరుగు లేదు, రచయిత వాదం అప్రతిహతం. సంస్కృతం నిజానికి ఒక మూలభాష కాదు. ఈ విషయం కొందరకు కష్టంగా వున్నా, చరిత్ర చెప్పే సత్యాన్ని గ్రహిస్తే, సత్యాన్ని సత్యంగా గ్రహించవచ్చు. రచయిత, యింకా వివరంగా, సోదాహరణాలన్నింటిని చూపితే, గ్రంథం విస్తరించినా, సత్యాన్ని కచ్చడాలు యెక్కువగా దొరికేవి, మంచి కవచాలు అందేవి. ఆ పని, విషయం కల్గిన మన రచయిత భవిష్యత్తులోనైనా చేసి తీరాలి, దానికై ఒక ప్రత్యేక పుస్తకం కావాలి. సంస్కృతం మూలభాష కాదు. ప్రాకృతం మూల భాష, ప్రాకృతాన్ని సంస్కరించి, దానికి సంస్కృతమని పేరు పెట్టి, పుత్రికకు మాతృస్థానాన్ని చేకూర్చి, పౌరాణిక నైతికత్వాన్ని రుజువుచేశారు. ఈ మూల సిద్ధాంతాన్ని చర్చా వేదికలోకి తెచ్చిన నాగేశ్వరరావుగారి కృషి నిజంగా సాహసోపేతం, ప్రశంసార్హం. కాని, సంస్కృతాన్నే సంస్కృతికి పర్యాయపదంగా వాడే ప్రాకృతలోకం నాగేశ్వరరావుగారిని ఆడిపోస్తుంది, పోయనిండు, పోయెడిదేమి? రెండవ వ్యాసాన్ని యీ వ్యాసపత్రయంలో వేయకుండా వుంటే బాగుండేది. దానిలోని విషయానికి, తతిమ్మా రెంటిలోని విషయానికి సామీప్యం లేదు. వైదికానికి భావం కూర్చింది సంస్కృతం, దానికి పాదులు చేర్చింది కరణీకాలు. రచయిత హేతువాది, హేతువాదానికి, చారిత్రక దృష్టి, శాస్త్రీయగీతి, నైతిక గమనం అవసరం. ఆ మూటిని రచయిత తనలో ఆకళింత చేసుకుని, తన భావ పరంపరను సూటిగా తను మాట్లాడే రీతిలో, హృదయానికి హత్తుకొనేటట్లు చెప్పారు. పాఠకలోకం, యీ గ్రంథాన్ని యీ దృష్టితో చూచి, యీ విధానానికి వూతాన్ని చేకూర్చి, యింకా ముందుకు విశాలవంతంగా పోయే, పోగలిగిన అలవాటు చేసుకోగలుగుతుందని ఆశిస్తాను, దానికి పుంతలు వేసిన నాగేశ్వరరావుగారిని అభినందిస్తాను. తెనాలి ఆవుల గోపాలకృష్ణమూర్తి 28-2-1958 ఎమ్‌.ఎ., ఎల్‌.ఎల్‌.బి. కీ.శే. పువ్వాడ నాగేశ్వరరావుగారు మానవవాదిగా గుంటూరులో ప్రజావాణి పత్రికకు రాసిన వ్యాసాలు గ్రంథస్థం చేశారు. ఆ రచనకు ఆవుల గోపాలకృష్ణమూర్తి పీఠిక రాశారు. అది తొలిసారి పత్రికలో ప్రచురణ నిమిత్తం.

No comments:

Post a Comment